రోజు లేచే దానికంటే వో గంట ముందు మేల్కొని, చెయ్యాల్సిన వంటంతా చేసేసి, విశాల్ కి …
ఆర్యన్ కి చెరో లంచ్ బాక్స్ సర్ది, ఆర్యన్ ని స్కూల్ బస్సు దగ్గర దింపి, యింటికి వచ్చి రెడీ అయి “యివాళ టీమ్ తో డిన్నర్ కి వెళ్లుతున్నాను. బియ్యం కడిగి పెట్టాను. సాయంత్రమొచ్చాక కుక్కర్ ఆన్ చేసుకో. ఫ్రిడ్జ్ లో పెట్టిన రసం… కూరల్ని వేడి చేసుకొని డిన్నర్ చెయ్యండి” అని విశాల్ కి చెప్పింది నీలిమ.
“ప్చ్… యేమొద్దు… నేను చూసుకుంటానులే… అదో పెద్ద యిష్యూనా… పని చూసుకో” అన్నాడు విశాల్.
“కానీ ఆల్రెడీ బియ్యం కడిగేసాను. ఆన్ చేసుకో” అని నీలిమ లాప్ టాప్ బ్యాగూ… కారు తాళాలు అందుకుని “ఫ్రిడ్జ్ లో పెరుగుంది. టేబిల్ మీద ప్లేట్స్, స్పూన్స్, మంచినీళ్ళ గ్లాసులు అన్నీ పెట్టాను. ఆర్యన్ కి స్నాక్స్ కూడా వుంచాను. యిద్దరూ డిన్నర్ చేసెయ్యండి” అని మరోమారు చెప్పి నీలిమ బయటకు వెళ్లబోతుంటే, “అబ్బా… నీకు చాదస్తం పెరిగిపోయిందనుకో!” అన్న విశాల్ మాటలు వినిపిస్తున్నా ఆఫీసుకు టైం అవుతుండటంతో యింక ఆగకుండా ఫిట్బిట్ లో స్టెప్స్ కౌంట్ చూసుకుంటూ త్వరత్వరగా లిఫ్ట్ వైపు నడిచింది నీలిమ.
‘‘యెస్… యిష్యూనే… విశాల్ కి వంట రాదు. వంటే కాదూ అసలు తనకి వంటగదే రాకెట్ సైన్స్ లా వుంటుంది. మాడ్యులర్ కిచెన్ అయినప్పటికీ గ్లాసులు, స్పూన్స్, పళ్ళాలు యేవెక్కడ వుంటాయో కూడా తెలియవు. విశాల్ కు అంత అపరిచితం వంటగది. టీమ్ తోనో ఫ్రెండ్స్ తోనో డిన్నర్ కో, లంచ్ కో, బ్రేక్ ఫాస్ట్ కో వెళ్ళినప్పుడంతా… యిలాప్రతీదీ విశాల్ కి ఆర్యన్ కి అమర్చి వెళ్లకపోతే యిద్దరూ తను వచ్చే వరకూ యేo తినరు. మేం చూసుకుంటామంటాడు కానీ విశాల్ మేనేజ్ చేసుకోలేడు. మొదట్లో చూసుకుంటానన్నప్పుడు ఫుడ్ ప్రిపేర్ చెయ్యకుండా వెళ్ళిపోతే తను వచ్చేసరికి ఆకలితో అలానే వుండేవాడు విశాల్. అయ్యోనని మనసు చివుక్కుమనేది. అప్పుడు గబగబా వొండేది. యిలా రెండు మూడుసార్లు అయ్యాక ఆ టైంలో వంట చేసే ఓపిక లేక విసుగ్గా వుండేది. పైగా ‘అయ్యో ఆకలితో వున్నారేననే’ గిల్ట్ వొకటి. యీ భోజనాల అరేంజ్మెంట్ కోసం తను తన ప్రొఫెషనల్ వర్క్ ని కానీ తన పర్సనల్ స్నేహాల్ని కానీ పక్కన పెట్టాలనుకోలేదేప్పుడూ. తను చేసే యే పనులకి విశాల్ అడ్డు చెప్పడు. కానీ తనకి కావాల్సిన వంటని మాత్రం తను చేసుకోలేడు.
కారు డ్రైవ్ చేస్తుండగా ఫోన్… అమ్మ. “స్పీకర్ ఆన్ చేసి వుందా” అడిగారు రూపాదేవి.
“మమ్మీ నేనొక్కదాన్నే వున్నాను. చెప్పు” అంది నీలిమ.
తల్లి యేదైనా తనకి మాత్రమే చెప్పాల్సిన విషయం వున్నప్పుడలా అడుగుతుందని నీలిమకి తెలుసు.
“కాజోల్ అస్సలు మాట వినటం లేదంట. మొండిగా వుంటుందని సాకేత్ ఫోన్ చేసాడు. వాళ్ళిద్దరికీ పొసగటంలేదని పెళ్ళయిన యీ మూడునెలల్లో మొదటిసారి చెప్పాడు. యేమి చెయ్యాలో తెలియటం లేదు” అన్నారు రూపాదేవి.
తల్లి గొంతులో బాధ కంటే ఆందోళన… ఆదుర్దా యెక్కువగా వినిపిస్తుంటే తమ్ముడి సంసారంలో అప్పుడే యీ గొడవలేమిటో అనుకుంటూ “అసలు గొడవేంటి వాళ్ళిద్దరి మధ్యా” అని నిదానంగా అడిగింది నీలిమ.
