విచా‘రణము’

విచారణ మొదలైంది!

పట్టాలపై పడివున్న పదిహేడు మృతదేహాలను బోనెక్కించారు!

దేహాలు కావవి, నెత్తురోడుతున్న ఖండ ఖండాలైన మాంసపు ముద్దలు!

కర్మాడ్ ప్రాంత రైలు పట్టాల పరిసరాలన్నీ రక్త కల్లాపి చల్లినట్టుగా వున్నాయి. చెల్లా చెదురుగా విసిరేసినట్టు పడివున్న అంగాగాలు పెట్టని చుక్కల్లా వున్నాయి. దుస్తులూ చెప్పులూ సరుకు సామాన్లూ గీయని గీతల్లా వున్నాయి. ఎవరో గీసిన ఆ ముగ్గు పేగుల ముద్దమీద  రొట్టెలు గొబ్బెమ్మలైనాయి!

ఔను, అక్కడే విచారణ ప్రారంభమైంది!

ప్రభుత్వమే విచారణకు ఆదేశించింది! కాదు, ఆదేశించాల్సి వచ్చింది!

“రైలు పట్టాలపై పడుకోవడం తప్పు”

ఆ మాటకు తెగిన తలలు దించుకున్నట్టే వున్నాయి?!

“రైలు పట్టాలపై పడుకున్నారంటే మీరు ఆత్మహత్య చేసుకోవడానికే- అని యెవరైనా ఆరోపిస్తే?”

తెగిన కంఠం వల్లనేమో గొంతులోంచి మాట పెగల్లేదు?!

“ఎవరైనా యింట్లో పడుకుంటారు”

“మాకు యిల్లు లేదు”

తెగిన నాలుక కొట్లాడుతూ నేలమీద గెంతులాడింది!

“మాకు లాక్ డౌన్ వల్ల పని పోయింది. ఇంటి కిరాయి కట్టలేకపోయాం. ఇల్లు ఖాళీ చేయించారు”

నాలుక తన్నుకలాడుతోంది!

“ఇల్లు లేనివాళ్ళు యే పేవ్మెంటు మీదో పడుకుంటారు. కాని యిలా పట్టాలెక్కరు!”

దేశం పరువు తీసినట్టుగా వుంది స్వరం!

“మొదట పేవ్మెంట్ మీదే పడ్డాం. కరోనా వస్తుందని గుంపులుగా వుండకూడదని తన్ని తరిమేశారు”

తెగిన ఛాతీ మీద తగిలిన గాయపు మచ్చని అందుకు సాక్ష్యంగా యెవరూ భావించలేదు!

“బస్సులు లేవు… రైళ్ళు లేవు… వేరే దారిలేదు…”

“ఇంతకీ యెక్కడి నుండి యెక్కడికి బయల్దేరారు?”

గద్దింపు!

“జల్నా, మహారాష్ట్ర నుండి మధ్యప్రదేశ్లో వున్న మా సొంత వూళ్ళకు బయల్దేరాం”

తెగిన పాదం పలికింది!

“ఎంతదూరం?”

నిట్టూర్పు!

“ఎనిమిదివందల యాభై కిలోమీటర్లు”

విరిగి వొరిగిన కాలు చెప్పింది!

“రైలు పట్టాల మీదనుంచి వెళితే దగ్గరనా?”

“కాదు, రోడ్డుమీద నుంచి వెళ్ళలేక… వెళ్ళే అవకాశంలేక…”

గుండె కొట్టుకుంది!

“ఏమయింది?”

“లాక్ డౌన్లో యెక్కడి వాళ్ళు అక్కడే వుండాలట. రోడ్డు మీద నడిచి కూడా పోకూడదట?!”

లాఠీ ఛార్జీలో తెగిన చెప్పు పెట్టుకున్న పిన్నీసు సాక్ష్యంగా చెప్పింది!

“కమ్యూనల్ స్ప్రెడ్ కాకూడదు కదా?”

“అమ్మ పెట్టదు. అడుక్కు తిననివ్వదు. మా దారిన మమ్మల్ని పోనివ్వరు”

తెగిన చేతి పిడికిలి బిగుసుకోలేదు?!

“తాత్కాలిక శిబిరాలకు తరలిస్తే- బంధించినట్టు భావిస్తే యెలా?”

“అక్కడ కమ్యూనల్ స్ప్రెడ్ కాదా?”

మీరు ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే చెప్పాలి, తిరిగి ప్రశ్న వేయకూడదని హెచ్చరించారు!

“పోలీసులు యెక్కడికక్కడ లాఠీ ఛార్జ్ చెయ్యడం వల్లే మీరు రోడ్డు వదిలి పట్టాలెక్కారు… అంతేనా?”

“మా నడకకి రాత్రీ లేదు, పగలు లేదు. పగలు సూర్యుడు కాల్చినా భయపడలేదు. రాత్రి రోడ్లమీదకి వచ్చిన అడవి జంతువులకీ భయపడలేదు”

రెప్ప కదలని కనుగుడ్డు అలాగే చూస్తోంది!

“నాలుగ్గంటల్లో లాక్ డౌన్ పెట్టేశారు. ఉన్న పళంగా పెళ్ళాం బిడ్డలతో రోడ్డున పడ్డ మాకు గెంజి పోసే దిక్కు కూడా కనిపించలేదు”

తెగిన పొట్ట పైకీ కిందికీ యెగసి పడుతోంది!

“మీరు పని చేసే కంపెనీలు?”

“పని చేస్తేనే కూలీ. వారం పది చూశాయి. పని లేకుండా పెంచి పోషించడానికి అమ్మానాయినా కాదు కదా?”

