ముత్యాలపందిరి: చేనేత వృత్తి – సామాజిక, సాంస్కృతిక విశ్లేషణ

తెలుగు నవలా సాహిత్యం విభిన్న వస్తు వైవిధ్యాలకు కేంద్రంగా నలిచింది. తెలుగు సమాజాల్లో అస్తిత్వ ఉద్యమాల ప్రభావం ఉనికిలోకి రాకముందే ఉత్పత్తి కులాల జీవన వృత్తుల మీద రచనలొచ్చాయి. అయినప్పటికీ అంతగా ప్రచారం, గుర్తింపునకు నోచుకోలేదు. మానవ సమాజానికి వలువలు అందించి విలువలతో కూడిన సంప్రదాయాన్ని నేర్పిన ఘనత వస్త్ర శిల్పులదే. బ్రిటిష్ వలస పాలకులను పారదోలడానికి జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో స్వదేశీ వస్త్రాలనే ధరించాలన్న చైతన్య దీప్తి చేనేత. ఖద్దరు నూలు వడికే చరఖా స్వదేశీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది.

దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా శ్రామికులు ఆధారపడి జీవిస్తున్న వృత్తి చేనేత రంగం మాత్రమే. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేయూత లభిస్తుందని ఆశించిన చేనేత ఉత్పత్తి వర్గాలను పాలకులు తీరని నిర్లక్ష్యం, నిరాశను మిగిల్చారు. తెలుగు సాహిత్యంలో అందులో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన లోకమలహరి చేనేత కార్మికుల వృత్తి జీవితాన్ని ‘సంఘం’ అనే సాంఘిక నవలలో మొట్ట మొదటిసారిగా చిత్రించారు. అదే విధంగా పోరంకి దక్షిణామూర్తి 1962లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్లగొండ తదితర తెలంగాణ పల్లెల్లో చేనేత వృత్తి మాండలిక పదాల సేకరణ ప్రాజెక్టులో పనిచేసి ఉన్నారు. ఈ క్రమంలోనే అచ్చంపేటలో వనం ముత్యాలు అనే చేనేత కార్మికునితో పరిచయమైంది. అక్కడ గరపోసల చీర, గంగసరం చీర, దగ్గులపుటం చీర, కాట్రేను చీర, అంటూ రకరకాల చీరల పేరు చెబుతూ ‘ముత్యాలపందిరి’ అనే చీర పేరు కూడా చెప్పారు. అక్కడే తనను ఆ చీర పేరు ఆకట్టుకుందని పోరంకి దక్షిణామూర్తి చెప్పారు.

ఆంధ్రప్రభ వారపత్రిక క్రోధి నామ సంవత్సర ఉగాది నవలల పోటీల ప్రకటన చేసింది. గతంలో దక్షిణామూర్తి ‘వెలుగు వెన్నెలా గోదారి'(1958-59) కోస్తా ప్రాంతీయ జానపద మాండలికంలో రాశారు. తెలంగాణ భాషలో రాయాలనే తపనకు ఆంధ్రప్రభ వారపత్రిక ప్రకటన కార్యాచరణకు పురికొల్పింది. చేనేత పదాల సేకరణకు తెలంగాణ మారుమూల పల్లెల్లో తిరిగిన జీవితం, భాషా అనుభవాలతో పదిరోజుల్లో “ముత్యాల పందిరి’ నవల పూర్తి చేశారు. ఆంధ్రప్రభ వారపత్రిక వారి ఉగాది (1964) పోటీలలో తృతీయ బహుమతిని ముత్యాల పందిరి గెలుచుకొంది. ఆ వారపత్రికలో ధారావాహికగా ప్రచురించారు. 1968లో ఎమెస్కో వారు తొలిసారిగా ప్రచురించింది. 1969లో ఈనవలకు అక్కినేని సారస్వత పురస్కారాల్లో బంగారుపతకం సొంతం చేసుకుంది. 2015, ఏప్రిల్ లో ఎమెస్కో ద్వితీయ ముద్రణ చేపట్టింది.

