రెండెకరాల గడి. ఎక్కడ మొదలు పెట్టాలి. కేంద్రం దొర కనుక దొరను లేపేస్తే ఫ్యూడలిజం కుప్పకూలుతుంది ఇది తొలి ఆలోచన. వర్గ శత్రు నిర్మూలనే ఏకైక మార్గంగా గోదావరి తీర ప్రాంతంలో 1972 నుండే కొండపల్లి సీతారామయ్య, కే.జీ.సత్యమూర్తి లాంటి వారితో పోరాటం మొదలైంది. ఆ అవగాహనతో 1975 కన్న ముందే మద్దునూరులో ప్రైవేటు స్కూలు టీచర్ ప్రవేశించిండు. ముంజం రత్నయ్య పెరడి దొర జన్నెకోడె తొక్కింది. అదేమిటంటే దొర అన్నిరకాలుగా తొక్కేశాడు. సింగరేణిలో పడక ఊళ్లో నిలబడలేక – ఊపిరి సలుపని స్థితిలో ఎండు కర్రలాగా ఉన్నాడు. అతనికి నిప్పుతోడయ్యింది. ముందే పసికట్టిన దొర పోలీసులను పెట్టుకున్నాడు. గోదావరి ఈవలి తీరంలో ఎమర్జెన్సీలోనే దొరలు ఖతమయ్యారు… ఇందులో ఎండుకర్ర, నిప్పు ఉన్నారు. భూస్వామ్యం ఒక వ్యక్తికాదు. ఒక వ్యవస్థ.
“భూస్వామ్యాన్ని కేవలం వ్యక్తిగత హింసావాద వర్గ శత్రు నిర్మూలన ద్వారా నిర్మూలించలేం. కొందరు వీరులతో ఇది జరిగే పనికాదు. వ్యవసాయ కూలీలను, పేదరైతాంగాన్ని వ్యవసాయ విప్లవ శక్తులుగా సమీకరించాలి” అనే తెలివి తెచ్చుకున్నవాళ్లు భూస్వామ్యాన్ని కూలదోయడమే కాదు కొత్త ప్రజాస్వామిక సమాజాన్ని నిర్మించాలి. అట్లా ఎమర్జెన్సీ తరువాత మద్దునూరులో అందుకనుగుణంగా సంఘాలు నిర్మించారు. అగ్గి రాజుకుంది. కొలిమి మద్దునూరు. రాజేసింది ప్రజలు. నిప్పు రత్నయ్య, రఘు. చుట్టు పక్కల ఆరు గ్రామాలల్లో తిరిగారు. మార్చిలో జరిగిన ఎన్నికలల్లో ఇందిరాగాంధీ ఓడిపోయింది. 21.03.1977 ఎమర్జెన్సీ ఎత్తేశారు. లోలోపల రగులుతున్న మద్దునూరు ప్రజలు ఏప్రిల్ 1978లో పట్వారిని ఒక పంచాయితీ సందర్భంగా మామిడితోటలో ఏ ఆధారాలు లేకుండా మాయం చేశారు. అది ఒక ఆరంభం. ఆ తరువాత ఊరికి పాటలచ్చినయ్. ప్రజా సంఘాల నిర్మాణం జరిగింది. అప్పటికే రత్నయ్య, రఘు నీళ్లల్లో చేపలయ్యారు. తొలకరి కురిసి వ్యవసాయ పనులు ఆరంభమైన జూన్ 1978లో కూలి రేట్ల పెంపుదల పోరాటాలు ఆరంభమయ్యాయి. దొర దిగిరాలేదు. 