ఇవ్వాళ
చందమామ మాయే
తుంపరగా కురుస్తున్న వెన్నెల
చితులపై గెంతుతూ,
మలమల మాడిన శవాల
వేడి వేడి బూడిదను ఎగజల్లుతున్నట్లే
పచ్చటి పంటలకు వాగ్దానమిచ్చే
నదీమతల్లి వొడిలోకి
దిక్కు నోచని మృతదేహాల్ని విసిరేస్తే,
పదహారు కళల
పున్నమి పొలమారుతున్నట్లే
చందమామ అబ్బురానికి ఛాతీ పొంగిన ఆకాశమూ మాయే
ఎడబాసే బిడ్డల ఏడుపులో
పడావు పడ్డ భూమిని
ఉత్త చేతుల్జాపి, ఊకుంచుతున్నట్లే
గుడ్డి భజంత్రీల చుక్కలతో కొలువు దీరి,
మహాద్భుతాల మహత్యాలకు
భోషాణాలు తెరుస్తున్నట్లే
కాపలా జన్మహక్కైన రాత్రీ మాయే
ఏ సందులోనో తెలువకుండా దూరి,
పంచప్రాణాలను నమిలే క్రిమినీ తరుముతున్నట్లే
‘కనిపించని వేషంలో తిరుగుతుందని’ ఆరోపించినట్లే
నిదుర కళ్లమీద
రేపటి భయాల గుడ్లగూబలు
తచ్చాడుతుంటే, మంత్రోపదేశం
చేస్తున్నట్లే
వగలమారి వాయు వీచికా మాయే
ఊపిరి, సిలిండరయి అమ్మకాలలో తరలిపోతుంటే
గిజగిజలాడే నవనీత హృదయాలకు
నేనున్నానంటూ పరిగెత్తుకొని వస్తున్నట్లే
మనిషినీ,మాలిన్యం కాని మనసునీ-,
పొరలు, పొరపొచ్చాలు లేని,
జగమంత పొద్దునీ-,
తట్టి, లేపుతున్నట్లే
మన చేతా, మన కొరకూ
మన నెత్తిన ఊరేగే
‘సర్వసత్తాక హుకుంలు’
మాయపొరలతో కప్పబడి వున్నట్లే
ఇంకా మాయలున్నయి!