పీడిత ప్రజల బతుకుల్లోని ఆవేదనను, అడవిలోని ఆకు పచ్చదనాన్ని తన పాటలో నింపుకుని ఉద్యమ చైతన్యంతో ఉద్వేగభరిత గీతాలను ఎలుగెత్తి పాడిన ప్రజా వాగ్గేయకారుడు జయరాజు. జీవితంలోని ఆటుపోట్లను పాటగా మలచుకుని పోరాట స్ఫూర్తిని వెదజల్లిన ధిక్కారకవి. కళ్ళముందు జరుగుతున్న అన్యాయాల్ని, ఆధిపత్యాల్ని ప్రశ్నించిన గొంతుక అడవిలో ఆయుధమై సంచరించింది. పేదరికం, అంటరానితనం, నిరుద్యోగం, అవమానాలు చుట్టుముట్టినా అలసిపోకుండా పోరాడిన కవియోధుడు జయరాజు. పూర్వ వరంగల్ జిల్లా మహబూబాబాద్ సమీపంలో గల గుముదూర్ గ్రామంలో కిష్టయ్య చెన్నమ్మలకు జన్మించాడు ఈ కవి. బాల్యం నుండే ప్రకృతి పాఠశాలలో పాటల అల్లికను నేర్చుకున్నాడు. తండ్రిలా దొర దగ్గర జీతగాడిగా మారిపోకుండా భూస్వామ్య వ్యవస్థపై, దొరల పెత్తందారీతనంపై తిరుగుబాటు జెండాను ఎగరవేసి జననేతగా మారాడు. విప్లవోద్యమాలకు తన స్వరాన్ని అంకితం చేస్తూ ‘బతుకుమీద ఆశలుంటే తమ్ముడా… బందూకును ఎత్తలేవురా తమ్ముడా’ అంటూ త్యాగాల బాటలో నడుస్తున్న అన్నలకు మార్చ్ ఫాస్ట్ గీతంగా నిలబడ్డాడు.
అడవినుంచి తన కార్యక్షేత్రాన్ని మైదాన ప్రాంతంలోకి మార్చుకున్నాక జయరాజ్ తన పోరాట పంథాను మరింత శక్తివంతంగా రూపొందించుకున్నాడు. సింగరేణిలో ఉద్యోగిగా నెల జీతమే ప్రధానంగా కాకుండా శ్రమ దోపిడికి గురవుతున్న తోటి కార్మికులకు కొండంత అండగా కార్మిక నాయకుడిగా ఎదిగాడు. చాలీచాలని వేతనాలతో అవిశ్రాంతంగా పనిచేస్తున్న కార్మికుల న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేసాడు. సమ్మెలు, నిరసనలు, ధర్నాలతో శ్రమజీవులకు వెన్నుదన్నుగా మారాడు. అధికారులు, పోలీసుల లాఠీ దెబ్బలకు, దొంగ కేసులకు భయపడలేదు. జైలు జీవితం గడిపినా తన ప్రతిఘటనా పథాన్ని వీడలేదు. పాటనూ మరవలేదు. ఉద్యమకారులు ఎన్ కౌంటర్ లో బలయినా వెరవకుండా బూటకపు కాల్పుల భాగోతాలపై పాటను అల్లి అమరవీరుల త్యాగాలను గానం చేసాడు. ‘‘ పాటే నా ప్రాణము/ పాటే నా జీవితం / ప్రకృతిచ్చినా వరం’’ అంటూ పాటలో దాగిన శక్తిని సమాజానికి పంచాడు. పచ్చని పకృతిలో దాగిన మౌలిక రహస్యాల్ని పసిగట్టాడు. ఆకాశం నుంచి కురిసే వానలో దాగిన సామాజిక ప్రయోజనాల్ని స్ఫురిoపజేస్తూ , వర్తమాన బీభత్స పరిణామాల్ని వర్ణిస్తూ ఒక అభ్యర్థనా గీతాన్ని రచించాడు. అదే “వానమ్మ వానమ్మ వానమ్మో…” అనే గీతం. తెలంగాణ నేలలో నెలకొన్న వర్షాభావ స్థితిని, వ్యవసాయదారుల జీవితాల్లోని కరువు సంక్షోభాన్ని వానతో మడివేసి చెప్పినతీరుతో ఈ పాట అత్యంత ప్రజాదరణ పొందింది.
