సాహిత్యం తరువాత సినిమాయే రెండవ వ్యసనంగా నా విద్యార్థి దశ గడిచింది గానీ చిరకాల స్నేహం శివలక్ష్మి వలె నేను సుశిక్షితుడైన సినిమా విమర్శకుణ్నో, విశ్లేషకుణ్నో, కనీసం సమీక్షకుణ్నో, పరిచయకర్తనో కాలేకపోయాను. నాకు ఆమె, ఆమె సహచరుడు రామ్మోహన్ చలసాని ప్రసాద్ ద్వారా పరిచయమైన గత ముప్పై మూడేళ్లలో ముఖ్యంగా నేను నలగొండ చౌరస్తా, మలక్‍పేటలో ఉన్న ఇరవై మూడేళ్లలో నన్ను ‘మంచి సినిమా‘ లో లేదా ‘ప్రత్యామ్నాయ సినిమా‘ లో ప్రవేశపెట్టాలని, నిలపాలని ఆమె చేసిన ఎన్నో ప్రయత్నాలు నా వ్యాపకాల వల్లనే ఫలించలేదు.
ఎమర్జెన్సీ తర్వాత వరంగల్‍లో జీవన్, శ్రీనివాసరావు, వంటి నా కొలీగ్స్ ప్రయత్నాల వల్ల ఏర్పడిన ఫిల్మ్ సొసైటీలో పట్టుమని పదేళ్లలో కొన్నయినా మంచి సినిమాలు చూడ గలిగానో లేదో. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్‍కి నన్నూ, నా సహచరినీ ఎన్నోసార్లు తమతో పాటే తీసుకవెళ్లి మంచి సినిమాలు సారథి స్టూడియోలోనో, ఫిల్మ్ ఫెస్టివల్స్ లోనో చూపాలనే ఆమె ప్రయత్నాలు బహుశా ఒకటి రెండు మంచి ఇరానియన్ సినిమాలు చూడడం వరకే ఫలించాయి.
ఇపుడింక ఏ అవకాశాలు, ఆకరాలు లేని నా ఈ స్థితిలో ఆమె నన్ను తన సినిమా పరిచయ వ్యాసాల ద్వారా మళ్లీ సినిమా అప్రీసియేషన్ కోర్సులోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నది. అందులోనూ సినిమా ద్వారా కాకున్నా నాకు పరిచయమున్న ప్రత్యామ్నాయ, రాజకీయ, ప్రజాకీయ వాతావరణం వల్లనైనా కొన్ని సినిమా పరిచయ వ్యాసాలు చదివి స్పందించగలనని భావించింది.
శివలక్ష్మికి ‘శ్రీశ్రీ రేడియో నాటికలు‘ పై ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాసం రాయవలసిన లేదా శ్రీశ్రీని అధ్యయనం చేయవలసిన సమయంలో చలసాని ప్రసాద్‍తో పరిచయం కావడం తెలుగు పాఠకులు ఎవరైనా ఊహించగలిగేదే. అప్పుడామె టెలిఫోన్ భవన్, ఖైరతాబాదులో టెలిఫోన్ ఆపరేటర్‍గా పనిచేస్తున్నది.
ఆమెకు జీవితం వల్ల, శ్రామిక వృత్తి జీవితం వల్ల, ఉద్యోగ వృత్తి వల్ల కూడ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చాయి. అట్లా ఆమెకు చలసాని ద్వారా ఒక విశాలమైన వైవిద్య భరితమైన ప్రపంచంతో పరిచయమైంది. అటు ఏలూరు వాడయిన రామ్మోహన్‍కు ఆర్టిస్టు మోహన్‍తో ఉన్న ఆత్మీయత వల్ల శివలక్ష్మికి కళలు – సాహిత్యం, సినిమాలను ఏ పర్‍స్పెక్టివ్‍లో చూడాలనే అవగాహన కలిగింది. ఆమెకు వాటిని ఎట్లా అర్థం చేసుకొని పరిచయం చేయాలనే నైశిత్వాన్ని కూడ అలవర్చింది – అని నేననుకుంటాను.
అట్లా ఆమె విరసంకు సన్నిహితురాలైంది. విరసం బయట కూడ ఆమెకు విస్తృత ప్రపంచం ఉన్నది. ముఖ్యంగా ఏ స్త్రీకయినా తన జీవితం చాలు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, వ్యాఖ్యానించడానికి. ఆ పని స్త్రీలందరూ చేస్తారు. కొందరి అనుభవాలు, వ్యా్ఖ్యలు మనదాకా, ఇతరుల దాకా చేరక పోవచ్చు. చాల మందివి అప్రకటితంగానే, అవ్యక్తంగానే ఉండవచ్చు. చాల కొద్ది మందికే అవి నలుగురికి చేర్చే అవకాశాలు రావచ్చు.
పితృస్వామ్య వ్యవస్థలో అందుకు కారణాలు నాకన్నా సాధికారికంగా శివలక్ష్మియే చెప్పగలదు. ఈ సినిమా పరిచయం, ప్రశంసా వ్యాసాల్లో పూసల్లో దారంవలె – ఆమె పర్‍స్పెక్టివ్ మనకు వ్యక్తం అవుతుంది. ఆమె నన్ను స్పందించమని పంపిన పదిహేడు సినిమాలు స్థూలంగా సోషలిస్టు రియలిజం, నియో రియలిజం, వాస్తవిక వాద సినిమా కోవలోకి వస్తాయి. అవి రష్యా, చైనాలలో విప్లవాలు విజయవంతమైనాక తీసిన సినిమాలు. జపాను, ఇటలీ, ఫ్రాన్స్ లలో ఫాసిస్టు వ్యతిరేక ప్రజాస్వామ్య పోరాటాల ప్రభావంతో నిర్మాణమైన సినిమాలు.
బోల్షివిక్ విప్లవంలో లెనిన్, స్టాలిన్‍ల నాయకత్వంలో స్వయంగా పాల్గొని స్టాలిన్ స్నేహంతో, ఆయనతో చేసిన చర్చలతో సోషలిస్టు రియలిజానికి ఒరవడి అయిన ‘బ్యాటిల్‍షిప్ పొటేమ్కిన్‘ తీసిన ఐసెన్‍స్టీన్ సినిమాలు మూడింటి గురించిన పరిచయం ఉంది. చైనా మహిళా సైన్యం గురించి తీసిన ‘ది రెడ్ డిటాచ్‍మెంట్ ఆఫ్ వుమెన్’ సినిమా పరిచయం ఉంది. ఇవి స్థూలంగా సోషలిస్టు రియలిజం – సామ్యవాద వాస్తవికతను అద్భుత కళా ఖండాలుగా చిత్రించిన సినిమాలుగా వింగడించవచ్చు.
