నాన్నది భూస్వామ్య కుటుంబం…
మాది కృష్ణా జిల్లా దివి తాలూకా ఘంటశాల పాలెం. చల్లపల్లి జమీందారు గ్రామాలన్నమాట. ఆ జమీందారు కిందున్న జీమీ గ్రామాలవి. చాలా చిన్న ఊరు. 1930లో పుట్టాను. మా నాయనమ్మ పేరు కలిపి వెంకట సుబ్బమాంబ అని పేరు పెట్టారట. అది అసలు పేరు. మా మేనమామ దోనేపూడి వెంకట్రామయ్య బతుకుదెరువు కోసం అహ్మదాబాద్ పోయి జౌళి మిల్లులో పనిచేసి వచ్చాడు. అప్పటికి రెండేళ్ల పిల్లని. మహారాష్ట్ర వాతావరణం ఆయన్ని నాగరీకం చేసింది. మా మామయ్య ”మీకు కృష్ణుడు ఇష్ట దైవం కదా. కృష్ణాబాయి అని పెడదాం” అని మార్చాడట. మహారాష్ట్రలో బాయి అంటే అమ్మ. కృష్ణమ్మ అవుతుంది.
మా నాన్న(వేమూరి వెంకయ్య)ది భూస్వామ్య కుటుంబం. అమ్మ(లక్ష్మీకాంతమ్మ)ది చిన్న రైతు కుటుంబం. నాన్న సంస్కారం, అమ్మ కళాభిరుచి, వ్యవహార జ్నానం ఇంటిని చక్కగా తీర్చి దిద్దాయి. పెద్దల నాటి పురాతన పెంకుటింటి లోపల హాల్లో కాగితం పూలు, లతలతో్ గోడల్ని అందంగా అలంకరించీరు. గోడలకి నడుము ఎత్తుదాకా డిజైన్లున్న పింగాణి టైల్స్ అంటించారు. వెనుకబడిన దివి తాలూకా ఘంటశాల పాలెంలో (30లలో)ఇలాంటి ఇల్లు ఉండడం ఆశ్చర్యమే. … ”మీ ఊరికి మీ అమ్మ నాగరికత తెచ్చింది… అన్నారొక మిత్రుడు. మీ ఇల్లు చూసేందుకు పని వేళ్ల వచ్చేవాళ్లం”… అని కూడా అన్నారు. మా నాన్న “కృష్ణా… ముకుందా… మురారి” అంటూ పాటలు, పద్యాలు మధురంగా ఆలపించేవాడు. మా మేనత్త ఒకామెకు పుట్టు చెవుడు. కానీ, పొట్లానికి కట్టిన ఏ కాగితమైనా సరే, సాపు చేసి చదివేది. ముసలి వయసులో కూడా కళ్ల దగ్గరికి పెట్టుకొని చదవడం నాకు గుర్తుంది. మా ఇంట్లో ఉయ్యాల బల్ల మీద పిల్లలందరం వూగేవాళ్లం. రాత్రుళ్లు దానిమీద నిద్రపోవాలని వుబలాటపడ్దా, పడిపోతామని పడుకోనిచ్చేవారు కాదు. మా ఇంటి ఎదురుగా చెరువు ఉండేది. దానిలో దిగనిచ్చేవాళ్లు కాదు. పడిపోతామని. తర్వాతి కాలంలో మా హేమ పిల్లల్ని తీసుకొని చెరువులో ఈత నేర్పించేది. చిన్నప్పుడు నా ఒంటినిండా నగలు పెట్టేది అమ్మ. నాకు మహా చిరాగ్గా ఉండేది. మఖమల్ గౌను మీద ఆ గొలుసులవీ గుచ్చుకుంటుండేవి. నా ఈడువాళ్లు లంగా ఓణీలు వేసుకునే రోజుల్లో కూడా నాకు గౌన్లే. ఏకంగా చీరల్లోకి వచ్చేశాను. చిన్నప్పటి నగల చిరాకే నీకు మిగిలిపోయింది అనేది హేమ.
తొలి నినాద జ్ఞాపకం… ‘విప్లవం వర్ధిల్లాలి’…
నాకున్న ఒకే ఒక్క అన్నయ్య(గోపాలరావు) మహా చిలిపి. నేస్తాలతో కలిసి వినాయక చవితికి కోమటి కొట్టు మీద పల్లేరుగాయలు, రాళ్ళు విసిరేవాడు. “ఇంత చిలిపి పిల్లాడిని కన్నావేం లచ్చింకాంతా!” అనేవారు ఇరుగుపొరుగు! సాయంత్రం మై నా యిల్లు చేరని అన్నని వెదికేందుకు పాలేరుని పంపారోసారి. గుమిగూడిన జనం మధ్య నటిస్తోన్న మా అన్నని పోల్చలేకపోయాడతను. “మా చిన్న దొరని ఎక్కడన్నా చూశారా?” అని అందర్నీ వాకబు చేశాడు. వాళ్ళు నవ్వుకుంటూ తనని చూపించారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లోని ఉరి తీసిన రోజు, మా వంటింటి అలమారు తలుపు లోపల సుద్దముక్కతో ‘విప్లవం వర్ధిల్లాలి’ అని రాసాడు. ఎందుకో తలుపు తెరిచిన మా నాన్న అది చూసి, అన్నం తింటూన్న అన్నని “విప్లవం యిట్లాగే వర్ధిల్లుతుంది రా!” అంటూ తొడ మీద కర్రతో బాదాడు. అయినా తన కంటి నుంచీ చుక్క నీరు రాలేదు.
బ్రాహ్మల్లా స్వచ్చంగా మాట్లాడాలని అమ్మ చెప్పేది. దాని ఫలితంగా … ”అమ్మా బస్త కాయలు అమ్మొచ్చాయి”… అని కేకేసేదాన్ని. ఒత్తు లేని బత్తాయిల్లో స్వచ్ఛత లేదని అనుకోవడమన్నమాట. నా చిన్నప్పుడు మా ఊరికి సర్కస్ వచ్చింది. మేనేజరు కూతురు నా ఈడుదే. జులపాల జుట్టుతో గుర్రం మీద వెళ్తుంటే జుట్టు ఎగురుతూ చాలా ముచ్చటగా ఉండేది. మా నాన్నకి బాగా నచ్చి నాకు జుట్టు కత్తిరించాడు. … ”దీన్ని ఎవరు పెళ్లాడుతారని” … మా అమ్మ లబోదిబోమంది. … ”అప్పటికి చూద్దాంలే” .. అన్నారాయన.
బెజవాడలో హైస్కూల్ చదువు…
ఎలిమెంటరీ స్కూలు చదువయిపోయాక బెజవాడ హైస్కూల్ చదువుకి పిన్ని గారింటికి పంపారు. రెండు జడలు వేసేది పిన్ని. మాస్టారు ఒకాయన రెండు జడలు కలిపి… ”ఇట్ల ఒకటిగా వేసుకోరాదు”… అనేవాడు. రెండు జడలు ఫ్యాషన్ అని ఆయన చిరాకన్నమాట. అప్పట్లో … ”కుంకుం లక్ష్మి… గంపలో జపాన్ బొమ్మలు, చక్కటి గాజు గిన్నెలు అమ్మకానికి తెచ్చేది. డాన్సింగ్ గర్ల్స్, ఫ్లవర్ వాజ్ లు ఎన్ని రకాలో. పాకుతున్న భంగిమలో మంచి రంగులో ఉన్న కృష్ణుడి బొమ్మలు తీసుకొచ్చేది. మా ఇలవేలుపు కష్ణుడికి పూజలు చేసి ఆ బొమ్మ అంగీకారం తీసుకొని గాని మా నాన్న వ్యవహారం మీద బయటికి వెళ్లేవాడు కాదు.
మా ఊర్లో ఇద్దరు కమ్యూనిస్టులుండేవారు. అయినపూడి వెంకటేశ్వర్లు, కొండపల్లి రామకోటయ్యను. మాల పల్లెతో వాళ్లకి సంబంధాలుండేవి కానీ, వర్గ దష్టి పదునుగా ఉండేది కాదనిపిస్తుంది. వెంకటేశ్వర్లు గారి రాధాకృష్ణ ఉన్నత విద్యావంతుడు, విలువున్నవాడూనూ. కమ్యూనిజానికి కొంత దగ్గర. రామకోటయ్య గారమ్మాయి శ్రీకృష్ణ, మా క్లాస్ మేట్ జగపతి రామయ్య దంపతులయ్యారు. ఖాజీపేటలో బాగా స్నేహంగా ఉంటూ, మాకు చాలా సాయం చేసేవారు. శ్రీకృష్ణ ఆథిథ్యం గురించి కథలు చెప్పుకొనేవాళ్లం. వాకిట్లో చెప్పులు విడిచి ఇంట్లోకి వెళ్లేసరికి, పప్పు నానబోసేది. అది రుబ్బి గారెలు, పచ్చడితో సహా తినిపించి గాని వదిలేది కాదు. తన ప్రేమంతా గారెల్లో నింపేదన్నమాట. ఎందరికో రైల్వే టీచర్లుగా ఉద్యోగాలిప్పిచేవారు జగపతి దంపతులు.
మామయ్యది మంత్రాల్లేని పెళ్లి…
నా పేరు పెట్టిన మామయ్య అహ్మదాబాదు నుంచి వచ్చి బాగా తెలిసిన పక్కింటి పిల్లని పెళ్లాడాడు. ఒక గ్రామ్ ఫోన్ మా అమ్మ కోసం కొనుక్కొచ్చాడు. దానిలో బ్యాండు మేళం రికార్డు పెట్టి పెళ్లయిందని పించాడు. దండలు మార్చుకొని. బ్రాహ్మడు లేదు, మంత్రాలు లేవు. అంత సింపుల్ గా చేసుకోవచ్చని ఆయనకు ఎలా తట్టిందో మరి. … ఇది పెళ్లేనా? అని వాళ్లత్తగారు కన్నీరు పెట్టుకుందని ఈ మాత్రమైనా చేశాడు. ఈ మామయ్య కొడుకు పెళ్లి అట్లహాసంగా అవుతుంటే… ఇదేంటి మామయ్యా…, ఇలా చేస్తున్నా… వంటే … కట్నమిచ్చే వాళ్ల కోరిక ఇది అన్నాడు. అమ్మాయి పెళ్లికి ఇదే ప్రశ్న వేస్తే … ఆడపిల్ల వాళ్లం గదా అన్నాడు. సమాజానికి లొంగిపోయే బలహీనత ఆయనకి అప్పటికి వచ్చేసిందన్నమాట. అలనాడు తాను అలా పెళ్లి చేసుకున్నందుకు మాత్రం నాకు ఎంతో మురిపెంగా ఉండేది. (ఏ వామపక్ష భావాలు ఆయనకు లేకపోయినా).
మా మామయ్య పెళ్లికి బందరు నుంచి ఫొటో గ్రాఫర్ ను తెప్పించి గ్రూప్ ఫొటోలు తీయించాడు. గ్రామ ఫోన్ లోంచి పాటలు ఎలా వస్తున్నాయో తెలీక లోపలికి తల పెట్టి ఎవరైనా కనిపిస్తారేమో అని చూసేవాల్లం. … ‘చల్ చల్ రే నవ్ జవాన్’ పాట బాగా గుర్తు. ‘ఆజా ఆజా…’ రికార్డుతో పాటు పాడేదాన్ని. మామయ్యకు పెద్ద చదువు లేకపోయినా సంస్కారవంతుడుగా ఉండేవాడు. భార్య లలితని తనతో గుజరాత్ తీసుకువెళ్లాడు. తిరిగొచ్చేశాక, మధ్యమధ్యలో వాళ్లిద్దరూ గుజరాతీలో మాట్లాడుకుంటే … మనమీదే చెప్పుకుంటున్నారని … అక్కా చెల్లెళ్లు బుగ్గలు నొక్కకునేవారు. ఆయనకి ఇంజనీరింగ్ స్కిల్స్ కూడా తెలుసు. మా ఊర్లో ఆయనే మా మేడ డిజైన్ చేసి కట్టించాడు.
