మోడీ వికసిత భారత్‌…ఓ ఫార్స్‌

భారతీయ జనతా పార్టీ 2014 పార్లమెంటరీ ఎన్నికల ప్రణాళికలో ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ట భారత్‌’ అన్న నినాదం ఇచ్చింది. దానికి మార్గం ‘సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌’ అని ప్రజలకు హామీ ఇచ్చింది. అలాగే రాజకీయాల్లో ‘అచ్చేదిన్‌ అనే వాలేహై’ అనేది బిజెపి నినాదం. యేటా యువతకు కోటి ఉద్యోగాలు, రైతులకు రెట్టింపు ఆదాయం, విదేశాల్లో అక్రమంగా దాచుకున్న డెబ్బయి లక్షల కోట్ల నల్లధనాన్ని అధికారంలోకి వచ్చిన తరువాత వంద రోజుల్లో దేశానికి తెప్పించి ఒక్కొక్క జన్‌ధన్‌ ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని ఊదరగొట్టారు. గంభీరమైన వాగ్దానాలను అమలుచేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. అన్ని వాగ్దానాలు గాలి మాటలుగానే మిగిలాయి. అలాగే మోడీ అమలులోకి తెచ్చిన పెద్దనోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) భారతదేశ ఆర్థిక మూలాలను చిన్నాభిన్నం చేశాయి. ప్రభుత్వం అనుసరించిన కార్పొరేట్‌ అనుకూల విధానాల వలన అత్యంత నీచమైన ఆశ్రిత పెట్టుబడి ఒకవైపు పెరుగుతుంటే, నానాటికి పెరుగుతున్న ప్రజల జీవనం అతలాకుతలమైంది. మితవాద నిరంకుశ- మతతత్వ మనువాద ఫాసిస్టు పాలనను అమలుచేస్తూ పార్లమెంటరీ ప్రాతినిధ్య వ్యవస్థకు ప్రతిబంధకాలు కల్పించడం, రాజ్యాంగ సంస్థలను (ఇడి, సిబిఐ, ఎన్నికల కమీషన్‌, న్యాయ వ్యవస్థ) బలహీనపరచడం, ప్రజాతంత్ర, పౌర హక్కులను అణచివేయడం జరిగింది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన పూర్తి మెజారిటీ వచ్చిన కిక్కుతో బిజెపి దీర్ఘకాలంగా సాధించదలచుకున్న సంఘ్‌ పరివార్‌ ఎజెండాను ఉత్సాహంగా అమలు చేసింది. ఆర్థిక రంగంలో కార్పొరేట్‌ అనుకూల విధానాలు ఒకవైపు, హిందు రాష్ట్ర ఏర్పాటులోని ప్రమాదకరమైన అంశాలను మరోవైపు అమలు చేసింది. రైతాంగ వ్యతిరేక కార్పొరేట్‌ అనుకూల మూడు వ్యవసాయ చట్టాలు చేసింది. కార్మిక హక్కులను హరించే విధంగా నాలుగు కోడ్‌లను చట్టంగా చేసింది. రాజ్యాంగంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన 370, 35ఎ అధికరణలను రద్దు చేసింది. జమ్ము-కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. బాబ్రీ మసీద్‌ స్థానంలో రామాలయ నిర్మాణం, ముస్లిం మైనారిటీలను పౌరసత్వ చట్ట సవరణ ద్వారా రెండవ తరగతి పౌరులుగా చూస్తోంది. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించే నగదీకరణ విధానాన్ని అమలు చేస్తోంది. భారత రిపబ్లిక్‌ స్వభావాన్ని మార్చి వేయడానికి ఒక పథకం ప్రకారం ప్రయత్నాలు సాగుతున్నాయి. లౌకిక ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన అనే నాలుగు రాజ్యాంగపు మూల స్తంభాలపై మోడీ ప్రభుత్వం నిరంతరంగా దాడి చేస్తున్నది. అన్ని రాజ్యాంగ సంస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకుని నిరంకుశంగా ప్రజా ప్రతిఘటనను అణచివేస్తున్నది.

