స్వేచ్ఛ సమానత్వం కోసం యుద్ధం తప్పదు: మాల్కం X

గత వారం రోజులుగా నల్ల జాతీయిడైన జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో అమెరికాలో నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. ఇరవై డాలర్ల నకిలీ నోటు వాడాడానే నెపంతో జార్జ్ ఫ్లాయిడ్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. పట్ట పగలు, ఎంతో మంది చూస్తుండగా, ఇద్దరు పోలీసులు అతని వీపుపై మోకాళ్లతో నొక్కిపెట్టి ఉండగా, ఇంకొక పోలీస్ ఆఫీసర్ తొమ్మిది నిమిషాలు అతని గొంతుపై మోకాలితో నొక్కడంతో జార్జ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ దారుణం జరుగుతుంటే చుట్టూ ఉండి చూస్తున్నవాళ్లు అడ్డుకోకుండా ఇంకొక పోలీస్ ఆఫీసర్ వారికి కాపలాగా నిలబడ్డాడు. ప్రత్యక్ష సాక్షులు వీడియో తీసిన ఆ దృశ్యం అమెరికన్లనే కాదు ప్రపంచం మొత్తాన్ని కదిలించింది. ఫ్లాయిడ్ హత్యతో జాత్యహంకారానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమయ్యి వైట్ హౌజ్ ని చుట్టుముట్టారు. దీనితో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంకర్లో దాక్కోవలసి వచ్చింది.

ఇవాళ అమెరికాలో ప్రజలు ‘న్యాయం లేనిదే శాంతి లేదు’ (No Justice No Peace) అని నినదిస్తూ నిరసనలు చేస్తున్నారు. ఈ సందర్భంలో “స్వేచ్ఛను శాంతి నుండి వేరు చేయలేము, ఎందుకంటే స్వేచ్ఛ లేనిదే ఏ మనిషీ శాంతిగా బతకలేడు” అన్న ఆఫ్రికన్ అమెరికన్ నాయకుడు మాల్కం X ను గుర్తు చేసుకోవాలి. అప్పుడప్పుడే బానిసత్వపు సంకెళ్ల నుండి బయటపడి శ్వేత జాత్యహంకార కబంధ హస్తాల్లో విలవిలలాడుతున్న నల్ల జాతీయుల పరిస్థితులను, వాళ్లపై జరిగే దుర్మార్గాలను, వాళ్ల ఆక్రోశాన్ని మాల్కం గొంతెత్తి చాటాడు. అతను అమెరికాలో నల్ల జాతీయుల స్వేచ్ఛతో మొదలుపెట్టి ప్రపంచంలోని పీడితులందరి స్వేచ్ఛ గురించి స్వప్నించాడు. అతని పదునైన మాటలు, అతని నాయకత్వపు సామర్థ్యం, ప్రజలను ఆకట్టుకునే శక్తి తెల్ల జాత్యహంకారపు మూలాలను ఒక్క కుదుపు కుదిపింది. అందుకే అతన్ని చూసి పాలకవర్గాలు వణికిపోయాయి.

మాల్కం X, మే 19, 1925 న మాల్కం లిటిల్ గా నెబ్రాస్కా రాష్ట్రంలోని ఒమాహా లో జన్మించాడు. అమెరికాలో ఆనాటికి కోటి, ముప్పై లక్షల మంది నల్లవాళ్లు ఉన్నారు- అందులో అధిక శాతం దక్షిణ రాష్ట్రాల్లో ఉన్నారు. బానిస వ్యవస్థ ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలలో ఉండటం వల్ల, 1863 లో బానిస వ్యవస్థ ను అమెరికా నిషేధించిన తర్వాత కూడా ఎక్కువ శాతం నల్లవాళ్లు దక్షిణ రాష్ట్రాల్లోనే ఉన్నారు. బానిస వ్యవస్థ ఉత్తర రాష్ట్రాలలో ఎక్కువ ఉండకపోవడానికి కారణం ఆ రాష్ట్రాల్లో ఉన్న వాతావరణానికి, పంటలకు బానిసత్వం కన్నా వెట్టి చాకిరీ అనుగుణంగా ఉందిందని, అట్లానే ఆ రాష్ట్రాల్లో బానిసత్వం పట్ల ఉన్న వ్యతిరేకత కొంత వరకు కారణమని విశ్లేషకులు చెబుతారు. 1925 నాటికి దక్షిణ రాష్ట్రాల్లో ఉన్న నల్లవాళ్లు ముఖ్యంగా చిన్న రైతులు లేదా కౌలుదారులుగా ఉన్నారు. ఉత్తర రాష్ట్రాల్లో నల్ల జాతీయులు ఎక్కువగా పరిశ్రమల్లో కార్మికులుగా ఉన్నారు. బానిస వ్యవస్థ అంతమయిన తర్వాత దక్షిణ రాష్ట్రాల్లో నల్లవాళ్లు కఠినమైన వర్ణవివక్షను ఎదురుకొన్నారు. నల్లవాళ్లు తెల్లవాళ్ల నుండి వెలివేయబడ్డారు. వాళ్ల నివాసాలు, స్కూళ్లు, చివరికి పబ్లిక్ టాయిలెట్లు సహితం వేరుచేయబడ్డాయి. ఉత్తర రాష్ట్రాల్లో వివిక్ష కొంత తక్కువ స్థాయిలో ఉన్నా అక్కడ కూడా నల్లవాళ్లు తెల్లవాళ్లకు దూరంగా కిక్కిరిసిన ఘెట్టోలలోకి (మురికివాడలు) విసిరివేయబడ్డారు. మొదటి ప్రపంచ యుద్ధపు అవసరాల వల్ల నల్లవాళ్లను పరిశ్రమల్లోకి శ్రామికులుగా చేర్చుకున్నారు. యుద్ధం ముగిసేనాటికి శ్రామికవర్గంలో వస్తున్న అలజడులను ఎదుర్కోడానికి తెల్లవాళ్లలో జాతివివక్షను రెచ్చగొట్టి శ్రామికవర్గం సంఘటితమవకుండా పాలకవర్గాలు కుట్రలు పన్నాయి. ఇట్లాంటి చారిత్రిక నేపథ్యంలో మాల్కం కుటుంబం, చాలా మంది నల్లజాతీయుల మాదిరిగానే జాత్యహంకార హింసకు గురయింది.

