ఎవరైనా ఎందుకు రాస్తారు? తమ ఆలోచనలు, కలలు తమకు తామే తరచి చూసుకోవడానికో, భద్రపరచుకోవడానికో రాస్తారు. లేదా తమ రచనలు ఇతరుల దాకా చేరాలని, ఇతరులతో పంచుకోవాలని రాస్తారు. తామెవరో తెలియాలని కొందరనుకుంటే, తమ రచనలు తెలిస్తే చాలని కొందరు, తాము తెలియొద్దు కానీ తమ రచనలు తెలియాలని మరికొందరు అనుకుంటారు. తాము తెలియకూడదు అనుకోవడం వెనుక సమాజం, జీవితం విధించిన కట్టుబాట్లు, నిబంధనలు ఉండొచ్చు, లేదా తాము చిత్రించిన జీవితం తమదని అందరికి తెలియొద్దని తమపై తామే విధించుకున్న నిబంధన కూడా ఉండొచ్చు. ఈ రెండిట్లోనూ మనకు ఎక్కువగా కనిపించేది స్త్రీల సాహిత్యం. స్త్రీలు రాయలేరని, రాసినా అది సాహిత్యం కాదని, రాయకూడదని, ఒక చట్రంలోనే రాయాలని, రచనల్లో కనిపించేది రచయిత్రుల జీవితమేనని, ఆ రచయిత్రుల జీవితంలో ఉన్న ఎవరో పురుషులు రాసి ఉంటారు కానీ ఆ రచయిత్రులు కాదని ఇలా ఎన్నో చర్చలు, వాదనలు, విమర్శలు. అందుకనే, జీవితంలో లాగానే సాహిత్యం లో కూడా స్త్రీల మీద కనిపించేవి, కనిపించనివి కూడా అయినా ఎన్నో నియంత్రణలు. రాయకుండా ఆగిపోయిన స్త్రీలున్నారు, రాసి తమ వద్దే దాచుకున్న స్త్రీలున్నారు, పురుషుల పేరుతొ రాసిన స్త్రీలు కూడా ఉన్నారు. పై సందర్భాల్లో కనిపించేది (?) తమను తాము అదృశ్యం, అజ్ఞాతం చేసుకున్న రచయిత్రులు. మరి అజ్ఞాతం నుండి రాసిన రచయిత్రుల మాటేమిటి? ఇది కేవలం సాహిత్య అజ్ఞాతం కాదు. సామాజిక, రాజకీయ, ఉద్యమ అజ్ఞాతం. తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు లొంగిపోయి నిశ్శబ్దంగా ఉండిపోవడం కాదు, అజ్ఞాతం నుండి వినిపించడం కాదు. వ్యవస్థను మార్చాలన్న ప్రయత్నంలో జీవితాలను త్యాగం చేసి అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటాలు చేస్తూ ఆ భావజాల స్థానం నుండి రాయడం. వియ్యుక్కలో మనం కలిసేది అలాంటి రచయిత్రులనే, వియ్యుక్కలో మనం చూసేది అలాంటి జీవితాలనే. అది రచయిత్రుల జీవితం కావచ్చు, లేదా వారి చుట్టూ ఉన్న వారి జీవితం కావచ్చు. ఆ రచనలు వచ్చేది మాత్రం అనుభవం నుండి, సంఘర్షణ నుండి. మహాశ్వేతాదేవి రచనల్లోని పాత్రలు తామే తమ గురించి మాట్లాడ్డం మొదలు పెడితే ఎలా ఉంటుందో ఆలా ఉంటాయి ఈ కథలు.
తమ ఉనికి మాత్రమే కాదు, తమ పేర్లు కూడా అజ్ఞాతమే, బహుళమే. ఈ మూడు సంపుటాల వియ్యుక్కలో కొందరు రచయిత్రులు ఉద్యమంలో ఉన్నపుడు రాశారు, మరికొందరు ఉద్యమం నుండి బయటకు వచ్చాక రాశారు. వారిలో చాలామంది రాస్తారని కూడా ఎవరికీ తెలియదు. చాలా రచనలు ఎక్కడా ప్రచురణకు కూడా రాలేదు. ఏ రచన ఏ రచయిత్రి రాసారో, ఎప్పుడు రాసారో కూడా తెలియని సందర్భాలు చాలానే ఉన్నాయి వియ్యుక్కలో. పేరు, ఇచ్చిన పేరు, పెట్టుకున్న పేరు, ఉద్యమం పేరు, కలం పేరు, అజ్ఞాత పేరు – వీటన్నిటిలో ఏ పేరుతో ఎవరు రాసారని? ఈ ప్రశ్నలు ఈ రచనల్లోని సంక్లిష్టతను మనకు ఇంకా దగ్గరగా తీసుకువస్తాయి. రచన-రచయిత-ప్రచురణ- పాఠకుల మధ్య ఉండే సంబంధాన్ని మరో కొత్త కోణం నుండి చూపిస్తాయి.