మా నాన్నలో ఆవేశం ఎక్కువ…
మా నాన్నలో ఆవేశం ఎక్కువ. సంస్కారి. అవిటితనం వల్ల కర్రతో నడిచేవాడు. ఆ కర్రతోనే ఒక్క గెంతు గెంతి విరోధుల మీద దూకేవాడు. ఊరి తగాదాల్లో ఓసారి పోలీసులొచ్చి … నడువ్… అంటే … కనపడ్డం లా. నడవలేనని? నన్ను ఎత్తుకెళ్లు అని డిమాండ్ చేశాడు. రెండెడ్ల బండి తొట్లో కూర్చుని దర్జాగా తోలేవాడు. రాముడు, లక్ష్మణుడు అని రెండెడ్లు నాన్న ముద్దు బిడ్డలు. ఆఖరి దశలో ఉన్న రాముడు గ్రామాంతరం వెళ్లిన నాన్న తిరిగొచ్చేవరకూ కళ్లల్లో ప్రాణాలు పెట్టుకొని, ఆయన రాగానే తన తొడ మీద తలపెట్టి ప్రాణాలు విడిచింది. ఇలాంటి కథలు రైతు కుటుంబాల్లో పరిపాటి. రైతుకి పశువుకి ఉణ్న అనుబంధం అలాంటిది. ఊళ్లో ఆసాములందరూ వ్యవసాయంతో పాటు వడ్డీ వ్యాపారం చేసేవారు. పక్కనున్న దేవరకోట ప్రాంతంలో అధిక వడ్డీ వసూలు చేసినా మా ఊళ్లో మాత్రం ధర్మ వడ్డీయే ఉండేదని చెప్పుకొనేవారు.
అమ్మానాన్నలది చాలా అనుకూల దాంపత్యం. అమ్మ పుట్టింటి వారిది చిన్న సంసారం, అధిక సంతానం కావడంతో అమ్మ తన తమ్ముళ్లనీ, చెల్లెళ్లనీ ఆదుకొనేది. నాన్న సహకారంతో.
చెల్లపల్లి రాజాకు వ్యతిరేకంగా ఓటేసిన అమ్మ…
మా ఊళ్లో ఆసాములందరూ ఒకే మాట మీద ఉండేవాళ్లు. అప్పట్లో ఒక బాల వితంతువుకి పునర్వివాహం జరిగింది. వీల్లందరూ దాన్ని వ్యతిరేకించారు. చుట్టుపక్కల ఊళ్లల్లోని సంస్కారవంతులు కొందరు ఈ పెళ్లికి తరలివచ్చారు. పై ఊరి నుంచి వచ్చిన మా పెద్ద మేన మామకు తలుపు తీయలేదు మా నాన్న. మా పిన్ని భర్త కమ్యూనిస్టు. ఆయన ప్రభావంతో 1952లో మా అమ్మ చెల్లపల్లి రాజాకి వ్యతిరేకంగా ఓటు వేసింది. ఆ బండ్లోనే వెళ్లిన నాన్న రాజాకి ఓటు వేశాడు. మా అమ్మను శాసించలేదాయన. పెళ్లిళ్లలో, సంబరాల్లో నాన్న చుట్టూ యువకులే ఉండేవారని అనేవారు. పాత, కొత్తల మేలు కలయిక ఆయన.
మా పెద్దమ్మ పెనిమిటి కొండపల్లి బుచ్చయ్య గ్రామ మునసబు., జిల్లా బోర్డు మెంబరు. భూమి విషయంలో రాజాతో తగాదా పడ్డాడు. రాజా మీద దావా వేశాడు. ఈయన పెద్ద ఆస్తిపరుడు కాదు. కానీ, పట్టుదల జాస్తి. కోర్టు పరిజ్ణానం ఉండడంతో చాలా ఏళ్లు ఈ దావా నడిపాడు. సైకిల్ పంచకట్టి, చొక్కా మీద కోటు వేసుకొని తలపాగా చుట్టుకొని సైకిల్ మీద మైళ్లకి మైళ్లు వెళ్లేవాడు.(ముట్నూరి కష్ణారావు గారి ఫొటోల్లోని తలపాగా లాంటిది.)
బెజవాడలో తొలి అడుగులు…
మా పిన్ని, బాబాయి ప్రజాశక్తి నగర్(బెజవాడ)లో ఉండేవాళ్లు. మా అన్ననీ, నన్నూ చదువులకి అక్కడికి పంపారు. అక్కడ చాలా కమ్యూనిస్టు కుటుంబాలుండేవి. చండ్ర రాజేశ్వర్‌రావు, చలసాని వాసుదేవరావు, సుందరయ్యలాంటి నాయకులు, కార్యకర్తలు ప్రజాశక్తి నగర్ లో ఉండేవాళ్లు. రాజకీయ తరగతులూ, మహిళా సంఘ కార్యకలాపాలు, విద్యార్థి, యువజన సంఘాల కార్యక్రమాలతో చైతన్యం పెల్లుబుకుతుండేది.
బిషప్ అజరయ్య స్కూలులో…
ప్రజాశక్తి నగర్ కీ, వూరికీ మధ్య (డోర్నకల్ డయోసిస్ హైస్కూలు) ఇప్పటి బిషప్ అజరయ్య హైస్కూలు ఒక్కటే ఆడపిల్లలకు ఉండేది. మా హెడ్ మిస్ట్రెస్ మిస్. థామస్ ఖరోడా. ఆవిడండే మాకు హడల్. ఉదయం స్కూలు తెరవగానే పిల్లలందర్నీ పేరుపేరునా పిలిచి పైనుంచీ కిందికి శల్యపరీక్ష చేసేది. ఆవిడ పిలిచిందంటే మాకు హడలే. ఓసారి కొత్తబట్టలేసుకుని హుషారుగా ఆమె ముందు నిలబడ్డాను. అప్పట్లో స్కూలు యూనిఫాం లేదు. క్రూరంగా చూసింది. భయమేసి పరుగెత్తాను. మిగిలిన టీచర్లు గుర్తులేరు గాని మిస్. కురువిల్లా జాగ్రఫీకి వచ్చింది. అసలే జాగ్రఫీ. పైగా ఆ టీచరుకి తెలుగు రాదు. మాకు ఇంగ్లీషు రాదు. ఆమె తెల్లగా కను ముక్కు తీరూ అదీ చక్కగా ఉండేది. మా బాబాయి ప్రతీవారం పీపుల్స్ ఏజ్ పత్రిక తీసుకెళ్లి మిస్. థామస్ కిచ్చి మాట్లాడేవాడు. అసలే ఆమె కరుడుగట్టిన క్రిస్టియన్. కమ్యూనిస్టు విరోధి. ఆమె ఈ పత్రిక ముట్టుకునేదా అని నా అనుమానం.
కమ్యూనిస్టు పార్టీపై నిషేధం…
ఇలా కొంతకాలానికి కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది ప్రభుత్వం. ఈ నిషేధం అంతటినీ తారుమారు చేసింది. అందరూ అరెస్టులవడం, అజ్తాతంలోకి వెళ్లడంతో ఎక్కడివాళ్లక్కడ చెల్లాచెదురయ్యారు. ప్రజాశక్తినగర్ పాడుబడింది. బతుకుతెరువు కోసం సినిమా పరిశ్రమనాశ్రయించేందుకు మద్రాసు చేరారు కొందరు. మరి కొందరు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. మా బాబాయి కడలూరు జైల్ లో ఉన్నాడు. కుటుంబం వాళ్ల ఊర్లో కొన్నాళ్లు, బందరులో కొన్నాళ్లు వుంది.
బందరు లేడీ యాంప్తిల్ స్కూ లో….
బందర్లో ఉన్న పెద్దమ్మ(బుచ్చయ్య పెదనాన్న) ఇంటికి పంపారు నన్ను. అక్కడ లేడీ యాంప్తిల్ స్కూలులో చేరాను. యుగంధరరావుగారనే కమ్యూనిస్టు సానుభూతిపరుడు పుస్తకాల షాపు పెట్టి కమ్యూనిస్టు పుస్తకాలు అమ్ముతుండేవాడు. రోజూ అక్కడికివెళ్లి పత్రికలూ, పుస్తకాలు చూసివచ్చేదాన్ని. చదువుకన్నా ఈ వ్యాపకం ఎక్కువయింది. ఎలా చదువుతున్నావని అడిగే పెద్దలు లేరు. గాంధీని హత్యచేశారు ఆ ఏడే. నల్ల బ్యాడ్జి పెట్టుకొని స్కూల్ కు వెళ్లా. స్కూల్ లో మా సీనియర్ జీఎన్ఎస్ కష్ణకుమారి బుచ్చయ్య పెదనాన్న తమ్ముడి కూతురు. పరిచయమైంది. నాకు మార్గదర్శి కూడా. మంచి సలహాదారు. వ్యవహార జ్ననం జాస్తి. నాకు ప్రపంచ జ్నానం ఎంత పెరిగిందో గాని, పరీక్ష మాత్రం తప్పి మా వూరు వెళ్లిపోయాను. ఆ ఏడాదే మా వూరు పక్కనే ఘంటశాల హైస్కూలులో ఫిఫ్త్ ఫారం (ఇప్పటి తొమ్మిదో క్లాసు) ప్రారంభించారు. దానిలో చేరాను. రోజూ నడిచివెళ్లడం కష్టమని రెండెడ్ల బండిలో పంపేవాళ్లు. మా ఊరి ఆడపిల్లలు ఇద్దరు(జూనియర్లు)కూడా నాతో వచ్చేవారు. మా రథసారథి నాగమల్లి.
సాహిత్యంలో హిందీ మాస్టారే పునాది…
ఇంతకాలం ఆడపిల్లల స్కూళ్ళో చదివిన నేను ఒక్కసారి మగపిల్లలతో కలిసి చదవాల్సిన పరిస్థితి. జంకు గొంకు లేకుండా ఆడ మగ తేడా లేకుండా మాట్లాడటం అలవాటాయి. అక్కడ వాళ్ళకి అది కొత్త. క్లాసులో నలుగురు ఆడపిల్లలం, అన్నపూర్ణ సరోజిని, బసవ భారతీ నేనూను. మా హెడ్మాస్టర్ రంగాచార్యులు గారు మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూసుకునేవారు. ఇంగ్లీషు క్లాసు ఆయనే తీసుకునే వారు. మాట జిల్లా బోర్డు హైస్కూలు. మా హిందీ మాష్టారు బండి నాగేశ్వరరావు గారు, గోరాగారి అనుయాయి. అచ్చఖద్దరు కట్టేవారు. సెకండ్ లాంగ్వేజి హిందీ తీసుకున్నాను. మాగజైన్ రాపర్ కూడా వృథాకానివ్వకుండా వుపయోగించడం దగ్గర్నుంచి, ‘0’లో అక్షరం రాయడంతో చక్కటి దస్తూరి అలవర్చుకోవడం వరకు ఎన్నో విషయాలు నేర్పే వారాయన ‘చిట్టెమ్మ’ అంటూ! ఫిఫ్ట్ ఫారం పాసై స్కూల్ ఫైనల్ కొచ్చాను. లాంగ్వేజెస్ లో నేనూ, లెక్కలూ సైన్సుల్లో బసవ భారతి ఫస్ట్ వచ్చేవాళ్ళం.
మా హిందీ మాస్టారు పాఠాలు చెప్పడమే కాకుండా ప్రతీదీ నేర్పేవారు. ఆయనంటే మాకు గురిగా ఉండేది. హిందీ కథలు చెప్పేవారు. మా చేత గమ్మత్తయిన హిందీ కథల్ని ట్రాన్స్ లేట్ చేయించేవారు. సాహిత్యంలో ఆయనే పునాది. ఆయన గోరా గారి శిష్యుడు. నాస్తికత్వం కూడా ఆయన వల్లనే. పోలీస్ టోపీ అనేది కథ మొట్టమొదటి కథ. బండి నాగేశ్వరరావు. తర్వాత కాలంలో ఆయన ఓ ఆశ్రమానికి చేరారు. ఆయనట్లా అయినపుడు చాలా ఏడ్చేశాం.
పిన్ని, బాబాయిలు రైతు సంఘం కార్యకర్తలు…
ప్రజాశక్తి నగర్ బెజవాడలో ఉండేడి. అక్కడ అన్ని ఫ్యామిలీస్ ని ఉంచి బుర్రకథలు చెప్పేవారు. చిన్నవాళ్లకు పాఠాలు చెప్పేవారు. మా పిన్ని బాబాయి రైతు సంఘంలో పనిచేశారు. అక్కడ పాఠలు నేర్పేవారు. దేశమును ప్రేమించుమన్నా పాట నుంచి కఈష్ణశాస్త్రి పాటల దాకా నేర్పేవారు. అక్కడే మద్దుకూరి చంద్రశేఖర్ రావు గారు పాఠాలు చెప్పేవారు. దగ్గర్లోనే మిషన్ స్కూల్ ఉండేది. సైకిల్ పై బడికి వెళ్లేదాన్ని.ఆ స్కూల్లో మా హెడ్ మిస్ట్రెస్ చాలా కఠినంగా ఉండేది. ఆవిడ మళయాళీ. ఆమె కమ్యూనిస్టులంటే పూర్తి వ్యతిరేకి. అక్కడ ఉండగా కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగా జరిగేది. చాలామందిని అరెస్టు చేశారు. ప్రజాశక్తి ఆఫీసును మూసేశారు. ఎక్కడివాల్లు అక్కడికి వెళ్లిపోయారు.