మాల్కం తల్లి లూయీస్ లిటిల్, ఆమె తండ్రి తెల్లవాడు కావడం చేత తెల్లజాతి స్త్రీ లా కనిపించేది. ఆమె తండ్రి గురించి ఆమెకున్న అవమానపు భావం తప్ప అతని గురించి తనకేమీ తెలియదని అంటాడు మాల్కం. అతని తల్లి ఆమె తండ్రిని ఎప్పుడూ చూడకపోవడం సంతోషకరమైన విషయం అని చెప్పేదని అంటాడు. అతను చేయబట్టే మాల్కం కు ఎరుపు-గోధుమ రంగు వచ్చింది. అతని జుట్టు కూడా అదే రంగులో ఉండేది. అతని పాలిపోయిన రంగు చేయబట్టే తన తండ్రి తనను బహుశా అందరికన్నా ఎక్కువ ఇష్టపడేవాడని, అదే కారణం చేత తన తల్లి తనను అందరికన్నా ఎక్కువ దండించేదని మాల్కం చెబుతాడు. మొదట్లో అందరు నల్లవాళ్ల లాగానే తన లేత రంగును చూసి మురిసిపోయేవాడని, తరువాతి కాలంలో, తనలో ఉన్న ఆ తెల్లజాతి రేపిస్ట్ ప్రతి రక్తపు బొట్టును ద్వేషించాడని అంటాడు.

మాల్కం తండ్రి అర్ల్ లిటిల్ నల్లజాతి విముక్తిపై మార్కస్ గార్వే ఆలోచనలను అనుసరించిన బోధకుడు. మార్కస్ గార్వే “బ్యాక్ టు ఆఫ్రికా” ఉద్యమానికి మార్గదర్శకుడు. నల్ల జాతి ఆత్మాభిమానాన్ని ఎత్తిపట్టిన ఆ ఉద్యమం ఆఫ్రికన్-అమెరికన్లను బాగా ఆకట్టుకుంది. తన తండ్రి హాజరయ్యి మాట్లాడే సమావేశాలకు నాల్గయిదు ఏండ్ల వయసులో ఉన్న మాల్కం వెళ్ళేవాడు. అట్లాంటి ఒక సమావేశం తర్వాత మాల్కం తండ్రితో ఒక ముసలావిడ ‘ఈ తెల్లవాళ్లు నిన్ను చూసి భయపడి చస్తున్నారు’ అని అన్న మాటలను మాల్కం చాలా గర్వంగా గుర్తు చేస్కుంటాడు. సమావేశాల చివరన తన తండ్రితో కలిసి అందరూ ‘మేలుకోండి, శక్తివంతమైన నా జాతి జనులారా, మీరు సాధించవలసింది సాధించి తీరుతారు’ అని నినదించడం అతని తండ్రి గురించి అతనికి గుర్తున్న అతి కొద్ది విషయాల్లో ఒకటి. నల్ల జాతీయుల ఆత్మాభిమానం, హక్కులను గురించి బీజం అతనిలో ఆ పసి వయసులోనే తన తండ్రి ప్రభావం వల్ల పడిందని చెప్పవచ్చు. మాల్కం నాలుగేండ్ల వయసులో ఉన్నపుడు తెల్లవాళ్ల మూక ఒకటి జాత్యహంకారంతో వాళ్ళ ఇంటిని తగులబెట్టింది. అతని ఆరేండ్ల వయసులో కూ క్లక్స్ క్లాన్ (ఒక తెల్ల జాత్యహంకార సంస్థ) తన తండ్రిని చంపేసింది.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోతున్న ఆ కుటుంబం తండ్రి మరణంతో అతలాకుతలం అయింది. తండ్రి మరణించేనాటికి అతని తల్లికి 34 ఏండ్లు. ప్రభుత్వం నుండి వచ్చిన వెల్ఫేర్ చెక్, వితంతువు పెన్షన్ చిన్న చిన్న ఖర్చులకు సరిపోయేవి. తెల్లవాళ్ల ఇండ్లలో పని చేయడం, కుట్టు పని వంటివి చేస్తూ ఆమె తన ఎనిమిది మంది పిల్లలను పోషించింది. ప్రభుత్వం నుండి సహాయం తీసుకోవడం ఆమె తన ఆత్మగౌరవానికి భంగంగా భావించేది. ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వ సహాయం తీసుకోవలసి రావడం ఆమెను మానసికంగా కుంగదీశాయి. ఆమె మానసిక స్థితి దిగజారుతున్న క్రమంలో ప్రభుత్వం మాల్కంను వేరే కుటుంబానికి అప్పజెప్పింది. ఆ తర్వాత కొంత కాలానికే, మాల్కం 12 ఏండ్ల వయసున్నప్పుడు అతని తల్లి మెంటల్ హాస్పిటల్ లో వేయబడి, 26 ఏండ్లు అక్కడే గడిపింది. పెద్ద పిల్లలిద్దరూ తమ ఇంట్లోనే ఉండిపోగా, మిగిలిన ఆరుగురు పిల్లలను వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నాలుగు వేరు వేరు కుటుంబాలతో ఉంచింది. కుటుంబ సభ్యులందరూ ఒకరినుండి ఒకరు దూరంగా విసిరివేయబడినా మానసికంగా అందరూ దగ్గరగానే ఉన్నట్టు మాల్కం చెబుతాడు.