ఈ కథల్లో కనిపించేది మనకు తెలియని లోకమేమీ కాదు. గ్రహాంతర జీవితమూ కాదు. కానీ, ఈ కథల్లో కనిపించే జీవితం ఖచ్చితంగా ఒక సగటు పాఠకుడికి తెలియని అనుభవమే. మనకు తెలియని జీవితాలకు, అనుభవాలకు, ఆవేదనలకు ఒక పరిచయమే. కేవలం హింస, తుపాకులతో మాత్రమే ముడిపడినట్లు మనకు చూపించే వ్యవస్థలను ప్రశ్నిస్తున్నట్లుగా ఈ కథలు ఉద్యమ జీవితంలోని మానవ కోణాన్ని గాఢంగా చూపిస్తాయి. అసలు ఉద్యమ జీవితమే మానవతా దృక్పథంతో, పీడనకు వ్యతిరేకంగా మలచబడిందన్న విషయాన్ని గుర్తు చేస్తాయి. రహస్య జీవితాల్లో ఎన్నో తెలియని కోణాలు, నిశ్శబ్దంగా నొక్కి పెట్టిన భావోద్వేగాలు. ఉద్యమాలను, ఉద్యమ కారులను, ఉద్యమ జీవితాలను ఒక కోణంలోంచి మాత్రమే చూసిన పాఠక ప్రపంచానికి, చూపించిన సాహిత్య ప్రపంచానికి కూడా వియ్యుక్క ఒక కొత్త సృజనాత్మకతను ఆవిష్కరిస్తుంది. అది కేవలం ఊహా జనితమయినది కాదు, అనుభవపూర్వకమయినది. అనుభవం ఎలా సాహిత్యంగా మారుతుందో వియ్యుక్క చెబుతుంది.
వ్యక్తిగత కథనాలంటే తమ గురించి తాము రాసుకునే కథలు. కానీ, ఆ తను ఎవరు? తనతో ఉన్న వ్యక్తా లేక తనవాళ్లతో ఉన్న వ్యక్తా లేక తనలాంటి వాళ్లతో ఉన్న వ్యక్తా? వ్యక్తిగతమయిన ఆ ప్రపంచం ఉద్యమ ప్రపంచమయితే? తనతో ఉండడం కాదు ఈ కథనాల ఉద్దేశం. తనలాంటి జీవితాలను తన రచనల్లో ఆవిష్కరించడం. వ్యక్తిగతమంటూ లేని ఉద్యమ ప్రపంచంతో మమేకమవుతూనే, తమ వ్యక్తిగత ప్రపంచంలో ఆలోచనలను అక్షరీకరించడం. ఈ కథలు వ్యక్తిగత కథనాలయితే, వీటి ఉద్దేశమేమిటి? వీటి పాఠకులెవరు? ఈ కథలు కేవలం రచయిత్రుల ఆలోచనలు, భావాలు మాత్రమే కాదు. ఇవి ఉద్యమం మీద ఒక వ్యాఖ్యానం లాంటివి. ఉద్యమానికి, బయటి ప్రపంచానికి జరిగే సంభాషణకు, సంఘర్షణకు ఇవి అద్దం పడతాయి. కొన్ని కథలు తాము ఉద్యమంలోకి వెళ్ళడానికి పూర్వంవి అయితే మరికొన్ని ఉద్యమంలో ఉన్నప్పటివి, ఇంకొన్ని ఉద్యమంలోంచి వచ్చేసాక రాసినవి. అయినా అన్నిటికి ఉద్యమమే ప్రాథమిక భూమిక. ఈ రచయిత్రుల అస్తిత్వాలన్నీ విభిన్నమయినవి. వాళ్ళని, వాళ్ళ కథలని కలిపి ఉంచేది ఉద్యమమొక్కటే.
