కార్పొరేట్ లాభాల కోసం తయారైన, దుర్మార్గమైన మూడు నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా, సుదీర్ఘంగా, ధృడంగా సాగిన చారిత్రక రైతు ఉద్యమ దాటికి మోడీ సర్కార్ దిగిరాక తప్పలేదు. ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు స్థిర నివాసాలేర్పరచుకొని ఏడాది పాటు సాగించిన పోరాటం మట్టి మనుషుల మహా విజయ ప్రస్థానంగా దేశం గుండెల మీద చెక్కబడి ఉంటుంది. ఈ చట్టాలు తమ బతుకుల్లో బుగ్గి పోసేవిగా, దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల పాదాక్రాంతం చేసి తమ కాళ్ల కింది నేలను కదిలించి వేసేవిగా రై•తులు భావించారు. అందువల్లనే వాటిని సమూలంగా రద్దు చేసితీరాల్సిందేనంటూ భీష్మించుకొని డిమాండ్ చేస్తూ ఏడాది పాటు దృఢ సంకల్పంతో పోరాటం చేశారు.
ఏడాదిగా రైతులు ఉద్యమం చేస్తున్నా అసలు అదో సమస్య కాదన్నట్లు మోడీ సర్కారు వ్యవహరించింది. కేంద్ర మంత్రుల, బిజెపి ముఖ్యమంత్రులు ఎంపీలు ఆందోళన చేస్తున్న రైతులను దేశద్రోహులు, విదేశీ నిధులతో కృత్రిమ ఉద్యమాలు నడుపుతున్నారని ఆరోపించారు. ఇంతకాలం మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు ససేమిరా అన్న మోడీ ప్రభుత్వం ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. ఎన్నో ఏళ్ల నునిచి, అందునా దశాబ్ద కాలం నుంచి పలు సమస్యలతో సతమతమవుతున్న ఈ దేశ రైతాంగం, ఏడాదికి పైబడి బలిదానాలతో సాగించిన పోరాటం చరిర్తలో నిలచిపోయే గెలుపు నమోదు చేసింది. పాలన పక్షాలెంత బలవంతులైనా, అధునిక హంగులతో ఎన్ని మాయో పాయాలు చేసినా… న్యాయమైన తమ హక్కులను ఉద్యమించి సాధించుకోవచ్చని రైతులు నిరూపించారు. కార్మిక వర్గానికి దిశా నిర్దేశం చేశారు. ఏడాది పైగా గొంతెత్తి నినదించిన రైతుల కల నెరవేరింది.
నవంబర్ 22 గురునానక్ జయంతి రోజున జాతి నుద్దేశించి ప్రసంగిస్తూ మూడు సాగు చట్టాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. జరిగిన పరిణామాలకు మోడీ రైతులకు క్షమాపణ కూడ చెప్పాడు. ఎందుకు క్షమాపణలు అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఎవరెన్ని విమర్శలు చేసినా… అహంకారిగా ముద్ర పడుతున్నా, ఒంటెత్తు పోతున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమైన… ఆత్మావలోకనం చేసుకున్న సందర్భాలు, వెనక్కి తగ్గిన ఉదంతాలు చూడలేదు గనుక, మోడీ రాజకీయాలను నిశితంగా గమనించిన వారికి మాత్రం పశ్చాత్తాపం ఆయన వ్యక్తిత్వంలో కానవచ్చే గుణవిశేషం కాదని తెలుసు. ఈ నిర్ణయం సంవత్సరం క్రితమే తీసుకుంటే ప్రభుత్వం పరువుదక్కేది. 700 ప్రాణాలు కాపాడినట్లు అయ్యేది. మోడీ ప్రకటించిన విధంగానే పార్లమెంట్ శీతకాల సమావేశాల ప్రారంభ దినాన్నే నవంబర్ 29న దేశ వ్యవసాయ రంగానికి గొడ్డలిపెట్టుగా మారిన వివాదస్పద మూడు సాగుచట్టాల రద్దు పక్రియ పరిసమాప్తమయ్యింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన సాగు చట్టాల రద్దు బిల్లు డిసెంబర్ 1న రాష్ట్రపతి రామ్‍నాథ్ కోవింద్ ఆమోదం తెలిపాడు.
