‘‘ఆయన మాటలను రికార్డుల నుంచి తొలగించాలి’’ అన్నాడు మరొకడు.
దాంతో సభలో ఒక్కసారి గందరగోళంమైంది. నిరసనలు పెల్లుబికినయి. జనం అంత గోల గోలగా అరుస్తూ కంపెనీ కుట్రపన్ని ఇదంతా చేస్తుందని తిట్టపోయసాగారు. ఆ లొల్లి చూసి అంతవరదాకా మాట్లాడిన వాడు చల్లగా జరుకున్నాడు. అటు తరువాత వాన్ని చూస్తామంటే కంటికి కనిపించకుండా పోయిండు.
‘‘ఇందాక మాట్లాడిన వాని మాటలు రికార్డుల నుంచి తొలగించకుంటే.. సభను జరుగనిచ్చేదిలేదు’’ అంటూ దుబ్బగూడెం జనం పెద్దగా అరవసాగిండ్లు.
ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా కంపెని ఇటువంటి ఎత్తుగడలు పన్నటం కొత్తేమి కాదు. ప్రతిపాధిత ప్రాజెక్టు కింద నిర్వాసితమయ్యే గ్రామాల్లోకి ప్రత్యేకంగా మనుష్యులను పంపి ఊరిలో లంగలను, దొంగలను చేరదీసి వారికి ఆశలుపెట్టి, డబ్బులు ఇచ్చి స్థానిక లీడర్ల పైరవీలకు తలలూపి, నయానా భయానా మరికొందరిని లొంగదీసుకుని ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కుట్రలు పన్నటం కొత్తేమి కాదు.
పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్న జనం అల్లరి చూసిన తరువాత కలెక్టర్ జోక్యం చేసుకోక తప్పలేదు. ‘‘నిజంగా ఐలయ్య దుబ్బగూడెం వాసి కాకుంటే ఆయన మాటలను రికార్డుల నుంచి తొలగిస్తాం’’ అంటూ ప్రకటించిండు.
‘‘ఒక్కసారి మళ్ళీ పిలిపించండి… వాడు దుబ్బగూడెం వాడో కాదో ఇప్పుడే తేలిపోతుంది’’ అంటూ అరిచిండొకరు.
ఇంతవరదాకా మాట్లాడిన వాడు మళ్ళీ వస్తాడేమోనని కొద్ది సమయం వేచి చూసిన కలెక్టర్ అతను రాకపోయేసరికి’’ ఐలయ్య మాటలు రికార్డుల నుండి తొలగిస్తున్నాం’’ అంటూ ప్రకటించిండు.
జనం శాంతించిండ్లు.
‘‘ఎర్రగుంటపల్లి నుండి గంధం రామస్వామి వచ్చి మాట్లాడాలి’’ అంటూ ప్రకటించిండ్లు….
గంధం రామస్వామి అనే నడీడు మనిషి వచ్చి మైకందుకున్నడు.
‘‘అయ్యా మేం నాయకపోళ్ళం. మా తాతతండ్రుల కాన్నుంచి మేం ఎర్రగుంటపల్లిలో ఉంటానం. ఇప్పుడు కంపినోడు వచ్చి మా భూములు గుంజుకుని మమ్ములను వెళ్ళగొట్టాలని చూస్తాండ్లు. అదేదో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందట. అక్కడ మా బాధలు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని అందరికి అందరం బయలుదేరివస్తాంటే. పోలీసులు వచ్చి ఊరును చుట్టుముట్టి మమ్ముల్ని ఇక్కడికి రాకుండా అడ్డుకున్నరు. తీరా ఎమ్మెల్యే వచ్చి లొల్లి పెడితే కాని మమ్మల్ని వదిలపెట్టలేదు. అయ్యా ఇదేమీ ప్రజాభిప్రాయ సేకరణ, అటువంటి దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? మా బొండిగ కోసి జీవిగంజి పోస్తామంటాండ్లు. ఇది మీకు న్యాయమైతదా!’’ అంటూ ఆవేదన చెందాడు.
‘‘పెద్ద పెద్ద సార్లు వచ్చిండ్లు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చిండ్లు. యూనియన్ల నాయకులు వచ్చిండ్లు.. వీళ్ళంతా ప్రజల వైపు నిలవాలి కానీ… కంపినివైపు నిలిచి మా బ్రతుకులు నాశనం చెయ్యాలని చూస్తాండ్లు.. ఇదెక్కడి అన్యాయం!’’ అన్నాడు మళ్ళీ.
‘‘ఇయ్యాల కొంతమంది పెద్దలు భూములు పోయినోళ్ళకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలి అంటాండ్లు. కంపెని భూములు తీసుకునేటప్పుడు ఒక మాట.. తీసుకున్నాంక మరో మాట మాట్లాడుతాంది’’ అంటూ నాయకులకేసి చూస్తూ ‘‘అయ్యా మీరెప్పుడైన వాళ్ళ బాధలు పట్టించుకున్నరా! ఇయ్యాల వచ్చి మాకు నీతులు చెప్పుతాండ్లు’’ కంపినోనికి అమ్ముడుపోయి మా బ్రతుకుల ఎందుకు మట్టి పోస్తరు’’ అన్నాడు ఆవేశంగా.
‘‘ఇదిగో నీ అభిప్రాయం చెప్పాలి… ఎవరిని తిట్టకూడదు’’ వేదిక మీదున్న పెద్దమనిషి అరిచిండు.
అప్పటికే పొద్దు వంగిపోయింది. వలన చాలామంది లేచిపోతాండ్లు. కంపినోడు చాయ్ బిస్కట్లు సప్లయి చేసిండు. కానీ అది ముందుకూచున్న వాళ్ళకే సరిగా అందలేదు. తాగేందుకు నీళ్ళు కూడా సరిగా లేక అవస్థలు పడుతాండ్లు. ఏదో ఒకటి తేల్చుకునేదాక ఇక్కడి నుంచి కదిలేది లేదన్నట్లుగా నిర్వాసిత గ్రామాల ప్రజలు మాత్రం మిగిలిపోయిండ్లు.
