లంద స్నానం

మాటంటే మాటే. ఒక్కటేమాట. వాళ్లు బూమ్మీద నిలవడరు. మాటమీద నిలవడరు అని మాదిగలకు పేరు పోయింది. ముట్టుడు ముట్టుడు అని బీరప్ప కథకాన్నుంచి ఎల్లగొడితే కేసుపెట్టి మైబూబ్నగర్ కి మూడేండ్లు తింపి మున్నూటచెర్ల నీళ్లుతాగించిండ్రు. మండలాన్నే చూపుల్లో శాసించే పటేండ్లను మా వాడకట్టుకు ప్రచారానికి రాకుండ్రి. మీకు ఓట్లేయ్యమని బాజాప్త చెప్పి రాకుమని బాతవెట్టి బంజేసిండ్రు. ఒకప్పుడు మాడ్గులంటే ఊరంతా గజ్జుమను. సర్పంచ్ ఎన్నికలల్ల గడికి ఎదురుదిరిగి గౌడను సర్పంచ్ ను జేసిన కార్టం వాళ్లకే ఉన్నదని ఓటల్ల, మండువల మాటలు వినవడు. ఇది ఒకప్పటి మాట.

ఇపుడు మాత్రం ఎండకు ఎండి, వానకు తడిసిన దందెడ మీకుటం పట్టి ఒక్కొక్కపురి ఇచ్చుకపోయినట్లు విడిపోయిండ్రు. పచ్చగడ్డి ఎయ్యకముందే బగ్గుమంటదా అన్నట్లుంటుంది. ఈ వేరుబంధం ఎంతదూరం పోయిందంటే జలసూతుకాలు పాసింది.

కాలం గడిచిన కొద్దీ ఇది చాలామందికి నచ్చలేదు. లోలోపల కులం ఒక్కటవ్వాలనీ అందరికీ ఉంది. ఐదేండ్లు అయ్యేవరకు మనసులు మారినై. కలుద్దామని కాయిషుకొద్దీ ఉన్నరు.

సాయంకాలం పక్షులు గూటికి చేరుతున్న తీరున మధ్యాహ్నం పన్నెండు గంటలకు కమ్యూనిటీ హాల్ దగ్గరికీ ఒక్కొక్కరు వస్తుండ్రు. ఐదేండ్లకింద విడిపోవడం వలన కులం పల్సపడ్డది. బతుకవోయిన కొడుకు కోసం ఎదురు చూస్తున్న తల్లికి కొడుకు రాంగనే ఎంత సంతోషముంటుందో కొందరికీ అంతే సంతోషముంది. విడిపోవడం వలన విసిగినోల్లు మునుపటోలే కల్వాలని ముసలి ముతక కలలు కంటుండ్రు. నాకు అంతే సంతోషముంది.

కలుస్తున్న ముచ్చట తెల్వాలంటే విడిపోయిన విషయం తెల్వాలే. ఊరుకి దూరంగ‌ విసిరేయబడ్డట్లుండే మాది తూరుపులోగిల్ల మాదిగవాడ. కులం కట్టుబాట్లు, పాబందులు, పంచాదులు బాగ. తగవులు వస్తే కులంల మేమే తప్ష చేసుకుంటం. వినకపోతే ఆఖరి అస్త్రంగా కులం బంద్ పెడ్తరు. కులం బందంటే ఒకప్పుడు అగ్గి కూడా పుట్టకపోయేది. సమిష్టిపని దప్పులు కొట్టడం, సచ్చిన పశువుల తోలు వొలవడం. బొందపెట్టడంలాంటివి జరుగకపోయేవి. సచ్చినట్టు కులం పాబందికి ఒప్పుకునే వాళ్లు.

