రెచ్చిపోయిందంటే నలుగురు మనుషులకు కూడా లొంగని దున్నపోతు అతడి సమీపంలో పసిపిల్లలా అవుతుంది. భయంతో కాదు, అతని కళ్లలోని కరుణతో. చెట్టు తొర్రలోంచి కిందపడ్డ చిలక పిల్ల అతని చేతుల మెత్తదనంలో కోలుకుని, కిలకిలమని పాట పాడుతుంది.
అంత అపురూపమైన ఆ చెంగల్వ రాయుడి స్నేహం, చిగురాకులాంటి సత్యవతిని మాత్రం కరిగించదా?
గ్రామంలో పెద్ద భూస్వామి అయిన మునసబు గారి కూతురు సత్యవతి. “దోసెడు ముత్యాల్లోనూ, దోసెడు రత్నాల్లోనూ పుట్టిన పిల్ల.” అయిన వారినందరినీ పోగొట్టుకుని గాలివాటున ఆమె లోగిట్లోకి కొట్టుకొచ్చిన అనామకుడు చెంగల్వ రాయుడు.
పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన సత్యవతికి అతన్ని చూస్తే కన్నతల్లి తిరిగి లేచి వచ్చినట్టు అనిపించేదట. ఎవరూలేని అతడికి ఆమె సర్వస్వమూ అయింది. త్రాచులు సంచరించే పొదల్లో తలదూర్చి ఆమెకు ఇష్టమైన పువ్వులు కోసుకొస్తాడు అతడు. ఆ దుస్సాహసానికి హడిలిపోయి అతడిని కాపాడమని మొక్కుకుంటూ అమ్మవారి కుంకుమ తెచ్చి నుదుటన పెడుతుంది సత్యవతి.
మనసులు కలిస్తే బతుకులు ముడిపడి పోతాయనుకునే అమాయకత్వం. పెళ్లిళ్లు జరిగేది సామాజిక హోదాల నడుమనే తప్ప, మనుషుల మధ్యన కాదనే వాస్తవం తెలియని కాల్పనిక లోకం. ఆమె కుటుంబానికి తలలో నాలుకై బాధ్యతలు మోస్తున్నాను కనుక, నోరువిప్పి అడిగితే అల్లుణ్ణి చేసుకుంటారని భ్రమించిన అతణ్ణి, అవమానించి వెళ్లగొట్టారు. డబ్బు సంపాదించి రెండేళ్లలో తిరిగి వస్తానని ఆమెకు మాటిచ్చి వెళ్ళాడు చెంగల్వ రాయుడు. అతడు తిరిగి వచ్చే దారులు మూసేయటం ఎలాగో మునసబు గారి కుటుంబానికి తెలుసు. అది- ఆమెకు పెళ్లి చేసెయ్యటం. ‘తగిన’ సంబంధం చూసి బాధ్యత నిర్వహించారు.
ఆస్తుల, హోదాల భద్రతా వలయంలో ఒదిగి నిలిచే నైపుణ్యం నైపుణ్యం నేర్వని సత్యవతి అత్తవారింటి నుంచి పారిపోయి వచ్చింది. బుద్ధి చెప్పి వెనక్కి పంపారు. ఆ బోధనను గ్రహించటానికి ఆమె మనసు ఆమె వద్ద ఉంటే కదా!
కాపురంలో ఇమడక, జుట్టు విరబోసుకుని తిరుగుతున్న ఆమెకు ‘దయ్యం’ వదిలించే భూత వైద్యాలు చేయించి తిరిగి అత్తవారింటికి పంపారు. ఆమె పరిస్థితిలో మార్పు లేదు. ఇప్పుడిది ఆ రెండు కుటుంబాల పరిథి దాటి ఊరుమ్మడి సమస్యగా మారింది. ఊరిపెద్ద మునసబుగారి పెద్దకొడుకుగా దీనికి ముగింపు పలికే బాధ్యతను భుజాన వేసుకున్నాడు సత్యవతి పెద్దన్న సుబ్బారాయుడు.
ఒక అర్థరాత్రి వేళ పుట్టింటికి తిరిగొచ్చిన చెల్లెలిని, తక్షణమే వెంటబెట్టుకుని అత్తవారింట్లో వదలటానికి బయల్దేరాడు. అతడు తిరిగి వచ్చాడు కానీ, ఆమె అత్తవారింటికి చేరలేదు. పుట్టింటికి తిరిగి రానూలేదు. సత్యవతి అదృశ్యం ఒక వార్తగా, ఆ పైన ఒక జ్ఞాపకంగా మారి, క్రమంగా మరుగున పడింది.
సుబ్బారాయుడి మానసిక, శారీరక ఆరోగ్యాలు ఏ తెలియని కారణంతోనో క్షీణించసాగాయి. వైద్యానికి ఒప్పుకోడు. తనను తాను శిక్షించుకుంటూ సత్యవతిని కలవరిస్తూ కునారిల్లిపోతున్నాడు. చివరకు అతడి గుండెను బద్దలు కొట్టుకుంటూ బయట పడింది మాట –
“ ఆ రాత్రి, గోనలేరు పొంగింది. బల్లకట్టు కన్నయ్య లేడు. నేనే బల్లకట్టు వేసానే.. ఎక్కనందే… లాగి బల్లకట్టు మీద పడేశానే… సత్యవతి ఇక రాదు… గోనలేరు మింగేసింది… నేనే… నా చేతులారా…!”
సుబ్బారాయుడి శ్వాసతోబాటు గాల్లో కలిసి పోయింది సత్యవతి మరణ రహస్యం!
1962 లో కళ్యాణ సుందరీ జగన్నాథ్ రాసిన ‘అలరాస పుట్టిళ్లు’, కథ ఇది. కులమో, మతమో, ఆర్థికమో… ఏదయితేనేం ఏ శక్తినో ఆసరాగా చేసుకుని, ఈ కథను తాజాగా కొనసాగిస్తూనే ఉంది ఈ సమాజం.