మాటలకు చేతలకు పొంతనలేని మోడీ పాలన :
వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా బిజెపి 2004 ఎన్నికల్లో ఇచ్చిన నినాదం ‘వెలిగిపోతున్న భారత్‌’. తరువాత అదే బిజెపి 2014లో ముందుకు తెచ్చిన నినాదం ‘అచ్ఛేదిన్‌’, తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్‌ రెండవ వారంలో ‘వికసిత భారత్‌’ ప్రభుత్వ సంకల్పమని ప్రకటించారు. మూడు నినాదాలకు తేడా ఉంది. మొదటిది తమ విఫలమైన పాలనను కప్పిపుచ్చుకొనేందుకు భారత్‌ వెలిగిపోతోందన్నారు. కాంగ్రెస్‌ పాలన మీద ధ్వజమెత్తేందుకు తాము అధికారానికి వస్తే అచ్చేదిన్‌ (మంచి రోజులు) తెస్తామని ప్రజలకు ఆశ చూపారు. పదేళ్లు గడిచినా వాటి జాడ కనిపించటం లేదు. దీంతో మరో పాతికేళ్లలో 2047 నాటికి అభివృద్ధి చెందిన వికసిత భారత్‌గా దేశాన్ని మారుస్తామని ఇప్పుడు మరో అబద్ధం పలుకుతున్నారు. బిజెపి దృష్టిలో దేశ అభివృద్ధి గురించి ప్రభుత్వానికి అనుకూలంగా కబుర్లు చెప్పేవారు అపర దేశభక్తులు, వారి అనుచిత, అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక విధానాల బండారాన్ని ప్రశ్నించేవారు క్షమించరాని దేశద్రోహులు. నేడు దేశంలో జరుగుతున్న ప్రచార దాడిలో నలుగుతున్న అంశమిది. 1947లో వలసపాలన పోయి స్వపాలన ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు పాలకులు చెప్పిన అభివృద్ధి కబుర్లలో వెయ్యోవంతు ఆచరించినా దేశం ఈ స్థితిలో ఉండేది కాదు. ఏడున్నర దశాబ్దాల తర్వాత స్వాతంత్య్రం మాకేమిచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమయ్యేది కాదు.

గత పది సంవత్సరాలుగా అధికారం వెలగబెడుతున్న బిజెపి సర్కార్‌ అబద్దాలతో, అసత్యాలతో, ఉద్వేగాలతో, విద్వేషాలతో తప్పుడు సమాచారంతో దేశాన్ని మొరటుగా వందల సంవత్సరాల వెనక్కి నడిపిస్తున్నది. స్వాతంత్య్ర ఉద్యమం వెలికి తీసిన సమస్యల పరిష్కారానికి, స్వాతంత్య్రానంతరం జరుగుతున్న (అందులో అనేక లోపాలున్నప్పటికీ) ప్రయత్నాలు అన్నింటిని అడ్డం కొట్టి దేశాన్ని పచ్చి మితవాద ఫాసిస్టు తరహా పరిష్కారాల వైపు లాగేస్తున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, దానికి ప్రాణవాయువు అందించే లౌకికతత్వం జవసత్వాలనిచ్చే సామాజిక న్యాయంపై ఈ మనువాదులు ముప్పేట దాడికి దిగారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, భారత రాజ్యాంగంలో పొందుపరచిన వ్యవస్థలన్నింటినీ హిందుత్వ శక్తులు తొలిచేస్తున్నాయి. ప్రత్యర్థులపై ఇడి, సిబిఐ, ఐటి దాడులు, ప్రజా సంఘాల నాయకులపై, పౌరహక్కుల కార్యకర్తలపైన ‘ఉపా’ కేసులు నమోదు చేసి సంవత్సర తరబడి నిర్బంధిస్తున్నారు.