స్థానిక సంస్థల ఎన్నికలు రెండువేల పదమూడులో వచ్చిన‌యి. మాఊరిలో వార్డులు పది. ప్రతీసారీ రెండు వార్డులకు మాదిగల నాయకత్వమే. ఎప్పటిలాగే మావోల్లకు ఉపసర్పంచ్ కావాలనేది చిరకాలవాంఛ. ఇప్పటివరకు సర్పంచ్ పదవికి రిజర్వేషన్ రాలేదు. మా రెండు వార్డులు ఒకరకంగా ఎపుడే ఏకగ్రీవమనే చెప్పాలె. ఎట్లయినా ఈసారి ఉపసర్పంచ్ కావాలని ఏకగ్రీవమైన వార్డు మెంబర్లమీద కులం పెద్దమనుషులు తీర్మానం పెట్టిండ్రు.

జనాభాలో సిద్దెంకి వాళ్లదే పెద్దపాలు. పూర్వకాలంలో మాయితనాలు చేయడంలో ఎల్లక మొదటిభాగం వాళ్ళు కొంక వాల్లను చేతపాలుకు తెచ్చుకున్నరు. మొదటిభాగం ఎందుకంటున్నానంటే బొట్టుకంకణం మట్టేది, ఊరుఊరంతా లందకాడికి వచ్చేది, ఈ సగంల పెద్దోల్ల ఇంటికే కాబట్టి మొదటిభాగం అంటున్న. ఇక రెండోభాగం సిద్దెంకివాళ్లు గజ్జెలవాళ్లని చేతపాలుకిందికి తెచ్చుకున్నరు.

మాయితనం చేత అంటే వ్యవసాయానికి ఫలితం ఆశించకుండా పనిచేయడాన్ని చేత అంట‌రు. ఆసామిచేసే వ్యవసాయానికి కావల్సిన తాళ్లు, తలుగులు, వ్యవసాయంలో తమవంతు సహకారంగా పనిచేయడం. చెప్పులు ముడవడం. దప్పులు కొట్టడం. రెండు భాగాలవాళ్లు కూడా తమకున్న ఊరి పాలునుంచి పావులభాగం పంచి తెచ్చుకున్నవాల్లకు ఇచ్చిండ్రు. పనికోసం తెచ్చుకున్నట్లే భావించుకోవాలె. వీళ్లేకాక కొరిమి, కోడూరు, కొండపురంవాళ్లకు చేతలో భాగంలేదు.

కాలం గడుస్తున్నది. మార్పులు కూడా చాలా వచ్చిన‌యి. గ్లోబలైజేషన్ పుణ్యమా అని చేతివృత్తులు చతికిలపడ్డయి. పులిబక్కగ అయినా సారుకలు తగ్గనట్లే చేతలు కొనసాగుతున్నయి. ఈ కొనసాగింపులు కేవలం దప్పులు కొట్టేకాన్నే వున్నయి.

మొదటి భాగంనుంచి ఒకటవ వార్డుకు సిద్దెంకి కమలయ్య రెండో భాగం నుంచి రెండో వార్డుకు సిద్దెంకి ప్రసాద్ ఇద్దరు పోటీలో ఉన్నరు. చదువుకున్న యువకుడు తెలివిపరుడయిన ప్రసాద్ ని ఉపసర్పంచ్ చేయాలని కులంల తీర్మానం చేసిండ్రు. అతను బీసీ వార్డుమెంబర్లను, నలుగురిని తనకు మద్దతిచ్చేలా ఒప్పించుకున్నడు. ఈ ఆరుగురిలోనుంచి ఒక్కన్ని పెకిలిస్తే మనదే ఉపసర్పంచ్ పదవి అని భావించిన కొందరు ఈ కూటమికి గండీ కొట్టిండ్రు.

