కరోనా భీభత్సాన్ని రికార్డు చేసిన నవల “లోపలి విధ్వంసం”

కరోనా ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేసి వదిలింది. ప్రపంచ ఆర్ధిక వ్యవ్యస్థ, ప్రజల జీవన విధానాన్ని ఈ ఉపద్రవం ఎంతలా ప్రభావితం చేసిందంటే ఆ విధ్వంసం నుండి మానవాళి కోలుకోవడానికి సుమారు రెండు దశాబ్దాలు పట్టవచ్చు. మనం బ్రతకడానికి ఏర్పరుచుకున్న విలువలు, ప్రమాణాలు అన్నీ కరోనా దెబ్బతో చిన్నాభిన్నం అయిపోయాయి. మనిషికి మనిషికి మధ్య శారీరిక దూరంతో పాటు మానసిక దూరమూ పెరిగిపోయింది. కరోనా మానవ సంబంధాలన్ని ఎంతగా నష్టపరిచిందో వివరంగా ఈ నవలలో చూపించారు సలీం. “లోపలి విధ్వంసం” ప్రజల లాక్ డౌన్ కష్టాలతో పాటు వారి మనసుల్లో జరిగిన విధ్వంసాన్ని చర్చిస్తూ, దాని నుండి కోలుకోవడం ఈ తరానికి ఎంత కష్టమో వివరిస్తుంది. సలీం గారు సాధారణంగా ఓ విషయాన్ని ఎన్నుకుని తన నవలకు కావలసిన సమాచారాన్ని పూర్తిగా రీసర్చ్ చేసి కథలో అవసరమైనంత మేర ఆ సమాచారాన్ని ఇస్తూ వెళతారు. అందుకే వీరి నవలలో కేవలం కథే కాదు వారు ఎన్నుకున్న విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. ఆదివాసీల మీద, దూదేకు ముస్లిం మహిళల మీద, ఎయిడ్స్ మీద, పులుల మీద, యుతనేషియా మీదా ఇలా ఒకో విషయానికి వీరు చేసే రీసెర్చ్ పాఠకులకు ఎంతో సమాచారాన్ని ఇస్తుంది. ఇలా ఓ విషయం పై సుదీర్ఘ రీసెర్చ్ చేసి పాఠకులకు ఓ కథ రూపంలో వివరించే రచయితలు ప్రస్తుతం తెలుగులో చాలా తక్కువ.

ఇక వీరికి ఒంగోలు ప్రాంతంపై ఉన్న ప్రేమను గమనిస్తే మాత్రం ముచ్చటేస్తుంది. తాము పుట్టి పెరిగిన ఊరుని తమ జీవితంలో ఓ భాగంలా ఎక్కడ ఉన్నా సరే దాన్ని తమ మనసులో నిలుపుకునే తరం బహుశా ఇదేనేమో. ఇప్పటి నవ తరంలో ఆ మమకారాలు ఎంతైనా చాలా తక్కువ. “లోపలి విధ్వంసం” నవలలో ఒంగోలు పట్టణం ప్రస్తుత రూపు రేఖలు పూర్తిగా కనిపిస్తాయి.

కరోనా సమయంలో అత్యవసరంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడింది వలస కూలీలు. ఒక ఊరి నుండి మరో ఊరికి, ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి నడుచుకుంటూ కుటుంబాలతో వందల మైళ్లు ప్రయాణించి వెళ్ళడం తలచుకుంటేనే ఒళ్లు గగ్గోర్పడుతుంది. ఈ కథలో రాములు అతని కుటుంబం హైదరాబాద్ లో ఓ ఇల్లు కట్టే దగ్గర పనికి కుదురుతారు. కాని లాక్ డౌన్ కారణంగా పనులు లేక, ఇక తప్పక తమ ఊరికి కాలి నడకన బయలుదేరుతారు. ఈ క్రమంలో వడ దెబ్బ తగిలి వారి పాప చనిపోతుంది. దారిలో ఓ స్నేహితుని భార్యకు రోడ్డుపై పురుడు పోయవలసి వస్తుంది. జీపుల్లో మనుషుల్ని కుక్కి, పోలీసుల కళ్లు కప్పి వారిని తరలించే డ్రైవర్ల దాష్టికం, ఇతరుల అవసరాలను వ్యాపరంగా మార్చుకునే వ్యక్తుల నైజంతో పాటు తమతోటీ వ్యక్తుల కష్టాలలో ఓ చేయి వేసి వారికి సాయపడే కొందరి మంచితనాన్ని కూడా వీళ్లు అనుభవిస్తారు. ఇంత కష్టపడి చివరకు సొంత ఊరు చేరితే ఊరిలోకి రాకుండా వారి బైట ఓ గుడిసెలో క్వారంటైన్ లో ఉండమని చెబుతారు ఊరి వాళ్ళు.

నిత్య మురళీ భార్యా భర్తలు. మురళి తండ్రి ఇల్లిల్లు తిరిగి కూరగాయలు అమ్ముకుంటూ బిడ్డని పెంచుకుంటాడు. ముసలితనంలోనూ వ్యాపారం మానను అని మొండి పట్టు పట్టిన ఆ తండ్రి కోసం ఓ కిరాణా షాప్ పెట్టిస్తాడు మురళి. సొంత ఇల్లు కట్టుకుని తల్లి తండ్రులను తనతో తీసుకుని వెళ్లాలనుకుంటాడు మురళీ. అదే ప్రయత్నంలో ఉంటాడు కూడా. ఈలోగా తండ్రికి బైపాస్ చేయవలసి వస్తుంది. అందుకని ఒంగోలు వచ్చి లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోతాడు మురళి. అంత కష్టపడి బ్రతికించుకున్న తండ్రి కరోనాతో మరణించి అ కుటుంబానికి తీవ్రమైన విషాదాన్ని మిగులుస్తాడు.

మురళీ బాల్య స్నేహితుడు నశీర్. డిల్లీలోని నిజాముద్దీన్లో తబ్లిగీ జమాత్ కు వెళ్లి వస్తాడు. ముస్లింలపై ఆ తరువాత చూపిన వివక్ష, వేసిన నిందలు జరిగిన అక్రమాలు తట్టుకోలేకపోతాడు. సొంత బాబాయి చనిపోతే అతనిని మతాచారాల ప్రకారం ఖననం చేయడానికి ఎవరూ ఒప్పుకోరు. వీరి శ్మశానంలోకి శవాన్ని ఎవరూ రానివ్వరు. పోలీసుల సహాయంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు గుట్టల్లో బాబాయిని ఖననం చేయడం జరిగిన తరువాత నశీర్ లో విపరీతమైన ఆందోళన పెరిగుతుంది. స్నేహం కోసం ప్రాణమిచ్చే గుణం ఉన్న నశీర్ చివరకు మనుష్యులంటేనే భయపడుతూ, ఎక్కడ తనకూ కరోనా వస్తుందేమో అని మనిషిని చూస్తేనే పారిపోయే స్థితికి చేరుకుంటాడు.

ఇక ఒంటరిగా ఇంట్లో ఉండే నిత్యకు సాధారణ జ్వరం వస్తుండి. కాని అది కరోనా ఏమో అని ఆమె భయపడుతుంది. కాదని తెలిసిన తరువాత కూడా తనకు సహాయం చేయవచ్చిన ఆంటీ కౌసర్ బేగంతో ఆప్యాయంగా ఉండలేకపోతుంది. తనకు అన్ని సేవలు ఆమె చేస్తున్నా ఆమెను వదిలించుకోవాలనే చూస్తూ భయంతో అనుమానంతో ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఐదు రూపాయల డాక్టర్ అని పేరుపడిన ప్రేమ్ నారాయణ్ డాక్టర్ గా తనవంతు సేవలు అందించడానికి తన వయసును మరిచి, హాస్పిటలో తిరిగి జాయిన్ అవుతాడు. కరోనా వార్డులో జరుగుతున్న ట్రీట్మెంట్ నిజంగా పేషంట్లపై పని చేస్తుందా అనే విషయం పై వైద్యులెవరిలో కూడా స్పష్టత లేని పరిస్థితులలో తన వంతు సేవలు అందిస్తూ ఉంటాడు. అతను ఎన్నో ఏళ్ళ నుండి చూస్తున్న పేషంట్లు కళ్ళ ముందే చనిపోతూ ఉంటే నిస్సహాయిడై కన్నిరు కారుస్తాడు. పేషంట్లకు డాక్టర్ల పై నమ్మకం లేకపోవడం, తడిసి మోపెడవుతున్న బిల్లులకు భయపడి ఓ పేషెంటూ ఆత్మహత్య చేసుకోవడం, ప్రేమ్ నారయణ్ తో కలిసి పని చేస్తున్న నర్సు కూడా ఒంటరిగా కూతురు కోసం కలవరించి చనిపోతూ ఉండడం పాఠకులను కలిచివేసే సంఘటనలు.

ఈ నవలను రచయిత వూహన్ లాబ్ నుండి మొదలెడతారు. ఈ వైరస్ ఎలా లాబ్ నుండి బైటకు పొక్కింది అన్న ఆలోచన చేస్తున్న సైంటిస్ట్ చివరకు ఏ విషయం అంతు పట్టక నిస్సహాయంగా ఉండిపోతుంది. ఇక తరువాత ఈ వైరస్ ప్రపంచంలోకి పాకడం మొదలయి భారత్ లో లాక్ డౌన్ విధించడం నుండి ప్రధాన పాత్రలన్నీ పరిచయమవుతూ ఉంటాయి. కథతో పాటు చాలా విషయాలను రచయిత ప్రస్తావిస్తారు. శ్రీలంకలో కరోనా తో ఎవరు చనిపోయినా వారి మతాచారాలతో సంబంధం లేకుండా వారిని దహనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిస్తే ఆ దేశంలో క్రిస్తియన్లు ముస్లింలు సుప్రీం కోర్టుకు వెళ్ళినా వారి విన్నపాలు పట్టించుకోదు ప్రభుత్వం. మతాచారం ప్రకారం ఖననం చేయాలనుకుంటే ఆ శవాలను మాల్దీవులకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి మాల్దీవుల ప్రభుత్వం అనుమతి ఇస్తుంది కూడా. ఇలాంటి స్థితి ప్రపంచంలో వస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.

ఇక కరోనాకు జరుగుతున్న వైద్యం వెనుక డాక్టర్లలోనే ఏకాభిప్రాయంలేని పరిస్థితి గురించి కొంత చర్చ ఉంటుంది. 2014లో వచ్చిన ఎబోలా వైరస్ ని కట్టడి చేయడానికి తయారు చేసిన రెమిడిస్వార్ మందు కరోనాకు పని చేస్తుందని నిర్ణయించడం, కాని అది ఊహించినంతగా పని చెయకపోవడం, వెంటిలేటర్ అమర్చిన పేషంట్లలో మరణాల శాతం అధికంగా ఉండడం, దీనికి కారణం తెలియక పోవడం, ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. పీపీఈ సూట్లు వేసుకోవడానికి ఇరవై నిముషాలు పడితే, అవి తీసేయడానికి నలభై నిముషాల సమయం పడుతున్నా, వాటి క్రింద చమటలు కక్కుతూ ఏ. సీలు లేకుండా పని చెయవలసిన వైద్య సిబ్బండి కష్టాలు ఊహించడం కష్టం.

ముస్లింలపై జరిగిన ప్రచారాలు వాతావరణాన్ని ఇంకా కలుషితం చేశాయి. జమాత్ కు వెళ్లి వచ్చినవాళ్ల వలనే కరోనా వ్యాపించిందని కొందరు. వీళ్లు డాక్టర్లపై ఉమ్మేశారని మరి కొందరు, ఇలా ఎన్నో పుకార్లతో కరోనా జిహాద్ దిశగా ముస్లింలు పని చెస్తున్నారని వారిపై దాడులు జరగడం వలన ముస్లింలు చాలా మంది భయంతో జీవించవలసి వచ్చింది. ఇక అంతక్రియలకు బంధువులు, కుటుంబీకులే రావడానికి నిరాకరిస్తే, నలభై ఎనిమిది గంటల దాకా ఎవరూ రాకపోతే శవాలను మున్సిపల్ సిబ్బందికి అప్పగించవలసి రావడం, ఈ శవాల దహనం వెనుక జరిగిన వ్యాపారం, ఇవన్ని చదువుతుంటే ఎలాంటి విపత్తు మానవ సమాజం అనుభవించవలసి వచ్చిందో తెలుసుకుని భయం వేస్తుంది.

అయితే ఈ విపత్తు నుండి తప్పించుకున్న సమాజం ఆ గాయాలనుండి కోలుకోవడం మాత్రం అంత సులువు కాదు. కరోనా మనిషిని మానసికంగా దెబ్బతీసింది. మానవ సంబంధాలను కలుషితం చేసింది. స్వార్దంగా ఉండవలసిన అవసరాన్ని సృష్టించి మనిషికి మనిషికీ మద్య అపనమ్మకాన్ని పెంచింది. కరోనా దారుణాలను భరించినవారు తిరిగి మామూలు మనుషులుగా మారడం మాత్రం కష్టం. వారి మనసులపై ఆ గాయలు ఎప్పటికీ మిగిలిపోతాయి. పది సంవత్సరాల చిన్న పాప ఎండలోపడి వందల మైళ్లు నడవవలసి రావడం, ఆ పాప అర్ధాంతర మరణాన్ని చూసిన తల్లి కోలుకోవడం అంత సులువు కాదు. ఊరిలో గౌరవప్రదమైన డాక్టర్ చనిపోతే అతని శవ దహనాన్ని కూడా అడ్డుకున్న మనుషులను చూసిన తోటీ డాక్టర్లకు, పేషెంట్ల చేతుల్లో దెబ్బలు తిన్న డాక్టర్లకు అయిన గాయాలు అంత త్వరగా మానవు. బ్లాకులో మందులు కొనడానికి ఆస్తులు అమ్ముకున్న వారు, తల్లిని ఓ హాస్పిటల్ లో తండ్రిని మరో హాస్పిటల్ లో పెట్టి నరకం అనుభవించిన పిల్లలు, తమను పట్టించుకునే వాళ్లు లేక, అందరూ ఉండి అనాధలుగా జీవించిన వాళ్లు మళ్లీ మామూలు మనుషులయి ఇతరులను ఇంతకు ముందులా ప్రేమించడం, నమ్మడం సాధ్యపడే విషయాలేనా? ఈ నవల కరోనా విధ్వంసాన్ని రికార్డు చేయడంతో పాటు ఇలాంటి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది.

సలీం గారి శైలి సరళంగా ఉంటూ చదివించే గుణాన్ని కలిగి ఉంటుంది. అందువలన నవల చదవడంలో ఎక్కడా ఇబ్బంది అనిపించదు. చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్పడం వీరి నైజం. అలా అని ఏ విషయాన్ని కాంప్లికేట్ చేయకుండా వివరించడం వీరి ప్రత్యేకత. ఈ నవల కోసం ఎన్నుకున్న విషయంలో విషాదమున్నా, కరోనా భీభత్సాన్ని విపులంగా రికార్డు చేసిన నవలగా దీన్ని గుర్తుంచాలి.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

Leave a Reply