సింగపూర్ వలస కార్మికుల కవిత్వం

పొట్ట చేతపట్టుకుని కూలికోసం వచ్చినవాళ్లుగా తప్ప వలస కార్మికుల్ని కవులుగా, రచయితలుగా ఎవరు చూస్తారు? తమలో తాము, తమకోసం తాము తమ కలలలో, కన్నీళ్ళలో వాళ్ళు సృష్టించుకున్న ప్రపంచాన్ని దగ్గరనుంచి ఎవరు చూసారు? వాళ్ళు కట్టిన భవనాలు వాళ్ళ జాడలనే తుడిచివేస్తాయి. మెరిసే అద్దాలలో కనిపించని ప్రతిబింబాలు వాళ్ళు. వాళ్ళు అద్దిన రంగులు వాళ్ళ నీడలనే మాయం చేస్తాయి…

సింగపూర్ నగరంలో మొదటిసారి అక్కడి వలస కార్మికుల కవిత్వ పోటీని 2014లో నిర్వహించారు. బంగ్లాదేశ్, ఇండియా, ఇండోనేసియా, మ్యాన్మార్, ఫిలిప్పీన్స్, చైనా దేశాల నుంచి వచ్చి వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికుల కవిత్వ పోటీని ఆ తరవాత వరుసగా ప్రతీ ఏటా నిర్వహిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ కవిత్వంలోకి తొంగి చూద్దామా…

కార్మికుడు
– శ్రామిక్ మునీర్

అద్భుత నాగరికత సృష్టికర్తవి నువ్వు
అందమైన కట్టడాల ఇటుకరాళ్ళపైన
నీ చెమటచుక్కల జాడల్ని తుడిచేస్తారు

పొరలు పొరలుగా పరిచిన తడి సిమెంటుపైన
రంగులు అద్దుతారు
పక్షి గూళ్ళ వలె నువ్వు అందంగా నిర్మించిన నగరాల మీద
నీ నీడ కూడా కనిపించదు

ఇదొక సంతోషపు సామ్రాజ్యం
ప్రేమన్నది కనిపించని దట్టమైన అడవిలో
నీకు వారసత్వంగా అందివచ్చిన ఆకలితో నువ్వు సహజీవనం చేస్తుంటావు

ఎవరికీ తెలియదు
నువ్వు కూడా ప్రేమించావని
కలలలో కలలు వుంటాయని

చెమట కంపు కమ్ముకున్న నీ దేహంపైన
వెన్నెల రాత్రి
హృదయ గంధాన్ని చిలకరిస్తుంది

భూమిని అలంకరించిన సృష్టికర్తవు నువ్వు
ఏదో ఒకరోజు నువ్వూ శాశ్వత నిద్రలోకి జారుకుంటావు

బహుశా, నువ్వు ఒక చెరువు గట్టున
అనాధ శవంగా మారిపోతావేమో, అమీనుల్ మాదిరిగా

వలస కూలీవైన నేరానికి
పుట్టిన చోట మట్టిలో కలవని
మృతదేహానివై పోతావేమో, రుహుల్ అమీన్ లాగా

రాణా ప్లాజా కంకరలో కలిసిపోతావేమో
తజ్రీన్ మంటలలో కాలి బూడిదైపోతావేమో
భూమిమీద నీ జాడ కూడా లేకుండా మాయమై పోతావేమో

నీ చెమటనీ, నెత్తురునీ పట్టించుకోని ప్రపంచం
ఇంద్రధనస్సు రంగులలో మెరిసిపోతుంది

నీకొక సమాధి కూడా లేని భూమి మీద
స్వర్గంలో మనిషి జ్ఞాపకాల పుటలలో
నువ్వొక చరిత్రవి, ఎవరూ చదవబోని చరిత్రవి

(బంగ్లాదేశ్ లోని షరియత్పూర్ లో పుట్టిన శ్రామిక మునీర్ 2010 లో సింగపూర్ వచ్చాడు. నిర్మాణ రంగంలో పనిచేస్తాడు. శ్రామిక పేరుతో కవిత్వం రాస్తూ ఉంటాడు. పనికి ప్రయాణం చేసే సమయంలోనూ, కాఫీ విరామ సమయంలోనూ కవిత్వాన్ని రాస్తూ ఉంటాడు. నజ్రుల్ ఇస్లాం, సుకాంతో తన అభిమానం కవులు. ‘కార్మికుడు’ అన్న కవిత 2015 లో రాసింది. ఈ కవితలో ప్రస్తావించిన వివిధ సంఘటనలు బంగ్లాదేశ్ కార్మికుల జీవితంతో ముడిపడినవి. అమీనుల్ ఇస్లాం, బంగ్లాదేశ్ లో దుస్తుల తయారీ కార్మికుల్ని సంఘటిత పరిచిన నాయకుడు, 2012 లో హత్య కి గురయ్యాడు. రుహుల్ అమీన్ బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాట నాయకుడు. 1971 స్యాతంత్య్ర పోరాట నేపథ్యంలోపాకిస్తాన్ సైనికులు తనని హత్య చేశారు. రాణా ప్లాజా భవంతి 2013 లో కూలిపోయింది. తజ్రీన్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ 2012 లో తగలబడిపోయింది.
బెంగాలీ నుంచి ఇంగ్లీష్ అనువాదం – గోపిక జడేజా, దేవబ్రత దాస్. సౌరదీప్ భట్టాచార్య సహకారం.)

అసహజ మరణం
– రిపన్ చౌదరి

కవిత్వం రాయాలని నేను రోజంతా దిగులు పడతాను
పదాలు అలా, అలా వచ్చి,పోతూ ఉంటాయి
నా చేతిలో కలం, కాగితాలు లేవు కదా
ఉన్నవల్లా సుత్తి, గునపం, పారా, తట్టా
వీటితో పని చేయవచ్చునేమో, కానీ కవిత్వం మాత్రం రాయలేను

కవిత్వంలో రాసే మాటలు నేను చెప్పినప్పుడే వచ్చి పోయేవి కావు
వాటికిష్టం వచ్చినపుడే అవి వచ్చిపోతాయి
నాకు గొంతెత్తి అరవాలనిపిస్తుంది
ఇది నేను కవిత్వానికి కేటాయించిన సమయం కాదని
కడుపు నింపుకోవడానికి నన్ను నేను అమ్ముకున్న కాలం ఇదని

నేను జీవితంలో ఆఖరు అధ్యాయానికి చేరుకున్నాను
నాకిప్పుడు బతుకు కన్నెర్రజేస్తే భయమనిపించదు
ఎగుడుదిగుళ్ళన్నిటినీ చూసేసాను
ఈ జీవితంలో ఇంకా ఏమీ చూడాలనుకోవడం లేదు

నేను చావు తృటిలో తప్పిపోవడం చూశాను
పనిచేసే చోట ప్రమాదంలో అవిటివాళ్ళయి పోవడం చూశాను
నా చావుని తప్ప నేను అన్నీ చూసేశాను

ఇప్పుడిది నేను జీవితాన్ని చూడాల్సిన సమయం
ప్రియురాలి అందమైన ముఖాన్ని చూడాలి
పిల్లలు పెరిగి పెద్దవడాన్ని చూడాలి
నిండు పున్నమి రాత్రిలో పండు వెన్నెల్ని చూడాలి
కవిత్వం అకాల మృత్యువు వాత పడకుండా చూడాలి

(రిపన్ చౌదరి పుట్టి పెరిగింది బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ ప్రాంతంలో. పదేళ్లుగా సింగపూర్ లోని షిప్ యార్డ్ లో పనిచేస్తున్నాడు. ఈ కవిత 2018 లో రాసింది)

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

Leave a Reply