ఒక్క క్షణం నిశ్శబ్దం!

“వాటరు ట్యాంకుల్లో పెట్రోలు ట్యాంకుల్లో వూపిరాడని ప్రయాణాలు ప్రమాదం కాదా?”

“ప్రమాదాల్ని తప్పించుకోవడానికి ప్రమాదాల్నే ఆశ్రయించక తప్పదు!”

మళ్ళీ అదే నిశ్శబ్దం!

“ప్రభుత్వం ట్రాన్సుపోర్ట్ యేర్పాటు యెందుకు చెయ్యలేదు?”

ప్రశ్న యిటు తిరిగింది!

“రైళ్ళు వేశాం!”

గొణుగుడు!

“ఎప్పుడు? నలభై రెండు రోజుల తర్వాతా?”

స్పష్టత!

“మేం అంత వరకూ బతకాలి కదా?”

కంఠనాళం లోంచి జారుతున్న నెత్తుటి చుక్క అలాగే గడ్డకట్టింది!

“రైల్వే శాఖ నూటాయాభై వొక్క కోట్లు విరాళం యిచ్చింది”

“ఔను, వలస కూలీలకు టికెట్ కూడా పెట్టింది”

నవ్వులు!

“తరువాత టికెట్ తీసేశాం”

“అంతా తిడితే, అయినా అంతా అయి పోయాక- పెళ్ళయి పోయాక- బాజా బజంత్రీలు వాయిస్తే యెందుకు?”

సైలెన్స్… సైలెన్స్!

“ఆగి రైలెక్కి వెళ్ళాల్సింది!”

“మేం బయల్దేరేటప్పటికి ఐదు రోజుల ముందే యిరవై లక్షలమంది పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. మా వంతు వచ్చేసరికి మేం ఆకలితో చచ్చిపోతాం. ప్రాణం వుండగానే- అదీ కొట్లాడితేనే పంపించని వాళ్ళు మా ప్రాణాలు పోయాక మా శవాల్ని మా వూళ్ళకు పంపిస్తారని మాకు నమ్మకం లేదు!”

“పరిస్థితి నిదానించాక…”

నసుగుడు!

“నన్ను కాదనుకున్న నగరంలో నేను చావడానికి కూడా సిద్ధంగా లేను!”

ఘంటాపథం!

“మేం మా వూళ్ళకు పోతామంటే- యిక్కడ మళ్ళీ ప్రారంభించాలనుకున్న నిర్మాణరంగం పనులు ఆగిపోతాయని వేసిన రైళ్ళు రద్దు చేసింది కర్నాటక ప్రభుత్వం. అదీ రెండ్రోజుల క్రితమే!”

సైలెన్స్… సైలెన్స్!

“వలస కూలీలకు ఆహారం, వసతి, అవసరాలు చూశారా?”

మానవహక్కుల కమిషన్ నివేదిక మాత్రమే కోరగలిగింది!

“మాదో కోరిక?”

“చెప్పండి… ప్రభుత్వం మీ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్సుగ్రేషియా ప్రకటించింది!”

“మేం కుటుంబాలకు కుటుంబాలే చనిపోయాం”

రెండు క్షణాల నిశ్శబ్దం!

కొట్టుకుంటున్న గుండె గొంతుకని సవరించుకుంది!

“మేం వలస కూలీలమే, కాని మేం భారతీయులం అవునో కాదో తమరు ముందు తేల్చాలి!”

తెగిన తలలన్నిటిదీ వొకే మాట!

“ఎందుకా అనుమానం?”

“అరవైనాలుగు విమానాల్లో దేశ దేశాల్లో వున్న వాళ్ళని వుచితంగా రప్పిస్తారు, దేశంలో వున్న మమ్మల్ని మాత్రం గాలికి వదిలేస్తారా? మేం యీ దేశ పౌరులం కాదా? ప్రజలు అందరూ సమానం కాదా?”

చూపుడు వేలు చూపించాల్సిన వాళ్ళ వేపే చూపిస్తోంది!

“వందే మాతరం- అంటే ‘వందే భారత్’ కుట్రే కనిపిస్తుంది మాకు”

“దేశంలో వున్న విదేశీయుల్ని వాళ్ళ వాళ్ళ దేశాలకు వుచితంగా పంపించేంత ప్రేమ వున్న మీ కళ్ళకు మేం యెందుకు కనిపించలేదు?”

అన్ని చూపుడు వేళ్ళూ చూపించాల్సిన వాళ్ళ వేపే చూపిస్తున్నాయి!

“వలస కార్మికులు స్వస్థలాలకు నడిచి వెళ్ళకుండా ఆపడం యెవరికీ సాధ్యం కాదు!”

సుప్రీం కోర్టు వ్యాఖ్యానం!

“మీరయినా అర్థం చేసుకున్నారు!”

తెగిన తల వొకటి ఆశగా చూసింది!

“నడిచి వెళ్ళేవాళ్ళని యెవరు మాత్రం ఆపగలరు? ఎలా వారికి నచ్చజెప్పగలరు? వాళ్ళను రైలు పట్టాలపై పడుకోకుండా యెలా ఆపగలం?”

తెగిన తలలు వొకదాన్ని వొకటి చూసుకున్నాయి!

“వలస కార్మికులకు పునరావాసం, వుచిత రవాణా కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేం”

రాలిన తలలు నేలకేసి కొట్టుకున్నాయి!

విచారణ ముగిసింది!

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

2 thoughts on “విచా‘రణము’

  1. చాలా బాగా వ్రాసారు వాస్తవాలను చక్కగా వివరించారు

  2. వాస్తవ కథనం బాగుంది….వై మోహన్

Leave a Reply