‘అసింటా! అసింటా!’ (దూరం! దూరం!) అనేది మా మేనత్త…
ఎలిమెంటరీ స్కూలు వాళ్ళింటి చావిడి లో వుండేది. ఒక రోజు క్లాసులో మంచి నీళ్ళు లేక వాళ్ళ వాకిట్లోకి వెళ్ళి మంచినీళ్ళడిగాను. మేనత్త తెచ్చిన మంచినీళ్ళ గ్లాస్ అందుకో బోయాను. ‘అసింటా! అసింటా!’ (దూరం! దూరం!) అని గ్లాసు గడప మీద పెట్టింది. తాగి చేతికివ్వబోతే వెనక్కి జరిగింది. కర్రపుల్లతో గ్లాసు తీసుకెళ్ళింది – నిప్పుల్లో నుందేమో! మా యింట్లో ఈ అంటూ సొంటు తలనొప్పి మాకు లేదు. అటువంటి యింటికి కోడలిగా వెళ్ళడమా?! అయితే
తెరల చాటున బతకడం నావల్లకాదని మొండికేశా…
ఈలోగా మా అమ్మకి బాగా జబ్బుచేసి మేజర్ ఆపరేషన్ అయింది. ఆమెకి ప్రాణ భయం పట్టుకుంది. దాంతో నా పెళ్ళి బెంగ! అప్పుడే ఒద్దని నేను. అయినా సంబంధాలు చూద్దం ప్రారంభించారు. స్టేటస్ లో సరితూగే ఒక సంబంధం వచ్చింది. వాళ్ళకి ఘోషా ఎక్కువ. తెరల చాటున బతకడం నావల్లకాదని మొండికేశా. నిరుపేద కుటుంబంలో బాగ చదువుకుని వున్నతస్థాయికి ఎదుగుతున్న అబ్బాయి సంబంధ మొకటి. “తక్కువస్థాయి అయినా బిడ్డని అంతబాగా చదివించుకున్న ఆ తల్లికి మొక్కుతా” నన్నాడు మా నాన్న. ఈలోగా సన్నిహితులు ఊళ్ళో నే వున్న మా మేనత్తి కొడుకు గురించి ఆలోచించమన్నారు. వాళ్ళ కుటుంబంలో నాకో చేదు అనుభవం వుంది. మా మేనత్త, ఆమె భర్త మా వూరి బ్రాహ్మణుల కింద లెక్క పంచాంగం చూడటం, ముహూర్తాలు పెట్టడం, తోటి కులస్తులు కూడా అంటు ముట్టు పాటించడం చాలా.
మా అన్న, మేనత్త కొడుకు బాల్య స్నేహితులు…
మా అన్న, మేనత్త కొడుకు (వేణు) బాల్యస్నేహితులు. ఇంజనీరింగ్ చదువుతున్న వేణు అంటే అన్నకి చాలా యిష్టం. అందుకని తన బాగా మొగ్గాడు. ఆ సెలవుల్లో మా యింటికి అన్నకోసం వచ్చేవాడాయన – ఒక కెమెరా. వేణు నా ఫోటో తీసుకొస్తానని మిత్రులతో చెప్పే వచ్చారని తర్వాత తెలిసింది! సైకిల్ తో ఫొటో తీయించు కోవాలనే నా కోరిక ని అన్నకి చెప్పా. మంచి ఫోటో తీశాడు. నాకు ప్రత్యేకంగా అభిమానం, ఇష్టం లాంటివేమీ కలగలేదు. మొత్తానికి అటూ యిటూ కదిలి పెళ్ళి కుదిరింది. పెళ్లి తంతు మాత్రం మంత్రాలతో వీల్లేదన్నా, అటు ఆయన అభిప్రాయమూ అదే. గొప్ప ఛాందసుడైన మామగారు కూడా “మీ యిష్టం, అంతా ఈశ్వరేచ్చా!” అనేశారు త్రిపురనేని రామస్వామి చౌదరి కొడుకు గోపీచంద్ వేణుగారి అభిమాన రచయిత. బాబు కొడుకులే నన్ను మార్చారు” అనేవారాయన. త్రిపురనేని రామస్వామి చౌదరి ‘వివాహవిధి’ ప్రకారం రామకోటయ్య మాస్టారు పెళ్ళి చేశారు – సప్తపదితో! మా క్లాస్మేట్ సూ, టీచర్, జిఎస్ఎస్ లాంటి మిత్రుడు వచ్చారు. మాకు టూరింగ్ టాకీస్ వుండడంతో డైనమో తో లైటు వెలిగించారు. మావూరి చలపతి బాబాయ్.
”శ్రోత్రీయ వంశసంభవుడు సుమ్మి నీ పతి
సత్పాత్రలు మెచ్చు నాగరికతా శిరోమణి వీవు…” అంటూ పద్యాలు చదివాడు.
పెళ్లయ్యాకే ఒకరినొకరం అర్థం చేసుకున్నాం…
పెళ్ళి అయాక, వేణు ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరంలో, నేను ఎస్సెల్సీలో ప్రవేశించాం. పెళ్ళి అయాకే మేమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించాం. పుంఖానుపుంఖంగా వుత్తరాలు రాసుకున్నాం. సెలవుల్లో కబుర్లే కబుర్లు. హైస్కూల్లో అపశృతి. మా క్లాస్ మేట్ తాతబ్బాయీ నేను పాఠాలు షేర్ చేసుకోవడం, కలిసి ట్యూషన్ కి వెళ్ళడంతో పుకార్లు ప్రారంభమయాయి. మా హెడ్మాష్టారికి మా యిద్దరి మీద చాలా అభిమానం. అందుకని మాకు దన్నుగా వున్నారు. ఈ రకమైన చికాకుతో వేణుకీ సంగతి రాశా ఏడుస్తూ “నేను హైస్కూల్లో చదివినప్పుడు గోడ రాతలు వాటి నిజానిజాలు తెలిసిన వన్డే …. నీ మనసు నాకు తెలుసు. ఇందులో అనుమానపడడానికేముంది? మొన్న శలవలో చెపుదామనుకున్న – పరీక్షల ముందు స్కూలుకి వెళ్ళే ద్దని. కానీ మర్చిపోయా. నువ్వేమాత్రం చరించు. నీకు తెల్సుగా ఏడ్చేవాళ్ళని నేను సహించనని. వాళ్ళని చూసే కోపం కూడా. నాకోసమన్నా ఏడవకు. -“తాతబ్బాయిక్కూడా రాద్దామనుకున్నా – నేను అనుమానపడకపోతే నువ్వెందుకు బాధపడ్డం?” అని రాశారు. వేణు ప్రేమకే కాదు, ఆయన హృదయ వైశాల్యానికి నాకు గర్వమే. ఒక అనుబంధం గురించి, యీ సందర్భంలో చెప్పాలి. ఘంటసాల మా అమ్మ మేనత్త కుటుంబం వుంది. ఎంత స్కారవంతులో చెప్పలేం. ఎస్సెల్సీ ఆఖరు రోజుల్లో వాళ్ళింట్లో వుంచారు నన్ను – స్కూలుకి దగ్గరని. ముసలమ్మ, విధవ కూతురు, కొడుకు, అతని చిన్నారి భార్య. నన్ను నెత్తిన పెట్టు కున్నారు. వేడి వేడి అన్నం, దానిలో వెల్లుల్లి గడ్డలు, తాజా కూరలూ, గడ్డ పెరుగు అన్నిటిని మించిన ఆప్యాయత. ఆ అన్నయ్య స్కూలుదాకా వచ్చేవాడు రోజూ, ఒద్దంటే వినేవాడు కాదు. ఎంత విలువ కట్ట గల నా ఆప్యాయత కి? పార్టీ సభ్యులు ఒకరిద్దరు విరాళాలు గురించి కలిసేవారు. అంతకన్నా రాజకీయ కార్యకలాపాలేమీ లేవు. ఘంటశాల చిత్రమైన ఊరు. కాంగ్రెసుకి పెట్టనికోట. ప్రతి యింటికీ అరుగులుంటాయి. పనిపాటలయిపోయాక అమ్మలక్కలు అరుగులమీద కూర్చుని దారే పోయేవాళ్ళమీద కామెంట్స్.
“ఆ అబ్బాయి ఎవరే?”, “ఆఁ బోగం పంచనాథం మనమడు” ఇలా అనిపించుకున్న అబ్బాయి (ఇంజినీరింగ్ విద్యార్థి) కుంచించుకు పోకుండా ఉండగలడా? మద్రాసు స్టెల్లా మేరిస్ కాలేజిలో మా జీఎస్ఎస్ చదువుతోంది. తన సలహాతో తెలంగాణ అక్కడే చేరాను – ఇంటర్ లో, అక్కడే సీతా మహాలక్ష్మి పనిచేస్తుంది. హనుమంత రావు (ఇప్పటి ప్రగతి ప్రింటర్స్), సీత, జీఎస్ఎస్, జయలతో బీచ్ కి వెళ్ళే వాళ్ళం. హను ‘స్టాలినో నీ ఎర్రసైన్యం, ఫాసీజా వినాశ సైన్యం’ అంటూ ఫాసిస్టు వ్యతిరేక గీతాలు చాలా బాగా పాడేవాడు. జయ (సికె నారాయణరెడ్డిగారి భార్య) సన్నటి గొంతుతో భావగీతాలు పాడేది. నాకు హాస్టల్ భోజనం సరిపడలేదు. ఇన్ఫ్లుఎంజా జ్వరం ఒచ్చింది. కబురు తెలిసి అమ్మ వచ్చింది. చదువుకి గుడ్ బై చెప్పి వచ్చేసాను. వేణు ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని కాకినాడ కాలేజిలోనే వుద్యోగంలో చేరారు.
కమలా వెంకటరత్నం అనే ఆవిడ ఔట్ హౌస్‌లో అద్దెకి దిగాం. వంట రాదు. ఇద్దరం కలిసి ఏదో ఉడకేసుకునేవాళ్ళం. ఆవిడ ఉదయాన్నే తలస్నానం చేసి తులసి పూజ చేసుకునేది. మా ఆయన ఉదయాన్నే అలర్జీ తుమ్ములు లేచేవారు. ‘అవి పాటించాల్సిన తుమ్ములు కాదని ఆమెకు నచ్చజెప్పి. కొత్త కాపురమని కూరలు, పిండి వంటలు దండిగా యిస్తూండేవారు. ఆవిడ మరదలు దమయంతి నేస్తమయింది. జీవిత సత్యాలు చాలా చెప్పేది. ఆవిడ అక్క కూతురు పద్మని చదువు కోసం తీసుకొచ్చింది. కాని ఎందుకనో చదువు అబ్బలా, చాలా స్వచ్ఛమైన పిల్ల. కల్లాకపటం తెలీదు. నా దగ్గరే ఉండేది. వేణు క్లాస్ మేట్ సూర్యనారాయణ (సూరి) తర్వాత ఆయనకి స్టూడెంట్ అయ్యాడు. అతనూ, మరో స్టూడెంట్ శేషగిరి – ఆ యిద్దర్నీ కూడా మా యింట్లోనే వుంచారు వేణు, హాస్టల్లో వాళ్ళకి చదువు సాగడం లేదని. నా చేతకాని వంటనే వాళ్ళూ భరించారు పాపం! స్టూడెంట్స్ లాడ్జి లాగా వుండేది కాని యలా వుండేది కాదు తర్వాత సూరి కుటుంబ సమస్యలతో బాగా దెబ్బతిన్నాడు. అసలే ఇంట్రోవర్ట్. శేషగిరికి జీవితాన్ని ఎలా మలుచుకోవాలో తెలుసు. ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణించాడు. ఇప్పటికీ మా స్నేహం అలాగే మిగిలింది. వాళ్ళ పిల్లలు మా పిల్లలు కూడా కలిసిపోయారు. ఇంజినీరింగ్ కాలేజీ లో లెక్కల మేష్టారు కెవిఎన్ అప్పారావుగారూ, రాధ మా పొరుగున వుండేవారు. రాధా నేను ఎంత బాగా కల్సిపోయామంటే రాధా కృష్ణులనేవారు మమ్మల్ని, ప్రతీ అనుభవాన్ని పంచుకునేవాళ్ళు.