“పడటం లేదు వాళ్ళిద్దరికీ”
“యే విషయంలో”
“యింటి పని విషయంలో”
‘యింటి పనా… వాట్ యే కోయిన్సిడెన్స్’ అనుకుంటూ “డిటైల్డ్ గా చెప్పు మమ్మీ. ప్రోబ్లం షేర్ చేసుకోవాలని నాతో చెపితే డీటెయిల్స్ చెప్పకపోయినా పర్లేదు. ప్రోబ్లం యెలా సాల్వ్ చెయ్యాలని మనిద్దరం ఆలోచన చెయ్యాలంటే మాత్రం నీకు తెలిసింది చెప్పు” అంది నీలిమ.
“కాజోల్ కి యింటిపని, వంటపని అస్సలు రాదంట. ప్రస్తుతం జాబ్ కూడా చెయ్యటం లేదేమో యెప్పుడో ఆలస్యంగా లేస్తుందంట. ఇక రోజంతా ఫోన్లో యీ సోషల్ మీడియాలోవి చూడటం… వోటీటీలోవి చూడటం. అంతేనట. వంటమ్మాయి రాని రోజు కనీసం కాఫీ కూడా పెట్టదంట. పెట్టటానికి అసలొస్తే కదా. యిక వాడా! వాడికాఫీ కూడా వాడికి కలుపుకోవడం రాదు. అసలీ గొడవలు కాజోల్ బెంగళూరు వెళ్ళిన మొదటి వారంలోనే మొదలయ్యాయంట. వో రోజు ‘యింటికి సాయంత్రం తన టీమ్ లోని కొలీగ్స్ ని డిన్నర్ కు యిన్వైట్ చేసానని, తనను రడీగా ఉండమని, కాజోల్ ను తన కొలీగ్స్ కు పరిచయం చేస్తానని, వంటామెతో డిన్నర్ రెడీ చేయించమని’ చెప్పి ఆఫీస్ కి వెళ్ళాడంట. సాయంత్రం తన కొలీగ్స్ తో వాడు యింటికి వచ్చేసరికి వుదయం వాడెళ్ళినప్పుడుయెలా వుందో అలానే షార్ట్స్ లోనే మంచం మీదే వుందంట ఫోన్ చూసుకుంటూ. స్నానం లేదు. ఆ యిల్లు నీట్ గాపెట్టనూ లేదంట. వంటామెతో వాళ్లకి డిన్నర్ కూడా ప్రిపేర్ చేయించలేదంట. యిలా చాలా చెప్పాడు. యేమిచెయ్యాలో పాలుపోవటం లేదు” అన్నారు రూపాదేవి.
“కాజోల్ కి అలవాటు లేదేమో యింటి పని. అందరికీ అన్నీ రావు కదా… అయినా సాకేత్ యేమీ కన్సర్వేటివ్ కాదు. పెత్తనం చెలాయించడం, తన మాటే నెగ్గాలని… తను చెప్పినట్లే చేయాలని కమాండ్ చేయడం వంటివి చేసే రకం కాదుకదా! మరెక్కడొస్తోంది గొడవ?” అడిగింది నీలిమ.
“ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాను… వస్తారుఅని చెప్పిన తర్వాత కూడా అలానే యే పట్టింపు లేకుండా వుండటం వాడికి ఫ్రెండ్స్ ముందు సిగ్గుగా అనిపించింది” అన్నారు రూపాదేవి.
“క్వయిట్ నేచురల్! ఆ విషయాన్ని సాగదీసి పోట్లాడుతున్నాడా కాజోల్ తో… అయిందేదో అయిందని వదిలెయ్యకుండా?” అంది నీలిమ.
“ఆ రోజొక్కటే కాదులే. అసలు కాజోల్ కి యింటి విషయాలే పట్టవంట. మినిమమ్ పట్టించుకోపొతే యెలా?” అని వాడు చాల బాధ పడుతున్నాడు. నాతో, మీ అందరితో ఫోన్ చేసి మాటాడమంటాడట. ‘నేను మాటాడినప్పుడో… లేదా మీరు పలకరించినప్పుడో తప్పా, తనంత తను యెప్పుడూ మీతో ఫోన్ చేసి మాటాడదు… నువ్వు గమనించావా’ అన్నాడు. మాతో యెలా వున్నా వోకే. మీరిద్దరూ హ్యాపీ గా వుంటే చాలని చెప్పాను” అన్నారు రూపాదేవి.
“యెవరు మాటాడితే యేమిటి మమ్మీ… మనమే మాటాడుతుందాం… కొత్త కదా! కొన్నాళ్ళకి తనకు అలవాటుఅవుతుందిలే… మెల్లగా యివన్నీ సర్దుకుంటాయిలే మమ్మీ”
“కాజోల్ తో నువ్వు మాటాడతావా?” అడిగారు రూపాదేవి.
.
“నేనా? యేమని? యిలాంటి డిఫరెన్సెస్ వాళ్లిద్దరే మాటాడుకొని సాల్వ్ చేసుకోవాలి. సాకేత్ నీతో షేర్ చేసుకోవటం వరకేనా యీ సమస్యలకి పరిష్కారం కూడా అడిగాడా” అని అడిగింది నీలిమ.
“వాడు బాధ పడుతున్నాడు కదా… కాస్త యెలా వుండాలో చెపుతావా?”
“నీకూ తెలుసు… మూడో మనిషి యింటర్ ఫియరెన్స్ యెప్పుడూ మరింత చికాకుని పెంచుతుందని… నువ్వుకూడా చప్పున కాజోల్ తో యివన్నీ మాటాడకు. కాజోల్ కి నీతో షేర్ చేసుకునే కంఫర్ట్ లేదింకా. జస్ట్ వెయిట్ మమ్మీ… అన్నీ సర్దుకుంటాయి” అంది నీలిమ.
