రెండు ప్రక్రియలు – ఒక తేడా

పేదరికం పిడికిట నలుగుతున్న ఒక చిన్న పల్లె. సైన్యంలో చేరటం తప్ప మరొక ఉపాధిమార్గం కనబడని యువతరం. వాళ్ళు పంపే డబ్బులకోసం ఇళ్ళలో కాచుకున్న సవాలక్ష అవసరాలు. పోస్ట్ మాన్ గా ఆ ఊరికి వచ్చిన మాజీ సైనికుడు. యుద్ధంలో గాయపడిన కాలు ఈడ్చుకుంటూ మనీఆర్డర్లు తెచ్చే అతడికోసం ఇంటింటా ఎదురుచూపులు.

ఇంతలో మొదలైంది రెండో ప్రపంచయుద్ధం. అంతకంతకూ తీవ్రంగా మారుతోంది. డబ్బు తెచ్చే పోస్ట్ మాన్, ఇప్పుడు చావు కబుర్లు తెస్తున్నాడు. అతడి రాకకోసం ఆత్రుతగా ఎదురుచూసిన మనుషులే ఇప్పుడు అతడు ఎదురయితే భయపడుతున్నారు. ఊరికంతా అతడొక దుశ్శకునమై పోయాడు. అతడి ఒంటరి బతుకులో అనుకోని ఆసరాగా మారిన మరో ఒంటరి, గౌరి తప్ప ఎవరూ పలకరించరు. యుద్ధమంటే ఏమిటో స్వయంగా తెలిసిన మనిషి అతడు. ఈ మనుషుల ముఖాల్లో మళ్ళీ యుద్ధ బీభత్సాన్ని చూసేందుకు ధైర్యం చాలటం లేదు. బిడ్డల మరణాలను తెలిపే టెలిగ్రాంలను తన బ్యాగులో దాచెయ్యటం తప్ప మరోమార్గం తోచలేదు.

చివరికి అతణ్ణి మరింత అగాధంలోకి నెట్టే రోజు రానే వచ్చింది. గౌరి కొడుకు చావు వార్తను తెలిపే టెలిగ్రాం అతడి చేతికొచ్చింది. కొడుకు రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్న గౌరి, యుద్ధం ఎక్కడ జరుగుతోంది? ఎలా జరుగుతోంది? అంటూ ప్రశ్నలు వేస్తోంది. “యుద్ధం నా బ్యాగులో జరుగుతోంది,” అనే జవాబు ఇస్తూ ఎన్ని ముక్కలైపోయుంటాడు ఆ మనిషి? అతడు భుజాన మోస్తున్నది ఉత్తరాలనా? ఎందరో యువకుల శవాలను కదా!

“భయానకం”, అనే ఈ మలయాళం సినిమాలో ఒక్కటైనా యుద్ధ సన్నివేశం కనబడదు. కానీ సామాన్యుల బతుకుల నిండా కమ్ముకున్న యుద్ధమేఘాలు గోచరిస్తాయి. అసలు రెంజీ పణికర్ ముఖమే యుద్ధ విషాదాన్ని మోస్తున్న దేశంలా మారిపోతుంది. తక్కళి శివశంకర పిళ్లై రాసిన “కాయర్’’, నవలలోని రెండు అధ్యాయాలను తీసుకుని జయరాజ్ దర్శకత్వంలో తీసిన చిత్రం ఇది.

మమ్ముట్టి నటించిన “కాథల్’’, ఇటీవలే చూశాం కదా! స్వలింగ సంపర్కులైన ఇద్దరు పురుషుల కథ రాబోతోందని అనగానే ఎన్ని ఊహాగానాలు? ఎన్నెన్ని నిషేధాలు? తను చెప్పాల్సింది ఆ వ్యక్తుల చుట్టూ సమాజం విధించిన వెలిని, జుగుప్సను, అవమానాన్నీ, తప్ప ఆ చర్యను కాదని తెలిసిన దర్శకుడు జియో బేబీ, ఆ లక్ష్యాన్ని సాధించి చూపారు. సినిమాలో ఆ ఇద్దరి నడుమ ఒక్క సంభాషణ కూడా లేకుండానే వారి లైంగిక తత్వంలోని భిన్నత్వం, అది వారి జీవితాలలో సృష్టించిన తుపాను, కుటుంబ సభ్యుల వేదన… ఇన్ని అంశాలను ఎంత హుందాగా చెప్పవచ్చో ఈ సినిమా ఒక ఉదాహరణ.