మోడీ ప్రకటనతో దేశవ్యాప్తంగా రైతుల విజయోత్సవాలు జరుపుకున్నారు. కొన్ని చోట్ల ర్యాలీలు కూడా జరిగాయి. ప్రధాని ప్రకటనను స్వాగతిస్తూనే, ఎంఎస్‍పికి చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లను సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. మోడీలాంటి మొండి మనిషి మట్టిమనుషుల డిమాండ్‍కు దిగిరావడం ఆయన హృదయపరివర్తన ఫలితం ఏమాత్రం కాదు. రాజకీయాలలో సదా ఒక అంతర్వాణి వినిపిస్తుంటుంది. ఏ నాయకుడు దానిని విస్మరించడు, నిర్లక్ష్యం చేయడు, మరింత అప్రమత్తం అవుతాడు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలుగావడం,ఫిబ్రవరిలో 5 రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నగారాయే ఆ అంతర్వాణి. లఖింపూర్ ఖేరి ఘటన తరువాత బిజెపికి యుపిలో తీవ్ర వ్యతిరేకత పెరిగింది.
దేశ వ్యవసాయ రంగాన్ని ఈ చట్టాలు మలుపుతిప్పుతాయని, విస్తృత సంస్కరణల్లో భాగమై రైతును రాజు చేస్తాయని, ఎత్తివేసే ప్రసక్తేలేదని… ఇంతకాలం నమ్మబలుకుతూ వచ్చిన పాలకపక్ష వాదనలు గాలికి పోయాయి. రైతు మరింత నలుగుతాడని, వ్యవసాయం, ఆహారోత్పత్తి-సరఫరా అన్నీ గంపగుత్తగా ఇక మార్కెట్‍ను శాసించే కార్పొరేట్ శక్తుల గుప్పిట్లోకి జారిపోతాయనే చట్టాల రద్దు కోరిన ఉద్యమకారుల మాట సత్యమై నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో, సరిహద్దుల్లో రహదారుల దిగ్బంధనంతో సాగించిన రైతాంగ ఉద్యమం ఎన్నో కడగండ్లను చూసింది. పోలీసు కాల్పులు, లాఠీచార్జీలు, అక్కడక్కడ చెలరేగిన అల్లర్లు, ప్రమాదాలు, ఇతరత్రా రేగిన హింస… ఏదైతేనేం, ఈ ఉద్యమ గర్భంలో దాదాపు 700 మంది ప్రాణత్యాగాలున్నాయి. వాటికెవరు బాధ్యత వహిస్తారు? ఉద్యమ నాయకులతో కేంద్రం సంప్రదింపులు, రాజకీయ పక్షాల సమాలోచనలు, సుప్రీంకోర్టు జోక్యం కూడా సమస్య పరిష్కరించి, నేరుగా న్యాయం అందించలేకపోయాయి. చివరికి ఉద్యమమే పరిష్కారం చూపింది.
ప్రజాభిప్రాయానికి తలొగ్గి ప్రభుత్వాలు వెనక్కి తగ్గడం, చేసిన తప్పును సరిదిద్దుకోవడం ప్రజాస్వామ్యంలో ఉత్తమమైన సంప్రదాయం. కానీ ఏలిన వారిలో ఆ ఉదాత్త లక్షణాలేవి ఇసుమంతైనా కనిపించవు. కనీసం రవ్వంత అపరాదభావం లేకపోవడం విచారకరం. రద్దుచేసే చట్టాలను కూడా ఆకాశానికెత్తుతూ కీర్తించడం వీరికి మాత్రమే చెల్లింది. రద్దు ప్రకటనలతో పాటుగా మోడీ సుదీర్ఘ వివరణను కూడా జోడించాడు. తాము తెచ్చిన మూడు చట్టాలు చాలా ఉపయోగకరమైనవనీ, దేశానికీ రైతులకూ ప్రయోజనకరమైనవనీ అయితే వీటిని ‘కొందరు’ రైతులకు సరిగా అర్థం చేయించలేకపోవటం వలన వారిలో అపోహలు తలెత్తి అసంతృప్తి వ్యక్తమైన కారణంగా ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లు వివరించాడు. అంటే, తాజా వెనుకడుగు వ్యూహత్మకమైనదే. బిజెపి అవసరాల రీత్యా వచ్చిందే! వారి వ్యవసాయ విధానాల్లో వచ్చిన మార్పు వల్ల కాదని స్పష్టమవుతుంది. ఇది రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేసిందేనని ఖచ్చితంగా చెప్పవచ్చు.