గోరాశాస్త్రికి ఉత్తరం రాశాం…
‘తెలుగు స్వతంత్ర’లో ‘ఆశఖరీదు అణా’ చదివి గోరాశాస్త్రికి వుత్తరం రాశాం. ఆయన ‘స్నేహలత అనే శీర్షిక పెట్టి యువతి యువకులకు పరిచయం కల్పించాడు. అలాగే హేమలతకీ నాకు అభిరుచులు కలుస్తా యని అంటుకట్టాడు. హేమ ఉన్న పరిస్థితులు రీత్యా మా దగ్గరికి వచ్చెయ్యమని ఆహ్వానించాం. మా పెద్దమ్మాయి పుటకలతో పొటమరించిన మా స్నేహం అనలువేసింది. మా పిల్లలకి కన్నతల్లిని నేనైనా తను పెంపుడుతల్లి అయింది. మానేసిన మెట్రిక్ చదువు పూర్తి చేసి పియుసి పాసైంది. నాన్నగారు నన్ను హృదయ జీవిననీ, తను మేధోజీవి అనీ అనేవారు. హేమకీ సాహిత్యాభిలాష ఎక్కువే. రాయగలిగిన శక్తి, అభిరుచి, లోకజ్ఞానం, అనుభవం వుండి కూడా ఏమీ రాయడం లేదని దెబ్బలాడేదాన్ని. పరిస్థితుల్ని క్రిటికల్ గా అంచనా వేసేది. వేణుగారి స్టూడెంటూ, రైల్వే ఇంజనీరు అయిన ఎం.సి. దాసుకీ తనకి ముడివేశాం. దాసు చాలా సంస్కారవంతుడు. రైల్వేలో అత్యున్నత పదవి నిర్వహిం చాడు. చల్లగా సాగుతున్న సంసారాన్ని, త్రుల్ని వదిలి అర్ధాంతరంగా వెళ్ళిపోయింది మా హేమ.
నాన్నగారు అంటుకట్టిన మరో మొలక యగళ్ళ రామకృష్ణ
నాన్నగారు అంటుకట్టిన మరో మొలక యగళ్ళ రామకృష్ణ, ఆప్యాయత లెదిగిన మనిషి “చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నవాళ్ళు అనుబంధాల కోసం అర్రులు చాసాలు అనేవారు చిన్నన్న. రామకృష్ణ మా యిద్దరికి అరమరికల్లేకుండా కన్నబిడ్డలా ఆ చెప్పేవాడు. ఎమర్జన్సీలో జైలు జీవితం పూర్తిగా అనుభవించి వచ్చిన ప్రసాదుని విజయ సమేతంగా తమ దగ్గర కొన్నాళ్ళుంచుకున్నాడు. చిన్న కష్టానిక్కూడా రావి ఆకులా వణికి పోయేవాడు. ఎదుటివారిలో లేకితనం కనిపిస్తే మాత్రం క్షమించలేకపోయేవాడు. మా కళ్ళముందే రాలిపోయాడు (2012).
వేణు సహచర్యం, సౌజన్యంతో నా వ్యక్తిత్వం వికసించింది…
నా స్నేహాలన్నిటినీ వేణు తన స్నేహాలుగా మలుచుకున్నారు. ఆయన సహ చర్యం, సౌజన్యంతో నా వ్యక్తిత్వం వికసించింది. చాలా క్రమశిక్షణగల మనిషి పెన్సిల్ చెక్కడం దగ్గర్నుంచీ ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలో, పదును పోకుండా చాకు ఎలా వాడాలో దాకా నేర్పేవారు. పొరపాటు వస్తే మాత్రం ఒప్పుకునేవారు కాదు. ఆయన కోపం తాటాకు మంటలాంటిది. నా కోపం అంత చప్పున చల్లారేది కాదు. విమర్శ, ఆత్మవిమర్శ పట్టింపు లేకుండానే ఆచరించేవాళ్ళం. సంగీతం, సాహిత్యం ఇద్దరికీ అభిమాన విషయాలే. ఇద్దరం నడిచి వెళుతూంటే నేను వెనకబడితే ఒప్పేవారుకాదు. ఇద్దరం పక్కపక్కనే నడవాల్సిందే.
ప్రసంగాలను శ్రద్ధగా రాసుకొచ్చేవారు…
ఆయనకి కమ్యూనిజం అంటే అభిమానమేగాని, చాలా సందేహాలుండేవి. పై చదువుల కోసం అమెరికా వెళ్ళినప్పుడు – అవి సరిగ్గా చైనాకీ, ఇండియా కి సరిహద్దు గొడవల రోజు. ‘పూల్ గేమ్’ చదివి సత్యాలు తెల్సుకున్నారు. అలాగే కాలేజీ రోజుల్లో దేవుని జీవితం’ (గోపీచంద్) చదివి భౌతికతత్వం అలవర్చుకున్నారు. ఆయన వ్యక్తిత్వం నన్ను మంచికి మలిచింది. తానొక్కరే సినిమా చూడాల్సివస్తే, యింటికొచ్చాక మొత్తం కళ్ళక్కట్టేవారు. ప్రతీది పంచుకోవడం జీవితంలో భాగమయింది. ఏ మీటింగుకి వెళ్ళినా ప్రసంగాలను శ్రద్ధగా రాసుకొచ్చి వినిపించేవారు. జర్నలిస్ట్ గా రాసుకుంటూంటే మీది ఏ పత్రికండీ?’ అని ఎవరో అడిగారని నవ్వుకున్నాం. కాకినాడ, అనంతపురం తర్వాత, గవర్నమెంట్ వుద్యోగానికి రాజీనామా చేసి, ఆంధ్రా యూనివర్సిటీలో చేరారు.
విశాల దృక్పథాన్నిచ్చిన విశాఖ…
విశాఖ మరింత విశాల దృక్పథాన్నిచ్చింది. అక్కడ ఆరుబయలు రంగస్థలంలో గొప్ప గొప్ప నాటకాలు, వివిధ రాజకీయ పక్షాల ఉపన్యాసాలు వుత్తేజాన్నిచ్చేవి. కె.వి.గోపాలస్వామి ఆధ్వర్యంలో మంచి సాంస్కృతిక ప్రదర్శనలుండేవి. మా అమ్మాయి నళిని, పద్మిని కాక, మా అన్న పిల్లలు రమేష్, విజయ్ కూడా మాతో వుండేవాళ్ళు. మాకు క్వార్టర్స్ దొరక్క ముందు వి. సుబ్బారావు గారింట్లో మకాం పెట్టాం. విశాఖ అందమంతా అనుభవించాం. బీచ్ క్వార్టర్స్‌లో ఏ గదిలో వెళ్ళినా, బాత్రూం లోకి వెళ్ళినా రంగులీనుతున్న సముద్రం ప్రత్యక్షమయ్యేది. ఓవైపు దాల్ఫిన్స్ నోస్ కొండ. అంత అందాన్ని ఆస్వాదిస్తూ, తీయతేనియ బరువు – ఓపలేదీ బతుకు అని పాడుకునేవాళ్ళం. వేర్వేరు వాళ్ళల్లో వున్న మిత్రులందర్నీ ఏదో ఒక వంకతో పిలిచి ఆ అందాల్ని చూపే వారం. సూర్యోదయం, సమయం, వానాకాలపు మబ్బుల విన్యాసాలు, అలల అద్భుత సౌందర్యం మిగిలిన ప్రపంచాన్ని మరిపించేది. సుధీర్, బీవీ సుబ్బారావు లాంటి స్టూడెంట్స్ ఆదివారాల అతిథులు పిల్లల చిన్నప్పటి మాటలూ చేష్టలు డైరీలుగా రాస్తే పెద్దయ్యాక సరదాగా చదువుకుంటారని నళిని, పద్మిని, నవత, మమతల డైరీలు రాసేదాన్ని. ఇప్పటికీ అవి చూస్తుంటే వాళ్ళ పసితనం గుర్తొచ్చి మురిపెంగా ఉంటుంది.
మా భీమేశ్వర్రావు (తమ్ము)కి మా పద్మకి పెళ్ళి చేశాం.
దిగంబర కవుల పరిచయమూ అక్కడే…
బంగోరె అందించిన ఆప్యాయతా విషాదము కూడా అక్కడే అనుభవించాం. నాన్నగారు, కాళోజీ, ఎమర్జన్సీ అన్నీ విశాఖ అనుభవాలే. సంజీవదేవ్, దిగంబర కవుల్ని యూనివర్సిటీ విద్యార్థులు పరిచయం చేసిందీ యిక్కడే. ఎన్నని గుర్తుచేసుకోగలను? నా అన్న పిల్లల్ని చదివించావ్. మరి వేణు అన్నపిల్లల్ని కూడా చదివించాలి గదా? ఇక్కడకన్నా అక్కడి వాతావరణం చదువులకి అనుకూలంగా ఉంటుంది” అని మానాన్న వుత్తరం రాశాడు. అభ్యంతరం ఎందుకుంటుంది? వాళ్ళు ముగ్గుర్నీ తీసుకొచ్చి చదువులో పెట్టాం. వాళ్ళు పెరిగిన తావరణం, అలవాట్లు వేరు. మా దగ్గర క్రమశిక్షణ వేరు. అందుకని వేణు ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. “ఎవరు తిన్న పళ్ళెం వాళ్ళే వంటింటి సింక్ లో పెడదాం. పిన్ని ఒక్కతే అన్ని పళ్ళాలూ తియ్యడం కష్టంగదా” అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు. మగవాళ్ళు ఎంగిలిపళ్ళెం తియ్యగూడదనే పద్ధతి వుండేదప్పుడు. మొగమాటంతో ఆకలితో వుండిపో తారేమోనని గెల తియ్యగా గల అరటి పళ్ళు యింట్లో వేలాడేసేవారు. క్రమంగా పిల్లలు బాగా దగ్గరయ్యారు. నిక్ నేమ్స్ పెట్టే ఆటలో వాళ్ళ బాబాయికి ‘దూర్వాసుడు’ అని బిరుదిచ్చారు. ఆయన ముసిముసి నవ్వులు ఒలకబోశారు. పిల్లలందర్లోకి చంద్రం మా హేతువాద భావాలకి దగ్గరగా వుండేవాడు. “బాబాయ్, నాస్తికాశ్రమం పెట్టి, విశాఖలోని సంగీత వాతావరణం మా పిల్లలు బాగా వుపకరించింది. రామవరపు విజయలక్ష్మి మంచి పునాదులు వేసింది. పిల్లల సైకాలజీ గమనించి మరీ పాఠాలు చెప్పేది ఆవిడ.
పిల్లలిద్దరూ సాహిత్యంలోనూ కృషి చేస్తున్నారు.
నళిని మెడిసిన్‌లో చేరడంతో సంగీతానికి ఆటంకమయింది. పిల్లల డాక్టర్ గా సెటిలయింది. పద్మిని ఇంగ్లీషులోను, సంగీతంలోను యూనివర్సిటీ పట్టాలు పుచ్చుకోవడమేగాక, వీణలో ప్రావీణ్యత సంపాదించింది. అదే వృత్తిగా స్వీకరించింది. అయితే యిద్దరూ సహచరులతోపాటు సాహిత్యంలోనూ కృషి చేస్తున్నారు.
కొంతకాలం కాజీపేటలో టీచర్ గా పనిచేశాను.
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది వేణుకి (1961) మా. పిల్లల చదువులు ఎక్కడ కొనసాగించాలా అనేది శేషప్రశ్న అయింది. కాజీపేట ఇంజనీరింగ్ కాలేజీ లో రిజిస్ట్రార్ అప్పారావుగారూ, రాధ వెంటనే స్పందించి “మా దగ్గర మంచి స్కూళ్ళున్నాయి, వచ్చేయ”మని ఆహ్వానిస్తే నిస్సంకోచంగా వచ్చేశాం. నేనొక దాన్నే వుండడమెందుకని అమ్మా నాన్న మా అన్న పిల్లలు ముగ్గుర్నీ కూడా తీసుకుని వచ్చారు. మా క్లాస్ మేట్ జగపతీ, వాళ్ళావిడ కృష్ణ (మా వూరే) ఫాతిమా స్కూలు దగ్గల్లో యిల్లు చూసి పెట్టారు. గేబ్రీయల్ స్కూల్లో మగ పిల్లల్ని, ఫాతిమాలో ఆడపిల్లల్ని చేర్చారు. కొంతకాలం నేను కూడా ఫాతిమాలో టీచర్ గా చేశాను. మిత్రులందరూ హైదరాబాదు వెళ్తూనో వస్తూనో కాజీపేటలో దిగేవారు.