ప్రజాభిప్రాయ సేకరణకు హక్కుల సంఘం వాళ్ళు వచ్చిండ్లు. స్వచ్చంధ సంస్థ ప్రతినిధులున్నారు. భూమి రక్షణ సమితి అనే ఓపెన్‍కాస్టుకు వ్యతిరేక పోరాట కమిటి వాళ్లు ఉన్నారు.
సభ ఆలస్యంగా ఆరంభం కావడం… ప్రజా ప్రతినిధులను, ఎంపీ, ఎమ్మెల్యే, యూనియన్ నాయకులను ముందు మాట్లాడించడంలో పుణ్యకాలం కాస్తా కరిగిపోయింది. హక్కుల సంఘం వాళ్ళకు, స్వచ్చంధ సంస్థల వాళ్ళకు ముందే మాట్లాడిస్తే అసలు లక్ష్యం దెబ్బతింటుందని భావించిన నిర్వాహకులు వారిని చివరగా మాట్లాడించాలనుకున్నారు. దాంతో వారు అవకాశం కోసం ఎదురు చూడసాగిండ్లు. అటు తరువాత ఒకరిద్దరు వచ్చి కంపెనికి అనుకూలంగా మాట్లాడిండ్లు. జనం లొల్లి పెట్టేసరికి వాళ్ళ గొంతులు దగ్గరపడి అర్థాంతరంగా ముగించిండ్లు…
నిర్వాహకులు మరోమారు మిగిలిపోయిన యూనియన్ నాయకులు మాట్లాడటానికి అవకాశం కల్పించిండ్లు. ఈసారి భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకున్ని పిలిచారు. జనం అసహనాల మధ్య నాయకుడు మైకు ముందుకు వచ్చిండు. ఆయన వేదిక మీదున్న వారిని పేరుపేరున సంబోధించి మాట్లాడసాగిండు. ‘‘అయ్యా నేను ఓపెన్ కాస్టులను వ్యతిరేకిస్తలేను, సమర్థిస్తలేను’’ అంటూ మొదలు పెట్టిండు.
‘‘మరి ఎందుకు వచ్చినవు టె•ంపాస్ చేయడానికా’’ అంటూ జనం అరిచిండ్లు.
ఆయన అదేమీ పట్టించుకున్నట్టు లేదు. తను చెప్పాల్సింది చెప్పుత అన్నట్టుగా ఉపన్యాసం దంచడం మొదలుపెట్టిండు.
ఈ అరుపులకు, కేకలకు బెదిరేవాన్ని కాదు..’’ అన్నాడు.
జనం అరుపుల కేకల మధ్య ఆయన ఏం మాట్లాడుతాండ్లో ఏమో ఎవరికీ అర్థం కాలేదు. సభంతా రసాబాసగా మారిపోయింది. ఆయన తన ఉపన్యాసాన్ని అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది.
మరోసారి కలెక్టర్ కలుగజేసుకున్నాడు. ‘‘మనకు ఎదుటి వారి అభిప్రాయం పట్ల వ్యతిరేకత ఉంటే ఉండవచ్చు కానీ మనం వారి అభిప్రాయం చెప్పనివ్వాలి. అట్లా చేయడం సంస్కారం అవుతుంది’’. అన్నాడు కోపంతో.
‘‘కాసిపేట ఎక్స్ ఎంపీటీసి రాపల్లి శ్రీనివాసు మాట్లాడాలి’’ అన్న ప్రకటన వెలువడింది.
రాపల్లి శ్రీనివాస్ మాట్లాడసాగిండు. ‘‘గిరిజన చట్టాలను తుంగలో తొక్కి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న పెద్దలకు, దొంగ మస్టర్లు వేయించుకుని కంపెని తరుపున మాట్లాడటానికి వచ్చిన కార్మిక సోదరులకు కంపెని ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుందని తెలిసి దాన్ని విజయవంతం చేయటానికి వచ్చిన ఎమ్మెల్సీకి, యూనియన్ నాయకులకు, ప్రాజెక్టు కింద సర్వం కోల్పతున్న సోదరులకు అందరికీ వందనాలు’’ అన్నాడు.
ఆ దెప్పిపొడుపు మాటలకు ముందు వరుసలో కూచున్నవారికి ఇబ్బంది కలిగించింది.
‘‘ప్రతిపాదిత ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే గ్రామాలు అన్నీ కూడా షెడ్యూల్ ప్రాంతాలు, షెడ్యూల్ ప్రాంతంలో పీసా అడవి హక్కుల చట్టం ప్రకారం గ్రామసభ అనుమతి లేకుండా ఎటువంటి ప్రాజెక్టు పనులు చేపట్టరాదు. ఇక్కడ నిర్లజ్జగా చట్టాలను ఉల్లంఘించి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న అధికారుల మీద ముందుగా శిక్షించాలి’’ అన్నాడు. చట్టాలు ఉల్లంఘించే వారిని శిక్షించాలి’’ అని జనం అరిచిండ్లు.
అతను మళ్ళీ మాట్లాడ సాగిండు.
‘‘పర్యావరణ శాఖ నాలుగు వందల పేజీల రిపోర్టు తయారు చేసింది. అది కూడా ఇంగ్లీష్‍లో… అది చదివి అర్థం చేసుకునే వాళ్ళు నిర్వాసిత గ్రామాల్లో ఎందరున్నారో నాకైతే తెలియదు. వాస్తవానికి పర్యావరణ శాఖ తయారు చేసిన రిపోర్టు స్థానిక ప్రజలకు అర్థమయ్యే విధంగా స్థానిక భాషలోనే ఉండాలి. కానీ అదేమీ చెయ్యలేదు. చివరికి ఇంగ్లీష్ రిపోర్టు కూడా అందుబాటులో లేదు. పదిహేడు పేజీల రిపోర్టును కంపెని తెలుగులో ముద్రించిండ్లు. అది కూడా అందరికి అందజేయలేదు. దాన్ని సంపాదించడానికి నాకే బ్రహ్మ కష్టమైంది. చివరికి ఆ రిపోర్టులో ఏముందయ్యా అంటే అంత తప్పుల తడక, వాస్తవాలను కప్పి పుచ్చిండ్లు . కంపెనీ అది చేస్తాం. ఇది చేస్తాం అంటూ అబద్దాలతో నిండిపోయి ఉంది. యువకులకు కుట్టుపనులు, అల్లిక పనులు, రిపేరింగ్ షాపులు పెడ్తారంటా మేం తినే కంచం గుంజుకుని మా మీద ఎంగిలి మెతుకులు ఎగజల్లుతరంట’’ అన్నాడతను ఆవేశంగా.
ఆయన మాటలు ఓపెన్‍కాస్టులకు అనుకూలంగా మాట్లాడిన వారికి ఇబ్బంది కలిగించింది.
‘‘చివరగా ఒక్క మాట చెబుతా! అంటూ అతను మరింత గొంతు పెంచిండు’’ గిరిజన చట్టాలకు భిన్నంగా చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రజాభిప్రాయ సేకరణను తక్షణమే రద్దుచెయ్యాలి. ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేసిన తర్వాత, ప్రభావిత గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి’’ అన్నాడు. అతని ప్రశ్నకు జవాబు ఏది? ప్రజలకు రక్షణ ఇచ్చే చట్టాలకు చిత్తు కాగితం విలువ ఇవ్వని దుర్మార్గం రాజ్యం ఏలుతుంది.
అటు తర్వాత మాట్లాడిన దుబ్బగూడెంకు చెందిన శంకర్‍ది మరో విషాదగాథ.
‘‘సోమగూడెం బాయి పడ్డప్పుడు మా ఊరినుండి అరవై ఎనిమిది ఎకరాలు తీసుకున్నరు. అందులో నావి ఆరు ఎకరాల పంట భూమి పోయింది. నాతోపాటు మరో నలభై మంది ఉన్నారు. నష్ట పరిహారం సరిపోదని కోర్టుకు పోతే ఇన్నేండ్లకాన్నుంచి కేసు ఎటూ తెగనేలేదు. కింది కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇస్తే కంపినోడు ఆపై కోర్డుకు పోయిండు. అట్లా ఇప్పుడు ఆ కేసు సుప్రీం కోర్టుల నడుస్తోంది. ఏండ్లకు ఏండ్లుగా ఎటూ తేలకుండా ఉంది. ఈ లోపున సోమగూడెం బాయి మొదలైంది. ఇప్పుడు బాయిల బొగ్గు అయిపోయిందని బావి మూతపడ్డది. కంపినోడు మిగిలిపోయిన బొగ్గు తవ్వుకొను ఓపెన్‍కాస్టు చేస్తమని, అందుకోసం మా ఊరు కావాలని మళ్ళీ వచిండ్లు. మళ్ళీ అదిస్తాం, ఇదిస్తాం అంటూ మాతో మాటలు చెప్పుతాండ్లు… బొగ్గు బావుల కింద భూములు ఇచ్చి మేం ఎట్లా అరిగోస పడ్డమో ఎప్పుడు ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. రెండు పంటలు పండే నా భూమిల ఇయ్యాల కంపినోడు పిచ్చిమొక్కలు నాటిండు. మా కర్మ ఇట్లా కాలబడ్డదని, తలరాతనుకొని ఏదో కూలినాలి చేసుకుంటూ చావకుండా బతుకుతున్నం. అట్లా బతకలేనివాళ్ళు సచ్చినోళ్ళు సచ్చిండ్లు. బ్రతుకుదెరువు వెతుక్కుంటూ పోయినోళ్ళు పోయిండ్లు. ఇప్పుడికీ కంపినోనికి మా ఊరు మీద కన్నుబడ్డది. ఊరు క్రింద ఉన్న బొగ్గు తవ్వుకోను మా ఊరును మా బ్రతుకుల్ని అందులో మాయం చేయాలని చూస్తాండ్లు. దానికి ఈ పెద్దలు వంతలు పాడుతాండ్లు? ఇదేం న్యాయం’’.
‘‘మేం సావనైనా చస్తాం కానీ మా ఊరును విడిచిపెట్టేది లేదు. మమ్ముల్ని అందరికి అందర్ని చంపి ఊరు తీసుకోండ్లి’’ అన్నాడు పొంగుకొచ్చె దుఃఖంలో అతని గొంతు మూగపోయింది.
9.
ప్రజల ఆవేదన చెవిటి వారి ముందు శంఖం ఊదినట్టుగా ఉంది.
అటు తర్వాత దుబ్బగూడెం వాసి కనకయ్య మాట్లాడటానికి వచ్చిండు.
‘‘శంకరయ్య చెప్పింది నిజమేనయ్యా…. బొగ్గు బాయి కింద తీసుకున్న భూములపైసలే ఇంకా రానేలేదు. బ్రతుకుదెరువు లేక మంచిర్యాల పోయి కూలినాలి చేసుకొని బ్రతుకుతన్నం. మళ్ళీ ఏదో మీటింగంటే మా భూమి పైసలు వస్తయేమోనని వచ్చిన గా భూమి పైసలు ఇప్పించాలి బాంచెన్’’ అంటూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు.
‘‘జాడి రంచందర్’’ అనే పిలుపు విని ఓ యువకుడు వేదిక మీదకు వచ్చిండు. అతని పీక్కపోయిన ముఖంలో ఏదో విషాదం, అసహనం నెలకొని ఉంది.