మరొక విధంగా చూస్తే సామ్యవాద వాస్తవిక సినిమాకు మూల పురుషుడనదగిన ఐసెన్‍స్టీన్ తీసిన మూడే మూడు సినిమాల గురించిన ఎంతో భావోద్వేగంతో రాసిన మూడు పరిచయ వ్యాసాలున్నాయి.
వీటిల్లో ‘బ్యాటిల్‍షిప్ పొటేమ్కిన్‘ ఒక్కటే నేను అరవై ఏళ్ల క్రితం అప్పుడు రీజినల్ రీసెర్చ్ ల్యాబరేటరీ (ఆర్‍ఆర్‍ఎల్) అని పిలుచుకునే ఇప్పటి సెంట్రల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఆ రోజుల్లో ఉన్న ఫిల్మ్ సొసైటీలో చూసాను. చైనా మహిళా సైన్యం గురించి 1970 సాంస్కతిక విప్లవకాలంలో మళ్లా తీసిన ‘ది రెడ్ డిటాచ్‍మెంట్ ఆఫ్ ఉమెన్‘ అనే సినిమా మాత్రం ఆమె చూపితేనే ఏ రెండున్నర దశాబ్దాల క్రితమో చూసి ఉంటాను.
మరొక వింగడింపు ద్వారా వివరించాలంటే నియో రియలిజానికి జపాన్‍లోను, ఇటలీలోనూ మూల పురుషులైన అకిరా కురోసావా (రషోమాన్), విట్టోరియా డి సికా (బైసికిల్ థీవ్స్) సినిమాల పరిచయం కూడ ఈ వ్యాసాల్లో ప్రముఖమైనవి.
ఈ ముగ్గురివి, మరికొందరివి ఇటువంటి సినిమాలే గాకుండా “పథేర్ పాంచాలి” వంటి సినిమా నిర్మించడానికి ప్రదర్శించడానికి విట్టోరియా డి సికా, “బైస్‍కిల్ థీవ్స్” సినిమా చూసి సాహసించిన సత్యజిత్ రే పరిచయం చేసిన ఇందిరా ఠాక్రూన్ పాత్ర విశ్లేషణ ఉంది. ఈ వ్యాసాల కాల విస్తృతి కూడ ఎంతటిదంటే కనీసం ఒక శతాబ్దం.
1917 లో విజయవంతమైన బోల్షివిక్ విప్లవ విజయం వెనుక 1905 నాటికే విస్పోటనమవుతున్న నావికా తిరుగుబాటును, లేదా ఒక సమ్మెను విప్లవ విజయకాలంలో “ప్రపంచాన్ని కుదిపేసిన పది రోజులు” గురించిన పరిచయాలను, 1925 లోనే నిర్మించిన సినిమాలు మొదలు ఇందులో రెండవ ప్రపంచ యుద్ధకాలం నుంచీ ఇంచుమించు 1940ల ఉత్తరార్ధం నుంచి వీరోచితంగా కొనసాగుతున్న రెండు జాతి విముక్తి (పాలస్తీనా, కశ్మీరు) పోరాటాల గురించి తీసిన సినిమాల పరిచయం, వ్యాసాలు కూడ ఉన్నాయి.
ఇంచుమించు అన్నిటికన్నా ప్రజల ప్రత్యామ్నాయ పోరాటాలు, ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలు, విప్లవ పోరాటాలు, జాతి విముక్తి పోరాటాలకు సంబంధించిన సినిమాల పరిచయాలే. చివరిదొక్కటే ‘పథేర్ పాంచాలి‘ సినిమాలోని వృద్ధ మహిళ పాత్ర విశ్లేషణ.
ఆమె చూసిన సినిమాల్లో లేదా ఇందులో రాసిన సినిమాల్లో నేను కేవలం విసిరేసినట్లుగా మూడే సినిమాలు చూశాను గదా అని అడిగితే అవి చాలు ఒక్క ‘బ్యాటిల్ షిప్ పొటేమ్కిన్‘ గురించి రాసినా చాలునన్నది. ఈ ఒక్క సినిమాను చూసి ఇప్పటికి అరవై ఏళ్లు కావస్తున్నా నేను సినిమా గురించి కొంత ఆసక్తీ, అధ్యయనం చేస్తున్న కాలం గనుక ముఖ్యంగా నాకు కళలు, సాహిత్యం పట్ల ఒక దృక్పథం ఏర్పడుతున్న కాలం గనుక ఆ సినిమా ప్రభావం నాపై ఉన్నది.
ప్రపంచ సినిమాలో ఐసెన్‍స్టీన్ స్థానాన్ని సైన్స్ రంగంలో ఐన్‍స్టీన్‍తో పోల్చవచ్చు. ఎందుకంటే ప్రపంచ శాంతి దూతగా ఐన్‍స్టీన్ విస్తృత ప్రపంచానికి తెలుసు. అట్లాగే నాలుగు పేజీలదే అయినా ఆయన రాసిన “వై సోషలిజం” (సోషలిజం ఎందుకు!) అనే వ్యాసం ఇప్పటికీ సామ్యవాదం ఆవశ్యకత గురించి అతి సులభంగా అర్థం చేసుకునే పాఠకుల కోసం ఆ వ్యాసం ఎన్నిసార్లు దాని అనువాదాల్లో కూడ ప్రచురింపబడిందో.
ఆ సోషలిజం ఆవశ్యకతను, అది ఆచరింపబడుతున్న ఒక కాలంలో, ఒక దేశం నుంచి ఆ సృజనాత్మక నిర్మాణ పక్రియని కళాత్మకంగా కేవలం మూడంటే మూడు సినిమాల ద్వారా చిత్రించిన అద్బుతమైన దర్శకుడు ఐసెన్‍స్టీన్.
ఐసెన్‍స్టీన్ ‘స్ట్రైక్‘ సినిమాను 1925 ఏప్రిల్‍లో, ‘బ్యాటిల్‍షిప్ పొటేమ్కిన్‘ ను 1925 డిసెంబర్‍లో తీసాడు. ఇవి రెండూ ఇంకా టాకీ చిత్రాలు రాని కాలంలో తీసిన మూకీ చిత్రాలే.