కొండపల్లి సీతారామయ్య, ద్రోణవల్లి అనసూయమ్మ దగ్గర్లోనే…
కొండపల్లి సీతారామయ్య, ద్రోణవల్లి అనసూయమ్మ మాకు దగ్గర్లోనే వుండేవారు. వాళ్ళ పిల్లలు చందూ, భారత్, జోనీ, కరుణ కూడా బాగా దగ్గరయ్యారు. అనసూయమ్మ అన్న రామకృష్ణారావు వేణుకి స్నేహితుడు. ఆయన భార్య లలిత నా క్లాస్ మేట్. అనసూయమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకి పట్టుకు పోరాడింది. భర్త సత్యప్రసాద్ గారిని పోరాటంలో కాల్చేశారు. ఆమె గంజిచీర నలగకుండా నీట్ గా పని పాటలు చేసుకునేది. ఆవకాయ ముద్దలు ప్రసాదుకి తినిపిస్తూ! ఓసారి కాజీపేట ఆస్పత్రికి పనిమీద అనసూయక్కా నేను వెళ్ళాం. అక్కడొక పాపకి నర్సు మందువేసే ప్రయత్నం చేస్తోంది. పాప గిలగిలా కొట్టుకుంటోంది. తల్లి నిస్సహాయంగా నిల్చుంది. అక్క గభాలున నేలమీద కూర్చుని పాపని కాళ్ళమీద పడుకో బెట్టుకుని చాకచక్యంగా మందు పట్టించింది. చీర నలగని ఆ వీరవనిత సందర్భోచితంగా అలా చేయడం అబ్బురమనిపించింది. చిన్న విషయమే కావచ్చు. కానీ మనిషి అంతరంగాన్ని పట్టిస్తుంది. శ్రీనగర్ దగ్గర్నుంచీ కాజీపేట దాకా పిల్లలకు కాలేజీ సీట్లు యిప్పించడం దగ్గర్నుంచీ, ఎన్నో కార్యక్రమాలు దక్షతతో నిర్వహించేది.
చెట్టుకొకరూ, పుట్టకొకరయ్యారు…
“తెలంగాణా సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ అద్భుతమైన పాత్ర పోషించింది. దానికి మద్దతుగా ఆంధ్రాలో మాభూమి నాటకం, వివిధ కళారూపాల ప్రదర్శనలు జరిగేవి. మా భూమినీ, ప్రజాశక్తి పత్రికనీ నిషేధించి (1950) ప్రెస్సుని ధ్వంసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణా పోరాటానికి మద్దతుగా నిలిచినందుకు ఒక్క కృష్ణాజిల్లా లోనే 300 మంది కాల్చేశారు. చెట్టుకొకరూ పుట్టకొకరు అయ్యారు. చలసాని ప్రసాద్ కుటుంబంలో బాబాయీ, బావ, అన్న పోలీసు కాల్పులకు బలయ్యారు. ప్రసాదు కాజీపేట రైల్వే కాంటీన్ లో పనిచేసేవాడు. నాన్న గారు అతని సాహిత్య పిపాస గురించి చెప్తుండేవారు. జగపతీ, ప్రసాదూ, కేఎస్, అప్పారావు, అన్నయ్యగారు, రాధ తరచూ మా ఇంటికి బాగోగుల భోగట్టా చేసేవారు. వీళ్లందరి అండదండలతో అమ్మా నాన్న నిబ్బరంగా ఉండేవారు.
కాళోజీని పరిచయం చేసింది బంగోరె…
బంగోరె కాళోజీని తీసుకొచ్చి పరిచయం చేశాడు. పొట్లపల్లి వారి కుటుంబం పిల్లల చదువుల కోసం కాపురముండి బాగా దగ్గరయ్యారు. పొట్లపల్లి రామారావు గారిని ” అమ్మాయి వుందక్కడ, చూసిపో” అని కాళోజీ పంపారు. ఆయన కాసేపు మౌనంగా కూర్చొని, కాసేపు మాట్లాడి వెళ్లేవారు.చెల్లాయిని దీవిస్తిమి అని కార్డులు రాసేవారు. పక్కనే ఉన్న పాలమామ కుటుంబం వల్ల తెలంగాణ యాసకి దగ్గరయ్యాం. మిషనరీల మూలంగా చుట్టూ క్రిస్టియన్ వాతావరణం ఉండేది.
కాజీపేట నక్సల్బరీ రాజకీయాలకు కేంద్రం…
కేఎస్, సత్యమూర్తీ, రమేష్ బాబూ, చలసాని గంటల తరబడి కశ్చేవ్ రివిజనిజాన్ని విమర్శిస్తూ, సాయుధ విప్లవ పోరాట పరిస్థితుల్ని అంచనా వేసేవారు. ప్రసాదు మాత్రం స్ట్రాంగ్ స్టాలినిస్ట్. ఎక్కడెక్కడి వాళ్లం, మా అవసరాల రీత్యా కాజీపేటలో కూడుకున్నాం. అలా అదే కేంద్రమయింది నక్సల్బరీ రాజకీయాలకు. అప్పట్లోనే కరుణా రమేష్ బాబుల పెళ్లి కాళోజీ ఆధ్వర్యంలో జరిగింది.
మా ప్రాంతంలో అలవాటు లేని హోలీ పండుగ వచ్చింది. రాధ రంగులు తెర నాకు మా నాన్నకి పూసింది, పిల్లల రంగుల్లో ఓలలాడారు. ఇంజనీరింగ్ హాలు పోయి ప్రసాదుకీ పూశాం. 30 ఏళ్ళ ప్రసాదుకింకా పెళ్ళి కాలేదు. రాధా నేను దెబ్బలాడేవాళ్ళం – ఇంకా ఎప్పుడు చేసుకుంటావనీ, ఎలాంటి అమ్మాయి కావాలన్నా. స్వతంత్రంగా బతకగల అమ్మాయి, వామపక్ష భావాలున్నాయి కావాలన్నాడు. హైదరాబాద్ మిత్రులు కమ్యూనిస్టు కుటుంబంలోని విజయని సూచించారు. విజయం మంచివక్త, మహిళా ఆర్గనైజర్. అన్నలు సాహిత్యంలోనూ రాజకీయాల్లోనూ మంచి అవగాహన వున్నవాళ్ళు. పెద్దన్నయ్య ప్రసాదుకీ బాగా తెలుసు. విజయకీ ప్రసాదు కుటుంబ నేపథ్యమూ, అతని అభిరుచులూ తెలుసు. ఇద్దరూ 1964 మేడే నాడు మిత్రుల మధ్య దండలు మార్చుకున్నారు. తర్వాత బంధుమిత్రుల వూళ్ళకి వెళ్ళి కనిపించి తిరిగొచ్చారు. ఎవరి వుద్యోగాల్లో వాళ్ళు చేరారు వేణు అమెరికా నుండి తిరిగొచ్చాక ప్రసాదుకీ, విజయకి విశాఖలో వుద్యోగాలు దొరికాయి – ఎవిఎన్ కాలేజీలో ప్రసాదుకీ, మునిసిపల్ హైస్కూల్లో విజయకీను. అందరం ఒకే యింట్లో 1964 నుంచి వున్నాం. మధ్యలో ఎమర్జన్సీ భూతం ముగ్గురు మగవాళ్ళనీ (వేణూ, చలసానీ, కొత్తగా పెళ్ళయిన మా చిన్నల్లుడు నరసింహారావు) జైల్లోకి తోసింది. రావిశాస్త్రి గారు, సురా, పక్కింటి రోజు గారు వీళ్ళకి జైలేట్స్ విశాఖలో సాహిత్య వాతావరణం చాలా చక్కగా వుండేది. విశాఖ రచయితల సంఘంలో రావిశాస్త్రి, కారాలే కాకుండా సిసింద్రీల్లాంటి యువ రచయితలు ఎన్నెస్, మరువాడ వగైరాలుండేవారు. “మమ్మల్ని హింసపెడుతున్నారయ్యా” అనేవారు పెద్దలు – వీళ్ళ తర్కానికీ ప్రశ్నలకీ జవాబులు చెప్పలేక.
చింతపల్లి గిరిజనులపై పోలీసుల దాడి…
1970లో విప్లవ రచయితల సంఘం ఏర్పడింది – శ్రీశ్రీ అధ్యక్షుడిగా, కెవిఆర్ కార్యదర్శిగా, కుటుంబరావు రావిశాస్త్రి ఉపాధ్యక్షులు గానూ, విరసాన్నే నక్సలైటు పార్టీగా భావించి ప్రభుత్వం నిషేదాలు, జైలు శిక్ష ముమ్మరం చేసింది. అదంతా విరసం చరిత్రగా రూపొందింది. చింతపల్లి గిరిజన గ్రామాలని పోలీసులు తగలబెట్టినప్పుడు విశాఖ పౌరహక్కుల సంఘం తరఫున అధ్యక్షుడు దిగుమర్తి గోపాలస్వామీ, ఉపాధ్యక్షుడు వేణుగోపాలరావూ, కార్యదర్శి జయగోపాలూ (నాస్తిక సమాజం నాయకుడు, మార్కిస్ట్ భావజాలానికి సన్నిహితంగా ఉంటాడు.) నిజనిర్ధారణ కమిటీగా చింతపల్లి పోయి చూసి నివేదిక పత్రికల్లో వెల్లడించారు. గిరిజనోద్యమం బలపడుతున్న కొద్దీ గంగవెర్రులెత్తిన ప్రభుత్వం మరోసారి చింతపల్లి గిరిజనుల మీద దండెత్తింది. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం తరఫున బాలగోపాల్ చింతపల్లి పోయి గిరిజనుల్ని చాటుమాటుగా విశాఖ తీసుకొచ్చి కలెక్టర్ కి రిపోర్టు యిప్పిద్దామనుకున్నారు. కానీ పోలీసులు చెల్లాచెదురు చేశారు. ఆ గిరిజనుల్ని యూనివర్సిటీ క్వార్టర్సులోంచి తీసుకొచ్చి మా యింటి మేడ మీద దాచారు. యూనివర్సిటీ ఏరియా కావడం వల్ల పోలీసులు లోపలికి రాకుండా గేటు ఎదురుగా కాపలా కాశారు, తెల్లవార్లూ, బాలగోపాల్ గిరిజనుల్ని పెరటి దారిన బస్టాండుకి తీసుకెళ్ళాడు. రావిశాస్త్రి గారిని చలసాని బస్టాండ్ కి తీసుకొచ్చాడు. అక్కడో కానిస్టేబుల్ తో “ఇదిగో సీతారాఁవుడూ, మా వాళ్ళని జాగ్రత్తగా చింతపల్లిలో దింపు సుమా!” అని శాస్త్రిగారు హెచ్చరించారు. విశాఖలో వాసిరెడ్డి వెంకటప్పయ్య కుటుంబం మేమూ గాఢ స్నేహితుల మయ్యాం. రికార్డ్ ప్లేయరూ రికార్డులు పట్టుకుని గేటు దగ్గర్నుంచే ‘అక్కా అని కేకేస్తూ వచ్చేవాడు. దంపతులు మాతోపాటు కూర్చుని సంగీత రసాస్వాదన చేసేవాళ్ళు. ఊళ్ళో బడేగులాం అలీఖాన్, బిస్మిల్లాఖాన్, పర్వీన్ సుల్తాన, చిట్టి బాబు మరెందరో గొప్ప విద్వాంసుల సంగీతం వెంకటప్పయ్య, రావిశాస్త్రి మాకు పరిచయం చేశారు.
విశాఖ యువ రచయితల నాయకుడు కథకుడు ఎన్నెస్…
వెంకటప్పయ్య మార్క్సిస్టు పార్టీలో పనిచేసి, ఆఖర్లో రాజకీయాలు ఒదిలేసి ఈథర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాడు. ఆ దశలో వెంకటప్పయ్యా ఎన్నెస్ ఆ ప్లాంట్ కి బలి అయ్యారు. ఎన్నెస్ ప్రకాశరావు విశాఖ యువ రచయితల నాయకుడు, మార్గదర్శి. యూనివర్సిటీ విద్యార్థుల కథాసంకలనాన్ని వెలువరించాడు. ఐవి సాంబశివరావు, కాళీపట్నంల సహచర్యం. వర్గశత్రువు కాగితప్పులి లాంటివాడని ‘పేపర్ టైగర్’ అనే ప్రసిద్ధ కథలు (వ్యంగ్య రచన) రాసి నిరూపించాడు. మా పెద్దమ్మాయీ అతను పెళ్ళి చేసుకున్నారు. కెమికల్ ఇంజినీరింగ్ చదివి రీసెర్చి చేసేవాడు. పెళ్ళయిన 3 నెలలకే ఈథర్ ప్లాంట్ కి బలి అయ్యాడు. (1973, జూన్ 14) విరసం సభ్యుడు. చావుని కూడా నిబ్బరంగా ఎదుర్కొన్నాడు. తెలుగు సాహిత్యలోకం గొప్ప ప్రామిసింగ్ రైటర్ ని కోల్పోయింది. శ్రీశ్రీ, కొడవటిగంటి, కెవిఆర్, చెరబండరాజు, విరసం మిత్రులు, తోటి రచయితలు చాలా బాధ పడ్డారు.