ముత్యాలపందిరి సంక్షిప్త పరిచయం: ‘ముత్యాలపందిరి’ ఉయ్యాలవాడల ఊడల మర్రితాన మొదలవుతుంది. పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన చంద్రయ్య, ముత్యాలు బావా మరదళ్లు. బాల్యం ఆటపాటలతో అల్లుకున్న జీవితం ఆనందంగా సాగుతుంది. ముత్యాలంటే చంద్రయ్యకు ప్రాణం. అంతేస్థాయిలో ముత్యాలు కూడా చంద్రయ్యను ఇష్టపడుతుంది. ముత్యాలు తండ్రి లక్ష్మయ్య గ్రామంలో ఆర్థికంగా ఆదిపత్యం కలిగి వుండటమే కాకుండా చేనేత సహకార సంఘాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. పట్నం నుంచి వచ్చే అధికారులకు తనవైపుకు తిప్పుకొని సంఘాన్ని నష్టాల్లో పడేస్తాడు. భావనా రుషి, సుంకులమ్మ కొడుకే చంద్రయ్య. ఆరులం కష్టపడి రెక్కాడితేనే డొక్కాడే నిరుపేద చేనేత కుటుంబం భావనారుషిది. చంద్రయ్య మేనమరదలు ముత్యాలు దగ్గరి కొత్త బంగారు ఉంగరాన్ని తీసుకొని ఎక్కడో జారవిడుచుకుంటాడు. తన తండ్రి భాననారుషి కొడతాడనే భయంతో చంద్రయ్య ఇంట్లో చెప్పకుండా పారిపోతాడు. సిల్వెరు నాడెయ్య, ఈదమ్మనే ఓ శాలోల్ల ఇంట్లో ఆశ్రయం పొంది మగ్గం పనులు మొత్తం నేర్చుకుని పనిమంతుడవుతాడు.

భావనా రుషి కొడుకు మీద రంది పెట్టుకొని అనారోగ్యంతో మంచానపడి చనిపోతాడు. బతుకమ్మ పండగంటే ముత్యాలుకు చాలా ఇష్టం కానీ ఆరోజు బావా యాదికొచ్చి దిగులుగా కూర్చుంటుంది. తన స్నేహితురాలు కాంతమ్మ బతుకమ్మ ఆట కాడికి తీసుకొని వెళ్తుంది. బతుకమ్మలను నీళ్ల కుంటలో వేసే క్రమంగా ముత్యాలు కాలుకు నీళ్లలో ఉంగరం తగులుతుంది. చేతిలోకి తీసుకొని చూస్తుంది. తాను బావకిచ్చిన ఉంగరంగా గుర్తించి, సుంకులమ్మకు చూపించి ఏడుస్తుంది. తన కొడుకు తప్పు చేయలేదని, అవమానంతో ఇల్లు వదిలిపోయిండని సుంకులమ్మ బాధపడింది. కొన్నేళ్ల తర్వాత చంద్రయ్యకు ఇల్లు యాదికొచ్చి తన ఊరుకి తిరుగి వస్తాడు. ఊరంత బాగా మారిపోయి కనిపిస్తుంది. తన ఇంటికి చేరుకోవడంతోనే తండ్రి గురించి తల్లిని ఆరా తీయడంతో, ఆమె ఏమీ చెప్పలేకపోవడంతో చనిపోయాడని తెలుసుకుంటాడు. చంద్రయ్య ఇంటి వద్దే సొంతంగా మగ్గం పనులు చేసుకుంటాడు. చంద్రయ్య పనితనం తెలిసినవారంత ఆయనతోనే చీరలు నేయించుకుంటారు. ముత్యాలు మీద ప్రేమతోని చంద్రయ్య ఆమెకు ‘ముత్యాలపందిరి’ చీర నేసి ఇస్తానడంతో, మరుదలు నాకెందుకు బావాని మురిసిపోతుంది. కావుల నుంచి మంచి పత్తి తీసుకొని సుంకులమ్మ వడికి దారం కండెలు చుట్టి కొడుక్కి అందిస్తుంది. చంద్రయ్య అందమైన అల్లికలతో నేయడానికి కాగితం మీద బొమ్మలు దించుకుంటాడు. మాలిపటేల్ భార్య సీతమ్మ కోడలుకు ‘కాట్రేనుచీర నేయమని చంద్రయ్యను కోరుతుంది. అది పెళ్లికానీ వారు నేయరని ఆమెకు చెబుతాడు.

ఓ రోజు మాలిపటేల్ భార్య సుంకులమ్మతో మాట్లాడుతూ ముత్యాలుకు పట్నం సంబంధం రాములుతో లగ్గం ఖాయమైనట్లు చెపుతుంది. ముత్యాలుకు తనతో పెళ్లి జరిగితే మళ్లీ మగ్గం పనులతో కష్టాలు తప్పా సుఖం ఏముంటదని సుంకులమ్మతో అంటాడు చంద్రయ్య. తన కొడుకు మేనరిక దక్కకపోవడంతో సుంకులమ్మ మానసికంగా అనారోగ్యంపాలయి చనిపోతుంది. ఎట్టకేలకు చంద్రయ్య ముత్యాలపందిరి చీరను నేసుకొని ముత్యాల లగ్గమై పట్నం పోతుందని తెలస్తుంది. ఆమెకు చీర ఇవ్వాలని రైల్వేస్టేషన్ కు వెళ్తుండగా లంబాడోళ్ల లబ్ది కలుస్తుంది. రాములును ముత్యాలును పెళ్లి చేసుకున్న విషయం లఖికి చెప్పడంతో రాములు మోసకారి విషయాలు బయట పెడుతుంది. ఇద్దరూ కలిసి స్టేషన్ కు వెళ్లేసరికి రైలు కదుతుంది. చివరకు లబ్దిని చూసిన రాములును రైలు నుంచి దూకి పారిపోతాడు. చంద్రయ్య, మత్యాలు కోసం నేసిన ‘ముత్యాలపందిరి’ చీరను అందిస్తాడు. చివరకు వాళ్లిద్దరు ఒక్కటికావడంతో నవల ముగుస్తుంది.