స్ట్రైక్ – కథ ఒక మెటల్ ఫ్యాక్టరీలో ఒక మైక్రో మీటర్ అదృశ్యమై, అది యాకోవ్ అనే కార్మికుడు దొంగిలించాడని యాజమాన్యం ఆరోపించి ఉద్యోగం నుంచి తొలగిస్తే అతడు ఉరివేసుకొని చనిపోతాడు. కాని అతడు ఉరివేసుకునేముందు తన కార్మిక సోదరులకు వాస్తవాలు వివరిస్తూ ఒక లేఖ రాస్తాడు. ఆ లేఖను, యాకోవ్ శవాన్ని చూసిన కార్మికులు పనిని స్తంభింపచేసి సమ్మెకు పిలుపిస్తారు. ఎనిమిది గంటల పనిదినం కావాలని, యాజమాన్యం శ్రామికులను సాటి మనుషులుగా మర్యాదగా చూడాలని, 30 శాతం వేతనం పెంచాలని, బాల కార్మికులకు 6 గంటల పనిదినమే ఉండాలని సమ్మె డిమాండులు పెడతారు.
సమ్మె రోజుల తరబడి సాగుతుంది చివరకు యాజమాన్యం వాటాదారులతో కలిసి కార్మికులపై అగ్నిమాపక దళం, పోలీసులతో దాడులు చేయిస్తుంది. నాలుగు వైపులా సైనిక సిబ్బంది చుట్టుముట్టడంతో కార్మికులు చెల్లా చెదరవుతారు.
“మాలో పిరికివాళ్లు లేరు. దేశద్రోహులు లేరు. మా చివరి రక్తపు బొట్టు వరకు మేము మా డిమాండ్లను సాధించుకోడానికి ధారపోస్తాం” అని నినదిస్తూ శ్రమ జీవులందరూ అమరులవుతారు అని క్లుప్లంగా కథను వివరించి శివలక్ష్మి ఈ సినిమాను దృశ్యకావ్యంగా మలిచిన విధానం వివరించాలంటే ఇదొక గొప్ప వచన కావ్యమే అవుతుంది అంటుంది. ఇందులో ఐసెన్‍స్టీన్ ప్రథమంగా మూడు గొప్ప లక్షణాలను ఆవిష్కరించాడంటుంది.
అవి ముందు తరాల విప్లవ చరిత్ర – పెట్టుబడిదారీ విధానంలో యంత్ర గర్భం నుంచి ఉద్భవించిన కార్మిక శక్తి పెట్టుబడిదారీ వ్యవస్థకి గోరీకట్టే క్రమంలో ఒక ఎర్రటి మైలురాయి. 1886 మే లో హే మార్కెట్ కార్మిక అమరుల రక్తంలో ఎగిరిన ఎర్రజెండా – నుంచి 1917 అక్టోబర్ విప్లవంలో నవంబర్ 7న ఏర్పరచిన కార్మిక వర్గ రాజ్యధికారం వరకు మిలిటెంట్ పోరాటాలు జరిగాయి. కనుక ఇది సమూహాల కథ. సమూహాచరణ వ్యక్తులను కాకుండా సమూహాలను కార్మిక సముదాయ శక్తిని హీరోగా చూపిన మాంటేజ్ పద్ధతి ఆవిష్కరణ అంటుంది.
“మాంటేజ్ అంటే ఫ్రెంచ్‍లో ఆకర్షణ అని అర్థం. రెండు విరుద్ధ సంఘటనల మధ్య ఘర్షణ సృష్టించి తాను ప్రతిపాదించదలచుకున్న మూడో విషయాన్ని ప్రేక్షకులకు స్ఫురింపజేయడాన్ని మాంటేజ్ ఘర్షణ” అని అంటారు. ప్రతి చిత్రం ఒక కొత్త జన్మ ఎత్తడం – పరస్పర విరుద్ధ శక్తుల సంఘర్షణలో ఒక నూతన శక్తి ఆవిర్భవిస్తుందనే మార్క్స్ గతితార్కిక భౌతికవాదాన్ని ఆధారంగా చేసుకుని ఐసెన్‍స్టీన్ మాంటేజ్‍కి అన్వయించాడంటుంది రచయిత్రి.
ఈ ఒక్కటేకాదు ఐసెన్‍స్టీన్ ఈ సినిమాలు మూడూ తీసే సమయానికి రష్యా ప్రజలు ఎనబై శాతం మంది నిరక్షరాస్యులు. రోజు రోజుకూ క్షణ క్షణానికి ఉధృతమౌతున్న విప్లవోద్యమంలో ప్రేక్షకుల్ని మమేకం చేయడానికి, రాజకీయ ఆలోచనలు చెప్పడానికి ఐసెన్‍స్టీన్ మాంటేజ్‍ను ఎన్నుకున్నాడు.
“విభిన్న భాషల, జాతుల ప్రజలను చైతన్యపరచడానికి సినిమాకు మించిన కళా రూపం మరొకటి లేదని అన్న లెనిన్ సూత్రీకరణను నూటికి నూరుపాళ్లు వాడుకున్నాడు ఐసెన్‍స్టీన్” అంటుంది రచయిత.
ఐసెన్‍స్టీన్ మాంటేజ్ పక్రియ గురించి వచ్చిన విశ్లేషణలు వివరించి ఆమె ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలను ఉదాహరణలుగా పేర్కొని ప్రేక్షకులు, పాఠకులు వాటిని సులభంగా ఎట్లా అర్థం చేసుకోవాలో మూడు దృశ్యాల ప్రస్తావన తెస్తుంది. శ్రామికులు ఎంతో సీరియస్‍గా చర్చించి రూపొందించిన డిమాండ్‍లను యాజమాన్యం ముందు, వాటాదార్లు ముందు పెట్టినప్పుడు దర్శకుడు తెరమీద బాతులు, బాతు పిల్లలు, పంది పిల్లలు, పిల్లి పిల్లలను చూపి యజమానులు, వాటాదార్లు బల్లలపై ఒలికిన వైన్‍ను తుడుచుకుంటున్న దృశ్యం చూపడం ద్వారా ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తారో చెప్తుంది. అట్లే యాజమాన్య – వాటాదార్ల సమావేశంలో ఒక నిమ్మకాయను జూస్ చేసే మిషన్‍లో పెట్టి పిప్పిచేసి పీలుస్తుంటాడు ఒక వాటాదారుడు.
శ్రమిస్తున్న మనుషుల మీద యంత్ర మరల్లో నలిగిపోతున్నంత వత్తిడి ఉంది. చార్లీ చాప్లిన్ తీసిన “మోడర్న్ టైమ్స్” సినిమాలోనయితే ఇంక శ్రామికుణ్నే మరల్లో తిరుగుతున్నట్లుగా చూపుతాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలో మనిషి శ్రమ ఆఖరి బొట్టుదాక పిండి, పీల్చబడిన శ్రామికుడిగా మిగులుతున్నాడు.