పార్లమెంటులో ప్రవేశపెట్టిన రద్దును ప్రకటించే బిల్లులో ఒకటీ రెండు వ్యాక్యాలను మినహాయిస్తే బిల్లు నిండా వాటిపై పొగడ్తల జల్లులే! సరైన చట్టాలు అయినప్పటికీ అనవసరంగా రైతులు ఉద్యమం చేశారని మోడీ నిస్సిగ్గుగా పేర్కొనడం ఆయనలోని ఆహాంభావానికి వర్గ దృక్పథానికి నిదర్శనం. అందువల్లనే రైతులు ఈ ప్రభుత్వాన్ని నమ్మడం లేదు. సాగు చట్టాలను రద్దు చేసినంత మాత్రాన ఆందోళనలపై వెనక్కి తగ్గేది లేదనీ, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేవరకూ, విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకునే వరకూ తమ పోరాటం సాగుతుందనీ స్పష్టం చేస్తున్నారు. మా పోరా•ం దేశం కోసమని నినదిస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వ ఎన్నికల ఎత్తుగడ మాత్రమేననీ, ఈ చట్టాల రద్దు లక్ష్యం దేశాన్ని పక్కదారి పట్టించడమేననీ ఈ సందర్భందా రైతు నేతలు పేర్కొనడం పభుత్వ వైఖరిని సరిగానే అంచనా వేసినట్లు కనిపిస్తున్నది.
రైతులు వ్యతిరేకించిన ఆ మూడు చట్టాల్లో మొదటిది రైతు ఉత్పత్తుల వ్యాపారం, వాణిజ్యం(అభివృద్ధి, సౌకర్యాల కల్పన) చట్టం- 2020 కాగా రెండోది రైతుల పంటలకు ధరల హామీ, రైతు సేవల చట్టం-2020, మూడోది నిత్యావసర సరకుల (సవరణ) చట్టం-2020. మొదటి చట్టం రైతులు తమ పంటను దేశంలో ఎక్కడబడితే అక్కడ, ఎవరికిబడితే వారికి అమ్ముకోవడానికి అవకాశం కల్పించేది. రాష్ట్ర ప్రభుత్వాల అధ్వర్యంలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలను ఈ చట్టం రద్దు చేస్తుంది. రెండవ చట్టం కాంట్రాక్టు వ్యవసాయాన్ని ప్రవేశపెట్టడానికి ఉద్దేశించింది. రైతులు ఎవరితోనైనా ఒప్పందం చేసుకొని ముందుగా నిర్ణయించుకున్న ధరల మేరకు వారికి పంట పండించి ఇవ్వడానికి అవకాశం కల్పించేది. మూడవ చట్టం ధాన్యాలు, పప్పులు, నూనెలు, ఉల్లిపాయ, బంగాళాదుంపలను నిత్యావసర సరకుల చట్టంలోని సరకుల జాబితా నుంచి తొలగించడానికి ఉద్దేశించింది. అంటే వ్యాపారులు ఇష్టావిలాసంగా ఈ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ ఉంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
