విశాలమైన ఆవరణ. అక్కడక్కడా వేసిన టేబిల్స్ కుర్చీలు. అవి వో పద్దతిలో వేసినవి కానప్పటికీ ఆ అమరికలో వో హార్మోనీ వుంది. ఆ కుర్చీలలో కూర్చుని కాఫీ తాగుతూ ఆ ప్రాంగణంలో తిరుగుతోన్న రకరకాల కుక్కపిల్లలని, కుక్కలని చూస్తున్నారెందరో. వాటన్నిటికి పేర్లు వున్నాయి. దాదాపు అందరూ ఆ పేర్లు తెలుసుకొని ఆ పేర్లతో పిలుస్తున్నారు. తెలియని వాళ్ళు, వాళ్ళకి నచ్చిన అలవాటైన మాటల్లో పలకరిస్తున్నారు. కానీ యెవ్వరు వాటిని యే భాషలోనూ కుక్కలని మాత్రం అనటం లేదు. వాటిల్లో స్నేహపూరితమైనవి కెఫేకి వచ్చిన గెస్ట్ ల కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. కొన్ని బాల్స్ తో ఆడుకుంటున్నాయి. మరికొన్ని రోజు చూస్తోన్న తమ సాటి కుక్కపిల్లలలో పెద్దవి పెద్దవాటితో, చిన్నవి చిన్నవాటితో ఆడుకొంటున్నాయి.
రేవంత్ వెంట మూడేళ్ళ మైత్రీని నడిపిస్తూ మైనా, స్ట్రాబెరిని చైన్ తో పట్టుకొని డ్రైవర్, స్ట్రాబెరీ రోజూ తినే ఫుడ్ బాస్కేట్ తో వాళ్ళ వెంటలోపలికి వెళ్ళుతున్న మంగ కెఫే ని కుతూహలంగా చూస్తూ నడుస్తోంది.
ఆఫీస్ లో డబ్బులు కట్టారు. అక్కడ స్టాఫ్ బాయ్ ఫుడ్ బాస్కెట్ ని తీసుకొని దానికో నెంబర్ స్టిక్కర్ వేసాడు. స్ట్రాబెరీ ని ఆ ప్రాంగణంలో వదిలారు. అక్కడున్న మిగిలిన వాటితో కలిసిపోతుందో లేదో కాసేపు గమనించారు. స్ట్రాబెరీ మరో రెండు పెట్స్ కలిసి ఆడుకోవటం మొదలుపెట్టాయి.
“వెరీ ఫ్రెండ్లీ… నైస్” పెట్స్ ని చూసుకొనే స్టాఫ్ లోని వో అమ్మాయి అంది.
“యేమైనా ప్రాబ్లం వుంటే కాల్ చెయ్యండి. డ్రైవర్ నెంబర్ కూడా యిచ్చాం. తనొచ్చితీసుకువెళ్ళతాడు” అంది మైనా.
“అలానే. కానీ మీరేం వర్రీ కాకండి. స్ట్రాబెరీ యిక్కడ కంఫర్ట్ బుల్ గా వుంటుంది. ఫెరోషియస్ గా వున్నవి క్యూబికల్స్ లోనే వుంటాయి. కెఫేకి వచ్చే వాళ్ళు కూడా వీటన్నిటిని ప్రేమించేవారే. అస్సలు మిస్ బిహేవ్ చెయ్యరు” భరోసా యిచ్చిందా అమ్మాయి.
వాళ్లకి కాస్త యెడంగా నిలబడి యింగ్లీష్ లో సాగుతోన్న యీ సంభాషణని వింటున్నా విషయం అర్ధం కాలేదు మంగాకి.
స్ట్రాబెరీ ని మరోసారి ముద్దు చేసి ‘’బై బై… సీ యూ…” అని కెఫే నుంచి బయటకి బయలుదేరారు మైన, రేవంత్. మైత్రీ ‘బై’ అంది.
ఆమె వెనకే వస్తూ ‘’యేమిటమ్మా యిది” బోలెడు ఆశ్చర్యంతో అడిగింది మంగ.
‘’మేం ఆఫీస్ కి వెళ్లిపొతే యింట్లో మరెవ్వరూ వుండకపొతే వాటికి ఫుడ్ పెట్టటం అవ్వదు కదా. అవి కూడా వొoటరిగా అంత సేపు వుండాలంటే బెంగగా అయిపోతాయి. మాలా జాబ్స్ చేసేవాళ్ళు వాళ్ళ పెట్స్ ని యిక్కడ వదలొచ్చు. సాయంత్రం మా ఆఫీస్ అయిపోగానే పట్టుకొని వెళ్ళొచ్చు. అలానే పనుల మీద బయటకి వెళ్ళేవాళ్ళు యిక్కడుంచి వెళ్ళొచ్చు. నెలకో, రోజుకో కట్టొచ్చు. భలే రిలీఫ్ యిటువంటి కెఫేలతో” అoది మైనా.
పెట్స్ డే కేర్ కేఫ్ఫే ని కళ్ళూ, నోరు వెళ్ళబెట్టి చూస్తూ ‘పిల్లలని డే కేర్ ల్లో వదిలేట్టు పెంపుడు జంతువులని కూడా వదిలే సౌకర్యమన్నమాట’ అనుకొంది మంగా.
ఆ తరువాత మైత్రీని డే కేర్ లో వదిలాక ‘’చూసావు కదా. రోజు యిలా వీళ్ళిద్దర్నీ డ్రైవర్ తో వచ్చి డ్రాప్ చెయ్యాలి” అంది మైనతో.
మంగా తలూపింది.
కొద్ది రోజుల క్రితమే యూ యస్ నుంచి మైనా, రేవంత్, మైత్రీతో యిండియాకి రావటానికి ముందే వాళ్ళు యింటిని ఫర్నిష్ చేయించుకొన్నారు. ఆన్ లైన్ లో స్ట్రాబెర్రీ ని కొనుక్కున్నారు. మంగాని మైత్రీ, స్ట్రాబెరీ పనుల కోసం. యింటి పనికి మరో ఆమెని, డ్రైవర్ న్నిఆ యా యెజెన్సీ లతో అపాయింట్ చేయించుకొన్నారు.