‘‘వానమ్మా వానమ్మా వానమ్మో
ఒక్కసారన్నా ఒచ్చిపోవే వానమ్మా
చేలల్లో నీళ్లు లేవు
చెలకల్లో నీళ్లు లేవు
వాగుల్లో నీళ్లు లేవు
వంపుల్లో నీళ్లులేవు
నిన్నే నమ్మిన రైతు
కళ్ళల్లో నీళ్లు లేవు’’
జయరాజు ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించి మైమరిచిపోయేలా గానంచేస్తూ స్వప్న వీధుల్లో సంచారం చేసే రొమాంటిక్ కవి కాడు. అడవిలో తిరగినప్పుడు కూడా చదువుకు దూరమైన ఆదివాసుల జీవితాల్లో అక్షరదీపాన్ని వెలిగించాలనే ప్రయత్నం చేసిన వాస్తవిక వాది. మనిషికి ప్రాణాధారం నీరు. దేహానికి జీవశక్తిని ఇచ్చే ఇంధనం నీరే. అటువంటి నీరు రైతుకు జీవనాధారం. దేశ ప్రగతిలో నీళ్ళది ప్రధాన భాగస్వామ్యం. వ్యవసాయ ఆధారిత దేశంలో సాగునీరు కోసం చాలా ప్రాంతాలు వానలకోసం ఎదురుచూడవలసిందే. సరైన సమయంలో వర్షం పడకపోతే రైతు కష్టాల పాలవుతాడు. పంటపొలం ఎడారిగా మారిపోతుంది. ఎటూచూసినా నీళ్ళు దొరకని పరిస్థితి, చేను, చెలకలు, వాగులు, వంకలు ఎండిపోయాయి. వానకోసం ఎదురుచూసీ చూసీ కన్నీళ్ళు కార్చిన రైతు కళ్లలో నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఎంత ఏడ్చినా నీళ్లు రాని భయంకర విషాదస్థితిని మనసు కదిలిపోయేలా వ్యక్తీకరించాడు.
‘‘ఎదిగేటి మిరపచేను
ఎండల్లొ ఎండిపోయే
సక్కాని మొక్కజొన్న
ఎక్కెక్కి ఏడ్వసాగె
పాలుపోసుకున్న కంకి
పాలన్ని ఉడిగిపాయె
నిలు పోసుకున్న చేను
నీళ్ళాడలేకపాయె’’
వానలు కురవకపోవడం వల్ల రైతు ప్రాణం ఎలా విలవిల్లాడిపోతుందో పొలంలోని మొక్కలు, మొలకలు కూడా అంతగా దుఃఖిస్తాయని వర్ణిస్తున్నాడు కవి. రైతు తన పొలంలో విత్తనం వేసి సాగుచేసి ఏపుగా ఎదిగేలా ఎరువువేసి సంరక్షిస్తుంటాడు. అవి ఎటువంటి చీడపీడలు లేకుండా బలంగా, ఏపుగా పెరుగుతుంటే ఒక తండ్రిలా సంబరపడిపోతుంటాడు. అంతగా వాటితో అనుబంధా న్నీ పెంచుకుంటాడు. ప్రయోజకులైన పిల్లల్ని చూసినంత ఆనందం రైతు గుండెల్లో పరవళ్ళు తొక్కుతుంటుంది. కాని ప్రకృతి కరుణించకపోతే అంతా క్షామమే. సకాలానికి వర్షం కురవక, నీరందక పంటలు ఎండిపోయే దుస్థితి వస్తుంది. ఎదిగిన పంట మొల్కను ఒక ప్రాణిగా దర్శిస్తున్నాడు కవి. ఎండలో ఎండిపోయె మిరప మొలక, సరిగ్గా గింజలు రాని మొక్కజొన్న, ఒట్టిపోయిన పాల కంకులకు మానవారోపణ చేస్తూ వాటి వేదనను కవిత్వీకరించాడు. నిండు గర్భిణి ప్రసవ వేదనతో మరణిస్తే ఎంత దుఃఖం కలుగుతుందో రైతు ధాన్యాగారం చేరుకొని పంటచేను కూడా అంతగా విలపిస్తుందని కవిత్వీకరించాడు. వానలు కురవకపోవడం వలన మొక్కలు పంట చేలు కూడా ఎంతగా బాధపడుతాయో శక్తివంతమైన ప్రతీకలతో దృశ్యీకరించాడు కవి.
