మోడీ పదేళ్ల పాలనా వైఫల్యం

సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమీషన్‌ తేదీలు ప్రకటించింది. దేశ చరిత్రలో ఇవి ఎంతో కీలకమైన ఎన్నికలు. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థగా కొనసాగాలా లేక హిందూ రాష్ట్రంగా ఆవిర్భవించాలా అనేది తేల్చే ఎన్నికలు ఇవి. ప్రధాని నరేంద్రమోడీ 2014 నుంచి అందిపుచ్చుకున్న ‘సబ్‌కా సాథ్‌… సబ్‌కా వికాస్‌’ నినాదం ఆచరణలో కార్యరూపం దాల్చలేదు. దేశంలోని మైనారిటీలు భయం గుప్పిట్లో కాలం గడుపుతూ జీవనాన్ని సాగిస్తున్నారు. తన ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఏ మతాన్ని అనుమతించబోదని మోడీ 2015లో ప్రకటించారు. హిందూ ముస్లింలు కలసికట్టుగా కృషి చేసి దేశం నుండి పేదరికాన్ని పారద్రోలాలని కూడా ఆయన హితవు పలికారు. కొద్ది నెలల క్రితం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ సమాజంలోని ప్రతి వర్గానికి చేరువ కావాలని సూచించారు. కానీ ప్రస్తుతం దేశంలో జరుగుతున్నది ఏమిటి? అని గమనిస్తే మోడీ మాటలకు బిజెపి ప్రభుత్వ ఆచరణకు పొంతన లేదు.

కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం పదేళ్లలో మితవాద నిరంకుశ-మతవాద పాలనకు ముందుకు తెచ్చింది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ (సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ) విధానాలను మరింత వేగంగా అమలు చేసింది. ఫలితంగా శ్రామిక ప్రజలపై అన్ని వైపుల నుంచి దాడులు జరిగాయి. దేశ లౌకిక, ప్రజాతంత్ర, ఫెడరల్‌ వ్యవస్థలను ధ్వంసం చేసింది. మైనారిటీలపై, మహిళలపై, దళితులపై, ఆదివాసీలపై ఫాసిస్టు దాడులకు పాల్పడింది. నియంతృత్వ పాలనకు రూపకల్పన చేస్తూ పార్లమెంటరీ ప్రాతినిద్య ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించింది. విద్య సంస్థలను, సాంస్కృతిక సంస్థలను మతతత్వంతో ప్రభావితం చేస్తోంది. అయినా మరోసారి తనకే అధికారమని ఆయన ప్రకటించుకుంటున్నాడు. నిజానికి మోడీ పదేళ్ల పాలన అబద్దాలకు, దోపిడీకి, అవినీతికి కేరాఫ్‌ అడ్రసుగా, ‘అసత్యమేవ జయతే’ అన్న రీతిగా సాగుతోందన్నది స్పష్టం.

అత్యధికమంది ప్రజలు ఎదుర్కొంటున్న ఆకలి, నిరుద్యోగం, దారిద్య్రం, పన్నుల భారం, సామాజిక వివక్ష గురించి వివిధ అంతర్జాతీయ నివేదికలు వెలుగులోకి తెస్తూనే ఉన్నాయి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చే ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ లెక్కన ఈ పదేళ్ళలో దేశ యువతకు 20 కోట్ల ఉద్యోగాలు వచ్చి వుండాలి. కానీ కోటి మందికి కూడా ఉద్యోగాలు రాలేదు. అలాగే తయారీ రంగంలో పది కోట్ల మందికి ఉపాధి కల్పించి దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటాను 17 శాతం నుండి 25 శాతానికి పెంచుతామన్నారు. ఉపాధి రంగంలో మహిళా కార్మికుల భాగస్వామ్యాన్ని పెంచి వారిని సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధిలోకి తెస్తామన్నారు. కాని జరిగింది ఏమిటీ? సిఎంఐఇ (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకనామి) రిపోర్టు ప్రకారం గత ఐదు సంవత్సరాలుగా దేశ శ్రామికుల సంఖ్య 40 కోట్ల దగ్గరే నిలిచిపోయింది. 2012లో నిరుద్యోగుల సంఖ్య ఒక కోటి. 2018 నాటికి మూడు రెట్లు పెరిగి మూడు కోట్లకు చేరింది. 2023 అక్టోబర్‌ నాటికి 4.20 కోట్లకు చేరింది. రానున్న కాలంలో మరింత తీవ్రం కానున్నదని ఐఎల్‌ఒ అధ్యయనం హెచ్చరించింది.

