యాభై ఏండ్ల విరసంతో ఒక ఆత్మీయ సంభాషణ – 1

విప్లవ రచయితల సంఘం 50 ఏళ్ళ సందర్భంలో సంస్థ కార్యదర్శి పాణి, కార్యవర్గ సభ్యురాలు వరలక్ష్మితో మాట కలిపాను. ఈ సంభాషణ ఎన్నో జ్ఞాపకాలను తడిమి, ఎన్నో ఆలోచనలను రేకెత్తించింది. విరసంతో నాది ఇరవై సంవత్సరాల స్నేహం. తన 50 ఏళ్ళకాలాన్ని విరసం తరచి చూసుకుంటున్నట్టే నన్ను నేను తరచి చూసుకుని, నేనేమిటి? నేనెక్కడ? అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకోడానికి ఈ సంభాషణ ఉపయోగపడింది. ప్రొద్దుటూరు ముస్లింల ఇరుకు గల్లీల నుండి విశాలమైన ప్రజారాశులు నడిచే విస్తారమైన ప్రజాపోరాటాల చరిత్ర వైపు నడవడానికి ఈ స్నేహం కారణమైందంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నేను ప్రతి దు:ఖితుడి వైపు సానుభూతిగా చూడడానికి అవసరమైన చూపు, రాయడానికి అవసరమైన భాష, ఈ నడకలోనే నాకు అబ్బింది. నా చూపు నాది కాదు. నా భాష నాది కాదు. అది సమస్త శ్రామిక జనాలు ఇచ్చిన కానుక అనే ఎరుక నాకు అబ్బింది. ఈ నేపథ్యం వెనుక ఉన్న జ్ఞాపకాలను తడుముకునే అవసరాన్ని మా సమావేశం ఇచ్చింది. నేను రూపొందుతున్న తొలి రోజులను గుర్తు చేసుకుంటూ ఈ ఇద్దరితో నా సంభాషణ మొదలు పెట్టాను. దీనికి ఆరంభంలో పాణి వేసిన ప్రశ్న ఉపయోగపడింది.

పాణి: విరసం యాభై ఏళ్ల సందర్భంలో మీ ప్రయాణం గురించి ఏమనుకుంటున్నారు?

మహమూద్‌: మీరు పరిచయమైన కాలం, పివి నరసంహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకరణల కాలం ఒకటే. అదే సమయంలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది. ఈ చారిత్రక పరిస్థితులు మన కలయికకు కారణమయ్యాయా? అనే ప్రశ్న ఇప్పుడు నాకు తలపుకొస్తోంది. మీకు ప్రొద్దుటూరులో మిత్రజ్యోతి సంస్థతో సంబంధం ఏర్పడడం యాధృచ్చికమని నేను అనుకోను. ఆ సమయంలో ‘మిత్రజ్యోతి సాహితీ సాంస్కృతిక సంస్థ’ కొన్నైన మంచి సాహిత్య కార్యక్రమాలు చేయడం, ఆ సంస్థలో ఒకరిద్దరు రచయితలు, కవులు ఉండడం మిమ్మల్ని ఆకర్షించి ఉంటుందని నా అభిప్రాయం. అప్పుడు, మీరూ శ్రీనివాసమూర్తి గారు ప్రొద్దుటూరు వచ్చారు. ఈ నేపథ్యంలో విరసం ఇతర లైక్‌ మైండెడ్‌ సంస్థలతో ఎంత ప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందో సాహిత్య సాంస్కృతిక ఆచరణతో సమాజాన్ని ప్రోగ్రెస్‌ వైపు తీసుకెళ్ళడంలో సంస్థలు ఎటువంటి పాత్ర నిర్వహించగలవో ప్రత్యక్షంగా నాకూ, మా సంస్థకూ అనిపించడం ప్రారంభమైంది. విరసంతో పోల్చుకున్నపుడు మిత్రజ్యోతి స్థాయి చిన్నదైనప్పటికీ మా సంస్థ గౌరవ మర్యాదలను గుర్తించడం, ప్రొద్దుటూరు లాంటి చిన్న పట్టణంలో ఓ సాహితీ సాంస్కృతిక సంస్థకున్న పరిమితులూ, పరిధిని గుర్తించి దానికి తగ్గట్టు ప్రవర్తించడం మమ్మల్ని అమితంగా ఆకర్షించింది.

అందుకే మెల్లగా మిత్రజ్యోతి విరసం ఆలోచనలతో రాజకీయ ఆచరణతో ఏకాభిప్రాయం నిర్మించుకుంది. విరసం ఆ సమయంలోనే ప్రొద్దుటూరు కేంద్రంగా కడప కమిటిని ఏర్పాటు చేసింది. అప్పట్నించి ఇప్పటి దాకా విరసం కార్యక్రమాలన్నింటిలో మేము చేదోడువాదోడుగా నిలిచాం. ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. 2001లో ప్రొద్దుటూరులో జరిగిన విరసం సాహిత్య పాఠశాల ఈ బంధాన్ని మరింత బలపడేలా చేసింది. మాకు, విరసానికి ఏమి తేడా లేదన్నంతగా ఆ కార్యక్రమంలో మిత్రజ్యోతి పాల్గొంది. అంతకు ముందు 1996 -97 లో అనుకుంటా – వి.వి సర్‌ ప్రొద్దుటూరు విరసం సభలో వక్తగా పాల్గొన్నారు. అది మిత్రజ్యోతి సంస్థ సభ్యులకు ముఖ్యంగా నాకూ, మిత్రజ్యోతి వ్యవస్థాపక సభ్యుడు బాషాకు రాజకీయ అవగాహనపరంగా మలుపు అని చెప్పవచ్చు. వి.వి. సర్‌ను నేను, పెన్నేరు ఎడిటర్‌ వనం శర్మ (అపుడు ఎంవిఆర్‌ లోకల్‌ ఛానల్లో పనిచేసేవాడు) ఇంటర్వ్యూ కూడా చేశాం. మాకు క్లాస్‌ అవుట్‌లుక్‌ రావడానికి ఆ సందర్భం భూమికగా అనుకోవచ్చు.

