మృత్యువు దాడి చేసిన రాత్రి
అక్షరాలకు జీవం పోస్తున్నాడు

రాత్రి గడియారంలో కాలం నిలిచిపోయింది
రక్తం కక్కుకుని ప్రభాకర్ కన్నుమూసాడని
గాలిలో సగం తెగిన నరాల తరంగాల స్వరాలు

కాలం నిలిచేమీ పోలేదు
నీ శవం దగ్గర కూడా గతమూ వర్తమానమూ ఘర్షణ పడి
నీ ఆశయ నినాదాలతో మేమే ముందుకు సాగాం
సూర్యుడు సంక్రాంతి లోకి పయనించాడు

రాస్తూ రాస్తూ అలవాటుగా గోడ వైపు చూశాను
అవును నేస్తం నువ్వు ప్రేమగా ఇచ్చిన గడియారంలో ముళ్ళు ఆగిపోయాయి
సరిగ్గా నీ అస్తమయం దగ్గర కాలం ఫ్రీజ్ అయినట్లు
కాదు, నీ ముళ్ళబాట జీవితం అక్కడితో ముగిసింది
నీ ఊపిరితిత్తుల నుంచి తీసిన నెత్తుటి సిరంజిలా
సెకన్ల ముల్లు ఆగిపోయింది
నువ్వు నడిచి పోయిన కత్తెర బతుకులా
నిమిషాల, గంటల ముళ్ళు నిలిచిపోయాయి
నీ శరీరమూ మనసూ అంతటా
ఇంక చోటు లేకుండా కుచ్చుకున్న సూదుల్ని
నాకు కాలంగా మలచి ఇచ్చావా నేస్తం

ఉదయం కోసం నిరీక్షించే
అస్తమయంగా అది కదిలించను
ఎముకల గూడు రాలి పడుతుందని కాదు
జ్ఞాపకాలు తుళ్ళిపడి తొణుకుతాయి
కోపంగా నిను మందలించిన సందర్భాలు
గుండెకోత బెడతాయి
అవార్డులు తీసుకున్నావని అలిగి నిన్ను చూడని రోజులు
అప్పుడప్పుడు అయినవీ కానివీ రాస్తున్నావని
ఆవేశంగా మందలించిన రోజులు
ఆరోగ్యం మళ్ళీ క్షీణించి ఆసుపత్రిలో పడితే
ఆదుర్దాగా వచ్చి దుఃఖం కాదని చెప్పడానికి
ఆగ్రహంగా కన్నెర్ర చేసిన రోజులు
అన్నీ మర్చిపోతానయ్యా
మళ్లీ నువు కళ్ళు తెరుస్తానంటే
అరాచకత్వం మాని ఆరోగ్యం చూసుకుంటానంటే

నేనొచ్చే వరకే నువు వెళ్ళిపోయావు గానీ
భాగ్యనడుగు
నీ కోసం విరసం మిత్రుల కన్నీళ్లు, కర్తవ్య ప్రతిజ్ఞలూ
మోసుకొచ్చాను

చాలామంది ఆరోగ్యవంతులకు
మనిషన్నాక చావు చెప్పకుండానైనా ఒకనాడు వస్తుందని
స్పృహ ఉండదు
జూలియస్ ఫ్యూజిక్ కు చెరబండ రాజుకు నీకు
నాజీ వ్యవస్థ అయితేనేమి
క్యాన్సర్ వ్యవస్థ అయితేనేమి
అది మరణ శాసనం రాసిన మరుక్షణం నుంచీ
మీరు ఒక్క స్వప్నాన్నీ నిదుర పోనివ్వలేదు
ఒక్క సంఘర్షణనీ చల్లబడనివ్వలేదు
ఒక్క క్షణాన్నీ వృథా కానివ్వలేదు

నిండు జీవితమైనా చాలని సార్థకమైన పేరు నీది
ప్రతి విశ్వాసాన్నీ శత్రువు పై కుంచెగా, కలంగా, లెన్స్ చూపుగా
ఎక్కు పెట్టిన గురి దానిది

ఎప్పుడెప్పుడో పుడిసెడు నెత్తురు కక్కుకొని
కవిత్వం ఊపిరితిత్తుల్లో క్లాట్ అయి
నీ సిటీలైఫ్ అర్థాంతరంగా
ఆగిపోతుందని తెలియక కాదు ఈ బాధ

శత్రువు నీ మీద దాడి చేయడానికి వచ్చిన రాత్రి
మండుతున్న నీ గుండెల్లో
నీ అస్థిపంజరాన్ని ఆయుధంగా మలుస్తున్నావని
తెలిసి కలిగిన ఆనందాశ్రువులే ఇవి

(14 జనవరి 1993 , ఉన్నదేదో ఉన్నట్లు)

జననం: వరంగల్లు జిల్లా లోని చిన్నపెండ్యాల. ఉద్యోగరీత్యా వరంగల్లు లోని సీ.కే.ఎం. కళాశాలలో (1968-98) తెలుగు సాహిత్య ఉపన్యాసకుడిగా పనిచేసాడు. నవంబర్ 1966 లో, సాహితీ మిత్రులు (Friends of Literature) స్థాపించి, సృజన అనే ఆధునిక తెలుగు సాహితీ వేదికను ప్రారంభించాడు. విరసం కార్యనిర్వాహక సభ్యుడుగా ఉన్నాడు. 1984 నుండి 1986 వరకు కార్యదర్శిగా పనిచేశాడు. 1983లో స్థాపించిన All India League for Revolutionary Culture (AILRC) కి వ్యవస్థాపక కార్యనిర్వాహక సభ్యుడుగా, 1993 నుండి 1999 వరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.

రచనలు: చలినెగళ్లు (1968), జీవనది (1970), ఊరేగింపు (1973), స్వేచ్ఛ (1977), స్వేచ్ఛ (1977), భవిష్యత్ చిత్రపటం (1986), ముక్త కంఠం (1990), ఆ రోజులు (1998), ఉన్నదేదో ఉన్నట్లు (2000), ఉన్నదేదో ఉన్నట్లు (2000), బాగ్దాద్ చంద్రవంక (మార్చి 2003), మౌనం యుద్ధ నేరం (ఏప్రిల్ 2003), అంతస్సూత్రం (2006), తెలంగాణ వీరగాధ (2007), పాలపిట్ట పాట (2007), బీజభూమి - వరవరరావు కవిత్వం -1, 2 (1957-2017), సహచరులు - జైలు లేఖలు (1989, 2019), జైలు రాతలు (2006), 'భూమితో మాట్లాడు' తదితర కాల్పనిక సాహిత్య వివేచన, యె క్యా జగహ్ హై దోస్తో (నవజీవన సంస్కృతి కోసం సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రచనలు - తెలుగు హిందీ అనువాదం - తుషార్ కాంత్ భట్టాచార్య)

Captive Imagination - Prison letters (Editor: Vasantha Kannabiran - 2010), A Life in Poetry (Selected translations into English; Editors Meera Kandasamy, N. Venugopal - 2023)

హిందీ: సాహస గాధా (సంపాదకులు: శశినారాయణ్ స్వాధీన్, నుస్రత్ మొయినుద్దీన్), హమారా మీ సప్నా హై తీస్రీ దునియాకా (అనువాదం: శాంతి సుందరి. ప్రచురణ: రాణాప్రతాప్), జైలు లేఖలు హిందీ (వాణి ప్రకాశన్)

అనువాదాలు: బందీ (Detained - A Writer's Prison Diary by Ngugi wa Thiong'O); మట్టికాళ్ళ మహారాక్షసి (Devil on the Cross - Novel by Ngugi wa Thiong'O); అనుమానిత కవితలు (Gulzar's Suspected Poems)

Leave a Reply