చిల్లర దొంగతనాలు, స్కూల్ లో అల్లరి పనులు చేస్తూ ఎన్నో సార్లు దొరికిపోయిన పన్నెండేండ్ల మాల్కం ను డిటెన్షన్ హోమ్ కి పంపించారు. ఆ హోమ్ ను నడిపించే మిస్సెస్ స్వెర్లిన్ అనే ఆవిడ మాల్కం ను చేరదీసి రిఫార్మ్ స్కూల్ కు పంపకుండా తనదగ్గరే ఉంచుకొని స్కూల్ లో చేర్పించింది. స్వెర్లిన్ దంపతులు తనను ఎంత బాగా చూసుకున్నా నల్లవాళ్ల పట్ల వాళ్లకు ఉండే చిన్నచూపు గురించి మాల్కం చెబుతాడు. తన ముందే, తను అక్కడ లేనట్టే నల్లవాళ్ల గురించి ‘నిగ్గర్’ అనే బూతు పదాన్ని అలవోకగా పదే పదే వాడడాన్ని గుర్తు చేసుకుంటాడు. తనను ఒక పెంపుడు జంతువులా చూసారే కానీ, మనిషిలా గుర్తించలేదని, చరిత్రలో ఎప్పుడూ తెల్లవాళ్లు నల్లవాళ్లను తమలో ఒకరిగా భావించలేదని చెబుతాడు. అతన్ని చేర్పించిన స్కూల్లో తన క్లాసులో అతనొక్కడే నల్లవాడు. స్కూల్ మొత్తంలోనే తను కాకుండా ఇంకొక కుటుంబానికి చెందిన పిల్లలు మాత్రమే నల్లవాళ్లు ఉన్నారు. చదువులో మాల్కం బాగా రాణించి ఏడవ తరగతిలో వాళ్ల క్లాస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. అతని ఇంగ్లిష్ టీచర్ ఒకరోజు మాల్కం ని జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నావని అడిగితే లాయర్ కావాలని అనుకుంటున్నా అని చెప్పాడు. ఆ టీచర్ అప్పుడు నవ్వి ‘నీ ఆలోచనలు వాస్తవికంగా ఉండాలి. ‘నిగ్గర్’ అయిన నీకు లాయర్ అవడమనేది వాస్తవికమైన లక్ష్యం కాదు. నీ కార్పెంట్రీ పని అందరికీ బాగా నచ్చుతుంది. కార్పెంటర్ అయ్యే ఆలోచన చేయి’ అని చెప్పాడు. క్లాస్ లో అందరినీ వాళ్లు ఏది చేస్తామంటే అది చేయమని ప్రోత్సహించిన టీచర్, అందరి కన్నా మంచి మార్కులు వచ్చినా తనను నిరుత్సాహ పరచడం మాల్కం ని కలచివేసింది. ఆ ఘటన తనలో ఒక లోతైన మార్పు తెచ్చిందని మాల్కం అంటాడు. అంతవరకూ తనని ఎవరు ‘నిగ్గర్’ అని పిలిచినా పట్టించుకోని మాల్కం అప్పటినుండి ఆ మాట ఎవరయినా అంటే తిరిగి వాళ్లను తీక్షణంగా చూడడంతో తనని అలా పిలవడం చాలా మటుకు మానేశారని చెప్తాడు.

పద్నాలుగు ఏండ్ల వయసులో మాల్కం చదువు వదిలిపెట్టి ఉద్యోగం కోసం బోస్టన్ లో ఉన్న అక్క (తన తండ్రి మొదటి భార్య కూతురు) దగ్గరకు వెళ్ళాడు. తన టీనేజ్ అంతా బోస్టన్, న్యూ యార్క్ లలో గడిచింది. అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే అక్రమ జూదం, డ్రగ్స్ అమ్మడం, వ్యభిచార గృహాలకు కస్టమర్లను చేరవేయడం, ఇండ్లలో దొంగతనాలు చేస్తూ నేర ప్రపంచంలోకి కూరుకుపోయిన జీవితాన్ని మాల్కం తన ఆత్మకథలో చాలా వివరంగా చెబుతాడు. చాలా మంది నల్లజాతి యువకులు చదువు, నైపుణ్యం, అవకాశాలు లేక చిల్లర నేరాలతో మొదలుపెట్టి అనివార్యంగా పెద్ద నేరాల ఉచ్చులోకి ఎట్లా పడుతారో వివరిస్తాడు. 21 ఏండ్ల వయసులో మాల్కం ఒక దొంగతనం కేసులో పట్టుబడి ఆరున్నర ఏండ్లు జైలులో గడిపాడు.

మాల్కం జైలు ఫోటోలు

జైలులో ఉండగా మాల్కం కు జాన్ బెంబ్రి (John Bembry) అనే తోటి నల్ల ఖైదీతో పరిచయం అయింది. తోటి నల్ల ఖైదీల అభిప్రాయాలను ఎప్పుడూ లెక్క చేయని తెల్ల ఖైదీలే కాకుండా, గార్డులు కూడా బెంబ్రి మాటలు ఆసక్తిగా వినడం మాల్కం ను ఆశ్చర్యపరిచింది. ‘మొదటిసారి ఒక వ్యక్తి తన మాటలతో అందరి గౌరవాన్ని పొందడం చూశాను’ అని బెంబ్రి గురించి మాల్కం చెబుతాడు. అతని ప్రోత్సాహంతో జైలులో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. ఇంగ్లిష్, లాటిన్ తో మొదలు పెట్టి, చరిత్ర, మతం, ఫిలాసఫీ, ఇట్లా జైలులో పగలనకా రాత్రనకా పుస్తకాలు చదివాడు. పుస్తకాలు చదవడం తన జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పిందని జైలులో ఉండగానే తనకు అర్థమయిపోయిందని మాల్కం అంటాడు.

జైలులో ఉండగా తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మాల్కం నేషన్ ఆఫ్ ఇస్లాం (Nation of Islam) లో చేరాడు. నేషన్ ఆఫ్ ఇస్లాం కు బ్లాక్ ముస్లిం మూవ్మెంట్ అనే పేరు కూడా ఉంది. అమెరికాలో బానిసలు, వాళ్ల సంతతి అయిన నల్లవాళ్ల ఇంటిపేర్లన్నీ తమను బానిసలుగా తెచ్చుకున్న యజమానుల ఇంటిపేర్లే. నేషన్ ఆఫ్ ఇస్లాంలో చేరిన నల్లవాళ్లు ఆ ఇంటిపేర్లని తిరస్కరించి, తెలియని తమ ఆఫ్రికన్ ఇంటిపేర్లకు ప్రతీకగా ‘X’ అని పెట్టుకున్నారు. అట్లా మాల్కం లిటిల్ మాల్కం X గా మారాడు. నేషన్ ఆఫ్ ఇస్లాం లో చేరడం మాల్కం జీవితంలో ఒక గొప్ప మలుపు. ఇస్లాం బోధనలను అనుసరించి అన్ని దురవాట్లను మానుకొని, జైలు నుండి బయటకు వచ్చాక నేర ప్రపంచం నుండి దూరంగా ఉన్నాడు. నేషన్ ఆఫ్ ఇస్లాం లో 14 ఏండ్లు ఉన్న మాల్కం దానిని బలపరచడానికి అహర్నిషలు పని చేసి, తక్కువ కాలంలోనే అందులో ముఖ్యమైన నాయకుడిగా ఎదిగి, నేషన్ ఆఫ్ ఇస్లాం నేత అయిన ఎలైజా మూహామద్ కు ముఖ్య ప్రతినిధి అయ్యాడు.

