ముసలివాడు ఎగరేసిన పక్షులు

అలసిపోయి నెపాల్ని ఎన్నిటిమీదికో నెట్టేసి
సణుగుతూ కూర్చున్నప్పుడు
భయం బూడిద వర్ణమై మనల్ని మెల్లిగా కమ్ముకుంటున్నప్పుడు
వచ్చిందా వాసన
శవం కాలుతున్న కమురు వాసన

మనం ఎన్నెన్నింటికో, ఎవరెవరినో ఆరోపిస్తూ
అంగుళమన్నా కదలకుండా, శపిస్తున్నపుడు
వినపడింది
ఒక మనిషిని మనం చంపుతున్నపుడు
ఊపిరి నిలిచిపోయే ముందు
విలవిలలాడుతూ చేసే ఆర్తనాదం

దానితో పాటూ
గుల్మొహర్ చెట్లమీదుగా, జీలం నది గుండా ప్రవహిస్తూ
కాశ్మీర్ లోయలో ప్రతిధ్వనిస్తూ మన వైపుగా వీచిన
స్వేచ్ఛా కాంక్షల చావులేని గీతం
ఎన్నో ఏండ్లుగా పాడుతున్న
ఆ మృత్యు విషాద ఆజాదీ గానం
మనకి నిజంగా వినపడిందా ఆ పాట?

అతడు, డెబ్బయి ఏళ్ళ వృద్ధుడు
దాదాపు అతడి వయసంత ఉన్న
ఆ గీతం బహుశా పుట్టగానే
ఏడ్చే తొలి దుఃఖం తో పాటూ
అతనిలో కలిసిపోయినట్లున్నది

ఇప్పుడతడు వట్టి ముసలివాడు
ముడతలు కమ్మిన మొఖం
వణికే చేతుల వాడు
అతడొక్కడే,
భుజానికి సంచీ వేలాడేసుకుని
కరపత్రాల్ని పక్షుల్ని చేసి వీధుల్లో ఎగరేస్తుంటాడు
ఎవరికీ పట్టని ముసలితనంలోనూ
ప్రపంచాన్ని పట్టించుకోవడం
అంటే ఏమిటో చెప్పేందుకు
ప్రతి ఉదయం వీధుల్లోకి వస్తాడు

హడావుడి ఆఫీసులకు, ఆసుపత్రులకు,
కాలేజీలకు పరుగెత్తే వాళ్లకు,
ఆటోరిక్షాలు, బస్సులు నడిపే
డ్రైవర్లకు
పిల్లల్ని బడులకు పంపుతున్న తల్లులకు
చౌరస్తాల్లో చేతులు చాచిన యాచకులకు
రికామిగా తిరుగుతున్న అనామకులకు
చివరికి నుదుట బొట్లు, లోన ఖాకీ నిక్కర్లు ధరించిన వాళ్లకు

కాశ్మీర దేశపు దుఃఖం గురించి
దాని రెక్కలు విరి చేసిన వైనం గురించి
అయినా సరే
ఓడని దాని స్వేచ్ఛా కాంక్ష గురించి
ఓరిమితో చెబుతుంటాడు

చివరికతడు అంటాడు
” మానవుడా నీ హృదయపు
తలుపులు తెరిచి చూడు
నీ సహోదరులు ఆ కాశ్మీరీయులు
వాళ్ళదైన ఆకాశాన్ని వాళ్ళను గెలుచుకొనియ్యి “

కొందరు చెమర్చిన కళ్ళతో అతడ్ని విన్నారు
కానీ ఎందరో అతడ్ని గేలిచేసి
భయపెట్టి వెళ్లగొట్టబోయారు
ఇంకా నెత్తురు మండుతూనే వున్న
ఆ ముసలి యవ్వనుడు
ఎవరు ఏంచేసినా
పక్షులను పంచడం, హృదయాలను తెరిచే మాటల్ని
వీధుల్లో ఎగరేయడం ఆపలేదు

నా చేతిలోనూ కరపత్రాన్ని పెట్టి
” మనుష్యులు సహజంగానే స్వేచ్ఛా కాంక్షులు
ఇతరుల స్వేచ్ఛని కూడా వాళ్ళు ఎప్పటికోప్పటికి
ఒప్పుకు తీరతారు
పంజరాలు నిర్మించే ఆ పిడికెడు
మందికీ భయపడకండెన్నడూ “
అని అన్నాడు

ఎవరో అతని మొఖం పైన
పిడిగుద్దులు గుద్దారు
అతడిక రాడని అనుకున్నా
ఇవ్వాళ్ళ వీధిలోకి వెడుతుంటే
వాచిన కంటితో, మొఖం పైన గాటుతో
వున్న ముసలివాడు
సరిగ్గా ఆ ముసలివాడే
బస్టాప్ లో నిలబడి
కరపత్రాల పక్షుల్ని పంచుతున్నాడు

నేనేం చేసాను ?
సిగ్గుతో తలవంచుకుని వడివడిగా
అక్కడ నుండి కదిలిపోయాను
నువ్వన్నా అతని చేతుల్లో నుండి
కాసిన్ని పక్షుల్ని తీసుకు ఎగరేస్తావా ?
వీధుల్లో తిరుగుతూ హృదయాల్ని
తెరిచే కాసిన్ని మంచి మాటల్ని
చెబుతావా ఎవరికన్నా ?

పుట్టింది హైదరాబాద్. కవయిత్రి. కథా రచయిత్రి. ఉద్యమ కార్యకర్త. కవితా సంకలనాలు: 'అడవి ఉప్పొంగిన రాత్రి', 'మృగన'. కథా సంకలనం: 'కొన్ని నక్షత్రాలు... కాసిన్ని కన్నీళ్లు'

4 thoughts on “ముసలివాడు ఎగరేసిన పక్షులు

  1. కాశ్మీరు ల విషాదాన్ని కళ్ల కు కట్టినట్లు చెప్పారు.

  2. what a great old man.
    very inspiring.
    he is the heart of the day.
    inspiring us to do something.
    let’s do ‘at least ‘ like vimala
    who gifted a love to the old man.
    very inspiring.

  3. Hmm. పక్షులను ఎగరేయడానికి నేను సిద్ధం

  4. ఎమిలీ డికిన్సన్ చెప్పినట్లు,
    “Hope” is the thing with feathers –
    That perches in the soul –
    And sings the tune without the words –
    And never stops – at all –
    మనుషులు మౌనంగా ఎగరేసిన మాటల పతాకాలు స్వేచ్ఛనీ, ఆశనీ సజీవంగా నిలబెడతాయి..

Leave a Reply