‘‘మాది ఎర్రగుంటపల్లి. నేను డిగ్రీ వరకు చదువుకున్నా. ఉద్యోగం దొరకలే. మా కులవృత్తి అయిన గొర్లు కాసుకుని బ్రతుకుతున్న. ఏదో ఊర్లు పోతాయంట. దాని గురించి ఇయ్యాల మీటింగు ఉందని మా అయ్య చెప్పేదాక నాకు దాని సంగతి తెల్వదు. ఇక ఇప్పుడు మాట్లాడకుంటే ఎప్పుడు మాట్లాడినా దండుగేనని పరుగుపరుగున వచ్చిన. ‘‘మాకు ఉద్యోగాలు రాకుంటే రాకపాయే… ఏదో గొర్లు మేపుకొని బ్రతుకుదాం అనుకుంటే అది లేకుండా చేస్తరా! ఊరు పోయినంక ఏముంటుంది… బొందలగడ్డల్ల ఏ చెట్టు చేమ మొలుస్తది. మా గొర్లు ఎట్లా బ్రతుకుతయి. మేం ఎట్లా బ్రతకాలి. మీ ఓసీపీలు మాకు వద్దు, మా నేల మీద మమ్ముల్ని ఎట్లనో అట్ల బ్రతకనివ్వండి. మేం ఏం పాపం చేసినమని మాకు ఈ శిక్ష’’ అంటూ ఆవేదన చెందాడు.
నిర్వాసితుల ఎవరి బాధ చూసినా ఒక్క తీరుగానే ఉంది. ఊరుపోయిన తర్వాత బ్రతుకు ఎట్లా బ్రతుకుదాం అన్న బ్రతుకు భయం.
సమత స్వచ్చంధ సంస్థకు చెందిన వ్యక్తి మాట్లాడారు. గిరిజన చట్టాలకు నిర్వాహకులు ఉల్లంఘించిన విషయాన్ని ఆయన చాలా సవివరంగా నిశితంగా వివరించాడు.
‘‘ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల్లో జీవజాతుల మీద, చెట్లమీద అధ్యయనం చేశారు తప్ప…. ప్రభావిత గ్రామాల ప్రజలకు జరిగే నష్టం గురించి పర్యావరణ రిపోర్టులో ఎక్కడా పేర్కొనకపోవడం విచిత్రం. పశువులకు, కోతులకు, కొండెంగులకు ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా ఈ గ్రామాల ప్రజలకు ఇవ్వరా! వారు తయారు చేసిన రిపోర్టు అయినా సరిగా ఉందా అంటే అదీ లేదు. ఏదో కంటితుడుపు చర్యగా ఉంది. వారి అధ్యయనాలకు శాస్త్రబద్ధత లేదు. ఒక ప్రాజెక్టు ఆరంభించినప్పుడు ఆ ప్రాజెక్టు వల్ల ఏర్పడే పర్యావరణ ప్రభావం గురించే కాదు. ఆ ప్రాజెక్టు వల్ల మానవ జీవితాలపై పడే ప్రభావం గురించి, సోషల్ ఇంపాక్ట్ గురించి అధ్యయనం చేయాలి కానీ అదంతా జరుగలేదు.
‘‘ప్రభావిత గిరిజన గ్రామాల్లో ఎన్ని తెగల గిరిజనులున్నారు. వారి జీవనోపాధి, జీవన విధానం, సంస్కృతి సాంప్రదాయాలపై ప్రాజెక్టు చూపే ప్రభావం గురించి అధ్యయనం చెయ్యాలి. అటువంటి వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసే స్వచ్చంధ సంస్థలు దేశంలో చాలా ఉన్నాయి. వీరికి చేతకానప్పుడు అటువంటి స్వచ్చంధ సంస్థల సహకారం తీసుకోవాలి. కానీ ప్రాజెక్టు మీద అధ్యయనం చేసిన పర్యావరణ శాఖ అదేమీ చెయ్యలేదు. రిపోర్టు అసమగ్రంగా ఉంది. అశాస్త్రీయంగా ఉంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణను తక్షణమే రద్దు చేసి సమగ్రమైన శాస్త్రీయమైన అధ్యయనం చేసిన తరువాతే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. అదే సమయంలో గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తూ జరుగుతున్న ఈ సభకు సాధికారత లేదు. మరో మాటలో చెప్పాలంటే ఈ సభ చట్ట వ్యతిరేకంగా జరుగుతుంది. కాబట్టి వెంటనే రద్దు చేయ్యాలి. అన్నీ సక్రమంగా ఉన్న తరువాతే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి’’ అంటూ తన అభిప్రాయాన్ని ప్రకటించిండు.
తమకు అనుకూలంగా మాట్లాడుతారు అనుకున్న వారిని ముందే మాట్లాడించడం, తమకు వ్యతిరేకంగా మాట్లాడుతారని భావించిన వారిని ఆఖరుగా మాట్లాడించడం కంపెని ఎత్తుగడలో ఒక భాగం. ఎందుకంటే అప్పటికీ చాలా కాలయాపన జరిగి జనం సహనం కోల్పోయి ఎవరు ఏమి మాట్లాడుతున్నారో విన ఓపిక లేకుండా పోతుంది. వారి ఎత్తుగడ కొంత ఫలితాన్ని ఇచ్చింది. మధ్యాహ్నం మూడు గంటలు దాటేసరికి ఆకలికి తాళలేక సగం మంది ఖాళీ అయ్యిండ్లు. ఇక తప్పనిసరి పరిస్థితిలో నిర్వాసితులు మిగిలిపోయారు.