మా ఊల్లో గౌడ్స్ జనాభా చాలా ఎక్కువ. సుట్టూ పదూళ్ళ పెట్టు పేరెల్లిన మండువ గోనెపల్లి సొంతం. కొంతమంది మహారాష్ట్రల మావులపట్టుకొని పెద్దయినోళ్లు చాలామందే ఉన్నరు. ఈసారి ఎట్లాగైనా నేనే ఉపసర్పంచ్ కావాలని బలమైన కోరికతో ఉన్నాడు గౌడ్. ఈ ఉపసర్పంచ్ కూటమికి ఎట్లాగైనా విచ్ఛిన్నం చేస్తే తానేనని భావించిన గౌడ్ ఎన్నికల ముందు రోజునుంచేకమలయ్యతో సఖ్యతగా ఉన్న‌డు. ఫలితంరాగానే అందరు అభినందిస్తున్నరు. “తాతా నేనే ఓ బీరు తాగిస్త పా” అని గౌడ్ అన్నడు.

“అప్పట్కి అప్పట్కి?’అని కనకయ్య వాయిదా వేస్తుండు. బల్మిచేస్తుండ్రు. “గా వాన్ని ఏడికి తీసుకుపోతండ్రు?” కమలయ్యని ఉద్దేశించి సిద్దెంకి ఎల్లయ్య అనేది అంటుండంగనే.

“ఏడికి లేదు తాతా? ప్పుడే వత్తం” అని అప్పటికే స్టాట్ అయిఉన్న బండివైపు సెయివట్టి గుంజుక పోతండు మల్లేషం. కమలయ్యను ఎక్కు ఎక్కుమని ఎక్కించుకొని గాలిమేఘంలా బండిమీద ఊరు దాటిండ్రు.

“నన్నెక్కడికి తీసుకుపోతండ్రు? అక్కడ ఓట్లు జరుగవట్టే..?”అన్నా వదులకుండా బండిమీద తీసుకపోతూనే ఉన్నరు. రామునిపట్ల, మందపల్లి స్టేజిదాటి సిద్దిపేట శివారులో బండి ఎంటరైంది.

“ఓ తాతా! దాబాకి వోతున్నం. యాల్లకు వోతం నీకేం ఇబ్బందిలేదు తయ్యే” అని బుదుగరిచ్చుకుంట తీసుకుపోతున్నరు. బండి సిద్దిపేట దాటి బూరుగుపల్లిదాటి దుబ్బాక దగ్గరున్న హబ్సీపూర్దాబా ముందు ఆగింది. మెయ్యవోకనే మెడకు పడ్డ ఉరిలా తయారైంది కనకయ్య పరిస్థితి.

కమలయ్య పోయింది క్షణాలల్ల మాదిగలందరికీ చాటింపు చేసినట్టే ఎర్క‌య్యింది. బక్కది పడితే ఈగలు సుట్టుకున్నట్టే బడిదగ్గర ఒగపక్కకు మాద్గులు సుట్టుకున్నరు. ఒకవైపు సర్పంచ్ ఎవరైతరని, ఉపసర్పంచ్ ఎవరైతరని నరాలు తెగే ఉత్కంఠ.

“కమలయ్య గిట్లపాయేనేంరా?” అని ఒకరు. “ఒస్కులయాల్ల పిస్కిపాయేనేంరా? కమలడు” అని మరొకల్లు. “మనకు ఎసరు దెచ్చేతందుకే వొయిండు?”అని ఇంకొక‌రు.

“వాడు పక్కల పాము గాదే. వాడేకాదు ఆ సగమే అట్ల. మాటకు మతి పూటకు గతీ ఉండది. వీల్ల సోపతి నడిమట్లే నాగలిడినట్లే ఉంటది.”అని ఒకలు.

“మొండివోయిన కత్తిని నమ్మొచ్చు, మొనవోయిన ఆరెను నమ్మొచ్చు. ఆఖరి పలిగిపోయిన దప్పును కూడా నమ్మొచ్చు. తలుగు తెంపుకున్న ఎద్దును నమ్మొచ్చు కాని వాల్లను నమ్మొద్దు. ఆ సగపోల్లను నమ్మితే బెల్లం పెట్టక సంకనాకినట్టే.” అని ఒక్కోవిధంగా అంటూనే ఉన్నరు.