‘యెంతో ప్లానింగ్ తో జీవితంలో ప్రతీది చెయ్యటం వారి జీవిత విధానమవ్వటం వల్ల వారి జీవితం బాగుందా… లేక బాగుండటం వల్ల ఆ జీవిత విధానం వచ్చిందా..’ అని వాళ్ళని చూసిన మొదటి రోజే అనుకొంది మంగ.
తమ జీవితాలూ వున్నాయెందుకు?! అతుకుల బొంతనైనా కాస్త తీరుగా కుట్టొచ్చు. తమ బతుకులని మాత్రం తీరుగా చేసుకునే పరిస్థితే కనిపించటం. తనకి తన వూరిలో బాగుండేది. కానీ రమేష్ కే… మంగాకి తామిక్కడకి రావటం, నడుస్తోన్న జీవితం మెదిలింది.
యేడాదిన్నర కూతురు రేఖతో పల్లె నుంచి కాస్త యెక్కువ సంపాదించాలనే రమేష్ కోరిక మేరకు ఆరు నెలల క్రితం సిటీకి వచ్చారు. ఆ పల్లె నుంచి రెండేళ్ళ క్రితం సిటీకి వచ్చిన రమేష్ స్నేహితుడు తిరిగి పల్లెకి వెళ్ళిపోతూ, తను చేస్తున్న డ్రైవర్ వుద్యోగాన్ని రమేష్ కి యిప్పించాడు.
యిన్నాళ్ళు అతనుండే యింటినే అద్దెకి మాటాడాడు. కొండాపూర్ కి దగ్గరల్లో వో బస్తీలో రెండు నవ్వారు మంచాలు వేస్తే పట్టేంత గదిని మూడు వేల ఐదొoదల అద్దె. కరెంట్ చార్జీలు ఫ్రిజ్ కి యింతా, టీవీకైతే యింతా యిలా వేరువేరుగా చార్జీలున్నాయి. టీవి వుంది. ఫ్రిజ్ లేదు. యల్ యి డి ట్యూబ్ లైట్ పెట్టుకోవాలని యింటి వోనర్ స్పష్టంగా చెప్పారు. కరెంట్ యిస్త్రీలు యింట్లో చెయ్యడానికి వీలులేదు. నీళ్ళ ఛార్జీలు, కరెంట్ చార్జీలు కలిపి అద్దె నాలుగు వేలైయింది.
*
వో నెల గడిచింది
“యీ సిటీకి వచ్చినకాడ్నుoచి తిండి నుంచి అన్నింటికీ తడుముకున్నట్టే వుంది. పదహారేల జీతo కదా. మీరిస్తున్నది యే మూలకీ రావటం లేదు” అంది మంగా.
“పొద్దంతా యింట్లో వుండే బదులు రెండు యిళ్ళల్లో పని చేసుకోవచ్చు కదా…” అన్నాడు రమేష్.
“పిల్లతో యెలా అవుతుంది చెప్పు. నాకూ పని చేసుకోవాలనే వుంది. యిల్లన్నా గడుస్తుంది” అంది.
“నేనేమైనా నాకోసం ఖర్చు పెట్టుకుంటున్నానా. యీ యింటి అద్దె, పిల్ల ఖర్చు. వొక్కోసారి ఆకలేస్తున్నా టీతో సరిపెట్టుకుంటున్నా బయట” నిష్టూరంగా అన్నాడు రమేష్.
“అసలు యీ పాట్లన్నీ మనకెందుకు. వున్న వూరులో వుండొచ్చుగా. అక్కడ మనకేం తక్కువ. వుండటానికి యిల్లుoది. యింటికే రేషన్ వస్తుంది. రోజూ చేపలూ, రొయ్యలూ, కావాలనుకున్నప్పుడు కోడి అన్నీ వున్నాయి కదా. యిక్కడేం బాలేదు మన వూరు వెళ్ళిపోదాం” అంది మంగ.
“అదేం యిల్లు. ఆ స్టలంలో మేడ కట్టాలి, చిట్టిబాబు యిల్లు కంటే గ్రాండ్ గా. మన పిల్లని మంచి కాన్వెంట్ కి పంపాలి. రెండు కార్లు టాక్సీలకి పెట్టి తిప్పిoచాలి” అన్నాడు రమేష్.
“అప్పుడు ఇజ్రాయిల్ వెళ్ళాలి. చిట్టిబాబు వాళ్ళు అదంతా అక్కడికెళ్ళేకదా కూడపెట్టారు” అని నవ్వి ‘’యివన్నీ మన వల్ల కాదు కానీ మన వూరు పోదాo” “పిచ్చి లేచిందా… యేo… నువ్వు పిల్లని వో రెండు గంటలు యెవ్వరికైనా అప్పచెప్పి పనిలోకెళ్ళు. ఆ డబ్బులతో నెల గడుపు. పదివేలు నెలకి చీటీ వేస్తున్నా. కారుకి కట్టి మిగిలినవి ఫైనాన్స్ తీసుకోవాలి. వూబర్ లో కారు నడుపుతా. యెంత కష్టం చేస్తే అంత డబ్బు. ఆ మళ్ళీ మరో కారు… అలా డెవలప్ అవ్వాలి మనం” అన్నాడు రమేష్.
పిల్లని వో రెండు గంటలు పెట్టుకుంటారాని యిరుగూపొరుగూ వాళ్ళని అడిగింది. పెట్టుకోం అన్నారు.
బట్టలు యిస్త్రీకి యిచ్చి, పిల్లని పెట్టుకోవటం గురించి యిస్త్రీ చేసే చిట్టిబాబు భార్య బేబినీ అడిగింది మంగ.