“కృష్ణా, మీకన్నా బాగా రాయగల మొనగాడిదుగో” అని మా అన్న తమ్ము పెద్దిరాజుని విజయవాడలో పరిచయం చేశాడు. కమ్మరిపని ఎంత నైపుణ్యం తో చేసేవాడో, అంత పనితనంతోనూ కథల్ని చెక్కేవాడు. చెక్కడం ఎక్కువై తక్కువ కథలు రాశాడు. విజయవాడలో విరసం సభ్యుడయ్యాడు. పురాణం లాంటి సంపాదకుడికి సమాధానంగా ఓ వ్యంగ్య రచన చేశాడు. ‘నీరు పల్లమెరుగు అంటారుగాని విజయవాడలో పల్లాన వున్న గుడిసెలకి నీళ్ళురావనీ, మెరకన వున్న మేడలవాళ్ళు కదా చేస్తార’నీ ఈ రచయిత కి ఎలా అర్ధమవుతుంది?” అని చురక అంటించాడు.
విశాఖ విద్యార్థుల సవాల్…
శ్రీ శ్రీ ఆధునిక తెలుగు సాహిత్యానికి యుగకర్త. ఆయన కవితాఝరి ఉర్రూతలూగిస్తుంది. కవితా ఓ కవితా, మహాప్రస్థానం, కొంతమంది కుర్రవాళ్ళు, ఊగరా ఊగరా లాంటి శ్రీశ్రీ కవితలెన్నో సాహిత్యాభిమానుల నాల్కలమీదా, గుండెల్లో నిల్చిపో యాయి. అలవోకగా అనర్గళంగా ఆయన కవిత్వం వినిపించి జనాన్ని ‘పదండి ముందుకు పడండి తోసుకు పోదాం పోదాం పైపైకి’ అని నడిపించాడు. అలాంటి శ్రీశ్రీకి సన్మానం చేసి, ఆయన సాహిత్యాన్ని మొత్తంగా పాఠకులకి అందించాలని విశాఖలో సన్మాన సంఘం నిర్ణయించింది. కె వి రమణారెడ్డి సంపాదకత్వం బాధ్యత యిచ్చింది. మా కుటుంబం మొత్తం సన్మాన కార్యక్రమాల్లో మునిగి తేలాం. కారాగార కార్యదర్శి, చలసాని కాలికి బలపం కట్టుకు తిరిగి పనులు నిర్వహించారు. 1970 ఫిబ్రవరి 1న ఆ పండగ. తెలుగునేల నాలుగు చెరగుల నుంచీ సాహిత్యాభిమానులు తరలివచ్చారు. ఉదయం మెడికల్ కాలేజీ పానగల్ బిల్డింగులో రచయితల సమ్మేళనం జరిగింది.
‘రచయితలారా! మీరెటువైపు?’…
‘రచయితలారా! మీరెటువైపు?’ అని విశాఖ విద్యార్థులు సవాల్ విసిరారు. ఆ చారిత్రక పత్రాన్ని సభలో పంచారు. రచయితల్లో కలకలం బయల్దేరింది. తామెటు వైపో తేల్చుకోవలసిన సందర్భం వచ్చింది. పోలరైజేషన్ జరిగింది. సాయంత్రం రాచకొండ, పురిపండా, కారా, కెవిఆర్, పురాణం, వరవరరావు, జ్వాలాముఖి, లోచన్, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మొదలైన ప్రముఖ రచయితలు, కవులు, అభిమానులు చౌలీ నుంచి స్టేడియందాకా వూరేగింపుగా నడిచారు. “రచయితలు వూరేగింపుగా రావడం తెలుగు సాహిత్య చరిత్రలో యిదే మొదటిసారి అన్నారు పురిపండా. శ్రీ శ్రీ తోపాటు తాపీ ధర్మారావు, తెన్నేటి విశ్వనాథం, పురిపండా అప్పలస్వామి, కెవి రమణారెడ్డి వేదికనలంకరించారు. తూమాటి దొణప్ప అందర్నీ ఆహ్వానించారు. యూనివర్సిటీ విద్యార్థుల బృందం ‘మరో ప్రపంచం’ గీతమాలపించారు. ఉత్తేజకర వాతావరణం. సందేశాలు వినిపించారు. తాతాజీ, కేవీఆర్, శ్రీశ్రీ మాట్లాడారు. ఆరుద్ర రెండు ముక్కలు మాట్లాడాడు. ఇదంతా సన్మాన చరిత్ర. దిగంబర్ కవులు, తిరగబడు కవులు మరెందరో తమ రచనలు వినిపించారు. లోచన్ ‘ట్రిగ్గిర్ మీద వేళ్ళతో” అంటూ మెత్తటి గొంతుతో, తీవ్రంగా పలికాడు. గుప్పెళ్ళు మూసుకున్న పొత్తిళ్ళబిడ్డని శిశు! పిడికిలి బిగించి ఈ లోకం మీద యుద్ధం ప్రకటిస్తున్నాము అంటూ ఆహ్వానించాడు.
విరసం ఆవిర్భావం…
అయిదు నెలల తర్వాత 1970 జులై 4న హైదరాబాద్ లో విప్లవ రచయితల సంఘం జననం. పురిటి నొప్పులు విశాఖ నగరంలో, జననం భాగ్యనగరంలో నూను. శ్రీకాకుళ నక్సల్బరీ పోరాటాల నేపథ్యంలో ఏర్పడిన మొదటి ప్రజా సంఘం విరసం. విరసం పుట్టి వారం తిరక్కుండానే శ్రీకాకుళోద్య నాయకులు వెంపటాపు సత్యం, కైలాసాల్ని కాంగ్రెసు ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది (జులై 10). ఒక కేసులో భూమయ్య, కిష్టాగౌడ్ లకి వురిశిక్ష విధించింది కోర్టు. ప్రజాందోళనతో రెండుసార్లు ఉరి అమలు ఆగింది. పత్తిపాటి వెంకటేశ్వర్లు యీ కృషిలో నిర్వహించిన పాత్ర అద్భుతం. కానీ పిరికి ప్రభుత్వం ఎమర్జన్సీ చీకటిమాటున వాళ్ళిద్దర్నీ ఉరి తీయనే తీసింది (డిసెంబర్, 1975).
ఎమర్జెన్సీ చీకటి రోజులు…
అప్పట్లో మృణాల్ సేన్ విశాఖలో సినిమా తీస్తా కలకత్తా తిరిగి వెళ్తున్నారు ఉరితీత గురించి ఆయనకి స్టేషన్లో చెప్పాం. వెంటనే సిగరెట్టు రేపర్ మీద దీనిని ఖండిస్తూ రాసిచ్చారు. ఆయన స్పందన అది. ఎమర్జన్సీ పిడుగు దేశం నెత్తిన పడింది. ఊరూరా అరెస్టులు. విరసం దగ్గర్నుంచి, ఆర్ఎస్ఎస్ దాకా బందిఖానాలో. మా యింటి ముగ్గురు మగవాళ్ళూ జైలు పాలయ్యారు. మా యింటివైపు తొంగి చూడ్డానికే జనానికి భయం. ఇంజనీరింగ్ లెక్చరర్ దివాకరరాయ్, రాజగోపాలరావు దంపతులు మాత్రం రోజూ వచ్చి పలకరించే వారు. జిజె విజెరాజు, వరహాలు చెట్టు లాంటి మిత్రులు చూడవచ్చేవారు. వరంగల్‌లో కమ్యూనిస్టు కలెక్టరుగా పేరొందిన కాకి మాధవరావు గారు, గుంటూరు నుంచీ డాక్టర్ సదాశివరావు గారు లాంటి మిత్రులు రావడం మార్పురాదు. ఎమర్జెన్సీ 1975 జూన్ 25 నుంచి ఫిబ్రవరి 1977 ఏప్రిల్ 20 దాకా వుంది.
నాన్నను హెచ్చరించిన నళిని…
ఎమర్జన్సీ ఎత్తేసిన తర్వాత, 1978లో విజయవాడలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ (సిద్ధార్థ) ప్రారంభించారు. దానికి వేణుగారిని యూనివర్సిటీ నుంచి డెప్యుటేషన్ మీద ప్రిన్సిపాల్‌గా తీసుకున్నారు. “నాన్నా పెట్టుబడిదారులకి పని చేయబోతున్నావ్. పిల్ చేస్తారు జాగ్రత్త” అని హెచ్చరించింది నళిని. నేను పుట్టిన జిల్లాలో ఇన్నేళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీ పెడుతున్నారు. దీని వరంగా తీసుకుంటున్నా” సన్నారాయన. మంచి స్టాఫ్ ని ఎంచుకోవడంలోనూ, వర్క్ జీతభత్యాల విషయంలో మేనేజిమెంట్ నీ ఒప్పించడంలోను విజయం సాధించారు. ఆయన ఆదర్శాలేమిటో తెలుసు. ఎమర్జన్సీలో జైల్లో వున్నారనీ తెలుసు. మేనేజిమెంట్ కి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు కాలేజ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధి. ఈ వైరుధ్యాలు మింగుడు పడలేదు. కానీ దీన్ని ఛాలెంజీగా తీసుకున్నారు వేణు. కాలేజీ నిర్వహణలో మేనేజిమెంట్ తలదూర్చలేదు – చాలా వరకు. అయిదేళ్ళు అక్కడే పని చేశారు. వెంకటేశ్వర్రావు అనే బుచ్చిరాముడు మా వూళ్ళో కార్పెంటర్, వామపక్షవాదం. అతన్ని కాలేజీలో కార్పెంటర్ గా తీసుకున్నారు. పెద్ద చదువు లేకపోయినా ప్రపంచ జ్ఞానంతో, అందరికీ మంచి సలహాలిచ్చేవాడు. ఎవరైనా పొరపాటు చేస్తే, ఎంత పెద్దవాళ్ళయినా సరే, నిర్భయంగా ఎత్తి చూపించేవాడు.
సాహితీ మిత్రుల సమావేశాలు…
సాహితీ మిత్రులు పేరుతో ఇంట్లోనే కొన్ని సమావేశాలు జరిపే. ‘మా’, టి ఎల్ కాంతారావు, ఖాదర్, అఫ్సర్, వాసుదేవరావు, పురాణం లాంటి కవులూ, సాహిత్యకారులు పాల్గొనేవారు. కెవిఆర్, బంగోరె, ఓరుగల్లు మిత్రులు, సి ఎస్ ఆర్ చలసాని లాంటివాళ్ళు వూళ్ళోకి వచ్చినప్పుడు సమావేశాలుండేవి. ఇంజనీరింగ్ కాలేజీలో కూడా కాళోజీ, బి వి నర్సింహారావు, రావిశాస్త్రి లాంటి ప్రముఖులతో విద్యార్థులకి ఇష్టాగోష్టి జరిగేవి.
విజయవాడ విరసం యూనిట్ ఉత్తేజాలు…
విజయవాడ విరసం యూనిట్ సభ్యులు పది మంది పైనే వుండేవారు. రజని, ఈశ్వరి, ఎల్లి అరుణ, అనూరాధ, అల్లం నారాయణ, త్రిపురనేని శ్రీనివాస్, జి.శ్రీనివాస్, డానీ, యువక, దాసు చాలా వుత్సాహంగా పాల్గొనేవారు. ఎన్.వేణుగోపాల్ అందరికీ తలలో నాలుకగా ఉండి చదివించడం రాయించడంలో చాలా శ్రద్ధ తీసుకునే వాడు. తన వూరూ పేరు లేకుండా ఎన్నో పుస్తకాలు ప్రచురించాడు. ఉదా: ‘మనలో మనం’ (కొత్త తరహాలో వ్యాస సంపుటి), ‘చిత్రహింసల కొలిమిలోంచి’, ‘మిలీషియా మహిళలు’ లాంటి మంచి అనువాదాలు అచ్చొత్తించాడు. సృజనలో బాల్యం నుంచి ఎదిగిన వేణుకి యీ పనులు కొట్టిన పిండే. ఇద్దరం అక్కా తమ్ముళ్ళలాగా మెలిగేవాళ్ళం. సిద్ధార్థలో అయిదేళ్ళు పని చేశాక వేణుగారు యూనివర్సిటీ వెళ్లిపోయారు. అక్కడి నుంచి మళ్ళా వచ్చి విజయవాడ కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీలో రెండేళ్ళు పని చేశారు. ఈ ఏడేళ్ళలో సాహిత్యపరంగా కొన్ని పనులు చేయగలిగాం.