ఎలైజా మూహామద్ తో మాల్కం

తెల్లవాళ్ల నుండి తమని తాము వేరు చేస్కోవడం వల్ల మాత్రమే నల్లవాళ్లకు విముక్తి కలుగుతుందనే భావజాలంతో ఏర్పడిన మతతెగ నేషన్ ఆఫ్ ఇస్లాం. తెల్లవాళ్లను ద్వేషించడమే నల్లవాళ్లకు శ్వేత జాత్యహంకారాన్ని ఎదుర్కునే గొప్ప సాధనమని నేషన్ ఆఫ్ ఇస్లాం చెబుతుంది. నల్లవాళ్ల పరిస్థితులను, సమస్యలను వ్యక్తపరుచుకునే వాహికలు లేని ఆ సమయంలో తెల్ల జాత్యహంకారాన్ని తీవ్రంగా ఖండించే ఇలాంటి మతతెగలు ఆ ఖాళీని పూరించాయి. తన నల్ల జీవితంలోని కష్టాలను, పరిస్థితులను అర్థం చేసుకోవాలని తహతహలాడుతున్న మాల్కం ను, తెల్లవాళ్ల హింసను ఎండగడుతున్న బ్లాక్ ముస్లిం ఉద్యమం బాగా ఆకర్షించింది. జైలులో ఉండగా ఇస్లాంలో చేరిన మాల్కం చనిపోయేవరకి ఇస్లాం మతంలోనే ఉన్నాడు. అయితే నేషన్ ఆఫ్ ఇస్లాం నుండి విడిపోయాక, మతం స్థానంలో రాజకీయాలు అతని జీవితంలో ప్రధానం అయ్యాయి. నేషన్ ఆఫ్ ఇస్లాం లో ఉండగా కూడా అతను మిగిలిన ప్రచారకులతో పోలిస్తే రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండేవాడు.

నేషన్ ఆఫ్ ఇస్లాం లో ఉన్న పద్నాలుగు ఏండ్లు మాల్కం అద్భుతమైన వక్తగా పేరు తెచ్చుకున్నాడు. అమెరికా మొత్తమే కాకుండా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలు విస్తృతంగా తిరిగి శ్వేత జాత్యహంకార హింసను నిక్కచ్చిగా, తీవ్రంగా దుయ్యబట్టాడు. మితవాదులైన నల్లజాతి నాయకుల ద్వంద్వ నీతిని వాడిగా విమర్శించాడు. నల్లవాళ్ల హక్కుల కోసం రాయితీలు అర్థించడం కాకుండా తమకు హక్కుగా పొందవలసిన వాటిని డిమాండ్ చేశాడు.

నేషన్ ఆఫ్ ఇస్లాం లో రాజకీయాల నుండి దూరంగా ఉండాలనే కఠినమైన పాలసీ ఉంది. నల్లవాళ్ల హక్కుల గురించి ఉద్యమాన్ని నిర్మించాలని తపన పడే మాల్కం కు ఇది దిగ్బంధం గా మారింది. తెల్లవాళ్ల జులుం నుండి నల్లవాళ్ల విముక్తి గురించి మాట్లాడడమే కాని దానికోసం ఏమీ ప్రణాళిక లేకపోవడం మాల్కం కు మింగుడు పడలేదు. నేషన్ ఆఫ్ ఇస్లాం పరిధులు దాటి మాల్కం పని చేసే ప్రయత్నాలు చేయడం దానినుండి విడిపోవడానికి ఒక కారణం అయింది. అట్లానే దాని నేత అయిన ఎలైజా మూహామద్ తన బోధనలకు విరుద్ధంగా పర స్త్రీలతో లైంగిక సంబంధాలు ఏర్పరుచుకోవడం, దేశంలో అందరూ గుర్తించే నాయకుడిగా మాల్కం కు పేరు రావడంతో అతనిపై అసూయతో కుట్రలు చేయడం మాల్కం ను చాలా నిరాశ పరిచాయి.

మాల్కం మార్చ్ 1964 లో నేషన్ ఆఫ్ ఇస్లాం నుండి వైదొలగి ముస్లిం మాస్క్ (Muslim Mosque Inc.) అనే సంస్థను స్థాపించాడు. దాని వెంటనే అతను మక్కా (Mecca) కు హజ్ యాత్రకై వెళ్ళి ఆర్థడాక్స్ ఇస్లాం మతాన్ని పుచ్చుకున్నాడు. మక్కా యాత్ర తరువాత అతను లెబనాన్, నైజీరియా, ఘానా, లైబీరియా, సెనెగల్, మొరాకో, అల్జీరియా దేశాలు పర్యటించాడు. మక్కాకు వచ్చిన ముస్లింలలో తెల్లవాళ్లు ఉండడం, వాళ్లు తనని ఆదరించిన తీరు, తను పర్యటించిన దేశాల్లో అక్కడి ఉద్యమ నాయకులతో చర్చలు, మాల్కం ఆలోచనలో ఒక పెద్ద మార్పుకు కారణమయింది. అంతవరకూ తెల్లవాళ్లను ద్వేషించిన మాల్కం, జాత్యహంకారం రంగుకు మాత్రమే సంబంధించింది కాదని, దాని చారిత్రిక మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. అమెరికాలో రాబోయే తరాలలో తెల్లవాళ్లు కూడా జాత్యహంకారానికి వ్యతిరేకంగా నల్లవాళ్లతో నిలువక తప్పదని చెప్పాడు. తన ఆలోచనల్లో వచ్చిన మార్పు గురించి చెబుతూ మాల్కం ‘నాకు బలమైన నమ్మకాలు ఉన్నప్పటికీ, నేనెప్పుడూ నిజాలను ఎదుర్కొంటాను. కొత్త అనుభవాలు ఇచ్చే కొత్త జ్ఞానాన్ని జీవితంలో భాగంగా స్వీకరిస్తాను. సత్యాన్ని అన్వేషించే క్రమంలో కొత్త భావాలను గ్రహించే దృక్పథం తో ఉండడం చాలా అవసరం, అందుకే నేను ఓపెన్-మైండెడ్ గా ఉంటాను.’ అని అంటాడు. ఈ వైఖరి వల్లనే మాల్కం ఎప్పటికప్పుడు తనని తాను తరచి చూసుకుంటూ, కొత్త జ్ఞానాన్ని పొందినప్పుడల్లా తనని తాని మెరుగుపరుచుకుంటూ, తన తప్పులను నిజాయితీగా ఒప్పుకుంటూ, సవరించుకుంటూ ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు.

మతయాత్ర కై మక్కాకు వెళ్ళిన మాల్కం దృష్టి ఆసక్తికరంగా ఆ యాత్ర తరువాత మతం నుండి మరింతగా రాజకీయాల వైపు మళ్ళింది. ఆ విషయం గురించి మాల్కం ఇట్లా అన్నాడు. “ఏ మతమూ నన్ను ఈ దేశంలో నా వాళ్ల పరిస్థితులను మరిపించలేదు. నావాళ్లపై హింస ఆగేవరకు, అంతమయేవారకు, ఏ దేవుడూ, ఏ మతమూ నన్ను అది మర్చిపోయేలా చేయలేవు. ఆ విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.”

హజ్ యాత్రకు వెళ్ళే ముందు స్థాపించిన ముస్లిం మాస్క్ సంస్థ జాత్యహంకార వ్యతిరేక పోరాటంలో నల్లవాళ్లను సంఘటిత పరచడానికి సరిపోదని గ్రహించి మతానికి సంబంధం లేకుండా ఆఫ్రో-అమెరికన్ ఐక్యత సంస్థను (Organisation of Afro-American Unity (OAAU)) స్థాపించాడు. ఆఫ్రికా లో జరుగుతున్న జాతివిముక్తి పోరాటాల స్ఫూర్తితో ఈ సంస్థ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. జాత్యహంకార దాడుల నుండి రక్షించుకోవడానికి ఆత్మరక్షణ దళాలను ఏర్పరుచుకోవడం, తెల్ల వాళ్లను తమ సంస్థలో చేర్చుకోకపోవడం వంటి నిబంధనలతో ఈ సంస్థ ఏర్పడింది. తెల్లవాళ్లు, నల్లవాళ్లు విడివిడిగా ముందు ఏకం కావాలని, తర్వాతే అందరూ కలిసి పని చేయొచ్చని మాల్కం మొదట్లో నమ్మాడు. దానివల్ల జాత్యహంకార వ్యతిరేక ఉద్యమాల పట్ల సానుభూతి ఉన్న తెల్లవాళ్లను ఆ సంస్థ కలుపుకోలేకపోయింది. అయితే కొంత కాలానికి మాల్కం పెట్టుబడిదారీ వ్యవస్థ నల్లవాళ్లపై చేసే అణచివేతకు నల్ల జాతీయత్వం (Black Nationalism) సరైన సమాధానం కాదని గ్రహించాడు. అతను ఘానా పర్యటించినపుడు అల్జీరియా అంబాసిడర్ తనతో జరిపిన చర్చల్లో- ప్రపంచంలోని అణచివేత వ్యవస్థను సమూలంగా పడదోయడానికి పోరాడుతున్న నిజమైన విప్లవకారులను బ్లాక్ నేషనలిజం సిద్ధాంతం దూరం చేసుకుంటుందని తను గ్రహించేలా చేశాడని మాల్కం అంటాడు.

త్వరలోనే మాల్కం జాత్యహంకార అణచివేతకి పెట్టుబడిదారీ వ్యవస్థ కారణం అని అర్థం చేసుకున్నాడు. ఆఫ్రికాలో జరుగుతున్న జాతివిముక్తి పోరాటాల గురించి మాట్లాడుతూ మాల్కం, “రాబందు స్వభావం లేకుండా పెట్టుబడిదారీ వ్యవస్థను నడపలేరు… నాకో పెట్టుబడిదారున్ని చూపించండి, నేను మీకో రక్తం మరిగిన పరాన్నభుక్కును చూపిస్తాను.” అని అన్నాడు. ఇంకొంత ముందుకెళ్లి వర్గ దృక్పథం వైపు మాల్కం అడుగులు వేస్తున్నట్టు ఈ మాటలతో మనకు తెలుస్తుంది. “మనం విప్లవాల యుగంలో జీవిస్తున్నాము, అమెరికాలో నల్లవాడి తిరుగుబాటును ఈ కాలాన్ని నిర్వచిస్తున్న అణచివేతకు, వలసవాదాలకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటులో భాగంగా చూడాలి. నల్లవాళ్ల తిరుగుబాటు కేవలం తెల్లవాళ్లకు వ్యతిరేకంగా జరిగే జాతి వైరుధ్యంగానో లేదా కేవలం అమెరికా సమస్యగానో పరిగణించడం సరైనది కాదు. నిజానికి, ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా అణచివేసేవారికి వ్యతిరేకంగా అణచివేయబడ్డవాళ్లు, దోపిడీదారులకు వ్యతిరేకంగా దోచుకోబడ్డవాళ్లు తిరగబడడం చూస్తున్నాం.”

మే 1964 లో హజ్ పర్యటన నుండి తిరిగి వచ్చి ఫిబ్రవరి 1965 లో చనిపోయేవరకూ, అంటే తొమ్మిది నెలల్లో మాల్కం ఆలోచనలో గణనీయమైన గుణాత్మక మార్పు జరిగింది. వర్ణాంతర వివాహాలపై తనకున్న అభ్యంతరాలను మార్చుకోవడం, నల్లజాతి ఉద్యమాలలో స్త్రీల పాత్రను గుర్తించడం, చర్మం రంగుతో సంబంధం లేకుండా అన్ని సంస్థలతో కలిసి శ్వేత జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాడడం, ఇట్లా అతివేగంగా తనను తాను సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాడు. అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు రెండూ తెల్ల పాలకవర్గాల ప్రయోజనాలకు కొమ్ముకాసేవేనని తన నిశితమైన మాటలతో ఎత్తిచూపాడు. నల్లవాళ్ల పౌరహక్కుల ఉద్యమాన్ని డెమోక్రటిక్ పార్టీతో ముడిపెట్టే నల్లజాతి నాయకులను ఎండగట్టాడు. నల్లజాతి మధ్య తరగతి నాయకత్వం పాలకవర్గాలు విసిరే ఎంగిలి ముక్కల కోసం ఉద్యమాలను తాకట్టుపెట్టడాన్ని బహిర్గతం చేసి వాళ్లను తూర్పారబట్టాడు. నల్లవాళ్ల అణచివేతను ఎదుర్కొనే సంస్థను నిర్మించడానికి తను చేస్తున్న కృషిని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్న నేషన్ ఆఫ్ ఇస్లాం మీద తీవ్రమైన విమర్శలు చేశాడు.

పెట్టుబడిదారీ వ్యవస్థలో నల్లజాతీయుల అణచివేత మూలాలను అర్థం చేసుకున్న మాల్కం అమెరికా పాలకవర్గాలకు అతి ప్రమాదకరంగా పరిణమించాడు. మరో వైపు మాల్కం నల్లజాతి మధ్య తరగతి నాయకత్వానికి, ముఖ్యంగా నేషన్ ఆఫ్ ఇస్లాంకు కంటకంగా తయారయాడు. తన రాజీపడని అభిప్రాయలతో ఎంతో మంది శత్రువులకు సంపాదించుకున్న మాల్కం న్యూ యార్క్ నగరంలోని హార్లమ్ (Harlem) లో ఒక ర్యాలీలో ఫిబ్రవరి 21, 1965 న కాల్చివేయబడ్డాడు.

తన జీవితంలో సైద్ధాంతికంగా ఒక గొప్ప సంఘర్షణ పడుతూ పరివర్తన చెందుతున్న కాలంలో మాల్కం జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. చనిపోయేనాటికి మాల్కం పెట్టుబడిదారీ వ్యవస్థకు, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాల వైపు అడుగువేస్తున్నది నిజమే అయినా బతికి ఉండుంటే అంతిమంగా అతను ఎట్లా పరిణామం చెంది ఉండేవాడనేది ఊహించుకోవాల్సిందే. నల్లజాతి సంకెళ్లను చేధించడానికి తను కలలు గన్న విప్లవాత్మక సంస్థను నిర్మించలేకపోయినా మాల్కం నిజమైన విప్లవకారుడు. పెట్టుబడిదారీ వ్యవస్థలోని అణచివేతకు, అన్యాయాలకు వ్యతిరేకంగా తన గొంతు విప్పడానికి మాల్కం ఎన్నడూ జంకలేదు. తను నమ్మిన విలువల కోసం ఆఖరి శ్వాస వరకూ నిజాయితీగా, రాజీపడకుండా నిలబడిన వ్యక్తిత్వం అతనిది.

