యుద్ధభూమిలోనిలబడి..

ఆదివాసీని అడవినుంచి తొలగించడమే అభివృద్ధి అని దేశ పాలకుల నమ్మకం. పాలసీ. దాని ఆచరణకు అనేక పథకాలు. వ్యూహాలు. కుట్రలు. కుతంత్రాలు. దానభేదదండోపాయాలు. వ్యతిరేక ప్రచారాలు. అనేక హింసా ప్రయోగాలు. చివరికి రాజ్యం తన పౌరుల మీద  రాజ్యాంగం సాక్షిగా వైమానిక దాడులకు సైతం తెగబడుతోంది. దానికి ఆమోదాన్ని పొందడానికి అసత్యాల్ని సత్యాలుగా అలవాటు చేస్తుంది. ఇప్పుడు యిక్కడి ఆదివాసీ చరిత్ర  మొత్తం  రక్తసిక్తం. మోసపూరితం. దగాభరితం.  ముందూ వెనకా కిందా మీదా అంతటా దగా. పాలకులే హంతకులు. ప్రభుత్వమే కుట్రదారు.  పార్లమెంటరీ వ్యవస్థలన్నీ కలిసి కూడబలుక్కుని సామాజిక సంపదని కార్పోరేట్ కబంధుడికి దోచిపెట్టే దళారీలే. ఈ దుర్మార్గపు కుట్రలో దేశ ఆదివాసీలు తమ సంస్కృతిని కోల్పోయారు. ఆటా పాటా మాటా కోల్పోయారు. సంచిత అనుభవ జ్ఞానాన్ని కోల్పోయారు. కాలి కింద నేలను కోల్పోయారు. నేల కింది ఖనిజాన్ని కోల్పోయారు. సర్వస్వాన్నీ కోల్పోయినా తమ హక్కులకోసం రాపాడుతూనే వున్నారు. సమస్త శక్తులు కూడగట్టుకుని మనుగడ కోసం పోరాడుతూనే వున్నారు. వారి  పోరాటం స్వీయ అస్తిత్వం కోసమో అటవీ పరిరక్షణ కోసమో మాత్రమే కాదు; మొత్తం దేశ ప్రజల భవిష్యత్తు కోసం. భద్రత కోసం. విముక్తి కోసం.  జల్ జమీన్ జంగిల్ ఇజ్జత్ నినాదం పరమార్థం అదే.  

ఈ నేపథ్యం నుంచి పుట్టిన మల్లిపురం జగదీశ్ ‘అడవి పూల దారిలో..’ కథనాలు   కేవలం అతని స్వీయ జీవిత అనుభవాల నుంచి, జ్ఞాపకాల నుంచి రూపొందిన సొంత వూరి ముచ్చట్లు కాదు. కడుపు చీల్చుకొని వచ్చే అతని మాట అడవితల్లి వుమ్మనీట పుట్టిన వుమ్మడి పాట. అతని శ్వాస యీ దేశపు ఆదివాసీ గుండె గోస. అతని వాక్యం యుద్ధక్షేత్రంలో క్షతగాత్రులైన అడవి బిడ్డల  ఆర్తనాదం.  అది గుండెలు పిక్కటిల్లేలా అతని  గొంతులో ప్రతిధ్వనిస్తుంది.