నవలలోని పాత్రలు :
ముత్యాలపందిరిలో కథా నాయకుడు చెంద్రయ్య. నాయిక ముత్యాలు. వీళ్లిద్దరు పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన రక్త బంధువుల పిల్లలు. బాల్య జీవితంలో ఆటపాటలతో కలిసి ఒకరికొకరి అత్యంత స్నేహంగా గడుపుతారు. పెరిగి పెద్దయ్యాక మొదలయిన కష్టాలు, కన్నీళ్లను దాటుకుని చివరకు మనుసులోని ప్రేమను గెలుచుకొని ఒక్కటవుతారు. చంద్రయ్య తండ్రి భావనారుషి, నీతిజాయితీ కలిగిన వ్యక్తిత్వం. ఒకరు అనవసరంగా మాటంటే పడే మనిషికాదు. చేనేత కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్న నిరు పేద చేనేత కార్మికుడు. ఆయన భార్య సుంకులమ్మ. భర్త మగ్గం పనిలో తాను భాగం పంచుకుంటూనే ఇంటిపనులు చక్కబెడుతుంది. ఆత్మగౌరవంతో సంసారాన్ని చక్కదిద్దుకొనే ఉత్తమ నేత మహిళా మణి. కష్టాల కడలిలో కెరటాల సమస్యలు ఎన్ని వచ్చినా తట్టుకొని జీవిత నావను నడిపించిన కష్టజీవి. కల్లు, చుట్ట తాగడం వల్ల గుండె పాడయిపోతుందని భావనా రుషికి నచ్చచెప్పిన సౌమ్యత గల గృహిణి.

సుంకులమ్మ తమ్ముడు లక్ష్మయ్య ఉయ్యాలవాడలోనే పుట్టి పెరిగిండు. బట్టలు, నూలు వ్యపారం చేయడంలో తెలివి సంపాదించాడు. మగ్గం పనులు చేయడానికి మనుషులు కరువు అవుతారని ముందే పసిగట్టి పిల్లలు బడికి వెళ్లకుండా విఫలయత్నాలు చేసిన స్వార్థజీవి. చేనేత సహకార సంఘానికి అధ్యక్షుడుగా వున్న తన బావ భావనా రుషిని కుయుక్తులతో బాధ్యతల నుంచి పక్కకు తప్పిస్తాడు. తాను చెబితే వినేటువంటి రాములును కార్యదర్శిని చేస్తాడు. సంబంధిత అధికారులను మచ్చిక చేసుకొని ప్రభుత్వ సొమ్మును సొంతానికి వాడుకుంటాడు.

మానవీయ సంబంధాల కంటే మనీ సంబంధాల పట్ల అతివిశ్వాసం కలిగిన టక్కరి లక్ష్మయ్య మోసకాడయిన రాములుకు పిలిచి తన బిడ్డ ముత్యాలుతో వివాహం జరిపించి మోసపోతాడు. లక్ష్మయ్య కుయుక్తులకు వంతపాడిన వ్యక్తి సంఘం కిష్టయ్య. భావనారుషి మీద అబ్బద్ధాలతో చేనేత సంఘం అధ్యక్షపదవి నుంచి తప్పించడానికి కారకుడు కిష్టయ్య. తన కులం, వృత్తి, ఊరు వివరాలు తెలియకుండా జాగ్రత్తగా లక్ష్మయ్యకు దగ్గరయిన నక్కజిత్తుల మనిషి రాములు. పట్నంలో తిరిగి ఉన్నతాధికారులతో పరిచయాలు పెంచుకొని పైరవీలు చేయడంలో దిట్ట. లంబాడోళ్ల ‘లబ్ధి’ని మోసం చేసిన ఘనుడు.