అప్పటికే మాకు ఇతర సాహితీ సంస్థలతో, ఉద్యమాలతో, సాహితీకారులతో సంబంధాలున్నా దృక్పథం విషయంలో చాలా అనుమానాలుండేవి. వామపక్ష భావాలతో సంబంధం ఉన్నా అసలు వామపక్షం ఏది అన్న మీమాంస ఉండేది. బహుశా మేము వెతుకుతున్నదీ సవాలక్ష గందరగోళాలకు పరిష్కారంగా -విరసం భావజాలంలోని స్పష్టత మాకు అక్కరకొచ్చింది. విరసం సభ్యుల్లోని సాధారణత్వం కూడా ఆశ్చర్యపరిచేది. ఇది 2001 సాహిత్య పాఠశాలలో ఇంకా స్పష్టంగా వ్యక్తమైంది. చెంచయ్య సర్‌, కృష్ణబాయి మేడం, వేణుగోపాల్‌ సర్‌, కళ్యాణరావు సర్‌ లాంటి సీనియర్‌ రచయితలను దగ్గరగా చూసే, వినే, నేర్చుకునే అవకాశం దొరికింది. లిబరల్‌ డెమొక్రట్స్‌మి అయిన మేము క్లియర్‌కట్‌ క్లాస్‌ అవుట్‌లుక్‌లోకి మారడానికి విరసం మాకు సహకరించింది. అప్పట్నుంచీ మిత్రజ్యోతి రచయితల రచనలపై, పనిచేసేతీరుపై విరసం ప్రభావం స్పష్టంగా పడింది. మిత్రజ్యోతి తర్వాత్తర్వాత కాలపరీక్షలను ఎంత ఎదుర్కొంది అనేది వేరే అంశం. విరసంతో మిత్రజ్యోతి సంబంధాలు బలపడుతున్నపుడు సంస్థలోపల జరిగిన సంవాదం – ‘విరసం ఒక విప్లవ సంస్థ, మిత్రజ్యోతి ఒక సాధారణ సాహిత్య సంస్థ, ఈ సంస్థకు చాలా లిమిటేషన్స్‌ ఉన్నాయి’ అని చాలా మంది సభ్యులు అభ్యంతరపెట్టారు. సంస్థకు ఎటువంటి రాజకీయ వాసన తగలకూడదు అని నమ్మే వాళ్లు మిత్రజ్యోతిని వదిలి వెళ్ళిపోయారు. వెయ్యి ఆలోచనలు సంఘర్షించుకున్న తర్వాత మిత్రజ్యోతి ఒక పువ్వుగానైనా తన అస్తిత్వాన్ని నిలుపుకోగలిగింది. ఇది మిగిలిన సభ్యులు అభివృద్ధికర పరిణామంగానే భావించారు. తక్కువ సభ్యులతోనే మిత్రజ్యోతి ఒక క్వాలిటీ సంస్థగా నిలదొక్కుకుంది. తర్వాతి కాలంలో మిత్రజ్యోతి ఇనాక్టివ్‌గా మారిపోయినా దాని ప్రభావం ప్రొద్దుటూరు పట్టణంలో ఇంకా ఉందనే నా అభిప్రాయం. క్లాస్‌ ఓరియంటేషన్‌, సాంస్కృతికంగా ఒక వాతావరణం ప్రొద్దుటూరుకు కలగడానికి విరసం, మిత్రజ్యోతి కారణమయ్యాయని చెప్పొచ్చు. మిత్రజ్యోతి రచనలపై కానీ కార్యక్రమాలపై కానీ ఆ ఛాయలు బలంగా కనపడతాయి – నేను ఒక కవిగా నిలబడడానికి ఇది కూడా కారణమే.

విరసం పుట్టి యాభై వసంతాలు దాటి తనను తాను పున:సమీక్షించుకుంటున్నపుడు, ఈ మీ ప్రయాణంలో ఎంతో కొంత దూరం మిత్రజ్యోతి లేదా వ్యక్తిగతంగా మహమూద్‌ అనే కవి ప్రయాణించాం కాబట్టి ఈ ప్రయాణంలోని లోటుపాట్లను చూసుకోవాలనిపిస్తుంది. విరసం ప్రయాణం ఎలా సాగుతున్నది? ఇందులో బలాబలాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలతోపాటు ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మన ముందుకు వస్తున్న సవాళ్ళకు సమాధానాలు వెతికి తిరిగి సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మనదే.

***

మహమూద్‌: విరసం పుట్టుకకు కారణమైన అనేక పరిణామాలతో పాటు తెలుగు సమాజ చరిత్రలో మేలుమలుపుగా కొనియాడదగిన విప్లవ విద్యార్థులు శ్రీశ్రీ షష్టిపూర్తి సభలో పంచిన ‘రచయితలారా మీరెటువైపు’ కరపత్రాలు చూపిన ప్రభావం, అక్కడి నుంచి మొదలైన ప్రయాణం ఇపుడు 2014 తర్వాత మారిన దేశ రాజకీయ చిత్రపటం నుంచి విరసం నేర్చుకున్న – గుణపాఠాలూ, సాగించిన ప్రగతి ఏమిటి? విరసం అవిర్భావానికి చోదకశక్తులుగా పనిచేసిన అప్పటి రాజనీయ పరిణామాలు ఏమిటి? వీటిని మీరు ఎలా విశ్లేషిస్తారు?

పాణి: విరసం ఆవిర్భావానికి కేవలం దేశ రాజకీయాలే గాకుండా, ఆనాడు ముందుకు తోసుకొనివచ్చిన అంతర్జాతీయ రాజకీయాల పరిణామాలు కూడా కారణం. సోవియట్‌ యూనియన్‌ సోషల్‌ సామ్రాజ్యవాద పంథా తీసుకోవడం, దానికి వ్యతిరేకంగా చైనా విప్లవశక్తులు గ్రేట్‌డిబేట్‌ నిర్వహించడం, చైనా కమ్యూనిస్టు పార్టీ లోపల కూడా రివిజనిస్టు శుక్తులను ఎదుర్కొని ఒక మహత్తర సాంస్కృతిక విప్లవం నిర్మించడం ఇలాంటి అంతర్జాతీయ నేపథ్యం భారతదేశంలో నక్సల్బరీ ఉద్యమ రూపకల్పనకు దోహదం చేసింది. విరసం ఒక సాహిత్య సంస్థగానే కాకుండా రాజకీయ దృక్పథాన్ని ఏర్పరచుకోడానికి, నక్సల్బరీ సాంస్కృతిక శక్తిగా రూపొందడానికి దేశ రాజకీయాలు, అంతర్జాతీయ విప్లవ వాతావరణం కారణం. ముఖ్యంగా చైనా సాంస్కృతిక విప్లవం ప్రపంచ కార్మికవర్గం మీద వర్గపోరాట ప్రభావాన్ని వేసింది. అన్నిటినీ ప్రశ్నించు, ఏటికి ఎదురీదు, నిలువనీటి సంస్కృతిని ధ్వంసం చేయమనే సందేశం అందులో ఉంది. ముఖ్యంగా రివిజనిజం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కోవాలనే స్ఫూర్తిని ఇచ్చింది. ఇది కేవలం రాజకీయాల్లోనే కాదు, తాత్విక, సిద్ధాంత, సాంస్కృతిక రంగాలన్నిట్లో వర్గపోరాటాన్ని తీసుకొచ్చింది. ఇది ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకోవడం మానవులకు సాధ్యమే అనే భరోసా.