ఈ సినిమాలో ఐసెన్‍స్టీన్ వలెనే శ్రీశ్రీ “చరమరాత్రి” కథల్లోనూ, “గుమస్తాకల” వంటి రేడియో నాటికల్లోనూ మాంటేజ్‍ని ప్రయోగాత్మకంగా, శక్తిమంతంగా వాడి విజయం సాధించాడంటుంది.
అయితే దాదాపు వందేళ్లు పోయాక ఈ సినిమాకి ఇప్పుడు రిలవెన్స్ ఏమిటో కూడ శివలక్ష్మి చెప్పకుండా వదలలేదు. మహత్తర త్యాగాల ద్వారా సాధించుకున్న 8 గంటల పనిదినాలు, మహత్తర శ్రామిక వర్గ సామ్యవాద ప్రయోగాలు అన్నీ కోల్పోయి ఇవ్వాళ కార్పొరేట్ ప్రపంచం ఇంటి నుంచి పనిచేయడాన్ని ఒక సౌకర్యంగా చిత్రిస్తున్నది. కార్మికుల హక్కులు, సాకర్యాలు దేనికీ బాధ్యత వహించని యజమాన్యం దౌర్జన్యాన్ని వైట్ కాలర్ సైబర్ కార్మికులు గుర్తించలేని అలీన భ్రమా మాయ మార్కెట్ ప్రపంచమిది. మార్క్స్ చెప్పిన శ్రమ దోపిడీకిది పరాకాష్ఠ. ‘కూలిపోతున్న జీవితాలను చూడడానికే కాదు, మనల్ని మనం నిలబెట్టుకోవడానికి కూడ ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి’ అని అంటుంది శివలక్ష్మి.
ఐతే ఐసెన్‍స్టీన్‍ను ప్రపంచ సినిమాలో అత్యున్నత స్థానంలో నిలిపిన చిత్రం ఆయన “బ్యాటిల్ షిప్ పొటేమ్కిన్”. ‘స్ట్రైక్’ సినిమా తీసిన ఎనిమిది నెలలకే డిసెంబర్ 1925 లో ఈ సినిమా తీసాడు. ఇందులో ఇతివృత్తం 1905 లో జార్ చక్రవర్తి కాలానిది, 1905 జూన్‍లో ప్రిన్స్ పొటేమ్కిన్ అనే సాయుధ యుద్ధనౌక రష్యా – జపాన్ యుద్ధంలో రష్యా ఓటమి తర్వాత తిరిగి వస్తూ ఒడెస్సా ఓడ రేవును సమీపిస్తున్న సమయంలో అందులోని నావికా సిబ్బంది చేసిన తిరుగుబాటుకు సంబంధించింది. ఎందుకంటే అదే 1905లో రష్యన్ ప్రజల తొలి విప్లవం రష్యా భూఖండంలో జరుగుతున్నది. కనుక ఈ తిరుగుబాటు కేవలం యుద్ధ నౌకలో అధికారుల మితిమీరిన నియంతృత్వం, అధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా మాత్రమే కాదు “రష్యన్ ప్రజలందరూ విప్లవంలో ఉన్నారు. మనం మాత్రం ఎందుకు ఆలస్యం చేయాలి, ఎందుకు చివరి వాళ్లం కావాలి”- అనే చైతన్యంతో భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం. దీనికి నిజానికి మన 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంలోనూ, జాతీయోద్యమం ఒక మిలిటెంట్ రూపంగా 1942లో క్విట్ ఇండియా పోరాటంగా ముగిసిన తర్వాత బొంబాయి ఓడరేవులో వచ్చిన నావికా తిరుగుబాటులో కూడ పోలికలున్నాయి. కాని ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉన్న ఇండియన్ సినిమా భారత ప్రజల వలసవాద, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలలో ఈ ప్రభావ ఘట్టాల గురించి ఒక్క సినిమా కూడ తీయలేదు. ముఖ్యంగా నావికా తిరుగుబాటు గురించి.
ఐసెన్‍స్టీన్ ఈ సినిమాని ఐదు అధ్యాయాలుగా విభజించాడు.
- మనుషులు – పురుగులు,
- డెక్ మీద డ్రామా,
- న్యాయం కోసం ఒక మృతజీవి పోరాటం,
- ఒడెస్సా మెట్లు,
- ఒక్కరి కోసం అందరు – అందరికోసం ఒక్కరు.
ఈ అధ్యాయాల శీర్షికలు చదివితేనే ఈ సినిమా గురించి తెలుసుకోవాలనీ, చూడాలనీ ఆసక్తి కలుగుతుంది కానీ ఆ అధ్యాయాల్లోని కథను నేను వివరించను. ఆ పని ఏదో ఎంత అద్బుతంగా శివలక్ష్మియే చేసింది. ఆమె మాటల్లో చదువుకుంటేనే మనకు సినిమా పట్ల కలిగే దాహం తీరుతుంది.
కాని కొన్ని పోలికలు నేను చేయాలనుకున్నవి. ఆమె చేసినవి ప్రస్తావించాలి.
1857 భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ‘సిపాయిల తిరుగుబాటు’కు రగిలిన తొలి నిప్పుకణంగా సిపాయిలకు తమ తుపాకుల్లో ఉపయోగించమని – తూటాలతో పాటు ముస్లిం సిపాయీలకు పంది మాంసం, హిందూ సిపాయీలకు గోమాంసం పెట్టి ఇవ్వగా గాయపడిన మత విశ్వాసాల వల్ల తిరుగుబాటు వచ్చింది. ఇది అసలు కారణం గాకున్న ప్రచారమైన కారణం లేదా ఎండుగడ్డి రగుల్కోవడానికి ఆధారంగా ప్రజలకు రైతాంగం చేతికందిన గడ్డిపోచ ఆధారం.
ఇందులోనూ డెక్ మీద తెల్లవారుతుంది. సిబ్బందికిస్తున్న నాసిరకం మాంసం గురించి నావికులు చర్చించుకుంటూ ఉంటారు.
