మా వూరి కథ – 3

‘‘ముందు అరెస్టు చేసిన దుబ్బగూడెం, ఎర్రగుంటపల్లి వాసులను విడుదల చేయాలి’ అంత వరదాక ప్రజాభిప్రాయ సేకరణ జరుగనిచ్చేది లేదు.’’ అంటూ యువకుడు ఒకడు బదులిచ్చిండు.

జనం సమ్మతిగా మళ్ళీ నినాదాలు చేసిండు.

‘‘ఎవరిని అరెస్టులు చేయలేదు. ఒకవేళ ఎవరికైనా చేసేదుంటే వెంటనే విడుదల చేస్తాం’’ అన్నాడు కలెక్టర్‍.

‘‘అబద్ధం’’ అరిచిండో యువకుడు.

‘‘ఎవరినైనా అరెస్టు చేస్తే విడుదల చేస్తాం’’ అన్నాడు కలెక్టర్‍.

‘వాళ్ళు వచ్చేదాక సభ జరుగడానికి వీలులేదు’’ అంటూ జనం నినదించారు.

సాయుధ పోలీసుల అదిలింపు, లాఠీ జులిపింపులు ఏదీ పనిచేయడం లేదు… దానితో అరెస్టు చేసిన వారిని విడుదల చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. అంత వరదాక జనం నినాదాలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

‘‘అరెస్టు చేసిన వారిని విడుదల చేశారు. వాళ్లు వస్తున్నారు’’ అన్నారు ఎవరో.

‘‘రాని రాని వచ్చినంకనే పబ్లిక్‍ ఇయరింగ్‍’’

‘‘అరెస్టు చేసిన జనం విడుదలై ఊరేగింపుగా వచ్చిండ్లు…. ఆహ్వానం పలుకుతూ జనం ఎదురేగిండ్లు.

కలెక్టర్‍ మళ్లీ మైకందుకున్నాడు. ‘‘సైలెన్స్ సైలెన్స్’’ అంటూ అరిచి చేతులు ఆడించిండు. ‘‘నిలబడ్డ వాళ్ళంతా కూచోవాలి… ఓసీపి పబ్లిక్‍ ఇయరింగ్‍ సజావుగా జరుగడానికి సహకరించాలి’’ అంటూ అరచిండు.

పోలీసులు లాఠీలు ఆడిస్తూ జనాలను కూచుండబెట్టిండ్లు. అల్లరి సద్దుమనిగే సరికి కలెక్టర్‍ మళ్లీ మాట్లాడసాగిండు.

‘‘ప్రియమైన ప్రజలారా! అసలు పబ్లిక్‍ ఇయరింగ్‍ జరిపేదే మీకోసం, ప్రతిపాదిత ప్రాజెక్టు కింద నిర్వాసితులయ్యే ప్రజలు తమ అభ్యంతరాలేమైనా ఉంటే తెలుసుకోవడానికే, ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్‍గా నేను ఇక్కడికి వచ్చింది మీ కోసం, మీ సాధకబాధలు తెలుసుకొని వాటిని తీర్చడానికి వచ్చాను. జిల్లా అధికారికిగా నాకు జిల్లా ప్రజలు ముఖ్యం, వారి భాగోగులు ముఖ్యం.. నేను కంపెనీ తరుపున రాలేదు. నేను ప్రజల తరుపున మీ తరుపున వచ్చాను’’. అంటూ క్షణమాగి జనంకేసి పరీక్షగా చూసిండు.

‘‘ప్రతిపాధిత ప్రాజెక్టు మీద అభిప్రాయాలు చెప్పాలనుకునేవారు ముందుగా పేర్లు ఇవ్వాలి. అట్లా ఇచ్చిన వారిని వరుసపెట్టి పిలుస్తాం. మీరు నిరభ్యంతరంగా అభిప్రాయాలు చెప్పవచ్చు. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. అయినప్పటికీ మీరందరు అభిప్రాయం చెప్పేదాక సభ కొనసాగుతుంది. ఇందులో ఎవరు అనుమానపడాల్సిన పనిలేదు. మీరందరు మాట్లాడే వరకు అది ఎంత సమయమైనా నేను ఇక్కడే మీతోనే ఉంటాను’’ అన్నాడు.

ప్రతి ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ప్రతిచోట కలెక్టర్లు చెప్పే మాటలు ఇక్కడ పునరావృతం అయినవి. జనంలో నిశ్శబ్దం అవరించే సరికి కలెక్టర్‍ మళ్ళీ చెప్ప సాగిండు.

‘‘మీరు అభిప్రాయాలు చెప్పడానికి ముందు ప్రతిపాధిత ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను స్థానిక జనరల్‍ మేనేజర్‍ వివరిస్తారు. వారి మాటలను మీరు జాగ్రత్తగా గమనించాలి. వాటి మీద మీకేమైనా అభ్యంతరాలుంటే అటు తరువాత తెలియజేయ్యాలి’’ అన్నాడు.

అంతవరదాక జనం నిరసనలు, అరుపులు, కేకలను చూసి కంగారు పడ్డ జనరల్‍ మేనేజర్‍ ఏవో ఫైళ్లను పట్టుకొని మైకు ముందుకు వచ్చిండు ఆయన తన కండ్లద్దాలను సవరించుకొని ఫైలు తెరిచి చూసి గొంతు సవరించుకొని జనం వైపోసారి పరీక్షగా చూసి మాట్లాడటం మొదలు పెట్టిండు….

5

జనరల్‍ మేనేజర్‍ తాను ముందే తయారు చేసుకున్న నోట్స్ చదవసాగిండు…..

‘‘దక్షిణ భారత దేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థ మన సింగరేణి. ఈ సంస్థలో ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 80 శాతం విద్యుత్‍ కేంద్రాలకు ఉపయోగపడుతుంది. మిగితా బొగ్గు సిమెంట్‍ తదితర పరిశ్రమల అవసరాలకు వినియోగించటం జరుగుతుంది. దేశంలో విద్యుత్‍ అవసరాలు పెరుగడం వలన ఆ మేరకు బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు ఉత్పత్తి లక్ష్యాలను నిర్థేశించింది. ఇప్పుడు సింగరేణిలో వార్షిక బొగ్గు ఉత్పత్తి 53 మిలియన్‍ టన్నులు ఉంది. పన్నెండవ పంచవర్ష ప్రణాళిక నాటికి 62 మిలియన్‍ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్థేంచింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మూసేసిన బొగ్గు గనుల నుంచి మిగిలిపోయిన బొగ్గు వెలికి తీయాల్సిన అవసరం ఉంది’’ అంటూ జనంలోకి చూసి మళ్లీ చదవసాగిండు… ‘‘అందులో భాగంగా మూసివేసిన ఎస్‍ఎంజీ1, ఎస్‍ఎంజీ1ఏ, ఎంఎస్‍జీ 3 మరియు కళ్యాణి ఖని 2, 2ఏ గనుల్లో మిగిలిపోయిన బొగ్గు తీయడానికి కళ్యాణిఖని ఓపెన్‍ కాస్టు చేయ్యాలని ఈ విధంగా మిగిలిపోయిన 30.544 మిలియన్‍ టన్నుల బొగ్గు వెలికి తీయడానికి ఉద్దేశించబడింది ఈ ప్రాజెక్టు’’ అంటూ క్షణమాగిండు.