‘బంధుత్వం వుంటే పెట్టుకుంటారు కానీ నిన్నగాక మొన్నొచ్చావ్ పిల్లని యెవరు పెట్టుకుంటారు చెప్పు? చుట్టాలు కాకపోయినా యేదో తెలిసిన వాళ్ళనైనా చూస్తారు. కానీ మన వైపు వున్నవాలైనా లేరిక్కడ. నేనా రోజూ రాను. వచ్చినా యీ చిన్ని షాప్ లో పిల్లని పెట్టుకోడానికీ వీలుకాదు. ఆడేపిల్లని పట్టుకోవటం కష్టం. పొరపాటున పాస్ పోసిందనుకో… బట్టలు కదా కష్టం…” అంది బేబీ.
*
అలా తన ప్రయత్నాలు తను చేసి చివరికి రమేష్ తో ‘యిప్పుడు కోతల పనులూ లేవుగా. మీ అమ్మని పిలిపించొచ్చుగా’ అంది మంగ.
రమేష్ తన తల్లి సుగుణమ్మని మనవరాలిని చూసుకోడానికి రమ్మని అడిగాడు. ఆమె వచ్చారు. ఆమె వచ్చాకే మైనా వాళ్ళ యింట్లో మంగ పనికి కుదిరిoది.
యీ రోజు మొదటి రోజు డే కేర్ కి రావటం.
*
మైత్రీని డే కేర్ లో, స్ట్రాబెరిని కెఫే డే కేర్ లో వదిలాక తిరిగి మైనా వాళ్ళుండే గేటెడ్ కమ్యూనిటీకి మంగాని డ్రైవర్ తీకుకువెళ్ళతాడు.
అక్కడే మరో రెండిళ్ళల్లో పని చేసుకొని యింటికి వెళ్ళేసరికి మంగాకి పన్నెండున్నరయింది. యింటికెళ్లి రేఖకి అన్నం తినిపించింది. అత్తగారితో కలిసి మంగా భోజనం చేసింది. గిన్నెలు తోమి, బట్టల్లుతుక్కుని, నీళ్ళు వచ్చే రోజేమో నీళ్ళు పట్టుకొoది. రమేష్ బట్టలని చిట్టిబాబుకి యిస్త్రీకిచ్చింది. యే వొక్క పనిలోనూ అత్తగారు సాయం చెయ్యకపోవటం మంగాని బాధిస్తోన్న పోనీలే తను పనికెళ్ళి వచ్చేవరకూ పిల్లని చూస్తోంది కదా అనుకొంది.
*
టీవి చూస్తూ, మనవరాలిని కనిపెట్టుకొoటూ ఆ చిన్ని గదిలో కూర్చోవటం నెల తిరక్కుండానే సుగుణమ్మకి విసుగ్గా అనిపించింది. యింటికి వెళ్ళిపోతానని సణుగుడు మొదలు పెట్టారు. ఖర్చులకి నెలకి వెయ్యి రూపాయిలు యిస్తానని అత్తగారితో మాటాడమని మంగ, రమేష్ కి చెప్పింది. కొన్ని సూటిపోటి మాటలు, సెంటిమెంట్ ల్ వాక్యాల తరువాత తల్లిని వొప్పించగలిగాడు రమేష్.
సుగుణావతికి ఆ వొప్పoదం రెండు వారాలు కూడా రుచించలేదు. చుట్టు పక్కల ఆడవాళ్ళంతా యిళ్ళల్లో, హోటళ్ళల్లో పాత్రలు తోముతూ, కూరలు కట్ చేస్తూనో, సూపర్ మార్కెట్లలో సరుకులు బాగుచేస్తూనో నెలకి యిరవై వేలకి తక్కువ కాకుండా సంపాదిస్తుంటే తనేమిటి వెయ్యి రూపాయిలకి సొంత మనవరాలిని చూడ్డానికి డబ్బు తీసుకుంటున్నాననే మాట పడుతూ యెందుకుండాలి!!?
మనవరాలిని చూసుకునే టైంలో బయట నాలుగు యిళ్ళల్లో పనిచేసుకొంటే దాదాపు యిరవై వేలు వస్తాయి కదా. తన కోడలు అంత సంపాదిస్తూ తనకి వెయ్యి రూపాయిలు యిస్తాననటం యేమిటి.? తనకిప్పుడు కోతల సమయం కాదు. కోతల వరకూ యిక్కడ యిళ్ళల్లో పనిచేస్తే యీ మూడు నెలల్లో దాదాపు అరవై వేలు సంపాదించుకోవచ్చు. సుగుణమ్మ యిలా పరిపరి విధాల ఆలోచించి వొకానొక వుదయం అన్నీ మొహమాటాలూ పక్కన పెట్టేసి రెండు యిళ్ళల్లో పనికి చేరిపోయింది.
దాంతో మంగాకి ఆమెకి మాటామాటా పెరిగింది. ఆ పెరిగిన మాట మంగాకి రమేష్ మధ్య మా అమ్మని అంటావా? యేo మీ అమ్మని పిలిపిoచుకోవేంమనే తగాదాగా మారిపోయింది.
“యేo తెలీనట్టు మాటాడతావు? మా అక్క పనికి ఖతార్ వెళ్ళింది కదా తన యిద్దరి పిల్లల్ని మా అమ్మే చూసుకుంటుంది. యెగతాళి కాకపొతే” అంది మంగ.
“యేo… పెద్దల్లుడి పిల్లల్నేనా… మన పిల్లని చూడొచ్చుగా” అన్నాడు రమేష్.
“వెటకారం హెచ్చుగానే వుంది” యీ గోలoతా యెందుక్కానీ పిల్ల పెద్దదయ్యే వరకూ పనికెళ్ళను” ఖరాకండీగా చెప్పేసింది మంగ.
“పనికి పోకపోతే యిల్లేలా గడుస్తుంది” బేలగా అన్నాడు రమేష్.
“యేమో… ” అంది మంగ.
“మతుండే మాటాడుతున్నావా?! చీటీకే పదేలు పోతున్నాయి. నా ఫోన్, బయట తాగే టీలూ, హెయిర్ కట్, డేటా కార్డ్, కొత్త సినిమా ఖర్చు బొటాబొటీగా వుంది బతుకు. నువ్వు మానేస్తే యింటి అద్దె, తిండి యెలా” వొక్క అరుపు అరిచాడు రమేష్.