రెండు సంవత్సరాలకు పైగా నీతి ఆయోగ్‌ నిర్దేశం మేరకు అధికారులు మథనం చేసి తీసుకువచ్చిందే వికసిత భారత్‌ 2047 ప్రణాళిక. దాని ప్రకారం 2047 నాటికి దేశ జిడిపి 30 లక్షల కోట్ల డాలర్లకు, ఇప్పుడున్న తలసరి సంపద 2500 నుంచి 20వేల డాలర్లకు పెరుగుతుందని ప్రచార ఆర్భాటం జరుగుతోంది. మోడీ ”వికసిత భారత్‌” నినాదం కొత్తది కాదు. మోడీ రోజూ పాడుతున్న పాత పాటే. ఇప్పుడు దానిని కొత్త మాటగా పైకి తీశారు. ఈ ఆగష్టు 15న జరుపుకునే 78వ స్వాతంత్య్ర దిన వేడుకలకు ”వికసిత భారత్‌”ను థీమ్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్య గానంతో జరిగే స్వాతంత్య్ర వేడుకలతో ఈ నినాదానికి పునఃప్రాణ ప్రతిష్ట చెయ్యాలన్నది మోడీ లక్ష్యంగా కనిపిస్తున్నది. మోడీ మానస పుత్రికగా రూపుదిద్దుకున్న ”వికసిత భారత్‌” కల సాకారం కావడం ఒక ఏడాదిలోనో ఐదేళ్లలోనో పదేళ్లలోనో జరిగేది కాదు. దాని పూర్ణ దర్శనం 2047లో మనకి చూపిస్తామంటున్నారు. అప్పటివరకూ తానే ఉంటానని, ఇది దైవకార్యమనీ దానిని సాధించడానికి తాను దైవదూతగా వచ్చినట్లు గత ఎన్నికల నాడే ప్రకటించారు. ఈ స్వాతంత్య్ర వేడుకలతో ఈ మహత్తర దైవకార్యానికి ఆయన శ్రీకారం చుట్టబోయే దృశ్యాన్ని దేశ ప్రజలకు చూపించ తలచినట్లు కనిపిస్తున్నది.

మోడీ దగ్గర ఒక ”అద్భుతమైన కళ” ఉంది. అది ప్రజల దృష్టి మళ్లింపు కళ. ప్రజలు తమ నిత్యజీవన సమస్యల మీద దృష్టి పెట్టకుండా దారి మళ్లించే కళ. గత పది సంవత్సరాల పాలన మీద మోడీ మాట్లాడరు. ఎందుకంటే అది అత్యధిక ప్రజల జీవితాలను మెరుగుపర్చలేదు పైగా దుర్భరం చేసింది. ప్రస్తుత ప్రజల తక్షణ సమస్యల మీద మాట్లాడారు. ఎందుకంటే వాటిని ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించే మార్గాలు ఆయన వద్ద లేవు. అందుకే 2047లో సాకారమవుతాయని దూరపు కొండలను చూపించి ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 2024-25 బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ”వికసిత భారత్‌” ను సాధించే రోడ్‌ మ్యాప్‌లో తొమ్మిది ప్రాధాన్యతా అంశాలను ప్రకటించారు. బడ్జెట్‌ ప్రసంగాలలో మాటల గారడీలు, అంకెల గారడీలు ఉంటాయి. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి 500 భారీ కంపెనీలు ఒక కోటి మంది యువతకు ఇంటర్న్‌ షిప్‌ కల్పించడం ఘనకార్యంగా కనిపిస్తోంది. ఇది ఐదు సంవత్సరాల పథకం. ఈ పథకానికి ప్రస్తుతానికి కేటాయించింది కేవలం 10000 కోట్లు మాత్రమే. ఇలా మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటని ప్రకటనలు చాలా కనిపిస్తాయి.

ఆచరణ లేని ప్రకటనలతో ఒరిగేదేముంటది ? :
బడ్జెట్‌లో ప్రాధాన్యతాంశాలుగా ప్రకటించిన వాటిలో నిజమైన సమస్యలను పక్కన పెట్టారు. వికసిత భారత్‌లో వ్యవసాయం ప్రాధాన్యత గల అంశం. కాని వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధర కావాలని, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేసి దానికి చట్టబద్ధత కల్పించాలన్న రైతుల డిమాండ్‌ను ఈ బడ్జెట్‌ పక్కన పెట్టింది. నిరుద్యోగ సమస్య సెగ గత ఎన్నికల్లో బిజెపికి తగిలింది. ఈ బడ్జెట్‌లో దానికి కొన్ని పథకాలను ప్రకటించారు. బడా కంపెనీల ఇంటర్న్‌ షిప్‌ పథకం అనేది పని నేర్పడం కోసం కాదు, ప్రభుత్వ సొమ్ముతో యజమానులు వారితో పని చేయించుకోవడం అన్నది బహిరంగ రహస్యం. కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా రిటైర్‌ అయిన ఉద్యోగుల ఖాళీలు భర్తీ చెయ్యకుండా ఇంటర్న్‌లను వాడుకోవడం జరుగుతుంది. వ్యవసాయ రంగానికి, గ్రామీణ పరిశ్రమలకు కేటాయింపులు గణనీయంగా పెంచకుండా అక్కడ 55 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నది కేవలం ప్రకటనగానే మిగిలిపోతుంది. విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు పెంచకుండా మానవాభివృద్ధిపై చెప్పిన మాటలు నీటిమూటలుగానే ఉంటాయి. మాటల్లో సామాజిక న్యాయం తప్ప ఆచరణలో అదనపు సాయం లేదు.

