రచయితొకడు వో చిన్న చేపని పట్టుకున్నాడు.
“నన్ను మళ్ళీ నీళ్ళలో వదిలేయ్. ఒడ్డు మీద చేపలు బతకవు. పైగా నేను చాలా చిన్నదాన్ని. నన్ను వదిలిపెడితే గనుక పెద్ద దాన్ని అవుతాను. అప్పుడు నీకు లాభం” అంది చిన్న చేప.
“నేను టాల్ స్టాయ్ కథ చదివాను” అంటూ రచయిత నవ్వాడు.
“ఓ అలాగా?” అని చిన్న చేప దీర్ఘంగా నిట్టూర్చింది.
“వలలో చిక్కిన చిన్నచేప నీళ్ళల్లో వున్న పెద్దచేపంత విలువ’ అనిచెప్పి కథని మార్చకపోవడం మీ తెలివితక్కువతనం” అని కూడా అంది.
‘మీ’ అన్నమాటతో రచయితకు సవాల్ విసిరినట్టయింది.
“నువ్వన్నది నిజమే, కాని చిన్న చేపవయి వుండి కూడా లాభనష్టాలు మాట్లాడినందుకే బెస్తవాడు నిన్ను వదిలిపెట్టలేదు” రచయిత మాట బెస్తవాన్నిసమర్ధించినట్టు కన్నా రచయితలని సమర్ధిస్తున్నట్టుగానే వుంది.
“చేప మనిషిగా మాట్లాడగా లేనిది, లాభనష్టాలు మాట్లాడడం నేరమా?” అంది చిన్న చేప.
“మరి నువ్వు రచయితవి అయితే యెలాంటి ముగింపు యిచ్చేదానివి?” రచయిత అడిగాడు.
“నేను రచయితనే అయితే చిన్న చేపని వదిలిపెట్టి బెస్తవాడు దయాగుణం చూపించినట్టు కథ ముగించేదాన్ని” అంది చిన్న చేప.
“ఓ నీలోనూ రచయిత వున్నాడే?” నవ్వాడు రచయిత.
“అలా అయితే నీ కథ మార్చి చెప్పు” అని కూడా అన్నాడు.
“చెప్తే వొదిలేస్తావా?” చేప ఆశగా అడిగింది.
“ఏమో? చేపలు యెగరావచ్చేమో?” రచయిత నవ్వాడు.
“ఎగరాలంటే రెక్కలే వుండనవసరం లేదు, కొంగ యెత్తుకు పోతే చాలు” నవ్వింది చిన్న చేప.
“నీకు భయం లేదా?” అడిగాడు రచయిత.
“భయం లేనిదెవరికి?” చేప మాట “నీకు లేదా?” అన్నట్టుగా ధ్వనించింది రచయితకి.
“సరే, నీ కథని మరోలా నడిపించు” అన్నాడు రచయిత.
“చిన్నచేపని వండి తిన్నా వొక పంటి కిందకే రాదు, అందుకని వండిన వరకే కాదు, పండిన వరకూ ఆగాలని చేపని మళ్ళీ నీళ్ళల్లో వొదిలేశాడు” చెప్పింది చేప.
“నీ కథ బాగుంది, కాని నిన్ను వదిలేయడం కాకుండా వేరే ముగింపు చెప్పు” రచయత చేపని అడిగాడు.
“చేపని నీళ్ళలో వొదిలేస్తే యేమి? చేప పెద్దదయితే యేమి?” అడిగింది చేప.
“చిన్న చేప ఆరోగ్యానికి మంచిది” నవ్వాడు రచయిత.
“మా చేపలు మీలా భారీగా వొబెసిటీగా పెరగడానికి కూడా కారణం మీరే, పెద్దగా పెంచిందీ మీరే. చిన్నవి మంచివి అన్నదీ మీరే” చేప మొహమాట పడలేదు.
“చిన్న చేపకు పెద్ద మాటలు” చేప కళ్ళలోకి చూశాడు రచయిత.
“నేనే పేద్ద చేపనయితే తిమింగలం అంత చేపనయితే నువ్విన్ని మాట్లాడేవాడివా?” చేప ప్రశ్నకు రచయిత దగ్గర వెంటనే సమాధానం లేనట్టు మూగగా వుండిపోయాడు.
“మీ మనుషుల్లో బలవంతులపట్లా బలహీనులపట్లా వొకేలా వుంటారా?” చేపకళ్ళు ప్రశ్నలయాయి.
రచయిత యెందుకో సిగ్గు పడ్డట్టు తలదించుకున్నాడు.
“అలా యేపుగా దుబ్బుగా పెరిగిన చేప మీద కళ్ళుపడి యే అర్ధరాత్రో దొంగలు యెత్తుకుపోతే?” యీ ముగింపు యెలా వుందనట్టు చూశాడు రచయిత.
“ఆ దొంగెదవ తింటే పరవాలేదు, అమ్ముకు చస్తాడు కదా?, చూడగానే యెంతకు అమ్మొచ్చు అనేగాని, యెన్ని పూటలు తినొచ్చు అని మాట్లాడలేదు” యెన్నో దఫాలు విన్న విషయమే చిన్న చేప చెప్పింది.
“నేనో కొత్త ముగింపు చెప్తాను” అన్నాడు రచయిత.
చేప చెప్పమన్నట్టు తోక ఆడించింది.
“నువ్వు చెప్పినట్టుగానే చిన్న చేపని దయతలచి వదిలేస్తే అది కొంచెం కొంచెం పెద్దదవుతూ వుంది. కాని చెరువులో కొంచెం కొంచెం నీరు యెండిపోతూ వుంది. ఆ చేప పూర్తిగా పెరిగి పెద్దదయింది. కాని చెరువులోని నీళ్ళు యెండిపోయాయి. చేప చచ్చిపోయింది” రచయత చెపుతూ యెలా వుందన్నట్టు చూశాడు.
చిన్న చేప యేమీ మాట్లాడలేదు. కాని దాని కళ్ళు తడిచాయి. రెండు చుక్కలు రాలాయి.
“ఎవరైనా చనిపోతారుగా? పుట్టుకవుందీ అంటే చావు వుందీ అని కదా? మరి నీకెందుకు అంత దుఃఖం?” రచయిత అడిగాడు.
తల అడ్డంగా వూపుతూ “సహజమైన చావు గురించి కాదు. అర్థం లేని చావు గురించి నా బాధ. నేను పచ్చిగా వున్నప్పుడే యే కొంగ కంట పడినా బాగుండును. దాని కడుపు నిండును. లేదంటే యెండి చీమల కడుపయినా నిండినా బావున్న” చేప కళ్ళు యేవో ఆలోచిస్తూ యెటో చూస్తున్నాయి!
రచయితకు తన సృజనలోని నిరక్షరాస్యత బోధ పడింది.
అరచేతుల్లోని చేపని అలాగే తీసుకువెళ్ళి నీళ్ళల్లో దోసిలి వదిలాడు.
చేప తోక ఆడిస్తూ రచయిత వంక చూసింది. బుడుక్కున మునిగి వుత్సాహంగా నీటిమీద తేలింది.
చేప స్థానంలో వొక బోధి చెట్టు రచయితకు దర్శనమిచ్చింది.
(టాల్ స్టాయ్ కి కృతజ్ఞలతో)
Chaala baagundhi