అత్యధిక శాతం రైతులు ఒకటి రెండు ఎకరాలకు, గరిష్టంగా ఐదెకరాలకు లోబడిన కమతాలు కలిగిన వారే ఉన్న మనదేశంలో వారు తమ పంటను దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకొని ఎలా లాభపడతారో అర్థం కాని విషయం. ఇంతకీ ప్రధాని మోడీ ఈ చట్టాలు రైతు వ్యతిరేకమైనవనే అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారా అంటే లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ చట్టాలు దేశంలోని చిన్న రైతులకు మేలు చేసేవని ఆయన ఇప్పటికీ భావిస్తున్నారు. ఒక వర్గం రైతులు వ్యతిరేకించినందు వల్ల మాత్రమే వాటిని ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు. ఏడాదిగా తీవ్రమైన చలికి, ఎండకు, వర్షాలకు తట్టుకొని దాదాపు 800 మంది ఉద్యమకారులను కోల్పోయి సాగించిన రైతు ఉద్యమం పట్ల ఏ సందర్భంలోనూ, ఇటీవలి లఖింపూర్ ఖేరీ దారుణ ఘటన సమయంలోనైనా సానుభూతి చూపించని ప్రధాని మోడీ ప్రభుత్వం ఉన్నట్టుండి ఇప్పుడీ చట్టాలను ఉపసంహరించుకోదలచడం వెనుక అసలు రహస్యం ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవుతామన్న భయమేనని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుచేత దీనిని అవకాశవాద చర్యగానే పరిగణించాలి గాని ప్రధాని మోడీ పశ్చాత్తాపం చెంది తీసుకున్నదిగా భావించడానికి వీల్లేదు.
సంవత్సరం పొడవున ఇంటిల్లిపాదీ, కుటుంబమంతా కష్టపడి పండించే పంటలకు కనీసం సాగు వ్యయమైనా తిరిగి రాక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి మూడు దశాబ్ధాలుగా కొనసాగుతున్నది. అందుచేత రైతు వ్యవసాయం కింద పెట్టే ఖర్చుకు తన కుటుంబ సభ్యుల శ్రమ విలువను, భూమి అద్దెను కలిపి వచ్చే దానికి అందులోని సగం మొత్తాన్ని అదనంగా చేర్చి మద్దతు ధరను నిర్ణయించాలని ఎంఎస్ స్వామినాథన్ కమీషన్ 2006 అక్టోబర్‍లో చేసిన సిఫారసు నేటికి అమలుకు నోచుకోలేదు. ఈ మద్దతు ధరను పంట కొనుగోలుదారులందరూ తప్పనిసరిగా రైతుకు చెల్లించేలా పకడ్బందీ చట్టం తీసుకు రావాలని రైతు ఉద్యమకారులు కోరుతున్నారు. కనీస మద్దతు ధర సమస్యపై విస్తృతమైన కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ చేసిన ప్రకటనను కూడా వారు విశ్వసించడం లేదు. కమిటీ వేయడమంటే సమస్యకు కలకాలం వాయిదా వేయడమే అనే అభిప్రాయం స్థిరపడిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధం చేసిన విద్యుత్తు సవరణ బిల్లు మొత్తం విద్యుత్తు పంపిణీని ప్రైవేటుపరం చేయడానికి ఉద్దేశించింది. అది అమల్లోకి వస్తే పేద, మధ్య తరగతి ప్రజలు, అణగారిన సామాజిక వర్గాలు వారు, చిన్న సన్నకారు రైతులు ఎన్ని కష్టాలు పడవలసి వస్తుందో చెప్పనలవి కాదు.