ఫేస్ బుక్ కవిసమ్మేళనం గ్రూప్ లో జగదీశ్ మన్నెం ముచ్చట్లు రాస్తున్నప్పుడు దాదాపు ప్రతివారం రాసిందాని గురించి, యింకా రాయాల్సినవాటి గురించి యెంతో విపులంగా చర్చించుకునేవాళ్ళం. ముఖ్యంగా అతను నడిచొచ్చిన అడవిదారిలో కొండమీద జరుగుతున్న ఆర్థిక సామాజిక సాంస్కృతిక పరిణామాల గురించి, వాటికి మూల కారణమైన దేశ రాజకీయాల గురించీ. మన్నెం ముచ్చట్లు దేశ ఆదివాసీ వర్తమాన చరిత్ర. వర్తమానం గతంతో కంటే వర్తమానంతోనే  చేస్తున్న సంభాషణ. ఈ సంభాషణలో యుద్ధభూమిలో నిలబడి ఆదివాసీ సంధిస్తున్న అనేక ప్రశ్నలున్నాయి. ఒకచేతిలో మతగ్రంథాలు మరోచేతిలో తుపాకీ పట్టుకొచ్చి సమస్తం దోచుకుపోయే మతప్రవక్తలపై యెక్కుపెట్టిన ‘శిలకోల’లున్నాయి. బొడ్లో బాకులు దోపుకుని సహపంక్తి భోజనాలకు సిద్ధమయ్యే రాజకీయ శకారుల నయవంచనపై ‘గురి’ పెట్టిన విమర్శనాస్త్రాలున్నాయి. ప్రత్యేక రక్షణ దళాల పేరుతో State sponsored గుండాలు నిర్వహించే శాంతి యాత్రా దురాగతాల మధ్య,  జేబులో సంక్షేమ పథకాలు మోసుకొచ్చి అరచేతి వైకుంఠం చూపి బండ్లతో కొండఫలం యెత్తుకుపోయే అధికారుల కల్లబొల్లి మాటల మధ్య,  ఇప్పచెట్ల  నీడల్లో మంచమ్మీద కూర్చొని నేస్తరికానికి గుర్తుగా యిచ్చిన మామిడితాండ్ర తింటూ గిరిజన జీవితంపై  అకడమిషియన్లు చేసే పరిశోధనల మధ్య, మూలవాసిని వనవాసిగా మార్చి సాంస్కృతిక అస్తిత్వాన్ని హరించే కళ్యాణ యోజకుల కపటాల మధ్య, డబ్బు సంచులతో  కలల్ని కొనే బేహారీ ఎన్జీవోల వుద్ధరింపుల మధ్య … దేశ ప్రథమ పౌరురాలి సాక్షిగా అడవి తల్లులు సేకరించిన యిప్పపూల కుప్పల్లోకి చొచ్చిన మల్టీ నేషనల్ కంపెనీ పురుగుల గురించీ  జీలుగు కల్లు ముంతల్లోకి రాజ్యం వొంపిన విషబిందువుల గురించీ బయటి సమాజం యింకా తెలుసుకోవాల్సిన అంశాలెన్నో వున్నాయి.

ప్రతి ఆదివాసీ సమాజానికీ వారికే ప్రత్యేకమైన సామాజిక సాంస్కృతిక రాజకీయ జ్ఞాన వ్యవస్థలుంటాయి. సాధారణంగా వాటిలోకి బయటి వ్యక్తుల ప్రమేయాన్ని వారు యిష్టపడరు. వారి యిష్టానికి భిన్నంగా అందులోకి యెవరైనా ప్రవేశిస్తే సహించరు. ప్రతిఘటిస్తారు. అప్పుడు ఆ సముదాయాలు తెలియని కుదుపుకు గురౌతాయి. అదే రాజ్యం చొరబడితే ఆదివాసీ బతుకు ఛిన్నాభిన్నమౌతుంది. అది రాముడైనా భీముడైనా నరేంద్రుడైనా నారసింహుడైనా చంద్రుడైనా దేవేంద్రుడైనా  .. అడవికి పరాయీనే. పరాయి  నీడ పడిన ప్రతిసారీ  అడవి ఆగమైంది. అల్లకల్లోలమైంది. అడవి కడుపులో చిచ్చు రేపిన వర్తమాన రాజకీయ ఆర్థిక ప్రమేయమే జగదీశ్ రచనకి వస్తువైంది. అడవినీ ఆదివాసీనీ కబళించే దృశ్యాదృశ్య  శక్తుల్ని అతను గుర్తించాడు. బయటినుంచీ వస్తున్న ప్రమాదాల్ని పసిగట్టాడు. పరాయీకరణ జూదంలో తన అన్నదమ్ములు పాచికలు కాకూడదని హెచ్చరిస్తున్నాడు. సామూహిక చేతనకి దూరమైతే జరిగే కీడు గురించి పెనుకేకలు పెట్టి తన జాతిని అప్రమత్తం చేస్తున్నాడు.  తన జీవితానుభవం ద్వారా తాను  గ్రహించిన నిజాల్ని సృజనాత్మకంగా యెలుగెత్తి వినిపిస్తున్నాడు.   ఈ స్వరం ముందు ముందు ప్రత్యామ్నాయ రాజకీయ ఆచరణకు దోహదం చేయాలి. సామూహిక చేతనకు దారులు పరవాలి.