“మీలా వుండొచ్చు కదా కాజోల్ కూడా”
“మాలా అంటే”
“పెళ్ళయినా కొత్తలో చేసుకోవల్సిన అడ్జెస్ట్ మెంట్స్ ని చేసుకోవచ్చు కదా మీ అందరిలానే”
“తను పెరిగొచ్చిన వాతావరణం మీద కూడా యివన్నీ డిపెండయి వుంటాయి కదా… వోకే మమ్మీ… ఆఫీస్ కి రీచ్ అయ్యాను. తర్వాత మాట్లాడతాను.” అంది నీలిమ.
*
గత మూడు రోజులుగా రూపాదేవికి గొంతులో యేదో అడ్డుపడి మింగుడు పడనట్టుగా వుంది బహుశా దుఃఖమేమో! మూడు రోజులుగా వొక్కరితో కూడా సాకేత్ విషయం మాటాడలేదు. నీలిమతో మాట్లాడాక కాస్త వూపిరాడినట్టయింది. నీలిమతో మాటాడి యిటు తిరిగేసరికి అత్తగారు. వింతగా రూపాదేవి వైపు చూస్తున్నారు. “యీమె విన్నారాయేoటి? మొత్తం వాట్సాప్ స్టేటస్ పెట్టేస్తారు వింటే’ అని కంగారుగా “యేమిటత్తయ్యా?” అన్నారు రూపాదేవి.
కాసేపు ఆగి నెమ్మదైన గొంతుతో “యింటి పనిలో కొంచెం సహాయం చెయ్యొచ్చుగా ఆ కాజోల్. యీ రోజుల్లో చదువుకోని పిల్లలెవరు చెప్పు. యింటి పని రాకపోతే నేర్చుకోవాలి. వంట మనుష్యులు, పని మనుష్యులు ఎందరున్నా యింట్లో పని తప్పుతుందా? మనం అందులో కొంతైనా చెయ్యటమో పైనుండి చూసుకోవడమో చెయ్యాలి కదా! లేకపోతే ఎలా కుదురుతుంది చెప్పు. నేనే పని చెయ్యను… రాదు అనటమేమిటో విడ్డూరం! మరీ అలా యెలా పెంచారో ఆ పిల్లని!“ ఆశ్చర్యపోతూ అన్నారు బామ్మ గారు. “అయినా కాజోల్ తో నేను మాట్లాడాతానుండు. మొత్తం యింటి పనంతా చేసుకుని నువ్వు వుద్యోగం ఎలా చేసేదానివో చెప్పి నాలుగు చీవాట్లేస్తాను.” అన్నారు బామ్మగారు.
“యిప్పుడే మనల్నెవరినీ యేమీ మాటాడొద్దంది నీలిమ” అన్నారు రూపాదేవి.
మొత్తం మనవలందిరిలోనూ నీలిమ అంటే ఆవిడకు యెంత యిష్టమో తెలిసి తెలివిగా అలా అన్నారామె. నీలిమ వద్దన్నది అంటే యిక ఆవిడ కాజోల్ తో మాట్లాడరు అనుకొని కాస్త స్థిమితపడ్డారు రూపాదేవి.
*
నీలిమ లంచ్ టైం లో తన టీమ్ వాళ్ళని… మరెందరినో పరిశీలనగా చూస్తూ తన తమ్ముడి వయసున్న వాళ్ళనిచూస్తూ వీళ్ళకి యింటి పని వచ్చి ఉంటుందా? అనుకుంటూ… అమ్మాయిల వైపూ చూసింది… వీళ్ళకి పనులొచ్చా? యేమో! తన క్లాస్ మేట్స్ లోనే చాల మందికి వంట రాదు. కుక్కర్ పెట్టటం, కాఫీ కలుపుకోవటం రాదు. కానీ యెలాగోలా సంసారాలని నెట్టుకొస్తున్నారు. విశాల్ కి వంట చేయడం రాకపోయినా… తనకు వంటపని యింటి పని చేయడం వచ్చు కనుక, వొక్కోసారి ఆఫీస్ పనితో వొత్తిడిగా వున్నా యెలాగోలా నడుస్తుంది బండి. మొదట్లో విశాల్ కి కాఫీ, టీ లాంటివైనా నేర్పించాలని ప్రయత్నం చేసినా అతనెప్పుడూ నేర్చుకునే ఆసక్తి చూపించలేదు. నువ్వు చెయ్యకపోయినా పర్లేదు కానీ యివన్నీ యిప్పుడు నా నెత్తిమీద పెట్టకు అనేవాడు. పనిచెయ్యకుండా రోజు గడవటం కష్టమని విశాల్ కీ తెలుసు. కానీ ఆసక్తి వుండదు. ఫుడ్ ని తెప్పించుకునే యాప్స్వొచ్చిన తర్వాత కూడా అతనికి కావాల్సిన ఫుడ్ ని తెప్పించుకునే ఛాయిస్ కూడా తక్కువే. పూర్తిగా వెజిటేరియన్. దాంతో రోజువారి భోజనం ఆర్డర్ చెయ్యటానికి వుత్సాహం చూపించేవాడు కాదు. తన మనసుకి గిల్ట్ లేకుండా, విశాల్ కి యిబ్బంది లేకుండా బయటకెళ్ళే ప్రతి సారీ అతనికి కావాల్సినవి ప్రతీది అరేంజ్ చెయ్యటం చేసేది. ఆర్యన్ పుట్టాక కూడా యిదే పద్దతి. వొక్కోసారి యే కారణంగానైనా యింటికి రావటం ఆలస్యమయినప్పుడు విశాల్ కి ఫుడ్ యెలా అని టెన్షన్ గా, కంగారుగా వుంటుంది. అన్నీ అమర్చి బయటకి వచ్చే తనని చూసి ‘ఆయనను చేసుకోమని చెప్పొచ్చు కదా!’ అని యెవరైనా అన్నా తను పట్టించుకునేది కాదు. యెందుకంటే అలాంటి ఆలోచనలు మొదట్లో తనకీ వచ్చేవి. అతనితో యిలాంటి మాటలన్నప్పుడు “నేనేమైనా నిన్ను చేసి పెట్టమన్నానా… యెప్పుడైనా? అవసరమైతే నా ఫుడ్ విషయం నే చూసుకుంటాను” అన్నాడు. కానీ విశాల్ కి ఆ స్కిల్ లేదు. నేర్చుకునే ఆసక్తి లేదు. పైగా అలాంటి సంభాషణలు తనకి అశాంతిగా అనిపించేవి. డిమాండ్ చెయ్యడని అతనికికావాల్సిన ఫుడ్ యేర్పాట్లు చెయ్యకుండా తను వదిలెయ్యలేదు. డిమాండ్ చెయ్యకపోవటం కంటే ఆ పనేదో నేర్చుకుంటే తనకి వొత్తిడి తగ్గుతుందని అతనెప్పుడూ అనుకోలేదు. ఆ విషయాన్ని అతనికి అర్ధం చేయించటమూ కష్టమే. మొదట్లో టైం మేనేజ్మెంట్ లో కొంత యిబ్బంది వుంటుంది కానీ అలవాటైయ్యాక పెద్ద కష్టమేమీ కాదనిపించేది.
విశాల్ యీ పనులను షేర్ చేసుకోకపోయినా… యింటిక్కావల్సినవి తీసుకురావటం… ఆర్డర్ చెయ్యటం… ఆర్యన్ విషయాల్ని పూర్తిగా పట్టించుకోవటం యిలా చాల పనులు బాధ్యతగా చేస్తాడు. విశాల్ మీద కంప్లైంట్ లేకపోవటం తన ఫ్రెండ్స్ కి ఆశ్చర్యమేసేది. స్నేహితులు యింటి విషయాలు మాటాడుకుంటున్నప్పుడు ‘తనకి కొన్ని పనులు వచ్చు. నాకు కొన్ని పనులొచ్చు… అందరికీ అన్నీ రావు కదా! నాకే కంప్లైంట్స్ లేవు విశాల్ మీద’ అని స్పష్టంగాచెప్పేది. కంపాటిబులిటీ విషయాలు కాలానుగుణంగా యెప్పటికప్పుడు మారిపోతూనే వున్నాయి. అందరూ అప్గ్రేడ్ అవ్వాల్సిందే.
తననీ, అక్కనీ యింటి పనీ వంట పని చెయ్యడానికి పిలిచినట్టు అమ్మ సాకేత్ ని పిలిచేది కాదు. నాన్నగారు యెప్పుడూ యింట్లో యే పనీ చేసేవారూ కాదు. వుద్యోగం చెయ్యటానికి తనని నాన్నగారు పంపటమే తనకి యిచ్చినగొప్ప గౌరవం… స్వేచ్ఛ… అనుకునేది అమ్మ. విశాల్ వాళ్ళ అక్కకి వచ్చినట్టు విశాల్ కి యింటి పని రాదు. విశాల్తమ్ముడికీ రాదు. కానీ అతను అమెరికా వెళ్ళాక, తప్పక యింటి పని, వంట పని చేసుకునేవాడట పెళ్ళేయ్యే వరకూ. సాకేత్ కూడా యింటి పని కాజోల్ కి మాత్రమే సంబంధించింది అనుకోకుండా తనూ నేర్చుకోవాలి. వంటపనికీ, యింటిపనికీ హెల్పెర్స్ వున్నా, యింట్లో వాళ్ళూ అంతో యింతో చెయ్యక తప్పదు… వాళ్ళు రాని రోజు మరింత పనుంటుంది కదా! చేసుకోవాలి కదా! ‘ ఆఫీస్ లోకి రాబోతుంటే నీలిమకు ‘కాజోల్, సాకేత్ యిది తామిద్దరి పనని రీలైజ్ అయితే తప్పా యీ సమస్యలకి పరిష్కారం లేదు కదా! వాళ్లకి యెవరైనా విడమర్చి చెపితేనో ?’ అనిపించింది.
కౌన్సిలింగ్…
*
బెంగుళూరులో వైట్ ఫీల్డ్స్ లో వున్న ప్రొఫెషనల్ ఫ్యామిలీ కౌన్సలర్ అనిల రాఘవన్ చేంబర్ లో తన ముందున్న సాకేత్… కాజోల్ చెపుతున్నవి శ్రద్ధగా విని “పెళ్ళికి ముందు మాటాడుకున్నప్పుడు యీ విషయాలన్నీ మాటాడుకోలేదా?” అడిగింది అనిల రాఘవన్.
“యే విషయాలన్నీ?” అడిగాడు సాకేత్.
“అసలు పెళ్ళి చేసుకోడానికి ముందు మీరేం మాటాడుకున్నారు?”
“నా జాబ్… హైక్ … టార్గెట్స్… ఫ్యూచర్ ప్లాన్స్ అలాగే తన జాబ్ విషయాలు మాటాడుకున్నాం” అన్నాడు సాకేత్.