కొంత మంది రైతులను ఒప్పించలేక ఉపసంహరించుకుంటున్నాయేగానీ, తమ చట్టాలు అద్భుత భాండాగారాలని ఆ అద్భుతాలేమిటో పార్లమెంటు ద్వారా ప్రపంచానికి చాటొచ్చుగా….? చర్చకెందుకు భయపడుతున్నట్టు…? తిరుగులేని మెజారిటీ ఉండి కూడా ఎందుకు వెనుకడుగేసినట్టు? ఎందుకంటే చర్య జరిగితే ఈ చట్టాలపై రైతులు సంధిస్తున్న ఏ ఒక్క ప్రశ్నకూ వారి వద్ద సమాధానం లేదు. చర్చ జరిగితే వీటి వెనుకున్న గుట్టంతా రట్టవుతుంది. సమస్త వ్యవసాయ వాణిజ్యాన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టే కుతంత్రాలన్నీ బట్టబయలవుతాయి. వీటికి తోడు ఇన్నాళ్ళూ రైతుల పోరాటాన్ని అడుగడుగునా అణిచివేసేందుకు పాల్పడిన దాష్టీకాలన్నిటికీ సంజాయిషీ ఇవ్వాల్సి వస్తుంది. వాటికి బలైన రైతులకు పరిహారాన్ని ప్రకటించాల్సి వస్తుంది. అన్నింటికీ మించి ఇప్పటికీ రైతులు డిమాండ్ చేస్తున్న ‘‘విద్యుత్ సవరణ చట్టం’’ బిల్లుకు, ‘‘కనీస మద్ధతు ధర’’ చట్టబద్ధతకూ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ చట్టాల రద్దును ఐక్యరాజ్యసమితి హక్కుల నిపుణులు సైతం స్వాగతించారు.
లోక్‍సభలో భారీ మెజారిటీ ఉన్న కారణంగా రైతుల ఆందోళనను మోడీ ప్రభుత్వం సంవత్సరకాలం ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా ఉద్యమంలో రైతులు లేరని, ఉద్యమకారులను ఖలిస్తాన్‍లని, తీవ్రవాదులని నిందించింది. ఏడాదిగా అపనిందలు, ఆరోపణలు, లాఠీచార్జీలు, బారికేడ్లు, హత్యలు, కుట్రలు మోపింది. రైతులపైన వేలాది కేసులు పెట్టింది. ఉపా చట్టాన్ని మోపింది. గర్హనీయంగా నిర్లక్ష్యం చేసింది. అడ్డు అదుపులేని ఈ దురహంకార ధోరణి చివరకు మోడీ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించేందుకు దారితీసింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‍లోని లఖింపూర్‍లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న రైతుల పైకి ఒక కేంద్ర మంత్రి కుమారుడు అమానుషంగా కారును నడపడం దేశప్రజలను దిగ్భ్రాంతి పరిచింది. ఆ ఘటన సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమంలో నిస్సందేహంగా ఒక ముఖ్యమలుపు అయింది.
దేశంలో 1991 నుంచి అమలులోకి వచ్చిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశాయి. మోడీ ఈ విధానాలను మరింత నిర్ణయంతో, వేగంగా అమలు చేస్తున్నాడు. మోడీ సర్కార్ అనుసరిస్తున్న రాజకీయార్థిక విధానాల పట్ల దేశవ్యాప్తంగా అన్ని వర్గాలలో వ్యతిరేకత గూడుకట్టుకొంది. ఇవాళ్టీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగ సంక్షోభం, రైతుల దీనస్థితికి కారణాలు గత మూడు దశాబ్ధాల సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల దుష్పరిణామమే. ఇవాళ సుదీర్ఘకాల రైతాంగ ఉద్యమం ప్రపంచీకరణ విధానాల విధ్వంసానికి వ్యక్తికరణ మాత్రమేనని గుర్తించాలి. సామాజిక సంక్షేమాన్ని విస్మరించి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలకు లాభాలు సాధించిపెట్టే విధంగా మన రాజ్యవ్యవస్థ మారింది. ద్రవ్య సంస్థల, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ధేశాలను అనుసరిస్తూ ప్రజల జీవితాలను ఛిద్రం చేశారు. అభివృద్ధి అంటే మానవాభివృద్ధిగా కాక జిడిపి పెరుగుదలనే అభివృద్ధిగా గొప్పలు చెప్పుకుంటున్నారు.