వలస పాలకుల నుండి అధికార బదిలీ జరిగి వందేళ్ళు పూర్తవుతున్న 2047 నాటికి మన దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుస్తామని మోడీ ప్రభుత్వం చెబుతున్నది. అభివృద్ధి చెందిన దేశం అంటే ఏమిటి? ఒక దేశంలోని ప్రజల సగటు తలసరి ఆదాయాన్ని బట్టి అభివృద్ధి చెందిన, చెందుతున్న లేదా వెనుకబడిన దేశాలుగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు వర్ణిస్తున్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం సగటు తలసరి ఆదాయం 13,845 డాలర్లు లేదా అంతకతంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉంటే ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా గుర్తిస్తున్నాయి. మనదేశ ప్రస్తుత సగటు తలసరి ఆదాయం 2,500 డాలర్లని ఏప్రిల్‌ 2024లో ఐఎంఎఫ్‌ విడుదల చేసిన ఆర్థిక నివేదికలో తెలిపింది. 77 ఏళ్ళ స్వపాలన తర్వాత మన ఈ తలసరి ఆదాయం (2,500 డాలర్లు)… 2047 నాటికి… అంటే రానున్న 23 ఏళ్ళలో అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించడానికి ఇప్పటి లెక్కల ప్రకారం అదనంగా 11,345 డాలర్ల తలసరి ఆదాయానికి చేరుకోవాలి. సాధ్యమా? ఈ సగటు లెక్కలే భలే జిమ్మిక్కుగా ఉంటాయి. 15 వేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన అంబానీ ఆస్తి, కనీసం పెళ్ళి చేసే ఆర్థిక స్థోమత లేక దాతలు ఇచ్చే ఉచిత తాళి కోసం ఎదురుచూసే పేదవాని ఆస్తి కలిపి సగటు ఆదాయాన్ని లెక్కిస్తారు. అంబానీ ఆస్తి నుండి పేదవానికి నయా పైసా రాకపోయినా, సగటు లెక్కల్లో మాత్రం ఇద్దరి ఆస్తి సమానమౌతుంది.

దేశం అభివృద్ధి చెందాలంటే సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాలను స్వావలంబన కోసం రూపొందించాలి. తయారీ, సేవలు, ఎగుమతుల తయారీకి ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం కోసం పరిశోధనలు చేయాలి. దేశ యువతకు ఉపాధి చూపించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ దిశగా మన ఆర్థిక విధానాలు ఉండాలి. అప్పుడే తయారీ రంగంతో పాటు, మౌళిక రంగాలు అంటే రైల్వే, రోడ్లు, గృహ వసతి, నీటి పారుదల, విద్యుత్‌, విద్య, వైద్య రంగాలతో పాటు వ్యవసాయాభివృద్ధికి పెట్టుబడులు పెరుగుతాయి. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి. కానీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, రైల్వే, రోడ్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌, టెలికం, విద్య, వైద్య రంగాలతో పాటు కీలకమైన వ్యవసాయాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించే విధానాలను మోడీ అమలు చేస్తున్నారు. దీని ఫలితంగా దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. మోడీ పాలనలోని గత ఆరు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ అప్పు రూ.82 లక్షల కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి మరో రూ.12 లక్షల కోట్లు అప్పు చేయడానికి బడ్జెట్‌లో ప్రతిపాదనలు పెట్టారు.

కార్పొరేట్ల పరమవుతున్న వ్యవసాయం :
మనదేశం అభివృద్ధి సాధించాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలని 2024 ఫిబ్రవరి 27న మహారాష్ట్రలోని యవత్మాల్‌లో మోడీ ఉపన్యసించారు. దేశ జనాభాలో 60 శాతం మందికి పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. 2018-19 నాడు 7.8 శాతం అభివృద్ధితో ఉన్న వ్యవసాయ రంగం 2024 మార్చి నాటికి 0.6 శాతానికి పడిపోయింది. కానీ, నిర్మలా సీతారామన్‌ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీకి గత సంవత్సరం కంటే రూ.24,894 కోట్లు, ఆహార సబ్సిడీకి రూ.7,082 కోట్లు తగ్గించేశారు. దీంతో రానున్న రోజుల్లో ఎరువులు, పురుగు మందుల ధరలు మరింతగా పెరుగుతాయి. పంటల పెట్టుబడి సహాయం పెంచకుండా, కనీస మద్దతు ధర, ఉచిత బీమా అమలు చేయకుండా వ్యవసాయ సంక్షోభాన్ని బిజెపి ప్రభుత్వం మరింత తీవ్రం చేస్తున్నది. ఆహార సబ్సిడీ తగ్గించడంతో పేదలకు అందుతున్న రేషన్‌ సరుకుల కోటా తగ్గిపోతుంది. ఆకలి కేకలు పెరుగుతాయి. వ్యవసాయ కూలీలకు, పేద రైతులకు కొంత ఊరటనిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈ బడ్జెట్‌లో కేటాయించిన రూ.86 వేల కోట్లలో, ఇప్పటికే చేసిన పనులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.41,500 కోట్లు పోను, మిగిలింది కేవలం రూ.44,500 కోట్లు. ఇంత తక్కువ డబ్బుతో కోట్ల మంది పేదలకు పనులు ఎలా కల్పిస్తారు?

పరాయి పాలన పోయి స్వపాలన వచ్చినా :
భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నామని పదే పదే పేర్కొంటున్న మోడీ సర్కార్‌.. దీనికి భిన్నంగా దేశంలో నిరుద్యోగం భారీగా పెరుగుతోంది. పెరిగిన నిరుద్యోగంపై ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ మరియు ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ కలిసి విడుదల చేసిన ఇండియా ఎంపాయిమెంట్‌ రిపోర్టు-2024 ప్రకారం నిరుద్యోగ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దేశంలోని పని చేయగలిగిన శ్రామికుల సంఖ్య 2011లో 61 శాతం ఉంటే 2021 నాటికి 64 శాతానికి పెరిగిందని, అయితే ఈ శ్రామిక జనాభాలో 2022 నాటికి కేవలం 37 శాతం మందికి మాత్రమే పనులు దొరికాయని ఈ నివేదిక తెలిపింది. యువతకు ఉపాధి కల్పించడం దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్‌ అని ఈ నివేదిక హెచ్చరించింది. తాజా రిపోర్టు ప్రకారం నిరుద్యోగ రేటు 2008లో 5.41 శాతం ఉండగా, 2014లో 5.44, 2020లో 8.00, 2024 జూన్‌ నాటికి 9.2 శాతానికి చేరుకుంది. ఈ పరిస్థితి నిరుద్యోగ రెడ్‌జోన్‌ లాంటిది. సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ(ఎ.ఐ) ప్రభావంతో నిరుద్యోగం మరింత తీవ్రం కానుంది. ఐటీ సేవల రంగాలలో తక్కువ నైపుణ్యం అవసరమైన 6,40,000 ఉద్యోగాలు పోతాయని ”భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం” అనే నివేదికలో ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ) ఇటీవల తెలిపింది. ఉద్యోగాలు సృష్టించలేని వృద్ధి వ్యర్థమేనని రిజర్వ్‌బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రంగరాజన్‌ స్పష్టం చేశారు.

వికసిత భారత్‌కు విద్య- విజ్ఞానం అవసరం లేదా? :
2047 నాటికి దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే విద్యారంగం కీలకమని, దేశ స్థూల జాతీయ ఆదాయంలో కనీసం 6 శాతం నిధులు విద్యకు కేటాయించాలని ప్రముఖ విద్యావేత్త గోవిందస్వామి విశ్వనాథన్‌ కేంద్ర బడ్జెట్‌పై స్పందిస్తూ మీడియాకు చెప్పారు. ప్రజల తలసరి ఆదాయం పెరుగుదలలో విద్యాభివృద్ధి కీలకమని ఆయన దక్షిణాది రాష్ట్రాలను ఉదాహరణగా చూపారు. అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళ తలసరి ఆదాయం దేశంలో మొదటి స్థానంలో ఉందని, ఈ తర్వాత స్థానాల్లో తమిళనాడు, తెలంగాణ ఉన్నాయన్నారు. బీహార్‌ తలసరి ఆదాయం అతి తక్కువగా ఉండడానికి అక్షరాస్యత కూడా ముఖ్య కారణమన్నారు. వలస పాలన పోయి స్వపాలన ఏర్పడినా… ఈ 77 ఎళ్ళళో ఎన్నడూ 3 శాతానికి మించి విద్యకు నిధులు కేటాయించలేదు. 2017 బడ్జెట్‌లో ఉన్నత విద్యకు జిడిపిలో 1.47 శాతం కేటాయిస్తే, ఈ సంవత్సరం కేవలం 0.99 శాతం మాత్రమే కేటాయించారు. పాఠశాల విద్యకు మరింతగా తగ్గించారు. ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం, గ్రామీణాభివృద్ధి రంగాలన్నింటికి నిధుల కేటాయింపులు తగ్గిపోయాయి. మేక్‌ ఇన్‌ ఇండియా, మేడ్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా వంటి నినాదాలను రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు.

ఈసురోమని దేశముంటే… :
‘ఈసురోమని దేశముంటే దేశమేగతి బాగుపడునోయి’ అని గురజాడ అప్పారావు ఏనాడో ప్రశ్నించారు. దేశంలో కోట్ల మంది కనీస తిండికి నోచుకోవడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జూలై నెలలో విడుదల చేసిన ‘ది స్టేట్‌ ఆఫ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ అండ్‌ న్యూట్రిషన్‌ ఇన్‌ ది వరల్డ్‌’ నివేదిక-2022లో 56.5 శాతం మంది భారతీయులు ‘ఆరోగ్యకరమైన ఆహారాన్ని’ పొందడంలేదని చెప్పింది. దేశంలోని 79 కోట్ల మంది ప్రజలు ఆహారం కోసం రోజుకు రూ.350 ఖర్చు చేసే స్థితిలో లేరని పేర్కొంది. ప్రపంచీకరణ ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ సేవలు కుదించుకుపోయాయి. పేద, మధ్య తరగతి వారికి వచ్చే అరకొర ఆదాయం నుండి విద్య, వైద్యానికి చేసే ఖర్చులు పెరిగిపోయాయి. ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో పాటు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి మనిషి ఆహారం కోసం సగటున నెలకు రూ.1750 ఖర్చు చేస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో రూ.2,529.67 ఖర్చు చేస్తున్నారని జూన్‌లో విడుదలైన ద హౌస్‌హోల్డ్‌ కన్జెమ్షన్‌ ఎక్స్‌పెండీచర్‌ సర్వే (హెచ్‌సిఇఎస్‌) తెలిపింది. ఆహారం కాని ఇతర వాటి కోసం (విద్య, వైద్యం, బాడుగలు, ప్రయాణాల లాంటి) గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.2,023.14, పట్టణ ప్రాంతాల్లో రూ.3,929.03 ఖర్చు అవుతుంది. ఆదాయం మూరెడు, ఖర్చు బారెడు అన్నట్లుగా ప్రజల పరిస్థితి మారింది. ఈ అంతరాన్ని పరిష్కరించకుండా మోడీ చెబుతున్నట్లు 2047 నాటికి దేశం సమగ్రాభివృద్ధి ఎలా సాధిస్తుంది?

తీవ్రమైన ఆర్థిక అసమానతలు :
దేశంలో ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. కుబేరులు అపర కుబేరులు అవుతున్నారు. దేశంలోని సంపదలో 40.1 శాతం సంపద కేవలం ఒక్క శాతంగా ఉన్న కోటీశ్వరుల దగ్గర ఉండగా, అట్టడుగున ఉన్న 50 శాతం ప్రజల దగ్గర 0.17 శాతం సంపద మాత్రమే ఉంటే దేశం ఏ గతిన బాగుపడుతుంది? సగటు భారతీయుడి కంటే కోటీశ్వరుల సంపద సుమారు 17 వేల రెట్లు ఎక్కువ. దేశంలో బ్రిటీష్‌ పాలన 1922 నాటి కంటే 2023 నాటికి భారీగా ఆర్థిక అంతరాలు పెరిగాయని నోబెల్‌ బహుమతి గ్రహీత పికెట్టీ లాంటి మేధావులు విశ్లేషిస్తున్నారు. ఈ ఆర్థిక అంతరాలను తగ్గించడానికి సంపన్నుల మీద పన్నులు వేయడానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. లక్ష్యం ఘనమైంది అయితేనే సరిపోదు, లక్ష్యాన్ని సాధించడానికి ఎంచుకునే మార్గాలు కీలకం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరడమంటే కేవలం కొద్ది మందిగా ఉన్న కోటీశ్వరులు శత కోటీశ్వరులుగా మారడం కాదు. కోటాను కోట్ల దేశ ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందడం.’ప్రపంచ అభివృద్ధి నివేదిక-2024′ అనే పేరుతో ప్రపంచ బ్యాంకు నివేదిక విడుదల చేసింది. అందులో భారత్‌ ఆర్థిక వృద్ధిపై ప్రపంచ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికన్ల వ్యక్తిగత తలసరి ఆదాయంలో నాలుగో వంతు స్థాయికి చేరుకోవడానికి భారత దేశానికి 75 ఏండ్లు పడుతుందని పేర్కొంది.

ముగింపు :
సామ్రాజ్యవాద అనుకూల విధానాలు, ద్రవ్య పెట్టుబడికి లొంగుబాటు, ఆశ్రిత పెట్టుబడికి ప్రోత్సాహం అమలు చేస్తున్నంత కాలం సాధారణ పౌరుల సమస్యలు పరిష్కారం కావు. ప్రభుత్వ విధానాలు మారకుండా ప్రజలు జీవితాలు మారవు. ఈ నేపథ్యంలో వికసిత భారత్‌ 2047 రోడ్‌ మ్యాప్‌ ప్రకారం మనదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడుతుందంటే జనం నమ్మేదెలా? మానవాభివృద్ధి సూచిలో 134వ స్థానంలో, ఆకలి సూచిలో 111వ స్థానంలో, సంతోష సూచిలో 137వ స్థానంలో, తలసరి ఆదాయంలో 136వ స్థానంలో, తలసరి కొనుగోలు శక్తిలో 125వ స్థానంలో, అసమానతల్లో మనదేశం 129వ స్థానంలో, పత్రికా స్వేచ్ఛలో 161వ స్థానంలో, పర్యావరణ పరిరక్షణలో 167వ స్థానంలో, పౌర హక్కుల పరిరక్షణలో 53వ స్థానంలో, ప్రజాస్వామిక స్వేచ్ఛలో 83వ స్థానంలో ఉన్నాము. ఇక జాతీయ బహుమితీయ పేదరికం 25 శాతం ఉంది. వీటితో పాటు అప్పుల కుప్పలు, అవినీతి, ద్రవ్యోల్బణం, ఆశ్రిత పక్షపాతం, డాలరుతో రూపాయి మారక విలువ పథనం వంటివి వికసిత భారత్‌కు ఏ విధంగా తోడ్పడేవి కావని గమనించాలి.

మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్ళుగా దేశీయ, విదేశీ కార్పొరేట్లకు సహజ వనరులను చౌకగా అప్పగిస్తున్నారు. ఈ విధానాలే భారతదేశ దుస్థితికి, ప్రజల దుర్భరత్వానికి అద్ధం పడుతున్నాయి. సకల వ్యవస్థల విధ్వంసమే మోడీ ప్రభుత్వ నిర్వాకం కాబట్టి ఆయన నినాదాలు వట్టి ప్రచార పటాటోపానికి వాడుకుంటారే తప్ప దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవితాలను బాగుపరిచే సంకల్పం ఆయనకు లేదన్నది సుస్పష్టం. పిడికెడు మంది ప్రయోజనాల కోసం 140 కోట్ల ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి, సమాజం మీద, వనరుల మీద, సంపద మీద కొద్దిమంది ఆధిపత్యాన్ని స్థాపించే, బలోపేతం చేసే విష, విద్వేష వ్యూహం అమలు చేస్తోంది. ఇక ఒక అడుగు ముందుకు వేసి భారత్‌ ‘మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ అని స్వయంగా అభివర్ణించిన దేశ ప్రజాస్వామిక మూలాలు కదలిపోతున్నాయి, కూలిపోతున్నాయనడం అతిశయోక్తి ఏమికాదు. వికసిత భారత్‌ కనుచూపు మేరలో కనిపించకపోయినా పట్టపగలు అరుంధతి నక్షత్రాన్ని చూపిన మాదిరి చెబుతున్నారు. ఒకసారి చెప్పనదాన్ని మరొకసారి మాట్లాడకుండా కొత్త పాట అందుకుంటున్నారు, అదే బిజెపి, నరేంద్ర మోడీ ప్రత్యేకత! అందువల్ల ప్రజల జీవితాలు గుణాత్మకంగా మారాలంటే వ్యవస్థాగత మార్పు కోసం సంఘటితంగా పోరాడడం తప్ప మరో మార్గం లేదు.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply