ఎండాకాలంలో ఒకరోజు అమ్మ నన్ను ఒక్కదాన్నే ఇంట్లో వదిలి, దగ్గర్లోనే ఉన్న మా అత్త వాళ్ల గుడిసెకు వెళ్లింది.
గుడిసెలో ఒక్కదాన్నే ఉండడం నాకు ఇష్టముండేది కాదు. ఎత్తుగా వెడల్పైన భుజాలున్న ఓ నలభై ఏళ్ల పిచ్చాయన దగ్గర్లోని కొండల్లో రికామిగా తిరుగుతుండేవాడు. ఆయనంటే నాకు భయంగా ఉండేది. నిజానికి వియాక-నాప్బిన (అంటే డకోట భాషలో ‘ఈకల నెక్లేస్ వేసుకునేవాడు’ అని అర్థం) ఎవర్నీ సతాయించేవాడు కాదు. ఆకలి తట్టుకోలేకపోయినప్పుడే ఎవరి గుడిసెలోకైనా వెళ్లేవాడు. పంచెలా కట్టుకున్న ఒక ఎర్ర దుప్పటి తప్ప ఆయన వంటిమీద మరే వస్త్రం ఉండేది కాదు. రికామిగా ఒక లక్ష్యమంటూ లేకుండా తిరుగుతూ పోగుచేసిన అడవి పొద్దుతిరుగుడు పువ్వుల గుత్తిని ఎర్రని చేతుల్లో పట్టుకుని తిరిగేవాడు. ఆయన నల్లని జుట్టు గాలికి జడలు కట్టి, మండుటెండల వల్ల ఎండిపోయిన ఎర్రటి రంగులోకి మారిపోయేది. చెప్పులు లేని ఎర్రని పాదాలతో పెద్ద పెద్ద అంగలేసుకుంటూ ఆయన నడుస్తూ ఉంటే పొడవాటి ఆయన చేతులు ముందుకీ వెనక్కి ఊగేవి.
అప్పుడప్పుడు నడుస్తున్నవాడల్లా ఆగి, కళ్లమీద నీడకోసం చేతులు అడ్డం పెట్టి వెనక్కి సుదూరంగా చూసేవాడు. అంత పెద్దవాడు అలా వెర్రిగా ప్రవర్తిస్తున్నాడని నేను ఎగతాళి చేసినప్పుడు ఏదో దుష్టాత్మ తన అడుగుల వెంటనే వెంటాడుతోందని అనుకుంటాడని, అమ్మ నాకు చెప్పింది. అమ్మ నాకు దగ్గర్లో ఉన్నప్పుడూ, వియాక-నాప్బినా దూరంగా నడిచిపోతున్నప్పుడూ నాకు ధైర్యంగా ఉండేది.
“చిట్టితల్లీ, అతన్ని చూసి జాలి పడు. అతను అందమైన యువకుడిగా, వీరుడిగా ఉన్నప్పుడు నాకు తెలుసు. గుట్టల్లో తిరిగే దుష్టాత్మ ఏదో అతన్ని ఆవహించింది. ఒకరోజు తన గుర్రాలనేసుకుని అటూ ఇటూ తిరుగుతూ ఆ గుట్టల్లోకి వెళ్లాడు. ఆరోజు నుంచి ఆ గుట్టలకు దూరంగా ఉండలేడు.” అని అమ్మ చెప్పింది.
ఆ దురదృష్టవంతుడి గురించి విని నేను చాలా బాధపడ్డాను. అతన్ని తిరిగి మామూలు మనిషిని చెయ్యమని పరమాత్మను వేడుకున్నాను. అతన్ని దూరం నుంచి చూస్తూ జాలిపడేదాన్ని కానీ మా గుడిసె దగ్గర కనిపించినప్పుడు భయపడేదాన్ని.
అందువల్ల, ఆ మధ్యాహ్నం అమ్మ నన్ను ఒంటరిగా మా గుడిసెలో వదిలి వెళ్లినప్పుడు ఆయన గుర్తుకొచ్చి భయపడతూ కూర్చున్నాను. వియాక-నాప్బినా గురించి విన్నవన్నీ గుర్తుకొచ్చాయి. వియాక-నాప్బిన ఇటువైపు వచ్చినా, ఇంటి చుట్టుపక్కల చిన్నపిల్ల లేదని చూసి గుడిసెలోకి రాకుండా వెళ్లిపోతాడని నాకు నేను సర్దిచెప్పుకున్నాను.
అప్పుడే, ఒక చెయ్యి గుడిసె ముఖద్వారానికి ఉన్న కాన్వాసును ఎత్తింది. మొదట ఒక మనిషి పొడవాటి నీడ గుడిసెలో పడింది. తరువాత మొకసిన్ (తోలుతో చేసిన పాదరక్షలు) వేసుకుని వున్న పెద్ద పాదం ఒకటి గుడిసెలో అడుగుపెట్టింది.
ఒక్కక్షణం ఊపిరితీసుకోవడనికీ, కదలడానికీ భయపడ్డాను. ఆ వ్యక్తి ఖచ్చితంగా వియాక-నాప్బినా అయివుంటాడని అనుకున్నాను. మరోక్షణమే పైకే నిట్టూర్పు విడిచి ఊపిరి పీల్చుకున్నాను. గుడిసెలోకి వచ్చింది, ఇక్తోమి గురించి నాకు కథలు చెప్పిన ఒక తాత.
“మీ అమ్మ ఎక్కడుంది, నా చిట్టి మనవరాలా?” అని ఆయన అడిగాడు.
“అమ్మ మా అత్తా వాళ్లింటి నుంచి వచ్చేస్తూ ఉంటుంది” అని బదులిచ్చాను.
“అయితే సరే. నేను మీ అమ్మకోసం ఇక్కడే కాసేపు ఎదురుచూస్తాను.” అని అంటూ చాప మీద కూర్చున్నాడు.
నేను వెంటనే ఓ మంచి గృహస్తు వేషం ధరించేసి ఆయనకు ఆతిథ్యమివ్వడానికి పూనుకున్నాను. అమ్మ కాఫీ గిన్నెవైపు చూశాను.
మూత ఎత్తి చూస్తే అడుగున గసి మాత్రమే కనిపించింది. చల్లబడిన బొగ్గులమీద కాఫీ గిన్నె పెట్టి దాంట్లో సగానికి వెచ్చని మిస్సోరీ నది నీళ్లు నింపాను. ఆ పనంతా చేస్తున్నప్పుడు ఆయన నన్ను గమనిస్తున్నాడని నాకు అనిపిస్తూనే ఉండింది. తరువాత రొట్టెముక్కనొకదాన్ని గిన్నెలో పెట్టాను. నేను ఎంతసేపు వేచిచూసినా ఆరిపోయిన బొగ్గులమీద కాఫీ ఎప్పటికీ కాగదని, మట్టి నీళ్లకన్నా అధ్వాన్నంగా ఉన్న నీళ్లని ఒక కప్పులోకి పోసాను. కాఫీ కప్పుని ఒక చేతిలో, రొట్టె ముక్క గిన్నెను మరో చేతిలో పట్టుకుని వెళ్లి వాటిని ఆ ముసలి వీరుడుకి అందించాను. ఏదో గొప్ప ఆథిత్యాన్ని సమర్పించుకుంటున్నట్లు వాటిని ఆయనకు అందించాను.
ధన్యవాదాలు చెప్తూ ఆయన వాటిని అందుకుని, పద్మాసానంలో ఉన్న తన కాళ్ల ముందు పెట్టుకున్నాడు. రొట్టెముక్క తుంచి నోట్లో పెట్టుకున్నాడు. తరువాత కాఫీ తాగాడు. నేనేమో గుడిసె మధ్యలో ఉన్న స్థంభానికి చేరగిలపడి, ఆయనను చూస్తూ కూర్చున్నాను. నా అంతట నేనే ఒక అతిథికి మంచి ఆతిథ్యమిచ్చానని నాకు గర్వంగా అనిపించింది.
ఆ ముసలి వీరుడు రొట్టె తినడం, కాఫీ తాగడం పూర్తవకముందే అమ్మ ఇంట్లోకి వచ్చింది. ఆయనకు ఇవ్వడానికి నాకు కాఫీ ఎక్కడ దొరికిందో అమ్మకు అర్థం కాలేదు. అప్పటివరకు నేను కాఫీ ఎప్పుడు పెట్టలేదు, తను వెళ్లేటప్పటికీ కాఫీ గిన్నెలో గసి తప్ప ఏమీ మిగల్లేదని ఆమెకు గుర్తుంది. అమ్మ కళ్లల్లోని ప్రశ్నలకు, ఆ వీరుడు సమాధానమిచ్చాడు, “నేను వచ్చిన వెంటనే చల్లబడ్డ బొగ్గుల మీద కాఫీ తయారు చేసి ఇచ్చింది నా మనవరాలు.”