న్యాయం కోసం ఒక మృత జీవి పోరాటం గురించి ఆ కథను వివరించి శివలక్ష్మి రోహిత్ వేముల త్యాగం ప్రపంచాన్ని కదిలించిన డిమాండ్స్ తో పోలుస్తుంది. తిరుగుబాటు విజయవంతమవుతుంది. కాని తిరుగుబాటుదారుల ప్రజాకర్షక నేత వాకులించుక్ బలవుతాడు. ఓడ ఒడెస్సా రేవుకు చేరుతుంది. వాకులించుక్ మృత దేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి ప్రజల సందర్శనార్ధం ఒక బహిరంగ ప్రదేశంలో టెంట్‍వేసి ఉంచుతారు. ఆ టెంట్‍లో ఒక కొవ్వొత్తి, వెలిగించి మృతదేహం దగ్గర “ఒక కప్పు సూప్ కోసం చంపబడ్డాడు.” అని రాస్తారు. (ఒక గ్లాసెడు నీళ్లు, ఒక కప్పు టీ తాగడానికి జైల్లో సిప్పర్ నిరాకరించబడిన స్టాన్ స్వామి కూడ మనకు జ్ఞాపకం వస్తాడు కదూ) ఈ వార్త దావానలం వలె వ్యాపిస్తుంది. ఇక ప్రజలు తండోప తండాలుగా వంతెనల మీది నుంచి, మెట్లమీది నుంచి కనిపించిన దారులన్నింటి నుంచీ చీమల బారుల వలె ఆ ప్రదేశాన్ని ఆక్రమిస్తారు. ఈ నావికా యాజమాన్యం మీద తిరుగుబాటు ఇంక నేలమీద జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటులో భాగమై ప్రతిధ్వనిస్తుంది.
ఒక నావికుడు “ఒడెస్సా ప్రజలారా! ఈ వాకులించుక్ మాతోపాటు పనిచేస్తున్న ఒక నావికుడు, ఇతన్ని ఒక కప్పు సూప్‍కోసం పోటెమ్కిన్ అధికారి క్రూరంగా చంపేసాడు. అణచివేత నశించాలి! మరణించిన మనిషి న్యాయాన్ని కోరుకున్నాడు.” అంటూ దీనిని ప్రజల మౌలిక పోరాటంతో అనుసంధానిస్తాడు. “తల్లులారా, సోదర సోదరీ మణులారా – ఈ భూమి మనది. మనందరం భుజం భుజం కలిపి, రష్యా కార్మికులతో కలిసి ఐక్య సంఘటన కట్టి పోరాడుదాం! మేం పగతీర్చుకుంటాం” అని ప్రసంగించాక నావికులందరూ ప్రతిజ్ఞచేస్తారు.
మనకు ఇట్లా మరణించిన రోహిత్ వేముల, స్టాన్‍స్వామితో పాటు ఇంకెన్నో గుర్తుకొస్తాయి. ఒక బుర్హాన్‍వనీ, ఒక మహేశ్ నరోటీ నుంచి ఏడాదిన్నరగా సాగుతున్న సిలింగేర్ ఆదివాసీ పోరాటానికి కారణమైన ఐదుగురి ఆదివాసుల పోలీసు కాల్పుల్లో మరణం దాకా.
అందుకే ఈ సినిమాలో ఆఖరి అధ్యాయం ఒక్కరి కోసం అందరు – అందరి కోసం ఒక్కరు అని ముగుస్తుంది. అప్పటికీ ఇప్పటికీ ఇది కోట్లాది శ్రమజీవుల పోరాట గాథ. ఇది ఐక్య సంఘటనలో భాగమైన వర్గ పోరాటం. ఇందులో జాతుల, కార్మికుల ఐక్య సంఘటన ఉంది. ఇది 1917 అక్టోబర్ విప్లవం నాటికి జాతుల విముక్తికి, ప్రజలు విప్లవానికి కూడ నాయకత్వం వహించిన శ్రామిక వర్గ విజయంగా ముగుస్తుంది.
ఈ సాదృశ్యాన్ని శివలక్ష్మి హృద్యంగా అభివర్ణిస్తుంది- “సినిమా ప్రారంభంలోనే ఉప్పొంగే సముద్రం కనిపిస్తుంది. వెంటనే లెనిన్ కొటేషన్ “విప్లవమే యుద్ధం, చరిత్రలో జరిగిన అన్ని యుద్ధాల కంటే ఈ యుద్ధం చాలా సబబైనది. న్యాయమైనది. అత్యవసరమైనది. ఈ నిజమైన యుద్ధం రష్యాలో ప్రకటించబడి, గొప్ప ఆశాజనకంగా మొదలైంది – లెనిన్ – 1905.” అని తెరమీద కనిపిస్తూ ప్రేక్షకులకు ఉత్తేజాన్నిస్తుంది.
ఇంక ఈ సినిమా సన్నివేశాలన్నిటిలోకి ఒడిస్సా మెట్ల సీన్ ఎంత ప్రఖ్యాతి గాంచిందో, ఆ సన్నివేశాలపై ఎంత చర్చ, ఎంత సాహిత్యం వచ్చిందో దానికదే ఒక చరిత్ర. సినిమా అంత ఒడిస్సా రేవు మెట్ల దగ్గర నిలిపి బ్యాటిల్ షిప్ పొటేమ్కిన్, నావతో ఈ మెట్లు, ఈ మెట్ల మీంచి వచ్చే జనం, వారిపై పోలీసుల కాల్పులు – ప్రజల ప్రతిఘటన – నావికులకు వాళ్ల సంఘీభావం దృశ్యాల చిత్రీకరణయే ! ఆ దృశ్యాలన్నీ శివలక్ష్మి వివశత్వంతో వివరించిన ఘట్టాలు చదువుకోండి, కానీ ఇది రాస్తూవుంటే అరవై ఏళ్లక్రితం నా కళ్లు చూసి ఇప్పటికీ రెటీనా పై పదిలపర్చుకున్న దృశ్యం. ఒక పాపాయిని ఉయ్యాలలో తీసుకెళ్తున్న తల్లి కాల్పులకు గురయి మరణిస్తుంది. ఆ పాప ఉయ్యాల మెట్ల మీద జారిపోతూ కనిపిస్తుంది. సినిమా చరిత్రలోనే మాంటేజ్‍కు ఒక ప్రామాణిక దృశ్యీకరణ ఒడెస్సా మెట్ల సీక్వెన్స్. శివలక్ష్మి మాటల్లోనే చెప్పాలంటే వందేళ్ల సినీ ప్రస్థానంలో కార్మికుల సామూహిక చైతన్యాన్ని పప్రథమంగా మిలిటెంట్‍గా అపురూపంగా దృశ్వీకరించిన చిత్రమిది.
“ప్రపంచంలో ఇంత వరకు వచ్చిన అతిగొప్ప విశ్వసనీయమైన చిత్రాలలో ఇది ఒకటి. నావికుల తిరుగుబాటు చిత్రించినందుకు, ప్రజలలో సమానత్వ భావాలను సూచన ప్రాయంగా రేకెత్తించగలిగినందుకు, సోవియట్ యూనియన్లో సోషలిస్టు రాజ్య స్థాపన గురించి పనిచేసినందుకు నిషేధింపబడిన విదేశీ చిత్రాల్లో అపూర్వ గౌరవం దక్కించుకున్న సినిమా బ్యాటిల్‍షిప్ పొటేమ్కిన్.”