వ్యవసాయంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో 1983లో 61 శాతం మంది పురుషులు ఉపాధి పొందుతుండగా 2021 నాటికి అది 37 శాతానికి తగ్గింది. ఇదే కాలంలో మహిళల ఉపాధి 75.5 శాతం నుండి 59 శాతానికి పడిపోయింది. మొత్తంగా 56 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగం దేశ స్థూల ఉత్పత్తికి అందిస్తున్న వాటా కేవలం 15 శాతం మాత్రమే, ఇది వ్యవసాయ సంక్షోభ తీవ్రతకు నిదర్శనం. మోడీ పాలనా పదేళ్ల కాలంలో నిర్మాణ రంగం, వ్యవసాయ రంగాల్లో 10.5 నుండి 12 శాతం దినసరి వేతనాలు పెరగగా, నిత్యావసర సరుకుల ధరలు మాత్రం 2023 మార్చి నాటికి 22 శాతం పెరిగాయి. అంటే ఈ కాలంలో గతంలో పొందుతున్న వేతనాల్లో పది శాతం నిజవేతనాలు తగ్గాయి. ఫలితంగా వీరి కొనుగోలు శక్తి తగ్గింది.

సంక్షోభంలో వ్యవసాయం:

2016 ఫిబ్రవరి 28న ప్రధాని నరేంద్ర మోడీ బడ్జెట్‌పై పార్లమెంట్‌లో మాట్లాడుతూ 2022 నాటికి (అప్పటికి దేశ స్వాతంత్య్రానికి 75 సంవత్సరాలు పూర్తవుతుంది) ‘రైతుల ఆదాయాన్ని రెండింతలు’ (డబ్లింగ్‌ ఫార్మర్స్‌ ఇన్‌కమ్‌) చేస్తానన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారస్సుల కంటే మరింత మెరుగ్గా రైతులను ఆదుకుంటామన్నారు. 2016 నాటికి రైతులకు నెలకు అందుతున్న ఆదాయం రూ. 8,058 నుండి 2022 నాటికి రూ. 22,610కు పెరిగేటట్లు ప్రతి సంవత్సరం రైతుల ఆదాయాన్ని 10.4 శాతం పెంచుతామని హామీ ఇచ్చారు. వివిధ కారణాలతో పంటలు నష్టపోతున్న రైతులను లాభదాయకమైన ఇన్సూరెన్స్‌ విధానం తెస్తామన్నారు. ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. మోడీ పాలించిన 2014-2023 మధ్య నేషనల్‌ క్రైమ్‌ రిపోర్టు ప్రకారం 1,00,474 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే గత తొమ్మిది సంవత్సరాల్లో ప్రతి రోజు 30 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. బిజెపి పాలనా కాలంలో పంటల పెట్టుబడి ఖర్చులు భారీగా పెరగడం, గిట్టుబాటు ధరలు అందకపోవడం, బ్యాంకుల రుణపరపతి పెద్ద ఎత్తున తగ్గిపోవడం రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు. నిజానికి వ్యవసాయాన్ని కార్పొరేట్‌ వ్యవసాయంగా మార్చాలన్నది బిజెపి లక్ష్యం. అందువల్లనే 2020 నుండి వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా రైతులు పోరుబాట పట్టారు.

పెరుగుతున్న నిరుద్యోగం :

ప్రధాని మోడీ, ఆయన పార్టీ బిజెపి వల్లె వేస్తున్న ‘వికసిత భారత్‌’లో నిరుద్యోగం భయంకర స్థాయికి చేరుకుంది. స్టార్టప్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా నినాదాలు గాలిలో ఉన్నాయి. చివరికి ఎక్కడిదాకా వచ్చిందంటే, విధిలేక వీధుల వెంట పకోడీలు అమ్ముకునే పని కూడా ఉపాధి, ఉద్యోగం కిందికే వస్తుందనే స్థాయికి ప్రధాని, బిజెపి పెద్దలు భాష్యాలు చెప్తున్నారు. ఈ చర్య నిరుద్యోగులను అపహాస్యం చేయడమే. ఇప్పటివరకు రైతుల, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యల గురించే విన్నాం. ప్రస్తుతం నిరుద్యోగుల ఆత్మహత్యలూ సంభవిస్తున్నాయని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో గణాంకాలు తెలుపుతున్నాయి. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన యువత ఉపాధి లేక నిరాశ నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడటం సమాజానికి చేటు. దేశ జనాభాలో 35 ఏండ్ల లోపు యువత 66 శాతం ఉంటుందని ఒక అంచనా. కోట్లాదిగా ఉన్న వీరికి ఉద్యోగ, ఉపాధి లేకపోతే బిజెపి ప్రచారం చేసుకునే ‘అచ్ఛేదిన్‌’ అనే దానికి అర్థమేమిటి?