“ఫ్యూచర్ ప్లాన్స్ అంటే?” అడిగింది అనిల.
“యిల్లు… విల్లా… యిన్వెస్ట్మెంట్స్… అమెరికా వెళ్ళటం యిలా” అన్నాడు సాకేత్. “మీ యిద్దరికీ వున్న స్కిల్స్ అవేమీ మాటాడుకోలేదా?” అడిగింది అనిల.
“వో… యా… నాకు స్విమ్మింగ్ డ్రైవింగ్… బంగీ జంప్…” అంది కాజోల్.
వింటున్న అనిలకు నవ్వొచ్చింది.
జాగ్రత్త గా ఆపుకుంటూ ‘రోజువారి జీవితంలో వంట యింట్లో చెయ్యాల్సిన జంప్స్ గురించి మాటాడుకోలేదు కానీ యే హాలిడేకో వెళ్ళినప్పుడు చేస్తామో చెయ్యమో తెలియని బంగీ జంప్ స్కిల్ ని మాటాడుకున్నారు. ప్రతీరోజు… ప్రతీక్షణం… కలిసి బతుకుతున్నప్పుడు రోజు వారి జీవితంలోకి కావాల్సిన స్కిల్స్ గురించి మాటాడుకోలేదు వీళ్ళు. వీళ్ళేకాదు దాదాపు తన దగ్గరకి వసున్నవాళ్ళంతా యిలానే వున్నారేమిటో?’
“వంట పని, యింటి పని తనకొచ్చా అని అడగలేదా?” అని అడిగింది అనిల.
“అవి అడగాల్సిన విషయాలా?” ఆశ్చర్యంగా అడిగాడు సాకేత్.
“అంటే” అంది అనిల.
“ప్రతి అమ్మాయికీ నేచరల్ గా వస్తాయి కాదా!” విస్మయంగా అన్నాడు.
“అలా యెలా అనుకున్నారు సాకేత్… అలా యెలా వస్తాయి?” అంది అనిల.
“మా అమ్మాగారు, అక్కలూ చదువుకున్నారు. జాబ్స్ చేస్తున్నారు. మా యిద్దరు అక్కలూ బెస్ట్ ఐ ఐ టి ల్లో చదువుకున్నారు. వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికి వంటొచ్చు. యింటి పనొచ్చు” అన్నాడు సాకేత్.
‘యేమిటో యీ మగవాళ్ళంతా! స్త్రీలంతా అన్నీ అవయవాలతో పాటు వంటపని యింటిపనితో పుడతారని యింత ప్రగాడంగా నమ్ముతారేమిటో! పిల్లలంతా వొక్కలానే పుడతారు. కానీ పిల్లలు ఆడపిల్లలుగా మొగ పిల్లలుగా పెంచపడతారని చాల మందికి తెలియకపోవటంతో పుట్టటమే ఆడపనులు మొగ పనులతోనే పుడతారనుకుంటుంటారు’ అనుకుంటూ, అనిల “వొకే… మీరేమనుకుంటున్నారు?” అని కాజోల్ ని అడిగింది.
“ఖచ్చితంగా యీ పని నేర్చుకోవాలని నాకెప్పుడూ యింట్లో చెప్పలేదు. నన్నెవరూ యేదో వొక పని చెయ్యమని అడగలేదు. నా పేరెంట్స్ యిద్దరూ డాక్టర్స్. యిల్లంతా మా బామ్మగారు చూసుకునేవారు. యిప్పుడు సడన్ గా నన్నుయిల్లు నీట్ గా పెట్టుకోవటం… కాఫీ చెయ్యటం యిలాంటివన్నీ చెయ్యమంటే నా వల్ల కాదు. నాకు నా ప్రొఫెషన్ మీద చాల యాంబిషన్స్ వున్నాయి. అవి నేర్చుకోవటం… ఆ వర్క్ కే టైం సరిపోదు. యింక యీ చిన్నిచిన్ని విషయాలకి యింత యింపార్టెన్స్ యిచ్చి యిదేదో అంతర్జాతీయ సమస్యలా రెండు ఫ్యామిలీల వాళ్ళంతా చర్చించడం యేమీ బాగోలేదు. యిది అంత యింపార్టెంట్ యిష్యూనా?” అడిగింది కాజోల్.
అనిల సాకేత్ వైపు చూసింది.
కాసేపయ్యాక అనిల “మీ యిద్దరూ వొకరి నుంచి వొకరు యే చేంజ్ ని… కోరుకుంటున్నారు… ఆశిస్తున్నారు? ” అని అడిగింది.
“రోజూ యింటి పని, వంట గురించి పట్టించుకోవాలి, యిలాంటివన్నీ నా వల్ల కాదు. నాకనిపించినప్పుడు చేస్తాను. అదో కండీషన్ గా పెడితే నాతో వీలుకాదు. మ్యేరేజ్ కి ముందు యెలావున్నానో అలానే వుంటాను. మేజర్ ఛేంజ్హస్బెండ్ అనే ఫ్రెండ్ వుంటాడు… ఆ ఫ్రెండ్ షిప్ పట్ల రెస్పాన్స్ బుల్ గానే వుంటాను. మేం కొన్నింటినిపంచుకుంటాం… సాకేత్ యిలా వుండాలి… అలా వుండాలి అనే డిమాండ్స్ నాకేం లేవ్. పెళ్ళికి ముందు యింట్లోవున్నప్పుడు మా మదర్ నా బట్టలు యిస్త్రీ… అన్నం తినిపించటం… యిలా చాల పనులు చేసి పెట్టేవారు. అవిప్పుడు నేనే చేసుకుంటున్నాను. నా బట్టలు యిస్త్రీతో పాటు సాకేత్ బట్టలకి బాధ్యత పడలేను. అలానే తనూ నా పనుల విషయంలో బాధ్యత పడక్కర్లేదు. నాకు అనిపించి… వీలుంటే చేస్తాను.” స్పష్టంగా చెప్పింది కాజోల్.