నవలలో చివరాఖరకు రాములు ముత్యాలును పెళ్లి చేసుకున్నాడని తెలిసిన లబ్ధి రాకతో రాములు బండారం బయటపడుతుంది. ముత్యాలుతో రైలులో వెళ్తున్న రాములు, లబ్ధి రావడంతో బండి నుంచి దూకి పారిపోతాడు. పోశయ్య గురువు. పిల్లలకు నీతి కథలు చెబుతాడు. ఊళ్లు తిరుగుతూ లోకజ్ఞానం పొందుతాడు. చెంద్రయ్యకు కొండలు, గుట్టలు చూపించి చైతన్యం కలిగిస్తాడు. పోరంకి దక్షిణామూర్తి నవలలో పాత్రలను ఇతివృత్తానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. నవలలోని గ్రామీణ పరిస్థితులను అనుగుణమైన భావాలను తెలంగాణ భాష ద్వారా చక్కగా చిత్రిక పట్టారు.

నవలలో సామాజిక జీవితం:
జీవిత వాస్తవికతను చిత్రించడంలో భాష కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. తెలంగాణ సామాన్య జన వ్యవహారిక భాషను రచయిత నిర్దిష్టంగా కథనంలో వాడటం మనకు స్పష్టం వినిపిస్తుంది. ప్రస్తుత తరానికి అవసరమైన తెలంగాణ భాష, సంస్కృతులు ‘ముత్యాల పందిరి’ నిండా అల్లుకుని ఉన్నాయి.

నవలలో ఎంచుకున్న భాషాశైలితో ఇతివృత్తాన్ని సమన్వయ్యం చేయడంలో దక్షిణామూర్తికి క్షేత్రపర్యటన అనుభవం బాగా ఉపకరించిందని చెప్పువచ్చు. ‘జీవితానికి ప్రాతినిధ్యం వహించే ప్రయత్నమే నవల ఆవిర్భావానికి కారణం'(హెన్రీ జెమ్స్) అన్నట్లుగా నవలలో సమకాలీన జీవితంతోపాటు సాంఘికాచార సంప్రదాయాలు కనిపిస్తాయి. సమాజానికి ప్రాతినిధ్యం వహించే పాత్రలు కూడా రచయిత ప్రవేశపెట్టాడు. జీవితానుగుణమైన వాస్తవ సంవాదాలతో నడుస్తుంది. కథాకథనంలో పూర్తి పల్లెటూరి జనవ్యవహారిక భాష ప్రయోగించడంతో రచయిత తన ప్రత్యేకతను చాటుకున్నారు.

ఉయ్యాలవాడలో ఊడలమర్రి వద్ద పిల్లలు ఆడుకుంటున్న దృశ్యంతో నవల మొదలవుతుంది. చంద్రయ్య తన మేనమరదలు ముత్యాలు కలిసి ఆడుకుంటుంటారు. చంద్రయ్య మేనమామ లక్ష్మయ్య ఉయ్యాలవాడలో పెద్ద బట్టల వ్యాపారి. ఆయన ఇంటిలో గ్రామానికి చెందిన పద్మశాలీల పిల్లలు వివిధ రకాలైన మగ్గం పనులు చేస్తుంటారు. ఆ ఊరిలో మగ్గం పనిమీద జీవించే చేనేత కులాలకు చెందినవారు చాలా మందే ఉంటారు. చేనేత కుటుంబాల పిల్లలకు బడికి వెళ్లి బాగా చదువుకోవాలని చాలా మందికి ఉన్నప్పటికీ తల్లిదండ్రుల ప్రోత్సాహం అంతంతమాత్రంగానే వుంటుంది. ఒకవైపు రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితుల్లో చేనేత కుటుంబాలు ఉండి, పిల్లలను కూడా నేతపనుల్లో పెట్టడం కనిపిస్తుంది. కుటుంబంలోని పిల్లల నుంచి వృద్ధుల వరకు తలా ఒకపని చేస్తేనే తప్పా కడుపులకు బువ్వదొరకని ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంటారు. చంద్రయ్యతోపాటు మిగతా శాలోల్ల పిల్లలు నర్సయ్య, నాగయ్య, మల్లయ్య, యాదగిరితోపాటు పోలీస్ పటేలు, మాలీపటేలు, పట్వారీల పిల్లలు కూడా బడికి పోతుంటారు. అదే దారెంబడిపోతున్న లక్ష్మయ్య సేటు గమనించి శాలొల్ల నాగయ్యనే పిల్లగాని జుట్టుపట్టుకొని కొడుతాడు. కార్టనాలో నీవంతు పని ఎవరు చేస్తారని మండిపడుతాడు.

