ప్రపంచం ఇప్పుడు ఒక విషమ కాలంలో ఉంది. తీరని దుఃఖాన్ని మూటగట్టుకుంటుంది. దోపిడీలు, అణిచివేతలు, నిర్బంధాలు నిత్యజీవితంలో భాగంగా మారుతున్న పరిస్థితులల్లో కరోనా వచ్చి మరింత విషాదాన్ని నింపుతుంది. ఇది ఎంతటి మానవ నష్టాన్ని కలిగిస్తుందో అంచనాలు వేయడం కూడా కష్టంగా వుంది. ఇటువంటి మహావిపత్తును అర్థం చేసుకోవడానికి మనకు మార్క్స్ ఆలోచనలు ఏ విధంగా ఉపయోగపడుతాయో ఆయన 203వ జయంతి సందర్భంగా పరిశీలిద్దాం.
కరోనా ప్రభావం, దాని మూలంగా జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని మనం తక్షణం జరగవలిసిన వైద్యసేవల గురించి, ప్రభుత్వాలు చేయాల్సిన (చేయలేకపోతున్న) కనీస ఏర్పాట్ల గురించి, వైద్యం పేరిట జరుగుతున్న దోపిడీ గురించి, కనీస ప్రాణవాయువు అందక పోతున్న ప్రాణాల గురించి మాట్లాడడానికే ఎక్కువగా పరిమితమవుతున్నాం. ఎందుకంటే అది తక్షణ అవసరం కాబట్టి. అయితే అదే సందర్భంలో ఆలోచించాల్సింది ఈ స్థితికి ప్రపంచ సమాజం ఎందుకొచ్చిందని. ఇది కేవలం ఒక వైరస్ మూలంగానే జరుగుతుందా? అసలు వైరస్ మానవ సమాజంలోకి ఎందుకొచ్చింది? ఒక వైరస్ మూలంగా వచ్చే విపత్తును నివారించలేని సమాజాలుగా ఎలా రూపంతరం చెందాము. ఈ ప్రశ్నలు వేసుకోకుండా ఎవ్వరిని నిందించినా పెద్దగా ప్రయోజనం వుండదు. ఎందుకంటే కరోనా వైరస్ మొదటిది కాదు, చివరిది అంతకన్నా కాదు. చారిత్రకంగా చూస్తే ఇది కేవలం ఒక ఎపిసోడ్ మాత్రమే.
మార్క్స్ కు కరోనా వైరస్ గురించి తెలిసే అవకాశం లేదు. కాని అది ఏ విధ్వంసకర అభివృద్ది నమూనా మూలంగా మానవ సమాజంలోకి వచ్చిందో ఆ విధ్వంసం గురించి, మనిషికి ప్రకృతికి మధ్య పెరిగిపోతున్న అగాధం గురించి కేవలం ఊహించి చెప్పడం కాకుండా శాస్త్రబద్ద విశ్లేషణ చేశాడు. అయితే మార్క్స్ ను సమగ్రంగా కాకుండా ముక్కలు ముక్కలుగా చదివి అర్థం చేసుకునేవాళ్ళు చేసే అనేక ఆరోపణలలో మరొకటి జత చేరింది. అదేమంటే ఆయన వర్గ సంబంధాలకు ఇచ్చిన ప్రాముఖ్యత సమాజానికి, ప్రకృతికి మధ్య ఉండే సంబంధానికి ఇవ్వలేదని. దాని మూలంగా ఈరోజు మనిషికి, ప్రకృతికి మధ్య జరిగే సంఘర్షణను, దాని ద్వారా జరిగే పర్యవసానాలను అర్థం చేసుకోవడానికి మార్క్స్ పనికిరాడని. ఈ విమర్శను పర్యావరణవాదులు, ప్రకృతివాదులు, కొందరు మార్క్సిస్టులు కూడా చేశారు. అయితే ఈ విమర్శకు కారణం మార్క్స్ ప్రకృతి-సమాజం సంబంధాల సమస్యను గుర్తించకపోవడం వలన వచ్చింది కాదు. దానికి సంబంధించి మార్క్స్ ప్రతిపాదించిన మౌళిక అవగాహనను కొన్ని తరాలపాటు అనేక మార్క్సిస్టు పార్టీలు, ఆలోచనా స్రవంతులు, వ్యక్తులు పెద్దగా విలువ ఇవ్వకపోవడమే. ఆ అవగాహనను సమాజ పరివర్తనా సిద్ధాంతంలో భాగంగా చూడకపోవడమే. ముఖ్యంగా భారతీయ మార్క్సిస్టు మేధో సంప్రదాయంలో దానికి ఇంకా ప్రాముఖ్యత ఇస్తున్న దాఖలాలు కనబడటం లేదు.
అయితే మొత్తంగా మార్క్స్ సమాజం-ప్రకృతి సంబంధాల విషయంలో చేసిన సూత్రీకరణలను వెలికితీయడం గత మూడు దశాబ్దాలుగా పాశ్చాత్య అకడెమిక్ రంగంలో, పర్యావరణ ఉద్యమాలలో జరుగుతుంది. ఈ కృషి “వేదాల్లో అన్నీ వున్నాయహే” అనే మడికట్టు పద్ధతిగా “మార్క్స్ ఎప్పుడో అన్ని విషయాల గురించీ చెప్పేశాడు” అనే విధంగా కాకుండా అతని ఆలోచనలను అప్పటి స్థల, కాల పరిమితులను దృష్టిలో ఉంచుకొని విమర్శనాత్మకంగా పునర్ నిర్మాణం చేస్తున్నారు. అయితే ఇది ఎర్ర మార్క్స్ ను విమర్శల నుండి కాపడటానికి ఆయనకు ఆకుపచ్చ రంగు వేయడానికి చేసే ప్రయత్నం కాదు. లేదా ఆయన ఔచిత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి అంతకన్నా కాదు. ఈ మేధోమధనమంతా ప్రపంచం ఈనాడు ఎదుర్కొంటున్న అనేక పర్యావరణ సమస్యలకు పూర్తి, స్థిరమైన పరిష్కారం చూపించడం కోసం, దాని కోసం రూపొందించుకోవాల్సిన కొత్త ఉద్యమ రూపాలను ప్రతిపాదించడం కోసమే. మార్క్సిస్టు అవగాహన మూలంగానే వాతావరణ మార్పు (climate change) సమస్యను కేవలం వ్యక్తుల నైతిక ప్రవర్తనకు పరిమితం చేయకుండా వ్యవస్థ మార్పుతో (system change) ముడిపెట్టి చూసే ఒక దృష్టికోణం పర్యావరణ ఉద్యమాలలో అభివృద్ది చెందింది. వ్యవస్థ మార్పు అంటే ఏ వ్యవస్థ, ఎందుకు, ఎటువైపుకు, ఎలా మారాలో అనే విషయాలు అత్యంత కీలకమైనవి. ఈ అంశాలను అర్థం చేసుకోవడానికి మార్క్స్ ఎంతగానో ఉపయోగపడుతాడు.
ముందుగా మార్క్స్ సమాజం-ప్రకృతి సంబంధాలను ఎలా చూశాడో తెలిస్తే కాని అతని ఆలోచనలు ప్రస్తుత సంక్షోభాలను అవగాహన చేసుకోవడానికి మనకు ఎలా ఉపయోగపడుతాయో అర్థం కావు. అయితే భూస్వామ్యం నుండి పెట్టుబడిదారి వ్యవస్థలోకి మారే సమాజాలలో జరిగే సామాజిక, ప్రాకృతిక సంబంధాల మార్పును అర్థం చేసుకోవడానికి మార్క్స్ డార్విన్ నుండి ఎంతో స్వీకరించాడు. డార్విన్ రాసిన “The Origin of Species” 1859లో ప్రచురింపబడగానే మార్క్స్, ఎంగిల్స్ ఎంతో ఉత్సాహంగా చదివి అతను చేసింది “యుగాన్ని మార్చే పని” అని కొనియాడారు. అయితే డార్విన్ జీవావరణ వ్యవస్థలో ప్రతిపాదించిన “మనుగడ కోసం పోరాటం” అనే సిద్ధాంతాన్ని మానవ చరిత్ర గతిని అర్థం చేసుకోవడానికి సోషల్ డార్వినిస్టులు చేసిన తప్పుడు ఆలోచనలను మార్క్స్ అప్పుడే ఎండగట్టాడు.
అలాగే జెర్మన్ వ్యవసాయ, రసాయన శాస్త్రవేత్త లైబిగ్ ప్రభావం కూడా మార్క్స్ మీద చాలా వుంది. లైబిగ్ 1842లో ప్రచురించిన “Organic Chemistry and its Applications to Physiology and Pathology” గ్రంధాన్ని ఎంతో నిశితంగా చదువుకున్న మార్క్స్ అందులో అతను ప్రతిపాదించిన జీవక్రియకు సంబంధించిన అంశాలు సమాజానికి, ప్రకృతికి వుండే పేగు బంధాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగ పడుతాయని గ్రహించాడు. జీవక్రియ (metabolism) అంటే ఒక జీవిలో లేదా జీవావరణంలో పదార్థం (matter), శక్తి (energy) కలిగించే ప్రవాహం, దాని మూలంగా ఆ జీవిలో, జీవావరణంలో జరిగే మార్పులను చెప్పే ఒక జీవసంబంధమైన ప్రక్రియ. ఈ భావన ఆధారంగా మార్క్స్ పెట్టుబడిదారీ వ్యవస్థలో మనిషికి, ప్రకృతికి మధ్య ఒక పెద్ద అగాధం ఎలా పెరుగుతుందో వివరించాడు. ముఖ్యంగా పెట్టుబడిదారీ వ్యవసాయ రంగంలో జీవక్రియలో ఏర్పడే చీలిక (metabolic rift) మూలంగా సంభవించే విపత్తుల గురించి వివరించాడు. కేవలం లాభాపేక్షే లక్ష్యంగా వుండే పెట్టుబడిదారీ వ్యవస్థ భూమిని, ప్రకృతిలోని అన్ని వనరులను కొల్లగొట్టడం మూలంగా తిరిగి వాటిని ఒక క్రమబద్దంగా పునరుద్ధరించాల్సిన (systemic restoration) అత్యవసరం పడుతుంది. కాని ఆ పని చేయడానికి కూడా పెట్టుబడి “నాకేంటి లాభం” అనే ఆలోచిస్తుంది. ఇటువంటి స్థితి మొత్తం వ్యవస్థనే ప్రభావితం చేస్తుంది.
పందొమ్మిదవ శతాబ్దపు ఇంగ్లాండ్ లో విచక్షణ లేకుండా భూసారాన్ని కొల్లగొట్టడం మూలంగా ఆ భూములు పంటకు పనికిరాని స్థితితో మొత్తం సమాజం (అతి ముఖ్యంగా అట్టడుగు వర్గాలు) ఆహార భద్రతను కోల్పోయిన ఒక పరిస్థితి వచ్చింది. కోల్పోయిన భూసారాన్ని పునరుద్ధరించడానికి దక్షిణ అమెరికాలోని పెరూ నుండి వేలాది టన్నుల పక్షుల మలాన్ని (guano) తరలించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చారిత్రకంగా అర్థం చేసుకున్న మార్క్స్ తన metabolic rift సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
చారిత్రకంగా చూస్తే మారే సామాజిక సంబంధాల మూలంగా వ్యవసాయం నుండి, గ్రామీణ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున రైతాంగం బయటకు నెట్టబడుతుంది. కాని అలా బయటకు (పట్టణాలకు) నెట్టబడిన రైతాంగాన్ని తన లోనికి తీసుకునే పారిశ్రామిక అభివృద్ది లేదు. వున్నా పెట్టుబడిదారులు అందరికీ అవకాశం ఇవ్వరు. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది నిరుద్యోగులుగా వుంటే అంత చౌకగా శ్రామికులు దొరుకుతారు కాబట్టి. పట్టణాలు, పారిశ్రామిక వాడలు పెరిగి పోవడమంటే అక్కడ కేవలం జనాభా పెరగడం మాత్రమే కాదు. అక్కడ గ్రామాల నుండి తరలిపోయే ఆహార ఉత్పత్తుల వినిమయం పెరగడం, తద్వారా ఉత్పత్తయ్యే వ్యర్థం కూడా అక్కడే పెరగడం. దీనర్థం భూమిలోని సారం ఆహార ఉత్పత్తుల రూపంలో పట్టణాలకు చేరుతుంది కాని పట్టణాలలో పోగయ్యే వ్యర్థం తిరిగి గ్రామాలకు చేరడం లేదు. ఇక్కడ ప్రకృతి విలువ (nature’s value) కేవలం ఒకే మార్గంలో పోతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో భూసారం గ్రామాల నుండి పట్టణాలకు తరలి పోవడాన్ని మార్క్స్ భూసార దొంగతనంగా (robbing of soil fertility) గుర్తిస్తాడు. ఈ దొంగతనం రికవరీ చేయలేని స్థితికి చేరినప్పుడు సారం లేని భూమి తన సహజ గుణాన్ని కోల్పోతుంది. ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోవడం విధ్వంసాలకు, విపత్తులకు మొదటి మెట్టు. ఇది సహజ సిద్ధమైనది కాదు. ఇది పెట్టుబడి బుద్ధిపూర్వకంగా సృష్టించే విధ్వంసం.
ఈ సందర్భంలో సహజంగా వచ్చే ప్రశ్నేమంటే ఉత్పత్తి సాధనాలు ఎంతో అభివృద్ది చెంది, అనేక శాస్త్రీయ ఆవిష్కరణలు జరుగుతున్న ఈ కాలంలో మార్క్స్ ఎప్పుడో చేసిన సూత్రీకరణలకు ఇంకా ప్రాసంగికత ఉన్నదా అని. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అప్పుడు మార్క్స్ చెప్పింది ఇప్పుడు యధాతదంగా జరుగుతుందని కాదు. పెట్టుబడి ఒకవైపు శ్రమ దోపిడీ చేస్తూనే, మరోవైపు వనరుల దోపిడీ చేస్తుంది. ఈ వనరుల దోపిడీ అంటే ప్రకృతికి ఉండే భరించగలిగే శక్తిని (carrying capacity) చాలెంజ్ చేయడం. అలా చాలెంజ్ చేయడం అంటే ప్రకృతి పరిమితులను (nature’s limits) ప్రశ్నార్ధకం చేయడం. అది జరిగినప్పుడు సమాజానికి, ప్రకృతికి మధ్య వుండే సమతుల్యత దెబ్బతింటుంది. అప్పుడు ప్రకృతి “పగ” తీర్చుకునే స్థితి వస్తుంది. (nature’s revenge అనే మాటను ఎంగెల్స్ మెటఫారికల్ గా మాత్రమే వాడాడు తప్ప ప్రకృతిని వ్యక్తీకరించి, భావోద్వేగాలు ఆపాదించి కాదు అనేది గమనించాల్సిన విషయం!). శాస్త్రపరిజ్ఞాణం ప్రకృతిని మరింత హేతుబద్దంగా అర్థం చేసుకుని దాని పరిమితులకు అనుగుణంగా జీవించడానికి ఉపయోగపడాలే తప్ప, దాని మీద అజమాయిషీ చేయడానికి కాదు. ఎంగెల్స్ mastering nature అనే భావనను చెప్పింది కూడా ఇదే ఉద్దేశంతోనే.
అంతేకాదు metabolic rift అనేది ఒక సంఘటన కాదు. అది ఒక చారిత్రక క్రమంగా కొనసాగుతుంది. ఇంకా అనేక రూపాలుగా విస్తరిస్తుంది. అది ప్రాధమిక ఉత్పత్తిదారులను తమ ఉత్పత్తి సాధనాలనుండి దూరం చేస్తుంది. మనిషికి ప్రకృతికి మధ్య దూరం పెంచుతుంది. గ్రామానికి పట్టణానికి, ఉత్పత్తికి వినిమయానికి మధ్య దూరం పెంచుతుంది. సామ్రాజ్యవాద దేశాల స్థితికి, దోపిడీకి గురయ్యే దేశాల స్థితికి మధ్య దూరాన్ని మరింతగా పెంచుతుంది. మార్క్స్ కాలం నుండి ఇప్పటి వరకు దీనికంతటికి ముఖ్య కారణం: అంతులేని సంపదను పోగుచేసుకునే (endless accumulation of capital) ఒక రాజకీయార్ధిక ప్రక్రియ. ఇది ప్రతి దానిని (ప్రకృతితో సహా) సరుకుగా మార్చడం ద్వారా, సమాజ సంపదను వ్యక్తి ఆస్తిగా గుర్తించడం ద్వారా, దానికి చట్టబద్ద రక్షణ కల్పించడం ద్వారా, అనేక రకాల పరాయీకరణలను అమలులోకి తీసుకొని రావడం ద్వారా, దోపిడీ అణివేతలతో సమాజంలో అసమానతలను కొనసాగించడం ద్వారా, మొత్తంగా దోపిడీ వర్గాలు అన్ని వ్యవస్థలను తమ ఆధీనం లోకి తీసుకోవడం మూలంగా సాధ్యమవుతుంది. వీటన్నింటినీ రద్దు చేయగలిగే రాజకీయార్ధిక వ్యవస్థలు వస్తే కాని ప్రకృతి-సమాజ అసమతుల్యం మూలంగా వచ్చే సమస్యలకు పరిష్కారం దొరకదు.