‘‘కొంగున నీళ్ళు తెచ్చే
నింగిలో మబ్బులేవి
చెంగు చెంగున ఎగిరే
చెరువుల్లో చేపలేవి
తెల్లాని కొంగబావ
కళ్ళల్లో ఊపిరేది’’
గగన సుందరి మబ్బుల కొంగులతో సింగారించుకుంటుంది. గాలికి కదలాడుతూ నీళ్ళు నింపుకుని భూమ్మీద కుండపోత వానగా కుమ్మరిస్తుంది. మబ్బుల కమ్మిన ఆకాశాన్ని చూస్తే రైతు కడుపు నిండుతుంది. అటువంటి తాత్కాలిక ఆనందమైన రైతుకు దక్కడం లేదు. మేఘాలు ముసురుకోవడమే లేదు. ఇక చెరువులో నీరు. ఎక్కడిది. అందులో చెంగుచెంగున ఎగిరే చేప పిల్లల జాడ ఎక్కడుంటుంది. ఆ చెరువులో ఒంటికాలిపై దొంగజపం చేస్తూ ఓరకంటితో చేపలను ముక్కున కరచుకుని కడుపు నిoపుకునే కొంగకూ ఆకలి బాధలు తప్పలేదు. చురుగ్గా కదిలే కొంగలోను ఊపిరి క్షీణిస్తుంది. వానలు కురవకపోవడంతో మానవాళే కాదు సమస్త ప్రాణులు కూడా ప్రాణాపాయ స్థితికి చేరుకుంటాయనే ప్రమాదాన్ని సూచిస్తున్నాడు కవి.
‘‘నల్లాని గౌడి బర్రె
తెల్లాని ఎల్లానావు
సైదన్న మేకపోతు
సక్కాని లేగదూడ
క రువింట్లే పీనుగెల్ల
కటికోని కమ్ముకునురి’’
వర్షాభావం వల్ల రైతు అనేక విధాలుగా నష్టపోతాడు. రైతు దుఃఖ తీవ్రత అన్నిరంగాలను ప్రభావితం చేస్తుంది. రైతు తన కుటుంబం పొట్ట నింపడానికి అన్నీ అమ్ముకునే ప్రయత్నం చేస్తాడు. వ్యవసాయ పనుల్లో మనిషికంటె ఎక్కువ గా కష్టించే ఆవులను, బర్రెలను పాలిచ్చే పాడియావు, ఇంట్లో పిల్లలుగా చూసుకునే లేగదూడలను, మేకలను సంతలో అమ్మకోవాల్సి వస్తుంది. ఎవరూ కొనకపోతే కబేళాలకు అమ్ముకునే అగత్యం ఏర్పడుతుంది. రైతు కూలీగా మారిపోతాడు. నిలువ నీడకూడ కోల్పోతాడు. ఉన్నవూరిలో పని దొరకక వలస వెళ్లిపోతాడు. ఒక్క వాన చుట్టూ అలముకున్న జీవన సౌందర్యాన్ని, సంక్షోభ విలయాల్ని ఏకకాలంలో కళ్లముందు కదలాడేటట్లుగా చిత్రీకరించాడు జయరాజు. ‘కరువింట్లే పీనుగెల్ల’ అనే మాటలో కరువుచేసే ప్రళయగాఢత అభివ్యక్తమైంది. పాటలో పునరుక్తికి, అంత్యప్రాసకున్న శక్తిని మరోమారు నిర్దారించిన పాటగా పేర్కొనవచ్చు.
‘‘కర్రు నడవకపాయె
గొర్రు నడవాక పాయె
తాళిపుస్తెలు పాయె
తట్టిచెంబూలు పాయె
నెర్రెబారిన బతుకు
హర్రాజు పాలాయె’’
రైతు ఆర్థిక సంక్షోభానికి, దారిద్య్రానికి పతాకస్థాయి వ్యక్తీకరణ పై పాదాలు. రైతు పశువులను, పనిముట్లను అమ్ముకున్నాక ఏం మిగులుతుంది. భార్యమెడలోని తాళి, మెట్టలు చివరి ముద్దగా ఆదుకుంటాయి. ఇంట్లోని చిన్నాచితక సామాన్లు కుదువపడ్తాయి. చివరకు ఏమీ మిగలని స్థితిలో బతుకులు వేలంపాటగా మారుతాయి. రైతు బ్రతుకు వెట్టిచాకిరి చేయడానికి ఎవరోఒకరికి బానిసగా వెళ్లవలసిన దుర్భర స్థితికి దిగజారుతుంది. దేశానికి అన్నదాతైన రైతు అన్నం మెతుకు కోసం యాచిస్తున్నాడు. దేశానికి వెన్నెముకైన రైతు అస్థిపంజరమై రోదిస్తున్నాడు. కురవని వానచుట్టూ కవి కన్నీటి వర్షాన్ని కురిపిస్తూ రైతు ఆవేదనను అద్భుతంగా అభివర్ణించాడు.