ఇలాంటి అంతర్జతీయ రాజకీయ, తాత్విక సన్నివేశం అది. ఇదంతా నక్సల్బరీ ఉద్యమానికి నేపథ్యం. నక్సల్బరీకి మన దేశంలో అధికార మార్పిడి తర్వాత జరిగిన పరిణామాలు అంతరంగిక కారణం. వలసానంతరం అధికారంలోకి వచ్చిన శక్తులు కొత్త దోపిడీ వ్యవస్థను నిర్మించే పనిలో ముమ్మరమయ్యాయి. అందువల్ల దోపిడీ పెరిగిపోయింది. పేదరికం, నిరుద్యోగం, అసమానతలు తారాస్థాయికి చేరాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత కమ్యూనిస్టుపార్టీ ఎన్నికల మార్గంలో భ్రష్టుపట్టిపోయింది. పోరాటశక్తులు అడుగంటిపోయాయి. దేశకార్మికవర్గం రివిజనిస్టు సంకెళ్లలో బందీ అయింది. భారత పాలక వర్గాల చేతుల్లో ఈ డెమెక్రసీ ఒక బూర్జువా డెమోక్రసీ అని, నియంతృత్వమని నిరూపణ అయింది. 1947 నుంచి 1967 దాకా రెండు దశాబ్దాల పాటు భారత పాలకవర్గాలు దేశాన్ని వాళ్ళు అనుకున్న రీతిలో నడిపించాలని చూశారు. దీని వల్ల అశేష ప్రజానీకం -వాళ్ళు భూమిలేని రైతాంగం కావొచ్చు, కార్మిక వర్గం కావచ్చు, సామాజికంగా వెనుకబాటుకు గురైన దళితులు కావొచ్చు వీరంతా తీవ్రమైన అణచివేతలో, దోపిడీలో మగ్గుతున్నారు. దళితుల మీద తీవ్రమైన దాడులు ‘స్వతంత్య్ర భారతదేశం’లో జరగడం మొదలు పెట్టాయి. ఆదివాసుల పరిస్థితి చెప్పవనవసరం లేదు. అంటే దేశంలో ఏ వైరుధ్యం పరిష్కారం కాలేదు. ప్రధాన వైరుధ్యాన్ని అడ్డం పెట్టుకొని అనేక కొత్త వైరుధ్యాలు బయల్దేరాయి.

నక్సల్బరీ వెనుక ఇదంతా ఉంది. నక్సల్బరీ లేకుంటే విరసం లేదు. అందుకే మేము చాలాసార్లు విరసాన్ని నక్సల్బరీ శిశువుగా చెబుతూ వచ్చాం. ఈ నేపథ్యంలోనే సీవీ రచనలు, దిగంబర కవిత్వం ఉన్నాయి. దిగంబర కవిత్వం మూడో సంపుటిని కులదురహంకానికి బలైపోయిన కంచకచర్ల కోటేశుకు అంకితం ఇచ్చారు. ఇది విరసానికి సాహిత్య పూర్వరంగం. ఈ సంచలనాత్మక కవిత్వం వెనుక నక్సల్బరీ సుదూర నేపథ్యం ఉన్నది.

నక్సల్బరీ లేకపోతే తెలుగుసాహిత్యంలో అయినా, భారతదేశ సాహిత్యంలోనైనా విప్లవకర ధోరణి వచ్చేది కాదు. మిగతా భారతీయ భాషలలో విరసర లాంటి నిర్మాణం అప్పుడు ఏర్పడి ఉండకపోవచ్చునేమో గాని తెలుగులో విరసం ఏర్పడానికి నేరుగా నక్సల్బరీయే కారణం. ఈ యాభై ఏళ్ళ కాలంలో గుర్తు చేసుకోవలసిందేమిటంటే కొద్ది మంది రచయితలు పూనుకొని, సాహిత్యం ద్వారా ఒక సందేశం ఇవ్వాలి, లేదా సాహిత్యం ద్వారా కొన్ని మార్పులు తీసుకురావాలని అని ఒక మంచి ఆశయంతో పూనుకొని విరసాన్ని ఏర్పాటు చేయలేదు. వ్యక్తుల ఆలోచన, సంసిద్ధత ఉంటాయి. విరసం ఏర్పాటును కానీ, కొనసాగింపును కానీ చారిత్రక శక్తుల నేపథ్యంలో, చారిత్రక సన్నివేశంలో భాగంగా చూడకపోతే దాని బలమేమిటి, ప్రభావం ఏమిటి అనే విషయం మనకు అర్థం కాదు.