“అన్నా! ఉపసర్పంచి నుంచి తప్పుకుంటే నీదేందో నీకు మూడోకంటికి తెల్వకుంట సూత్తమన్నరు. నేను కులం పాబంది తప్పలే. దీన్ని మీరే నిర్ణయం చెయ్యాలే” అని వార్డుమెంబరైన పోశెట్టి పెద్దమనుషులతోటి అంటుండు. “ఇల్లు అలుకంగనే పండుగైతాది? ఐతే సూద్దాం దొమ్మర్ల పెళ్లి”, అన్నట్లు కొంతమంది. చర్చలు, తర్కాలు పుడుతూనే వున్నయి.

సరిగ్గా ఉపసర్పంచ్ ఎన్నికకు కనకయ్యను పావురాన్ని పట్టుకొచ్చినట్లు పట్టుకొచ్చిండ్రు. గాలానికి ఎర్రను తొడిగి చేపదొంగిలించినట్లు గౌడ్ ఉపసర్పంచ్ అయిండు.

నేనే ఉపసర్పంచ్ ని అన్న ధీమా పోశెట్టికి ఉండేది. ఇప్పుడు మనసు మనసులాలేదు. సేతులతున్క గద్ద తన్నుకవోయినట్లున్నది. గాయపడ్డ పాదంలా అడుగడుగుకి ముల్ల సలపరంలాంటి బాధ ఉన్నది. అన్ని తెలిసినోడు అమాసనాడు సచ్చినట్టు నా బతుకు ఆగమయిపాయే. అని రకరకాలుగా ఆలోచిస్తండు. | ఆశపడ్డనోట్ల పాసుపడ్డట్లు ఈసారికూడా వస్తదనుకున్న ఉపసర్పంచ్ పదవి రాకపోయేసరికి మాదిగూడెం కోపం బగీసమంటలయి లేసి లేసి పడుతుంది. మరునాడు కనకయ్యను పంచాదిలకు పిలువాలని మనిషిని పెట్టి ఇంటింటికి చెప్పించిరి. అందరు కమ్యూనిటీ హాల్ దగ్గరికీ వచ్చిండ్రు.

“మాటమీద నిలవడకపోతే బతుకెందుకయా అందుకే మనల్ని మాదిగిమాట నీళ్లమూట అని అన్నరు. తప్పు చేసినోనికి తగిన శిరిష్ట ఉండాలే.” పెదమనిషితోటి ఒక ఆవేదన. ‘ఔ! ఔ! తప్పు చేసినోడు తమ్ముడైనా సరే, ధర్మం తప్పద్దు” అని పెద్దమనిషి నివేదన.

వకూడుదామని యాల్లకు దప్పిచ్చిండు వార్డు మెంబర్ కమలయ్య. ఈ సగం ఆ సగం కల్సి యాభైమందికి ఎక్కువనే పనివోడకొట్టుకొని ఉన్నరు. రెండోరోజు మల్లా జమయిండ్రు. “కమలయ్యను పిలిసి దడ్వత్ పెట్టుమంటే పెట్టాన్నడు. పాలియ్యా అయితుంది. నీ వల్ల గొంతమంది పనివోతంది. ఇది న్యాయమేనారా? కనుకయ్య. తప్పో ఒప్పో ఓటి జరిగిపోయింది. అది సరిదిద్దుకుందాం దడ్వత్ పెట్టురా?” అని పెద్దమనిషి అన్నడు.

“నేను జేసిన దొంగతనమేంది? తప్పేంది? నేను దడ్వత్ ఎందుకు పెడా? వాళ్లు నన్ను తీసుకపోయ్యిండ్రు. నేను వోయిన. నాది తప్పేలేదు. నాకేమెరుక. గిట్లయితదని? నా నుంచి దండుగ ఎల్లది.” అని కమలయ్యన్నడు.