ఈ పాట ఒక్క తెలంగాణ ప్రాంతానికి పరిమితమైంది కాదు. వానకోసం ఎదురుచూసే ప్రతిమనిషికి, ప్రతి నేలకు పేగుబంధమైన పాట ఇది. ‘వానలు కురవాలి’ అని కప్పల పెళ్ళిళ్ళు, యజ్ఞ యాగాదులు చేయటం కంటేకూడా ఈ కవి చేసిన కవితాత్మక ప్రార్థన ఎంతో విలువైంది. రైతు కష్టం, నీటి విలువను తెలుపుతూ, శాస్త్రీయంగా ఆలోచింపజేస్తుంది ఈ గీతం. ఇటువంటి ప్రకృతి విపత్తులను, సామాజిక సంక్షోభాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే ముందస్తు జాగ్రత్తలకు పురికొల్పుతుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడమెలా అనే స్పృహను కల్గిస్తుంది. కరువు పరిస్థితుల ఉత్పన్నమైనప్పుడు సాటి మనిషిని ఎలా ఆదుకోవాలనే మానవీయ భావనలను ఆర్థ్రంగా తెలియజేస్తుంది. వానల కోసం నిరీక్షీస్తున్న రైతు హృదయానికి నేపథ్య గీతం ఈ పాట. ప్రాకృతిక పరిణామాలను కవిత్వీకరించడంలో దిక్సూచిలాంటి పాట ఇది. ‘వేమన పద్యం చదవనివాడు ఈ వాన పాటలో తడవనివాడు’ లేడన్నoతగా ప్రజల హృదయాలలో ప్రతిధ్వనించిన పాట ఈ “వానమ్మ వానమ్మ వానమ్మో”.
(పూర్తి పాట)
వానమ్మా వానమ్మా వనమ్మో
వానమ్మా వానమ్మా వనమ్మో
ఒక్కసారన్నా ఒచ్చిపోవే వానమ్మా || వానమ్మా ||
చేలల్లో నీళ్లులేవు
చెలకల్లో నీళ్లులేవు
వాగుల్లో నీళ్లులేవు
వంపుల్లో నీళ్లులేవు
నిన్నే నమ్మిన రైతు
కళ్లల్లో నీళ్లులేవు || వానమ్మా ||
ఎదిగేటి మిరపచేను
ఎండల్లొ ఎండిపోయే
సక్కాని మొక్కజొన్న
ఎక్కెక్కి ఏడ్వసాగె
పాలుపోసుకున్న కంకి
పాలన్ని ఉడిగిపాయె
నీలు పోసుకున్న చేను
నీళ్లాడలేకపాయె || వానమ్మా ||
కొంగున నీళ్ళుతెచ్చే
నింగిలో మబ్బులేవి
చెంగు చెంగున ఎగిరే
చెరువుల్లొ చేపలేవి
తెల్లాని కొంగబావ
కళ్లల్లో ఊపిరేది || వానమ్మా ||
నల్లాని గౌడి బర్రె
తెల్లాని ఎల్లానావు
సైదన్న మేకపోతు
సక్కాని లేగదూడ
కరువింట్లే పీనుగెల్ల
కటికోని కమ్ముకునురి || వానమ్మా ||
కర్రు నడవకపాయె
గొర్రు నడవాక పాయె
తాళిపుస్తెలు పాయె
తట్టిచెంబూలు పాయె
నెర్రెబారిన బతుకు
హర్రాజు పాలాయె || వానమ్మా ||
జయ రాజు గారి పాట జీవితం పరిచయం ఇప్పుడు అవసర ము
గతితార్కిక భౌతికవాదాన్ని తనువెల్లా నింపుకొని, అణువణువూ శోధించి ప్రకృతి రహస్యాల్ని ఒడిసిపట్టుకున్న పర్యావరణ ప్రేమికుడు,పీడిత తాడిత వర్గాల శ్రమదోపిడిని ఎదిరించేందుకు పాటను ఆయుధంగా చేసుకున్న ప్రజావాగ్గేయకారుడు జయరాజు గారు. వానకోసం ఏడ్చి ఏడ్చి ఉన్నకాసిన్ని కన్నీళ్లు కూడా పోగుట్టుకున్న రైతుల దీనావస్తను, రెక్కలు ముక్కలైనా పిడికెడు మెతుకులు దొరకని కార్మికుల దుస్థితిని, ప్రకృతి సంపదను కొల్లగొట్టి అడవితల్లి బిడ్డలకు కూడు గూడులేకుండా చేసిన దోపిడివర్గాలపై ధిక్కారస్వరాన్ని వినిపిస్తూ శ్రామికగీతాల్ని ఎలుగెత్తిపాడిన గొప్పకవి. మీరు చెప్పినట్లుగా వేమన పద్యాలు విననివారు, వానమ్మ పాటలో తడవనివారు తెలుగునేలపై ఉండరన్నది అక్షరసత్యం. జనాణ్యాలను ముంచెత్తిన వానమ్మ వానమ్మ వానమ్మో పాటకు తనదైన శైలిలో అద్భుతమైన విశ్లేషణ చేసి మా అందరి హృదయాలను మరొక్కసారి వానలో తడిపినందుకు డా.ఎస్.రఘుగారికి ధన్యవాదాలు మరియు అభినందనలు.🌷🙏🌷