‘‘మీకు తెలుసు ఒకప్పుడు ఈ బావుల్లో ఏడు వేల మంది కార్మికులు పని చేశారు. బావులు మూసివేయడం వలన చాలా మంది కార్మికులకు పనులు లేకుండా పోయింది. ఇంకొంతమందిని ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు చేయాల్సి వచ్చింది. కార్మికుల ఉద్యోగాలకు భద్రత కల్పించాలన్నా, కంపెనీ ఉత్పత్తి లక్ష్యాలను చేరుకొని మనుగడ సాగించాలన్నా ఓపెన్‍ కాస్టు గనీ అవసరం ఎంతైయినా ఉంది’’

‘‘మూసివేసిన బావులనుండి మిగిలిపోయిన బొగ్గు తీయటం అండర్‍ గ్రౌండ్‍ బావుల ద్వారా అసాధ్యం. ఇప్పటికే అండర్‍ గ్రౌండ్‍ బావుల ద్వారా ఒక టన్ను బొగ్గు ఉత్పత్తి చెయ్యటానికి అయ్యే ఖర్చు 2300 రూపాయలు అయితే అమ్మకం ధర మాత్రం రూ. 1300 మాత్రమే ఉంది. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉండే ఓపెన్‍ కాస్టులను ఆరంభించడం ద్వారానే కంపెనీ మనుగడ సాధ్యం అవుతుంది’’ అంటూ తనవెంట తెచ్చుకున్న కాగితాల కేసి చూసి మాట్లాడసాగిండు’’. ప్రాజెక్టు కాల పరిమితి 19 సంవత్సరాలు ఉంటుంది. ప్రాజెక్టు క్రింద నిర్వాసితులయ్యే గ్రామాల ప్రజలకు గవర్నమెంటు జీవో 68 ప్రకారం నష్ట పరిహారం చెల్లించటం జరుగుతుంది. ఎవరికీ ఏ నష్టం జరుగకుండా సంస్థ తన సామాజిక బాధ్యతను నిర్వహిస్తుంది.’ కావున ప్రజలను పరిస్థితులను అర్థం చేసుకొని ప్రాజెక్టు ఏర్పాటుకు సహకరిస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు.

ప్రతి నూతన ఓపెన్‍ కాస్టు ఆరంభించినప్పుడు కంపెనీ చెప్పే మాటలనే జీఎం గారు వల్లె వేసిండు. దేశాభివృద్ధి బొగ్గు ఉత్పత్తులు పెంచాలని, అందు కోసం మరింత ఉత్పత్తులు చేయాలని, అండర్‍ గ్రౌండ్‍ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి ఎక్కువ ఖర్చవుతుందని, అదే ఓపెన్‍ కాస్టులయితే ఉత్పత్తి ఖర్చు తక్కువ సంస్థ లాభాలు ఎక్కువని అరిగిపోయిన రికార్డులా అవే మాటలు. ఎవని అభివృద్ధి, ఎవనికి లాభం. లాభాలు అభివృద్ధి ఏ లెక్కన చూస్తారు. ఉన్న కార్మికులను వీధుల్లోకి నెట్టి, ఊర్లకు ఊర్లు బొందర్ల గడ్డలుగా చేసి సాధించిన ఉత్పత్తి, అభివృద్ధి ఎట్లా అభివృద్ధి అవుతుంది.

అటుతరువాత సంస్థకు చెందిన ఎన్విరాన్‍మెంటు అధికారి పర్యావరణ పరిస్థితుల మీద మాట్లాడటానికి లేచిండు. అతని లావాటి ముఖంలో ఏ భావం స్పష్టం కావడం లేదు. ఆయన వెంట తెచ్చుకున్న నోట్స్ను యాంత్రికంగా వల్లివేయడం మొదలు పెట్టిండు…

‘‘ప్రాజెక్టు కోసం మొత్తంగా 949.21 హెక్టార్ల భూమి అవసరం అవుతుంది. ఇందులో ఇప్పటికే సింగరేణి ఆధ్వర్యంలో ఉన్న భూమి 246.16 హెక్టార్లు. ప్రస్తుతం సేకరించాల్సిన భూమి 699.05 హెక్టార్లు. క్వారీ విస్తరణ 363.23 హెక్టార్లు. క్వారీ గరిష్ఠ లోతు 230 మీటర్లు. ఈ ప్రాంతంలో మొత్తం బొగ్గు నిలువలు 45.31 మిలియన్‍ టన్నులు. మొత్తం వెలికి తీయాల్సిన మట్టి 365.49 మిలియన్‍ క్యూబిక్‍ మీటర్లు.. మొత్తం ప్రాజెక్టు వ్యయం 417.33 కోట్ల రూపాయలు’’. అంటూ అతను పాఠం అప్పగించసాగిండు.

పబ్లిక్‍ ఇయరింగ్‍కు వచ్చిన జనానికి కూర్చోడానికి చోటులేక ఎక్కడికి అక్కడ నిలబడిపోయిండ్లు. మధ్యాహ్నపు ఎండ చిటపటలాడిస్తుంది. ప్రాజెక్టు కింద నిర్వాసితులయ్యే జనం ఒక్కొక్కరు దాదాపు ఐదారు కిలో మీటర్లు నడిచి వచ్చిండ్లు. పొద్దటి నుండి అరిచి అరిచి చాలమంది గొంతులు పోయినవి. అరెస్టు నుండి విడుదల అయి వచ్చిన వాళ్లు అటు కోపంతో ఇటు దాహంతో కుతకుతలాడసాగిండ్లు. ఆ అల్లరేమి పట్టనట్టుగా పర్యావరణాధికారి మాట్లాడుతున్నాడు.

‘‘గొంతులు ఎండిపోతున్నాయి. తాగేందుకు నీల్లెక్కడ’ అంటూ ఎవరో అరిచిండు.

‘‘అదిగో అక్కడ’’ అంటూ వేదికకు ఎడమవైపు చూయించిండు పోలీసు జవాను ఒకరు.

టెంట్‍కు కొద్ది దూరంలో మంచి నీళ్ల క్యాన్లు పెట్టుకొని కంపెనీ వాచ్‍మెన్‍ ఒక్కడు కనిపించిండు. అతని చుట్టు ఈగల్లా ముసిరిన జనాలకు నీళ్లు సప్తయి చేస్తున్నాడు. దాహంతో అల్లాడే వాళ్లు అటువైపు కదలిండ్లు. మంచినీళ్ల కోసం అక్కడ జనం పెద్ద గుంపైండ్లు. ‘‘నీళ్ళ సప్లయి కూడా సరిగా చేయలేదు. ఇవేం పబ్లిక్‍ ఇయరింగ్‍’’ అంటూ ఒక రుసరుసలాడుతుండు.