“తప్పు కులపోల్లదైతే కులపోళ్లే భరించుకుంటరు” అని అన్నా వినిపించుకుంటలేడు. “నేనువెట్ట. నానుంచికాదు.” అనుకుంటూ పోతండు. “ఓ సగం పెద్దమనుషులు ఇంటండ్రా! ఇదేనా తరువాయి? కులాన్ని కాదని పోతండు” అని రెండో సగపోల్లు అన్నారు. బాధ్యతగా వచ్చిండ్రు. క్షారాలు చేస్తుండ్రు. సిద్దెంకి మొదటి భాగం వాళ్లు క్షౌరం చేయించుకుంటూ మొదటి సగపోల్లు పిలువకపోయేరికి రెండో సగపోల్లు మనం పనిలేకున్నమా పడేనాడు పడ్డది. పంచాది? అనుకుంట ఎదిరిచూసి ఎల్లిపోయిండ్రు.

మొదటి సగపోలు ఐదారుగురు గుమికూడి ఆ సగానికి మన సగానికి ఎన్నిసార్లు పంచాదులైనా మనోల్లదే తప్పుచేస్తుండ్రు. దండుగలు కట్టిపిస్తుండ్రు. ఏందిది? ఎందుకిట్లా జరుగాలే? ఆలోచిద్దాం. అనుకుంటుండ్రు. ఆలోచనలేదు. ఎన్నటికైనా తప్పుతప్పే. అదిగాదు పద్దతి అని మరొకరు అని చెప్పితే నీకేం ఎరుక నువ్వూకో.. అనుకుంట ఒకరినొకరు అనుకుంటూ ఎవలింటికి వాళ్లు వోయిండ్రు.

మరునాడు ఉదయం కల్సి వాళ్లతోటి మనముండేది ఏంది? మనోనికి దండుగెందుకు పడాలే? మనం వాళ్లతోటి ఉంటే దండుగ పడ్డది. మనంతల మనముంటే దండుగలేదు. దోసంలేదు. మనం కంటుకావొద్దు. కనుకడే నిన్న అన్నట్లు అంటడు. వాల్లంతల వాళ్ళు, మనంతల మనం లేచిపోదాం ఎట్ల అయేదుంటే అట్లయితది అనుకున్నరు. పంచాది కోసం ఆ సగం ఈ సగం పదకొండు గంటలకు అందరు కల్సిండ్రు.

ఎప్పటోలెనే నాదేం తప్పులేదు అని అంటండు. రెండో సగంలో నుంచి పెద్దమనిషి స్వరం “కమలయ్య నా మాట విను. కులం పాబంది దాటిన. నాది పొరపాటు. కులానికి శనార్టీ అనురా పంచాదిలేదు. దడ్వత్లేదు. దండుగలేదు. అందరం ఎప్పటోలే కల్సి ఉందాం.” అని ఓ పెద్దమనిషి ముక్తాయింపు.

కమలయ్య మాత్రం నాదేం తప్పు అని వితండవాదం చేస్తుండు. రెండో సగం నుంచి మరో పెద్దమనిషి స్వరం “నిన్న, ఇయ్యాల్ల నువు జేసిన గనకార్యానికి కైకిల్లు పోగొట్టుకొని ఉంటున్నం. ఈ కర్సు బరించురా? లేకపోతే కులానికి శనార్తి అనా” అన్నడు.

“నాకేం దెలువది. నేనన.”అనుకుంటా కులాన్ని కాదని కనకయ్య పోతండు. రెండువైపులా పెద్దమనుషులు పిల్సినా రాలేదు. కాలమ్మూడంది బక్కది పడదా? అనుకుంటూ వచ్చిన దారిన పోయిండ్రు.