“అయితే నే పనికి వెళ్లి వచ్చేవరకు పిల్లని నువ్వు పట్టుకో. లేదా మీ అమ్మకి చెప్పుకో” అంది.
“మా అమ్మతో మాటాడతా” అన్నాడు.
సుగుణమ్మతో రమేష్ మాటాడేడు. నెల మధ్యలో మానేస్తే యిళ్ళల్లో వాళ్ళు డబ్బులు యివ్వరేమో… జీతo తీసుకుని మానేస్తాలేరా” అని కొడుక్కి చెప్పనైతే చెప్పారు కానీ ఆమెకి ఆ సంపాదన వదులుకోవటం యిష్టం లేదు.
పల్లెల్లో సుగుణమ్మకి రోజూ మొగుడు తాగొచ్చి బయట చేసే గోలా, యింట్లో శరీరం మీద చేసే చీదరా జీవితంలో తప్పటం యిదే మొదటిసారేమో సుగుణమ్మకి పల్లెకీ వెళ్లాలని లేదు. కాస్త డబ్బులు మొగుడు తాగడానికి పంపితే కనీసం వో నాలుగు నెలలైనా ప్రాణానికి హాయి అనుకుందామె. అదీకాక వున్న చోట కూర్చునే అలవాటు పుట్టి బుద్దేరిగినప్పటి నుంచి లేదేమో పిల్లని మాత్రమే చూసుకొంటూ, టీవీ చూస్తూ కాలక్షేపం చెయ్యాటానికి ఆమె మనసొప్పటం లేదు. ఆ విషయం డైరెక్ట్ గా కొడుక్కి చెప్పలేక అప్పటికి తప్పిoచుకొంది.
పెళ్ళైనప్పటి నుంచి అత్తగారిని కాస్త పట్టిపట్టి చూస్తోన్న మంగాకి ఆమె వొప్పుకోవటం ఆనందంగా అనిపించినా వో అనుమానాస్పద మేఘం ఆమె మనసులో తిరుగుతోనే వుంది.
అత్తగారు పని మాని పిల్లని చూసే వరకూ పిల్లని చూడమని బస్తీలో కొడుకూకోడలు యింట్లో వుండే దేవమ్మని అడుగుతానని చిట్టిబాబు భార్య అంది. నెలకి వేయి రూపాయిలు యిస్తే చూస్తానంది దేవమ్మ. మంగ సరేనంది. డబ్బులిస్తున్నట్టు తన కోడలికి చెప్పకూడదoది దేవమ్మ.
వో రెండొoదలు యిమ్మంది దేవమ్మ. మంగ యిచ్చింది. మొదటి రోజు దేవమ్మ రేఖాని సవ్యంగానే చూడటంతో సుగుణమ్మ మాట తప్పినా పర్లేదు దేవమ్మ బానే చూసుకుంటుంది అనుకొంది మంగ.
*
నెల అవ్వగానే జీతం తీసుకొoది సుగుణమ్మ. యింట్లో ఫుల్ టైం వుండే పని దొరికిందని తన బట్టల బ్యాగ్ తీసుకొని మనవరాలి చేతుల్లో ఐదొoదలుంచిoది.
తను అనుకున్నట్టే అత్తగారు తన బుద్ధి చూపించుకున్నారనుకొoటూ ‘చూసావా’ అన్నట్టు రమేష్ వైపు చూసింది మంగ.
రమేష్ తల్లిని ఆ యింట్లో దింపుతూ తను టాక్సీ కొనుక్కోవాలనుకొంటున్న విషయం చెప్పాడు.
*
ఆ రోజు మంగ పని నుంచి వస్తూ పిల్లని తెచ్చుకుందామని దేవమ్మ యింటికి వెళ్ళింది. తలుపు దగ్గరకి వేసుంది. పిలిస్తే దేవమ్మ రాలేదు. టివీ లోంచి హిందీ సీరియల్ వినబడుతోంది. మంగ తలుపు తోసుకొని లోపలికి వెళ్ళింది. మంగని అక్కడ దృశ్యం చూసి ముందు బిక్కబారిపోయింది. దేవమ్మ పన్నెండేళ్ళ మనవుడు రేఖ మీద పడుకుని నిపిల్స్ ని ముద్దు పెట్టుకొంటూ కనిపించాడు.
ఆ పక్కనే మంచం మీద పెద్ద గురకతో నిద్రపోతోంది దేవమ్మ. మంగని చూసి ఆమెని తోసుకొంటూ చేతికి అందకుండా పారిపోయాడా బాలుడు.
పట్టరాని కోపంతో దేమమ్మని కనిపించిన చీపురుతో మంగ చితక బాధేస్తుండగా దేవమ్మ కోడలు రోజా లోపలి వచ్చింది. చేతిలోని పాలితీన్ కవర్ న్ని హడావిడిగా కింద పెడుతూ అరుస్తూ ‘’పగలా గయా క్యా… మార్ దియారే…” అంటూ మంగని వొక్క తోపు తోసింది.
ఆ దెబ్బలకి కూడా లేవలేనంత తాగున్న దేవమ్మ కనీసం యిటు నుంచి అటు కూడా తిరగ లేదు. విరిగిపోయిన చీపురుని అక్కడ పడేసి పిల్లని భుజాన్ని వేసుకొని కళ్ళనీళ్ళని కూడా తుడుచుకోకుండా అలానే దుక్కపడుతూ “పిల్లని చూస్తానని చెప్పి అలా వదిలేస్తుoదా? నీ కొడుకెక్కడా… వాణ్ని చంపేస్తా” వెక్కిళ్ళ మధ్య అరిస్తోంది మంగ.
“యెంటే నా కొడుకుని అంటున్నావ్. మా అత్త మీద పిల్లనెందుకు పడేసి వెళ్ళుతున్నావ్. పిల్లని పెట్టుకోవద్దని మా అత్తకి చెప్పాలనుకున్నా.” అంది రోజా.