ఈ అరుపుల కేకలను పట్టించుకోని పర్యావరణ అధికారి తన ప్రసంగం కొనసాగించిండు. ‘‘ప్రాజెక్టు ముందు దశలో సారవంతమైన మట్టిని తీసి ఒకచోట నిల్వ చేస్తారు. అటు తరువాత క్వారీ వలన ఏర్పడిన బొందలను పూడ్చేందుకు ముందే తీసిన సారవంతమైన మట్టిని పరిచి భూమిని మళ్ళీ యథా తద స్థితికి తీసుకురావడం జరుగుతుంది. వాటిపై చెట్లను నాటి ప్రక్కన ఉన్న అడవులలో కలిసిపోయేలా తీర్చిదిద్దడం జరుగుతుంది’’. అన్నాడతను.

ఆ మాటలు వింటుంటే మనసు కుతకుతలాడింది. నూతన ఓపెన్‍ కాస్టులు ఆరంభించిన ప్రతి చోట ఇదే హామీలు.. మైసమ్మతల్లికి మేకపోతును బలి ఇచ్చేటప్పుడు నీళ్ళు పోసి తల దువ్వినట్టే అంతా జరిగిపోతుంది. ఓపెన్‍ కాస్టుల పేర పచ్చటి భూమిని బొందల గడ్డలుగా చేసి తీసుకోవాల్సిన సంపదంతా తోడుకొని బొందలు అట్లాగే వదిలేసిన సంఘటనలు ఎన్నిలేవు? ఓపెన్‍ కాస్టుల రీఫిల్లింగ్‍ పేర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు కాజేస్తుంది. గత ఐదు సంవత్సారాలలో ఈ విధంగా మూడు వేల కోట్ల రూపాయు ప్రభుత్వం బొక్కసంలోకి పోయింది. మరి ఆ సొమ్ము ఎటుపోయింది..? ఎవడు కాజేసిండు..? మన ఊరు కానప్పుడు, మన ప్రాంతం కానప్పుడు ఏదీ ఎట్లా పోతేంది? ఎవడు ఎట్లా చస్తేంది? వారికి ఇక్కడ సంపద కావాలి. ఇక్కడి భూమి సంగతి వారికి అక్కరలేదు. ఆ భూమి మీద బ్రతికే మనుషుల సంగతి అక్కరలేదు. గత 50 సంవత్సరాలుగా యథేచ్చగా జరుగుతున్న విధ్వంసంను ఆపే నాథుడు లేడు. ఆదుకునే వాడు అసలే లేడు. చెప్పే మాటలకు, చేసే చేష్టలకు పొంతన లేదు. ఓడ దాటినంక తెడ్డు మల్లన్న అన్నట్టు అడిగే నాథుడు లేడు.. ఇప్పటికే ఆరు ఓపెన్‍ కాస్టులు మూసేసిండ్లు. అట్లా మూసేసిన చోట భూమిని యథాస్థితికి తెచ్చింది. ఎక్కడ?

ఏం చేసినా చెల్లుబాటు అయ్యే దుర్మార్గం రాజ్యం ఏలుతున్నప్పుడు ఎంత వినాశనమైనా జరిగిపోతుంది. పర్యావరణ అధికారి ఇంకా ఏదో చెప్పుతున్నాడు. ‘‘బారీ పేలుల్లకు దుమ్ము రేగకుండా వెట్‍ డ్రిల్లింగ్‍ పద్ధతి అమలు చేస్తాం.. ఓబీ కుప్పల మీద చెట్లు నాటుతాం’’.

మళ్ళీ అవే అబద్ధాలు ఓపెన్‍ కాస్టు ఆరంభమైన గత ముప్పయి ఏండ్లుగా అవే మాటలు చెట్లు నాటడం పేరు మీద కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్లుగా కంపెని ప్రతి సంవత్సరం వార్షిక రిపోర్టులో చూపెడుతూనే ఉంది.. ప్రతి సంవత్సరం లక్షల మొక్కలు నాటామని పర్యావరణ రిపోర్టులు అందమైన బ్రోచర్లు దర్శనమిస్తూనే ఉంటుంది. రోడ్ల మీద నిలువెత్తు హోర్డింగ్‍లు పెట్టి కంపెని తమ సంస్థ పర్యావరణానికి కట్టుబడి ఉందంటూ దర్శనమిస్తాయి. కాని ఒకప్పుడు పచ్చటి అడవులలో కళకళలాడిన గోదావరి పరివాహక ప్రాంతం నేడు ఎడారిని తలపిస్తోంది. అవినీతి చెదలు మొక్కలను మింగేసింది.

పర్యావరణ అధికారి మాటలు కొనసాగుతున్నాయి.

‘‘ప్రాజెక్టు క్రింద తన దిశను కోల్పోయినవాగులు, కాలువలను మళ్లింపు చేసి చెక్‍డ్యాంలు, ర్యాకపిల్‍ డ్యాంలను నిర్మిస్తాం. ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసి చెరువులు నిర్మిస్తాం’’.

అరచేతిలో బెల్లం పెడుతున్నట్లుగా పర్యావరణ అధికారి మాటలు సాగుతున్నాయి. జనం వినేవాళ్లు వింటున్నారు. విసుక్కునే వారు విసుక్కుంటున్నారు. ఇదంతా వొట్టిదేనంటూ అసహనంగా గుణుక్కొనే వారు గుణుక్కుంటున్నారు. ముందు వరుసలో కూర్చున్న నాయకులు ఆయన మాటలకు తలలు ఆడిస్తూ ఉన్నారు. తెల్లటి దుస్తుల్లో ఉన్న ఫ్యూన్‍ ఒకరు నాయకులకు ఛాయ్‍, బిస్కట్లు, మజ్జిగ ప్యాకెట్లు అతి వినయంగా అందిస్తున్నాడు.

కంపెనీ ఉచిత మస్టర్లు ఇచ్చి తీసుకవచ్చిన కార్మికులు వేదిక ముందు సగానికి పైగా కుర్చీలు ఆక్రమించుకొన్నారు. ఛాయ్‍ బిస్కట్ల కోసం అక్కడ చిన్నగా తోపులాట మొదలైంది.

అది చూసిన కలెక్టర్‍ తన చేతిలో ఉన్న మైకు మీద వ్రేలితో టకటకలాడించి అది సరిగానే పని చేస్తుందని భావించి వెంటనే’’ ఎవరి అల్లరి చేయవద్దు అందరికి ఛాయ్‍ బిస్కట్లు అందుతాయి ఎవరు కూర్చున్న కాన్నుంచి లేవ వద్దు’’ అంటూ అదే పిగా అరవసాగిండ్లు. సుతారంగా లాటీలు ఆడిస్తూ పోలీసులు వారిని కూచుండబెట్టిండ్లు. ఆ గడబిడకు కాసేపు మౌనం వహించిన పర్యావరణ అధికారి మళ్ళీ మాట్లాడసాగిండు.

‘‘సింగరేణి సంస్థ ఒక్క బొగ్గు తీయడమే కాదు.. వివిధ రూపాల్లో తమ సామాజిక బాధ్యత నెరవేరుస్తుంది. అనేక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. అందుకోసం ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. పరిసర గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడుతుంది. హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఈ ప్రాంత ప్రజల ఉపాధి అవకాశాలు మెరుగు పర్చడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. స్త్రీలకు అల్లికలు, కుట్టు పనులు నిర్వహిస్తుంది. యువకులు పోలీసు ఆర్మీ, తదితర వాటిలో రిక్రూట్‍ అవడానికిఅవసరమైన ట్రెనింగ్‍లు ఇస్తున్నాం. ఈ విధంగా ఇప్పటికే వందలాది మంది యువకులు ఇటు పోలీసుల్లో, ఆర్మీలో ఉద్యోగాలు పొంది లాభపడ్డారు.ఇంకా కంప్యూటర్‍, మల్టీమీడియా, వెల్డింగ్‍, ఫోటోగ్రఫీ వంటి ట్రెనింగ్‍లు ఇప్పించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రస్థుతం నిర్వాసిత గ్రామాల యువకులకు కూడా వర్తింపజేస్తుంది. ఇదంతా కంపెనీ సామాజిక బాధ్యతగా చేపడుతుంది. ఈ సౌకర్యాలను ఈప్రాంత యువకులు కూడా ఉపయోగించుకోవాలి’’ అన్నాడు.

తినే కంచం గుంజేసి ఎంగిలి మెతుకులు ఎగజల్లినట్టుగా బొగ్గు గని ప్రభావిత గ్రామాల ప్రజల పట్ల కంపెనీ తన ఉధారతను చాటుతుంది. వందలాది గ్రామాలను మింగేసి లక్షలాది మంది ప్రజలకు వాళ్లు పుట్టిపెరిగిన ఊరు నుంచి బలవంతంగా నెట్టేసి వారికి బ్రతుకు లేకుండా చేసే వాళ్లు.. గుట్టలను మింగి గులుకరాళ్ళు ఎగజల్లుతున్నారు… తలలు తెగ నరికిన వాళ్ళే తెగిన తలల మీద నీళ్ళు చిలుకరిస్తూ తమ ఉధారత్వాన్ని తమకు తామే వెయ్యి నోళ్ళ చాటుకుంటున్నారు. ఎవడు విధ్వంసం సృష్టిస్తుండో వాడే అభివృద్ధి గురించి మాట్లాడటం విచిత్రమే మరి.. తమ దోపిడికి, తమ విధ్వంసానికి ఎదురు లేనప్పుడు ఏం చెప్పిన చెల్లుబాటు అయ్యే చోట అంతా తలక్రిందుల ప్రచారమే కదా…

పర్యావరణ అధికారి తన ప్రసంగం ముగించగానే కలెక్టర్‍ తన సీట్లో నుంచి లేచి మైకందుకున్నాడు.

‘‘సోదరులారా! ఇంత వరదాక స్థానిక జీఎం మరియు ఎన్విరాన్‍మెంట్‍ అధికారిగారు సుదీర్ఘంగా, చాలా వివరంగా ప్రాజెక్టుకు సంబంధించి, పర్యావరణానికి సంబంధించి తెలియజేశారు. ఇదంతా మీరు వినే ఉంటారు. కాబట్టి మీరంతా ఎటువంటి అనుమానాలు లేకుండా మీ సందేహాలను ఇక్కడికి వచ్చి తెలియజేయాల్సి ఉంటుంది. అందు కోసం ఇక్కడ మాట్లాడే వారందరు ముందుగా వారి పేర్లను నమోదు చేసుకోవాలి’’. అంటూ మరోసారి హెచ్చరించిండు.

ఆయన మళ్ళీ ఇలా అన్నాడు. ‘‘ప్రాజెక్టు ఎఫెక్టెడ్‍ గ్రామాల ప్రజలు మాట్లాడే ముందు, ఇక్కడికి వచ్చిన మన ప్రజాప్రతినిధులు ముఖ్యంగా స్థానిక ఎంపీ గారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వచ్చి ఉన్నారు. ముందుగా వాళ్ళు మాట్లాడిన తరువాత నిర్వాసిత. గ్రామాల ప్రజల మాట్లాడటానికి అవకాశం ఇస్తాం. కావున ప్రజల సహకరించాలి’’ అంటూ విజ్ఞప్తి చేసిండు.

6

అందరికంటే ముందు పెద్దపల్లి ఎంపీ మాట్లాడటానికి లేచిండు. ఆయనకు అంతకు ముందే ఎర్రగుంటపల్లి, దుబ్బగూడెం వాసులు పబ్లిక్‍ ఇయరింగ్‍కు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్న సంగతి తెలిసింది. తీరా ఇక్కడ వచ్చే సరికి సభావేధిక ముందంతా నిర్వాసితులు కాని వారితో నిండిపోయి ఉండటం గమనించి ఆవేధన చెందాడు… దాంతో అతను.

‘‘కలెక్టర్‍ గారు అసలు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందా! తమాషా జరుగుతుందా!’’ అంటూ విరుచుకుపడ్డారు.

ఆ మాటలకు కలెక్టర్‍ కాస్త ఇబ్బందిగా కదిలిండు.మాట్లాడేది ఎంపీ కాబట్టి ఆయన ఏమి చెయ్యలేక మౌనంగా ఉండిపోయిండు.

‘‘పబ్లిక్‍ ఇయరింగ్‍లో ప్రాజెక్టు క్రింద నిర్వాసితులయ్యే ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి కాని, వాళ్ళేమో ఎక్కడో దూరంగా ప్రక్క ప్రక్కకు నిలుచున్నారు. వారికి కూర్చోడానికి చోటు లేదు. ఇక్కడ ముందు వరుసలో కంపెనీ పుక్కిడి మస్లర్లు ఇచ్చి తీసుకువచ్చిన వారిని కూచుండబెట్టిండ్లు. ఇదేం ప్రజాభిప్రాయ సేకరణ. ముందుగా ఇక్కడ వారిని ఖాళీ చేయించి అసలైన నిర్వాసితులను ముందుకు పిలిపిస్తే కాని ప్రజాభిప్రాయ సేకరణ జరుపడానికి వీలు లేదు’’ అంటూ ఎంపి తన నిరసన వ్యక్తం చేసిండు.

దాంతో జనంలో కలకలం రేపింది. దూరం దూరంగా నిలుచున్న ప్రభావిత గ్రామాల ప్రజలు ‘నిజమే’ అంటూ అరిచారు.’’

‘‘మే కూచోవడానికి చోటే లేదు’’ అన్నారొకరు.

‘‘ఉచిత మస్లర్లు ఇచ్చి తీసుకువచ్చిన వారిని వెనక్కి పంపించాలి’’. మరొకరు అరిచిండ్లు.

వేదిక మీది నుంచి కలెక్టర్‍ ఏదో సర్థి చెప్పడానికి ప్రయత్నించిండు. కాని అది వృథా ప్రయాసే అయ్యింది. ఇప్పుడు కూర్చున్న వారిని లేపాలంటే గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని భావించి మిన్నకుండిపోయిండు.

ఎంపీ మళ్లీ మాట్లాడసాగిండు. ‘‘ప్రతిపాధిత ప్రాజెక్టు కాసిపేట మండలంలో 70 శాతం ఉంది, మందమర్రి మండలంలో 30 శాతం ఉంది. పబ్లిక్‍ ఇయరింగ్‍ ఎక్కడ జరుపాలి. ప్రాజెక్టు క్రింద ఏయే గ్రామాలైతే నిర్వాసితులు అవుతున్నారో ఆయా గ్రామాల్లో నిర్వహించాలి. కాని అందుకు భిన్నంగా ఇక్కడ జరుగుతుంది’’ అంటూ కలెక్టర్‍ వైపు చూసి ‘‘ప్రజాభిప్రాయ సేకరణ నిర్థేశించిన సూత్రాల ప్రకారం జరుగడం లేదు కాబట్టి వెంటనే రద్దు చేసి నిర్వాసిత గ్రామాలలో నిర్వహించాలి’’ అంటూ డిమాండ్‍ చేశారు.

‘‘ఇప్పటికే కంపెనీ చాలా చోట్ల ఓపెన్‍ కాస్టులు ప్రారంభించింది. అటువంటి చోట ఓసీపీల వల్ల చుట్టు ఉండే గ్రామాలలో వాటర్‍ లెవల్స్ పడిపోయాయి. ఇండ్లు క్రాకులు ఇచ్చినవి. మేడిపల్లి ఓసీపీ క్రింద కాళీ చేయించిన వీర్లపల్లి, మేడిపల్లి గ్రామస్థులకు ఆర్‍ అండ్‍ ఆర్‍ ప్యాకేజీ అమలు జరుపలేదు. చాలా చోట్ల కంపెనీ హామీలను ఉల్లంఘిస్తుంది. చట్టాలను ఉల్లంఘించింది. దాంతో నిర్వాసిత గ్రామ ప్రజలలో వ్యతిరేక తీవ్రంగా ఉంది. ‘‘మేం చేసేది చేస్తాం ప్రజలు మీ చావు మీరు చావండి అంటే ఎట్లా? గతంలో లోకల్‍ వాళ్లకు ఎంప్లాయిమెంట్‍ ఇచ్చేది. అది బంద్‍ చేసిండ్లు. అంతా మీ ఇష్టమేనా, ప్రజల మంచి చెడు చూడాల్సిన అవసరం లేదా’’ అంటూ అధికారులను నిలదీసిండు.

‘‘బూట్‍ పాలీష్‍ పనిలా జరుగుతున్న ఈ ప్రజాభిప్రాయ సేకకరణను వెంటనే రద్దు చేయాలి. నిర్వాసిత ప్రజలకు కంపెనీ అన్ని వివరాలు తెలియజేసి వారి మధ్యన వారి అభిప్రాయాలు సేకరించాలి. అప్పుడు ప్రజలు ఏం చెప్పుతారో తేలుతుంది’’ అన్నాడు.

రూల్స్కు విరుద్ధంగా ప్రజాభిప్రాయం జరుపడాన్ని ఎంపి వ్యతిరేకించటం జనానికి నచ్చింది. దాంతో వారు పెద్దగా అసమ్మతి తెలియజేస్తూ ‘‘‘పబ్లిక్‍ ఇయరింగ్‍ రద్దు చేయాలని నినదించారు.

అటు తరువాత భారత కమ్యూనిస్టు పార్టీకి చెందిన బెల్లంపల్లి నియోజక వర్గ ఎమ్మెల్యే మాట్లాడటానికి వచ్చారు. ఆయన కార్మిక క్షేత్రమైన బెల్లంపల్లిలో పుట్టి పెరిగినవాడు. ప్రజల కష్టనష్టాలు ఎరిగిన వాడు.

‘‘నేను ఓసీపీలను వ్యతిరేకిస్తున్నాను’’ అంటూ అతను తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టి ముందే ప్రకటించిండు.

ప్రజలు ఆసక్తిగా చూసారు.

‘‘ఓసీపీల వల్ల ఉత్పత్తి ఎక్కువ వస్తుంది. లాభాలు ఎక్కువ వస్తాయి నిజమే కాని ప్రజలకు జరిగే నష్టం గురించి ఆలోచించాలి. ఓసీల వల్ల భూములు పనికి రాకుండా పోతున్నాయి. గ్రామాలలో వ్యవసాయం కుంటుపడిపోతుంది. నిజమే భూములు పోయిన వారికి కంపెనీ ఎకరానికి లక్ష, లక్షన్నర నష్ట పరిహారం ఇస్తుంది. దాని వల్ల వారు ఎన్ని రోజులు బ్రతుకుతారు. మహా అంటే ఏడాదో రెండేండ్లో బతుకుతారు కావచ్చు. కాని అటు తరువాత బిక్షగాళ్ళుగా మారిపోతాండ్లు’’ అంటూ క్షణమాగిండు.

‘‘బొగ్గు గనుల క్రింద భూములు కోల్పోయిన వారికి గతంలో ఉద్యోగాలు ఇచ్చేవాళ్లు. కంపెనీ ఇప్పుడు అది ఇస్తలేదు. అటు భూములు పోయి ఉద్యోగాలు లేక నిర్వాసిత ప్రజలు ఎట్లా బ్రతుకుతారు. ప్రజలు ఎట్లా సచ్చినా పర్వాలేదు. కంపెనీకి బొగ్గు కావాలంటే ఎట్టా…!’ అంటూ ఆవేదన చెందిండు.

ఓసీపీల క్రింద సర్వం కోల్పోయిన వందలాది గ్రామాల ప్రజల పరిస్థితిని ఆయన ప్రత్యక్షంగా చూశాడు. ముఖ్యంగా గోలేటి ఓపెన్‍ కాస్టు గనుల వల్ల నిర్వాసితులైన గిరిజనుల బాధను ఆయన అసెంబ్లీలో లేవనెత్తిండు. కాని అదంతా చెవిటివాని ముందు శంఖం ఊదినట్టు అయ్యింది. ఆయన మళ్ళీ మాట్లాడసాగిండు.