బిజెపి అధికారానికి రాక ముందు ఉన్న సమాచారం ప్రకారం 2012లో నిరుద్యోగం 2.1 శాతం. అది 2018లో నేషనల్‌ సర్వే సంస్థ సమాచారం ప్రకారం 6.1 శాతానికి చేరింది. దేశ కార్మిక శక్తి సర్వేల ప్రకారం అంతకు ముందు 45 సంవత్సరాలతో పోలిస్తే అది అధికం. 15-24 సంవత్సరాల యువతలో నిరుద్యోగం ఎంత అన్నది ప్రధానంగా చూడాలి. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ ప్రకారం 2014లో మోడీ అధికారానికి వచ్చినప్పుడు 22.4 శాతం మందికి ఉపాధి లేదు. మోడీ అధికారానికి వచ్చాక 2022 నాటికి 23.22 శాతానికి పెరిగింది. తొమ్మిది సంవత్సరాల సగటు 24.74 శాతం ఉంది. మాక్రోట్రెండ్స్‌ సమాచారం ప్రకారం 15-24 ఏండ్ల వయస్సులోని యువత కార్మిక- శక్తిలో 2014లో 31.64 శాతం ఉండగా, మోడీ ఏలుబడిలో 2023లో 28.04 శాతానికి తగ్గింది. విద్యావంతులు పెరిగిన కొద్దీ యువతలో నిరుద్యోగ శాతం కూడా పెరుగుతున్నదనే అంశాన్ని ఎందుకు మూసిపెడుతున్నట్లు? నరేంద్ర మోడీ గొప్పగా చెప్పుకొనే నైపుణ్యం తీరు ఎలా ఉంది. 2021 భారత నైపుణ్య నివేదిక ప్రకారం దాదాపు సగం మంది డిగ్రీ కలిగిన వారు నిరుద్యోగులు.

మన దేశంలో 2030 వరకు ఉపాధిని కోరుకునే వారి సంఖ్య ఏటేటా గణనీయంగా పెరగనుందని వర్తమాన ధోరణి వెల్లడిస్తోంది. అంటే నిరుద్యోగమూ పెరగనుంది. కార్మికశక్తిలో మొత్తంగా, ప్రత్యేకించి మహిళల శాతం పెరగటం లేదు. ఎందుకు అన్నది సమస్య. అధికారానికి వచ్చిన తొలి రోజుల్లో విదేశాలు తిరిగి పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు తెచ్చినట్లు నరేంద్ర మోడీ ఘనంగా చెబుతున్నారు. కాని పది సంవత్సరాల తరువాత జనానికి అందినవాటి ఫలితాలేమిటో చెప్పరు. తమ వికసిత భారత్‌ నినాదంతో త్వరలో ఆర్థిక వృద్ధి చైనా, అమెరికాలను మించిపోతామని చెబుతున్నారు. ఎంతగా చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నప్పటికీ మన దేశంలో పెట్టుబడి వాతావరణం వ్యాపారం చేసేందుకు పెద్ద సవాలుగా ఉందని 2022 నివేదికలో అమెరికా చెప్పింది. రక్షణాత్మక చర్యలు, భారతీయ ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి చేరలేకపోవటం వంటి కారణాలను దానిలో పేర్కొన్నారు. అంతేకాదు ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛ సూచిక 2023 నివేదిక ప్రకారం 131వ స్థానంలో మన దేశం ఉంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని 39 దేశాల్లో 27వ స్థానంలో ఉంది.