కాజోల్ మాట్లాడిన మాటల కంటే ఆమె టోన్ సాకేత్ ని మౌనంలోకి తోసేసింది.
కాజోల్ యే మాత్రం మారదు అనుకున్నాడు సాకేత్. తను చెప్పింది సాకేత్ కి నచ్చదని తెలిసినా స్పష్టంగానే మాటాడటమే కరెక్ట్ అనుకొంది కాజోల్.
యిద్దరూ మౌనంగా బయటకి వచ్చారు.
*
కాజోల్ అమ్మగారు రేణుక కాల్ చేసారు రూపాదేవికి. రూపాదేవి ‘హలో’ అనగానే మరోమాట లేకుండా “మీకు తెలుసు కదా వదినా! కాజోల్ మాకు వొక్కగానొక్క పిల్ల. చిన్నప్పటి నుంచి వొక్కత్తేపిల్లని గారాబంగా పెంచాను. అన్నం కలిపి తినిపించేదాన్ని. బట్టలన్నీ రెడీగా పెట్టేదాన్ని. యే పనీ చేయనిచ్చేదాన్ని కాదు. అవసరమైనప్పుడు వాళ్ళే నేర్చుకుంటారనుకున్నాను” అన్నారు రేణుక.
“అంతేలేండి. కావాలంటే యిప్పుడు వాళ్ళు యిద్దరూ నేర్చుకుంటారు…” అన్నారు రూపాదేవి.
“వదినా! మీరు కొన్ని రోజులు పిల్లల దగ్గరకు వెళ్లి వుండి, యీ పనులన్నీ నేర్పిస్తే వాళ్ళిద్దరి మధ్యా వచ్చిన కాన్ఫ్లిక్ట్ పోతుంది” అన్నారు రేణుక.
‘ఆ పనేదో ఆవిడే చెయ్యొచ్చు కదా! యిప్పుడు తెలివిగా ఆ బాధ్యతను తన నెత్తిమీదకు నెట్టేయాలని చూస్తోంది’ అనుకుంటూ రూపాదేవి “లేదండి. మీరే వెళ్ళండి. మీ దగ్గరున్న చనువు నా దగ్గర వుండదు కాజోల్ కి. మీరైతే తనతో యేమి చెప్పినా, యెలా చెప్పినా పరవాలేదు. అయినా అక్కడకెళ్ళి వుండటం నాకు వీలుకాదండి… అత్తయ్య గారు, మీ అన్నయ్యగారిని వదిలివెళ్లడం యెలా అండి?” అన్నారు రూపాదేవి.
“మీ పెద్దమ్మాయి దగ్గర అమెరికాలో ఆరు నెలలుండి వచ్చారు కదా… బెంగళూరే అమెరికా అనుకోండి’ జోక్ చేస్తున్నట్లుగా నవ్వుతూ అన్నారు రేణుక.
“మీరే వెళ్ళండి… అమెరికా అనుకుని” నవ్వుతూ అన్నారు రూపాదేవి.
అలా కాసేపు సంభాషణ జరిగినా యెటూ తేలలేదు.
*
సాకేత్ తల్లికి ఫోన్ చేసి కౌన్సలర్ దగ్గర జరిగిన మాటలన్నీ తల్లికి పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆమెకి కొడుకు సంసారం నిలబడుతుందా అనే అనుమానం మొదలై వొక్కసారిగా మ్రాన్పడిపోయారు. యిప్పుడెలా? కొడుక్కిచాల చెప్పాలనిపించింది. కానీ యెలా చెప్పాలోనని ఆలోచిస్తూ మాట్లాడలేదు. కొంచెంకొంచెంగా దుఖం వూరుతుంది.
నీలిమకు ఫోన్ చేసారామె.
“మా టీమ్ తో డిన్నర్ కెళ్లాను మమ్మీ. యిప్పుడే యింటికి బయలుదేరాను. డిన్నర్ చేశావా.” అడిగింది నీలిమ.
“చేసాను” అని సాకేత్ కాజోల్ కౌన్సిలర్ దగ్గరకి వెళ్ళిన విషయాలు… కాజోల్ వాళ్ళ అమ్మగారి మాటలూ అన్నీ చెప్పి “అసలిది యింత పెద్ద సమస్య అయిందేమిటి నీలూ?” అన్నారు రూపాదేవి.
“యెవరి మనఃస్థితిని బట్టి, పరిస్థితిని బట్టి వారి వారి సమస్యలు పుడుతూంటాయి. అలానే వారి వారి విచక్షణనుబట్టి నిర్ణయాలు తీసుకుంటారు. యెవరో వొకరు సర్దుకుపోవడం అంటే, ఆ వొకరూ యెవరన్నదే యీ తరం ప్రశ్న. చాల కాలం క్రితం అమ్మాయిల్ని సర్దుకుపోవాలని నచ్చచెప్పడమో, ఆదేశించటమో, నిర్ణయించటమో చేసేవారు. లేదా యెవరికి వారు సర్దుకుపోవాలని అనుకునేవారు. యిప్పుడలా లేదు. సాకేత్ కూడా ఆలోచించాలి. కాజోల్నుంచి తన యెక్స్ క్టేషన్స్ ల్లో కనీకనిపించని అలవాటైన పెత్తనం వుందేమోనని తరచి చూసుకోవాలి. యింటికి ఫ్రెండ్స్ ని పిలిచినప్పుడు ఆ రోజు కాజోల్ కి వోకేనా కాదాని కనుక్కోవాలి కదా! ఆ రోజు ఆ అమ్మాయి మూడ్ యెలావుందో…సాకేత్ ఆమె స్పేస్ ని గౌరవించాలి. అలానే కాజోల్ కూడా సాకేత్ స్పేస్ ని గౌరవించాలి. కాజోల్
కూడా ఆలోచించుకోవాలి… తనకి ఆ రోజు యెవ్వరినీ కలిసే మూడ్ లేనప్పుడు ఆ విషయం సాకేత్ కి స్పష్టంగా చెప్పాలి. తన హస్బెండ్ ని ఫ్రెండ్ అనుకుంటుంటే, ఫ్రెండ్స్ యింటికి వస్తారని చెప్పినప్పుడు ఆ పట్టించుకోని తనమేమిటో…తనలోని ఆ పార్శ్వం యేమిటో… తనూ చెక్ చేసుకోవాలి. అయితే మనలోని లోపాల్ని మనం గుర్తించడం, వొప్పుకోగల్గడం యెవరికైనా యీజీ కాదు” అంది నీలిమ.
“నేను సాకేత్ ని సరిగ్గా పెంచలేదా నీలూ? మీతో యింట్లో పని చేయించినట్టే, నేర్పించినట్టే వాడినీ పెంచుంటే వాడు ఆ పనులన్నీ తన భార్యవి మాత్రమే అని యింత గట్టిగా నమ్మేవాడు కాదేమో!” అన్నారు రూపాదేవి.
“కావొచ్చేమో! ఖచ్చితంగా తెలీదు మమ్మీ. మనం పిల్లల్ని వాళ్ళకి మంచిది అనుకొని పెంచుతాం… కానీ మన మనస్సుల్లో యేవి యెక్కడ నుంచి పోగుపడతాయో తెలీదు. మామ్… నువ్వు నీ పెంపక లోపమనే గిల్ట్ లోకి జారకు… యిటు స్పూన్ అటు పెట్టటం రాని అమ్మాయిలూ పెళ్లి అయ్యాక చక్కగా కుదురుకుని వున్నవాళ్లు వున్నారు… పదిమందికి వొంటి చేత్తో వండి పెట్టగలిగే సత్తా వున్నా విడిపోయినవాళ్ళు వున్నారు. బేసిగ్గా పెళ్ళితో వచ్చే రిలేషన్ షిప్ ని ఫ్రెండ్ అనుకుంటున్నారు కానీ ఆ రిలేషన్ షిప్ లో ప్రేమో…స్నేహమో…బంధమో…యేదో వో పేరుతో యెవరూ యెవరిపై పెత్తనం, కట్టడి చెయ్యకూడదని… యిద్దరూ వాళ్ళవాళ్ళ స్పేస్ ని గౌరవించాలానే యెరుక వుండటంలేదేమో! అందుకే పెళ్ళితో వచ్చే యీ రిలేషన్ షిప్ అంత కాంప్లికేటెడ్ గా మారిపోతుందేమో! కలిసి వున్న కాపురాల్లో చాలామట్టుకు యిద్దరిలో వొకరు మరొకరి పెత్తనాన్ని భరించటమో లేదా అందులో సర్దుకుపోవడం వల్లేసాగుతున్నాయి… దానికి నువ్వూ, నేనూ, మనలాంటి ఆడవాళ్ళు, యింకా అనేకమంది మగవాళ్ళూ కూడా అతీతం కాదు. వూరికే గిల్ట్ తీసుకోకు. వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు యెలాగోలా’’ అంది నీలిమ.
“వొకవేళ డైవోర్స్ తీసుకుంటామంటేనో!” ఆదుర్దాగా అన్నారు రూపాదేవి.
“తీసుకుంటే తీసుకోనీ.”
“అదేమిటి నీలూ… అంత తేలిగ్గా చెపుతున్నావు?”
“అరే… అదే వాళ్ళిద్దరి డెసిషన్ అయితే గౌరవించాలి… మనుష్యుల్ని కలిపి వుంచే ప్రేమో! స్నేహమో! వాళ్ళిద్దరిమధ్య లేకపోతే యిక కలసి వుండటంలో అర్థమేముంటుంది? వాళ్ళ మధ్య రిలేషన్ ను యెలా బాగుచెయ్యవచ్చోఆలోచించు. అందరం ఆలోచిద్దాం. వాళ్లింకా యేమి చెప్పక ముందే నువ్విలా రకరకాలుగా వూహించుకోకు. వో కే ? నేను యింటికి వచ్చేసాను. లిఫ్ట్ లోకి వెళ్ళుతున్నాను. బై.“ అని నీలిమ లిఫ్ట్ లోకి వెళ్ళింది.
యింట్లోకి వచ్చి, కాళ్ళు చేతులు కడుక్కుని, డైనింగ్ హాల్లోకి వచ్చింది నీలిమ. మిగిలిపోయిన కూరలూ, రసం, పెరుగుని ఫ్రిడ్జ్ లో పెట్టింది. మిగిలిన అన్నాన్ని చిన్ని గిన్నెలోకి తీసి, డైనింగ్ టేబుల్ సర్ది, మంచినీళ్ళు తాగి, కిచెన్లోని లైట్ ని తీసేసి, స్నానం చేసొచ్చి, లాప్ టాప్ ఆన్ చేసింది. పిల్లల్లోని సాఫ్ట్ స్కిల్స్ ని డెవలప్ చేసే రెండుమూడు యాప్స్ ని చెక్ చేసింది. తనకి కావల్సింది దొరికేవరకూ వెతుకుతూనే వుంది. “Dining etiquette… కుక్కరీ క్లాసెస్ ఫర్ చిల్డ్రన్” అని దొరగ్గానే ఆర్యన్ పేరుని అందులో రిజిస్టర్ చేసింది.
ఫోన్ తీసుకొని “డియర్ విశాల్… కొద్దికొద్దిగా యింటిపని, వంట పనిని నువ్వూ చేస్తుండు… పేరెంట్ నుంచి పిల్లలు చాల నేర్చుకుంటారు… ఆలోచించు… మన ఆర్యన్ కోసం…” అని అక్కడో లవ్ యెమొజి ని పెట్టి విశాల్ కి వాట్సాప్ మెసేజ్ పంపింది. కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్ ని అవాయిడ్ చెయ్యటానికి నీలిమ విశాల్ కి యిలానే వాట్సాప్ మెసేజెస్ పంపుతుంది.
‘యీ రోజు కలిగిన యెరుకతో ఆర్యన్ కే కాక యీతరం పిల్లలందరికీ… వారు ఆడైనా… మగైనా… యే జండర్ అయినా అందరికీ అవసరమైన, తప్పని సరైన లైఫ్ స్కిల్ అనిపించింది. అందించే ప్రయత్నం చేస్తున్నాను. యిలా యెప్పటికప్పుడు పిల్లలకి కావాల్సిన స్కిల్స్ ని అప్ గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళటం మాత్రం చేస్తుండాలి… వంటపని యింటి పని రావటం మరొకరి కోసం కానేకాదు… యెవరికివారు కంఫర్ట్బుల్ గా… సుఖంగా… హ్యాపీగా… శాంతిగా బతకటానికి అవసరం’ అని యఫ్ బి లో రాసుకొని, వోన్లీ మీ అని ప్రైవసీ సెట్టింగ్ పెట్టి, పోస్ట్ చేసింది నీలిమ. ప్రైవసీ పెట్టకపొతే యీ మాటల్ని చూసి కాజోల్… తన తమ్ముడు వారి గురించే రాసానానుకోవచ్చు… యిది యీ రోజు తనకి స్ట్రాంగ్ గా కలిగిన యెరుక… మెమరీగా వస్తూనే వుంటుంది. ప్రోగ్రస్ చూడాలి తన యింట్లో… ప్రతీ యేడాది… అనుకుంటూ మంచం మీద వాలుతూ ఫిట్ బిట్ లో స్టెప్స్ కౌంట్ చూసుకుంది… రేపు మరింత కౌంట్ పెంచాలనుకొంది.
ఇదే పాయింట్ మీద కథ రాశాను నేను కూడా.జాగృతి అనే పత్రిక వారు విశిష్ఠ బహుమతి
ఇచ్చారు.
జీవితాలని నిలిపే చిన్నపాయంటు ఇది.
లక్ష్మీ అన్నపూర్ణ గారు, మీ అభిప్రాయం ని పంచుకున్నందుకు థాంక్యూ అండి.
మీ కథని చదువుతాను సంపాదించి.
మీకు అభినందనలు.
ఇది చాలా సున్నితమైన అంశం. అంత సున్నితంగాను సమస్య గురించి రాశారు. వంట వచ్చిన మగపిల్లలు కూడా ఎదుట వారు చేసి పెట్టాలని చూస్తారు. చాలా బాగుంది పద్మ గారూ.
Sunitha Pothuri గారు, మీకు నచ్చినందుకు సంతోషంగా వుంది.
హృదయ పూర్వక కృతజ్ఞతలు మీకు.
ఈ ఇంటిపని పంచుకోవడమనేది చిన్నగా కనిపించే జటిలమైన సమస్యే. ఇప్పటి జనరేషన్ లో చాలామందికి చాలా అవసరమైన స్కిల్స్ లో ఒకటి. చాలా నచ్చింది పద్మగారు.
Thank you very much for sharing your opinion Indirapriyadarshini garu.
True….burning problem touch చేశారు….ఈ మధ్యే మా ఫ్యామిలీ సర్కిల్ లో మూడు జంటలు…just….ఇలాంటి చిన్న చిన్న సమస్యల వల్లే విడాకుల వరకు వచ్చారు…నాకు…మీ help తీసుకోవాలి అనిపించింది….కానీ ఉపయోగం ఉండదేమో అని విరమించుకున్నా….
మీ కౌన్సెలింగ్ బాగా అనిపించింది…కానీ బుర్రలు బాగా లేకుంటే…ఏమి చెప్పినా ఎక్కదేమో కదా…madam….
Very useful article👌
వాణీ ప్రసాద్ గారు,
మీరు వివరంగా మీ అభిప్రాయాలను…. ఆలోచనలను… అనుభవాలను పంచుకున్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.
ఈ జెనరేషన్.. లో వస్తున్న గ్యాప్స్.. వర్క్ డిఫరెన్స్ బాగా చెప్పారు.. పద్మ గారు… ఇంట్లో పేరెంట్స్ బిహేవియర్తో పాటే పిల్లల ఆటిట్యూడ్ డెవోలోప్ అవుతుందని.. ఎవరికోసం వారు పనులు చేసుకోవాలి అంతే కరెక్ట్
ప్రేమలు మీకు ❤️❤️❤️