17.06.78 నాడు పాలేర్ల, వ్యవసాయకూలీలు పనిపాటలోల్లు సాకలిమంగలి లాంటి వారందరితో సమ్మె ఆరంభమయ్యింది. దొర పనులన్నీ బందు… మద్దునూరు అల్లకల్లోలమయ్యింది. మూడు రోజుల తరువాత 20.06.78 ఆరు గ్రామాల ప్రజలు బండ్లకు ఎర్ర జెండాలు కట్టుకొని 500 బండ్లతో అక్రమంగా దొర ఆక్రమించిన అడవిలో నుండి ఎవరకి కావాల్సిన కర్ర వాళ్లు నరుక్కొని పోయారు. దొరకు దెబ్బమీద దెబ్బ. ఈ వార్త జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, మంథనిలాంటి చోట్లకు వ్యాపించింది. అప్పటకే అన్నిచోట్ల రైతుకూలి సంఘాలు ఏర్పడి పనిచేస్తున్నాయి. అన్నిచోట్ల వెట్టి బందయ్యింది. దున్నేవారికి భూమి ప్రాతిపదికన 30 గ్రామాలలో ఎనిమిది వందల ఎకరాలు రైతాంగం దున్నింది. చాలా చోట్ల పాలేర్ల జీతాలు, కూలిరేట్లు పెరిగాయి. ఇలాంటి రైతాంగ పోరాటాలను సమీకరించడానికి 08.09.78 జగిత్యాలలో జైత్రయాత్ర జరగింది. నలుబైవేల మంది రైతాంగం హాజరయ్యారు. మద్దునూరు ప్రజలు బండ్లు గట్టుకొని సభకు పోయారు. ప్రాంతపు దొరలంతా చెన్నారెడ్డితో మొరపెట్టుకొని 20.10.78 కల్లోలిత ప్రాంతాలుగా జగిత్యాల, సిరిసిల్లాలను ప్రకటించారు. ఊరూర పోలీసు క్యాంపులు వచ్చాయి. వందలాది కేసులు, వేలాది మందిని అరెస్టు చేశారు. అయినా వ్యసాయ పనులు నడువలేదు. మద్దునూరు దొర ట్రాక్టర్ కొన్నాడు. పాలమూరు లేబర్ను తెచ్చినా పనులు సాగలేదు. విరివిగా తుపాకులకు లైసెన్సులిచ్చారు. దొర తుపాకి తెచ్చాడు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మధ్య దాకా దొరలది పైచెయ్యి అయ్యింది. రైతుకూలి నాయకులు- కార్యకర్తలు ప్రజల్లో నిలబడి పని చేయడం వలన డిసెంబర్ లో మరో ప్రజా వెల్లువ వచ్చింది.
సమ్మెలు సాంఘీక బహిష్కారానికి దారితీశాయి. దొరలకు అగ్గి నీళ్లు బందు. జిత్తులమారి దొరలు మంతనాలకు దిగారు. దొరలు అక్రమంగా దున్నుకుంటున్న ప్రభుత్వ భూములు, దండగలు వాపసు యివ్వాలని ప్రజలన్నారు. ఎన్నోకుట్రలు కుతంత్రాలు. మోసం చేసి కార్యకర్తలను చంపారు. గడులమీద దాడులు ఆరంభమయ్యాయి. అప్పటికే ఒకసారి గడిమీద ప్రజలు దాడి చేశారు. 1979 డిసెంబర్ కల్లా మద్దునూరి నుండి తన ఆటలు సాగక దండుగల పేర వసూలు చేసిన డబ్చు దస్కం తీసుకని దొర పట్నం పారిపోయిండు. గడిమీద ప్రజలు రెండోసారి దాడి చేసి కసితీసుకున్నారు. దొరభూములు బీడు పడ్డాయి. పంటలు ప్రజలు కోసుకున్నారు. పశువులు ఆగమైనయ్. దొరలాగే ప్రజల మీద ఆధారపడిన జన్నెకొడె- తన అధికారం సాగక ఈ మార్పు గ్రహించలేక తను బతకలేక గడిముందు పడి చనిపోయింది.