జనాల ఓపికను పరీక్షపెడుతూ ఏఐటీయూసీ నాయకుడు ఒకడు వచ్చి మాట్లాడసాగిండు. అతను ఓసీపీలను సమర్థిస్తూ మాట్లాడే సరికి, అసలుకే అసహనంతో ఉన్న జనం పెద్ద ఎత్తున అల్లరి పెట్టిండ్లు. దాంతో అతను అర్థాంతరంగా తన ప్రసంగాన్ని ముగించిండు.
అటువంటి సమయంలో టిబిజికెఎస్ అధ్యక్షుడు మాట్లాడటానికి పిలుపు వచ్చింది. ఆయన మాట్లాడుతూ సహజ వనరుల ప్రజల అభివృద్ధిలో భాగం కావాలి కానీ అందుకు విరుద్ధంగా జరుగుతుంది. ఈ తలక్రిందుల అభివృద్ధిని వ్యతిరేకించే ప్రజలను తుపాకులతో అణిచివేస్తున్నారు. ప్రాజెక్టు కింద నష్టపోతున్న జనం గొంతు నొక్కేందుకు ఆయా గ్రామాల్లో సాయుధ బలగాలను మోహరించి వారిని రాకుండా చేసి, అరెస్టులు కొనసాగించి, భయోత్పాతం సృష్టించి సాగిస్తున్న ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఉత్త భూటకం. ఇప్పటికే ఓసీపీల క్రింద నిర్వాసితులైన ప్రజలకు కంపెని ఇచ్చిన హామీలు అమలు జరుపలేదు. ఇప్పుడు మళ్ళీ హామీలు ఇస్తూ మరోసారి మోసం చెయ్యాలని చూస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ పేరు మీద ప్రభుత్వం తన అభిప్రాయాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దటం జరుగుతుంది. ఇది అన్యాయం, అక్రమం. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా చట్టం నిర్దేశించిన పాటించలేదు. అందువలన నియమాలు ఈ ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చెయ్యాలి. ప్రకృతికి పర్యావరణానికి నష్టం కలిగించే ఓసీపీల ద్వారా బొగ్గు తవ్వే విధానాలకు ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలి’’ అన్నాడు.
అటు తరువాత మాట్లాడిన తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మరింత తీవ్రంగా తన నిరసన వ్యక్తపరిచాడు.
‘‘ఇది అభివృద్ధికాదు విధ్వంసం. ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓసీపీలను వ్యతిరేకిస్తూ మాట్లాడితే దాని అనుబంధ ట్రేడ్ యూనియన్ నాయకుడు ఓసీపీలను సమర్థించడం ఏమిటి? ఈ రెండు నాల్కల ధోరణి ఏమిటి? పార్టీకంటూ ఒక పాలసీ ఉండాల వద్దా? ఓసీపీలను సమర్థించే వాళ్ళు ఎవరి వైపు నిలుస్తాండ్లు? కార్పోరేటు సంస్థలవైపు నిలుస్తాండ్లా? కంపెని ఇచ్చే డబ్బుల కోసం ఎంత నీచానికైనా పాల్పడుతారా? వీళ్ళు ఈ మనుషులుగా ఆలోచించడం మానివేసి కార్పోరేటు బానిసలుగా ఆలోచించే నాయకులను మనం నాయకులుగా ఎట్లా గుర్తించాలి. బొగ్గు గనుల క్రింద కాసిపేట మండలంలోని భూములు తీసుకుని వారికి కనీసం త్రాగటానికి మంచినీళ్ళు కూడా ఇవ్వని కంపెని ఇవ్వాళ కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటి గురించి మాట్లాడుతు ప్రజలను మోసం చేస్తుంది. ఓసీపీలు వస్తే కంపెనికి లాభాలు వస్తాయంట. కార్మికులు లాభపడుతారంట. ఉద్యోగాల భద్రత ఉంటుందని కొంతమంది అమ్ముడుపోయిన ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడిండ్లు. కానీ వాస్తవంగా ఏం జరిగింది? జరుగుతుంది? ఓసీపీలు వచ్చిన తరువాత ఉత్పత్తులు మూడు రెట్లు పెరిగితే కార్మికుల సంఖ్య సగానికి ఎందుకు తగ్గింది? ఓసీపిలు వచ్చి కార్మికులను బాగుచేసిందా? కార్పోరేటు సంస్థలను బాగు చేసిందా? కార్మికులను తగ్గించి ఉత్పత్తులు పెంచడం అభివృద్దా! ఓసీపీల క్రింద ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎంత విధ్వంసం జరిగిందో వాటిని సమర్థించే నాయకులను తెలియదు అనుకోవాలా! ఏమిటి ఈ బానిస బుద్ది. తమ జేబుల్లోకి నాలుగు రూపాయలు వస్తాయంటే ప్రజలకు ఎంత నష్టం జరిగినా ఫర్వాలేదు! ఇదిగో ఇటువంటి వారి గురించే ‘అమ్మ’ నవలలో మాగ్జింగోర్కి ఆధ్యాత్మిక బానిసలన్నాడు. ఆ పోలిక సరిగ్గా ఈ నాయకులకు సరిపోతుంది’’. అన్నాడు తీవ్ర స్వరంతో.
తమ నాయకులను అంత మాటలు అనేసరికి వారి అనుచరగణం పెద్దగా కేకలు వేస్తూ అరిచిండ్లు సభంత గోలగోలగా మారింది.
10
ఈ మొక్కుబడి ప్రజాభిప్రాయ సేకరణ చూడలేక సూర్యుడు పడమటి కొండల్లోకి ముఖం చాటేసిండు. ప్రతిచోట జరిగిట్టే పబ్లిక్ ఇయరింగ్ అనే కార్యక్రమం ముగిసిపోయింది? ప్రతిచోట జరిగినట్టే ప్రజలు వ్యతిరేకించినా అంత సజావుగా ఓపెన్ కాస్టుకు అనుకూలంగా జరిగిపోయిందంటూ అధికారులు నివేదికలు పంపవచ్చు. అన్ని చోట్ల జరిగినట్టే మా మందమర్రిని కూడా మింగేయవచ్చు.