కరుణ ఇల్లే విరసానికి విడిది…
విరసం అభిమానులు ద్రోణవల్లి అనసూయమ్మ, కరుణ, వసంత విరసానికి దన్నుగా నిలబడ్డారు. కరుణ ఇల్లు అందరికీ విడిది. వసంతా, నేను ఫిలిం అప్రీసియేషన్ కోర్సులో చేరి గొప్పగొప్ప సినిమాలు చూడగలిగాం. వాటి సమీక్షలు, వివరణలూ మమ్మల్ని ఎడ్యుకేట్ చేశాయి. జగన్ (ఇప్పుడు ‘ఆంధ్రజ్యోతి’లో సీనియర్ జర్నలిస్ట్) అనే స్టూడెంట్ ఆ క్లాసుల్లోనే పరిచయమయ్యాడు. అతను అంతర్జాతీయ సినిమా పండగలన్నిటికీ వెళ్ళడం, వాటిని తెలుగు వారికి పరిచయం చేయడం వృత్తిగా కూడా చేసుకున్నాడు. ‘ది టేస్ట్ ఆఫ్ మనీ (15 కేన్స్ సినిమా కథలు) అనే పుస్తకం, లెక్కలేనన్ని సినిమా వ్యాసాలు రాస్తున్నాడు. వసంతలక్ష్మి సాహిత్య అభిరుచితో జర్నలిజం చేసింది. ‘ఆంధ్రజ్యోతి’లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తోంది. బాలగోపాల్ సహచరి. మానవహక్కుల వేదిక బాధ్యురాలు. నా ఫ్రెండ్ జి ఎస్ ఎస్ కూతురుగా పరిచయమై నాకు మంచి నేస్తం అయింది. ఈ కోర్సుకి వరంగల్లు నుంచీ జయధీర్ తిరుమలరావు, మిగిలిన వూళ్ళ నుంచీ మరికొందరు కూడా వచ్చారు. మేం ఫిలింకోర్సులో ఆఖరి సినిమా ‘చేగువేరా’ చూశాం. ఆఖర్లో చేగువేరా గుండు దెబ్బతో పడిపోయిన దృశ్యాన్ని చూపిస్తూ ‘స్టాండప్ స్టాండప్’ అని వినిపిస్తుంది. కొంత సేపు అలా నిశ్చేష్టులమై నిల్చుండిపోతాం. మన అమరవీరుల బలిదానాలు గుర్తొచ్చాయి. బరువెక్కిన హృదయంతో బయటపడ్డాం.
సహచరుల్ని ఎంచుకున్న పిల్లలు…
ఆ నాటి విజయవాడనీ, ఆ సాహిత్య సాంస్కృతిక వాతావరణాన్ని తల్చుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు? మధుర స్మృతులెన్నో నా మరుపు మడతల్లో మలిగిపోతున్నాయి. మా పిల్లల పెళ్ళిళ్ళు రకరకాలుగా రూపొందాయి. రాజకీయపరంగా ఏర్పడిన పరిచయాలు అనుబంధాలుగా మారాయి. దశాబ్దాల పాటు అజ్ఞాత జీవితాలు గడిపిన మా బిడ్డలు తమ సహచరుల్ని ఎంచుకున్నారు. కాని మరో జంట – భాష ఒకటి కాదు. మనస్తత్వాలు ఒకటి కాదు. అలవాట్లు, అభిరుచులు ఒకటికాదు భిన్నత్వంలో ఏకత్వం.
ఈ ప్రేమ వివాహాలకి ప్రాతిపదిక ఏమిటీ? ఆలోచించిన కొద్ది ఆశ్చర్యంగా ఉంటుంది. మా మమత తన క్లాస్ మేట్ రఘు ప్రకాశ్ ని పెళ్ళాడింది. కమ్యూనిస్టు ప్రాంతంగా పేరొందిన కేరళలోనే అతను పుట్టినా, ఆ భావాలతనికి అంటలేదు. అందుకనే మమత తన కుటుంబ నేపథ్యం చెప్పి, “ఎప్పుడైనా మా కె ఎస్ మామ వస్తే షెల్టర్ యివ్వాల్సి వుంటుంద”ని హెచ్చరించింది. ‘దానికి తిరుగేమీ!’ అన్నాడు తన సహజ హాస్య ధోరణిలో. అతను వాళ్ళింట్లో రెబెల్. తండ్రి పద్ధతులు అతనికి పడేదిగాదు. ఎప్పటికప్పుడు మమత ఆ విషయాలు రాసేది. పెళ్ళి కాకముందే, పిహెచ్డి ఆంధ్రా యూనివర్సిటీలో చేశాడు రఘు. మకాం మాతోనే. 1992లో రిజిస్టర్ పెళ్ళి చేసుకున్నారు. “మన మలయాళీ పిల్ల దొరకలేదా నీకు?” అని గొణిగాడు తండ్రి. తల్లి చాలా మెతక. కొడుకు ఇష్టాన్ని అంగీకరించింది. కోడల్ని తీసుకెళ్ళి అక్కడ నిరాడంబరంగా పెళ్ళి చేశారు. మేమందరం వెళ్ళాం. కేరళలో గొప్ప సంఘసంస్కర్త నారాయణగురు సంప్రదాయం
వాళ్ళది. రఘు ఉద్యోగరీత్యా విశాఖలో సెటిలయాడు. రఘు, వాళ్ళ బిడ్డ తుషార కూడా మమతలాగే మాకు అత్యంత ప్రీతిపాత్రులు. 9 లో ఎన్నికలు జరిగి ఇందిరా కాంగ్రెసు చిత్తుగా ఓడిపోయింది. జనతా ప్రభుత్వం ఏర్పాటయింది. తర్వాతి చరిత్ర లోక విదితమే.
చలం – సామాజిక దృక్పథం…
ఇవేళా నిన్నా కాదు. సుమారు డబ్బయ్ ఏళ్ళ కిందటి ముచ్చట. ముద్దులొలికే చిన్నపాపకి ముచ్చటగా పెళ్ళిచేశారు. పిల్ల ఈడేరింది. అత్తవారింటికి కబురె కంది. ముహూర్తం పెట్టించి అమ్మాయిని అత్తవారింటికి పంపారు. ఈడు ముదరకుం డానే, శృంగారాభిలాష కలగకుండానే మొగ్గలా ముడుచుకుపోయిన యీ చిన్నారి పాప వురకలెత్తే వయసులో వున్న ఆ అబ్బాయికీ శోభనపు గదిలో పొందు ఎలా కుదురు తుంది? దాంతో ఏడుపులూ, మొత్తుకోళ్లు. ఆ అమ్మాయి అన్నగారు తిరగబడి “ఇలా సాగడానికి వీళ్లే”అన్నారు. కాని అలాగే సాగింది. చెల్లెలు కాపరానికి వెళ్ళింది. పెనిమిటితో పాట్లు తప్పు. అన్నగారు రిజిష్టర్ వుత్తరాలు- “నా చెల్లెల్ని ఏడిపించాను నీ అంతు తేలుస్తా” అంటే, “ఏం, నీ అన్న అంత మొనగాడా? నా పెళ్ళాం. నా ఇష్టం” అని ఇతగాడి రంకెలు. “అన్నయ్యా నీకు పుణ్యముంటుంది. నా కాపురంలో చిచ్చు పెట్టకు” అని చెల్లెలు కూడా రాయడంతో ఆ అన్నగారు దిగమింగక తప్పలా. ఆ అన్నే గుడిపాటి వెంకటచలం. అప్పటి నుండి మీ వివాహ వ్యవస్థ, దానిలో వున్న కుళ్ళు స్పష్టంగా గ్రహించి దీనిని బద్దలు కొట్టేందుకు ఆలోచించసాగాడు. సహజంగా దుడుకుతనమున్నా, అపారమైన జాలి, కరుణ గల చలం తన చెల్లెల్లాంటి అభాగినులను చూసి, పేరుకున్న యీ మురికిని పోగొట్టేందుకు కెరటంలా విరుచుకు పడ్డాడు. అప్పట దాకా మత్తు నిద్రలో వున్న తెలుగుదేశానికి అది షాక్ ట్రీట్మెంట్ అయింది. ఆ కుదుపుకి లేచి బయటపడి చలంతో చేయి కలిపిన వాళ్ళకన్నా, సుఖనిద్ర’ అడిగా తున్న యీ కిరాతకుడెవరా అని కళ్ళెర్రజేసి రాళ్ళు విసిరిన వారే ఎక్కువ. అయన బెదరకుండా అవిరామంగా ముప్పై ఏళ్ళ పాటు స్త్రీ స్వేచ్ఛ కోసం అలమటించిన నెత్తురు కాలం నుంచి రాశాడు, అవి వుత్త రచనలు కాదు, నిప్పుల కణికలు.
అతన్ని చదివితే ఆడవాళ్ళు, కుర్రాళ్ళు చెడిపోతారని పుస్తకాలు దాచేవారు తమ పట్టు మంచపు తలగడ కింద – ‘నీతిమంతులైన పెద్దలు, పెళ్ళాలు, కుర్రాళ్ళు అవి చదివితే లేచి పోతారని భయం. అందుకే చలం అన్నారు “స్త్రీ నిజంగానే కళ్ళు తెరచి పరీక్షించి ఏరుకునేటట్లయితే యీ మొగవాళ్ళ కెవరికైనా వివాహయోగ్యత వుంటుందా? కుక్క హృదయంలో అపారమైన ప్రేమ అనే instinct వుంది. దీనిని ఎవరి మీదనో ఒకరి మీద కురిపిస్తే కాని కుక్కకి శాంతి ఉండదు. అందుకని ఆ మనిషి స్వభావం ఎటువంటిదా అని యోచించకుండా ఒక ముద్ద అన్నం పడవేసిన వాణి ప్రేమించి తనని తన్నినా వెంటబడి ఆరాధించి తన జీవితాన్ని సార్థకం చేసుకుంటుంది. చాలా మంది స్త్రీలింతే. దానికి కారణం కూడా చలం చెప్తాడు. “క్రూరమైన యీ లోకంలో అనాథవైన స్త్రీవి. మిమ్మల్ని, మీ సూనృతాన్ని అదిమి నాశనం చేశాం పురుషులం” అని.
”ఆం, అదంతా నీ వూహ. ఆడవాళ్ళు హాయిగా కాపరాలు చేసుకుంటున్నారు. నువ్వెందుకు గోల పెడతావ్?” అన్నవాళ్ళతో, సుఖంగానూ, నిర్మలంగానూ స్త్రీలు కాపరాలు చేయడం లేదు. అసలా బూజు గదుల్లో లేని పదార్థం నిర్మలత్వమే” అని నొక్కి చెప్పాడు. అంతేకాదు, మనసులు కలవని కాపరం వ్యభిచారంతో సమానమే నంటూ “చాలా మంది లేదు. అప్పటికీ వేశ్య ముట్టేటంత ప్రతిఫలం కూడా దొరకదు. అతనంటే భరించలేని ద్వేషం, అసహ్యం కలిగినా, మర్నాటినించీ అతన్నే సేవించి, కామించి పిల్లల్ని కని తీరాలి” అని మన ‘పవిత్ర వివాహ మందిరాల్లోని రహస్యాన్ని బట్టబయలు చేశాడు. పతివ్రతల స్థితి ఇంతే, భర్తలతో వ్యభిచారం చేస్తేగాని గతి
మాతృస్వామ్యం నుండి పితృస్వామ్యంలోకి సమాజం అడుగుపెట్టినప్పుడే పురుషాధిక్యత మొదలయింది. భూస్వామిక యుగంలో ఇది వికృతంగా, పశుత్వంగా పరిణమించింది. మతం దీన్ని బలపరిచింది. బతికినంతకాలం బలవంత పూర్వకమైన దాంపత్యంగా స్త్రీని పురుష జాతికి లోబరచింది మతమూ, వివాహవ్యవస్థ కూడా. దీన్ని బద్దలు కొట్టాలంటే మెత్తని సంస్కరణలో, మృదువైన వుపన్యాసాలో చాలవు. అందువల్లనే సంస్కర్త కాని చలం రెబెల్ (తిరుగుబాటుదారు) అయాడు. సామాజికంగా ఇది చాలా సాహస కార్యం, “ఈ సంఘం దున్నపోతులాంటిది. ఒక పట్టాన కదలదు. ఎప్పుడైనా నాలాంటి వాడు వాలితే తోక విదిలిస్తుంది” అన్నాడాయన.