ఇవాళ రాజ్యం నిస్సిగ్గుగా మార్కెటుకు దాసోహం అంటున్నది. అందువల్లనే భిన్న ప్రజా ఉద్యమాలు ఏదో రూపంలో ముందుకు వస్తున్నాయి. భారత రైతాంగం మోడీ రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను గత ఏడేళ్లుగా చాల నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. డిమానిటె•జేషన్, జిఎస్‍టి, పెట్రోల్-డిజిల్ ధరల పెరుగుదల, వ్యవసాయ సబ్సిడీల కోత, మద్ధతుధర ఇవ్వకపోవడం వంటివన్ని రైతాంగంలో చైతన్యాన్ని నింపాయి. ఉద్యమ బాట పట్టించాయి. రాజ్యాంగ సంస్థలు స్వతంత్రతను కోల్పోయి ప్రభుత్వ జేబు సంస్థలుగా దిగజారాయి. ఇవన్ని దేశంలో ప్రజాస్వామ్య పునాదులను పెకిలించి వేశాయి. రైతుల ప్రతిఘటనపై ఎన్ని కుట్రలు పన్నినా, హింసకు పాల్పడ్డా, నిందలు వేసిన ప్రభుత్వం నిరోధించలేకపోయింది. ప్రతిపక్ష పార్టీలు కూడా దాదాపు ప్రపంచీకరణ విధానాలకు ••ట్టుబడి ఉండడం వల్ల ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని చూపలేకపోవడం వల్ల పార్లమెంటరీ రాజకీయాలలో ఒక ఖాళీ ఏర్పడింది.
మన దేశంలో మూడు దశాబ్దాల ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు ఆర్థిక సంక్షోభానికి దారితీశాయి. ఫలితంగా ఏర్పడిన రాజకీయ సంక్షోభ శూన్యతలో మత అస్తిత్వం బలమైన శక్తిగా ఎదిగింది. కాని ఈ అస్తిత్వ రాజకీయాలలో ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలూ, సామాజిక న్యాయం లాంటివి లేకపోవడం ఆ రాజకీయాల పరిమితులను చాటుతున్నవి. ఈ రాజకీయ వాతావరణ కార్పొరేట్లకు ఎంతో అనుకూలంగా మారింది. దీంతో భిన్న ఆర్థిక రంగాలని ఏ ప్రతిఘటన లేకుండా ఆక్రమిస్తూ, పోతున్న ఈ పక్రియ వ్యవసాయ రంగ కార్పొరేటీకరణను కూడా చేపట్టింది. దేశంలో నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. సామాజిక న్యాయం, సమానత్వ భావనను, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని అటుకెక్కించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడం వంటి ఆర్థిక వృద్ధి నమూన సంపన్న వర్గాల దోపిడీ కొరకే కాని ప్రజల బతుకులు బాగుచేయడానికి కాదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందులో రైతులు అగ్రభాగాన నిలబడి దేశానికి దిశను నిర్ధేశిస్తున్నారు. అందువల్ల ఇది ప్రజాతంత్ర విప్లవంలో భాగమేనని చెప్పవచ్చు. దాంట్లో భాగంగానే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలని కార్పొరేట్లు ఆశ్చర్యపడే రీతిలో రైతాంగం వ్యతిరేకించడంతో మార్కెట్ కేంద్రిత ఆర్థిక విధానాలకు కొంత కళ్లెం పడింది.
రైతు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత, రైతులపై పెట్టిన అక్రమ కేసుల ఉపసంహరణ, విద్యుత్త్ బిల్లు ఉపసంహరణ, మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం, పంట వ్యర్థాలు తగులబెట్టే రైతులపై కేసుల ఉపసంహరణ వంటి ఐదు డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలకు రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. ఆ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చాకు ఒక లేఖను పంపించింది. దీంతో ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు 40 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‍కెఎం) డిసెంబర్ 9 సాయంకాలం ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుంటే మళ్లీ ఉద్యమిస్తామని రైతు నేతలు హెచ్చరించారు. డిశంబర్ 11 నుంచి ఢిల్లీ సరిహద్దుల నుంచి ఉద్యమ శిభిరాలను ఖాళీ చేయనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు.