మనిషి క్రియాశీలమైన, చైతన్యవంతమైన భాగస్వామ్యంతోటి కార్మికవర్గం వర్గపోరాటాలకు సిద్ధమైతే తప్ప వైరుధ్యాలు పరిష్కారం కావు. వర్గపోరాటం అనేక రూపాలలో అనేక స్థాయిలలో వ్యక్తమౌతుంది. భారత సమాజంలో ఒక ప్రధాన వైరుధ్యం పరిష్కారం కాగుండా మిగిలిపోవడంతో దాని రద్దు కావడం కోసం చారిత్రక శక్తులు సిద్ధమయ్యాయి. అందువల్లనే నక్సల్బరీ కేవలం ఒక ఈవెంట్‌గా, ఒక ఘటనగా మిగిలిపోకుండా ఒక పంథాగా మారింది. అందుకే సమాజంలోని అన్ని రంగాలపై ప్రభావం వేయగలిగింది. అలాంటి రంగాలలో సాహిత్య రంగం ఒకటి. తెలుగు సమాజంలో ఆ మార్పుకి విరసం అనే ఒక నిర్మాణం దోహదపడింది. కాబట్టి విరసం ఏర్పాటు చారిత్రకంగానే చూడాలి. విరసం ఏర్పాటు కాక తప్పని ఒక స్థితిని చరిత్ర తీసుకొని వచ్చింది. చరిత్రలోంచి పుట్టిన విరసం చరిత్ర నిర్మాణంలో భాగమై సమాజంపై ప్రభావం వేయగలుగుతోంది. చాలా సాహిత్య సంస్థలు పుడుతూ ఉంటాయి. చాలా అద్భుతమైన పాత్రను పోషించి ఆగిపోవడం, బలసీనపడటం జరుగుతూ ఉంటుంది. కొన్ని ఉనికి కూడా కోల్పోతాయి. కానీ విరసం ఒక సజీవమైన స్రవంతిగా కొనసాగడానికి.. అనేక ఆటుపోట్లు మధ్య, లోపలా బయట చాలా సంక్షోభాల మధ్య కొనసాగడానికి కారణమేమంటే, అది చరిత్రకు సంబంధించిన ఒక కర్తవ్యాన్ని పరిపూర్తి చేయవలసిన బాధ్యతను భుజాననేసుకొని బయల్దేరింది. కాబట్టి ఆ దశ పూర్తయ్యేంతవరకూ విరసం పాత్ర ఉంటుంది. అయితే ఈ మొత్తం ప్రాసెస్‌ ఒక సరళరేఖలా ఉండకపోవచ్చు. చాలా ఆటుపోట్లు మధ్య, బలాబలాల రాపిడి మధ్య కొనసాగుతూ వుంది.

మహమూద్‌: విరసం ఆవిర్భావంనాటి పరిస్థితులతో పోల్చితే ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో మీరు గుర్తించిన తేడా ఏమిటి? నా ఉద్దేశ్యం విప్లవపార్టీ ఆచరణ గురించి కాదు. మొత్తం సామాజిక పరిస్థితుల్లో ఎటువంటి మార్పు అని?

పాణి: విప్లవ పార్టీ అయినా, విరసం అయినా సమాజం అనే మొత్తంలో భాగం. సమాజంలో వచ్చే మార్పులకు సమాజంలో మార్పు తేవాలని బయలుదేరిన విప్లవ పార్టీ కూడా గురవుతుంది. సమాజం ఒక సజీవమైన వ్యవస్థ. అది నిరంతరం చలనంలో ఉంటుంది. నిత్య ఘర్షణలో ఉంటుంది. అనేక రకాల శక్తులు తలపడుతూ ఉంటాయి. కాబట్టి అది మార్పుకు గురవుతూ వుంటుంది. విరసం ఏర్పడిన కాలంలో సమాజం ఎట్లా ఉండేదో గుర్తు చేసుకుంటే ఈ యాభై ఏళ్ళలో కనీసం మూడు నాలుగు దశలు దాటి సమాజం ముందుకొచ్చింది. ఈ మార్పు మన రాజకీయ రంగంలో కనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయార్థిక వ్యవస్థలో కనిపిస్తుంది. సాంస్కృతిక రంగంలో కూడా దానికి తగ్గ మార్పులు కనిపిస్తాయి. ఈ యాభై ఏళ్ళ కాలం వ్యవస్థ అనేక సంక్షోభాల్ని సృష్టించుకుంది. వాటికి పాలకవర్గం వెతికే పరిష్కారాలు మరిన్ని సమస్యలకు కారణమయ్యాయి. వీటిని ప్రశ్నించిన ప్రజా ఉద్యమాలపై అణచివేత ప్రయోగిస్తోంది. అసలైన వైరుధ్యాల పరిష్కారానికి సిద్ధమైన విప్లవోద్యమాలను నిర్మూలించే ప్రయత్నం చేస్తోంది.

ఇది పైకి కనిపించేది. వాస్తవానికి అభివృద్ధి, సంక్షేమం అనే భావనలను పాలకులు అతి పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. ఒక పక్క ప్రైవేటీకరణ, ఇంకో పక్క సంక్షేమ రాజ్యం ఈ రెండు పద్ధతుల్లో వ్యవస్థను పాలకులు ముందుకు తీసుకపోదామని అనుకుంటున్నారు. ఇది దోపిడీని, అసమానతలను తీవ్రం చేసింది. అంతే కాదు. మన దేశంలోని అతి ప్రాచీనమైన సాంఘిక సంబంధాలను, భావజాలాలను గతం కంటే ఎక్కువగా వాడుకుంటున్నారు. దళితులు, స్త్రీలు, ముస్లింలమీద దాడులను ఇందులో భాగంగా చూడాలి. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం పాలకుల రాజకీయార్థిక విధానాలు, కుల మత భావజాలాలు, సాంఘిక వ్యవస్థల నుంచి పుట్టుకొచ్చింది. ఇదంతా మన దేశంలో పార్లమెంటరీ మార్గంలోనే జరిగింది.

ఇలా విరసం ఆవిర్భావం నాటికంటే రాజకీయ పరిస్థితి చాలా మారింది. మారిందని ఇప్పుడు చెప్పడం కాదు. మేము, విప్లవోద్యమం 1970ల చివరి నుంచి, 80ల ఆరంభం నుంచే ప్రతి సందర్భంలో చెబుతూ వచ్చాం. ఘటనలు జరిగినప్పుడు చెప్పడం కాదు. రాబోయే పరిణామాలను అర్థం చేసుకోగల ముందుచూపుతో సిద్ధాంత తలంలోనే ఈ విషయాలన్నీ చెబుతున్నాం. శక్తిమేరకు ఎదుర్కొంటున్నాం.

మహమూద్‌: యాభై ఏళ్ళ క్రితంతో పోల్చితే ఇప్పుడు రాజ్యం శక్తివంతంగా మారింది. దీనికి తగ్గట్టు ఇంత బలమైన రాజ్యాన్ని ఎదుర్కోడానికి అవసరమైన శక్తియుక్తుల్ని విప్లవోద్యమం సాధించింది. ఇందులో విరసం పాత్ర ఏమిటి?