“వుత్తి పుణ్యానికేమైనా చేస్తోందా మీ అత్త. నెలకి వెయ్యి రూపాయిలు మాటాడుకొని రెండొందలు అడ్వాన్స్ తీసుకొంది” అంత కంటే గట్టిగా అరిచింది మంగ.
“మా అత్తమ్మని పనికి పెట్టుకునేoత మేడంవ్వి అయ్యావా” గయ్ మని అరుస్తూ
“పైసా కనిపిస్తే పదిరూపాయలు తాగే బాపతు మా అత్తమ్మ. నీ డబ్బుల వల్లే మళ్ళీ తాగటం యెక్కువయింది. మీ అత్తమ్మ వుందిగా. పో…పోవే… మా అత్తమ్మనే పనికి పెట్టుకునే దొరసానివా… ’ అప్పటికే బస్తీబస్తీ గుమ్మిగూడిపోయారు.
రోజా కొడుకు చేసిన పనిని బయటకి చెప్పలేక పిల్ల బతుకుని బయట పెట్టినట్టు అవుతుందని యేడుస్తూనే యింటి కొచ్చింది మంగ. వేడినీళ్ళల్లో కొన్ని డెటాల్ చుక్కలు వేసి పిల్ల వొళ్ళు రుద్దుతూ కళ్ళు తుడుచుకొంటూనే వుంది మంగ.
రోజా కొడుకు విషయం మాత్రం రమేష్ కి చెప్పలేదు రమేష్ కోపంతో ఆ పిల్లవాడిని యేమైనా చేసేస్తాడేమోననే భయంతో.
*
“పాపని నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి కంఫర్ట్ బుల్ గా జాబ్ చేసుకుంటున్నాను. థాంక్యూ’ అని షర్మిల అందో రోజు మంగతో.
డబ్బులిస్తున్నాం పని చేస్తుందిలే అనుకోకుండా షర్మిలా నేర్చుకొoటోన్న తెలుగులో యిలా తన కృతజ్ఞతని మంగకి చెపుతూనే వుంటుంది.
షర్మిలా అలా చెపుతుంటే మంగాకి మొదట్లో ఆశ్చర్యంగా అనిపించేది. తర్వాతర్వాత ‘ఆమె వేరే భాషావిడ కదా… ఆ భాషోళ్ళు అలానే చేపుతారేమో’ అనుకునేది.
యీ విషయాన్ని తనతో పనికివచ్చే యింటిపనులు చేసే వాళ్లకి చెపితే ‘నేను పనిచేసే యిళ్ళల్లో వో మేడంది వేరే భాషే. కానీ ఆ యమ్మ యెప్పుడూ చెప్పలేదు’ అందో అమ్మాయి.
మైనా అలా థాంక్స్ చెప్పటం ఆమె తనకి యిస్తున్న గౌరవంగా సంతోషపడింది మంగ. అలాంటి మైనాతో పాపని యెక్కడ పెట్టడానికి వీలులేక పడుతోన్న తిప్పలని వో రోజు చెప్పింది.
‘అరే… సారీ…’ అందామె. కానీ ఆమె వో పరిష్కారాన్ని చూపించ లేకపోయింది.
*
రేఖా ని యెక్కడా వుంచకుండా యింట్లోనే వుంచాలని నిర్ణయించుకొంది మంగ. మంచం మీద నుంచి దూకకుండా మంచం యెత్తి లాగినా కింద పడకుండా వో తాడేసి గోడకి కొట్టిన పెద్ద కొక్కేలకి వేసి కట్టేసింది. లోపల్నుంచి బోల్ట్ పెట్టుకునే అవకాశమే లేదు. బోల్ట్ లోపలి వైపు పైకే వుంది. పిల్లకి వుదయం తినిపించి పిల్ల గదంతా తిరిగై కుండా కాలికి స్ట్రాబెరీకి వేసేలాంటి మెత్తగా వుండే వో గొలుసుని అనుష్కాకి వేసి కట్టేసింది మంగ. తల్లి ప్రాణం అయ్యో అని కొట్టుకొంటున్నా యింట్లోనే వుంటుంది పిల్ల. బయటవాళ్లకి అప్పచెప్పే పరిస్థితి లేదు. యిల్లే సేఫ్ అనుకుంది మంగ. యింటికి బయట తాళo వేసి పనికి వెళ్లిoది.
వొకే వొక్క ఆలోచన… ఆ వొక్క ఆలోచన తప్పా మరే ఆలోచనలూ లేనట్టు అయిపోయింది మంగ జీవితం… పాప యెలా వుందో… లేచుoటుoదా… యేడుస్తోందా… యిలా పనికి వచ్చినంతసేపు కూతురు అనుష్కా ఆలోచనలే మంగకి. కూతురిపై ధ్యాసలో మిగిలిన ప్రపంచమంతా గప్ చిప్ అయిపోయిందామెకి.
వొకప్పటిలా వొక్క చోట నిలిచే కాళ్లు కావాయే… కట్టేసింది కదా… యేడిస్తే కాసేపు యేడుస్తుంది… తనే వూరు కొంటుంది అనుకొoటూ తనని తానే వూరడించుకొంటుంది మంగ.
*
ఆ రోజూ పని చేసుకొని మంగ యింట్లోకి అడుగు పెట్టిన మంగ పై ప్రాణాలు పైకే పోయాయి. ప్లాస్టిక్ బిందెలో తల పెట్టేసిoది పిల్ల. అక్కడ వరకూ కట్టిన తాడుతో సహా యెలా పోయిందో ఆ బల్లని యీడ్చుకొంటూ. గుక్కపెట్టి యేడ్చి సొమ్మసిల్లి పోయిందా.
అంతకంటే యెక్కువ ఆలోచించలేక వుక్కిరిబిక్కిరవ్వుతూ పిల్ల తలని అందుల్లోంచి తీయ్యడానికి ప్రయత్నించింది. ఆమె వల్ల కాలేదు. బయటకు పరిగేత్తింది. బైక్ మీద ఆ అరుగుల మీదా సెల్ ఫోన్ ల్లో సినిమా చూసుకొంటున్న ముగ్గురు కుర్రాళ్ళు కనిపించారు. అలా బస్తీలో వాళ్ళు వో యిరవై మంది వరకూ మూగారు.
‘’చెవులకి సబ్బు రాయండి వచ్చేస్తాది” యెవరో అన్నారు.
తలని అందులోంచి తీయ్యటానికి తలా రెండు సలహాలు చెప్పారు. యెవరికి తోచిన ప్రయత్నo వాళ్ళు చేస్తూనే వున్నారు.
‘పాస్టిక్ దే కదా… యీ ఖీమా కొట్టే కత్తితో కొట్టేస్తే…
అమ్మో… వద్దు పొరపాటున పిల్ల తలకి తగిలితే…
కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో కొట్టేస్తే…’
‘వొద్దొద్దు….’
అప్పుడొచ్చింది బేబీ యిస్త్రీ పెట్టెతో. వేడివేడి పెట్టెని ఆ ప్లాస్టిక్ బిందె మీద పెట్టింది.
ప్లాస్టిక్ మెల్లగా కరగసాగింది.
అప్పుడు ఆ కమురు వాసనకి చుట్టూ వున్నవాళ్లే దగ్గుని ఆపుకోలేకపోయారు.
పిల్ల తలని బయటకి తీసారు.
కూతుర్ని గుండెలకి హత్తుకొని బోరుమంది మంగ.
పిల్లని ముందు డాక్టర్ దగ్గరకి పట్టుకెల్లండన్నారెవరో.
‘అక్కరల్లేదు… తల అందులో వుండే సరికి కాస్త వూపిరి అందుండదు’ అంటూ పిల్లని బలవంతంగా మంగ చేతుల్లోంచి లాక్కుని నోటితో ముఖం మీదకి గాలి వూద సాగింది దేవమ్మ.
వాళ్ళందరినీ చూస్తూ వీళ్ళు తనూ వొకప్పుడు తన్నుకొన్నాం. అరుచుకొన్నాం. మాటాడుకున్నాం. నవ్వుకొన్నాం. పంచుకొన్నాం. కలిసి వున్నట్టా… స్నేహితులమా… బంధూవులా… యేమో… యిదంతా… దగ్గరా కాదు దూరమూ కాదు… యెన్నాళ్ళు వున్నాతమ తమ వూరుల్లో వున్నట్టు, పుట్టినప్పటి నుంచి వొకరిని వొకరు బాబాయ్ పిన్నమ్మ మామ అత్తా అన్నా తమ్ముడూ అని పిలుచుకొనే అనుబంధాలూ మధ్యలో యెవరికి రావేమో.
తల్లి కాబోతున్నానని తెలిసినప్పుడు నిండు గోదావరికి వరదొచ్చినoత సంబరం తనలో. సంతకి యెప్పుడు పోయినా పిల్ల కోసం రిబ్బన్లు చిన్నిచిన్ని గౌవున్లు, చేతికి గాజులు బొమ్మలూ తెచ్చుకోవటం చూసి అమ్మా, అమ్మమ్మ, వూరిలో వాళ్ళు కూడా పుట్టకుండా అవన్నీ కొనకూడదు అనేవారు. అబ్బో! భూమి పుట్టాక మంగొక్కర్తే పిల్లనికంటుందని పరాచికాలు ఆడేవారు మరికొందరు. పిల్ల పుట్టాక ఆరునెలలు వరకూ పిల్లని చూసుకొంటూ బానే గడిచిపోయింది తమ జీవితం.
వున్న చోట కంటే పొరుగూరో పట్నమో సిటీనో వేరే దేశమో దాటేస్తే బోలెడంత యెదుగుదల వుంటుందని ఆడవాళ్ళు పనులకోసం పల్లెలు దాటి వెళ్ళుతూనే వున్నారు. అలా తమ చుట్టూ వున్న వాళ్ళల్లో చాల మంది డబ్బులు సంపాదించాలని సిటీకో, వేరే దేశానికో వెళ్ళుతుండటం చూసి రమేష్ కి సంపాదన మీద కోరిక పుట్టింది. సిటీకి పోదామని పట్టుపట్టాడు. సిటీకి వచ్చారు.
కొద్దిగా యెదగాలనే రమేష్ కి బాగా యెదగాలి త్వరగా యెదగాలి అనే కోరిక గట్టిగా పట్టుకోవటంతో తనూ పనికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మనిషి రక్తం మరిగిన పులిలా సంపాదన రుచి తెలిసిన తనూ ఆ సంపాదనని వదులుకోలేకపోయింది. లేకపోతే దేవమ్మ యింట్లో తన పిల్లపై ఆ పిల్లాడిని చూసిన రోజే పని మానేసి వుండేది. యెలాంటి ప్రమాదంలోకి నెట్టిందీ రోజు పిల్లని. ఛా… తను తల్లేనా… యింట్లో డబ్బులు యివ్వకుండా వాటిని దాచి పెట్టుబడి పెట్టి యెదగాలి అనుకున్న తన భర్తా, కారణాలు యేవైనప్పటికి తనని సంపాదనవైపు తోసిన కోరికలే తన అత్తగార్ని తోసాయా?!!
యెదగాలనే కోరిక యింత ప్రమాదకరంగా తన ముందు నిలబడిన యిప్పుడు కూడా తను పిల్లని యెక్కడుంచి రేపు పనికి వెళ్లాలని ఆలోచించటం యేమిటి…?
తల్లి ప్రేమనే మింగేసే యీ యెదుగుదల నిజంగా యెదుగుదలేనా…?
అందరం తల్లులమే… కానీ కొందరు తల్లులకి మైనా మేడం గారికి వున్నట్టు అన్నీ అందుబాటులో వుంటాయి. స్ట్రాబెరీనీ, పిల్లని చూసేదాని కoటే ప్రేమగా చూస్తారు. అలాంటి సౌకర్యాలు తను యివ్వలేకపోవచ్చు. భద్రంగా చూసుకోవద్దా? ప్రేమంటే జాగ్రతగా చూసుకోవటమే కదా. కానీ తనేం చేస్తోంది.?
యెక్కడ పుట్టి పెరుగుతామో ఆ ప్రాంతంలోనైనా వో ఆసరా దొరుకుతుంది. పల్లె అయినా పట్టణం అయినా బస్తీ అయినా తనిక్కడ పరాయి మనిషి కదా… కొత్త మనిషి కదా…
అసలిక్కడ మరొకర్ని చూసే తీరిక, వెసులుబాటు యెవరికున్నాయి? అలా వుండే పరిస్థితి లేదు.
యింకా యెన్ని చూడాలో… సిటీ వొద్దు అనుకొంది మంగ.
*
ఆ రాత్రి అన్నం తింటూ “కోతల టైం కదా. అమ్మ వూరు వెళ్ళిపోతుందంటా రేపు. యింటికి యేమైనా పంపుతావా” అన్నాడు రమేష్.
“మనమూ వెల్లిపోదాం” అంది మంగా.
“పిచ్చిలేచిందా… చీటీలు మధ్యలో వున్నాయి”
“మీరొచ్చినా రాకపోయినా నే వెళ్ళిపోతా” అంది.
“పనికి వెళ్ళితేనే కదా. పోనీ పని మానై”
“యేమి తింటాం? పైగా నా జీతం డబ్బులతో కూడా చీటీ మొదలుపెట్టారు” అంది.
“యేదో వొక సారి పిల్లకి ప్రమాదం జరిగిందని ప్రతి సారీ జరుగుతుందా? మైనమ్మ గారిల్లు, మరో యిల్లు చేసుకో. అలా అయితే నువ్వు పదిన్నరకి వొచైవొచ్చు. యిoస్టాల్ మెంట్స్ లో బండి తీసుకొంటా. అప్పుడు పిల్లని యెనిమిదన్నర వరకూ చూసుకోవచ్చు. అక్కడ నుంచి రెండు గంటలే కదా పిల్ల వొక్కర్తి వుండేది” అన్నాడు రమేష్.
“మీరేమి చేసుకుంటారో చేసుకోoడి. వెళ్ళి పోతున్నా. అక్కడే యెప్పటిలా పొలం పనికి పోతాను. బండే కొనుక్కుంటారో.. కార్లే కొనుక్కుంటారో… మీ యిష్టం” స్పష్టంగా చెప్పేసింది మంగ.
“వెళ్ళితే నీ ముఖమెప్పుడూ చూడను” అన్నాడు కోపంగా.
అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆమెకి వొక్క క్షణం భయమేసింది. యెన్నో సార్లు యెన్నో విషయాలకి అరుచుకున్నారు కానీ అతనెప్పుడూ యిలాంటి మాట అనలేదు.
*
“మంగ ప్లేస్ లో వో అమ్మాయి కావాలి” అంది మైనా.
రేవంత్ వెంటనే యేజెన్సీ కి చెప్పాడు.
“యింత జీతం వదిలి తిరిగి విలేజ్ వెళ్ళిపోవటం యేమిటో” అంది మైనా.
“మనం రాలేదా యూ యస్ నుంచి యిక్కడికి. అక్కడ నుంచి వెనక్కి వచ్చి ప్రొడక్టివిటీ లో పాలుపంచుకోవడం యెలా డెవలప్మెంట్ అని మనం అనుకున్నామో అలానే గ్రామాలకు.. వ్యవసాయం లోనికి తిరిగి వెళ్లడం కూడా మినియేచర్ లో అంతే అభివృద్ధికరం కదా. యీ నగరాల్లో నిలబడటానికి… తలదాచుకునేందుకు… యేమీ లేని నా పిల్లలకి నిలబడేందుకు… యింత నేల… చెప్పుకునేందుకు… యింత అస్తిత్వం యివ్వాలని వెనక్కి వెళ్లిపోవాడాన్ని మెచ్చుకోవలసిన విషయమే కదా…” అన్నాడు రేవంత్.
“వు… నాకో విషయంలో గిల్టీగా వుంది” అంది మైన.
యేమిటన్నట్టు చూసాడు.
“మంగ తన పాపని పనికి వెళ్ళేడప్పుడు యెక్కడ పెట్టాలి అని అంత యిబ్బంది పడుతున్నా నీతో తెచ్చుకో అని అనలేకపోయాను. మన పాపని డ్రైవర్ తో పంపడానికి భయపడే మంగ తోడు వుండాలనుకున్నాం కదా… వొక్క రోజు కూడా మంగకి తన పాప విషయంలో హెల్ప్ చెయ్యలేక పోయాను” అంది మైనా.
కొద్ది సేపు మౌనం.
“అది వీలైయ్యే విషయం కాదులే మన స్ట్రక్చర్ ల్లో… ” అన్నాడు.
అవునన్నట్టు కనురెప్పలు కదిల్చీంది మైనా.
*
చేతిలో పిల్లని యెత్తుకొని మరో చేతిలో బట్టల బ్యాగ్, మరో చిన్ని మూట పక్కన పెట్టుకుని నాంపల్లి స్టేషన్ ల్లో నరసాపురం యెక్స్ ప్రస్ వచ్చే ఫ్లాట్ ఫారం మీద జనరల్ బోగీ ఆగే చోట లైన్ ల్లో నిలబడింది మంగ. వూరి వాళ్ళు కనిపించి చేతిలో బ్యాగ్ అందుకున్నారు.
“మీ ఆయనేడి” అడిగిందామె చనువుగా.
“సెలవు దొరకలేదు పిన్ని” అంది మంగా.
నిలబడటం అయితే నిలబడింది కానీ ఆమె చూపులన్నీ చెపులన్నీ ‘యే మంగా’ అనే రమేష్ కోసమే చూస్తున్నాయి.
కోపమొక్కటైతే పర్లేదు… మొoడివాడు… పట్టుదలా యెక్కువే… మాటలు మానేసాడు… నిజ్జంగానే ముఖం చూడడా… తను వూరుకుంటుందేమిటి… కులపంచాయితీ పెట్టించదా యేమిటి…
వస్తారా… రారా… వొక్కటే ఆలోచన మంగలో…
ప్లాట్ ఫాం మీద బండి పెట్టారు. లైన్ ముందుకి కదుల్తుంది. మంగ చేతిలో పిల్లా మరో చేతిలో మూట పట్టుకొని ముందుకి కదుల్తుంది. పెట్టెలోకి యెక్కబోతుంటే చేయి తేలిగ్గా అనిపించింది. చేతిలో మూటని లాక్కున్న రమేష్ మంగ పక్కనే అడుగులు వేస్తూ “యిక్కడవన్నీ చక్కపెట్టుకొని వచ్చేస్తాలే నెలలో. యిదిగో ప్యారడైజ్ మటన్ బిర్యానీ… ఫేమస్… “
మంగ చేతి బరువే కాదు మనసుల్లోoచి బరువూ తగ్గి “చీటీలని తినటం మానైయ్యకు. వేళకి తిను. నీకోసం వంట చేసొచ్చా” అంది.
కలుసుకొన్న కళ్ళల్లో అనుబంధం గొప్ప రిలీఫ్ గా వుంది వాళ్ళిద్దరికీ.
*
శ్రమ జీవితాల్లోని ఎగుడుదిగుళ్లని, కష్ట సుఖాల బతుకుని .. దిగువ తరగతిలోని వైరుధ్యాలని, వాటికి కారణాలని .. బాగా చెప్పిన కథ .. కథ ముగింపు చాలా అదంగా pogitive గా చూపించడం ఇంకా బాగుంది..
అంతర్గతంగా Back to Villages concept నీ, అతి చిన్న వయసులోనే కనిపించే Psychologial deviation/s నీ బాగా పట్టుకున్నారు. రచయిత కుప్పిలి పద్మ గారికి అభినందనలు. ప్రచురించిన మీకు ధన్యవాదాలు. —- థింసా
వివరంగా మీ అభిప్రాయంని పంచుకోవటం సంతోషంగా అనిపించింది.
థాంక్యూ సర్.
కుప్పిలి పద్మ గారిని Facebook lo తరచూ చదువుతూ వుంటాం. అయితే బాగా రాస్తారు అని తెలుసు మరీ ఎంత బాగా రాస్తారు అని ఇపుడే తెలిసింది. ఆశీస్సులు.
Thank you Vara Prasad garu.
జీవితాలను, సమాజాన్ని, మారుతున్న దృక్పధాన్ని,
ఎంతో దగ్గిరగా, సునిశితంగా, హృదయంతో చూసే మీకే
కేవలం మీలాంటి వారికే సాధ్యమయ్యే హత్తుకొనే నిజంలాంటినిజం! 💐💐❤️❤️👏👏👌👌
అందుకే మా “పద్మము” బంగారం
Thank you very much Ramesh Ponugoti garu.
సున్నితమైన కథాంశాలని ఎంచుకోవడంలోనే కాదు వాటిని అంతే సున్నితంగా చెప్పటంలో కూడా పద్మగారు ప్రజ్ఞాశీలి.
Thank you Deepa Polireddy garu.
అద్భుతంగా ఉంది కధ. కష్టపడి బతికే మంగ జీవితం లో పడే బాధలు బాగా చెప్పుకొచ్చెరు పద్మ గారు. అభివృద్దిలో కింది వారి జీవితాన్ని బాగా చిత్రీకరించారు.
Thank you Subrahmanyam garu.
స్ట్రాబెర్రీ వెర్సెస్ రేఖ.
కుక్క పిల్లకు దొరికేపాటి ఆలన పాలన పనిచేసే తల్లి యొక్క పసిపాపకు దొరకకపోవడం అనే వ్యవస్థ డొల్లతనాన్ని బాగా ఎండగట్టారు.
రమేశ్ పట్నానికి కాస్తా ఎక్కువ సంపాదిద్దామని వచ్చాడా లేక ఎప్పటికీ పల్లెలో కూలిమనిషిగానే వుండాల్సిన స్థితి నుంచి బయటపడదామనుకున్నాడా అన్నది చర్చించాల్సిన అంశం.
ఎవ్వరూ అదే స్థితిలో వుండాలనుకోరు. కానీ ఆ స్థితి నుంచి, స్థాయి నుంచి బయటపడాలనుకునే వారికి ఎదురయ్యే అడ్డంకులు, వాటిని కల్పించే సమాజాన్ని ఈ కథలో చూడవచ్చు.
Thank you very much Sir.
మంచి కథ. నేల విడిచిన ఊర్ధ్వగమనపు ఆశల్ని రెచ్చగొట్టే నేటి అభివృద్ధి నమూనా ఆర్థిక తారతమ్యాలతోపాటు వాటి మధ్య సారూప్యతను కూడా ఎలా స్థాపిస్తోందో కుప్పిలి పద్మ అద్భుతంగా ఎంతో నిపుణంగా చిత్రించారు. కథను అందంగా ఆహ్లాదభరితంగా ముగించడం మరింత బాగుంది. అభినందనలు.
భాస్కరం గారు, నమస్తే.
మీ అభిప్రాయం సంతోషమేసింది.
హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్.
మీరు మెట్రోకవతలి వైపు వెళ్ళడమే సంభ్రమం , బ్యాక్ టు బేసిక్స్ ఎప్పుడూ రక్షణాత్మక గేమే. “అది వీలయ్యే విషయం కాదులే మన స్ట్రక్చర్స్ లో .. ” అనే మనో అవస్థ పోతేనే మెట్రోకావల కూడా జీవితం వెల్లి విరుస్తుంది.
మానవ సంబంధాలలో చొచ్చుకొచ్చే అర్థశాస్త్రాన్ని మీ చాలా కథల్లో లాగే ఇందులోనూ ఆ వేదన .
అభినందనలు మామ్
మహేంద్ర గారు, చక్కని విశ్లేషణ కి , అభిప్రాయాన్ని పంచుకొన్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.