‘‘నిర్వాసిత గ్రామాల ప్రజలకు కంపెనీ అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ మభ్యపెడుతుంది. కాని ఆచరణలో అదేం చేయటం లేదు. గోలేటి, డోర్లీ ఓపెన్‍ కాస్టుల క్రింద నిర్వాసితులైన అక్కడి గిరిజనులకు ఒక ‘చొప్పిడి’ కాడ ఒక నిర్వాసిత కాలనీ ఏర్పాటు చేసింది. కాని అక్కడ మనుష్యులు బ్రతుకడానికి అవసరమైన ఏ సౌకర్యం కల్పించలేదు. ఫలితంగా అక్కడ ఎవరు ఉండటం లేదు. గోలేటి ఓపెన్‍ కాస్టు క్రింది నిర్వాసితులైన గిరిజనులంతా తలో దిక్కు బ్రతుకపోయిండ్లు. ఒకప్పుడు అడవిలో తమ నేల మీద తాము కష్టం చేసుకొని బ్రతికిన గిరిజనుల బ్రతుకు దెరువులేకుండా చేసింది కంపెని. వాళ్ళ బ్రతుకుల్లో విషం చిమ్మింది. ఇదేం అభివృద్ధి’’ అన్నాడతను ఆవేశంగా….

‘‘పారిశ్రామిక ప్రగతికి బొగ్గు తవ్వకాలు అవసరమే కాదంటలేము.. బొగ్గు తవ్వుకోవాలంటే ప్రకృతికి, పర్యావరణానికి, భూమికి నష్టం కలిగించని రీతిలో అండర్‍ గ్రౌండ్‍ విధానంలో బొగ్గు తవ్వకాలు జరుపుకోండ్లి. దానికి మేం కాదంటలేం… కాని అందుకు విరుద్ధంగా ఇక్కడి భూమిని ప్రజలను నాశనం చేసి ఓపెన్‍ కాస్టుల ద్వారా బొగ్గు తవ్వకాలు సాగిస్తామంటే ఒప్పుకునేది లేద’’ అన్నాడు.

“ఇంతకు ముందు మన ఎంపీగారు చెప్పినట్టుగా పబ్లిక్‍ ఇయరింగ్‍ చట్ట విరుద్ధంగా నడుపుతాండ్లు. ప్రతిపాదిత కళ్యాణిఖని ప్రాజెక్టు కాసిపేట, మందమర్రి మండలాల్లో ఉంది. ఈ రెండు మండలాలు గిరిజన మండలాలు. షెడ్యూల్‍ ప్రాంతాలు. షెడ్యూల్‍ ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్టు ఆరంభిస్తే ఆ ప్రాంతానికి చెందిన గ్రామ పంచాయితీ, దాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేయ్యాలి. కాని అట్లా చెయ్యలేదు. అట్లా చేయకపోవడం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమవుతుంది. భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన వాళ్లు చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన వాళ్లు, చట్ట విరుద్ధంగా నడుచుకోవడం అన్యాయం. చట్టాల గురించి నిర్వాహకులకు తెలియదు అనుకోలేం. తెలిసి చట్టాలను ఉల్లంఘించటం క్షమించరాని నేరం” అన్నాడతను తీవ్ర స్వరంతో….

ఆ మాటలకు వేదిక మీదున్న కలెక్టర్‍ ముఖంలో నెత్తురుచుక్క లేకుండాపోయింది. మిగితా అధికారులు ఇబ్బందిగా కదిలారు.

‘‘చివరగా నేను మా కార్మిక సోదరులకు ఒక్క మాట చెప్పదలుచుకున్న… కార్మిక వర్గం అంటే. సమాజంలో చైతన్యవంతమైంది. సమాజంలోని అనేక చెడులను తొలగించేందుకు సమస్త పీడిత జనాలకు ఏకం చేసి వారికి నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోవాల్సిన వర్గం అటువంటి కార్మిక సోదరులు ఇవ్వాళ కంపెనీ తన అవసరం కోసం ఏవో నాలుగు ఉచిత మస్టర్లు ఇచ్చి ఇక్కడకు తీసుకురాగానే మురిసిపోయి స్థానిక ప్రజలకు అన్యాయం చేస్తామా? ఇది కార్మిక వర్గ చైతన్యాన్ని సూచిస్తుందా… దిగజారుడు తనం చూయిస్తుందా! ఎప్పటికైనా కార్మిక వర్గం – రైతాంగం కలిసే పోరాడాల్సి ఉంది. సమాజంలో ఈ దోపిడి అంతం చేయాల్సి ఉంది.’’ అన్నాడు ఆవేశంగా

‘‘మనలో మనకు తగాదా పెట్టే కంపెనీ మోసపు ఎత్తులను అర్థం చేసుకోవాలి. లేకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే అవుతుంది’’ అంటూ ముందు వరుసలో కూర్చున్న వారినుద్దేశించి అన్నాడు.

చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే ఉచిత మస్టర్లు పొంది వచ్చిన వారిలో ఎక్కువ శాతం మంది కమ్యూనిస్టు పార్టీ అనుబంధ కార్మిక సంఘంకు చెందిన వాళ్లు. తమ పార్టికే చెందిన ఎమ్మేల్యే తమను విమర్శించటం వారికి ఇబ్బంది కలిగించింది. యూనియన్‍ నాయకులు ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళు తప్పని సరై వచ్చారు.

ఓపెన్‍ కాస్టును వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే తన ప్రసంగాన్ని ముగించడం, వేదిక మీదున్న పెద్దలకు ఇచ్చింది కల్గించింది. వాళ్ళు ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా బలగాలను మోహరించారు. కాని వారు ఊమించని విధంగా ప్రజాప్రతినిధులు మాట్లాడే సరికి మింగుడు పడటంలేదు.

కాంగ్రెస్‍ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మాట్లాడటానికి వచ్చినప్పుడు సభలో గందరగోళం ఏర్పడింది. ఆయన కాంగ్రెస్‍ పార్టీ ఎమ్మెల్సీయేకాదు. సింగరేణిలో కాంగ్రెస్‍ అనుబంధ ట్రేడ్‍ యూనియన్‍ ముఖ్య నాయకుడు. ఆయన ఏం మాట్లాడుతాడో, ప్రజలకు ముందే తెలిసినట్టుంది. దాంతో వారు తమ నిరసన తెలియజేస్తూ అరుపులు, కేకలు మొదలుపెట్టారు.

‘‘ఆయన చెప్పేది ఏముండదు.. కంపెనీ తొత్తు’’ అంటూ పెద్దగా అరిచిండొకరు.