పదిహేను రోజుల తర్వాత కమలయ్య అన్న రామయ్య చనిపోయిండు. శవయాత్రలో రెండో సగం నుంచి దప్పు బుజానికి ఎవ్వరు వేయలేదు. పాడే మోయలేదు. చావులో నామమాత్రంగానే పాల్గొన్నారు. క్రియాశీలంగా పాల్గొనలేదు. ఇది ఒకరకంగా చెప్పాలంటే ప్రతీకారమే. చనిపోయిన రెండోరోజు గజ్జిలిండ్ల నుంచి పెద్దమనిషి మొదటి భాగం సిద్దెంకి వాల్ల దగ్గరికి వచ్చిండు. దినాలు ఎల్లినంక మాట్లాడుకుందాం కనీ ఇప్పుడైతే దడ్వత్ వెట్టుకుందాం. అందుకు పెదమనిషి నుంచి సగం నుంచి కానీ ఏ మాత్రం స్పందన లేదు.

మూడోరోజు పిట్టకు పెడ్తరు. పిట్టబియ్యం సుట్టి పట్టేటోల్లు పాలివాల్లు పిట్టకుబియ్యం ఇస్తరు. రెండో సగంనుంచి పిట్ట బియ్యం అడిగినా తేలేదు. మొదటి సగం పిట్టకు వోయిండ్రు. పదొద్దుల్ల దినాలనాడు పిట్టకు బియ్యం ఇయ్యలేదు. అయినా పాలోల్లు జలసూతుకాలు పాటిస్తున్నారు. పిట్టకార్యక్రమం అయింతర్వాత క్షారాలకు వోయిండ్రు. సిద్దెంకి వాల్లది పాతబాయి అని పేరువోయింది. ఆ సమీపంలో రెండో సగంవాల్ల సింతలకింద ఎప్పుడు కూసున్నట్లే మంగలి నాగయ్య, బాబులు కత్తులసంచి పట్టుకొని కూసున్నరు. తాత్కాలికంగా ఎత్తులు ఏసికూసున్నరు.

బుచ్చయ్య మంగోల్లలసూసి “ఓ నాగి సిన్నయ్య శారాలు చేసేది మా బాయికాన్నే. ఇటురాండ్రి” అన్నడు. సరే అనుకుంటూ వచ్చిండ్రు. క్షారాలు చేస్తుండ్రు.

సిద్దెంకి మొదటి భాగం వాళ్లు సౌరం చేసుకుంటున్నారు. ఈ భాగం పూర్తికాగానే రెండో భాగం వాల్లకు చేయాలి. ఓ ముగ్గురు చేసుకున్నారు. నాలుగోవ్యక్తి కూర్చోంగనే అప్పటికే ఏదో గుసగువెట్టుకున్నరు. మొదటిభాగం నుంచి ఒక వ్యక్తి తేని సరాయింపును ఎత్తుకొని సిన్నయ్య వరుసైన నాగయ్యతో “అరేయ్ మంగలినాగా ఆ సగపోల్లకు శౌరం చేయకు. వాల్లు డప్పులు కొట్టలే. పిట్టకు బియ్యం ఇయ్యంలే. దూరం దూరమే ఉంటుండ్రు. కడుపుల తట్టెడు ఇసంపెట్టుకొని వచ్చుడెందుకు? వాల్లకు చెయ్యనే చెయ్యకుండ్రి.” అని అన్నడు.

“మేమవలకు సగం చేసి యిడిసి పెట్టలేదు. వీల్లకు చేయ్యం.”

“నీకు కట్నం పెట్టనే పెట్టం”అని బుచ్చయ్య అన్నడు. “ఎట్లా పెట్టవో నేను సూత్త” అనుకుంట పూర్తిగా క్షౌరం చేసిండు. నుండి వాల్లదాంట్ల చస్తే వీళ్లు, వీల్లదాంట్ల చచ్చినా వాల్లు పోరు. వీళ్ల వాళ్ల చూపులమధ్య పచ్చగడ్డి వేయకముందే మంటలు లేస్తున్నయి. పిల్లికి ఎలుకకు ఉన్నట్లు పగలు పొగలు ఎల్లుతున్నయి. మచ్చుకు ఒక ఉదాహరణ. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నయి.

