మార్చి నెల మొదలైతానే మహిలా దినోత్సవం గుర్తొస్తుంది. ఎవరు పిలుస్తారో ఏమో అన్న యోచనలో ఉన్నట్లే మార్చి ఏడో తేదీ రాత్రి మా ఆఫీసు నుండి ఫోన్ వచ్చింది. పొద్దున ఎనిమిదో గంటకల్లా జిల్లాలో జరిగే మహిలా దినోత్సవం కార్యక్రమానికి హాజరు కావాలి లీవు పెట్టడానికి కుదరదు అని. రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా అన్నట్లు పైన వాల్లు చెప్తే పోక తప్పదు కదా !
నేను ఉన్న తావు నుండి కార్యక్రమం జరిగే తావుకి పోవాలంటే రెండు బస్సులు మారి పోను నాలుగు గంటలు రాను నాలుగు గంటలు పడుతుంది. నేను ఇంట్లో నాలుగు గంటలకు అంటే తొలికోడి కూస్తానే లేస్తే ఎనిమిది కల్లా పోగలను అనుకోని ఏడో తేదీ రాత్రి పొద్దున్నేలేయెల్ల అని నా మనసుకు నూరుసార్లు చెప్పుకుంటా ఇంట్లో నా మొగునికి పిల్లలకి చెబితి. వాళ్ళు రేపు నువ్వు ఇంగా ముందుగా లేసి అన్నం, కూర చేసి పెట్టేసి పో, మాకు చేతగాదు అనే. నేను యాడికి పోవాలన్నా సంగటి చారు బాద తప్పదే అని ఒక పక్క కోపం, మల్లా ఓ పక్క చేయకపోతే ఏం తింటారో ఏమో అన్న ఆలోచన. ఈ బాద కన్నా ఒక అడుగు ముందుగా లేసిచేసి ఆడ ఏసేసి పోదాంలే అనుకొన్న మల్ల నాలో నేనే! చెత్త అట్లే ఉంది. గుడ్డ గుసురు అట్లే ఉండాయి. అవన్నీ సర్దల్ల అనుకుంటా పనుకుంటే నిద్ర పట్ల. సూది కింద పన్నా ఇనిపిస్తా ఉంది. ఏదన్నా అలికిడైతే లేచి టైం చూస్తే అప్పుడు రెండు అయ్యింది. పడుకుంటే నిద్ర రాదు. ఎప్పుడెప్పుడు నాలుగు అవుతుందా అనుకుంటున్నట్లే తొలికోడి కూసే! గబక్కన్న లేసి నాకోసం ఎదురు చూస్తున్న పనులన్నీ యాడ టైం అయిపోతుందో అనుకుంటా చేసేస్తి.
ఉలిపల్లి గా నీల్లు పోసుకుని అందరూ మంచి, మంచివి చీరలు కట్టకొస్తారు అని ఉన్న చీరలన్నీ తిరగేస్తి వాటిలో చీర ఉంటే రైకి ఉండదు. సరిపోయే పావడ దొరకదు. కొన్ని బరువుగా ఉంటాయి. ఒల్లు మనసు అలసిపోయినప్పుడు బరువు చీరలు చూస్తే ఎవరబ్బా వీటిని మోసేది అనిపిస్తుంది. బాగా రెడీ కావాలనుకోని మల్ల సింపుల్ గా రెడీ అయ్యి ఆయాలకే తినలేక ఆరు గంటల బస్సు యాడ ఎల్లి పోతుందో అని మా ఊరు నుండి మల్ల బస్సు కాడికి అర కిలోమీటరు దూరం నామొగిన్ని బండ్లో వదలమని చలికి వనకతా ఆరోగంట కంతా రోడ్ లో ఉంటే బస్సోడు ఆపొద్దు నాకంటే అరగంట ముందుగా వెళ్లిపోయినాడు .
ఆరు నుండి ఏడు దాకా ఒక బస్సునాబట్ట కూడా రాలే. ఆఫీసు వాళ్ళు ఏమంటారో ఏమో. ఇంకా ముందుగా వచ్చి ఉంటే బాగుండేది అనుకుంటా ఉండ. నాతో పని చేసే నా జతగత్తెలు నువ్వు ఇంకా రాలేదా అని పోన్లో అడుగుతా వాళ్లు అవసరిస్తా ఉంటే నా తలకాయ తోలుబొమ్మలాటాడింది. ఒక ఆటో వచ్చే. పానం లేచి వచ్చినట్లయ్యె. ఆటోలో సందు లేదు. నా కాల్లు చేతులు అదుముకొని నాలుగు అడ్డాల చెక్క మీద కూర్చుంటే ఆటోవాడు నిదానంగా రోడ్లు పక్కన పరాగ్గా నిలబడిన వాళ్ళను కూడా నిలిపి పిలిసి అడుగుతాడు వస్తారా అని. నువ్వు పోనీ రా నాయనా నాకు లేట్ అవుతుంది అని మనసులో తిట్టుకుంటూ ”వోన్నాకొంచెం అర్జెంటు, బస్సు ఎల్లిపోతుంది అని అవసరిస్తే నీకు అర్జెంట్ అయితే నాకు కలెక్షన్ కావద్దమ్మా అంటాడు. బస్టాండ్ కొస్తే బస్సు రెడీగా ఉంది. అబుడే గంటకు పైగా లేటు అయిపోయింది.
బస్సు బస్టాండ్ నుండి బయలు తేరి సంతదావన దూరిపోతోంది. ఆ సంతలో రోడ్డు పక్కన సినిమా హాల్ ఉంది. ఆపొద్దు కొత్త సినిమా రిలీజ్. ఆయాల కంతా అప్పుడప్పుడే మీసకట్టు వస్తున్న మగపిలకాయలు, కొంటిపిలకాయలు రంగులు చల్లుకుంటూ, పెద్దపెద్ద డ్రమ్స్ కొడతా తలకాయలకి ఆ హీరో బొమ్మలు ఉండే రిబ్బన్లు కట్టి, అదే బొమ్మల చొక్కాయిలు ఏసుకుని టపాసులు కాలుస్తా రోడ్డుపైన ఒకే అరుపులు. వాళ్ల తంతు అయిందాకా ఒక్క బండి కూడా కదల్లా. బస్సులో కూర్చొన్న పెద్దోళ్ళంతా తిట్టే పనే. అది దాటుకొని ఇంకో ఊరు బస్టాండ్ లో బస్ ఆగింది. ఎక్కే వాళ్ళు యొక్కతా ఉండారు, దిగేవారు దిగుతా ఉండారు నా పక్కన ఒక మగాయన కూర్చొని ఉండి దిగేసి నాడు. ఈసారి ఆడోల్లకు ఎవరికన్నా ఇద్దాము సీటు అని నా చేతిలో ఉన్న బ్యాగు పక్కసీట్లో పెడితి. ఎందుకంటే ముందు కూర్చున్నాయన బలంగా ఉన్నాడు. ఇరుకు. అట్లా ఇట్లా కదిలే పరిస్థితి కూడా లేదు. చేతులు యాడ పడితే ఆడ ఏస్తాడు. ఎవరో ఒకాయమ్మ పడతా లేస్తా వచ్చే. రామ్మా కూర్చొ అని సీటు ఇస్తి .ఆయమ్మ ”నేను ఫలానా ఆఫీసులో పని చేస్తున్న. ఈ సంవత్సరం రిటైర్డ్ అవ్వాల్సింది. రెండేళ్లు పెంచి ఈ అవస్థలు. ఇప్పుడున్న ఆరోగ్యాలకి, పని ఒత్తిడికి ఎబుడెపుడు ఇంట్లో ఉంటామా అనిపిస్తోంది అనే. ఆ యమ్మ చేతిలో పేపర్ చూస్తా బాలికపై అత్యాచారం అనే వార్త చదువుతా ”ఎన్నిచట్టాలు వచ్చినా ఏమన్నాభయపడతున్నారా? ఇట్లాంటి వాళ్లను కన్నతల్లిదండ్రులకు ఎంత నరకం కదా” అనే. ఆమె దిగిన తర్వాత మళ్లీ ఒక బిడ్డ తల్లి వచ్చి నా పక్కన కూర్చుంది. బిడ్డకి రెండేండ్లు ఉంటుంది. వాళ్ళమ్మ చేతిలో ఉండే సెల్లు ఈ లేదని వాడు గెట్టిగా ఏడుస్తా ఉండాడు. వాళ్ళమ్మ వాడి ఏడుపు చూడలేక సెల్లు ఆన్ చేసి బొమ్మలు పెట్టి ఇచ్చింది. వాడు రెండు చేతులతో సెల్లు పట్టుకొని కన్నార్పకుండా చూస్తా ఉండిపాయ. వాళ్ళమ్మ చెప్తా ఉంది ఇంట్లో కూడా అంతే ఏడిస్తే సెల్లు, టీవీ పెట్టేస్తే చూసుకొని ఉండిపోతాడు ఆకలి కూడా కాదు అని.
ఒళ్ళు అలసి ఇంకొక అర్ధగంట లో బస్సు దిగాతాననంగా మంచి నిద్ర లోకి ఎలి పోయినా. గబుక్కున మెలకువ వచ్చి చూస్తే నేను దిగాల్సిన స్టాపింగ్ ఆగి ముందుకు వెళ్ళిపోయింది బస్సు. గబగబా లేచి డ్రైవర్ని ఆపమనీ పరిగెత్తుకుంటూ వస్తి . ”ఏమ్మా నిద్ర పోతున్నావా” అనే. అక్కడ మొగం చిన్నబాయ. ఆఫీసువాల్లు చెప్పిన టయానికి నాకు రెండు గంటలు లేటయ్యే.
సరే అని వాళ్లు చెప్పిన రెండు మూడు పనులు చేసేసి నేను నా జతగత్తె వెనకాల కుర్చీలలో కూర్చున్నాము. టిఫిన్ కూడా లేదు. మధ్యాహ్నం వరకు అట్లే ఉండల్ల. సరేలే టీ స్నాక్స్ ఇస్తే అవి తిని ఉందాములే అని టీ స్నాక్స్ ఎప్పుడు ఇస్తారో అని ఎదురు చూస్తున్నాం. ఆ మీటింగ్ దగ్గర మూడు వందల మంది డ్వాక్రా సంగం ఆడోల్లు ఉన్నారు. నామాదిరిగా మారుమూలపల్లెల నుంచి బస్సులుపట్టుకొని పడి లేసి వచ్చినారు. హాలంతా మాటలతో గజిబిజిగా ఉంది.
నా పక్కన ఉన్న నా జతగత్తె తాను ఎన్ని గంటలకు లేసిందో ఎట్ల పడిలేసి వచ్చిందో చెబుతోంది. వేదిక మీద కూర్చునే పెద్దలు కూడా వచ్చేసారు. మా మనసంతా టీ స్నాక్స్ పైనే ఉంది. యాడ కళ్ళు తిరిగి పడిపోతమో అనిపిస్తా ఉంది. బయట పోతే మాపై ఆఫీసర్లు కోప్పడతారు. అట్లే ఉన్నాము. అప్పటికి టైం పన్నెండు అయింది. అప్పుడు టీ స్నాక్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ మూడు వందల మందికి పంచుకుంటూ మా కాడికి వచ్చే లోపల అరగంట పట్టింది. మాకు యాడ లేకుండా పోతాయో అని ప్రాణం లాగతా ఉంది. మా కాడికి వచ్చేసరికి ముందుగా చేతులు పడితిమి. వాల్లు ఇచ్చిరి. ఎన్నో దినాలు చూడక తిండి చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మాకు. యుగానికొక్కడు సినిమాలో వాళ్లు తిండి కోసం ఆరాట పడినట్లు లోలోపల మేము అట్లా ఆరాటపన్నాము. అవి తిన్నాక పానం లేచి వచ్చినట్లయింది అప్పటి నుండి మీటింగ్ మొదలైంది. అవార్డులు,శాలువాలతో సన్మానాలు, మాటలు ప్రారంభమయ్యాయి.
వేదిక మీద ఉన్న పెద్దలంతా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్లు. తొలిత ఒక సారు మహిళా దినోత్సవం గురించి సంఘాల గురించి మాట్లాడుతూ ఆడవాల్లు ఎన్నో సాధించినారు అన్నిట్లో ముందున్నారు కానీ సమాజంలో మగోల్లు మృగాలుగా తయారు కాకుండా చూడాల్సిన బాద్యత సరిదిద్దాల్సిన బాద్యత తల్లిదే అని ముగించాడు. పోలీస్ శాఖ లో ఒక పెద్ద అధికారి మాట్లాడుతూ ఎక్కువ అక్రమ సంబందాలు పెట్టుకొని గొడవలు పడి విడిపోయే కేసులు చాలా వస్తున్నాయి నాకు తెలిసిన ఒక బార్య బర్త ఇద్దరూ చాలా అందంగా ఉంటారు. ఇద్దరూ పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు కానీ ఆ బార్య డ్రైవర్ తో లేచిపోయింది. ఆ డ్రైవర్ని పగలు చూస్తే రాత్రి కలలో వస్తాడు అంత చండాలంగా ఉన్నాడు ఎలా లేచి పోయిందో తెలియదు. అమ్మాయిలు ఫోన్లు ఎక్కువగా వాడుతూ ప్రేమలో పడి మోసపోతున్నారు. ఇంట్లో తల్లి తన ఆడబిడ్డ ప్రవర్తన ఎట్లా ఉంది అని గమనించి వాళ్ళకి బుద్ధి నేర్పించాలి అన్నాడు. ఇంకొక మహిళా కార్యకర్త మాట్లాడుతూ మనము ఈ రోజు ఇక్కడికి వచ్చి మీటింగ్ లో పాల్గొన్నాము అంటే అది మన మగవాళ్ళ సాయంతోనే మనకంటే మన భర్తలు గొప్పవాళ్ళు కాబట్టి మనకు ఉమెన్స్ డే ఉన్నట్లే వాల్లకు కూడా మగవాళ్ల డే ఉండల్ల అని చెప్పి వాల్ల కోసం ఒకసారి చప్పట్లు అని అందరితో చప్పట్లు కొట్టించి ముగించె. ఇంకొక అధికారి సంఘాలకు లోన్లు ఎంతిచ్చాము అని లెక్కలు చెప్పి ఇంట్లో ఆడవాళ్లదే పై చేయి. ఇల్లు సరిదిద్దేది ఆడదే కాబట్టి ఆడవాళ్లు పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నాడు . చివరికి సమావేశం ముగిసింది.
అయితే ఈ మీటింగులో చెప్పిన మాటలు విన్నాక మాకు కడుపులో ఏదో అనిపిచ్చింది. పిల్లలు చెడిపోవడానికి కారణం మనమేనా అంటే ఆ మాటకి నా జతగత్తె ఏమన్నంటే ”బిడ్డలు మన మాట ఇంటారా? వాళ్లకు మూతి కడగను, ముడ్డిగడగను, వొండిపెట్టదానికి తప్పితే అమ్మమాట యాడ ఇంటారు. ఇంక బల్లో ఐవోర్లు అయితే అసలు మంచి చెడ్డ నేర్పించడమే మానేసినారు. మగవానికి మీసకట్టు, ఆడదానికి రొమ్ముకట్టు వస్తే చాలు టీవీలు, యూట్యూబులు చెప్పినట్లు ఇంటారు. సావాసగాళ్ళతో తిరుగుతారు. అబిమాన సినిమాహీరో చేసినట్టు చేస్తారు. ఇందరు నేర్పిస్తా ఉంటే వాళ్లు మన మాట యాడ ఇనేది అనె. అది ఆడ కొలువుదీరిన పెద్దలకు తెల్లేదా? ఏదో మాట్లాడాలని కాకపోతే ” అని ఇద్దరం అనుకుంటిమి.
ఆలోచిస్తున్నట్టే మూడున్నర అయిపోయింది గంట. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. బోజనాల కోసం తోసులాడుకొని తిని బస్సెక్కి ఇల్లు చేరేసరికి రాత్రి పది అయింది గంట. మళ్లీ ఇంట్లో పనులన్నీ నాకోసమే ఎదురు చూస్తున్నాయి!
మహిళ నిజ పరిస్థితి ఏమిటో చెప్పకనే చెప్పారు మొత్తం ఆ రోజుని వివరిస్తూ!