ఎదుగు బొదుగు లేని తయారీ రంగం :

పారిశ్రామిక ఉత్పత్తి విలువ తమ ఏలుబడిలో ఎంత పెరిగిందో చూడమని మోడీ భక్తులు చెబుతారు. ఆ మేరకు ఉపాధి ఎందుకు పెరగలేదో మాత్రం చెప్పరు. మరోవైపు జిడిపిని ఎంత పెంచామో చూడండి అంటారు. ప్రపంచ బ్యాంకు విశ్లేషించిన దాని ప్రకారం 2014లో మన పారిశ్రామిక ఉత్పత్తి విలువ 307 బిలియన్‌ డాలర్లు, కాగా 2023 నాటికి 450 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇదే కాలంలో జిడిపిలో దాని వాటా 15 నుంచి 13.32 శాతానికి దిగజారింది. దీని అర్థం ఏమిటి? ఉపాధి రహిత వృద్ధి జరుగుతున్నట్లు విదితమవుతుంది. దీనివలన కార్పొరేట్ల సంపద పెరుగుతుంది తప్ప జనానికి దక్కేదేముండదు. ఏ దేశంలోనైనా ప్రజల కొనుగోలు శక్తి తగ్గి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు బ్రిటీష్‌ ఆర్థికవేత్త జెయం కీన్స్‌ సిద్ధాంతం ప్రకారం డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. దానివలన వివిధ రంగాలు కొంతమేరకు సానుకూలంగా స్పందిస్తాయి. ఉదాహరణకు రోడ్ల నిర్మాణం జరిపితే సిమెంటు, ఉక్కు, చమురు, రోడ్డు నిర్మాణ వాహనాలు తదితర ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. మొత్తంగా చూసినప్పుడు కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చే మౌలిక సదుపాయాలకు ఖర్చు పెంపుదల కోసం కోట్లాది మంది సంక్షేమానికి చేసే ఖర్చుకు కోత పెడుతున్నారు లేదా మంచం చాలకపోతే కాళ్లు ముడుచుకొని సర్దుకోమని చెప్పినట్లుగా చేస్తున్నారు.

సంపన్నులకు వరాలు-ప్రజలపై భారాలు :

విదేశాల్లో దాచుకున్న 70 లక్షల కోట్ల నల్లధనాన్ని బయటకు తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ. 15 లక్షలు వేస్తానని పదేళ్ళ క్రితం మోడీ దేశ ప్రజలకు హామి ఇచ్చారు. పన్నులు పెరగవని, మధ్యతరగతి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రాల్లో వసూలు అవుతున్న పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని 2013 అక్టోబర్‌ నెలలో గుజరాత్‌లో జరిగిన 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ సమావేశంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోడీ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. జిఎస్‌టి విధానం వల్ల దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమలైతే పన్నుల భారం పెరగదన్నారు. 2012-13 నాటికి 119 రకాల సరుకులపై పన్నుల విధానం వుండగా మోడీ పాలనా కాలంలో పన్నులు లేని సరుకులు చివరకు శ్మశానాల్లోని కట్టెలపై, చిన్న పిల్లలు వాడే పెన్సిళ్ల మీద కూడా పన్నుల భారం వేశారు. మరోవైపు సంపన్నుల కోసం 2014-15 కస్టమ్స్‌ డ్యూటీ పన్ను (విదేశాల నుండి దిగుమతి చేసుకునే సరుకులపై వేసే పన్ను) 15.1 శాతం నుండి 6 శాతానికి, కార్పొరేట్‌ పన్ను 34.5 శాతం నుండి 27.2 శాతానికి తగ్గించారు. మధ్యతరగతి ఉద్యోగులు, వ్యాపారులు చెల్లించే ఆదాయ పన్నును మాత్రం 20.8 శాతం నుండి 30.2 శాతానికి పెంచారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పన్ను వాటాలు ఇవ్వకుండా సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా మోడీ పెత్తందారీ పాలన సాగిస్తున్నారు. బడా సంపన్నులు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు సకాలంలో చెల్లించకుండా ఎగవేసేదానికి ముద్దు పేరు ‘నిరర్థక ఆస్తులు’ (నాన్‌ పెర్ఫార్మింగ్‌ ఎసెట్స్‌). మోడీ పదేళ్ళ పాలనలో ఈ నిర్థరక ఆస్తుల విలువ రూ. 54 లక్షల కోట్లకు పెరగడాన్ని బట్టి ఈ ప్రభుత్వానికి కార్పొరేట్‌ శక్తులతో ఎంత బలమైన సంబంధాలు ఉన్నాయో తెలుస్తుంది. కార్పొరేట్‌ దిగ్గజాలకు 2014 నుండి 2023 వరకు అన్ని బ్యాంకులు కలిపి రూ. 15.23 లక్షల కోట్ల రూణాలను రద్దు చేసాయి. ఉద్దేశ్యపూర్వకంగా 50 మంది సంపన్నులు రూ. 87 వేల కోట్ల సొమ్మును బ్యాంకులకు ఎగ్గొట్టారు.