పాణి: భారత బూర్జువా రాజ్యంలో వచ్చిన మార్పులను ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సి ఉంది. అంతర్గత కారణాల వల్ల, బైటి నుంచి ప్రజల ఒత్తిడి వల్ల, ఉద్యమాల వల్ల తన పనితీరు మార్చుకుంది. అసలు ఈ యాభై ఏళ్ళలో వ్యవస్థ పనితీరే మారింది. ఇప్పుడు భారతరాజ్య ప్రమేయం లేని, దాని స్పర్శలేని, అది తన చేతుల్లోకి తీసుకోని భాగమంటూ దేశంలో లేదంటే అతిశయోక్తి కాదు. యాభై ఏళ్ళకిందట, ప్రభుత్వం ఏమిటో, ఎవరు ప్రధానో, ఎవరు ముఖ్యమంత్రో మారుమూల ప్రజలకు పెద్దగా తెలిసేవి కావు. ఆదివాసులకైతే ఈ వ్యవస్థ ఏమిటో తెలియదు. తమదైన ప్రత్యేక జీవన విధానం ఉండేది. ఇప్పుడు నేరుగా రాజ్య యంత్రాంగం వాళ్ళలోకి కూడా వెళ్ళింది. ఆ ప్రాంతాల్లో తిరుగుబాట్లు వస్తున్నప్పుడు ‘సంక్షేమం’ అనే ముసుగులో వెళుతోంది. దాన్ని వాళ్లు తిరస్కరిస్తే అణచివేత రూపంలో వెళుతోంది. ఇపుడు కొత్తగా మతం రూపంలో కూడా వెళుతోంది. ఈ రకంగా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రాజ్యం చాలా గతిశీలంతో ఉంది. బూర్జువా మేధావి వర్గం ఈ మార్పును చూసి పులకించిపోతుంటారు. బూర్జువా రాజ్యం ఇంతగా విస్తరిస్తూ ఉందంటే ప్రజలను తన అధీనంలోకి తెచ్చుకుంటుందని అర్థం. తను కల్పించే భ్రమలలో ప్రజలను ఉంచాలనుకుంటుంది. లేదంటే అణచివేస్తోంది. అసలు విషయం ఏమంటే ఇది వ్యవస్థ విస్తరించడం.

దీన్ని పోరాట ప్రజలు ఎదుర్కొంటున్నారు. వాళ్లకు బాసటగా విప్లవ సాహిత్యోద్యమం పైన చెప్పిన విశ్లేషణల ద్వారా, వాటిని జీవితానుభవం నుంచి కాల్పనీకరించి సాహిత్యం చేయడం ద్వారా ఈ యాభై ఏళ్లలో కృషి చేస్తోంది. మొత్తం మీద రాజ్యం అంటే అణచివేత సాధనం అనే మర్క్సిస్టు లెనినిస్టు అవగాహనను ఈ పరిణామాల దృష్ట్యా అనేక కోణాల్లో విరసం వివరిస్తోంది.

మహమూద్‌: పైన చెప్పుకున్న ఉదాహరణల నేపథ్యంలో విరసం తన రచనల ద్వారా ఈ రాజ్య విస్తరణను, దాని అణిచివేతను ప్రజలకు తెలియచేయడం కోసం తయారు చేసిన టూల్స్‌ ఏమిటి?

పాణి: రాజ్యం మౌలికంగా అణచివేత సాధనం అని యాభై ఏళ్ళ కిందట జనానికి చెబితే అర్థమైన దానికంటే ఇప్పుడే బాగా అర్థమవుతోందని నా అభిప్రాయం. సంక్షేమాలు, ఉచితాలు, రాయితీలు, పింఛన్లు మొదలైనవి గుమ్మరిస్తున్న ఈ రోజుల్లో ఇది దోపిడీ వ్యవస్థ అనీ, రాజ్యమంటే అణచివేత సాధనమనీ చెబితే ఎలా రిసీవ్‌ చేసుకుంటారు? అనే ప్రశ్న కొందరు వేస్తుంటారు. ఇది నిజాయితీతోనే వేస్తున్నవాళ్లున్నారు.

నిజమే. పైన చెప్పిన మార్పులు సామాన్యమైనవి కాదు. ఇవన్నీ పైపై విషయాలు. పాలకులు తమ అధికారం కోసం, దోపిడీ కోసమే ఇవన్నీ ఇస్తున్నారని కూడా ప్రజలకు తెలుసు. ఇవి తీసుకోకుంటే పూట గడవని దుస్థితి తమకు కల్పించిందని ప్రజలకు తెలియదనుకోవడం పొరబాటు. పార్లమెంటరీ రాజకీయాలు ఎంత నగ్నంగా దిగజారాయంటే అవి అధికారానికీ, ఆస్తులు పోగేసుకోడానికేనని ప్రజలకు అర్థమౌతున్నది. దాపరికరం లేకుండా పాలకులు ఇలా ప్రవర్తిస్తున్నారు. ముప్ఫై ఏళ్ళ కిందో, యాభై ఏళ్ళ కిందో ఇవి బూటకపు ఎన్నికలు అని ఎవరో రాజకీయ కార్యకర్తలు ప్రజలకు చెప్పవలసి వచ్చేది. కానీ ప్రభుత్వ తీరు, ఎన్నికల తీరు ఎవరో చెప్పనవసరం లేకుండా ప్రజల అనుభవంలో భాగమైపోయాయి. ఓటింగ్‌ శాతం పెరగవచ్చు, ఓటు రేటు కూడా పెరగవచ్చు. కానీ ప్రభుత్వాల గురించి, వాటి పనితీరు గురించీ ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకుంటున్నారు. ఎన్నికల వ్యవహారం ఎట్ల నడుస్తోంది, రాజకీయ పార్టీలు ఎంతగా భ్రష్టు పట్టిపోయాయి అనేవి ప్రజలకు తెలుసు. తమ నిమిత్తం లేకుండా ప్రభుత్వాలు మారుతున్నాయని కూడా వాళ్లకు బాగా తెలుసు. గత యాభై ఏళ్ళలో ఇది బూర్జువా ప్రజాస్వామ్యమని, దీనికి ఫ్యూడల్‌ నేపథ్యం ఉందని, ఇప్పుడైతే మరింత స్పష్టంగా బ్రాహ్మణికల్‌ స్వభావం ఉండే భూస్వామ్యం- సామ్రాజ్యవాద అనుకూల స్వభావం అనీ విరసం చెబుతున్నది.