మార్క్స్ దృష్టిలో ప్రకృతి మనిషికి లభించిన ఒక బహుమతి కాదు. ఎందుకంటే బహుమతిగా భావిస్తే ప్రకృతి విలువను ఉత్పత్తిలో భాగంగా చూడలేము. అంతేకాదు బహుమతిని ఇష్టానుసారంగా వాడుకునే ఒక స్థితిలోకి నెట్టబడుతాము. అందుకే మార్క్స్ ప్రకృతిని మనిషియొక్క జీవం లేని దేహంగా (“Nature is man’s inorganic body”) అభివర్ణిస్తాడు. దీనర్ధం మనిషి ప్రకృతిలో భాగం; ప్రకృతి మనిషిలో భాగం. ఆ మనిషి జీవంతో వుండాలంటే ప్రకృతితో నిరంతర జీవక్రియా సంబంధాన్ని కొనసాగించాలి. మనిషి మారుతున్న ప్రకృతికి అనుగుణంగా తన జీవన విధానాన్ని మార్చుకోవాలి. అంతేకాని సొంత లాభాల కోసం , పెట్టుబడి అభివృద్ధి కోసం జీవావరణ విధ్వంసం చేస్తూ కాదు. అలా చేయడం మూలంగానే సగటున ప్రతి పది సంవత్సరాలకు ఒక విపత్తును (epidemic) ప్రపంచం ఎదుర్కొంటుంది. ఇప్పుడు దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఒక మహా విపత్తును (pandemic) ఎదుర్కొంటున్నాము.
ఈ విపత్తులను పరిశోధించే శాస్త్రవేత్తలు చాలా స్పష్టంగా చెబుతున్నారు జంతువులలో వుండే వైరస్ లు మనుషుల్లోకి రావడానికి కారణం అధిక లాభాల కోసం పారిశ్రామిక పద్ధతులలో జంతువులను పెంచడం, జంతువుల సహజ ఆవాసాలను నాశనం చేయడం. అలా చేయడం మూలంగా జంతువులలో రోగనిరోధక శక్తి తగ్గి వైరస్ బారిన పడటం, తద్వారా అది మనుషులకు సోకడం జరుగుతుంది. ఇది చాలా సులభంగా అర్థమయ్యే విషయమే అయినప్పటికీ పెట్టుబడిదారులు కాని, వాళ్ళకు కాపలా కాసే పాలక వర్గాలు కాని ఆ చైన్ ప్రక్రియను ధ్వంసం చేసే పనిచేయరు. ఎందుకంటే వాళ్ళకు ప్రజల ప్రాణాలకన్నా తమ స్వంత లాభాలు ముఖ్యం.
నిజమే కరోనా పాండెమిక్ కేవలం మనిషి-ప్రకృతి సమస్య మాత్రమే కాదు. ఇది ఆరోగ్య భద్రత సమస్య. స్వేచ్ఛగా జీవించే హక్కు సమస్య. కాని వాటిని అమలుచేసే వ్యవస్థలు ఎక్కడున్నవి? అన్నీ పెట్టుబడి పాదసేవలో వున్నయి. వ్యవస్థ మార్పు కోరే ప్రజా రాజకీయాలు మాత్రమే ప్రజలకున్న చివరి ఆయుధం. ప్రతి సమస్యను హేతుబద్దంగా, శాస్త్రీయంగా విశ్లేషించి ఆ సమస్యలకు రాజకీయ పరిష్కారాన్ని చూపగలిగే ఒకే ఒక్క సిద్ధాంతం మార్క్సిజం. అది తనను తాను విమర్శించుకుంటూ, స్థల కాలాలకు సరిపడేలా సాన పెట్టుకుంటూ నిత్య చలనంలో ఉండటం దాని ప్రత్యేకత. అటువంటి సిద్ధాంతాన్ని మానవాళికి అందించిన మార్క్స్ కు జోహార్లు!
(‘జాతీయ స్ఫూర్తి’ మాసపత్రిక మే 2021 సంచికలో ప్రచురితం)
Metabolic Rift, Robbing of Soil Fertility భావనలను మార్క్స్ ఎక్కడ ఏమని చెప్పిడో రెఫరెన్స్ , కొటేషన్ ఇవ్వండి. (ఇలాంటి వాటిలో ప్రతిసారీ రెఫరెన్సు ఇవ్వడం మంచిది అనుకుంటాను)