ఫ్యూడల్ సమాజంలో కుళ్ళిపోయిన నీతులు, ఆచారాలు తప్ప స్వాతంత్ర్యం (individual liberty) లేదు. ఫ్యూడల్సమాజంమీద బూర్జువా వ్యవస్థ తిరుగుబాటు జెండా ఎగరేసింది. స్వేచ్ఛను రక్తాక్షరాలతో లిఖించింది. స్వేచ్ఛ లేకుంటే ఆధునిక సమాజం లేదు. ఇంకా రాజరికమే కొనసాగేది. పెట్టుబడిదారీ వ్యవస్థ సేయు చలం ఆహ్వానించాడు కానీ, అందులోని వ్యాపార విలువలను తిట్టి దిగ పారపోవా చలం అంటాడు -దీగా భార్య పురుషుడు, పురుషుడుగా భర్తకి స్త్రీ ఏమీ ఇవం పోతున్నారు. ఒకరి శరీరం మీదనైనా రెండోవారికి ధ్యాస పోయింది. సౌఖ్యమివ్వదానికి| ధనమూ, ఆస్తి ముఖ్యమనుకున్నంత కాలమూ యిక ఏ విలువలకి స్థానముందమ అని. ఈ సమాజంలో డబ్బు విలువ మిగతా విలువల్ని ఎలా ధ్వంసం చేసింది గ్రహించాడు.
చలం ఏ ప్రలోభాలకూ అమ్ముడుపోకుండా తాను నమ్మిన దాన్ని నిజాయితీతో ఆచరించాడు. నిర్మితి, నిజాయితీలకు చలం ప్రతీక. అటు సారస్వత పీఠాధిపతులు యిటు నీతివేత్తలతోను ఎడతెగని పోరాటం సాగించాడు.
అయితే సమాజం యిలా ఏర్పడ్డానికి కొన్ని భౌతిక కారణాలుంటాయనే చారిత్రక అవగాహన లేని కారణంగా పాత విలువలన్నిటిని ధ్వంసం చేసేస్తే, కొత్త విలువలు ఏర్పడతాయని భ్రమించాడు చలం. సమాజానికి మగవాడు బానిస, అతనికి బానిస ఆడది” అన్నాడే కాని కొత్త సమాజాన్ని నిర్మించుకుంటేనే గాని స్త్రీ పురుషులు విముక్తి పొందలేరని స్పష్టంగా గ్రహించలేదాయన. కొత్త సమాజం మీద కొంత నమ్మకం, ఎక్కువ అపనమ్మకమూ ఏర్పడం వలన అప్పటికే రూపు దిద్దుకుంటున్న సోషలిస్టు వ్యవస్థని బెదురుబెదురుగా చూశాడు. కమ్యూనిజం ఒక సుదూరపు కల” అన్నప్పటికీ దానిని నిజం చేసింది. త్రీ పురుషులు బానిసలను చేసే యీ సమాజాన్ని మార్చేసి ప్రయాణించకుండా సెక్స్ ని మాత్రమే పట్టించుకున్నాడు.
భర్తల నిరంకుశత్వానికి సొంత ఆస్తి మూలమైనప్పుడు, ఆర్థికంగా స్వతంత్రురాలు లైన స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడడం కష్టం. ఆర్థిక పునాది మారితేనే స్త్రీ విముక్తి అయిన మానవజాతి విముక్తి అయినా సాధ్యమయేది. ఆ తర్వాత కూడా వెనకటి తాలూకు భావాలు కొనసాగేటంత కాలం స్త్రీకి సమానత్వం రాదు. ఇంకా చాలా కాలం పోయాక యీ మోనోగ మీ పోయి యువతీయువకులు తమ మనసుల్లోని కోరికలను బట్టి కల్పివుండగలిగినంత కాలం వుండి, విడిపోవల్సినప్పుడు విడిపోయే స్వేచ్ఛ పొందగల్గుతారు.
1955 లో అరుణాచలంలో చింతాదీక్షితులు గారి ప్రజావాజ్మయం’ పుస్తకానికి పీఠిక రాస్తూ “కమ్యూనిస్టులు, నందూరి సుబ్బారావుగారు ‘చదువుకున్నవాడు కన్నా, చాకలివాడు మేలు మళ్ళీ బాదారు పండితులను పట్టుకుని” అన్నారు చలం. ఎంకి పాటల నండూరి సుబ్బారావుగారు కష్టజీవిని కథానాయకుడుని చేసినందుకూ, శ్రమ జీవుల భాగ్యోప జీవనానికి కమ్యూనిస్టులు పాటుబడుతూన్నందుకూను.
1997లో చలం “ఎవరెంత గింజుకున్నా, వేయిమంది విశ్వనాథలు పుట్టినా, పట్టి వెనక్కి లాగినా సంఘం ముందుకే వెళుతుంద”న్నాడు. “అయితే మనిషికి progress ఒక necessity కావాలి. ఈ దేశంలో మళ్ళీ మళ్ళీ శ్రీరాముడు పుట్టినా ఈ తెలుగుదేశపు ఫ్యూడల్ సమాజంలో, ముఖ్యంగా స్త్రీ, పురుష సంబంధాల్లో మాగ్నకార్ట్’ – స్వేచ్ఛాపత్రం రచించాడు చలం. ఆ సమాజాన్ని తలుచుకుంటే స్వేచ్ఛా పత్రం అవసరం ఎంత వుందో తేలిగ్గా తెలుస్తుంది. “స్వతంత్ర దేవత కలకత్తా కాళీ కన్నా భయంకరమైనది. నిరంతరం సుఖ నైవేద్యాన్ని, అశ్రు అభిషేకాన్ని కోరుతుంది చలం ఆ దేవతను చివరిదాకా ఆరాధించాడు. దేశాన్ని వెనక్కి మళ్ళించలేడు.” అన్నాడు.
విరసం మా ఊపిరి…
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వికృతరూపం ధరించడంతో, ఎన్నికల వ్యవస్థ కి ప్రత్యామ్నాయంగా నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలు రాజకీయాల్లో ముందుకొచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లా ఎంఎల్ఏ నర్సిరెడ్డిని నక్సలైట్లు హత్య చేసిన వెంటనే మావోయిస్టుల మీద నిషేధం విధించిన ప్రభుత్వం విరసాన్ని కూడా నిషేధించింది. దీనివల్ల ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురయింది. ఈ సందర్భంలో నగరంలో పెద్దల్ని కలుసుకుని (జస్టిస్ చిన్నపరెడ్డి దగ్గర్నుంచీ) విషయాలు వివరించాం. నిషేధం చెల్లదంటూ విరసం విజ్ఞప్తి చేసింది. అప్పుడు నేను విరసం కార్యదర్శిని, ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది. మాది రాజకీయ పార్టీ కాదనీ, సాహిత్య సాంస్కృతిక సంఘమేననీ, ఇలాంటి సంఘాన్ని నిషేధించడం అన్యాయమని త్రిసభ్య కమిటీకి నివేదించాం. నిషేధం విధించడం వల్ల కలిగే నష్టమేమిటని జస్టిస్ టి.ఎల్.ఎన్.రెడ్డి (కమిటి సభ్యుడు) అడిగారు. మీ అబ్బాయిని మూడు గంటలు చీకటిగదిలో బంధించండి ఆ తరహా అభిప్రాయాన్ని సేకరించండి తెలుస్తుంది” అన్నాం.
వాక్ స్వాతంత్ర్యాన్ని హరించేలాగా పోలీసుశాఖ ప్రైవేటు హంతక ముఠాల్నిప్రోత్సహిస్తోందని వివరించాం. బహిరంగంగా పత్రికలలో ప్రకటించి మరీ చంపుతూంటే పోలీసుశాఖ మిన్న కుంటున్నది. ఇదే పరిస్థితి అచ్చం యిలాగే పునరావృతం అవుతోందిప్పుడు. నర్సకోబ్రాస్, నల్లమల నల్లత్రాచులు, కాకతీయ కోబ్రాస్ పేరుతో జాబితాలు ప్రకటిస్తూంటే కూడా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవడం లేదు. దీన్ని అభిశంసించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశాం. మూడు నెలల తర్వాత ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయవలసి వచ్చింది (నిషేధం ఎత్తివేత – 2005, నవంబర్ 17), తెలుగు రచయితలు మాకందించిన సంఘీభావా నికి కృతజ్ఞతలు తెలియజేశారు. (విరసం చరిత్ర వేరుగా ప్రచురిస్తున్నందు వల్ల వివరాలు యివ్వడం లేదు.) విరసం మా ఊపిరి. తప్పులు ఒప్పులు నిర్బంధం, విజయాలూ ఎదురయే దారిలోనే మా ప్రయాణం సాగుతుంది.
నాలో శూన్యం నింపిన వేణు మరణం…
నా జీవితంలో అన్నీ తానే అయిన వేణుని, ఆఖరాఖర్లో మాటలే కరువై అచేతనంగా నా చేతుల్లోనే కన్నుమూసిన వేణుని విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రిలో శరీరదానంలో భాగంగా అప్పగించాం. ఒకరకంగా నాలుగేళ్ళ ముందు నుంచే ఆయన నాలో శూన్యం నింపాడు. అలవాటు ప్రకారం “ఫలానా పుస్తకం యెంత బాగుంది”, “ఫలానా వాళ్ళు మీ గురించి ఫోన్ చేశారు” అని చెప్తే ప్రతిస్పందన కరువయ్యేది. మా చిన్నమ్మాయి పద్మిని, నరసింహారావు చాలా లాలనగా చూశారాయన్ని, వైద్యసలహాలు నళిని, శ్రీనివాస్‌లు ఇస్తూనే వుండేవారు. అందర్నీమించి అప్పాయమ్మ ఆయనకి కన్నతల్లిలా సేవలు చేసింది. మనుమలు రాహుల్, వినోద్ మున్నా, అజంతా, కీర్తి, తుషార, ఉదయ్ కోపదారి తాతయ్యని ప్రేమగా చూసుకున్నారు.
త్యాగాలు, బలిదానాలే ఉద్యమాలకు ప్రాణం…
ప్రజా ఉద్యమం కోసం ఎన్నెన్ని రకాలుగానో ఎందరో త్యాగాలు చేస్తున్నారు. భుజంగరావుగారూ, కాకర్ల గారి లాంటి ఎందరెందరో, లలితగారూ, క్రాంతిగారు 4 లాంటి తల్లులు అందరిలో తమ బిడ్డల్ని చూసుకోవడం మరీ విశేషం. తాయమ్మ కరుణ, పద్మకుమారి లాంటి మహిళలు తుపాకుల బదులు కలాలతో, గళాలతో పోరాడుతున్నారు. ప్రజాసంఘాలు స్థాపించి అమరుల బంధుమిత్రుల్ని ఆదుకుంటున్నారు. వారందరికి పేరు పేరునా వినమ్రంగా అభినందనలు తెలుపుతున్నా.
జీవితంలో గొప్ప పనులేమీ చేశాననీ, ఏమి సాధించానని చెప్పుకోవడం? నా గురించి నేను రాసుకోవడం సుతరామూ ఇష్టం లేదు. కాని “1956 నుంచీ రాస్తున్నావు గదా, వాటి అనుభవం ఈ తరానికి పనికొస్తుంది” అని డాక్టర్ శ్రీనివాసూ, నళిని ఒత్తిడి చేశారు. “వేణుగారు లేని ఒంటరితనంతో ఉన్నారు మీరు. యాభై ఏళ్ళ పైచిలుకు జీవితంలో ఒక్కసారిగా మనిషి కనిపించకుండా పోతే ఏమైపోతారో నాకూ ఎంతో కొంత తెలుసు. నేను విరసంలో లేకపోవచ్చు. కానీ విప్లవంతో ఉన్నాను. మీ రచనలు ఎక్కడున్నా వెదికి పంపుతాను” అన్న ప్రశాంత్ భరోసా, చలసాని చేయూతా ఈ రూపం తీసుకున్నాయి. సాహిత్య సమాలోచన పుస్తకం రాశాను. ఇది రాస్తున్నంత కాలమూ వేణు నాలోనే ఉన్నారు. ఎనభయ్యో ఏట రాస్తున్న ఈ పుస్తకం లో చాలా విషయాలు మరుగున బడి పొరపాట్లు దొర్లి వుండొచ్చు. కాలక్రమణిక సరిగా రాలేదు. విజ్ఞులు గ్రహిస్తారని ఆశిస్తున్న. ఈ రాతప్రతి ముగిస్తూండగా ఆప్తుడు, సమరశీలి గంటి ప్రసాదం ఆహుతి అయిన కబురు కళ్ళనీ గుండెనీ నింపేసింది. కన్నీళ్ళతోనూ ఆవేదనతోనూ ఆగ్రహంతోను ముగించాను.