ఇట్లా ఎన్ని ఊర్లను నాశనం చేయ్యలేదు. ఇంకా ఎన్ని ఊర్లు నాశనం కావటానికి సిద్దంగా ఉన్నాయి. సింగరేణికి పుట్టినిల్లయిన ఇల్లందు ఓపెన్‍కాస్టు బొందల్లో సమాధి కాబోతుంది. ఉద్యమాలకు నిలయంగా పారిశ్రామిక పట్టణంగా ఘణతకెక్కిన గోదావరిఖని పట్టణం చుట్టూ అల్లుకుపోయిన ఓపెన్‍కాస్టు గనుల వల్ల తన అస్తిత్వాన్ని కోల్పోనుంది. సింగరేణి మోడల్ కాలనీగా పేరొందిన 8 ఇంక్లైన్ కాలనీ ఓపెన్‍కాస్టు మట్టిదిబ్బల మధ్య బంధీ అయిపోయింది.
మణుగూరు, శ్రీరాంపూర్, మందమర్రిలో, ఆరంభమైన ఓపెన్‍కాస్టులు ఆ ప్రాంతాన్ని ఎడారిగా మార్చబోతుంది. కాకతీయ కళా వైభవం రామప్ప వంటి చారితక్ర ప్రాధాన్యత కలిగిన కట్టడాలు, వందల సంవత్సరాలుగా ప్రజలకు సాగునీరు తాగునీరు అందించే నాటి వెంకటాపూర్, పాకాల, రామప్ప, చెరువులకు ఉగ్గం వచ్చింది. దట్టమైన అడవులకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లాలోని తిర్యాణి, డోర్లీ, అబ్బాపూర్, కైరిగూడ, దంతన్‍పల్లి, ఆరెగూడెం గ్రామాలను గోలేటి డోర్లి ఓపెన్‍కాస్టు గనులు మింగేసినవి. వాటితోపాటు అడవులు, అడవులలోని వాగు వంకలు, అరుదైన వృక్షాలు, పక్షులు జంతుజాతులు నశించి పోయినవి.
కరీంనగర్ జిల్లాలోని మేడిపల్లి, లింగాపూర్ గ్రామస్థులు మేడిపల్లి ఓపెన్‍కాస్టుకు వ్యతిరేకంగా జరిపిన పోరాటం నీరుగారిపోయింది. ఖమ్మం జిల్లా మణుగూరు ప్రాంతంలో గిరిజనులు జరిపిన ఓపెన్‍కాస్టు వ్యతిరేక పోరాటాన్ని అణిచివేశారు. సత్తుపల్లి ఓపెన్‍కాస్టు వ్యతిరేక పోరాటానికి కూడా అదే గతి పట్టింది.
ఓపెన్‍కాస్టు వ్యతిరేకంగా పోరాడిన జనం, చివరికి ఓపెన్‍కాస్టుల కింద తమ ఇండ్లు కూడా తీసుకోవాలని ఆందోళనలు చెయ్యాల్సిన దుస్థితికి నెట్టబడ్డారు.
ఓపెన్‍కాస్టు ప్రభావిత గ్రామాల్లో పర్యావరణ పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల్లో ప్రజల శ్వాసకోశ వ్యాధులు పెరిగిపోయాయని, గర్భస్రావములు రేటు గణనీయంగా పెరిగిందని తేల్చింది. ఓపెన్ కాస్టు బ్లాస్టింగ్‍ల వల్ల ఏర్పడే శబ్దకాలుష్యం వలన ఆ ప్రాంతంలోని క్రిమి కీటకాలు పెద్ద ఎత్తున నశించిపోయాయని, ఓపెన్‍కాస్టుల వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని భవిష్యత్‍లో ఆ ప్రాంతాలు మానవ నివాసయోగ్యం కాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఓపెన్‍కాస్టు ప్రభావిత గ్రామాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం, వర్షపాత తగ్గిపోవటం గమనించారు.
ఓపెన్‍కాస్టుల క్రింద ప్రత్యక్షంగా కొన్ని వందల గ్రామాలు నామరూపాల్లేకుండా పోతే పరోక్షంగా ఓపెన్‍కాస్టు చుట్టుపక్కల దాదాపుపది కిలోమీటర్ల పరిధిలో వేలాది గ్రామాలు వాటి దుష్ట ప్రభావంకు లోనైనవి. భూగర్భ జలాలు అడుగంటిపోయినవి. వ్యవసాయంలో దిగుబడి తగ్గింది. పచ్చని పొలాలు బీడు భూములుగా మారిపోయాయి. దుమ్ము, శబ్ద కాలుష్యం పెరిగిపోయింది. ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్యం మీద ఓపెన్ కాస్టులు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పిల్లలపై వీటి దుష్ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. రక్తహీనత, మానసిక వైకల్యం, దగ్గు, దమ్ము వంటి రోగాలు పెరిగిపోయాయి. ఓపెన్‍కాస్టులలో వెలువడే రసాయన వ్యర్థ పదార్థాలు జల వనరుల్లో కలవడం వల్ల జల కాలుష్యం పెరిగిపోయింది. అదే నీరు తాగడం వల్ల మనుషులు, పశు పక్షాదులు అకాల మరణానికి, రోగాలకు గురవుతున్నారు. సర్కారుకు ఇక్కడి సంపదను దోచుకుపోవటం మీదున్న ప్రేమ ప్రజల మీద లేకుండా పోయింది.