ఈ చిత్రం అమెరికా, బెర్లిన్, అనేక ప్రపంచ దేశాలలో ఏ సినిమా నిషేధించబడనన్ని సంవత్సరాలు నిషేధింపబడింది. అసలు రష్యాలోనే విడుదలకు నోచుకోలేదు. బ్రిటన్‍లో అయితే ఏ సినిమా నిషేధింపబడనన్ని రోజులు నిషేధింపబడింది. “ఇందులో ఉన్న సామాజిక, సాంఘిక స్థితిని యథాతథంగా ఉంచాలనుకునే వారికి ఇది ఒక సింహస్వప్నమైంది” అంటుంది రచయిత్రి.
ఈ చిత్రం చూసి జర్మన్ నాజీ ప్రచార శాఖా మంత్రి గోబెల్స్ – “ఇది ఒక అద్బుతమైన చిత్రం – దృఢమైన రాజకీయ నమ్మకంలేని ఎవరైనా ఈ చిత్రం చూసిన తర్వాత దాని రాజకీయ ఆలోచనా విధానానికి ప్రభావితమై బోల్షివిక్కులుగా మారిపోతారు.” అని అన్నాడు.
‘మద్రాసు ప్రావిన్స్ లో ప్రకాశం పంతులు ప్రభుత్వం ఏర్పడినాక (1947 కు ముందు) ఆయన మంత్రి వర్గంలో ఉన్న కళా వెంకట్రావు “మా భూమి” నాటకం చూసి కన్నీళ్లు పెట్టి, మంత్రివర్గ సమావేశంలో ఆ సినిమా నిషేధాన్ని బలపరచాడు’ అని శ్రీశ్రీ చెప్పాడు.
“1952లో సైట్ అండ్ సౌండ్ మేగజైన్‍లో ప్రపంచ ప్రఖ్యాత సినిమాలలో ఇది నాలుగవ గొప్ప చిత్రంగా పేర్కొన్నారు.” ఇదే చిత్రం “1958లో బ్రస్సెల్స్ వరల్డ్ ఫెయిర్‍లో అన్ని కాలాలకు వర్తించే విశ్వ జనీనమైన గొప్ప చిత్రం” గా పేరు గాంచింది. “ఈ సినిమా ఒక సాంకేతిక కళాఖండం, ఒక సృజనాత్మక విద్యుద్ఘాతం” అంటుంది శివలక్ష్మి.
ఐసెన్‍స్టీన్ ప్రతిపాదించిన సోషలిస్టు రియలిజం సిద్ధాంతంతో ఏకీభావం లేని వారు కూడ సినిమా పుట్టినప్పటి నుంచి వచ్చిన పది మంచి సినిమాలలో గుర్తుపెట్టుకోదగిన సినిమా “బ్యాటిల్‍షిప్ పొటేమ్కిన్” ను పేర్కొంటారు. ఇదే సందర్భంగా మరో అరుదుగా తెలిసిన యదార్థాన్ని ప్రస్తావించాలి.
ఐసెన్‍స్టీన్ బోల్షివిక్ విప్లవంలో లెనిన్‍తో తీవ్రంగా ప్రభావితుడయి విప్లవ విజయానంతరం సినిమాలు తీసేనాటికి లెనిన్ లేడు. సోషలిస్టు నిర్మాణ స్వప్నం ఆచరింపబడుతున్న నాలుగేళ్లకే 1923 లో అమరుడయ్యాడు. లెనిన్ అమరుడయిన రెండు సంవత్సరాల తర్వాత 1925 లో స్ట్రైక్, బ్యాటిల్‍షిప్ పొటేమ్కిన్ చిత్రాలను దృశ్యీకరించాడు. మూడో సినిమా “ప్రపంచాన్ని కుదిపేసిన ఆ పదిరోజులు” 1927 లో నిర్మించాడు. ఈ సినిమా నిర్మాణ క్రమమంతా ఐసెన్‍స్టీన్ ఈ ఇతివృత్తం చిత్రీకరణల విషయంలో స్టాలిన్‍తో చర్చల్లో ఉన్నాడు, జాతుల సమస్య, భాషా, సంస్కతుల గురించి, కళా దృక్ఫథం గురించి స్టాలిన్‍కున్న అవగాహన స్పష్టత ఈ చిత్ర నిర్మాణంలో ఐసెన్‍స్టీన్‍కు ఎంత దోహదం చేసిందో ఆయనే స్వయంగా రాసాడు. ఇంటర్వ్యూలో చెప్పాడు కూడ. ఇదంతా ప్రపంచ సినీ చరిత్రలో భాగమైన పాఠ్యాంశమే.
“ప్రపంచాన్ని గడగడలాడించిన ఆ పది రోజులు” అనే జాన్ రీడ్ (John Reed ) నవల ఆధారంగా ఐసెన్‍స్టీన్, తన అసొసియేట్ గ్రిగోరి అలెగ్జాండర్‍తో కలిసి తీసిన సినిమా “అక్టోబర్”. మొదట నిశ్శబ్ద మూకీ యుగంలోనే చిత్రీకరించారు. తర్వాత లోపలి వివరణలతో సహా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ధ్వని చిత్రాన్ని దృశ్వీకరించారు.
అమెరికన్ పాత్రికేయుడు, సోషలిస్టు జాన్‍రీడ్ రష్యాలో తన కాలంలో చాల ప్రముఖులైన బొల్షివిక్ నాయకులను చాల దగ్గరగా చూసాడు. ఒక రహస్య స్థావరంలో ఉండి పది రోజులు నిద్రాహారాలు మాని “Ten Days that shook the world” అనే గ్రంథాన్ని రచించాడు. దాని మీద ఆధారపడి తీసిన సినిమా ఇది.
ఈ చిత్రం ఫిబ్రవరి విప్లవం తర్వాత ఉప్పొంగుతున్న ఉత్సాహం, హర్షోద్వేగాల మధ్యన జార్ చక్రవర్తి అలెగ్జాండర్ III విగ్రహాన్ని పడదోసి తాత్కాలిక ప్రభుత్వాన్ని స్థాపించడంతో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మెన్షివిక్కుల మీద బోల్షివిక్కులు విజయం సాధించే వరకు ప్రజలూ, సైనికులు ఎదుర్కొన్న ఆనాటి ఆకలి బాధల్ని, దుర్భరమైన వేదనల్ని కళ్లకు కడుతుందీ చిత్రం.