అత్యంత హింసాత్మకమైన సందర్భాలనూ, భయానకమైన అనుభవాలనూ గొప్ప నేర్పుతో , అనుకున్న లక్ష్యం వైపు గురిచూసి ప్రయోగించిన ఉదాహరణలు సాహిత్యంలో కూడా ఎన్నో కనబడతాయి.

సాదత్ హసన్ మంటో కథలు చదివాం కదా! “ఖోల్ దో!” అని పలవరించే ఆ పిల్లను జీవితంలో మరిచి పోగలమా? ఆమె అనుభవించిన నరకాన్ని వర్ణించటానికి సరిపోయే మాటలు ఏ భాషలో ఉన్నాయని?

ఇస్మత్ చుగ్తాయ్ కథలో? ఒక చిన్నపిల్ల చెప్పిన తెలిసీ తెలియని కథ, అంతఃపుర స్త్రీల ఒంటరితనాలనూ, రహస్య విషాదాలనూ ఎంతగా వివరించింది?

ఎలా సాధించారు ఈ రచయితలు ఈ ఫలితాలను?
ఒకటి : వారికి తమ లక్ష్యాలేమిటో స్పష్టంగా తెలియటం. మరొకటి : ఆ లక్ష్యాలను చేరటానికి సాహిత్యంలో లభించే వివిధ పరికరాలను గురించిన అవగాహన, వాటిని ప్రయోగించగల నేర్పు ఉండటం.

వర్తమాన సాహిత్యంలో ఇలాంటి ప్రయోగాలు బొత్తిగా లేవని కాదు. కానీ, తగ్గుతున్నాయేమో అనిపిస్తోంది. కొత్త సమూహాలనుండి రచయితలు రావటంతో సాహిత్య వస్తువుల్లో వైవిధ్యం కచ్చితంగా పెరిగింది. ఒకప్పుడు చర్చించటానికి భయపడే, ఇబ్బంది పడే ఎన్నో సమస్యలను ఇవాళ ధైర్యంగా, నిబద్ధంగా ముందుకు తెస్తున్నారు రచయితలు.

ఐతే, ఈ మొత్తం ప్రక్రియలో పాఠకుల భాగస్వామ్యాన్ని ఎంతమంది రచయితలు పట్టించుకుంటున్నారో తెలియదు. తమకు తెలిసిన వాస్తవాలను ఉన్నదున్నట్లుగా, అతి వివరంగా రికార్డ్ చేయాలనుకునే నిజాయతీ గొప్పదే. కానీ అటువంటి రచనను న్యూస్ పేపర్ పాఠకులు కోరుకున్నట్టుగా, సాహిత్య పాఠకులు ఆశించరని సృజనాత్మక రచయితలు గమనించటం అవసరం. ఆ గమనింపు లేనప్పుడు పాఠకులను ఆశ్చర్యపరచటమో, భయభ్రాంతం చెయ్యటమో ద్వారా సంచలనాన్ని సృష్టించటం దగ్గర ఆ రచన ఆగిపోతుంది. సృజనాత్మక సాహిత్యం పరిధి ఇంతకన్నా విశాలమైనది, సున్నితమైనది కూడా. అది సమస్యలను చూపించటమే కాదు, బాధితుల పక్షాన సమాజాన్ని సెన్సిటైజ్ చేస్తుంది. ఆ క్రమంలో బాధితుల గౌరవానికి, ఆత్మాభిమానానికీ దెబ్బతగలకుండా కూడా జాగ్రత్త వహిస్తుంది. వారి దైన్యాన్ని బహిర్గతం చెయ్యటంకన్నా, వారి హక్కులను డిమాండ్ చెయ్యటంపై శ్రద్ధ పెడుతుంది.

కొందరు రచయితలు ఈ చిన్న విషయాన్ని గమనించక పోవటం వలన గొప్ప సాహిత్య రచనలు కావలసినవి రిపోర్టులుగా మిగిలిపోవడం బాధాకరం.

నిజాయితీతో, నిర్భీతితో, నిష్పాక్షికంగా పనిచేయాల్సిన రిపోర్టర్ బాధ్యత తక్కువదేమీ కాదు. కానీ రిపోర్టర్లు సృజనాత్మక రచయితలు , చెయ్యాల్సిన పనులు వేర్వేరు స్వభావాలు, లక్ష్యాలు కలిగినవని గుర్తించటం ఆ రెండు రంగాల వారికీ అవసరమే కదా!

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

Leave a Reply