దేశ సహజ సంపదలు దేశ ప్రజల అభివృద్ధిలో భాగంగ కావాలి. కానీ అందుకు భిన్నంగా జరుగుతున్నది. కొద్దిమంది లాభాల కోసం, అశేష జనాలను బలిపశువులను చేస్తున్నారు. అన్యాయపూరితమైన అసమాన అభివృద్ధే, అభివృద్ధిగా చెలామణి అవుతున్నది. ఈ తలక్రిందుల అభివృద్ధిని వ్యతిరేకించే ప్రజల మీద ఉక్కుపాదం మోపి, రక్తపుటేర్లు పారిస్తున్నారు.
ఈ విధ్వంస కాండలో ఎక్కువగా నష్టపోయింది ఆదివాసులు. ఎందుకంటే ఆదివాసి ప్రాంతంలోనే 90 శాతం బొగ్గు నిల్వలు ఉన్నాయి. వారి అమాయకత్వాన్ని, వెనుబాటుతనాన్ని, అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని చట్టాలను ఉల్లంఘించి దౌర్జన్యంగా భూములు గుంజుకుంటున్నారు. ఏండ్లకు ఏళ్ళుగా వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములను చట్టబద్ధంగా రిజస్టర్ కాలేదని బలవంతంగా గుంజుకున్న సంఘటనలు ఉన్నాయి. దాంతో అడవిలో తమ బ్రతుకేదో తాము బ్రతికే గిరిజనులు పెద్ద సంఖ్యలో నిర్వాసితులుగా మారి పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. ఫలితంగా అడవిపై ఆధారపడి సమిష్టి జీవనం సాగించే గిరిజనులు పారిశ్రామిక ప్రాంతంలో ఒడ్డున పడ్డ చేపపిల్లలా రోజు కూలీలుగా దుర్భర జీవితం గడుపుతున్నారు. ఆకలి చావులకు బలి చేయబడుతున్నారు. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం ఆచార వ్యవహారాలు మంటగలిసిపోతున్నాయి.
భూసేకరణ సందర్భంగా కంపెని ఇచ్చే హామీలు అమలు జరుగటం లేదు. ముప్పై ఏండ్ల కిందట గోదావరిఖని ఓసిపీ 1 క్రింద తమ భూములు ఇచ్చిన వకీల్‍పల్లి గ్రామస్థులు చేసేందుకు పనులు లేక ఆకలికి సచ్చేవాళ్ళు సచ్చిపోగా మిగిలిన వాళ్ళు బ్లాస్టింగ్‍ల వల్ల కూలిన ఇండ్ల మొండి గోడల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఇండ్లు వదిలి పోలేక, అక్కడ ఉండి బ్రతకలేక దినం ఒక గండంగా చుట్టూ కొండల్లా పేరుకపోయిన మట్టి దిబ్బల మధ్య చావలేక బ్రతుకుతున్నారు.
గోదావరిఖని ఓసిపీ 2 క్రింద సర్వ కోల్పోయిన సింగిరెడ్డిపల్లెది మరోదీన గాథ. ఓపెన్ కాస్టు ప్రాజెక్ట క్రింద పంట పొలాలు తీసుకున్న కంపెని, ఇండ్లకు ఎక్కువ వాల్యుయేషన్ ఇవ్వాల్సి వస్తుందని వాటిని వదిలేసింది. ఆక్రమించిన భూముల్లోకి ఎవరూ రాకుండా కంచెలు వేసింది. పశువులు రాకుండా లోతైన కందకాలు తవ్వింది. దాంతో పశువులకు మేత లేక అంగడికి తోలుకపోయి అడ్డికి పావుషేరుగా అమ్ముకొన్నారు.
గోదావరి ఒడ్డున ఉన్న లింగాపూర్, మేడిపల్లి గ్రామస్థులు మేడిపల్లి ఓసీపీ కింద సర్వం కోల్పోయి చుట్టు పేరుకపోయిన మట్టిదిబ్బల మధ్య దినమొక గండంగా బ్రతుకుతున్నారు. చివరికి చస్తే కూడా ఎటూ తీసుకుపోలేక ఇండ్ల మధ్యనే శవాలను పాతిపెట్టుకుంటున్నారు.
ఓపెన్‍కాస్టులో భూములు కోల్పోయిన ప్రజల బాధలు చూసి మంథిని మండలంలో లద్దనూరు, రత్నాపూర్, పన్నూర్ గ్రామాల ప్రజల తమ భూములు ఇవ్వటానికి సిద్దపడలేదు. బలవంతంగా నిర్వహించిన పబ్లిక్ ఇయరింగ్ రసాభాసగా మారి రణరంగమైంది. జనం టెంట్లు పీకివేసి తమ నిరసన తెలియజేశారు. అయితేనేమి… కంపెనీ దొంగచాటుగా కొంతమందిని వ్యక్తిగతంగా పిలిపించుకుని వారిని నయానా భయానా లొంగదీసుకుని భూములు కాజేసింది.
లక్ష్యంవైపు నడిపించే నాయకత్వం లేకపోవటం వలన ప్రజల ఆందోళనలు నీరుగారిపోతున్నాయి. ఓపెన్‍కాస్టు నిర్వాసిత ప్రజల బాధలు ఓట్ల రాజకీయాలుగా మారిపోయాయి. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వారికి మద్ధతు తెలుపుతున్నట్లుగా కన్పిస్తూ మొక్కుబడి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నికల్లో నెగ్గిన తరువాత మోసం చేస్తున్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కొరకు తాము పుట్టి పెరిగిన ప్రాంతానికి, ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. చివరికి తెలంగాణ ఉద్యమ పార్టీలుకూడా ఇందుకు మినహాయింపు కాకపోవటం విషాదం.