పద్మశాలీ కుటుంబాల దయనీమైన పరిస్థితులు రచయిత మన కళ్లముందుంచుతాడు. ‘పెదొండ్లు కొల్వు సెయ్యాలె. పిల్లగాండ్లకు బువ్వ పెట్టాలె. మేం మంచిగ సదువుకొని, యాడన్న కొల్వు సేస్తం. నూర్ల రూపాలొస్తయి. ఈడేమున్నది ? అని యాదగిరి లక్ష్మయ్యను నిలదీస్తాడు. చేనేత పనులు పద్మశాలీలతోపాటు తొగటవాళ్లు, మాలవాళ్లు, కుర్మలు కూడా ఉన్నరు. దేవాంగులు దసిలి పట్టు నేతపని చేయడం కనిపిస్తుంది. ‘సాలోడు సచ్చినా, బతికినా గుంతలనే నానుడి ఉన్నట్లుగానే చేనేత కుల వృత్తిని నమ్ముకున్నవాల్లకు ఆర్ధిక పరిస్థితులు అద్వానమని రచయిత పరోక్షంగా చెప్పడం గమనించవచ్చు. ‘కుల ఇద్దె ఇడిస్తే ఇట్లనే ఉస్కె గంపలు మొయ్యాలె'(పుట: 18) అంటాడు లక్ష్మయ్య. ‘సాలెపల్లె దినమంత కష్టం సేస్తే రూపాయినె వస్తది గాని, కూలీ పన్ల రొండ్రూపాయిలొస్తయి గద’! అని శాల పోశయ్య ఆవేదన వ్యక్తం చేస్తాడు.

లక్ష్మయ్య ఊర్లో నూరు చేనేత మగ్గాల మీద చీరలు నేపియ్యడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో పద్మశాలీలకు నూలు అందించి చీరలు నేయిస్తాడు. దీంతో చేనేత కులాల మీదనే వ్యపారం చేస్తూ లాభాలు గడిస్తుంటాడు. చేనేత పనివారికి తగిన శ్రమ ఫలితం కోసం చేనేత కార్మికులు అందరూ కలిసి సహకార సంఘం పెట్టుకొని, భావనారుషిని అధ్యక్షుడిగా, కిష్టయ్యను కార్యదర్శిగా ఎన్నుకుంటారు. చేనేత సంఘం నడవడం ఇష్టంలేని లక్ష్మయ్య సేటు సెక్రెటరి కిష్టయ్యను తనకు అనుకూలంగా మలుచుకొని రాములును సెక్రెటరిగా ఎన్నికయ్యేటట్లు లక్ష్మయ్య చక్రం తిప్పుతాడు. పెట్టుబడిదారి స్వభావం కలిగిన లక్ష్మయ్య చేనేత కార్మికుల శ్రమ మీదనే లాభాలు ఆర్జించడమే కాదు, సోసైటీని నిర్వీర్యం చేయడంలో లక్ష్మయ్య కుట్రను రచయిత మన ముందుంచుతాడు. తోబుట్టువైన సుంకులమ్మ భర్త భావనారుషి సంఘం’కు అధ్యక్షుడైనప్పటికీ తన ఆర్థిక దోపిడీని సాగించడానికి కుట్రలో భాగంగానే ‘సంఘం’ సెక్రెటరి కిష్టయ్యను లోబరుచుకొని రాములును కార్యదర్శిగా ఎన్నుకొని సంఘాన్ని తన కనుసన్నల్లో నడుపుకోవడానికి వ్యుహం పన్ని విజయం సాధిస్తాడు. దోపిడీ స్వభావం కలిగిన పెట్టుబడి లాభాలే లక్ష్యంగా పనిచేస్తుంది. సమాజంలో కుల సంబంధాలను, రక్త బంధుత్వ విలువలను సైతం విస్మరిస్తుందని నవలలో రచయిత అద్భుతంగా చిత్రించారు.

నవలకు ప్రధాన కథానాయకుడు చెంద్రయ్య. తన మేనమామ కూతురు ముత్యాలంటే అమితమైన ప్రేమను పెంచుకుని కలలు కుంటాడు. చంద్రయ్య తల్లి సుంకులమ్మకు కూడా ముత్యాలును కోడులుగా చేసుకోవాలని మనుసులో వుంటుంది. తన తమ్ముడైన లక్ష్మయ్య ఆర్ధికంగా బాగా ధనవంతుడు కావడంతో పేదింటికి తన బిడ్డను ఇవ్వడానికి మనుసులో ఏనాడు ఆలోచన కూడా రానీయడు.తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితులను అర్ధం చేసుకొని చంద్రయ్య, ముత్యాలుకు తండ్రి చూసిన రాములునే పెళ్లి చేసుకోమని మౌనంగా తన బాధను దిగమింగుకుంటాడు. కులం, రక్త సంబంధాల కంటే సమాజంలో ఆర్థికంగా బలపడిన వర్గాలు ఏకమవడానికి ప్రయత్నిస్తాయని అర్థం చేసుకోవాలి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే'(మార్చ్)నని ‘ముత్యాలపందిరి’లో స్పష్టంగా దృగ్గోచరమవుతుంది.