వాళ్లిద్దరూ నవ్వారు. ” కాసేపు ఆగండి. మంట రాజేస్తాను.” అని అమ్మ ఆయనకు చెప్పింది. ఆయనకోసం నిజం కాఫీ తయారు చేసి ఇద్దామని అమ్మ అసలు ఉద్దేశం.
తీసుకున్న ఆతిథ్యం కంటే ఎక్కువ హుందాగా ప్రవర్తించాలన్న సాంప్రదాయమున్న తెగ మాది. అందుకు తగ్గట్టుగా ప్రవర్తించాడు ఆ తాత. ఆయన గానీ, అమ్మ గానీ నన్ను ఎగతాళి చెయ్యలేదు. ఎంత తప్పైనప్పటికీ, నా నిర్ణయాన్ని వాళ్లు గౌరవించారు. ఆరోజు ఎంత హాస్యాస్పదంగా ప్రవర్తించానో నాకు ఎన్నో ఏళ్ల తరువాత గాని తెలిసిరాలేదు.
5.
చనిపోయినవాడి పండ్ల పొద
ఓ ఆకురాలు కాలం మధ్యాహ్నం మా పొరుగు గుడిసె పక్కనుంచి ఎంతో మంది జనం నడుస్తూ వెళ్లారు. రంగులు పులుముకున్న ముఖాలతో, ఛాతి మీద కణుజు దంతాలతో చేసిన తెల్లటి ఆభరణాలను ధరించి వాళ్లు హరక వాంబ్డి వాళ్ల ఇంటివైపు గబగబా వెళ్లారు. కొంతమంది తల్లులు తమ పిల్లలను పట్టుకుని నడిచారు. మరికొందరు పిల్లలను లాక్కుంటూ వేగంగా నడిచారు. వంకర తిరిగిన కర్రలు పట్టుకుని వంగిన వీపుతో మెల్లగా నడిచి వస్తున్న ముసలి అవ్వలను దాటుకుంటూ వెళ్లారు. చాలమంది యువకులు తమ గుర్రాల మీద కూర్చుని వచ్చారు. పళ్లూడిపోయిన వీరులు, ముసలి అవ్వల్లాగే మెల్లగా వెళ్లారు. అయితే వాళ్లు తమ గుర్రాల మీద నిటారుగా కుర్చున్నారు. గద్ద ఈకలతో చేసిన తురాయిలను ధరించీ, మునుపటి యుద్ధాల్లో తాము గెలుచుకున్న విజయచిహ్నాలను ప్రదర్శించారు.
గుడిసెల మధ్యలో ఉన్న పెద్ద గుడిసె ముందు పెద్ద మంటను రాజేశారు. కొన్ని పెద్ద నల్లటి కుండలను ఆ మంటల మీద పెట్టి వాటిల్లో దుప్పి మాంసాన్ని వండుతున్నారు. ఆ మంట చుట్టు పెద్ద వృత్తాకారంలో చాలా మంది జనం కూర్చున్నారు. ఆ గుంపు వెనక కొంతమంది యువవీరులు తమ గుర్రాల మెడలకు ఒరిగి నిలుచున్నారు.
నల్లటి రెండు జడలు చెవులకు అటూ ఇటూ వేసుకుని, శరదృతువులోని ఆకుల్లా మెరిసిపోతున్న ముఖాలతో యువతులు తమ సంరక్షుకల పక్కన సిగ్గు పడుతూ కూర్చున్నారు. పెళ్లికాని యువతులు, జనం అందరూ పాల్గొనే విందుల్లో హాజరవ్వాలంటే తమతో పాటు బంధువులనెవరినైనా తోడు పిలుచుకోవడం మా తెగల్లో ఆనవాయితీ. అదేమంత తప్పకుండా అనుసరించాల్సిన ఆనవాయితీ కాదుగానీ, సాధారణంగా అందరూ పాటిస్తారు.