గతంలో జరిగిన అనేక పబ్లిక్‍ ఇయరింగ్‍లలో ఆ యూనియన్‍ ఓసీపీలను సమర్థించింది. దాంతో ఆయన ఇప్పుడు కూడా అదే పాతపాటే పాడుతాడు’ అన్న భావన ప్రజల్లో ఉండిపోయింది. గోల గోలగా అరుస్తున్న ప్రజలను చూసి ఆయన ఆవేశం చెందాడు.

‘‘మీరు అరిచి గీ పెట్టినా ఓపెన్‍ కాస్టులు ఆగేటివి కావు. అవి మీరు రమ్మంటే వచ్చేది కాదు, పొమ్మంటే పొయ్యేటివి అంతకంటే కాదు’’ అంటూ అరిచిండు.

జనం పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ‘‘ఆయన వెంటనే ‘దిగిపోవాలని’ అంటూ పెద్దగా జనం అరవటంతో సభలో మరోమారు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వేదిక మీద ఉన్న వారు ‘సైలెన్స్ సైలెన్స్’ అంటూ అరిచిండ్లు. కాని జనం వినిపించుకోలేదు. అంత వరదాక కడకడలు నిలుచున్న పోలీసులు చొచ్చుకువచ్చి జనాలను శాంతింపజేయడానికి ప్రయత్నించిండ్లు. అయినా ప్రజల నిరసన నినాదాలు హోరెత్తుతూనే ఉంది.

‘‘ఎమ్మెల్సీ డౌన్‍ డైన్‍’’ అంటూ ఓ యువకుడు అరుస్తుంటే జనం ప్రతిగా నినదించసాగిండ్లు.. చివరికి పోలీసుల జోక్యంతో సభ కాసేపటికి సద్దుమనిగింది.

ఎమ్మెల్సీ మళ్లీ మాట్లాడసాగిండు…

‘‘ఓసీలు వద్దంటే కంపెనీ మూతేసుకోవాల్సిందే’’ అంటూ అతను మరోసారి గొంతు పెంచిండు ‘‘బొగ్గు ఉత్పత్తిలో ఓసీపీలదే 80 శాతం వాటా, కేవలం 20 శాతం వాటా మాత్రమే అండర్‍ గ్రౌండ్‍ గనుల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఆ విషయాన్ని ఓసీపీలు వ్యతిరేకించే వాళ్లు గమనించాలి. అంతే కాదు అండర్‍గ్రౌండ్‍ గనుల ద్వారా ఉత్పత్తి అయ్యే ప్రతి టన్ను బొగ్గుకు కంపెనీకి సరాసరిగా రెండు వందల రూపాయల నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని ఓపెన్‍ కాస్టు గనుల ద్వారా భర్తి చేయబడుతుంది. ఎందుకంటే ఓసీపీల ద్వారా బొగ్గు ఉత్పత్తి ఖర్చులు తక్కువ అందుకే సింగరేణిలో మనుగడ సాధించాలంటే ఓపెన్‍కాస్టు గనులు రావాలి. అందుకే మా యూనియన్‍ ఓసీపీలను సమర్థిస్తోంది’’ అన్నాడు.

తాము చంపాలనుకున్న కుక్కను పిచ్చి కుక్క అని ప్రచారం చేసినట్టు కంపెనీ ఏదైతే ప్రచారం చేస్తుందో.. అదే విషయాన్ని యూనియన్‍ నాయకుడు వక్కానించిండు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి పన్నిన కుట్రలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల బారిన పడేశారు.

నష్టాల సాకు చూపి అంతిమంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే నాటకం మొదలైంది. ఆ విధంగా 92 సింగరేణిలో 1200 కోట్ల నష్టాలు పేరుకుపోయాయని, బీఐఎఫ్‍ఆర్‍ పరిధిలోకి పోయిందంటూ కార్మిక వర్గంమీద దాడి మొదలైంది. కంపెనీ మూసి వేస్తారు, ఉద్యోగాలు పోతాయి అంటూ ప్రచారం మొదలైంది. మేనేజ్‍మెంటు చేసే ప్రచారానికి యూనియన్‍ నాయకులు వంతపాడారు.

వాడవాడన మీటింగ్‍లు పెట్టి ‘‘కంపెనీని నష్టాల నుంచి కాపాడాలంటే కార్మికులు మరింత కష్టపడి పనిచేయాలి. ఉత్పత్తులు పెంచాలి. సమ్మెలు మానాలి’’ అంటూ ప్రచారం సాగించారు. నష్టాల బూచిని చూపి కార్మికులను భయబ్రాంతులకు గురిచేసి కంపెనీ కార్మిక వర్గం మీద అణచివేతలకు దిగింది. హక్కుల హరింపులు మొదలు పెట్టింది. ఖర్చులు తగ్గించుకోవటం పేరు మీద కాంట్రాక్టీకరణను ముందుకు తెచ్చి కార్మికులను ఉచ్చు బిగించింది….

ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉత్పత్తులు పెరిగిపోతున్నాయి. కాని ప్రభుత్వం బొగ్గు ధరల కాంట్రోలింగ్‍ పేర ఉత్పత్తి ఖర్చులకంటే అమ్మకపు ధరలు తక్కువ నిర్ణయించడంతో ఆ మేరకు నష్టాలు పెరిగాయి. అదే ప్రభుత్వం ప్రైవేటు రంగ బొగ్గు సంస్థలు తమ ఇష్టంవచ్చిన ధరలకు బొగ్గు అమ్ముకునే వెసలుబాటు కలిగించింది. విదేశీ సంస్థలకు ప్రైవేటు బొగ్గు సంస్థలకు రాయితీలు ఇచ్చి ప్రభుత్వరంగ బొగ్గు సంస్థలపై పన్నుల భారం మోపింది. దానికితోడు వేల కోట్ల కుంభకోణాలు అంతిమంగా బొగ్గు సంస్థలను నిర్వీర్యం చేయడానికి గ్లోబల్‍ కుట్ర మొదలైంది. కార్మికులకు వాస్తవాలు వివరించడంలో కార్మిక సంఘాలు ఎప్పుడు చొరవ చూపలేదు సరికదా ప్రభుత్వ కుట్రలకు వంతపాడారు. ఫలితంగా ఇవ్వాళ ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థ ఇప్పుడు ప్రైవేటీకరణ అంచున వేలాడతీయబడ్డాయి.

ఎమ్మెల్సీ మాటలు కొనసాగుతూనే ఉన్నాయి.

‘‘నిజమే మనకు ఏమన్న సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకుందాం. అది నష్టపరిహారం విషయమా! మరోకటా అన్నది తరువాత. అంతేకాని గుడ్డిగా ఓపెన్‍ కాస్టులను వ్యతిరేకించటం దేశాభివృద్ధిని అడ్డుకోవడమే’’ అన్నాడు.

అయాసపడుతూ.. జనం నిరసనలను పట్టించుకోవకుండానే ఆయన ఓసీపీలను సమర్థిస్తూ తను చెప్పాల్సింది చెప్పి తన ఉపన్యాసం ముగించిండు.