“అంతిమంగా అణచివేసేవారికి, అణచివేయబడేవాళ్లకు మధ్య యుద్ధం జరగుతుందని నేను నమ్ముతున్నాను. అందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం కోరుకునేవాళ్లకు, దోపిడీని కొనసాగించాలనుకునే వాళ్లకు మధ్య యుద్ధం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అంతిమంగా చర్మం రంగుకి సంబంధం లేకుండా అలాంటి యుద్ధం జరుగుతుందనే నమ్మకం నాకుంది.” అని స్వప్నించిన మాల్కం ప్రపంచ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాడు. జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో అట్టుడికిపోతున్న అమెరికా ఈరోజు మాల్కం లాంటి అలుపెరుగని వీరుని ప్రేరణతో పోరాట మార్గాలు ఎంచుకోవాల్సి ఉన్నది. రాజీలేని అతని పోరాటం, నిజాయితీ, నిబద్ధత అమెరికన్లకే కాదు, ప్రపంచంలో అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే ప్రజలందరికీ గొప్ప స్ఫూర్తి.

పుట్టింది హైదరాబాద్. పెరిగింది మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో. వైద్య విద్య కె. ఎం. సీ, వరంగల్. ‘ప్రజాకళ’ (2006-2007), ‘ప్రాణహిత’ (2007-2010) వెబ్ పత్రికల ఎడిటోరియల్ టీం మెంబర్. వృత్తి - వైద్యం. అభిరుచి - సాహిత్యం. ప్రస్తుతం అమెరికాలోని ఇండియనాపోలిస్ లో ఫామిలీ ఫిజీషియన్ గా ప్రాక్టీస్ చేస్తోంది.

27 thoughts on “స్వేచ్ఛ సమానత్వం కోసం యుద్ధం తప్పదు: మాల్కం X

  1. A very wonderful article about an ever inspiring martyr! Thanks Chaithuu.

  2. చాలా బాగా రాసారు చైతన్య. ఇప్పటి పరిస్థితుల్లో గతాన్ని , నాటి పోరాటాలను, వాటికి నాయకత్వం వహించి దిశ నిర్దేశం చేసిన నాయకులను గుర్తుకుతెచ్చుకోవడం అవసరం. ముఖ్యాంగా గతాన్నించి నేర్చుకోవాల్సినవి, వదిలేయాలైనవి ఏమిటో అర్థం
    విమల

  3. మాల్కం X ప్రయాణం గురించి బాగా రాశారు…. ఇప్పుడు చరిత్రలోని అడుగులను తడమడం ఎంత అవసరమో చెప్పడం బాగుంది. స్ఫూర్తిదాయక వ్యాసం.

  4. చాలా బాగా అవసరమయిన సమయం లో ఒక ప్రజల కోసం పని చేసిన మాల్కం ని పరిచయం చేశారు .

  5. చక్కని వ్యాసం..మాల్కం జీవన ప్రయాణం.. అతని అభిప్రాయాలు కాలానుగుణంగా మారడం బాగా చెప్పారు.. అతని జీవితం ఇప్పటి పరిస్థితులలో స్ఫూర్తి కావాలి.చైతన్యకు అభినందనలు

  6. చాలా ఏళ్ల క్రితం మార్క్సిస్ట్ డాట్ ఆర్గ్ లో మాల్కం గొంతు విన్నాను. కానీ తన రచనలేవీ చదవలేదు. ఇప్పుడు మీరు మాల్కం ను అద్భుతంగా పరిచయం చేశారు. ఫ్లాయిడ్ హత్యనేపథ్యంలో మాల్కం ను స్ఫూర్తి అవసరం

  7. the article is good ,timely and informative. but the second paragraph in which u referred to his parentage is not clear. can u suggest any book to understand his life. congrats CHAITANYA.

    1. Thank you, uncle! May be you are talking about the paragraph about her mother. The father of Malcolm’s mom was a white man who she never met or knew anything about. I did not want to use the word ‘grandfather’ as he was never really a grandfather to Malcolm.

      ‘The autobiography of Malcolm X as told to Alex Haley’ is an excellent book to understand his life.

  8. “రాబందు స్వభావం లేకుండా పెట్టుబడిదారీ వ్యవస్థను నడపలేరు… నాకో పెట్టుబడిదారున్ని చూపించండి, నేను మీకో రక్తం మరిగిన పరాన్నభుక్కును చూపిస్తాను.” అని మాల్కం అన్నాడు.
    ఎప్పటికప్పుడు తనను తాను చైతన్యీకరించుకుంటూ సవ్యమైన దారిలోకీ మాల్కం చేసిన ప్రయాణాన్ని చక్కగా హృద్యంగా ఆవిష్కరించావు చైతూ!

  9. You have traced all the milestones of his ideological journey with appropriate quotes. Very insightful authentic account Chaitanya. Congratulations.

Leave a Reply