అనేక రూపాల్లో డబ్బు చెలామణి పెరిగిన మాట వాస్తవం. దీనికంటే ఎక్కువగా దోపిడీ పెరుగుతున్నదని విప్లవ సాహిత్యోద్యమం చెప్పగలిగింది. అలాగే దోపిడీ రూపాలు మారుతున్నాయేగాని, దోపిడీ పోలేదనే భావనను కూడా విరసం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలుగుతోంది. హింసకు రాజ్యానికి ఉండే సంబంధాన్ని అనేక భావనల ద్వారా వివరిస్తోంది. ఈ యాభై ఏళ్లలో ఎవరైనా విప్లవ సాహిత్యంలో వ్యవస్థ, రాజ్యం పని తీరులో మార్పుల చిత్రణ మీద ప్రత్యేకంగా విశ్లేషిస్తే అనేక విషయాలు తెలుస్తాయి.

మహమూద్: ఇటీవల చాలా మంది యూత్‌ విరసంలోకి రావడం నేను గమనించాను. మీ అవగాహన వారి రచనలో ట్రాన్స్ఫర్‌ కావడానికి మీరిస్తున్న ఆ పాఠాలేమిటి? వరలక్ష్మి గారి నుండి ఈ సమాధానం ఆశిస్తున్నాను.

వరలక్ష్మి: కొనసాగింపులో భాగంగా, అంటే విరసం స్రవంతిలో భాగంగానే యూత్‌ వస్తున్నారు. ఎక్కడ ఒక ప్రాసెస్‌ కొనసాగుతూ వస్తోంది అనిపిస్తే, అందులోనూ ఒక భవిష్యత్తుకు సంబంధించిన అంశం కనబడితేనే కొత్తతరం వస్తుంది. మామూలుగా అంటూ వుంటారు, కమ్యూనిస్టుల్లో 40 సంవత్సరాల పైబడినవారే ఉంటారని. కమ్యూనిజం రేపటి తరం అందుకోబోయే గొప్ప భవిష్యత్తుకు సంబంధించిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం కూడా వర్గపోరాట ఆచరణ ద్వారా వ్యవస్థ మార్పుకు బాట వేస్తుంది. వర్గపోరాటం అనే డ్రైవింగ్‌ ఫోర్స్‌ ఉంటే యూత్‌ ఉద్యమాల్లోకి వస్తారు. వాళ్ళు రావడంతోనే ఒక కన్విక్షన్‌తో, అవగాహనతో వస్తారు. లేకపోతే వ్యవస్థలో చాలా ఆకర్షణలు ఉంటాయి. వాటిలో కొట్టుకొనిపోవచ్చు. సాహిత్య రంగంలో విరసంలోకి రావడానికి కూడా కారణం అదే. కేవలం రచయితలుగా ఉండిపోవడంలో ఒక సౌకర్యం ఉంటుంది. ఉద్యమాల వరకు చూసినా ఇంకా చాలా ఉద్యమాలున్నాయి. ఎక్కడైనా చేరిపోవచ్చు, కాని విరసంలోకి వచ్చే యువతకి స్పష్టత ఉంది. సమాజ పరిణామాల పట్ల మంచి అవగాహన, మార్పు పట్ల విశ్వాసం వాళ్ళకి ఉంటుంది. విరసం అన్ని సంస్థల్లాంటిది కాదని, కేవలం గతాన్ని నెమరు వేసుకోవడమూ, తీరిగ్గా కూర్చొని సాహితీ చర్చలు చేసుకుంటూ ఉండడం మాత్రమే చేయదని తెలుసుకుని ఇందులోకి వస్తారు. ఇంటర్నల్‌గా విరసానికి ఒక డ్రైవింగ్‌ ఫోర్స్‌ ఉంది. అది ప్రజా ఉద్యమాలకు సంబంధించినది. వ్యవస్థమార్పుకు సంబంధించిన సంఘర్షణ నిరంతరం కొనసాగుతుంటుంది. కొత్తతరాలు, కొత్తశక్తులు వస్తూనే ఉంటాయి.

విరసంలోకి వచ్చే కొత్తతరం అది మొదలుపెట్టిన ప్రాసెస్‌ని అందుకోవడమే కాదు, సంస్థకు కొత్త యనర్జీ ఇస్తారు. కొత్త వాళ్ళు రావడంతోనే ఒక తాజాదనాన్ని తీసుకొస్తారు. ఇప్పటి యువత ఏ స్థితిలో ఉంది, వారి అనుభవాలు ఏమిటి అనేవి సంస్థ అవగాహనలో భాగమవుతాయి. సంస్థ అభివృద్ధికి అన్ని వయసులవారు అన్ని సమూహాలవారు దోహదం చేస్తారు. ఎవరి ప్రత్యేకత వారిదే. ఇప్పుడు విరసంలో 20, 25 మధ్య వయసు వారు చేరడం ఎంతో పాజిటివ్‌‌ అంశం. ఇటీవల చేరిన ఇద్దరు కొత్త సభ్యుల్లో ఒకరికి పి.జి. అయిపోతే ఇంకొకరు పి.జి. చేస్తున్నారు. వాళ్ళు చెబుతున్నదేమిటంటే విరసం సాహిత్యానికి, మిగతా సాహిత్యానికి మౌలికంగా తేడా ఉంటుందని. మిగతాళ్ళు చెప్పని విషయాలు, చెప్పడానికి సాహసించని విషయాలు మీరు చెబుతారు. మీ సాహిత్యంలో స్పష్టత వుంటుంది అంటుంటారు. అంటే ఇక్కడ మనకు సంబంధించిందీ, మనం నేర్చుకోగలిగింది ఉంది అనే అవగాహనతో యువత వస్తున్నారు. ఎవరో చెప్తే సంస్థల్లోకి రారు కదా. కొంత మంది స్ఫూర్తి, ప్రోత్సాహం ఉండొచ్చు కానీ వాస్తవానికి మార్క్సిజంలోనే ఆ శక్తి ఉంటుంది. మార్క్సిజంలోనే సమాజ గతిని అర్ధం చేసుకునే ఒక కాన్సెప్ట్‌ ఉంటుంది. అది ఒక సైన్స్‌ కాబట్టి దాన్ని అవగహన చేసుకున్నవాళ్ళు తప్పనిసరిగా ఒక స్పష్టత తోటి కొనసాగుతారు. అట్లా నేనైనా నా తరువాత వచ్చిన వాళ్ళైయినా దాన్ని తెలుసుకున్నాకనే ఒక కన్విక్షన్‌ తోటే సంస్థల్లోకి వస్తున్నారు.