ముత్యాలపందిరి: సాంస్కృతిక విశేషాలు:
‘ముత్యాలపందిరి’లో ఆయా సందర్బాలకు అనుగుణంగా మానవ జీవితంలోని వివిధ సాంస్కృతిక విషయాలను మనోహారంగా రచయిత చిత్రించారు. చంద్రయ్య, ముత్యాలు బాల్య జీవితంలో ఆడుకున్న ఆటలు, పాటలు నవల చిత్రించిన పరిస్థితులనాటికి పాఠకులను తీసుకొని వెళు తాయి. నవల చదువుతున్న ఆసాంతం మన కళ్లముందు ఆ దృశ్యాలు కదలాడుతాయి. మానవ జీవితంలో సంస్కృతి సంప్రదాయాలకు చాలా ప్రాధాన్యత వుంటుంది. జీవితమంత విశాలమైన నవలలో రచయిత మానవ జీవితంలో విభిన్న సాంస్కృతిక విశేషాలతో రచనలో అక్షరీకరించడం వల్లనే మంచి నవలకు సంపూర్ణత్వం చేకూరుతుందని విమర్శకుల అభిప్రాయం. నవల చదువుతున్న క్రమంలో పాఠకుడిని తన బాల్య జీవితంలోకి నడిపిస్తాయి. చంద్రయ్య, ముత్యాలు బావామర్దళ్లు. ప్రతీ బాల్యంలో పిల్లలకు ఆటలంతా ఇష్టం మరేది ఉండదేమో.


చెమ్మచెక్క చేరడేసి మొగ్గ/ అట్లుపోయంగ ఆరగించంగ,
ముత్యాల చెమ్మచెక్క ముగ్గులేయంగ/ రత్నాల చెమ్మచెక్క రంగులెయ్యంగ పవడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ/ ముత్తాలు పెండ్లికీ ముందు పోదారండి!

అంటూ పిల్లల పాటలు ఆకట్టుకుంటాయి. సుమారు అరవై ఏళ్ల కిందటి గ్రామీణ జీవితాన్ని రచయిత దక్షిణామూర్తి మనముందర ఆవిష్కరణ చేశారు. ముత్యాలుకు మేనత్త సుంకులమ్మ తన మేనకోడలును అల్లారుముద్దుగా చేనేత వృత్తి పనులు నేర్పుతుంది. ‘ఈడు సూడు బిడ్డా ! మొదలు ఏమి సెయ్యాలె రాటం కొనాకు ఎంకయ పీటున్నది గదా!దాని సెవుల్లకెల్లి కదురు పెట్టాలి. కదురు మీద దిండున్నది కదా! రాట్నం మొల్తాడు మీకెల్లి పురి గుంజకోని దిండుకు తొడగాలె. రాట్నం పురి బిర్రు గుంజినంక, కదురు కొనాకెల్లి ఊసె సెక్కాలి’ అంటూ కండెలు పోయడం సాంస్కృతిక ఉ త్పత్తి జీవిత మూలాలను పరిచయడం పూసగుచ్చినట్లు రచయిత వర్ణన చాలా ఆసక్తికరంగా వుంటుంది.


గ్రామీణ జీవితంలో పనితోనే పాట పుట్టిందనేది నానుడి. ఉత్పత్తికులాలు శ్రమైక జీవితంలో అలసటను మరచిపోయి ఉల్లాసంగ జీవితాన్ని ఆనందించడానికి నాటి నుంచి నేటి వరకు జానపదులకు ఆటపాటలు ప్రధానం.పాఠశాలకు వెళ్తున్న చంద్రరు, ముత్యాలు ‘కుమ్మరిగూడెం’లో ఒగ్గోలు కథ చెబుతున్న విషయం తెలుస్తుంది. పిల్లలకు కథలంటే బాల్యంలో చాలా ఇష్టపడుతారు. ఒగ్గు కళాకారులు చెప్పే బీరప్ప కథ విని తమ కుటుంబంలో బీరప్ప, నారజముడు పాత్రల్లా ఎవరుంటారో కూడా ముత్యాలు, చంద్రయ్య ముచ్చటలో తెలిసిపోతుంది.