పర్యావరణ ప్రేమికులు, మేధావులు భూమి రక్షణ వంటి స్వచ్చంధ సంస్థలు, హక్కుల సంఘం వాళ్ళు ప్రజల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నారు. కానీ వాళ్ళు ప్రజా ఆందోళనలను ఉద్యమరూపం తీసుకురావడంలో విఫలం అవుతున్నారు. ప్రముఖ మానవ హక్కుల సంఘం నాయకుడు బాలగోపాల్ సార్ బ్రతికి ఉన్నప్పుడు ఓపెన్‍కాస్టు వ్యతిరేకంగా ప్రజలు జరిపే పోరాటాలతో నిత్య సంబంధాలు కొనసాగించాడు. శకలాలు శకలాలుగా జరుగుతున్న పోరాటాలను ఏకతాటి మీదికి తెచ్చేందుకు ఆయన జరిపిన ప్రయత్నం స్పష్టమైన ఒకరూపం సంతరించుకోకముందే ఆయన ఆకాల మరణం చెందటంతో విఘాతం కలిగింది. అయినప్పటికీ అడపాదడపానైనా అనేక నిర్భంధాలను ఎదుర్కొంటూ ప్రజలు జరిపిన వీరోచిన పోరాటాల ఫలితంగా కొన్ని చోట్ల ప్రతిపాదిత ఓపెన్‍కాస్టులను విరమించుకోక తప్పలేదు. అటువంటి చోట కూడా మేనేజ్‍మెంట్ కొత్త ఎత్తులు ఎత్తి ప్రాజెక్టు పేర్లు మార్చి మళ్ళీ అవే ప్రాజెక్టులను కొనసాగించటానికి విశ్వప్రయత్నం చేస్తుంది.
ఓపెన్ కాస్టుల వల్ల ఏర్పడే పర్యావరణం విధ్వంసాలను గుర్తించిన అభివృద్ధి చెందిన దేశాలు తమ దేశంలో ఓపెన్‍కాస్టు విధానాలను రద్దు చేసుకొని మూడవ ప్రపంచ దేశాల్లో ప్రోత్సహిస్తుంది. సామ్రాజ్యవాద దోపిడి శక్తులకు గులాంగిరి చేస్తూ పాలకులు తమ తాత్కలిక లాభాల కోసం ఈ దేశ ప్రజలకు శాశ్వత అన్యాయం చేస్తున్నారు. ప్రజల అభివృద్ధిలో భాగం కావాల్సిన సహజ సంపదలను కొద్దిమంది లాభాల కోసం ధారాదత్తం చేస్తున్నారు. ఆక్రమంలో లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడుతూ అవినీతి చరిత్రను తిరుగరాస్తున్నారు.
మన పొరుగున ఉన్న చిన్న దేశమైన బంగ్లాదేశ్‍లో ఇటువంటి వినాశకర అభివృద్ధి విధానికి వ్యతిరేకంగా దివాన్‍పూర్ జిల్లా పుల్‍బరిలో సంతాల్‍తెగ గిరిజనులు, అక్కడ పాలకులు బ్రిటన్ చెందిన బహుళ జాతి సంస్థకు అప్పగించే ప్రతిపాదిత ఓపెన్‍కాస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించారు. ఇక్కడిలాగే అక్కడ బహుళ జాతి సంస్థలకు అమ్ముడుపోయిన బంగ్లా పాలకులు ఆందోళనకారులపై కాల్పులు జరిపి ఆరుగురి ప్రాణాలను బలితీసుకున్నది. అయినా గిరిజనులు తమ పోరాటాన్ని విరమించలేదు సరికదా మరింత ఉదృతం చేసి పాలకుల ఎత్తులను చిత్తుచేసి విజయం సాదించారు.
మన దేశంలో దండకారణ్యంలో గిరిజనులు తమ జల్ – జమీన్- జంగల్ తమకే చెందాలని జరుగుతున్న విరోచిత పోరాటాన్ని పాలకులు సైన్యాన్ని ప్రయోగించి రక్తసిక్తంగా అణచి వేస్తున్నారు.
సామాజ్య్రవాదుల కనుసన్నల్లో దేశాన్ని పాలించే వాళ్ళు, హంతకులు దేశాధినేతలుగా చెలామణి అవుతున్న చోట, కాకులను కొట్టి గద్దలను మేపే సోకాల్డ్ అభివృద్ధి, అభివృద్ధిగా చెలామణి అవుతున్న సందర్భంలో ప్రజల బ్రతుకులు మరింత దుర్భరం అవుతున్నాయి.
ఈ వ్యవస్థీకృతమైన ఈ అన్యాయాలకు, అణిచివేతలకు బలైపోతున్న ప్రజలే రేపు అగ్ని కణాలై ఈ దోపిడి వ్యవస్థను కూల్చక తప్పదు. అంతకుమించి ప్రజలకు బ్రతకటానికి వేరే దారేది లేదు. లేకుంటే తరతరాలుగా సాది సవరచ్చన చేసిన ఈ భూమితల్లి రేపటి మన పిల్లలకు వారసత్వంగా అందించలేము. మరో మాటలో చెప్పాలంటే ఇవ్వాల్టి మన మౌనం రేపటి మన పిల్లలకు మరణశాసనం అవుతుంది. అందుకే ప్రజలకు పోరాటం తప్ప మరో దారి లేదు.
విచిత్రం ఏమిటంటే ఆనాడు తెలంగాణా ఉద్యమకాలంలో ఓపెన్‍కాస్టు వ్యతిరేక పోరాటంలో కలిసి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి తదనంతర కాలంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించి అధికారం చేపట్టిన తరువాత ఏ విధానాలనైతే వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన తరువాత మరింత కృరంగా అదే విధానాలను అమలు జరుపుతున్నది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్ని నీటి మూటలైపోయినవి.
ఇన్ని విద్రోహల మధ్య, ఇంత విధ్వంసం మధ్య అసమాన పోరాటాలకు కేంద్రమైన మావూరు మందమర్రి మరోమారు పోరాటానికి సిద్దమౌతుంది.