కలెక్టర్‍ మరోసారి మైకందుకొన్నాడు. ‘‘ఎదుటి వారు తమ అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. అది మనకు అనుకూలమైనా, వ్యతిరేకమైనా! ఎవరి అభిప్రాయం వారు చెప్పుకునే స్వేచ్ఛా ఉందని గమనించాలి’’ అంటూ అరవసాగిండు.

తెలంగాణ రాష్ట్ర సమితికి చెదిన ఎమ్మెల్యేకు చివరగా మాట్లాడటానికి అవకాశం కల్పించారు. అప్పటికి ఆయన్ని పబ్లిక్‍ ఇయరింగ్‍కు రాకుండా అరెస్టు చేయడం, దానిపై ఊరంతా నిరసనలు రావటం దాంతో తప్పని సరై ఆయన్ని విడుదల చేయడం వంటి సంఘటనలు జరిగిగాయి. ఆ కోపం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది.

‘‘సర్కార్‍ మెడ మీద కత్తిపెట్టి పబ్లిక్‍ ఇయరింగ్‍ జరుపుతాంది. ప్రాజెక్టు క్రింద నిర్వాసితులయ్యే ఊర్ల చుట్టు పోలీసులను మోహరించి, వారిని రాకుండా అడ్డుకుని ప్రజాభిప్రాయ సేకరణ చేయడం అన్యాయం, దౌర్జన్యం… చివరికి ఈ విషయం తెలిసి నేను అక్కడికి పోతే, నేను ఈ ప్రాంత ప్రజాప్రతినిధిని, ఎమ్మెల్యేను అని చూడకుండా అరెస్టు చేసిండ్లు. పబ్లిక్‍ ఇయరింగ్‍లో నా అభిప్రాయం చెప్పడానికి వస్తే అరెస్టు చేస్తారా! ఏమిటీ దౌర్జన్యం.. అటువంటి దానికి ఈ పబ్లిక్‍ ఇయరింగ్‍ దేనికి..!’’ అన్నాడు ఆవేశపడిపోతూ..

‘‘ఇప్పటికే కంపెనీ చేపట్టిన ఓపెన్‍ కాస్టు గనుల వల్ల దాదాపు మూడు వందల గ్రామాలు నామరూపాలు లేకుండాపోయాయి. ఆ గ్రామాల ప్రజలు ఏమైపోయిండ్లో తెలువదు…! ఇంతకు ముందు పర్యావరణ అధికారి మాట్లాడుతూ ఓసీపీల్లో బొగ్గు తవ్వకాలు అయిపోయన తరువాత మళ్లీ భూమిని యథాతథంగా చేయడానికి రీపిల్లింగ్‍ చేస్తారని చెప్పుతాండ్రు… కాని మూసేసిన ఓపెన్‍ కాస్టు గనుల్లో ఎక్కడి రీపిల్లింగ్‍ చేసిండ్లా. మా భూముల్లో బొగ్గు ఉంటే దానిని తువ్వుకొని మా ఊర్లను బొందలగడ్డలుగా చేసి మా బ్రతుకుల్లో మన్నుపోసి మీరు లాభపడుతారా’ ఇక్కడ ఇంతకు ముందు కొంతమంది పెద్దలు ఓసీపీలు కావాలని అభివృద్ధి జరగాలని చెప్పిండ్లు. ఎవర్ని నాశనం చేసి ఎవడు అభివృద్ధి చెందుతాండ్లు. ఈ తలక్రిందుడు అభివృద్ధిని మేం అంగీకరించం’ మా గొంతులు కోయడానికి చాలా మాయమాటలు చెప్పుతాండ్లు… అదిస్తాం.. ఇదిస్తాం అంటాండ్లు.. అండర్‍ గ్రౌండ్‍ బావులు ఆరంభినప్పుడు ఇచ్చిన హామీలే కంపెనీ తీర్చలేదు. ఇప్పుడేమో మళ్ళీ ఓసీపీలు తెచ్చి ఇక్కడ భూమిని, ఆ భూమి బ్రతికే మనుష్యులను సమస్త జీవరాశిని నాశనం చేస్తామంటాండ్లు’’ అన్నాడు అతను ఆవేశంగా.

‘‘తెలంగాణ రాష్ట్ర సమితి ఈ అన్యాయాన్ని జరుగనివ్వదు. మేం సూత్రబద్ధంగానే ఓసీపీలను వ్యతిరేకిస్తున్నాం. బొగ్గు అవసరమైతే అండర్‍ గ్రౌండ్‍ బావులు తవ్వవచ్చు, కాని ఓసీపీలు తవ్వి ఈ వినాశనం కొనసాగిస్తామంటే మాత్రం మేం ఊరుకునేది లేదు. ఓసీపీలకు వ్యతిరేకంగా మా పోరాటం ఉధృతం చేస్తాం’’ అంటూ ముగించిండు.

వేదిక మీద ఉన్న పెద్దలు గంభీరమైండ్లు. ఓసీపీలను వ్యతిరేకిస్తున్న జనం తమ హర్షాన్ని తెలుపుతూ నినదించిండ్లు…

మాటలకు చేతలకు పొంతనలేని నాయకుల మాటలు ముగిసాయి. కొంతమంది నాయకులు ఓసీపీలను బహిరంగంగానే సమర్థిస్తే, మరికొంతమంది నాయకులు తాము వ్యతిరేకిస్తున్నామని ప్రకటించిండ్లు.

ఓపెన్‍ కాస్టు పెనుభూతం ఊళ్ళను, ఆ ఊళ్ళలోని జనం జీవితాలను మింగేస్తుంటే ఈ ముసలి కన్నీళ్లు కార్చటం వల్ల లాభం ఎవరికి? ప్రజల ఆందోళనలో భాగస్వామ్యం కాని వారి ఉత్తుత్తి మాటలతో ఈ వినాశనం ఆగుతుందా!

(ఇంకా ఉంది…)

రచయిత. తెలుగు సాహిత్యంలో పి.చందు గా సుపరిచితుడు. అసలు పేరు ఊరుగొండ యాదగిరి. వరంగల్ ఉర్సులో 1954 సెప్టెంబరు 24 న వీరమ్మ, మల్లయ్య దంపతులకు జన్మించారు. ఎల్.బి. కాలేజీలో బి.కాం చదివారు. సింగరేణిలో ఉద్యోగ విరమణ చేశారు. "శేషగిరి", "నల్లమల", "భూదేవి", "నెత్తుటిధార", "శృతి", "బొగ్గులు" తదితర పదిహేను నవలలు రాశారు. సుమారు వంద కథలు రాసి "భూ నిర్వాసితులు", "జులుం", "గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు", "సమ్మె కథలు" కథా సంపుటాలు ప్రచురించారు.

Leave a Reply