మద్దునూరులో దొర ప్రత్యక్ష క్రూర దోపిడి, పీడన, హింసతో కూడిన అధికారం కూలిపోయింది. తమ చైతన్యవంతమైన ప్రతిఘటనతో అలలు అలలుగా ధీటైన ఎత్తుగడలతో ప్రజలు దొరను ఊరినుండి తరిమేశారు. దొరతరపున రాజ్యాంగం, చట్టం, పోలీసులు నిలబడినా కూడా హత్యలు, అరెస్టులు, నిర్భంధం, జైల్లు, కేసులైనా కూడా వాటినన్నింటిని ఎదుర్కొని మందుకు సాగారు. ప్రజలు ఉత్పత్తి శక్తులను విప్లవీకరించినది పీపుల్స్ వార్ పార్టీ- భారతదేశంలో అధికారంలో ఉన్న అర్థవలస, అర్థభూస్వామిక శక్తులను కూలదోసి- ఉత్పత్తి వనరులను- ఉత్పత్తి శక్తులను, ఉత్పత్తి సంబంధాలను ప్రజాస్వామీకరించడం వ్యూహంలోని భాగంగా- రైతాంగ, కార్మిక, ఆదివాసీ పోరాటాలను సమన్వయంలోని భాగంగా – మద్దునూరులో కొలిమంటుకున్నది. అందులో ప్రజలు మెరుగు పెట్టబడ్డారు…
ఈ క్రమంలో పాత భూస్వామిక భావజాలం, రూపొందుతున్న కొత్త ప్రజాస్వామిక భావజాలం మధ్య సంఘర్షణ. అది భావోద్వేగాలతో నిండి ఉన్నది… ఇది కథాంశం…
“ఆవులావులు కొట్లాడ్తె లేగల కాళ్ళిరిగినట్టు – అచ్చేటిది రాకమానదు. ఎనకటినుంచచ్చే ఇలవరిసే గిప్పుడు ఒక్క పెట్టున మార్తదా? మనకు సంక లేవడితే ఖార్జం కండ్లబడ్తది. దొరలు కొండలసొంటోల్లు. దున్నపోతు గట్టుతోని పోట్లాట బెట్టుకున్నట్టు. దొరలు డబ్బు, కానూన్లు, కచ్చీర్లు, మంది మార్భలం కలిగినోళ్లు – గాళ్లతోని ఇరోధం బెట్టుకుంటే మన బతుకు ఆకుకు అందకుంట, పోకకు పొందకుంటయితది.” ఇది పాత భావజాలం గల రకరకాల ప్రజలల్లో బలంగా ఏర్పడ్డ అభిప్రాయం. అది బీటలు వారుతోంది. మరుగుతోంది. అయినా పోరాటం ఎదురుదెబ్బలు తిన్నప్పుడు బయటకు వస్తోంది.
ఇలాంటి పాత అభివృద్ధి నిరోధకమైన సమాజంలో నుండి పోరాటంలో నుంచి రాటు దేలినవాళ్లు – సమాజపు చలనసూత్రాలు అర్థం చేసుకున్నారు. పారిస్ కమ్యూన్ నుండి రష్యా, చైనా విప్లవాలే కాదు – భారతదేశంలో జరిగిన అనేక పోరాటాలను అర్థం చేసుకున్నారు. నక్సల్బరి ఆటుపోట్లు అనుభవించిన వాళ్లు. అందులో నుంచి ఎదుగుతున్న నాయకత్వం.
“ఆడు కొట్టినా తిట్టినా నా భూములు గుంజుకున్నా, కూళ్లు ఎగబెట్టినా, దండుగలు తిన్నా, ఆడోళ్ళ ఖరాబు చేసినా, ఆని ఇష్టా రాజ్జెం, సత్తె నాశిడం జేసిన సచ్చినట్టు పడుండాలే ననే గద. పడుంటే మంచిదే. కానీ పడుండనోళ్ల గురించి మనం నెత్తినోరూ కొట్టుకున్నా ఆగుతారా? ఎండకాలం రాకపోతే మంచిగుండనుకుంటాం. రాకమానుతదా? ఎండకాలమత్తది. చెట్ల ఆకులు రాలిపోతయి – మల్ల ఆనకాలమత్తది. కొత్త సిగురులు పుట్టుకత్తయ్.” ఇది ప్రకృతి నియమం…
ఇదంతా కథలో తేవడం ఎట్లా?
సమస్య మొదటికచ్చింది. చనిపోయిన జన్నెకోడె ఈ రెండు భిన్న వైరుధ్యాల పతాక స్థాయి వ్యక్తీకరణ…
ఎట్లా రాయడం? తెలుగులో వచ్చిన కథలు, నేను చదివిన కథలు గుర్తుకు తెచ్చుకున్నాను. కూలిపోతున్న భూస్వామ్యాన్నో, రూపొందుతున్న కొత్త సమాజాన్నో ఇంచుముంచిగా చిత్రించిన కథలున్నాయి. కానీ ఇది రెంటి మధ్య ఏకకాలంలో సంఘర్షణ. గోర్కీ ‘డేగ పక్షి పాట’ కథ – అది మరీ సింబాలిక్ గా ఉన్నది. లూషన్ ప్రజల నుండి ఏరుకొని తిరిగి చెప్పిన కథలున్నాయి. మరీ సంక్షిప్తం. లూషన్ బహు నేర్పరి. ప్రేమ్ చంద్ ‘కఫన్’ లాంటి కథలు పాత సమాజపు వికృతరూపం చిత్రించినవి. నేను చదివిన లాటిన్ అమెరికన్ కథలు బహు కొద్ది.
ఇదంతా కాదు. ప్రజల్లో మౌఖిక కథలున్నాయి. అవి చెప్పే పద్ధతున్నది. అనేక మంది జానపద కళాకారులు వేల కథలల్లారు. చెప్పారు. గానం చేశారు. ఇదే కథను ప్రజల మీటింగులల్లో ఉపన్యాసకులు చెప్పగా విన్నాను… ప్రజలు పూర్తి స్థాయిలో ఒంట బట్టించుకోలేదు… రాత్రి డ్యూటీలో ఒక్కన్నే రెండు గంటల రాత్రి ఈ కథ నాకు నేనే చెప్పుకున్నాను… గుర్రుకొడుతున్న డ్యూటీడ్రైవర్ కుర్చీలో నుండి లేచి నిలబడి మళ్ళీ కుర్చీలో కూర్చుండి –
“ఎందుకు” అన్నడు. అతను ముస్లిం.
“వో బద్మాష్ బైల్ గంట గత్తర జేత్తంటే దుడ్డందుకొని తరుముతే కిస్సా కథమ్. గంట పరేషానెందుకు?” అన్నడు.
“నువ్వు విన్నావా?”
“భిల్కుల్- మగర్ సమఝా నహీ” అన్నడు.
“సరే! ఎట్లయిన విన్నవు గన్క- అది దొర నిషాని కోడెను ఏమన్నా అంటే దొర బతుకనియ్యడు. రెండోది అది దేవుని కోడె. దేవునికి కోపమత్తదని జనం బయపడుతరు.”
“అయితే మరింక బతుకుడు మూసీబతే” అన్నడు. ఇంతలో క్వారీకి పోయే టయిమయింది.
పోతూ పోతూ “సాలా పైసేవాలా పూరా జాన్వర్ హై. మనుషులను సమఝ్తా నహీ. (డబ్బున్నోళ్ళు పశువులు. మనుషులను అర్థం చేసుకోరు.)” అన్నాడు.
పర్వాలేదు. మౌఖిక జానపద గాథలాగా చెప్పడం కథ శిల్పంగా అనుకున్నాను.
మరో రెండు రోజులు ఒక వందసార్లు కథను మనసులో నిర్మించి విచ్చగొట్టుకున్నాను.
పాత్రలు – దొర, జన్నెకోడె, ముంజం రత్నయ్య, బక్క పిలగాడు రఘు… అంతా రడీ… వీళ్ళంతా కథలో భాగం. కథ చెప్పే పద్ధతి జానపద కళాకారుల పద్ధతి కనుక కథకావల మూడో వ్యక్తి కావాలి. అతనికి ఈ సంఘర్షణ అంతా అర్థమై ఉండాలి. అప్పుడు కథలో ఇంకో అంశం వొచ్చింది. కథ మద్దునూరులోనే జరిగినా అది ప్రత్యేకమౌతుంది. రైతుకూలి సభలల్లో ఎట్లాగు వేలాదిమంది రైతులు, రైతుకూలీలు సమీకరించబడి వారి వారి అనుభవాలు పంచుకుంటారు కనుక – అది తెలంగాణలోని దొరలందరికి, ప్రజలకు ప్రతీక కావాలి. అంటే ప్రత్యేక కాలువ లాగా ఆరంభమై నది కావాలి. అప్పుడు దొర, జన్నెకోడె, రత్నయ్య, రఘు కొద్ది మార్పులు అవసరమయ్యాయి. (ఉదాహరణకు నేనెంచుకున్న ఆలూ దొర మాడు తాగడు కానీ చాలా మంది దొరలు తాగకపోతే బతుకలేరు. అదొక దొరతనపు అలవాటు.)
మూడో వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు. ఆ మొత్తంలో నుండి ఎదిగిన వ్యక్తి. అంటే రత్నయ్య, రఘులు నాయకులుగా ఎదగడం. అప్పుడు ప్రజానాయకులంటే ఎట్లా ఉంటారు. ఇది అన్నింటికన్నా పెద్ద సమస్య అయ్యింది. నాకు తెలిసిన వాళ్లందరి గురించి ఆలోచించాను. కనిపించే బాహ్యరూపమా? వాళ్ల ఆలోచనలా? వాళ్ల రాజకీయాలా? వాళ్ల లక్ష్యమా? ఎక్కడ చదివి నోటు చేసుకున్నానో గాని నాయకత్వ లక్షణాల గురించి నేను రాసుకున్న నోట్సు దొరికింది.
- ఒక విషయాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడం.
- అహంకారానికి (ఇగో) కి పోకుండా, వైరుధ్యాల్ని గుర్తించడం, ఒప్పుకోవడం.
- పరిష్కరించడానికి చొరవ చూపడం.
- మనుషుల పట్ల ప్రేమ గలిగి ఉండటం.
- ఒక పనికి సంబంధించిన అంచనా.
- తన తోటివాళ్ల శక్తి సామర్థ్యాలను గుర్తించడం అందుకు తగిన విధంగా ప్రోత్సహించడం.
- చొరువ
- సమిష్టి పని విధానం మీద ఆసక్తి, నమ్మకం.
- సరైన సమయంలో విమర్శ – ఆత్మవిమర్శ.
అట్ల గంగన్న రూపు దిద్దుకున్నాడు. ఈ గొడవంతా ఒకప్పుడు బౌద్ధం విలసిల్లిన గోదావరి (గంగ) తీరప్రాంతంలో మొదలయ్యింది. కాదు యుద్ధం కొనసాగుతోంది తరతరాలుగా. సాంబయ్య- అతి పురాతన పేరు…
కథ రెండు రోజుల్లో రాశాను… జులై 1981 సృజన మాసపత్రికలో వచ్చింది.
అప్పటి నుండి మద్దునూరు నా జీవితంలో భాగం. నేను రాయని, రాయజాలని వందల కథలకు, అతి పురాతన, అతి సంక్లిష్టమైన భారతీయ గిడసబారిన భూస్వామ్యానికి అది కొండ గుర్తు… అక్కడే దాని పునాదులతో సహా పెకిలించే ఆచరణ మొదలై నా కాలంలోనే నలభై అయిదు సంవత్సరాలు కావస్తోంది. ఎన్నెన్ని మలుపులో! ఎన్నెన్ని విశాదాలో! ఒక్కొక్క జీవితం ఒక్కొక్క కథ.
“నక్సలైట్లు దేవుళ్లురా! వాళ్ళు మరో పదేండ్లు ముందు వచ్చి ఉంటే నేను మరింత కోటీశ్వరున్ని అయ్యేవాన్ని. హైదరాబాదు సిటీ సగం కొనేవాన్ని. అక్కడుంటే అదే గడిలో ఉండేవాన్ని గదా!” (ప్రజలు చెప్పుకుంటారు) మద్దునూరు దొర అన్నట్లు ‘తెలంగాణ గడీలు’ పుస్తకంలో కె.వి. నరేందర్, సంగవేని రవీంద్ర రాశారు. అనేక వార్తా కథనాలు వచ్చాయి. ఇంతకీ వారు అర్థం చేసుకున్నది, ప్రపంచాన్ని చూస్తున్నది, డబ్బుగానే… డబ్బు అధికారంగా మారి మద్దునూరు హైద్రాబాదుకు మారడం ఒక విశాదమే. అదిప్పుడు అర్థ భూస్వామ్య, ఆర్తవలస అధికార కేంద్రంగా మారింది. తిరిగి తెలంగాణలో నాయకత్వంలోకి వచ్చింది.
నల్లా ఆదిరెడ్డి తన సహచరులతో నిర్మించిన ప్రజాపోరాటం ఒకప్పటి బౌద్ధం లాగా అడవుల్లోకీ విస్తరించింది. తెలంగాణా ప్రజాపోరాటాలలోని వైరుధ్యాలను అర్థం చేసుకొని ఒక గెంతుకు సిద్ధ పడుతున్న సమయంలో కేంద్ర కమిటీ సభ్యుడుగా ఎదిగిన ఆదిరెడ్డిని, రాష్ట్ర కార్యదర్శి సంతోషరెడ్డిని, ఉత్తర తెలంగాణా కార్యదర్శి శీలం నరేశ్ ను డిశంబర్ 2, 1999 లో బెంగుళూరులో పట్టుకొని కొయ్యూరులో కాల్చేశారు.
రకరకాల ఇబ్బందులు పడి మరణించిన ముంజం రత్నయ్య సమాధి (స్థూపం) మద్దునూరులో కూల్చివేశారు. పరిణాత్మక మార్పు, గుణాత్మక మార్పుగా పరిణామం చెందాలంటే బ్రాహ్మణీయ భూస్వామిక తాత్వికత ధ్వంసాన్ని, పతనాన్ని- నూతన ప్రజాస్వామిక తాత్వికతే చేయగలదు. అలాంటి తాత్వికతను రూపొందించడానికి ప్రతీకాత్మకంగా చెప్పిన కథే ఈ “మార్పు” కథ. ఇది ఒక చిన్న ఆరంభం. ప్రజలు పోరాడి రూపొందించిన తాత్వికత.
వందలాది మండి పోరాడి నిర్మించిన ఒక సామాజిక వాస్తవం. వేలు లక్షలాది మంది అందిపుచ్చుకొని పురోగమించాల్సిన ప్రణాళిక…
తెలిసినవాళ్ళ- పేర్లు కొన్ని. కాని వేల మంది లక్షల మంది ఈ యాభాయేండ్ల యుద్ధ రంగంలో ఉన్నారు. ముప్పై వేల మంది అమరులయ్యారు. ఈ మహత్తర, ఉద్విగ్న విప్లవోద్యమ ప్రవాహంలో స్థల కాలాలల్లో నేనుండటం వలన- నాకు సమాజం యిచ్చిన వెసులుబాటు వలన- విప్లవోద్యమ ఆచరణను ఒక చిన్న కథగా రాయగలిగాను. మార్పు – ప్రజలు పోరాడి రూపొందించిన కథ.
ఇందులోని జన్నెకోడె లాగా పశువులకు విచక్షణ జ్ఞానం ఉండదు. గతాన్ని సమీక్షించుకోలేవు. వర్తమానపు భౌతిక జీవితంలో మాత్రమే బతుకుతుంటాయి. భవిష్యత్తును కలగనలేవు.
భూస్వామిక సమాజంలోని, ముఖ్యంగా దోపిడితో బతికేవాళ్లు, విచక్షణ లేని మనుషులు అంతే- తమ బతుకును, తమతోటి వారి బతుకును, దీని చుట్టూ ఆవరించి ఉన్న సామాజిక జీవితాన్ని, పరిణామా క్రమాలను అర్థం చేసుకోలేరు. తాత్వికంగా ఆలోచించలేరు. ఫలితంగా ఉత్పత్తి వనరులు, శక్తులు, సంబంధాలు అభివృద్ధి చెందలేదు.
ఎప్పటికైనా ప్రజలు బ్రాహ్మణీయ భూస్వామ్యాన్ని కూల్చక తప్పదు. ప్రజలు విముక్తి సాధించక తప్పదు.