వచ్చిన తరువాత ఇక సాహిత్యానికి సంబంధించిన స్కిల్స్‌ అది చర్చించే పద్దతిలో కావొచ్చు, అధ్యయనం ద్వారా కావొచ్చు లేదా కొన్ని క్లాసెస్‌ కండక్ట్‌ చేయడం ద్వారా కావొచ్చు ఒక సమిష్టి కృషిలో భాగంగా మనుషులు ఎదగడం అనే ఒక ప్రాసెస్‌ విరసంలో ఉంటుంది. సభ్యుల మధ్య పర్సనల్‌ ఇంటరాక్షన్‌ దగ్గరి నుండి (వయసుతో సంబంధం లేకుండా), సమావేశాలు, వర్క్‌ షాప్స్‌ వరకూ అన్ని కలయికలు సభ్యులు ఎదగడానికి, అలాగే కొత్తవారి నుండి సంస్థ నేర్చుకోడానికి దోహదం చేస్తాయి. మూడు తరాల విరసం ఇట్లనే కొనసాగుతోంది.

వ్యక్తులుగా రచయితులుగా ఉండడానికి సంస్థలకి తేడా కూడా ఇక్కడ చెప్పుకోవాలి. సంస్థగా సమష్టి అధ్యయనం, కలిసి అవగాహన చేసుకోవడం, చర్చించుకోవడం, ఈ మొత్తం నుండి డ్రా చేసుకొని వ్యక్తులు ఎదగడం అనేది ఉంటుంది. సమష్టి నుంచి నేర్చుకుంటూ, ఈ సమష్టి కూడా ప్రజల మీద ఆధారపడి ఉన్నదనే ఎరుకతో ఉంటూ, ఆ పునాది నుండే జీవితాన్ని కానీ, భావజాలాన్ని కానీ, ఘర్షణను కానీ అర్థం చేసుకుంటారు. వ్యక్తిగత అధ్యయం, కృషికి ఇది తోడైతే మనుషులు ఎంతో ఎదుగుతారు. అట్లా సంస్థ ద్వారా ఒక సమూహంలో భాగం కావడం, ప్రజలను అర్థం చేసుకోవడం అనేది నిరంతరం విరసంలో జరుగుతూ ఉంటుంది. ఒక డైనమిజం గురుంచి పాణి అన్నాడు కదా అలాంటి డైనమిజం ఉంది కాబట్టే సంస్థలోకి 20-25 ఏళ్ల యూత్‌ వస్తున్నారు.

మహమూద్‌: విరసంలోకి మీరెలా వచ్చారో చెప్పండి. అంతకు ముందు నుండే మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి నాకు సుమారుగా తెలుసు. అయినా మీరు చెప్తే వినాలని ఉంది. విరసం సభ్యులు కావడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేమిటి?

వరలక్ష్మి: నాకున్న చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానం దొరుకుతుందనిపించింది. మనకు ఒక ఏజ్‌ వచ్చాక చాల ప్రశ్నలు మొదలవుతాయి. ఎట్లయితే చిన్నపిల్లలకి అన్ని ప్రశ్నలే ఉంటాయో ఒక అడాలసెన్స్‌లోకి వచ్చాక చుట్టూ ఉన్న సమాజం గురుంచి చాల ప్రశ్నలు వస్తాయి. వ్యవస్థలో అనేక దుర్మార్గాలు, వివక్షా, పీడనలు ఉంటాయి కదా. అసలు ఈ మొత్తం సమాజంలో ఇక్కడ నేను ఏంటి అనే ప్రశ్న కూడా వస్తుంది. యువతలో మామూలుగానే ఒక జీల్‌ ఉంటుంది. అయితే ఎక్కడో ఒక చోట సమాధానం వెతుక్కుని శాటిస్ఫై అవుతుంటారు. అట్లా ఒక వెతికే క్రమంలో, అర్ధం చేసుకునే క్రమంలో చాల ప్రశ్నలకు నాకు మార్క్సిజంలో సమాధానం ఉంది అనిపించింది. అట్లాంటి ఒక జర్నీ చేస్తున్నపుడు విరసం పరిచయం కావడం విరసంలో భాగమై దానిని కొనసాగించడటం నా ప్రత్యక్ష అనుభవం.

భౌతికంగా ఏ ఉద్యమాలు లేకపోయినా కేవలం సాహిత్యాన్ని చదివి, మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తూ మార్పుకు సంబంధించిన విషయాలు లేదా సమాజాన్ని అర్థం చేసుకునే విషయాలు ఇందులో ఉన్నాయని కన్విన్స్‌ అయ్యాను. ఇప్పటికి ఉన్న అన్ని సిద్ధాంతాల్లోకి ఇది సైన్టిఫిక్‌ అనిపించింది. మార్క్సిజాన్ని కరెక్టుగా ఇంప్లిమెంట్‌ చేసే ఉద్యమం, లేదా సంస్థ ఇది. ప్రజలతో కనెక్ట్‌ అయిన సంస్థ ఇది అని అర్థమైనపుడు నేను విరసంలో భాగమయ్యాను. ‘అసలు ఇది కదా చేయవలసింది. ఇప్పుడు ఈ దశలో… అంటే 20-25 ఏళ్ల వయసులో ఇది కదా చేయవలసింది’ అని ఒక లైట్‌ ఎక్కడి నుండి అయినా వస్తే దానిని అందుకునే చొరవ యువతకు ఉంటుంది. ఒక 40 సంవత్సరాలు దాటిన తరువాత మన అధ్యయనంలో ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఒక స్రవంతిలో భాగం కావడం, ఎప్పటికప్పుడు కొత్తవి తీసుకుని మన జీవితంలో భాగం చేసుకోవడం సాధారణంగా ఉండదు. ఏదైనా కొత్త జెనరేషనే కొత్త సవాళ్ళను తీసుకోవడం, దేనికైనా కొత్త శక్తిని ఇవ్వడం ఉంటుంది. అట్లా నా జర్నీ స్టార్ట్‌ అయింది.

సుమారు 2005 అనుకుంటే, అంతకంటే ముందు ప్రొద్దుటూరులో సాహిత్య పాఠశాల జరిగినపుడు నేను వచ్చి చూడటం, ఇక్కడ వీళ్ళు ఇంత సీరియస్‌గా విషయాలు మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోవడం ఒక అనుభవం. మీరు నడిపే లైబ్రరీకొచ్చి పుస్తకాలు చదువుతున్నపుడు, వాటిలో ఉండే గాఢత కానీ, స్పష్టత కానీ ఆ తరువాత మీరు చర్చిస్తున్నప్పుడు ఎక్కువ ఫీలయ్యేదాన్ని. మిత్రజ్యోతి వాళ్ళు స్టడీ సర్కిల్‌లో మాట్లాడుకుంటున్నపుడు, ఇక్కడ ఇంత సీరియస్‌గా ఆలోచించే వాళ్ళు ఉంటారా అని మళ్ళీ ఒకలాంటి ఆశ్చర్యం, ఇంకా తెలుసుకోవాలనే ఒక ఆతృత. ఇది నాకే కాదు నాతోపాటు వచ్చిన పావని, రాముకు కలిగింది. మన లైబ్రరీ, మల్లెల నారాయణ సార్‌ ఇది చదువు, అది చదువు అని ఇచ్చే బోలెడు పుస్తకాలు మా ఆకలిని మరింతగా పెంచాయి. ఇక్కడి నుండి తిరుపతి పోయిన తర్వాత టి.యం.ఎస్‌. ప్రభావం కూడా తోడైంది. మీకు విరసం పరిచయమైన కాలాన్ని బాబ్రీ మసీదు సంఘటనతో గుర్తు చేసుకున్నారు. నాకు విరసం పరిచయమైన కాలంలోనే గుజరాత్‌ మారణకాండ జరిగింది.

ఏమైనా ఆ ఉత్సుకత యంగ్‌ పీపుల్‌కి సహజంగానే ఉంటుంది కాని అనేక కారణాల వల్ల అది డైవర్ట్‌ అవుతూ ఉంటుంది. వేరే అట్రాక్షన్స్‌ లోకి వెళ్తూ ఉంటారు. ఒకసారి దీని గురించి తెలిసిన తరువాత దీనికి మించిన అట్రాక్షన్‌ లేదు అనిపిస్తుంది. సరే, సహజంగా ఉద్యమాల బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నవాళ్లు ఆ ఉద్యమ నేపథ్యం నుండి, ఆ వాతావరణం నుండి సంస్థలోకి వచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనుండి విరసంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాల కారణాలు ప్రేరేపించినా ఒక సైంటిఫిక్‌ విజన్‌, సైన్టిఫిక్‌ బేస్‌ ఉంది ఈ అప్రోచ్‌లో. విప్లవోద్యమానికి సమిష్టిగా ఆలోచించే ఒక పద్దతి, అందరినీ అకామిడేట్‌ చేసుకుని ఒక డైరెక్షన్‌ ఇచ్చే శక్తి ఉంది. సాంస్కృతిక ఉద్యమంలో ఆ బలం విరసంకు ఉంది.

మహమూద్‌: ఆకర్షణ దగ్గరికి వస్తే, ఇప్పుడు విరసం సాహిత్యం పట్ల ఆకర్షింపబడటానికి విరసం సాహిత్యంలో ఉండే ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? రకరకాల పాయలున్నాయి కదా, అవి కాకుండా విరసం వైపుకే రావడానికి దాంట్లో ఉండే ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? ప్రజలను లేదా యువకులను విప్లవ సాహిత్యం ఎట్లా ఆకర్షిస్తుంది?

వరలక్ష్మి : ఇప్పుడీ విషయం కాస్త భిన్నంగా ఆలోచించాలి. 70, 80 లలో అయితే నాటకం, పాటలు ఇట్లాంటివి చాల విస్తృతంగా ఉండేవి. ప్రజల్లోకి చాల వెళ్ళేవి. ఆ తరంలో చాల మంది పాటలు విని జననాట్య మండలి ప్రదర్శనలు చూసి ఉద్యమాల్లోకి వచ్చేవాళ్ళు. నా మటుకు నాకైతే వీళ్లు మాత్రమే ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొడతారు అనిపించింది. ఏ మొహమాటం లేకుండా, ఏ శషభిషలు లేకుండా చెప్పవలసిన విషయాన్ని చెప్తారు. చెప్పడంలో కూడా మొండిగా, బండగా చెప్పడం కాదు చాల శాస్త్రీయంగా ఉంటుంది. ఈ అట్రాక్షన్‌ కూడా సినిమాల్లాగానో, పాటల్లాగానో (కళా రూపాలను తక్కువ చేయడం కాదు) కాకుండా చాలా గాఢంగా ఉంటుంది. లాంగ్‌లాస్టింగ్‌ కూడా. మార్క్సిజాన్ని అధ్యయనం చేసి సంస్థలోకి రావడం లేదా ఆ అప్రోచ్‌ ఉంది కాబట్టి సంస్థలోకి రావడం అనేది ఇంకా చాలా గాఢంగా ఉంటుంది. పిజి చదువుతున్న ఒక అమ్మాయి ఈ మధ్య మామూలుగా విరసం సభలకు వచ్చి సభ్యురాలైపోయింది. నిజానికి నాకెట్లయితే విరసం పరిచయం అయిందో తనకి కూడా ఇంచుమించు అలానే అయింది. కేవలం సాహిత్యం చదవడం వల్లనే. వేరే ఏమి లేవు. విద్యార్థి ఉద్యమాలు కానీ ఇతరేతర ఉద్యమాల పరిచయం గానీ లేవు. కాలేజీ చదువులు తప్ప వేరే వ్యాపకాలు కూడా పెద్దగా లేవు. కానీ చదవడం, తెలుసుకోవడం అనే జిజ్ఞాస ఉంది. అక్కడి నుండి సంస్థలోకి వచ్చేసింది. ప్రొద్దుటూరులో సభలు జరిగినప్పుడు మొదటిసారి నాతో పాటు వచ్చి పార్టిసిపేట్‌ చేసింది. అందరూ కవిత్వం చదువుతుంటే వచ్చి చదివింది. తర్వాతి ఏడాది మెంబర్‌ అయింది. ఇంకా వేరే వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇటీవలి తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మిగతా ఫోర్సెస్‌ ఉద్యమాలలో భాగస్వామ్యం కావడానికి, ఒక విప్లవోద్యమం అనే ఒక డ్రైవింగ్‌ ఫోర్స్‌ వాళ్ళ భౌతిక, మానసిక వాతారణంలో ఉండి దాంట్లో నుంచి ఉద్యమాలలోకి వచ్చిన వాళ్లకు తేడా కనిపిస్తుంది. ఇలా చాల డైమన్షన్స్‌ ఉంటాయి.

(ఇంకా ఉంది)

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

Leave a Reply