మన్నెం ముచ్చట్లలో కనిపించే ప్రధాన పాత్ర తుఫాన్ వలసపోయిన తన చిన్ననాటి నేస్తం  అని రచయిత చెప్పాడు. నిజానికి తుఫాన్  జగదీశ్ ఆల్టర్ ఇగో. అతను అడవినుంచి వలసపోలేదు. అడవినుంచి తొలగింపబడ్డాడు. అడవికి అతను దూరమయ్యాడు గానీ అడవి అతని నుంచి దూరం కాలేదు. అతని ఆత్మ అడవిలో చెట్టు  చిటారు కొమ్మలకు వేలాడుతూ భారత యుద్ధంలో బర్బరీకుడిలా అంతా గమనిస్తూనే వుంటుంది. ప్రతి పిట్ట గొంతులోనూ అది ప్రతిధ్వనిస్తూనే వుంటుంది. జరుగుతోన్న విధ్వంసాన్ని ప్రశ్నిస్తూనే వుంటుంది. తమ మూలాల నుంచి దూరమయ్యే ఆత్మీయుల్ని జాగరూకుల్ని చేస్తూనే వుంటుంది. అందుకే యీ ముచ్చట్లు వొక అపరాధ భావనతో జగదీశ్ తనతో తాను చెప్పుకునే స్వగతాలు. తన లోపలికి తాను విమర్శనాత్మకంగా చూసుకునే తీక్షణ వీక్షణలు.  అంతరంగపు లోతుల నుంచి తవ్వి తీసిన ఆర్ద్ర ఆవిష్కరణలు. అందుకే యీ ముచ్చట్ల శైలి వుద్వేగంతో మిళితమై వుంటుంది. అచ్చమైన స్థానీయమైన శ్రీకాకుళం భాషలో  చైతన్య స్రవంతిలో యీదులాడే  పలవరింతలా వుంటుంది.  అడవిలోపల కొండవాలున ప్రవహించే గెడ్డ గట్టున నిద్రా మెలకువా  తెలీని స్థితిలో కంటున్న కలలోని కలవరింతలా వుంటుంది. అంతా కలిపి ఆశువుగా కయికట్టిన వొక అందమైన దీర్ఘ కవితలా వుంటుంది.  

అడవి బిడ్డలు నడిచే అడవి దారి అంతా  కంటకావృతం. అది పూల దారి కావాలని రచయిత ఆశయం. ఒక సామూహిక స్వప్నం అతణ్ణి ఆ దారిలో నడిపిస్తుంది. కలిసి నడుద్దామా? కాళ్ళూ నోళ్ళూ కట్టేసుకుని భద్రలోకపు భవంతుల్లో మౌనంగా విశ్రమిద్దామా? తేల్చుకోవాల్సిన సందర్భం యిది.

ఇన్నాళ్లుగా యే గిరాంమూర్తో హెమాన్డార్ఫో వెన్నెలకంటో బాలగోపాలో ఆదివాసీ భాషల పట్ల సంస్కరణల పట్ల విప్లవ ఆచరణ పట్ల సానుభూతితోనో సహానుభూతితోనో  చేసిన అధ్యయనం కాదిది. అడవి పొత్తిళ్ళలో పుట్టి పెరిగిన అడవి బిడ్డడు తన జాతి జీవన సౌందర్య సంక్షోభాల గురించి తొలిసారిగా అందిస్తోన్న  సజీవ కథనాలివి. ఆదివాసీ జీవన భాష్యాలివి. ప ర్ స్పె క్టి వ్స్ ప్రచురణగా యీ  ముచ్చట్లని యిలా మీ ముందుకు తేవడానికి సహకరించిన రచయితకూ సాంకేతిక సహకారం అందించిన మిత్రులకూ మప్పిదాలతో …  

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

One thought on “యుద్ధభూమిలోనిలబడి..

  1. ప్రేమతోను ఆసక్తితోను రాసిన ముందుమాట ..రచయితను ఆ సమాజాన్ని అర్దం చేసుకున్న ముందుమాట ..రచయిత జగదీశ్ కు, ప్రభాకర్ గార్లకు అ అభినందనలు

    ముకుంద రామారావు..

Leave a Reply