బలవంతుడూ, ధైర్యవంతుడూ అయిన హరక వాంబ్డి తన మొట్టమొదటి యుద్ధం నుంచి యువ వీరుడిలా తిరిగి వచ్చాడు. అతని కొత్త హోదాను అందరితో కలిసి ఉత్సవంగా జరుపుకోవాలని తెగలోని అందరినీ విందుకు పిలిచారు అతని బంధువులు.
నా భుజాల మీద కప్పుకునేందుకు అందమైన ఎర్రచారల దుప్పటిని అందుకుంటున్న నాకు, ఉల్లాసంగా సాగుతున్న ఆ సంరంభాన్ని చూస్తుంటే అసహనంగా అనిపించింది. ఆరోజు ఉదయం మా అత్త తెచ్చిచ్చిన అడవి బాతునూ వండుతూ అమ్మ తీరికలేకుండా ఉంది.
“అమ్మా, అమ్మా, మనల్ని విందుకే పిలిచినప్పుడు అక్కడికి వెళ్లకుండా ఈ చిన్ని భోజనాన్ని ఎందుకు వండుతున్నావు? గుర్రుగా అడిగాను.
“ఓపిక పట్టడం నేర్చుకో, చిట్టితల్లీ. ఉత్సవానికి వెళ్ళేదారిలో చాన్యు వాళ్ల గుడిసె దగ్గర కాసేపు ఆగి వెళ్దాం. వాళ్ల ముసలి అత్త అనారోగ్యంతో మంచంలో ఉంది. ఈ చిన్ని భోజనం ఆమె ఇష్టపడొచ్చు.”
అవసానదశలో ఉన్న ఆమె సన్నని ముఖంలో బాధను ఒకసారి చూశాను. అప్పటివరకు ఆమె నాకు గుర్తు రానందుకు సిగ్గు పడ్డాను.
దారిలో నేను అమ్మ ముందు పరిగెత్తి ఒక చిన్న పొదకు కాసిన ఊదారంగులో ఉన్న పండ్లను అందుకోబోయాను. అమ్మ సన్నని గొంతుతో ‘ష్’ అని నన్ను మందలించింది.
“ఏం అమ్మా? నాకు ఈ పండ్లు తినాలనుంది.” నేను నిరాశతో చెయ్యి దించి అడిగాను.
“ఈ పొదనుంచి పండ్లను ఎప్పుడూ తెంపకు చిట్టి తల్లీ. ఎందుకంటే ఈ పొద వేర్లు ఒక ఇండియన్ వ్యక్తి అస్థిపంజరాన్ని అల్లుకుని ఉన్నాయి. ఒక వీరుడిని ఇక్కడ సమాధి చేశారు. అతను బతికి ఉన్నప్పుడు ఈ పండ్ల విత్తనాలతో ఎప్పుడూ ఆడుకునేవాడు. అతను చనిపోయినప్పుడు అతని విత్తనాలను చేతిలో పెట్టి పూడ్చిపెట్టారు. ఆ విత్తనాలనుంచే ఈ పొద పుట్టింది.”
ఆ నిషిద్ధ ఫలాలను చూస్తూ, పవిత్రమైన ఆ నేల మీద మెల్లగా అడుగులు వేశాను. అక్కడనుంచి కొంచెం దూరం వెళ్లేంతవరకు అమ్మతో గుసగుసగా మాట్లాడాను. ఆరోజు తరువాత, ఆ పొదవైపు ఎప్పుడు వచ్చినా, నా పిచ్చి వాగుళ్లు ఆపేసేదాన్ని. విస్మయంతోకూడిన గాంభీర్యం నన్ను ఆవహించేది. ఆ పొద వేర్ల నుంచి ఈల శబ్దం వినిపించేది. వెళ్లిపోయినవారి ఆత్మలనుంచి వచ్చే ఈలలు నేను ఎప్పుడూ విని ఉండకపోయినా, కానీ వాటి గురించి పెద్దవాళ్ల దగ్గర ఎన్నోసార్లు వివరంగా విన్నందుకు, ఆ ఈలను విన్న వెంటనే గుర్తుపట్టగలనని నా నమ్మకం.
మృతవీరుడి పండ్ల చెట్టు గురించి అమ్మ చెప్పినదే ఆరోజు నామీద శాశ్వత ముద్ర వేసిందని, ఇప్పుడు అనిపిస్తోంది.
బావుంది కథనం