పాత క్యాలెండర్ ప్రకారం 1917 ఏప్రిల్ 3వ తేదీన తానున్న రహస్య స్థావరం నుంచి లెనిన్ తన చుట్టూ గుమిగూడిన తన మద్దతుదారులతో ఫిన్లాండ్ రైల్వే స్టేషన్‍కు తిరిగి వస్తాడు. అతడు ఒక భారీ యంత్రం ముందు నిలబడి భారీ సమూహాలను ఉద్దేశించి ఉత్తేజకరంగా ప్రసంగిస్తాడు.
1917 జూలై 6 నాటికి బోల్షివిక్ పార్టీ ప్రధాన కార్యాలయం స్మోల్నీ భవనాన్ని పాలక పార్టీ నాశనం చేసి, పార్టీ ప్రభావ పత్రిక ‘ప్రావ్దా’ను నదిలోకి తోసి, లెనిన్‍ను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీచేస్తుంది. జూలై 6న అరెస్టయిన లెనిన్ భూగర్భం నుండి తిరుగుబాటు ప్రణాళికలను రచించడం కొనసాగిస్తుంటాడు. ఈ దృశ్యాలు ఒకవైపు చూపుతూ బయట ప్రేక్షకుల సన్నివేశ దృశ్యాలు, స్మోల్నీ భవనంలో బోల్షివిక్ పార్టీ సామూహిక సమావేశ దృశ్యాలు, వింటర్ ప్యాలెస్‍లో మంత్రివర్గ ప్రధాన కార్యలయంలో వారి సన్నివేశ దృశ్యాల మధ్య ఈ చిత్రం ముందుకు వెనుకకు ప్రసారమవుతుంది.
1917 అక్టోబర్ 10వ తేదీన బోల్షివిక్ కమిటీ సమావేశమవుతుంది. సభ్యులలో ట్రాట్‍స్కీ మొదలైన వారు విప్లవానికి సరియైన పరిపక్వ సమయం రాలేదని వాదిస్తారు. కానీ కామ్రేడ్ లెనిన్ తిరుగుబాటు నగారాకే సుముఖత చూపుతాడు. తర్జన భర్జనల తర్వాత కామ్రేడ్ లెనిన్ ప్రతిపాదననే కమిటీ అంగీకరిస్తుంది.
నాలుగు నెలల తర్వాత లెనిన్ రహస్య స్థావరం నుంచి అక్టోబర్ 24న స్మోల్నీ భవనానికి తిరిగి వస్తాడు. అక్టోబర్ 25 న తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్నామని ప్రజలకు ఒక సందేశం పంపిస్తాడు. అదే రోజు ప్రజలు పెద్ద ఎత్తున వింటన్ ప్యాలెస్ లాంజ్ వద్దకు చేరుకుంటారు. కార్మికులు వంతెనపై పూర్తి నియంత్రణ సాధించి, వంతెనలను తిరిగి పైకి ఎత్తి మెన్షివిక్కులను బందిస్తారు. నేవా నదిలోని అరోరా నౌక నుండి సంకేతం వచ్చిన వెంటనే హఠాత్తుగా ఒక ఇతిహాస క్లైమాక్సిక్ సీక్వెన్స్ లో వింటర్ ప్యాలెస్‍ను చుట్టుముడుతారు.
రాజ భవనంలో ప్రభుత్వ దళాలను, విలువైన ఆస్తులను వశపరచుకుంటారు. చివరకు, సోవియెట్లు తాత్కాలిక ప్రభుత్వ ఛాంబర్స్ తలుపులను దబ దబ బాది లోపలికి ప్రవేశించి ప్రభుత్వ సభ్యులను అరెస్టు చేస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గడియారాలు సోవియట్ విప్లవ విజయాన్ని సూచిస్తూ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి.
అక్టోబర్ 26న కొత్త ప్రభుత్వం ప్రజలు శాంతి, సామరస్యాలతో జీవించడానికి భూమి పంచాలనే ఆదేశాలు జారీచేస్తుంది.
“కథ ఇదే కానీ అడుగడుగునా లెనిన్ విప్లవ దిశానిర్దేశాన్నీ, ప్రతి సీన్‍ను అత్యద్భుతంగా దృశ్యీకరించిన విధానాన్నీ పీడిత ప్రజల్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ చూడాల్సిందే” – అని అంటుంది రచయిత్రి.
పీడిత ప్రజల్ని ప్రేమించేవారు – అన్నపుడు పీడిత ప్రజలు అణచివేత, దౌర్జన్యాలకు గురవుతున్న స్థితిగతులను అధిగమించడానికి, రూపుమాపడానికి వాళ్లు ఎంచుకున్న పోరాట మార్గాలను ప్రేమించడం – ప్రేమ అనేది ఒక భావన మాత్రమే కాదు ఆచరణ – ఐక్యత – ఇద్దరు వ్యక్తుల్లో ప్రేమ ఎన్ని ఆటంకాలయినా అధిగమించి వారి ఐక్య ఆచరణలో ప్రతిఫలించాలని ఎట్లా కోరుకుంటామో పీడిత ప్రజల పట్ల ప్రేమ అనేది కూడ వారి జీవితాలతో మమేకమై వారి పోరాటాలలో పాల్గొనడం ద్వారానే నిలిచి ఫలించగలగిన ప్రేమ అవుతుంది.
మౌలికంగా ప్రజలు శాంతి, సామరస్యాలతో ఎప్పుడు జీవించగలుగుతారనే శాస్త్రీయ అవగాహన – భూమి పంచాలనే ఆచరణతోనే సాధ్యమవుతుందని గుర్తించే ప్రభుత్వం మాత్రమే ప్రజా ప్రభుత్వం.
ప్రపంచ చరిత్రలో మొట్ట మొదటగా సోషలిస్టు రాజ్యం స్థాపించే అదృష్టం కలిగింది. అది ఒక కొత్త అధ్యాయానికి తెర తీసినందుకు గర్వపడే హక్కు మాకు దక్కింది అనే లెనిన్ వాక్యాలను ఉదహరిస్తూ ఈ సినిమా మొదలవుతుంది. అక్టోబర్ విప్లవం 10వ వార్షికోత్సవం సందర్భంగా 1927లో రెండు సినిమాలను ప్రదర్శించడానికి సోవియెట్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించింది. అందులో ఈ ‘అక్టోబర్ ఒకటి. ఈ ప్రాజెక్టుకు అధికారిగా సోవియెట్ ప్రభుత్వం ఐసెన్‍స్టీన్‍ను నియమించింది.
విప్లవ విజయం లభించిన సమయంలో రష్యా గత పాలన పీడన దోపిడీల వలన తీవ్ర క్షామ పరిస్థితులను, ఆకలి దారిద్య్రాలను అనుభవిస్తున్నది. అతి సామాన్యుని నుండి లెనిన్ వరకు అటువంటి గడ్డు పరిస్థితుల్లోనే తమ సమస్యల పరిష్కారంలో ప్రజలందరినీ సంలీనం చేసే శ్రామిక ఆచరణను ఎంతో నిరాడంబరంగా అమలుచేస్తారు.
ఈ దృశ్యాలను మెన్షివిక్కుల తాత్కాలిక ప్రభుత్వ విజయ సందర్భంలోని ఆడంబరాలు, విలాసాలతో పోల్చే మాంటేజ్‍లో చూపుతాడు ఐసెన్‍స్టీన్. అట్లే దేశం అనే భావన రాచరిక సైనిక పతకాలతో ముడిపడి ఉందని, దేవుడు, దేశం అనే భావనలను ప్రజలను అణగదొక్కి ఉంచుతూ విప్లవం గురించి ఆలోచించకుండా చేస్తున్నాయనే స్ఫూర్తిని కలిగిస్తాడు.
ఐసెన్‍స్టీన్ నిర్మించిన స్ట్రైక్, బ్యాటిల్ షిప్ పొటోమ్కిన్, అక్టోబర్ చిత్రాలను కలిపి ఐసెన్‍స్టీన్ ట్రయాలజీ అంటారు.
ఐసెన్‍స్టీన్ ఈ మూడు సినిమాల్లోను ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు గాను, ఒక యుద్ధనౌకలో సైనికులు, వాళ్ల పోరాటానికి మద్దతు తెలపడానికి వచ్చిన ప్రజలుగానూ అన్నిటినీ మించి వింటర్ ప్యాలెస్‍ను స్వాధీనంచేసుకుని విప్లవ విజయం ప్రకటించిన ప్రజలుగానూ ప్రజలే నాయకులు. ఐసెన్‍స్టీన్ ప్రధాన కథా నాయకులు శ్రామికులు, పేద ప్రజలు కానీ వీరులుగా గొప్ప సాధికారతనూ అన్నిటినీ మించి బలమైన పోరాట దృక్పథంతో ఉంటారు అంటూ శివలక్ష్మి ఒక పరిశీలన చేస్తుంది.
ప్రపంచంలోని అత్యద్భుతమైన సాహిత్యంలో గానీ, సినిమాల్లో గానీ పోరాడే ప్రజా సమూహాల్ని కథా నాయకులను చేయడం కనిపించదు. ఒక్క ఐసెన్‍స్టీన్ మాత్రమే ఆ పని చెయ్యగలిగాడు. ప్రముఖ నటీనటులెవరూ ఈ సినిమాలో నటించలేదు. నటీ నటులందరూ ప్రజలే. ఒక హీరో, హీరోయిన్లతో, దిగజారిన విలువలతో సినిమాలు తీస్తున్న దర్శకులకు ప్రపంచమంతా ఉన్న మనుషులు, కార్మికుల గాధలతో సహజంగా, వాస్తవికంగా తియ్యొచ్చనే ఒక సవాలును వందేళ్ల క్రితమే ఐసెన్‍స్టీన్ దర్శకులకు విసిరాడు.
ఈ మూడు అద్బుత ప్రజా విజయ సినిమాలతో పాటు ఆయన ప్రపంచానికి ‘ద ఫిల్మ్ అండ్ ది ఫిల్మ్ సైన్స్‘ అనే అద్భుతమైన గ్రంథాన్ని కూడ రచించి చూపాడు.
“ఒక చిత్రం ప్రజల మనుసుల్లో తిష్ఠవేయాలంటే ఆ చిత్ర దర్శకుడు రచయిత, సామాజిక శాస్త్రవేత్త, కళాకారుడు కూడా అయ్యుండాలి. విప్లవం నాకు అమూల్యమైన వరాలిచ్చింది. నన్నొక రచయితగా, కళాకారుడుగా తీర్చిదిద్దింది.” అన్న ఐసెన్‍స్టీన్ ప్రజలు సాధించిన గుణాత్మక విజయాలను చిత్రించాడు.
సామ్యవాద వాస్తవికత ప్రజల ఓటమిలో గర్భితమై ఉన్న విజయాన్ని హామీపడుతుంది. రూపానికీ సారానికి ఉన్న వైరుధ్యాన్ని పరిష్కరిస్తుంది. అంతరాలను తొలగిస్తుంది. భూమి పంచాలనే ఆదేశాలను బోల్షివిక్ ప్రభుత్వం జారీచేసిందంటే అవి అమలవుతాయి అని అర్థం.
ఈ సినిమాలకు ఇవ్వాళ సంబద్ధత ఏమంటే మళ్లీ మూడో ప్రపంచ యుద్ధ వాతావరణంలో యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చిన విప్లవం (1917) ఫాసిస్టు యుద్ధాన్ని సామ్యావాద శక్తుల, ప్రజాస్వామ్య శక్తుల విజయాన్ని సాధించి ఫాసిజాన్ని మట్టి కరిపించిన సోవియట్ ప్రభుత్వ నాయకత్వం సోవియెట్ రష్యా ప్రజల త్యాగాలు, శివలక్ష్మి 1942లో రష్యన్ రెడ్ ఆర్మీ మహిళా కామ్రేడ్లు ఇటువంటి విజయం కోసం చేసిన త్యాగాలను ‘ది డాన్స్ హియర్ ఆర్ క్వయట్’ చిత్ర పరిచయంలో చెప్పింది.
జాతులకు విడిపోయే హక్కును హామీ పడుతూ విప్లవం ద్వారా యు ఎస్ ఎస్ ఆర్ లో ఐక్యం చేసింది. ఆ ఐక్యత 1953 దాకా సుస్థిరంగా కొనసాగి 1956 నుంచి బీటలు వారుతూ 1991 నుంచి వేర్పాట్లకు, ఉక్రెయిన్‍పై దాడి ద్వారా రష్యన్ జాతీయోన్మాదానికి దారితీసింది. రెండు సామ్రాజ్యవాదాలు (నాటో సామ్రాజ్యవాదం. రష్యా చైనా సామ్రాజ్యవాదం) యుద్దోన్మాదానికి ప్రత్యేకించి ఉక్రెయిన్, రష్యన్‍లే గాక, మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తున్నది. మనదేశంలోనూ బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం జాతీయోన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. ఈ తరుణంలో 105 సంవత్సరాల క్రితం బోల్షివిక్ విప్లవ విజయాన్ని, సామ్యవాద వాస్తవికతను ఉత్తేజంగా చిత్రించిన ఐసెన్‍స్టీన్ సినిమాలకు ఎప్పటికన్నా ప్రాచుర్యం ఉంటుంది.