విద్యపై పీపుల్స్ మేనిఫెస్టో డిమాండ్లు: తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ

మే 13, 2024 వ సంవత్సరం జరిగే ఎన్నికలు విద్యారంగానికి భారతదేశానికి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మొత్తం విద్యా రంగం ఆర్ఎస్ఎస్- బిజెపి వారు ఊడిగం చేసే కార్పొరేట్ శక్తుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. జాతీయ విద్యా విధానం -2020 మరియు జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం -2023 (National Curriculum Framework-2023) లను తమ హిందుత్వ ఫ్యాసిస్ట్, కార్పొరేట్ ఎజెండాను ముందుకు తీసుకుపోవడానికి తీసుకొచ్చారు. విద్యారంగంలో వ్యాపారీకరణ, కార్పొరేటీకరణలను ప్రోత్సహించడానికి “వ్యాపారాన్ని సులభతరం చేయడం” అనే విధానాన్ని ప్రోత్సహించడానికి ఈ విధానాలు తీసుకొచ్చారు. విద్యా రంగానికి స్థూల జాతీయోత్పత్తిలో 6 శాతం నిధులు కేటాయించకపోవడం వలన విద్య వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ లు వేగవంతమయ్యాయి. దేశంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు వనరులు లేక , వసతులు లేక నియామకాలు లేక సతమతం అవుతూ ఉంటే వాటిని అభివృద్ధి చేసే బదులు విదేశీ విశ్వవిద్యాలయాలను ఆహ్వానిస్తున్నారు. ఒక్క పాఠశాల విద్యనే తీసుకుంటే పాఠశాలల్లో మౌలిక వసతులు లేక, ఖాళీగా ఉన్న 10 లక్షల పోస్టులు నింపకపోవడం వలన, పాఠశాల విద్య విధ్వంసానికి గురైంది. ఫలితంగా దేశవ్యాప్తంగా గత మూడు సంవత్సరాల లో 61 వేల 361 పాఠశాలలో మూతపడ్డాయి. ఫలితంగా 47 వేల 680 స్కూల్లు ప్రైవేటు రంగంలో పెరిగాయి.

నరేంద్ర మోడీ కాలంలో విద్య కేంద్రీకరణ తీవ్రమైంది. ఇప్పటివరకు జాతీయ విద్యా శిక్షణ మరియు పరిశోధనా సంస్థ( NCERT) ఒక నమూనా పాఠ్యప్రణాళికను తయారుచేసి రాష్ట్రాలకు పంపి తమ తమ పాఠ్య పాఠ్యప్రణాళికలను స్వతంత్రంగా తయారు చేసుకోవడానికి రాష్ట్రాలకు అవకాశం యిచ్చేది. అయితే ఈ నూతన విద్యా విధానం పదేపదే నొక్కి చెప్పిన విషయం ఏమంటే పాఠ్యప్రణాళికను కేంద్రం తయారు చేస్తుంది. రాష్ట్రాలు కొన్ని పాఠాలు ప్రచురించుకోవచ్చు అని చెప్పి కేంద్రం వ్రాసిన పాఠాలకే జాతీయ ఆమోదం ఉంటుందని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు.

ఇంకొక విషయం ఏమిటంటే ఒక విద్యార్థి 12వ తరగతి తర్వాత తన పట్టణంలో ని డిగ్రీ కళాశాలలో ప్రవేశం పొందాలన్నా అందుకు జాతీయ పరీక్షా సంస్థ ( NTA) నిర్వహించే ప్రవేశ పరీక్ష వ్రాయవలసింది. ఎప్పుడైతే ఉన్నత విద్య ప్రవేశాలకు జాతీయ ప్రవేశ పరీక్ష విధానం ప్రధానమవుతుందో అప్పుడు కేంద్రం రాసిన పాఠాలకే ప్రాధాన్యత ఉంటుంది. అంటే పాఠశాల విద్యా రంగాన్ని పూర్తిగా కేంద్రం నియంత్రించబోతున్నది.

అంతేకాకుండా ఉన్నత విద్యలో ఒక భారత ఉన్నత విద్యా సంఘం( HECI) ఏర్పాటు అవుతుంది.దీని కింద విశ్వవిద్యాలయాలను నియంత్రించడానికి ఒక సమితి(NHERC), కోర్సులు రూపొందించడానికి ఒక సమితి( GEC), నిధులు ఇవ్వడానికి ఒక సమితి ( HEGC) ఉంటాయి .ఇవి కాక విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు ప్రోత్సహించడానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్( NRF) అనే ఒక సంస్థ ఉంటుంది. అంటే రాష్ట్రాలలో ఉన్న విశ్వవిద్యాలయాలు మరియు ఇతర ఉన్నత విద్యా సంస్థలు అడుగు తీసి అడుగు వేయాలంటే ఇన్ని కేంద్ర సంస్థల అనుమతి ఉండాలి.విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నదనే విషయాన్ని కూడా మరిచిపోయి మితిమీరిన అధికార కేంద్రీకరణ లను అమలు చేస్తున్నారు.

విద్యాకాశాయకరణ నరేంద్ర మోడీ కాలంలో రెట్టింపు వేగంతో అమలు జరుగుతూ ఉన్నది. ఎన్సీఈఆర్టీ( NCERT) పుస్తకాల నుండి గాంధీని చంపడంలో హిందుత్వ శక్తుల పాత్ర, గుజరాత్ లో మతకల్లోలాలు, మొగలుల చరిత్ర, సామాజిక ఉద్యమాలు, కుల వివక్ష లకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగిస్తున్నారు. ప్రకృతి శాస్త్రాలలో కూడా డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం, పీరియాడిక్ టేబుల్సులను తొలగిస్తున్నారు.విద్యారంగంలో సామాజిక వివక్ష ,కుల వివక్ష జడలు విప్పి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనే విద్యార్థిని బలి తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

అందుకే విద్యారంగంలో ఒక శక్తివంతమైన విద్యా ఉద్యమాన్ని నిర్మించకుండా ఈ ప్రగతి నిరోధక విధానాలను ఓడించలేము. అన్ని స్థాయిలలో లౌకిక, శాస్త్రీయ మరియు పూర్తిగా ప్రభుత్వ నిధులతో కూడిన కామన్ విద్యా విధానం అనే ప్రధానమైన నినాదం ఇందులో ముఖ్యమైన అంశం. అఖిల భారత విద్యా హక్కు వేదిక మరియు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీలుగా ఈ క్రింద పేర్కొన్న పీపుల్స్ మేనిఫెస్టో లోని ప్రధాన డిమాండ్లను రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రజలు ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

విద్యపై పీపుల్స్ మేనిఫెస్టోలోని ప్రధాన డిమాండ్లు:

  1. జాతీయ విద్యా విధానం- 20 20, జాతీయ ప్రణాళిక చట్రం- 2023 లను రద్దు చేయాలి.
  2. కేంద్ర బడ్జెట్లో కనీసం 15% విద్యకు కేటాయించాలి.
  3. విద్యా వ్యాపారికరణ, కార్పొరేటీరణ, కేంద్రీకరణ హిందుత్వీకరణలను వెంటనే ఆపివేయాలి.
  4. విద్యాసంస్థలలో ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు నింపకుండా “కౌన్సిలర్ల “పేర్లతో పాఠశాలల్లో “ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ ” పేరుతో యూనివర్సిటీలను బిజెపి మరియు ఆర్ఎస్ఎస్ లు తమ కార్యకర్తలను చొప్పించడం మానుకోవాలి
  5. విద్యను ఉమ్మడి జాబితా నుండి తిరిగి రాష్ట్ర జాబితాలోకి తీసుకురావాలి .
  6. నాలుగు సంవత్సరాల డిగ్రీ, సి యు ఈ టి ( CU ET) నీట్ NEET,JEE మరియు ఇతర కేంద్రీకృత పరీక్షలను రద్దు చేయాలి.
  7. దేశంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలి. విదేశీ విశ్వవిద్యాలయాలను దేశంలోకి అనుమతించరాదు.
  8. విద్యా,ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లను ఎత్తేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. అలాగే ప్రమోషన్లలో సీనియారిటీ విధానాన్ని తీసేసి విధానాన్ని మానుకోవాలి .
  9. చరిత్రను వక్రీకరించడం వెంటనే నిలిపివేయాలి.డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం, పీరియాడిక్ టేబుల్స్ లాంటి శాస్త్రీయ కోర్సులను తీసివేసి జ్యోతిష్యం, భూతవైద్యం వంటి అశాస్త్రీయ కోర్సులను ప్రవేశపెట్టడం మానుకోవాలి .
  10. విద్యా సంస్థలలో సామాజిక వివక్షను, కులవివక్షను తొలగించడానికి న్యాయపరమైన అధికారాలు ఉన్న జీఎస్ క్యాష్ (GSCASH) లాంటి కమిటీ వలె రోహిత్ చట్టాన్ని తీసుకురావాలి.
  11. క్యాంపస్ ప్రజాస్వామ్యం, విద్యాసంస్థల స్వయం ప్రతిపత్తిని మరియు భావ ప్రకటన స్వేచ్ఛను పునరుద్ధరించాలి.
  12. ప్రతి కళాశాల మరియు విశ్వవిద్యాలయాలలో విద్యార్థి సంఘానికి ఎన్నికలు జరపాలి.

ప్రొ.లక్ష్మీనారాయణ.
కార్య నిర్వహణ కార్యదర్శి.
తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ

Leave a Reply