విశాఖ ఏజెన్సీ: గుర్రం స్వారీ చేస్తూ బడికి వచ్చే మాస్టారు (బీబీసీ)
https://www.bbc.com/telugu/india-49374542
సాధారణంగా ఉపాధ్యాయులు బైక్‌పైనో, ఆటోలోనో, బస్సులోనో బడికి వస్తుంటారు. కానీ, ఈ మాస్టారు మాత్రం గుర్రం మీద వస్తారు. అదేదో సరదా కోసం కాదు. తప్పని పరిస్థితిలో ఆయన అలా రావాల్సి వస్తోంది. తమ పిల్లల జీవితాలను బాగుచేసే మాస్టారి సౌకర్యం కోసం గ్రామస్థులే ఓ గుర్రాన్ని కొనిచ్చారు.
చీమలు దూరని చిట్టడవికి చిన్నది… కాదు!
కాకులు దూరని కారడవికి పెద్దది… కాదు!
అదొక మనుషులున్న మన్యం!
మన్యం మధ్యలో వూరు! ఊరు చుట్టూ ఆకుపచ్చ’ధనం! మధ్యలో మనుషులే యెండిపోయిన కట్టెల్లా వున్నారు! అయితే, వాళ్ళని మిగతా మనుషులతో కలిపే దారి లేదు!
నిజంగానే ఆ వూరికి దారిలేదు! రావాలన్నా పోవాలన్నా గట్టూ మిట్టా యెక్కి దిగాలి! బురదా వరదా తొక్కి నడాలి! కొండా లోయా అంతుచూసి అవతలికి పోవాలి!
చెపితే తప్ప అక్కడో వూరుందని తెలీదు! ఆ వూళ్ళో చదువుకున్న పిల్లలున్నారనీ తెలీదు! చెపితే తప్ప అక్కడో బడుందని తెలీదు! బళ్ళో వొంటి వుపాధ్యాయుడున్నాడనీ తెలీదు!
బళ్ళోకి యివాళ వుపాధ్యాయుడు వస్తాడో రాడో?! తెలీదు!?
‘లేదు, వస్తాడు…’ అంటారు పిల్లలు!
‘ఔను, వచ్చి తీరుతాడు…’ అంటారు పెద్దలు!
నమ్మకం! ఆగమొచ్చినా ఆగడు! మేఘమొచ్చినా ఆగడు! తప్ప పుట్టాడు! దారి లేని వూరికి దారి తప్పడు! వస్తాడు! సూర్యుడు వచ్చినట్టే వస్తాడు! సూర్యుడు వెళ్ళినట్టే వెళ్ళిపోతాడు! రోజూ కనిపించే సూర్యుడతను! వెలుగై వస్తాడు!
పిల్లలే కాదు, పెద్దలే కాదు, యెవరి విశ్వాసమూ వీగిపోకూడదన్నట్టు విరిగిపోకూడదన్నట్టు ఖచ్చితంగా వస్తాడు! వచ్చేస్తుంటాడు!
ఊరంతా తమ చెమటని జమచేసి కొన్న గుర్రం మీదే గూడేనికి వస్తాడు!
ఉపాధ్యాయుడు రోజూ వచ్చినట్టే వస్తాడు! నెలల తరబడి వచ్చినట్టే వస్తాడు! తప్పక వస్తాడు!
ఎలా వస్తాడు?
రాజకుమారుడులా వస్తాడు!
అందుకని పిల్లలంతా మహరాణుల్లా చూస్తున్నారు!
ఆకాశం పైకప్పు కప్పుకున్న ఆ అంతఃపురానికి వస్తాడు! బడి మొండి గోడలమధ్య అంతే మొండిగా యెదురుచూస్తున్నారు పిల్లలు!
వర్షంలో తడిచారు! ఎండలో యెండారు! చలికి వణికారు! కానీ యిళ్ళకు మాత్రం పోలేదు! పోబుద్ది కాలేదు!
‘వర్షమా! మా వుపాధ్యాయుడు వచ్చేదాకా ఆగు’ అని పలక మీద రాసి ఆకాశానికి చూపించారు! వాన వెలిసింది! మంత్రం వేసినట్టు!
‘ఎండా! మా వుపాధ్యాయుడు వచ్చేదాకా ఆగు’ అని పలక మీద రాసి తూరుపుకు చూపించారు! ఎండ మబ్బయ్యింది! మబ్బుల గొడుగన్నట్టు!
‘చల్లగాలీ! మా వుపాధ్యాయుడు వచ్చేదాకా ఆగు’ అని పలక మీద రాసి నలుదిక్కులకు చూపించారు! గాలి ఆగింది! తన కాళ్ళూ చేతులూ తనే కట్టేసుకున్నట్టు!
అయినా మారాజు రాలేదు?!
వేళ మించింది! ఇంత వేళకు వచ్చెయ్యాలి!
మరింకా రాడేం?
ఆకలవుతోంది! దప్పికవుతోంది! తిల్లుమాని మరీ చూస్తున్నారు! నీడ మాయమైంది!
రాకపోతే రానని ముందురోజే చెప్తాడు వుపాధ్యాయుడు!
ఆపదలు చెప్పి వస్తాయా?
ఎలా?
దారేది?
తూనీగకు దారెందుకు? వెళ్ళేదే దారి! దూసుకు వెళ్ళేదే రహదారి!
అక్కడంతా ‘టక్.. టక్..’మని వినిపిస్తున్న చప్పుడు పిల్లల గుండె చప్పుడో లేక గుర్రం డెక్కల చప్పుడో కనిపెట్టడం యే శాస్త్రజ్ఞుడివల్లా కాదు!
పగటి పూటే కళ్ళల్లో దీపాలు వెలిగించుకొన్నారు!
ఇంకా రాడేం?
ఉపాధ్యాయుడు వచ్చాకే పిల్లలకి వూపిరాడుతుంది! మూసిన పెదాలు విచ్చుకుంటాయి! మూసిన నోళ్ళు తెరచుకుంటాయి! మూసిన పుస్తకాలు కూడా! అంతవరకూ చీకటి యెదలో చింతల పొదలో రాతి శిలల్లాగ కదలక మెదలక అలాగే!
పెద్దలు పరుగులు తీశారు?
కొండచర్యలు విరిగి పడ్డాయా? లోయలోకి జారి పడలేదు కదా? పులి పంజా విసరలేదు కదా? ఏనుగు గాని యెంటపడలేదు కదా? పిల్లల యెలుగుబంటి అల్లరి పెట్టలేదు కదా? ఏ క్రూర జంతువో తినెయ్యలేదు కదా?
వాన మొదలయ్యింది!
ఎండ విరగ కాచింది!
పిచ్చిపట్టినట్టు గాలులు!
పలకల మీద అక్షరాలన్నీ చెరిగిపోయాయి! ‘ఉపాధ్యాయుడు’ కూడా చెరిగిపోయాడు!
ఇక ఆ వూరికి వుపాధ్యాయుడు రాడు?! అతనికి యే ఆపదా రాలేదు! అతణ్ణి యేమీ యెత్తుకు పోలేదు! బడిని సర్కారే యెత్తుకు పోయింది! మాయ చేసింది!
ఔను, చదివే పిల్లల మీద లాభనష్టాలు లెక్కవేసిన ప్రభుత్వం అక్కడ బడిని మూసేసింది!
బడుల మూసివేతని బడుల విలీనం అంటూ పత్రికలన్నీ వార్తల్ని వడ్డించాయి!
పిల్లలకి వడ్డించిన అక్షరమో అన్నమో అవాల్టి నుండి అదృశ్యమైపోయింది!!