ఈ నవలలో ముస్లిం పిల్లలతో కలిసి పతంగుల పండగ నిర్వహించుకోవడం కనిపిస్తుంది. విభిన్న సామాజిక వర్గాల మధ్య మత సామరస్యతా సాంస్కృతిక ఐక్యతను చిత్రించడంలో రచయిత చక్కని తెలంగాణ భాషా భావుకతను ప్రదర్శించారు. చంద్రయ్య ఇంటి నుంచి పారిపోయి వేరే గ్రామంలో శాలోల్ల కాడయ్య, ఈదమ్మ ఇంటిలో ఆశ్రయం పొందుతాడు. పున్నమ్మ పెండ్లి కార్యంలోని ఎదురుకోళ్లు, లగ్గంపోలు, అరుంధతి నక్షత్ర దర్శనం, “ఏర్నాల బంది’, పదహారు పండగ తదితర విశేషాలను వర్ణించడం పాఠకుడిని ఆకట్టుకుంటుంది. బతుకమ్మ పండగ నవలలో ఒక మలుపులు తిప్పుతుంది. ముత్యాలు తన బావకిచ్చిన ఉంగరం బతుకమ్మలు వదిలే నీళ్లకుంటలో దొరుకుతుంది. చేనేత కులాల నేసే రకరకాలయిన చీరలను రచయిత పరిచయం చేస్తాడు.

‘ఇగ్లో నర్సయ్యా ! ‘పూనాకొంగు రాజమాలంచు గద్వాల సీర’ ఎన్నడన్న జూసినవా ! అంటడిగిండు చంద్రయ్య. మగ్గం, కండెలు, రాట్నం, సిట్టెలు, గుమ్మి, పంటె, పోగు, సుంచు, సిగరు, ఊస, బద్దె, లాడెకొమ్ము, లడీలు, లాకలు, పిర్రపట్ట, పాకోడు, అలుక్కుంచె, సరిగుంజ, ఇర్లుకుంచె, ఆసు, పడుగు, దండెం చేనేత శ్రమైక సంస్కృతిలో భాగమైన పనిముట్లు రచయిత చక్కగా వివరించారు. నూలుపున్నం దీనికి మరోపేరు జంజరాల పున్నం చేనేతవారు పిలుస్తారు.

అన్నివర్గాల ప్రజలు రాఖీపౌర్ణమిగా కూడా జరుపుకుంటారు. చేనేతలో వృత్తి పనిలో తనకున్న అనుభవ జ్ఞానాన్ని చెబుతాడు చంద్రయ్య. గ్రామాల్లో విభిన్న సామాజిక కులాలు తమ సంస్కృతిలో భాగంగా కట్టు, బొట్టు విధానాలు వేర్వేరుగా ఉంటాయనడానికి నవలలో వృత్తి కళానైపుణ్యం వివరిస్తుంది. కొలికిమొంగి చీర, పచ్చీసుకానల చీర, పగడసారవొల్లె, ఉల్లిపూల చీర, జొన్నలరాశి చీర, దగ్గులపుటం చీర, గరెప్రోసల చీరలు నేయడం నేర్చుకుంటాడు. పనిమంతుడైన చంద్రయ్య తన మరుదలు ముత్యాలుకు “ముత్యాలపందిరి’ చీర నేయడం పని మొదలు పెడుతాడు. లక్ష్మయ్య తన కుమార్తె ముత్యాలుకు రాములుతో పెళ్లి నిశ్చయమైందని తెలిసినపుడు తన కడుపులోనే ఉద్వేగపు బాధను నింపుకొని తనలాంటి పేదవాడిని చేసుకొని మళ్లీ శాలపని చేసుడుకంటే ఉన్నోడిని చేసుకోవడం మంచిదని తన తల్లిని కూడా సముదాస్తాడు.

మానవ జీవితంలో సాంస్కృతిక జీవితంలో ఆహారపు అలవాట్లు కూడా ఒక భాగంగా మన గమనించవచ్చు. ఈ నవలలో తెలంగాణ, ఆంధ్ర ఆహారపు అలవాట్లకు సంబంధించిన పుంటికూర, గోంగూర చర్చను రచయిత నలభై ఏళ్ల క్రితమే తీసుకురావడం అభినందించదగిన విషయం. భాషలు వేరయినా మనుషులుగా మనమంతా ఒక్కటేననే భావన కలిగించారు.

తెలంగాణ భాషా విశేషాలు :
నవలలో తెలంగాణ జానపద భాష స్వచ్ఛత పాఠకుడికి కళ్ల ముందు కనిపిస్తుంది. తెలంగాణ సమాజంలోని జనవ్యవహారిక భాషను ప్రయోగించడం ద్వారా నవల మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. పోరంకి దక్షిణామూర్తి తెలంగాణ జిల్లాలో చేనేత వృత్తి పదకోశ సేకరణకు చేసిన క్షేత్రపర్యటన అనుభవం ద్వారా పొందిన భాషతోపాటు, చేనేత వృత్తి నైపుణ్యాన్ని చక్కగా వర్ణించారు.

