ఇంతకీ మూసీ నది మాట్లాడితే ఏమవుతుంది? ఏమైనా కావొచ్చు. హైదరాబాద్ గుండెల్లో దాక్కున్న దుఃఖం బైటకి పొంగొచ్చు. భవంతుల పునాదుల్లో తొక్కి వేయబడ్డ పేదరికపు మూలుగులు పెద్దగా వినబడొచ్చు. నగర నిర్మాణాల్లో సంపన్నుల నాగరికత కన్నా శ్రామికుల చెమటే ఎక్కువుందన్న సత్యం బైటపడొచ్చు. అయితే మూసీ నది ఎలా మాట్లాడుతుంది. అసలు మూసీని ఎవరు పలకరించాలి? శతాబ్దాల నుండి, ముఖ్యంగా కొన్ని దశాబ్దాల నుండి మూసీ తన గుండెల్లో నింపుకున్న బడుగు జన జీవన విషాదాన్ని ఎవరు వెలికి తీయాలి? ఆ తీరిక ఎవరికున్నది? ఆ నిబద్ధత ఎవరు చూపిస్తారు?
అనువాదకురాలు, కథా రచయిత్రి కవిని ఆలూరి గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ మహానగర పరిధిలోని మురికివాడల మీద విస్తృత పరిశోధన చేసారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కాలేజిలో డిగ్రీ లెక్చరర్గా పనిచేస్తున్న ఆమె ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎంతోమందిని వ్యక్తుల్ని పట్టుకొని వారి ద్వారా స్లంస్ లో జీవించే వారి కాంటాక్ట్ సంపాదించి ఒంటరిగా ఈ మురికివాడల్లోకి తన ప్రయాణం మొదలుపెట్టారు. ఆర్ధిక వ్యయంతో పాటు ఆమె ఎంత కష్ట పడ్డారో వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు. ఎంతో మానసిక, శారీరిక శ్రమ వుంది ఆమె పరిశోధనలో. తన పరిశోధనల ఆధారంగా సుమారు ఒక రెండు సంవత్సరాల క్రితం “అభాగ్య జీవుల భాగ్య నగరం” అన్న పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం ఆమెకి మంచి గుర్తింపుని తెచ్చింది. ఆ పుస్తకంతో ఆగిపోకుండా ఆమె మరో రెండు సంవత్సరాల పాటు ఎండనకా వాననకా తిరిగి ఎన్నో పదుల సంఖ్యలో మురికివాడల్ని సందర్శించి, వారి జీవితాల్ని ప్రత్యక్షంగా పరిశీలించి, వారితో మాట్లాడి, వారితో సంభాషణల్ని రికార్డ్ చేసి, ఫోటోలు, వీడియోలు తీసి ఇప్పుడు ఇంకో పుస్తకాన్ని ముద్రించి మన ముందుకు వచ్చారు. తాను సేకరించిన గణాంకాల ఆధారంగా ఆమె అనేక వ్యాసాలు రాసారు. అందులో కొన్ని వ్యాసాల్ని ప్రముఖ దిన పత్రికల్లో ప్రచురించారు. ఈ వ్యాసాలతో పాటు ఆమె హైదరాబాద్ మహానగరంలోని ముఖ్యమైన మురికివాడల సర్వ సమగ్ర చిత్రపటాన్ని చిత్రించారు ఈ పుస్తకంలో.
సుమారు 200 పేజీలు వున్న ఈ పుస్తకంలో తొమ్మిది ప్రధాన కథననాలు, ఇంకా పత్రికల్లో ప్రచురించబడిన మరో 15 వ్యాసాలు ఉన్నాయి. తాను సందర్శించిన ప్రతి బస్తీ అసలు ఏ విధంగా ఏర్పడిందీ… అంటే ఏ ప్రాంతం నుండి ప్రజలు మొదటగా వచ్చి అక్కడ నివాసం ఏర్పరుచుకున్నారు, అలా నివాసం ఏర్పర్చుకున్నాక ఇంకా ఎవరెవరు వచ్చారు, ప్రస్తుతం వున్న పరిస్థితులు ఏమిటి, వారి జీవన విధానం, బతుకుతెరువు, కుటుంబ నిర్మాణం, ఆదాయ వనరులు, ఉపాధి విధానాలు, అక్షరాస్యతా శాతం, ప్రభుత్వ జోక్యాలు, వసతుల కల్పన వంటి ప్రతి పార్శ్వాన్ని స్పృశించారు. ప్రతి వ్యాసంలోనూ బస్తీ ప్రయాణం మనకి అర్ధమవుతుంది. నగరంలోని బస్తీలన్నీ గ్రామీణ ప్రాంతం నుండి వలస వచ్చిన శ్రామిక వర్గం వారితో ఏర్పడినవే. వ్యవసాయక దేశమైన భారతదేశంలో కరువు కాటకాల వల్ల, నీటి పారుదల సౌకర్యాల లేమి ఒక కారణం కాగా వ్యవసాయంలో ఒక క్రమంలో పెట్టుబడి చొరబడి యాంత్రీకరణ పెరిగి ఉపాధి అవకాశాలు కోల్పోవటం కూడా నగరాలకి వలసలు పెరగటానికి ఒక ప్రధాన కారణం. అయితే నగరాలకు వలస పోయినంత సులువు కాదుగా తమ గ్రామీణ సంస్కృతిని వదులుకోవటం!
“కోట్లకి పడగలెత్తిన వాళ్లు మా కడుపులే కొట్టాలా?” అనే వ్యాసంలో జంగం మెట్ బస్తీల్లో నివశించే బుడగ జంగాలు, పూసల, వీరముష్టి, దాసరి, బైండ్ల, ఎరుక, చెంచు, కోయ వంటి సంచార జాతుల నగర జీవన విధానాల్ని వివరిస్తారు. ఇప్పుడు 90 ఏళ్లు పైన వున్న యాదమ్మతో సంభాషిస్తూ గత 70 సంవత్సరాలుగా ఆ బస్తీ ఎలా ప్రయాణించిందో చెబుతారు. జంగం మెట్లో ముప్ఫై శాతం మాత్రమే అక్షరాస్యతా శతం వున్న 500 దాకా బుడగ జంగాల కుటుంబాలుంటాయి. బుడగ జంగాలు వృత్తి రీత్యా కళాకారులు. తెల్లవారు జామునే జంగమయ్యలుగా తయారై పాటలు, కథలు చెబుతూ యాచకత్వం చేసేవారు. వీరిది సంచార జీవితమే కానీ వీరు “జిప్సీ”లు కారని అంటారు కవిని. ఊరూరా తిరుగుతూ బుర్ర కథలు చెప్పటం, డింకీ వంటి వాయిద్యాలని ఉపయోగిస్తూ పాటలు పాడటం వీరి ప్రత్యేకత. ఇప్పుడు కొంతకాలంగా వాళ్లు యాచకత్వాన్ని వదిలేసి పురుషులు రకరకాల కూలి పనులకు వెళుతుండగా స్త్రీలు వేరే ప్రాంతంలో పాత బట్టలకు స్టీలు సామాన్లు ఇచ్చే వ్యాపారం చేస్తున్నారు. ఏవేవో పనులు చేస్తున్నారు.
జంగం మెట్ ప్రాంతంలోనే వీరభద్రీయులనే ఆశ్రిత కులం వారూ వున్నారు. వీరినే వీర ముష్టి, నెత్తి కోతల, విభూతుల వారు అని పిలుస్తారు. గతంలో వీరు వైశ్య కులం యొక్క ధన, ప్రాణాలని కాపాడేవారట. మొదటిలో వైశ్య కులం నుండి మాత్రమే తమ పారితోషికాన్ని ముష్టి రూపంలో స్వీకరించే వీరు తదనంతర కాలంలో గాండ్ల, బలిజ, జంగంల దగ్గర కూడా స్వీకరించేవారు. ప్రస్తుతం వీరు ఆటోలు నడుపుతూ, కూలీలుగా పని చేస్తూ ఉదర పోషణ చేసుకుంటున్నారు. కాలం జీవన విధానాన్ని మార్చినా మనిషిలోని సంకుచితత్వం మాత్రం కులాన్ని నిర్మూలించ లేకపోవటమే కాదు జీవన ప్రమాణాల్ని ఉన్నతీకరించ లేకపోయింది, బతికే వాతావరణాన్ని మార్చలేక పోయింది.
దశాబ్దాల తరబడి జంగం మెట్ ప్రాంతంలో నివశిస్తూన్న వాళ్లది ఒక ప్రత్యేకమైన లిపి లేని భాష. ఇప్పటికీ ఓలియ, దాసరి, బేడ బుడగ జంగం, పూసలవాళ్లు ఒకరితో మరొకరు ఇదే భాషలో మాట్లాడుకుంటుంటారు. పూసల మహిళలు తిరుగుతూ పూసలు దువ్వెనలు, అద్దాలు, పక్కపిన్నులు, బాలింత మందులు, మసాలాలు, దారాలు, ఉడుము నూనె (నడుములు గట్టి పడటానికి), గాజులు, చెంప స్వరాలు అమ్ముతూ జీవనం సాగించేవారు. వీరి పూర్వీకులు రెండు మూడు వందల సంవత్సరాల క్రితమే అవాంఛిత రోమాల్ని తొలగించే “జనాన్” అనే సబ్బుని తయారు చేసారంటే ఆశ్చర్యమేస్తుంది. ఒకప్పుడు పెళ్లిళ్ల సందర్భంగా వీరి దగ్గర నుండే మేకప్ సామాను విరివిగా కొనేవారు. అయితే ఈ రోజున వీరి వస్తువులు కొనేవారు లేకపోయారు. గ్లోబలైజేషన్ పుణ్యమాని బయట విస్తరిస్తున్న మార్కెట్ వీరి పొట్టల్ని కొట్టింది. రిలయన్స్, ఇంకా అనేక కార్పొరేట్ కంపెనీలు అన్ని రంగాల్లోకి దిగటంతో అనేక మంది సామాన్య రిటెయిలర్ల జీవితాలే కాదు ఇలాంటి బడుగు జీవితాలు కూడా ధ్వంసం అయిపోతున్నాయి. అందుకే పూసల నరేష్ అనే అతను “కోట్లకి పడగలెత్తినోళ్లు మా కదుపులే కొట్టాలా?” అని ప్రశ్నిస్తున్నాడు.
అనేకమంది పేదలు ఆధారపడి జీవించే జియాగూడాలోని మటన్ మండీ గురించి, చర్మా వ్యాపారం చేసే డోరాల గురించి, “దువా కరే దుర్దష్! రగేకు కరె అల్లాహ్! అల్లా ఆప్ కో అబాద్ రఖే! హే అల్లా కే లాల్! నబీ కె నూరె! మహ్మద్ కె ప్యారే!” అంటూ ఆశీర్వచనాలు పలికుతూ పొట్ట పోసుకునే ఫకీర్ల బస్తీ గురించి, చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలలో బలంగా వేళ్లూనుతున్న పెళ్లిళ్ల దళారీ వ్యవస్థ గురించి, మయన్మార్ (బర్మా)లో తమ ఆస్తులన్నీ పప్పు బఠాణీల రేటుకి అమ్మేసుకొని ఇక్కడికి ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకొని వచ్చి ఇక్కడ స్థిరపడ లేక, ఆదరణ దొరక్క దయనీయమైన జీవితాల్ని గడుపుతున్న రోహింగ్యాల (ముఖ్యంగా నోట్ల రద్దు సమయంలో వీరి బాధ) గురించి , సింగరేణి కాలనీ వాసుల నిత్య పోరాటాల గురిని, పారిశ్రామిక ప్రాంతాల్లోని దళారీ వ్యవస్థ (అవుట్ సోర్సింగ్) గురించి…ఆయా బస్తీలలో నివశించే ప్రజల అస్తిమిత జీవనాన్ని, నిరంతరం అభద్రతలో మునిగి తేలే అస్తిత్వాల్ని, చాలీ చాలని బతుకుల వలన దెబ్బ తినే మానవ సంబంధాల్ని, కుటుంబ హింసని…చదువుతుంటే గుండె భారమై ఇలా ఎన్నాళ్లు? ఇంకెన్నేళ్లు అనే ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా మాణికేశ్వరినగర్ బస్తీలో ఒక పెద్ద సెప్టిక్ టాంక్ మీద జీవిస్తున్న 50 కుటుంబాల మనుగడ పోరాటం దయనీయంగా అనిపిస్తుంది. మన సమాజంలోనే వీళ్లందరూ వున్నారా? అనే ఆవేదనకి లోనవుతాం. ఒక్కో ఇంట్లో నాలుగు నుండి ఆరుగురు వరకు జీవిస్తూ 20 నుండి 50 గజాల స్థలంలో టార్పాలిన్ పట్టాల నుండి కాంక్రీట్ నిర్మాణాల వరకు చేసిన ఇళ్లల్లో బతికే వీరి వ్యధార్థ జీవన దృశ్యం బాధ కలిగిస్తుంది. వీళ్లల్లో ఎవరి డిమాండ్లు వారికున్నాయి. అభివృద్ధి పేరుతో జరిగే ఏ పారిశ్రామికీకరణ వీరి జీవితాల్ని అభివృద్ధి చేయక పోగా మరింత సంక్షోభంలోకే నెడుతున్నది. పరిసరాల కాలుష్యం, వసతుల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యం, నిలకడ లేని ఉపాధులు… ఒకటేమిటి? అనేక రకాలుగా సంక్షోభ పూరితం ఈ పేదల జీవితం.
మన సోషలిస్టు ప్రజా శ్రేయ రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఒక గౌరవనీయమైన నివాసం, ఆరోగ్యకరమైన జీవితం, విద్య, వైద్య సదుపాయాలతో కూడిన ఆదర్శాలనెన్నింటినో చెప్పుకోటం జరిగింది. అయితే వాస్తవం అందుకు భిన్నంగా వున్నది. ప్రజలంటే మరీ ముఖ్యంగా పేద ప్రజలంటే వోటర్లుగా మాత్రమే చూడబడుతున్నారు. ఈ పరిస్థితి మారాలని బలంగా తోస్తుంది ఈ పుస్తకం చదివితే. ఎవరైనా సామాజిక స్పృహ కలిగిన ఔత్సాహికులు పూనుకోవాలే కానీ ఎన్నో షార్ట్ ఫిలింస్ కి కావలిసిన విషయం వుంది ఈ పుస్తకంలో. ఇంత మంచి ప్రయత్నానికి తన శక్తి సామర్థ్యాలకు మించి పూనుకున్న కవిని ఆలూరికి అభినందనలు.
(“మూసీ నది మాట్లాడితే” – త్రిలోచన ప్రచురణలు. రచయిత్రి: కవిని ఆలూరి. పేజీలు: 196. వెల: రూ.150. ఫోన్: 9701605623)
Good review about the book of Kavini garu. Thank you sir.