తీవ్రమవుతున్న సామాజిక వివక్ష :

మైనారిటీ మతస్థులపై ఆటవిక బుల్డోజర్‌ న్యాయాన్ని మోడీ, ఆయన శిష్య బృందం అమలు చేస్తోంది. గో సంరక్షణ పేరుతో జరిగిన 66 హింసాత్మక సంఘటనల్లో 64 ముస్లింలను లక్ష్యంగా చేసుకుని జరిగాయి. ఇందులో 53 శాతం సంఘటనలు బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే జరిగాయి. దేవాలయాల పేరుతో మైనారిటీ మతస్థుల ప్రార్థనా మందిరాలపై దాడులు పెరిగాయి. అయోధ్యలో రామమందిర విగ్రహ ప్రతిష్ట, పార్లమెంట్‌ భవనం ప్రారంభం రాజుల కాలం నాటి ఆచారాలతో, మనుధర్మ భావజాలంతో జరిగాయి. ‘బేటీ బచావో’ అని చెప్పే ప్రధానమంత్రి ఏలుబడిలో లింగ వివక్ష తీవ్రంగా పాటిస్తున్న 156 దేశాల్లో మన దేశం 140వ స్థానంలో ఉంది. అంటే మనకంటే కేవలం 16 దేశాలే కింద ఉన్నాయి. భరతమాత జపం చేస్తున్న బిజెపి పాలనలో ప్రపంచంలో మహిళలపై జరుగుతున్న హింసలో మన దేశానిదే అగ్రస్థానం కావడం సిగ్గుచేటు. దళితులపై కుల వివక్ష దాడులు, హింస పెరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో 25.82, రాజస్థాన్‌లో 14.7, మధ్యప్రదేశ్‌లో 14.1 శాతం దాడులు పెరిగాయి. ఆర్థిక అంతరాలు అనూహ్యంగా, భయంకరంగా పెరిగిపోతున్నాయి. అన్ని రంగాల్లో విఫలమైన మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడమంటే… దేశం మరింతగా వెనక్కు వెళ్లడమే అవుతుంది. వివక్షాపూరిత మోడీ పాలనలో సామాజిక న్యాయం ఎలా అమలవుతుంది?

మహిళలకు ఉపాధి, భద్రత కరువే!:

పదేళ్ల నరేంద్ర మోడీ పాలనను వెనక్కు తిరిగి చూసుకుంటే జనాభాలో సగ భాగమైన మహిళల స్థితి ఏమిటి? మహిళలకు శాంతిభద్రతలు, రక్షణ సూచికలో మనమెక్కడున్నామో తెలుసా? మన మిత్ర దేశంగా మోడీ అండ్‌ కో చెప్పుకుంటున్న అమెరికాలోని జార్జి టౌన్‌ సంస్థ రూపొందించిన 2023 విశ్లేషణ ప్రకారం 177 దేశాలలో 128వ స్థానంలో ఉన్నాం. మోడీ గొప్పదనం గురించి చెప్పుకునేందుకు ఆయన భక్తులు నిత్యం వల్లించే పాకిస్తాన్‌ 158 స్థానంలో ఉండటం ఎంతో ‘ఊరట’ కలిగిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. బేటీ పడావో, బేటీ బచావో నినాదంతో పాటు అచ్చేదిన్‌ వాగ్దానం చేసిన మోడీ ఏలుబడిలో పది సంవత్సరాల తరువాత పరిస్థితి ఇది. మహిళల శాంతిభద్రతల గురించి, తాజా సూచికల గురించి అంతర్జాతీయ మీడియాలో పేర్కొన్న అంశాలు నరేంద్ర మోడీ పరువును మరింత పోగొట్టేవిగా ఉన్నాయి. ‘స్టాటిస్టా’ అనే సంస్థ సమీక్ష జార్ఖండ్‌లో స్పానిష్‌-బ్రెజిలియన్‌ పర్యాటకురాలి మీద… ఆమె భర్త ముందే ఎనిమిది మంది చేసిన అత్యాచార ఉదంతంతో ప్రారంభమైంది. ఇది అంతర్జాతీయంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో మహిళలకు రక్షణ లేని దేశాల సరసన చేర్చి మన గురించి చర్చించుకుంటున్నారు. దేశంలో రోజుకు 86 అత్యాచారాలు జరుగుతున్నట్లు 2022లో నమోదైంది. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులు పెరుగుతున్నట్లు నమోదైన నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న, ఒక యోగి పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్‌ 2022లో ప్రథమ స్థానంలో ఉండడం సిగ్గుచేటు.