మొదటిసగపోల్ల శాతదారులు కొంకోల్లు. రెండో సగపోల్ల శాతదారులు గజ్జెలోల్లు, గజ్జిలోల్ల ఇంట్లనుంచి బద్దిపడగకు ఇయ్యమందుతుండ్రు. గజ్జలోల్లు పోయేసరికి బద్దిపడగలో వండుతున్న కొంకోల్లు వండితే మేం తినమంటే తినం. వాళ్లు పోయినంకనే మేం వస్తం అన్నరు. ఇదేం లొల్లిరా దేవుడా అనుకుంటూ ఇయ్యమందుకునేటోల్లే సాగతోలిండ్రు.

ఉద్యోగ రీత్యా ఊళ్లు తిరుగుతున్న కొన్నాళ్లు మెదక్లో ఉండి ఈ మధ్యే సిద్దిపేటకు వచ్చిన. ఒగరోజు కొత్తింటి భూం పెద్దయ్య చచ్చిపోతే నేను నా సహచరి లావణ్య పోయినం. కన్నీరు కార్చినం. శవయాత్రల పాల్గొన్నం. మా సగం ఒకదిక్కు ఆ సగం ఒకదిక్కు స్నానాలకు పోయింది. నేను అన్ని విషయాలు తెలుసుకున్న. ఒగనాడు ఇమరస చేసుకోవాలి అని చెప్పి ఎట్లాగో దీపం చూసేదిలేదు కనుక ఇద్దరం సిద్దిపేటకు వచ్చినం. బాధపడ్డం. కొన్ని గాయాలను కాలం మానకపోతదా? అని ఎదురిచూసినట్లే జరుగుతుంది.

సంపతికి వోకున్నా ఆపతికి పోవాలని వెల్లినం. చావులాంటి ఆపతులకు పోకపోవడం వల్ల వచ్చిన పక్కూర్ల సుట్టాలు, పొరుగూరి కులపోల్లు మీదేం ఊరయ్యా అని అనడం వల్ల పెద్దమనుషులకు ఎక్కడో తగిలింది. పోయిన్నాడు ఏం కట్టుకపోయేదుంది అనే వైరాగ్య తత్వం వచ్చింది. మనుషుల గర్వాన్ని ఎన్నికలు దూరం చేసినయి. కులంలోని చావులు అంతరాల్లో ఉన్న మనసులు, మమతలు రాతిగుండెల్ని లక్కల్ని చేసినయి.

బొడ్డూడని పిల్లకాన్నుంచి కమ్యూనిటీ హాల్ కి చేరిండ్రు. ఎన్నాళ్లనుంచో కలువాలని తహతహలాడుతున్న వాల్లకి ఒకింత పులకరింత. ఉత్సాహం. కేరింతలు. అందర్నీ ఉద్దేశించి కులానికంత శనార్తులు. నా వల్ల జరిగిన దోసానికి బాధపడుతున్న. అందరం అన్నదమ్ములోలే కలిసివుందాం. అని కన్నీళ్లతో కనకయ్య వేడుకోలు. కనకయ్య తప్పును తప్పనక చేర్చుకోవడం మాదికూడా తప్పే. అందరం కల్సివుందాం అని మొదటి సగం నుంచి పెద్దమనిషి పలుకులు.

మా ఊరి వాగు పెద్దగుండు మీదినుంచి పారినట్లు వచ్చిన శబ్దంలా చప్పట్లు, కేకలు. కరతాళ ధ్వనులు. ఆనందానికి అవధులు లేని సంతోషాలు. వంద డప్పులు ఒక్కసారి గంతేసి కొట్టినట్లు వేడుక. ఇదే అసలైన దసరా. ఇదే అసలైన బతుకమ్మ. అలాయిబలాయిలు. ఆలింగనాలు. కరచాలనాలు. తీరొక్క రంగులు పూచిన పూలతోటలా కమ్యూనిటీ హాల్లో పేర్చిన బతుకమ్మలా మనసులు లంద స్నానం చేసిన తోలులా శుద్దీకరించబడి స్వచ్ఛంగా నిగనిగలాడుతున్నయి. తీర్మారు స్టెప్పులు. ఆనంద భాష్పాలు. ఆత్మగౌరవ ప్రతీకలు. పతాకలు. కలుస్తే నిలుస్తం. నిలిస్తే గెలుస్తం. నినాదాల్లో తొలిగిన అంతరం. ఇంతకంటే మాకు ఇంకేం పండుగావాలే. ఇంకేం సంబూరం గావాలే.

జ‌న‌నం: గోనెప‌ల్లి, సిద్ధిపేట జిల్లా. క‌వి, రచ‌యిత, ఉపాధ్యాయుడు. 'మా తొవ్వ‌'(క‌విత్వం), 'బ‌తుకు పాఠం'(క‌విత్వం), 'త‌ప్ష‌'(క‌థ‌) ప్ర‌చురించారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుంచి 'తెలంగాణ‌ పాట‌ల్లో సామాజిక చిత్ర‌ణ' అనే అంశంపై ప‌రిశోధ‌న చేశారు. ప్ర‌స్తుతం వేముల‌ఘాట్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో స్కూల్ అసిస్టెంట్‌(తెలుగు)గా ప‌నిచేస్తున్నారు.

18 thoughts on “లంద స్నానం

  1. ,👌👌👌 katha bagundi.
    Kuala chichu nu dati aikyatha nilipina katha

    Congratulations Dr. Siddenky

  2. అద్భుతం.అలవోకగా ఉపమాలంకారాలు, అద్భుతమైన సామ్యాలు, ఎన్నో తెలియని తెలంగాణ పదాలతో చదువుతున్న ంతసేపూసినిమా చూస్తున్న భావన కలిగింది.ఎత్తుగడ బాగుంది.💐💐💐💐

  3. కృతజ్ఞతలు అన్న మీ స్పందనకు ధన్యవాదాలు

  4. మంచిగుంది కథ సిద్దెంకి భయ్యా

  5. తెలంగాణ మాండలికంలో బాగా వ్రాసినారు

  6. వాస్తవాన్ని కథగా మలిచిన తీరు బాగుంది

  7. తనను తాను తడుముకుంటూ,అస్థిత్త్వంను మరిచి నడస్తున్న జాతికి చేకట్టేగ గతం పొరలను తవ్వుతూ
    మావిముంతల మర్మం తెల్పున్న లంద వాసనల సుగంధం ముమ్మాటికి మాదిగ జాతి బతుకు చిత్రీకరణణనే అంటే అతియోక్తి అసలే కాదు.నిజంగ
    చెదిరిన కళల వ్యధ గాధనే…

    చాల బాగుంది భయ్యా
    అభినందనలు

  8. అన్న కృతజ్ఞతలు
    మీ విశ్లేషణ చాలా బాగుంది
    చాలా మందికి మార్గదర్శనం చేసినట్లున్నది

  9. కధనం సూటిగా స్పష్టంగా సాగడం ఒక ఎత్త యితే, ఘర్షణలు, రక్త పాతాలు లేకుండా, కుల తప్పును సరిదిద్దుకున్న విధానం కథకు ఆయువుపట్టు. దళిత బహిరంగ, అంతర్గత విషయాల పై మరిన్ని కథలకు ప్రయత్నించి, ఒక సంకలనం ప్రచురించే శక్తి సిద్దెంకి కి వుందని నమ్ముతూ, అభినందనలు

    1. థాంక్యూ అన్న మీ అభిమానానికి

      మంచి విశ్లేషణ చేశారు. సూచనలు అందించారు.

      మీ ప్రోత్సాహం, మీరు నింపిన స్ఫూర్తి నేను మరో నాలుగు కథలు రాసే వరకూ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను.

      థాంక్యూ దాసరాజు అన్న గారికి కృతజ్ఞతలు

Leave a Reply