పార్లమెంటరీ పజాస్వామ్యంలో శాంతియుత ప్రజా ఆందోళనలు ఒక అంతర్భాగమని, ప్రభుత్వాల విధానాలను ప్రశ్నించే హక్కు ప్రజలకుంటుందనే ప్రజాస్వామ్య మౌలిక విలువలని అంగీకరించే పరిస్థితిలో మోడీ సర్కార్ లేకపోవడం మతతత్వ ఫాసిస్టు విధానాలకు సంకేతంగా గుర్తించాలి. ఈ విధానం ఇంకా ముందుకు వెళ్లి దేశ అభివృద్ధికి ప్రజాస్వామ్యమే పెద్ద అడ్డంకి అని వాదించే దశకి చేరవచ్చు. వృద్ధి లక్ష్యమేమిటన్న స్పష్టత వీళ్లకు లేకపోవడం, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసమానతలు, నిరుద్యోగం, పేదరికం, విద్యారోగ్యాలు అందుబాటులో లేకపోవడం లాంటి సవాళ్లకు జవాబు లేకుండా వృద్ధి నమూనాను సిద్ధాంతీకరించడం, ఆధిపత్య భావజాలాన్ని పెంపొందించడంలో వీళ్ళు మునిగితేలుతున్నారు. సంపద సృష్టి దేశానికి అవసరమే. కాని ప్రజలను బలిపెట్టి ముందుకు సాగడం సాధ్యం కాదని రైతాంగ ఉద్యమం స్పష్టపరిచింది.
అకుంటిత దీక్షతో సాగిన రైతు ఉద్యమం సాధించిన ఫలితం బిజెపికే కాక పాలక ప్రతిపక్ష పార్టీలకు గుణపాఠమే. ఈ ఉద్యమంలో పాలక పార్టీల భాగం కాలేదు. ఏ రాజకీయ పక్షాన్ని రైతు ఉద్యమ నాయకత్వం విశ్వసించలేదు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలు పిండుకునేందుకు యత్నిస్తాయి. ఉద్యమ ఉధృతిని అది తగ్గిస్తుంది. రెండు, వ్యవసాయరంగ మౌలిక సమస్యలపై విపక్ష పార్టీల ఆర్థిక-సామాజిక-రాజకీయ విధానాలు భిన్నమైనవేమీ కావు. భారతీయ జాతీయ, ప్రాంతీయ పార్టీలు దాదాపు అన్నీ సామ్రాజ్యవాదం ప్రపంచీకరణ ఆర్థిక విధానాలకు సానుకూలమే. ఈ విషయంలో అన్ని పాలకపక్షాలూ ‘ఒకే తాను ముక్కలు’ అన్న భావన రైతాంగ ఉద్యమ నాయకత్వానికుంది.
మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నా ఇంకా నెరవేరని డిమాండ్స్ ఉన్నాయి. అందుకే ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు. ఇది ముమ్మాటికి రైతుల విజయమే. నియంతృత్వ పోకడలపై వెల్లువెత్తిన నిరసనే. ఈ పోరాటం రైతుల చైతన్యానికి నిదర్శనం. ఇది సమిష్టి పోరాట విజయం. ఇటువంటి తీవ్రమవుతున్న వైరుధ్యాన్ని పాలకులు ఎలాగు పరిష్కరించలేరు కనుక ప్రజలే సంఘటిత పోరాటాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను, సమాన అవకాశాలను, అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని సాధించుకోవడం తప్ప మరో మార్గం లేదు. అదే సమయంలో ఎల్లకాలం ప్రజలను మభ్యపెట్టి, హింసించి, అక్రమంగా కేసులు పెట్టి తమ రాజకీయ ప్రయోజనాలు, కార్పొరేట్ల దోపిడీ ప్రయోజనాలు ఏకకాలంలో పొందడం అసాధ్యమని మోడీ సర్కార్ తెలుసుకోవాల్సిన చారిత్రక సందర్భం ఇది.