‘ఇండియా టుడే’ వెబ్‌సైట్‌ 2023 జూన్‌ పదకొండున రోషిణీ చక్రవర్తి రాసిన విశ్లేషణకు ‘భారత్‌లో తగ్గుతున్న మహిళా శ్రామికులు, ఎందుకు మహిళలు పని చేయటం లేదు’ అనే శీర్షిక పెట్టింది. భారత్‌లో వేతనాలు పొందే ఉపాధిలో మహిళలు ఇరవై శాతానికి లోపుగానే ఉన్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదికను దానిలో ఉటంకించారు. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం ఉపాధిలో కేవలం 19.2 శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా పురుషుల్లో 70.1 శాతం ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక లింగ అసమానతల నివేదిక 2022 ప్రకారం 146 దేశాల జాబితాలో 135వ స్థానంలో భారత్‌ ఉంది. ప్రపంచ శ్రామిక శక్తిలో లింగ సమానత్వం రావాలంటే 132 సంవత్సరాలు పడుతుందని ఆ నివేదిక పేర్కొన్నది. 2005లో 32 శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి 2022 నాటికి 19.2 శాతానికి తగ్గింది. అధికారిక సమాచారాన్ని విశ్లేషించినప్పుడు 2004లో గరిష్ఠంగా 35 శాతం మంది మహిళలు ఉపాధి పొందగా 2022 నాటికి అది 25 శాతానికి తగ్గినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త రోజా అబ్రహం చెప్పారు. సిఎంఐఇ ఉపాధి నివేదిక ప్రకారం 2022లో పనిచేసే వయస్సులో ఉన్నవారిలో కేవలం పది శాతం మహిళలు మాత్రమే అంటే 3.9 కోట్ల మంది మాత్రమే పని చేస్తూ ఉండటం, అదే పురుషుల విషయానికి వస్తే 36.1 కోట్ల మంది ఉన్నట్లు పేర్కొంది.

అన్నీ సూచికల్లో భారత్‌ది దిగజారుడే :