మన జీవితాల్లో విస్మరించిన పదజాలం, సంస్కృతి, సంప్రదాయాలు ఆయా సందర్భాల్లోని సంఘటనలు ముందుకు లాక్కెళ్తాయి. సాల్లె(బడి), ఎంటికలు, కొల్వు, జిట్టెడు, సవుకారు, దప్తరు, తరీక, పుర్సతు, మొబ్బుల, యాష్ట్ర, ఉర్కుడు, పరాకతు, అర్ర, కమాయించు, జల్ది, దునియ, రేల్లాడి, సాలాయన, పోరగాండ్లు, పోరీలు, టక్కరు, ఫికరు, నెత్తి, ఇత్తులు, నాష్ట్ర, కరాబు, బర్రె పదాలు తెలంగాణ గ్రామీణ జీవభాష నవలలోకి రావడం రచయితకు భాష పట్ల ఉన్న గౌరవంగా గుర్తించాలి. సంస్కృతి, సంప్రదాయాల్లోంచి వచ్చిన భాషను సాహిత్య రచనలో వాడటం అరవై ఏళ్ల క్రితమే ప్రయోగించడం విశేషంగా పరిగణించాలి.

జరసేపు, లగ్గం,యాది, మాలు, గదువ, సత్తు, అగ్గువ, దస్కతు, వన్నె, సౌలతు, దియ్యి, గుబులు, పుంటికూర, తాంబాళం, ఎదురుకోళ్లు, దబ్బదబ్బ, దందలు, శురువు, నియతి, తెస్సగ, తానం, మతులాబు, అలుగు(ముల్లు) తోసలే పదాలు తెలంగాణ నిఘంటువులోకి ఎక్కించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సాహిత్య రచనలోకి తెలంగాణ భాష, యాసను తీసుకురావడం పట్ల రచయితలు కొత్తగ ఆలోచించాలి. ‘శాలోడు సచ్చినా బతికినా గుంతలోనే’, కుల ఇద్దెకు సాటిలేదు గువ్వలచెన్నా!, ‘సచ్చేదాక సగం గుంత సచ్చినంక నిండు గుంత’ సామెతలు చేనేత జీవిత అనుభవాల నుంచి వచ్చినవే.

అందమైన చీరలు నేసినప్పటికీ ఏనాడు కొత్త బట్టలకు నోచకొని బడుగు జీవుల పడుగుపేకలను వర్ణించడంతో రచయిత వస్తువు పట్ల స్పష్టమైన అవగాహనతో విజయం సాధించాడని చెప్పవచ్చు. నలభై ఏళ్ల కిందటి వాస్తవికతను అవగతం చేసుకొని రచించిన నవల ముత్యాల పందిరి. సమాజంలోని చేనేత వృత్తి జీవితాలను స్థితిగతులను, మానవ సంబంధాలు అర్ధిక సంబంధాలుగా బలపడుతున్న స్థితిని మన కళ్ల ముందు ప్రదర్శించారు.తెలుగు సాహిత్యంలో చేనేత జీవితాల మీద వచ్చిన రెండో నవలగా “ముత్యాలపందిరి’ని గుర్తించాల్సిన అవసరం ఉంది.

ఆధార గ్రంథాలు: పోరంకి దక్షిణామూర్తి, ముత్యాలపందిరి(నవల), ఎమెస్కో(2015), హైదరాబాద్

పుట్టింది వడ్డిచర్ల, జనగామ జిల్లా. నెల్లుట్లలో పెరిగాడు. జనగామలో సదివిన మట్టి పెడ్డ. వరంగల్లు నగరంలో వలస బతుకు మనుగడ. ఉపాధ్యాయ బోధన విద్యలో నల్లబల్ల మీద అక్షరాలకు అభద్ర కూలీ గొంతుకవుతాడు. చాయ్ నీళ్లు లేకున్నా సాహిత్య సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడు. కవి, రచయిత, జర్నలిస్ట్, పరిశోధకుడు, అధ్యాపకుడు. ప్రముఖ తెలుగు పత్రికల్లో పాత్రికేయుడిగా పని చేశాడు. ప్రస్తుతం ఉస్మానియా యునివర్సిటీలో 'తెలుగు సాహిత్యంలో చేనేత వృత్తి జీవనచిత్రణ'పై పరిశోధన చేస్తున్నాడు.

2 thoughts on “ముత్యాలపందిరి: చేనేత వృత్తి – సామాజిక, సాంస్కృతిక విశ్లేషణ

  1. ఆర్టికల్ సూపర్. నేత కార్మికుల కష్టాలను, చేనేత గొప్ప తనాన్ని కళ్లకు కట్టినట్లు రాశారు. శ్రమైక జీవన సౌందర్యం తెలిసిన రచయితలకు మాత్రమే ఇలాంటి రచనలు చేయగలరు

Leave a Reply