ఈ కథలు కేవలం తమ గురించి మాత్రమే రాసుకున్నవి కావు. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి, వ్యక్తుల గురించి, వ్యవస్థల గురించి సునిశితమయిన విశ్లేషణ ఈ కథల వస్తువు. ప్రపంచపు బాధనంతా తమ బాధగా చేసుకున్న ఈ అజ్ఞాత రచయిత్రులు తమ మనసులో, జీవితాల్లో జరిగే సంఘర్షణను కూడా మనతో పంచుకుంటూనే ఉంటారు. కుటుంబాలను వదిలి, ఉద్యమ ప్రపంచాన్ని, ప్రజలందరినీ తమ కుటుంబంగా భావించే వీరికి తమ వాళ్ళ జ్ఞాపకాలు సలుపుతూనే ఉంటాయి. నిత్య సంఘర్షణ, ఊగిసలాట, కానీ నిర్ణయాధికారం వాళ్లదే. తమ జీవితంలోని ఆవేదన ను, ఆరాటాన్ని గురించి రాసినా అది దీనంగా చేసే ఆలాపన కాదు. తమ యుద్ధాల గురించి నిర్భయంగా వివరించే ధీరత్వం. వ్యక్తులుగా, రచయిత్రులుగా, పోరాట యోధులుగా బహుళ పాత్రలు పోషిస్తూ, భిన్న సామాజిక స్థానాల నుంచి తమ వాదన వినిపిస్తూ ప్రపంచాన్ని చేరుకునే ప్రయత్నం.
తమ వాళ్ళందర్నీ వదులుకున్న వాళ్ళు, తమవాళ్ళందరూ వదులుకున్న వాళ్ళు. కానీ, అందరు వాళ్ళ వాళ్ళే. అందరికి అయినా వాళ్ళే. తమ కుటుంబాన్ని వదిలేసి వచ్చినా, కాదనుకోవాల్సి వచ్చినా, విశాల ప్రపంచమంతా వారిదే. ఉద్యమంలో వ్యక్తులతో అనుబంధాలు, చుట్టూ ఉన్న ప్రజలతో బంధాలు ఒక కొత్త కుటుంబాన్నే సృష్టిస్తాయి వాళ్ళ కోసం. అందులో ముఖ్యమయినది పోగొట్టుకున్న మాతృత్వం, ఇతరుల పిల్లలతో అనుబంధాన్ని పంచుకోగలిగే ప్రేమతత్వం. పితృస్వామ్య, భూస్వామ్య సమాజాలు కీర్తించే మూస మాతృత్వం కాదిది. ప్రపంచాన్నంతా తన కుటుంబం అనుకోగలిగే విస్తృతమయిన అవగాహన.
కథ అన్నది మనకు బాగా తెలిసిన సాహిత్య రూపమే కానీ ఈ కథలు ఆ సాహిత్య రూపంలోని కొన్ని కొత్త కోణాలను అవిక్షికరిస్తాయి. ఈ కథలను చర్చించడమంటే కేవలం సాహిత్య లక్షణాలను, సౌందర్య శాస్త్ర దృక్పథాలను చర్చించడం కాదు. కథ, జీవితం ఎలా పెనువేసుకుని ఉంటాయో చర్చించడం, రచయిత కనిపించకుండానే తన కథల్లో ఎలా కనిపిస్తారో తెలుసుకోవడం, ఏ సాహిత్య ప్రయోజనం ఏమిటో విమర్శనాత్మకంగా పరిశీలించడం. బానిసత్వం నుంచి బయటపడి స్వతంత్ర జీవితం గడపడానికి ఏళ్ల తరబడి సంఘర్షించి చివరికి విముక్తి సాధించిన హారియట్ జేకబ్స్ తన ఆత్మ కథ ఇన్సిడెంట్స్ ఇన్ ది లైఫ్ అఫ్ ఎ స్లేవ్ గర్ల్ (1861) ఏమంటుందంటే – తాను తన ఆత్మకథ రాయడం తన రచన చాతుర్యం చాటుకోవడం కోసం కాదని, తన కథ తనలాంటి ఇంకొంత మందిని తమ కథ చెప్పుకునేలా ప్రభావితం చెయ్యగలుగుతుందన్న ఆశ అని. వియ్యుక్క లాంటి పుస్తకాలు మరెన్నో కథలను మన వరకు తీసుకు వస్తాయని నమ్ముతూ, తీసుకు రావాలని కోరుకుంటున్నా.