స్త్రీ పురుషుల అసమానత, ప్రభుత్వంలో అవినీతి, హత్యలు, నిరుద్యోగంరేటు, దిగజారుతున్న వాతావరణం లాంటి అనేక విషయాలను తీసుకుని ర్యాంకింగ్‌లను నిర్ణయిస్తారు. అసాధారణ వేగంతో మోడీ పాలనలో దేశం వృద్ది చెందుతోందని అత్యంత తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు. 2021లో కామన్‌ వెల్త్‌ (లండన్‌) విడుదల చేసిన నివేదిక ఆధారంగా వరల్డ్‌ యూత్‌ డెవలప్‌మెంట్‌ ప్రకారం 181 దేశాలలో మన దేశం 122వ స్థానంలో ఉన్నది. ప్రపంచ స్త్రీ, పురుష అంతరం నివేదిక ప్రకారం, ప్రపంచ ఆర్థిక వేదిక 2023లో 146 దేశాల అధ్యయనంలో ఇండియా 127వ ర్యాంకులో ఉన్నట్లు ప్రకటించింది. 2023లో యుఎన్‌డిపి నివేదిక ప్రకారం, ఇండియా 191 దేశాలలో 122వ స్థానంలో ఉన్నది. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలు తమ పాలనలో నారీశక్తిని (మహిళల సాధికారిత) సాధించినట్లు ప్రచారం సాగిస్తున్నాయి. 2023 ఐక్యరాజ్యసమితి అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోని 60 శాతం ప్రసూతి మరణాలు, పుట్టుకలోనే మరణాలు భారత్‌లోనే ఉన్నాయి. వాక్‌ఫ్రీ ఫౌండేషన్‌ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో 11 మిలియన్లమంది ఆధునిక బానిసత్వంలో ఉండగా, అత్యధికులు భారత్‌లోనే ఉన్నారు. ఎన్నికల ప్రజాస్వామ్య సూచీలో 202 దేశాలలో మనదేశం 108వ స్థానంలో ఉన్నదని వీ-డెమ్‌ ప్రజాస్వామ్య నివేదిక 2023లో ప్రకటించింది. వాస్తవంగా అభివృద్ధికి సంబంధించి లేదా పరిపాలన, ప్రజాస్వామ్యం తదితర అనేక అంశాలలోనూ భారత్‌ వెనుకబడి ఉన్నదన్న విషయాన్ని మోడీ ప్రభుత్వం దాచిపెడుతోంది. ప్రపంచ పత్రికాస్వేచ్ఛ సూచీ 2023లో ఇండియా 180 దేశాలలో 161 స్థానంలో ఉంది. ప్రపంచ అవినీతి సూచీ 180 దేశాల జాబితాలో భారత్‌ 93వ స్థానంలో ఉంది. ఐరాస రూపొందించిన 143 దేశాల సంతోష సూచీలో భారత్‌ 126వ స్థానంలో ఉంది. ఏ సూచీ చూసినా పరిస్థితి ఇదే.

రాజ్యాంగ విధ్వంస, విద్వేష పాలనపై బహిరంగ లేఖ :

ప్రధానమంత్రిని ఉద్దేశించి మాజీ ఉన్నతాధికారులు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. రాజ్యాంగ ప్రవర్తనా బృందం – కాన్‌స్టిట్యూషనల్‌ కాండక్ట్‌ గ్రూప్‌- అనే పేరుతో పనిచేస్తున్న ఈ బృందం తరపున తయారైన ఈ లేఖ మీద 70 మంది మాజీ ఐఎఎస్‌ అధికారులు, 10 మంది మాజీ ఐపిఎస్‌ అధికారులు, స్వీడన్‌, ఇటలీ, పోర్చుగల్‌, యుకె, మయన్మార్‌,మెక్సికో, ఈజిప్ట్‌, నెదర్లాండ్స్‌, జపాన్‌, ఈస్తోనియా, ఫిన్లాండ్‌, ఇండోనేషియా, కొలంబియా, ఈక్వెడార్‌, కోస్టారికాలలో భారత రాయబారులుగా పనిచేసిన పది మంది మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారులు, ఇరవైమంది మాజీ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌, ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌, ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ అధికారులు సంతకం చేశాడు. వీరందరూ పదవీ విరమణ చేసిన అధికారులు. రాష్ట్ర ప్రభుత్వాలలోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ అత్యున్నత స్థాయి అధికారులుగా పనిచేసిన వారు మోడీ పాలనలో దేశంలో పెద్ద ఎత్తున సాగుతున్న విద్వేష విధ్వంసానికి మేమంతా సాకక్షులుగా ఉన్నామని తెలిపారు.

దేశంలో బలిపీఠం మీద ఉన్నది. కేవలం ముస్లింలో, ఇతర మైనారిటీ మతస్థులో కాదు. మన రాజ్యాంగమే బలిపీఠం మీద ఉన్నది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వోద్యోగులుగా మాకు సాధారణంగా అంత తీవ్రమైన పదజాలంలో వ్యక్తీకరించే అలవాటు లేదు. కాని మన జాతి స్థాపక పితామహులు నిర్మించిన రాజ్యాంగ నిర్మాణం ఈ విధంగా విధ్వంసం అవుతుంటే, మాకిక మాట్లాడక తప్పడం లేదు. మా అగ్రహాన్నీ, ఆవేదననూ వ్యక్తీకరించక తప్పడం లేదు. మైనారిటీ సమూహాలకు, ప్రత్యేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా అస్సాం, ఢిల్లీ, గుజరాత్‌, హర్యానా,కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో పెచ్చరిల్లుతున్న హింసాకాండ భయానకమైన పరిమాణాలకు చేరుకున్నది. ఈ రాష్ట్రాలలో, ఢిల్లీ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలలోనూ భారతీయ జనతా పార్టీయే అధికారంలోఉన్నదని పేర్కొన్నారు. ఇవాళ దేశం అన్ని రంగాలలో ఎదుర్కొంటున్న ప్రమాదం కనివిని ఎరుగనిదని భావిస్తున్నామన్నారు. ఇవాళ ప్రమాదంలో ఉన్నది రాజ్యాంగ నైతికత, రాజ్యాంగ ప్రవర్తన మాత్రమే కాదు. అసలు మన నాగరికతా వారసత్వమైన విశిష్ట సంకీర్ణ సామాజిక కలనేత వస్త్రం చీలికలు పీలికలు అయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నామన్నారు. ఇంత అంతులేని సామాజిక ఆర్థిక ప్రమాదం కళ్లముందర ఉండగా మీ మౌనం చెవులను బద్దలు గొడుతున్నది. మరోవైపు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సహితం కార్యనిర్వాహక వర్గం కనీస గౌరవం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ముగింపు:

పదేళ్ల పాలనలో వాగ్దానాల వరదా పారించారు. కాని అవి అమలులోకి రాలేదు. మోడీ పాలన మేడిపండును తలపిస్తోంది. చట్టాలను చుట్టాలుగా చేసుకొని ఆర్థిక నేరగాళ్లపై చర్యలు అంటూ సామాజిక మేధావులను, ప్రతిపక్షనాయకులను, పత్రికా యాజమాన్యాల గొంతునులమడం వంటి చర్యలకు పాల్పడ్డారు. గత పదేళ్ల మోడీ పాలనలో నిరుద్యోగం, దారిద్య్రం, అసమానతలు పెరిగాయి. కార్పొరేట్లకు 15 లక్షల బ్యాంకు పారుబాకీలను రద్దు చేశారు. మొత్తంగా చూస్తే మోడీ పాలన కార్పొరేట్లకు ప్రయోజనంగా, ప్రజలకు భారంగా పరిణమించింది. రాజ్యాంగ సవరణ అంటూ బిజెపి నాయకులు, చట్టసభ్యులు తరచూ చేసే వ్యాఖ్యల వెనుక మనుస్కృతి అమలుకు కసరత్తు ఉందన్నది యదార్థం. ‘2024 ఎన్నికలు సంక్లిష్టమైనవి. దేశానికి, దాని భవిష్యత్‌కు ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితులను దేశం ఎదుర్కోంటోంది. పదేళ్లుగా దేశంలో వినాశకర పాలన సాగుతోంది. గరిష్ఠ పాలన, కనిష్ట ప్రభుత్వం అన్నది మోడీ మాటలకే పరిమితమైంది. ఉద్యోగాల కల్పన, నల్లధనం వెనక్కి తేవడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, ధరలు తగ్గించడం, రాజ్యాంగ ఫెడరల్‌ స్వభావాన్ని పరిరక్షించడం, లౌకిక ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.

దేశాన్ని మతరాజ్యంగా మార్చేందుకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు కుట్ర చేస్తున్నాయి. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు కలిసి రాజ్యాంగాన్ని తుంగలో తోక్కేస్తున్నారు. భారత చరిత్రను వక్రీకరిస్తూ తిరిగి రాయాలని చూస్తున్నారు. ప్రజలలో మత భావాలు రేకెత్తించి రాజకీయ లబ్ధి పొందాలన్నది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల లక్ష్యంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుకోవడం ఎలా? రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక ప్రజాస్వామ్యం, ఫెడరల్‌ వ్యవస్థ పరిరక్షణ గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన సందర్భం ఇది. అసమానతలు, అన్యాయం, వివక్ష ఉండరాదన్నది ప్రజల భావన, అయితే దీనికి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు అంగీకరించవన్నది అక్షర సత్యం. ఈ కార్పొరేట్‌ మతతత్వ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా సాగనంపితే దేశానికి అంతమంచిది. ప్రజాసమస్యలు పరిష్కారం కావాలంటే బడా భూస్వామ్య, బడా బూర్జువా, సామ్రాజ్యవాద, మతతత్వ పాలకుల కూటమికి వ్యతిరేకంగా ప్రజాతంత్ర ఉద్యమాన్ని చేపట్టి విజయవంతం చేసుకోవడమే ప్రజల ముందున్న ఏకైక మార్గం.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply