పాలబుగ్గల జీతగాళ్లే కండ్లల్ల మెదులుతుంటరు

ఆమె ‘మాభూమి సంధ్యక్క’గా తెలుసు. మొదటి తరం జననాట్యమండలి సభ్యురాలిగ కూడ తెలుసు. అనేక సభల్లో ఆమె పాట స్వయంగా విన్న. ఇక యూట్యూబ్ వచ్చిన తర్వాత ఆమె పాడిన ఎన్నో పాటలు చాలా సార్లు చూసిన, విన్న. కాని ప్రత్యక్ష పరిచయం ఎప్పుడూ లేదు. కలిసే అవకాశం కూడా దొరకలేదు. అక్క కూతురు చైతన్యతో కలిసిన స్నేహం మూలంగ ఈ సారి వాళ్ళు అమెరికా రాగానే ఫోన్ లో మాట్లాడి, ఎలాగైనా వెళ్ళి కలవాలని అనుకున్న. అలాగే వెళ్ళి కలవడమే కాదు, రెండు రోజులు వాళ్ళ దగ్గరే వుండి ఎన్నో మాటలు, పాటలతో ఎంతో ఉద్వేగంగ గడిపినం. ‘మనోళ్లు’ అనుకోగానే ఇంత ప్రేమతో మాట్లాడే మనుషులు ఎందుకు కరువవుతుండ్రు అనిపించింది. ఆ రెండు రోజుల్లో అక్క, తన సహచరుడు (లక్ష్మయ్య) తమ ఉద్యమ తొలినాళ్ళ ముచ్చట్లు ఎన్నో చెప్పిండ్రు. వాళ్ళ గుండె లోతుల్లోంచి వస్తున్న మాటలు అబ్బురపరిచినవి. వాళ్ళ జీవితానుభావాల లోతుల్లోకి పోయి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అనిపించింది. ‘కొలిమి’ కోసం ఇంటర్యూ చేద్దామనుకున్న. అయితే ఒక సామాజిక శాస్త్ర విద్యార్థిగా ఈ ముచ్చటకు వున్న సామాజిక ప్రయోజనం ఏంటి అని నాకు నేనుగా ప్రశ్నించుకున్న. ఈ ముచ్చట ద్వారా కేవలం అక్క జీవిత, ఉద్యమ ప్రయాణం లోతుపాతులను మాత్రమే కాదు, ఆ తరాన్ని విప్లవ పథంలో నడిపించిన చారిత్రిక పరిస్థితుల గురించి కూడా అర్థం చేసుకోవచ్చు అనిపించింది.

నడుస్తున్న చారిత్రిక క్రమంలో ఒక తరం మరో తరాన్ని నిరంతరంగా అంచనా వేస్తూనే వుంటుంది. ఆ అంచనా తరాల మధ్య వుండే పోలికల గురించి, పెరుగుతున్న అంతరాల గురించి. పోలికల గురించి అంచనా వేయడం తేలికైన పనే. కాని అంతరాల లోతు పట్టుకోవడమే కష్టం. అయితే అంతరాల గురించి మాట్లాడుకోవడమంటే కేవలం మారిన భౌతిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల గురించి మాత్రమే కాదు. ఆయా తరాలు చేసే ఊహల గురించి, వాటిని నిజ జీవితంలో అనుభవంలోకి తీసుకు రావడానికి వ్యక్తులుగానో, సమూహంగానో చేసే వివిధ ప్రయత్నాల గురించి తెలుసుకోవడం కూడా. అయితే వ్యక్తుల సామాజిక ఊహలను (sociological imagination) అర్థం చేసుకోవడమంటే ప్రముఖ సామాజిక శాత్రవేత్త C Wright Mills అన్నట్లు వ్యక్తుల వ్యక్తిగత జీవితాన్ని (biography) తాము గడిపిన చారిత్రిక సందర్భంలో (history) ఉంచి వాటి మధ్య ఉండే పరస్పర సామాజిక సంబంధం గురించి లోతుగా ఆలోచించడం. ఒకే చారిత్రిక సందర్భంలో జీవించినప్పటికీ చరిత్ర అందరి వ్యక్తుల మీద ఒకే రకమైన ప్రభావాన్ని చూపదు. ఎందుకంటే ఆయా వ్యక్తుల జీవిత అనుభవాలబట్టి, సామాజిక పరిస్థితులను బట్టి చరిత్ర అర్థమవుతుంది. దానిలో భాగం కావడానికో లేక దాని గతిని మార్చడానికో అవకాశం వస్తుంది. అలాంటి చారిత్రిక అవకాశాలను అందిపుచ్చుకోవడం వ్యక్తుల స్పృహ మీద, నిబద్ధత మీద ఆధారపడి వుంటుంది.

అయితే ఏ ఒక్కరూ ఏ తరానికీ ప్రతినిధులు కారు, కాలేరు. ఒకవేళ ఎవరైనా అలా పొరబడితే, అది ఒక చారిత్రక తప్పిదమే అవుతుంది. కాకపోతే ఒక తరానికి వుండే కొన్ని విలువలను వ్యక్తులుగా తమ చైతన్యం మేరకు ప్రతిబింబించే అవకాశం వుంటుంది. అందుకే ఆ వ్యక్తులను వారి తరానికి సంబంధించిన స్థలకాలాల్లో నిలిపి వారి జీవితాల లోతులను తడిమిచూడాలి. ఆ వ్యక్తుల జీవితాలు, విలువలు ఏ విధంగా మలచబడినవో చూడాలి. ముఖ్యంగా ముల్లదారైన విప్లవమార్గాన్ని(చాలా విశాల అర్థంలోనే) ఎంచుకున్నప్పుడు అనుభవంలోకి వచ్చే చైతన్యం, సంఘర్షణలు, పరివర్తనలు, కష్టనష్టాలను అర్థం చేసుకోవాలి. తమ వ్యక్తిగత అస్తిత్వాలను రద్దు చేసుకోని లేదా వాటిని దాటి ఒక సమున్నతమైన నూతన మానవ ఆవిష్కరణ దిశగా అడుగులు వేసిన తరం మనుషుల అంతరంగం తడిని తాకి చూడాలి. జననాట్యమండలి సంధ్యక్కను మొదటిసారిగా కలిసినప్పుడు నా తరం నుండి ఆమె తరాన్ని అర్థం చేసుకుంటూ ముందు తరానికి ఏమైనా చెప్పగలమా అనే ఒక ఆలోచనతో అక్కతో ముచ్చట మొదలు పెట్టిన.

అక్కా! మీరు, మీ సహచరులు ఎందరో వివిధ సామాజిక స్థితిగతుల నుండి వచ్చి వాటినన్నింటిని అధిగమించి గొప్ప విప్లవ కలను కన్నారు. గొప్ప పరివర్తన కోసం పరితపించారు. ఆ కల నెరవేరిందా, ఆ పరివర్తన జరిగిందా అనేది విప్లవోద్యమాన్ని సుదీర్ఘ సమాజ పరిణామ క్రమం దృష్టితో చూస్తే కాని అర్థం కాదు. అయితే నాలాంటి వాళ్ళకు ఆ రాజకీయ మార్గం అర్థమయ్యింది కాని ఆ మార్గంలో నడిచే సోయిని, శక్తిని మీకు ఎవరిచ్చారు, ఎలా వచ్చింది అనే విషయాన్ని తెలుసుకోవాలనే ఒక కుతూహలం ఉంది. ఆ విషయాలు చెప్పండి’ అని అడిగిన.

తమ్మీ! మాది అప్పటి వరంగల్ జిల్లా. దేవురుప్పల మా ఊరు. మేము ఇద్దరం అక్కచెల్లెండ్లం, ఇద్దరం అన్నదమ్ముల్లం. మాకు భూములు ఏమి లేవు. ఉన్నదల్లా రెండు అర్రల ఇల్లు. దాన్ని కూడ మా నాయన అమ్మేసి ఏటూరునాగారం దగ్గరున్న పందిపంపులకు వ్యవసాయం చేయడానికి పోయిండ్రు. నన్ను జనగాంల అనాధ పిల్లలు ఉండే హాస్టల్ల చేర్చి పోయిండ్రు. అప్పుడు నేను నాలుగో తరగతిల ఉన్న. వాళ్ళు ఎక్కడ పోయింది, ఎట్ల బతికింది నాకేమి పెద్దగ తెల్వదు. కాని, నేను ఎనిమిదో తరగతిల వున్నప్పుడు మల్లా దేవురుప్పుల వచ్చిండ్రు. కాని అప్పుడు వుండనీకి ఇల్లు లేదు. మా అమ్మ చెల్లెలు (పెద్దమ్మ బిడ్డ) వాళ్ళ పశువుల కొట్టంల ఒక పక్కకు పాక ఏసుకోని ఉండనిచ్చింది. ఇక అమ్మ రోజు తెచ్చే కూలితోనే మా కడుపులు నిండేవి. మా అన్న, తమ్ముని కూడ మూడు, నాలుగు చదివే సరికే వాళ్ళ చదువు ఆపి ఒక పటేల్ దగ్గర జీతానికి పెట్టిండ్రు. తప్పని పరిస్థితి. అమ్మ ఒక్కదాని కూలితోటి ఇల్లు ఎల్లకపోయేది. నాయనేమో తాళ్ళెక్కుతుండె (గీతా కార్మికుడు). కాని కల్లు ఎప్పుడు పారదు కదా. దానికి సీజన్ వుంటది. మా దగ్గర కల్లు కానప్పుడు వాళ్ళ అమ్మగారి ఊరు కొండూరు అని వున్నది, అక్కడినుండి అంచె కల్లు తీసుకొచ్చి మా ఊర్లో అమ్ముతుండె. దానితోనే కుటుంబాన్ని పోషించేది. అమ్మ కష్టమే ఎక్కువ. అన్న, తమ్మునికి ఎంతిస్తరు అప్పుడు జీతాలు. వాళ్ళ జీతం పది రోజులు కూడ రాకపోయేది మాకు గాసం. అట్లా అమ్మ జొన్న కంకి ఏరబోయి పచ్చిజొన్నలు కొట్టి గట్క పోసేది ఆ రాత్రి. పెసరు చేను ఏరబోయి వచ్చి పెసర్లు ఉడకబెట్టి గుడాలు పెట్టేది. ఇట్ల ఏ పూటది ఆ పూటకే. నిలువ అనేది ఉండేది కాదు ఇంట్ల. కూలికి పొయ్యొచ్చి అప్పుడు చేస్తె ఆ పూటకి తిండి. అమ్మ ఇల్లిల్లు తిరిగి కొంగుబట్టి అడుక్కొచ్చి వండితె తింటోళ్ళం. మేం అందరం తింటె ఇంత మిగిలితె తినేది, లేకుంటె లేదు. కడుపుకట్టుకోని బతికేది అమ్మ. అటువంటి కుటుంబ నేపధ్యం నుండి వచ్చిన. అన్నం కోసం ఎదురుచూసుకుంటు ఆకలితోని బతికినం. అందుకే ఎవ్వరిని ఆకలికి ఉంచలేను నేను.

అలాంటి పరిస్థితుల్లో నన్ను అనాధ శరణాలయంలో వేసిండ్రు. నాతో పాటుగ మా ఊరి నుండి ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండిరి. అందులో ఒక పిల్లనేమొ ఒక్కతె బిడ్డ అయితే హాస్టల్ల పెట్టినందుకు అందరు తిడుతుండ్రని తీసుకోని పోయిండ్రు. ఇంకో అమ్మాయి మా ఊరిలో రాజారాం అని గొప్ప బుర్రకథా కళాకారుడు (తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నడు) ఉండేది, ఆయన బిడ్డ. ఆయన మా నాయనకు మంచి దోస్తు. ఆయన కూడ బిడ్డను తీసుకుపోతె, మా నాయన వచ్చి ‘నువ్వు కూడ రా బిడ్డ, ఒక్కదానివి ఉంటె గుండె పగుల్తవ్. ఏదో ఉన్నదో లేందో తిని మాతోనే వుందువ్ రా’ అని అన్నడు. ‘లేదు నాయన నాకు ఇక్కడ బాగనే వుంది. నీను ఈడనే వుంట’ అని చెప్పిన. ఎందుకంటే నాకు తెలుసు ఇంట్ల పరిస్థితి. పూటపూటకు ఇబ్బందులేనాయె. అందుకే ‘వాళ్ళు లేకున్నా, వేరే దోస్తులు ఉన్నరు. నీను బాగనే ఉంట’ అని చెప్పి అక్కడే వున్న. పదో తరగతి వరకు హాస్టల్లనే వున్న. ఎప్పుడన్న రెండు రోజులు చుట్టమోలె ఇంటికి వచ్చి పోయే దాన్ని.

అయితె మా నాయన తెలంగాణ సాయుధ పోరాటంల కాసాని నారాయణ వంటి నాయకులతోని కలిసి పనిచేసిండు. వాళ్ళిద్దరు మంచి దోస్తులు. ఇద్దరు కలిసి మేకలు, గొర్రెలు కాసిండ్రు చిన్నప్పుడు. సాయుధ పోరాటంల కూడ కలిసి పనిచేసిండ్రు. నాయన ఐదేండ్లు జైళ్ళ వున్నడు. ఆయనకు మంచి రాజకీయ జ్ఞానం వున్నది. కాకుంటె పిల్లల పట్ల అంత శ్రద్ధ వహించలే. తనకు తెలుసు చదువుకుంటె జ్ఞానవంతులవుతరు, మంచి భవిష్యత్తు వుంటది అని. ఆయన తరువాతి తరం ఆయనకంటె మెరుగ్గ వుండాలి కదా. కాని మా అన్న, తమ్మునికి మా నాయనకు ఉన్నంత తెల్వి కూడ లేదు. ఎందుకంటె వాళ్ళకు చదువులేదు. ఎంతకాలం జీతాలు ఉండడం, బావుల దగ్గర వుండడమే అయ్యింది. దానితోని ఎప్పుడు మా నాయనకు భయపడే పరిస్థితే. ఎందుకంటె ఈయన జైళ్ళ తెలుగు, ఉర్దూ నేర్చుకోని ప్రపంచ రాజకీయాలు మాట్లాడెటోడు. జైళ్ళ నుండి బయటికి వచ్చినంక మా పెదనాయనకు కూడ చదువు చెప్పిండంట. అప్పటినుండి మా పెదనాయన రామాయణం, భారతం చదివి అందరికి చెప్తుండె. కాని తన పిల్లల విషయంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం చేసిండు.

ఇటువంటి కుటుంబ పరిస్థితి. అయితె మేము పిల్లలం కూర్చున్నప్పుడు వాళ్ళు చేసిన పోరాటాల గురించి నాయన చెప్తుండె. పేదవాళ్ళ కోసం ఏమి పనులు చేసిండ్రు, ఎలాంటి రాజకీయ చర్యలల్ల పాల్గొన్నడో చెప్తుండె. నాకు మంచిగనిపిస్తుండె. చిన్న చిన్న ప్రశ్నలు వేస్తుంటి. నాయనేమో ‘పెద్దగ మాట్లాడకండి బిడ్డ. వాళ్ళు వీళ్లు వింటరు’ అనెటోడు. అదేదో రహస్యం మాట్లాడుతున్నట్లు! మా అమ్మ కూడ దళాలకు సద్దులు మోసుకపోయేదంట. అమ్మ కూడ చెప్పేది. అయితె అట్లా వినేటప్పుడే కొంత కొంత అర్థం అవుతుండె. సమాజంలో పేద, ధనిక స్థాయిలుంటవి. అవి పోవాలంటె పోరాటం చేయాలని. ఆ మాటలు నాకు బాగా నచ్చేది. ఎందుకంటె మాది పూరాగ హీన స్థితి కదా ఇంట్ల. పోరాటం చేస్తె ఉన్నోళ్ళు, లేనోళ్ళు అనే తేడాలు పోతయనేది బాగా నచ్చింది.

ఇంట్ల పూజలు చేసుడు, పండుగలు చేసుకునుడు కూడా లేదు. ఇగ బట్టలు అయితె పురాగ చినిగిపోయినప్పుడే ఒక జత కుట్టిద్దురు. ఒక రోజు టెంత్ అయిపోయింది, దసరా పండుగ. కొత్త బట్టలు లేవు కదా, బయటికి వెళ్ళకుండా దర్వాజ కాడ ఉట్టిగ నిలబడ్డ. నిలబడితె మా నాయన వుండి ‘నువ్వు ఎందుకు పోతలేవో నాకు తెలుసు. నీకు కొత్త బట్టలు లేవని బయటకు పోతలేవు. కాని నీకు ఈ మాత్రమన్న వున్నవి. నీకంటే ఆయింత లేనోళ్లని చూసి సంతోషపడు, నాకు ఈ మాత్రమన్న వున్నయనుకోని’ అని అన్నడు. అవును నిజమే కదా అనిపించి దబదబ తయారయి వెళ్ళిపోయిన. ఇట్ల మా నాయన కొన్ని ఆలోచింపచేసె మాటలు మాట్లాడెటోడు. మంచి తెల్వికల్లోడు.

స్కూల్ల నేను బాగా ఆక్టివ్ గ వుండేదాన్ని. ఆటలు ఆడటం, డాన్స్ చేసుట్ల బాగా ఆక్టివ్ గ ఉండేదాన్ని. ఫలానా ‘చిలకమ్మ’ అంటే అందరికి తెలిసేది. నాకు అమ్మ నాయన పెట్టిన పేరు చిలకమ్మ. రిజిస్టర్ లో కూడా అదే వుంటది. తర్వాత ఆ పేరును మా టీచర్ ‘సంధ్య’ అని మార్చింది. నేను ఆరవ తరగతిల వున్నప్పుడు వచ్చిన లక్ష్మి వాసన్ మేడం హాస్టల్ల ఉన్న మా అరవై మంది పేర్లు మార్చింది. మా సొంత పేర్లు పిలుచుకుంటె మోకాళ్ళ మీద నిలబెట్టిస్తుండె. ఆమె ఏ హాస్టలుకు పోయినా ఆ అరవై పేర్లే పిల్లలకు పెడుతదంట. ఆమెకి అది అలవాటు. ఆ అరవై పేర్ల మీద ఒక పాట కూడ ఉన్నది. ఆ పాటకు మాకు డాన్స్ కూడ నేర్పిచ్చింది. అట్ల ఆమె పెట్టిన పేరే ‘సంధ్య.’

నేను కల్చరల్ గ బాగా ఆక్టివ్ గ వుండటం చూసి మా టీచర్ కూడా బయటి నుండి యాదగిరి అనే ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల పనిచేస్తున్న మంచి కళాకారున్ని తీసుకొచ్చి ఇంకా పాటలు, ఆటలు నేర్పించడం చేసేది. ఎనిమిదో తరగతిల జాషువ బుర్రకథ కూడ నేర్పించింది. నాది పదో తరగతి అయిపోయినంక కమ్యూనిస్టు పార్టీ తరుపున ఎన్నికల ప్రచారానికి నన్ను తీసుకోని పోయిండ్రు. అప్పుడే నేను సుద్దాలకు పోతె సుద్దాల హనుమంతు ఇంటికి పోయినం. అప్పుడే ‘పల్లెటూరి పిల్లగాడ’ పాట సుద్దాల అశోక్ పాడంగ విన్న వాళ్ల ఇంట్లో. ఆ పాట వింటె చాలా బాగనిపించింది. వెంటనే రాసుకున్న. రాసుకోని నేర్చుకున్న అప్పడిదప్పుడె. నేర్చుకోని పాడి వినిపించిన. ‘బాగ పాడుతున్నవమ్మ’ అన్నడు హనుమంతు. ఇగ అప్పటి నుండి పాడుతున్న ఆ పాట.

ఆ యాదగిరి ఈయనకు (లక్ష్మయ్య) బాగ పరిచయం. మా నాయనకు కూడా సాయుధ పోరాట కాలం నుండి బాగ తెలుసు. ఆయనే ఈయనకు ‘సంధ్యను పెండ్లి చేసుకో. వాళ్ళ నాయనవి కూడ కమ్యూనిస్టు భావాలే. వాళ్ళు కట్నాలు ఏమి ఇచ్చుకోలేరు’ అని చెప్పిండు. ఈయనను ఒప్పిచ్చిండు, మా నాయనకు కూడ చెప్పిండు. ఆయనే నన్ను ఒకసారి హైద్రాబాద్ లో జరుగుతున్న యువజనోత్సవాలకు పాటలు పాడటానికి తీసుకుపోయిండు. అక్కడ లక్ష్మయ్య వాళ్ళ రూం లోనే వుండి ఆ కార్యక్రమంలో పాల్గొన్న. అక్కడ పాటల పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. రూం లకు వచ్చినంక లక్ష్మయ్య, ఆయన దోస్తులు పాడమంటె మళ్ళీ ఆ పాట పాడిన. ‘అరే బాగ పాడుతుందిర, మన జననాట్యమండలికి పనికొస్తది ‘ అని అనుకున్నరు. అప్పటికే జననాట్యమండలి ఏర్పడి వాళ్ళు ఆ కార్యక్రమాలకు పోయి వస్తుండ్రు. లక్ష్మయ్య దోస్తులు కూడా ‘సంధ్య బాగా ఆక్టివ్ గ వుంది. పెండ్లి చేసుకో’ అని బాగ ఎంకరేజ్ చేసిండ్రంట.

అప్పటి నుండి నా అడ్రస్ తీసుకోని లక్ష్మయ్య లెటర్స్ రాసేది. ఒకసారి ‘అమ్మ ‘ నవల తెచ్చి ఇచ్చిండు. అట్లనే ఒక పత్రిక తెచ్చిండు అందులో జార్జ్ రెడ్డిని చంపింది వున్నది. నాకు తెలిసి తెలియని వయస్సు కదా అవన్ని చదువుతుంటె కొత్తగ అనిపించబట్టింది. ‘అమ్మ ‘ చదివినంక ‘ఓహో అందరం కూడివుంటె ఇంత బాగుంటది కదా’ అనిపించింది.

ఒక రోజు (మే 18, 1974) నేను మా ఇంటి ముందల చెట్టుకింద ఉన్న నులక మంచం మీద కొంగు మొఖం మీద కప్పుకోని పడుకోని వున్న. లక్ష్మయ్య, ఆయన దోస్తు ప్రతాపన్న ఇద్దరు వచ్చిండ్రు. ఆ రాత్రి అక్కడే వుండి, తెల్లారి నన్ను తీసుకోని లక్ష్మయ్య వాళ్ళ పక్క ఊరు వెల్దండల జరిగే మీటింగ్ కు పోదామనే ప్లాన్ తోని వచ్చిండ్రు. ప్లాన్ ప్రకారమే పొద్దున్నే లేసి పోతుంటె, మేము జనగాం పోయేసరికి ఆ సభకు వక్తలుగా రావాల్సిన చెరబండరాజు, వరవరరావు సారును ముందే అరెస్ట్ చేసిండ్రు అని తెలిసింది. వాళ్ళు రాలేదు కాని సభ జరిగింది. వెల్దండల మే 19న నాది జననాట్యమండలి మొదటి ప్రోగ్రాం. అప్పటికి నాకు ఆ కల్చరల్ ట్రూప్ గురించి పెద్దగ తెల్వది. నర్సింగన్న, భూపాల్ కలిసి ఒక ట్రూప్ గ హైద్రాబాద్ నుండి వచ్చిండ్రు. వాళ్ళు ఒకటి రెండు పాటలు పాడినంక నేను ‘పల్లెటూరి పిల్లగాడ ‘ పాట పాడిన, తర్వాత ‘ఎరుపంటే కొందరికి భయం, భయం’ పాడిన. అందరికి బాగ నచ్చింది.

‘బాగ పాడుతుంది, ఎవరు ఈ అమ్మాయని?’ నర్సింగన్న అడిగి తెలుసుకోని, మన జననాట్యమండలి ట్రూప్ లో చేర్చుదాం అని లక్ష్మయ్య తోటి అన్నడంట. ‘సరే వాళ్ళ నాయనతోటి మాట్లాడి చెప్త,’ అని ఈయన చెప్పిండంట. అయితే మా నాయనకు కూడ ఈ రాజకీయాల మీద ఇష్టం వుంది కాబట్టి ఆయనే తర్వాత నన్ను తీసుకోని పోయి లక్ష్మయ్యకు అప్పజెప్పిపోయిండు. అప్పుడు నర్సింగన్నది “ఆర్ట్ లవర్స్” వుండె. అక్కడ నన్ను ఒక నెల రోజులు వుంచిండ్రు. కొన్ని పాటలు, డాన్స్ స్టెప్స్ నేర్పిచ్చిండ్రు. అక్కడ వున్నప్పుడే గద్దరన్న, వాళ్ళంత మాకు పెండ్లి చేయడానికి ఒక డేట్ నిర్ణయించిండ్రు.

జననాట్యమండలి మేము అమ్మాయి తరుపోల్లమని గద్దరన్నే నాకు చీర కొనుక్కోమని 40 రూపాయలు ఇచ్చిండు. అంబర్‌పేటల జె.ఎన్.ఎం వాళ్ళు, లాయర్ పత్తిపాటి వెంకటేశ్వర్లు అందరు కలిసి అగస్టు 11, 1974 న పెళ్ళి చేసిండ్రు. ఇగ అప్పటి నుండి తీరిక లేకుండ ప్రోగ్రాంలు ఇచ్చినం. గద్దరన్న రహస్య జీవితంలోకి పోకముందే అప్పటికే స్టేజీల మీద పాడడం మానేసిండు. ఎక్కువ ఎక్స్‌పోజ్ కావద్దని. అన్న రాత్రి వచ్చి నాకు పాట నేర్పేది, పొద్దున్నే నీను స్టేజ్ మీద పాడేది. రోజు ఇట్లనే పోతుంటె లక్ష్మయ్య ‘నాకు పెండ్లి చేసి, నా పెండ్లాన్ని ఒక్క పూట కూడ ఇంటికాడ వుంచరు’ అంటె, ‘ఏం బావా, సంధ్య నీ ఒక్కని సంధ్య కాదు. ఆమె జనం సంధ్య’ అని గద్దరన్న నవ్వుకుంట అంటోడు. అట్లా ఎమర్జెన్సీ దాకా నాకు ఒక్క రోజు కూడా తీరిక వుండేది కాదు. జె.ఎన్.ఎం ప్రచారం విపరీతంగ జరుగుతుండె. దానితోటి అప్పటి వరకు విప్లవకారులు “దుర్మార్గులు” అని అయిన ప్రచారం స్థానంలో వాళ్ళు ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధమైనోళ్ళు, వాళ్ళు మనోళ్లు అనే వరకు వచ్చింది.

1975 ల గుంటూర్ లో పాటలు పాడితె మమ్ముల అరెస్ట్ చేసిండ్రు. దెబ్బలు తిన్నం. అప్పుడు ‘పోలీసోని పాట’ గద్దరన్న రాసిండు, నేను పాడేది. ఆ పాట ఎక్కడ పాడినా జనం ఉర్రూతలూగేది. మళ్ళీ మళ్ళీ పాడించుకునేది. పాడుతుంటె జనాలు ఒక్కసారిగ వంతపాడేది. ఆ పాట:

ఓరోరి అమీనోడ
ఓరోరి సర్కిలోడ
పదిలంగా ఉండు కొడుకో
కదిలింది ఎర్ర దండు
పదిలంగా ఉండు కొడుకో
కదిలింది కూలి దండు
దొంగల్ల దొంగ ఓరి
లంగల్ల లంగ ఓరి
మా పోరుకడ్డమొస్తే
కడుతాము నీకు గోరి

ఈ పాట ‘బండెనుక బండి కట్టి’ బాణీలో పాడేదాన్ని. అది పోలీసోల్లకు వ్యతిరేకంగ వుండే సరికి ప్రజలకు చాలా బాగ నచ్చేది. ఆ పాట మొత్తం బాగుంటది, కాని ఒక్క చరణం లో మాత్రం బూతు పదాలు ఉన్నవి. దానితోటి తర్వాత ఆ పాట పాడటం మానేసినం. అయితే అప్పుడు అట్ల పాడొద్దు అనే స్పృహ కూడా లేకుండె. తర్వాత రంగనాయకమ్మ లాంటి వాళ్ళు గట్టి విమర్శ చేసిండ్రు. దానితోటి అట్ల పాడుడు తప్పు అని కూడ నేర్చుకున్నం.

గుంటూర్ల ఐదు ప్రోగ్రాంస్ అయిపోయినవి. ఆరవది గుంటూర్ పక్కన ఉన్న విలేజ్ గుజ్జనగుండ్లల ప్రోగ్రాం చేస్తున్నం. ఒక వక్త ఉపన్యాసం అయిపోయింది, ఒక డప్పు పాట అయిపోయింది. ఇక మూడోది నా పాట. పోలీసోల్ల మీద పాట. అది రెండు లైన్లు పాడగానే జనాలు ‘ఓ ఓ’ అనుకుంట ఉరుకులు పరుగులు పెడుతుండ్రు. చూస్తే పోలీసుల లాఠీలు, జనాల కొట్టుడు కనిపిస్తుంది. నాకు అర్థమయిపోయింది పోలీసోల్లు దాడి చేస్తుండ్రు అని. పెద్ద వేదికేసిండ్రు అప్పుడు. నేను చిన్నగుంటి. 16-17 ఏండ్లే వుంటవి. నా కొడుకు, భాస్కర్, నా కడుపుల వుండు. అయినా వేదిక మీది నుండి దుంకేసిన. దుంకేసి ఒక గుడిసెలకు పోయిన. పద్మ వుంది కదా (అమరుడు ఆజాద్ సహచరి) ఆమె, భూపాల్, నిమ్మి ఒక దిక్కుకు పోయిండ్రు. భూపాల్, నిమ్మి ఒక పాట కోసమని గజ్జెలు కట్టుకోని వున్నరు. ఆ గజ్జెల సప్పుడుకు వాళ్ళు ఎక్కడపోతె పోలీసోళ్లు అక్కడ పోయి చివరికి వాళ్ళను పట్టుకున్నరు. వాళ్ళను పట్టుకుపోయేది సి.ఎస్.ఆర్ ప్రసాద్ చూసి ‘అరే లోకల్ వాళ్ళు ఎవ్వరు లేర’ని, వాళ్ళతో పాటుగ కావాలని అరెస్ట్ అయ్యిండు. అరెస్ట్ అయినంక పద్మను ఒక్కటి కొడితే ఆమె అద్దాలు పొయ్యి ఎక్కడో పడ్డవి. తెల్లారిపోయినప్పుడు మాకు కనబడితె తీసుకొచ్చినం వాటిని. ఆ రాత్రి భూపాల్ ను, ప్రసాద్ ను విపరీతంగ కొట్టిండ్రు.

నేను ఆ గుడిశల ఉన్న కదా మెల్లగ నడుచుకుంటు ఊరి బయటకు పోతె అక్కడ మనోళ్లు కలిసిండ్రు. పోలీసులు పోయినంక అందరం కలిసి ఊర్లకు వచ్చినం. అయితే పొద్దునే మళ్ళీ ఆ వేదిక దగ్గరనే సభ జరిపి పోదాం అని అనుకోని ఆ రాత్రి గుంటూర్ల మాకు ఏర్పాటు చేసిన రూం కి పోయినం. పొద్దున్నే లేసి మొఖాలు కడుక్కోని, బ్యాగులు సర్దుకుంటున్నం. అంతలనే పెద్ద బూట్ల సప్పుడుతోటి పోలీస్ ఫోర్స్ మా మీద దాడి చేసింది. అందరిని రోడ్డు మీదనే కొట్టుకుంట పోలీస్ స్టేషన్ వరకు నడిపించుకుపోయిండ్రు. అక్కడ మళ్ళీ విపరీతంగ కొట్టిండ్రు. దెబ్బ మీద దెబ్బ పడుతుంటె తిమ్మిరెక్కినట్లు అయ్యింది. అట్లయినంక దెబ్బ నొప్పి కూడ తెలుస్త లేదు. కాని వాడు వదిలిపెట్టాలని ‘ఓ ఓ’ అని బొబ్బలు పెట్టినం. తెల్లారేసరికి ఒళ్ళంత నల్లగ కమిలిపోయింది.

బాగ కొట్టినంక మమ్ముల సబ్ జైళ్ళ పెట్టిండ్రు. తెల్లారి పొద్దున్నే చెరబండరాజు, కె.వి.ఆర్ మమ్ముల చూడడానికి వచ్చిండ్రు. మేము అందరం చిన్న పిల్లలం అయితిమి, వాళ్ళను చూడంగనే ఉరుక్కుంటూ పోయి చేతులు పట్టుకున్నం. మా దెబ్బలు, నొప్పులు అన్ని చెప్పినం. మేము నవ్వుకుంటనే మాట్లాడుతున్నం కాని వాళ్ళేమో ‘పిల్లలకు ఇంతగనం దెబ్బలు తగిలినా ఇంకా నవ్వుతూనే మాట్లాడుతున్నరు’ అని ఇద్దరు భల్లున ఏడ్చిండ్రు. మాకేమో దేశం కోసం ఏదో పెద్ద ఘనకార్యం చేసినంత ఫీలింగు అనిపించింది. కాని అంత పెద్దోళ్ళు మాకోసం అట్ల ఏడ్చేసరికి ఈ రాజకీయాలల్ల మనుషులు ఎంత సున్నితంగ వుంటరు అనిపించింది. అక్కడి నుండి కష్టపడి హైద్రాబాద్ కు వచ్చిన. ఆ తెల్లారి నుండే ఎమర్జెన్సీ విధించిండ్రు. లక్ష్మయ్యను కూడ వేరే ఒక కేసులో అప్పటికే పట్టుకు పోయి 40 రోజులు అవుతుంది. ఎక్కడ ఎవ్వరు కానరాని పరిస్థితి. నిర్భంధం అంత తీవ్రంగ వుండె.

అక్క అప్పటి సంగతులు పూసగుచ్చినట్లు ఒక సహజ ప్రవాహంలా చెప్పుకుంటూ పోతుంటే ‘అక్కా ఈ పాటలు, ప్రోగ్రాంస్ బాగనే వున్నవి. కాని అవి జరిగే క్రమంలో అసలు ఈ పోరాటం ఎందుకు, ఈ ప్రయాణం ఎక్కడికి అనే విషయాల మీద మీకు ఏమైన సిద్ధాంత అవగాహన వుండెనా? దానికి సంబంధించి ఏమైనా ప్రత్యేక క్లాస్సెస్ చెప్పిండ్రా?‘ అని అడిగిన.

ప్రత్యేకంగా క్లాసెస్ ఏమి చెప్పలేదు కాని ఆ పాటల ద్వారనే అర్థం చేసుకునేదాన్ని. అట్లనే మీటింగ్స్ అటెండ్ అవుతోళ్ళం కాబట్టి అక్కడ రాజకీయ విషయాలు తెలిసేవి. లోతైన రాజకీయ సిద్ధాంతాలు తెల్వకపోయినా చేస్తున్న పని పేదల కోసం చేస్తున్నం అని తెలిసేది. నేను అప్పుడే కదా వచ్చింది. నాకు తెలిసే అవకాశం కూడ లేదు. కాని తర్వాత చిన్నచిన్నగ పుస్తకాలు చదువుతూ అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన. ‘పిలుపు’, ‘సృజన’ పత్రికలు తప్పనిసరిగ ఇద్దరం చదివెటోళ్ళం. చర్చించుకుంటోళ్ళం. లక్ష్మయ్య కూడ నన్ను ఎడ్యుకేట్ చేయడానికి బాగ శ్రద్ధ పెట్టేటోడు.

అక్క రాజకీయ అవగాహన గురించి మాట్లాడుతుంటె అడిగిన ‘జె.ఎన్.ఎం ట్రూప్ లో ఎక్కువగ వున్నది మగ వాళ్ళే. ఆ స్టేజ్ మొత్తంగా మేల్ డోమినేషన్ షో గా కనిపిస్తది. మహిళల గొంతులు మధ్య మధ్యలోనో లేదా కోరస్ లోనో వినిపిస్తయి. ఆ వేశధారణ కూడా ఆ డామినేషన్ ను కనబరుస్తున్నట్లు ఉంటది. వీటికి సంబంధించిన విమర్శ కూడా ఉంది. మీ అభిప్రాయం ఏంటి?’

నేను పాడిన తొలినాళ్ళలో (ఎమెర్జెన్సీ వరకు) నన్ను ఎవరో డామినేట్ చేస్తుండ్రు అనే ఫీలింగ్ అనిపించలేదు. అప్పుడు అలాంటి ఆలోచన కూడ ఎవ్వరికి లేదు. అందరం కలిసే ప్రోగ్రాం చేసెటోళ్ళం. కాకపోతె 1990ల వచ్చేసరికి ఆ డామినేషన్ అనిపించింది. ‘మళ్ళీ పాడడానికి వచ్చింది’ అనే ఎగతాళి మాటలు కూడ వినాల్సివచ్చింది…

అక్క చెప్తుండగానే ‘ఎందుకు అలాంటి మాటలు వినాల్సి వచ్చింది. గొప్ప విప్లవ లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారు?’ అని అడిగిన.

దానర్థం అప్పటికి కొత్తగా వచ్చిన తరం ఇంకా రాజకీయాలను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆ విప్లవ స్ఫూర్తిని ఇంకా అందుకోలేదు. దానికి తోడు అప్పటికే వీడియోలు, ఫొటోలు తీసుడు వచ్చింది. అదంతా మాకు కొత్త. మాకు ఫొటోల్లో, వీడియోల్లో పడాలి, ఆకర్షణ పెంచుకోవాలి అనే ధ్యాస ఎప్పుడూ లేదు. (మాకు అసలు పెండ్లి ఫొటోనే లేదు. అప్పుడు మా నియమం ప్రకారం అసలు ఫొటోలు దిగొద్దు.) దానితోటి మా ప్రదర్శన అంతా సహజంగ వుండేది. ఫొటోల కోసం ఫోజులు పెట్టడం, కృత్రిమ హావభావాలు చూపించడం లేకుండె. కాని తర్వాత ఆ కృత్రిమత్వం కనిపించింది. అప్పుడు నన్ను పాడనీయలేదు. నన్ను పక్కకు పెడుతుండ్రని అప్పుడు ఫీల్ అయిన.

మేము 70లలో పాడేటప్పుడు మాకు జె.ఎన్.ఎం సభ్యులు ఎవ్వరు కూడా బాధ్యులుగా లేరు. మాకు మూర్తన్న (ఎల్.ఎస్.ఎన్ మూర్తి) కోఆర్డినేట్ చేస్తుండె. కొన్ని రోజులు భూపాల్ వున్నడు, కాని తర్వాత మూర్తన్నను పంపించిండ్రు భూపాల్ వెంబడి. అయితే అందరం కూర్చోని ఎవరు ఎప్పుడు మాట్లాడాలి, ఏం పాట పాడాలి (పోయిన ప్రాంతాన్ని బట్టి) అని మొత్తం ప్రోగ్రాం ముందే రాస్తుండె. దానితోటి వ్యక్తుల ఇష్టాయిష్టాలతోటి పనిలేకుండ ప్రోగ్రాం అనుకున్నట్లు జరిగేది. ప్రతి ప్రోగ్రాం తర్వాత రివ్యూ కూడ చేసుకునేటోల్లం. తప్పులు ఉంటె సరిచేసుకునేటోల్లం. కాని తర్వాత కాలంలో ఆ పద్ధతి కనిపించలె. వ్యక్తుల ఇష్టం బట్టి ఎవరు పాడేది నిర్ణయించుడు మొదలయ్యింది. అప్పుడు చాలా ఫీల్ అయిన. చాలా సార్లు లక్ష్మయ్యకు చెప్పుకోని ఏడ్చిన కూడ. అయినా కూడ 1990ల నుండి జరిగిన అన్ని ప్రోగ్రాంలకు పోయిన (91ల అద్భుతంగా జరిగిన రైతుకూలి మహాసభలతో సహా). రాష్ట్రం మొత్తం తిరిగిన. అవకాశం వచ్చినప్పుడల్ల పాడిన.

కాని ఇక్కడ ఒక మాట చెప్పాలి. పార్టీతో ప్రభుత్వం జరిపిన చర్చల సందర్భంలో ఉన్న వెసులుబాటు పరిస్థితుల్లో రహస్య జీవితంలో ఉన్న చాలా మంది కామ్రేడ్స్ వాళ్ళ కుటుంబాలతో మాట్లాడటం లేక ఉత్తరాలు రాయడం చేసిండ్రు. అప్పుడే మాతోపాటుగా పనిచేసిన ఒక జె.ఎన్.ఎం కామ్రేడ్ నాకు ఉత్తరం రాసిండు. అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుంటు ‘అప్పటి మేల్ డామినేషన్ ను మీరు ఎలా భరించిండ్రు. ఆ పురుషాధిక్యానికి నేను కూడా ఒక బాధ్యున్నే. నన్ను క్షమించక్క’ అని రాసిండు. అంతే కాదు ‘ఎప్పుడు మీరు పాడేవాళ్లే కాకూడదు. మీరు కూడ పాటలు రాయండి’ అని కూడ రాసిండు. ఆ లెటర్ ఇచ్చిన స్ఫూర్తితోనే ఎప్పుడూ పాటలు పాడేదాన్నే అనుకునే నేను 10-12 పాటలు కూడా రాసిన. నాకు చాలా సంతోషం వేసింది. నిజమైన ప్రజా పోరాటం ఏం నేర్పుతది అని ఆ లెటర్ ద్వారా నాకు స్పష్టమయ్యింది.

‘అయితే నిర్బంధాన్ని ప్రత్యక్షంగా అనుభవించినవ్, దాని వివిధ రూపాలను చూసినవ్. అయినా కూడా ఎందుకు ఉద్యమాలతోనే నడవాలనుకున్నవ్?’ ఈ ప్రశ్నకు తన జీవితంలో నుండే సమాధానం ఇంతకుముందే చెప్పింది. కాని ఇంకా ఏమైన చెప్తదేమోనని అడిగిన.

నిజం చెప్తున్న తమ్మి. నేను ఎన్నడు భయపడలేదు. ఇదంతా నాకెందుకు అని ఫీల్ కాలేదు. ఇంకా ప్రజల కోసం పనిచేయాలి. ఇంకా పాడాలి అనేదే నా తపనంత. కొట్టిండ్రు కదా ఇంకేం ప్రమాదం వుంటదో అని ఎన్నడు కూడ ఆలోచించలే. నాకు రానేలేదు ఆ తలంపు, భయం. ఇప్పుడు వెనక్కి ఆలోచిస్తే, మా ఇంటి బీదరికం నన్ను అట్ల నిలబెట్టిందనిపిస్తది. నేను ‘పాల బుగ్గల జీతగాడా’ అంటూ పాడుతుంటే నాకు మా అన్న, తమ్ముని పాదాలే గుర్తుకొస్తయి. (ఈ మాటతోనే అక్క గొంతులో దుఖం ఒక్కసారిగా ఉబికివచ్చింది. ఏడుస్తూనే మాట్లాడుతుంది.) నేను ఆ పాటలో లీనం కావడానికి అదే కారణం. ఎందుకంటే నేను దుర్భరమైన పేదరికాన్ని అనుభవించిన. ఆ జీవిత అనుభవమే నన్ను నిలబెట్టుతుంది ఇప్పటికి కూడ. ఇప్పుడు నా పరిస్థితి ఎంత మెరుగైనా వుండొచ్చు కాని, అప్పటి నా పరిస్థితిని జీవితంలో ఎప్పటికి మరిచిపోను. ఒకసారి లక్ష్మయ్య 70 రూపాయలు పెట్టి ఒక చీర కొనుక్కొస్తే అది కట్టుకోని సంతోషపడే బదులు ఈ పైసలు పెడితే మా ఇంట్ల అందరికి బట్టలొచ్చును కదా అనే బాధ పడిన. ఇప్పటికి కూడా నా ఇంట్లో పనిమనుషులను సైతం నా ఇంటి మనుషుల లెక్కనే చూస్త. ఎందుకంటే నా అన్న, తమ్ముడు కూడ జీతగాళ్లే కదా. వాళ్ళను కూడా ఇట్లనే చూస్తరేమో అనుకుంట. నాకు ఎప్పుడూ మా అమ్మ కూలి, ఆమె కొంగులో పట్టుకొచ్చిన బియ్యమే గుర్తుకొస్తయ్. ఆకలికి ఆపుకోలేక ఏడ్చిన రోజులు ఇప్పటికి గుర్తున్నయ్. అన్నంల కేవలం ఉప్పు, కారం, నీళ్లు పోసుకోని తిన్న పరిస్థితి. చిన్నతనంలో అనుభవించిన కడు పేదరికం నా మనసు మీద చాలా ప్రభావాన్ని వేసింది. అందుకే నా కుటుంబ నేపథ్యం ఎప్పుడు నన్ను నేను ఎటుపైవు వుండాలి అని గుర్తుచేస్తనే వుంటది. నా వర్గం కోసం నేను పని చేయాలని స్థిరపడి పోయింది తప్ప, నేను ఒక్కదాన్ని సుఖంగ వుంటే చాలు అని ఎప్పుడూ అనుకోలే.

‘అక్కా మీరు సమాజంలో దోపిడీ పీడన పోవాలి అనే ఉద్యమాలలో భాగమై పనిచేస్తావున్నరు. అదొక దీర్ఘకాలిక ప్రయత్నం. దాని కోసం ఎందరో ఎన్నో త్యాగాలను చేసిండ్రు. అయితే మీరు నమ్మిన రాజకీయాలు మీలో ఏమైనా మార్పును తీసుకొచ్చినవా?’

సున్నితత్వాన్ని అలవరిచినవి. మనుషుల పట్ల, ఉద్యమాల పట్ల ఏ విధమైన వైఖరితో ఉండాలి అనేది రాజకీయాలే నాకు నేర్పించినవి. నేను ఏమనుకుంటనంటే నా పట్ల, నా చర్యల పట్ల ఇతరుల వైఖరి నా ముందు ఎలా వుంటదో, నా వెనకాల కూడా అలాగే వుండాలని అనుకుంట. అందుకే నాకు నటన చేయబుద్ధి కాదు. స్వచ్ఛమైన మనసుతో వుండాలని నేను చదివిన సాహిత్యంలోని పాత్రలు, నేను నిజ జీవితంలో చూసిన మనుషుల నుండి నేర్చుకున్న. మా జె.ఎన్.ఎం లో దివాకర్ వంటి కామ్రేడ్స్ ను చూసినప్పుడు వాళ్లలో ఉండే నిర్మలత్వం, ఉద్యమం కోసం పడే తపన చాలా స్ఫూర్తినిచ్చేది. అట్లనే జె.ఎన్.ఎం పద్మ కూడా. ఎంతో చైతన్యవంతంగ, తెగువతో ప్రజల తరుపున కొట్లాడేది. అద్భుతంగ పాడేది. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన చంటిబిడ్డను కూడా వదులుకోని ప్రజాయుద్ధంలో భాగమయ్యింది. అమరురాలయ్యింది. ఆమె అంత నేను ఎదగలేదు కాని, ఆమె ఎప్పుడు నాకు ఆదర్శమే. అదే విధంగా వీవీ సార్. రాజకీయాలలో సార్ కు ఉండే నిబద్ధత, ఖచ్చితమైన అభిప్రాయాలను దగ్గరి నుండి చూసిన. చిన్నా పెద్ద తేడా లేకుండ ఆత్మీయంగా మాట్లాడే తీరును చూసినప్పుడు సార్ మీద మరింత గౌరవం కలుగుతది. అట్లనే చెరబండరాజుకు ప్రజల మీద, సహచరుల మీద ఉండే ప్రేమ, ఆయన రాజకీయ కమిట్‌మెంట్. వీళ్లందరూ నాకు ఒక మోడల్ లాగ కనిపిస్తరు.

అయితే విప్లవం అనేది త్యాగాల దారి కదా. ఎందరో కామ్రేడ్స్ అమరులయిండ్రు. అందరం పుడుతం, చస్తం. కాని వాళ్లు ఒక మహోన్నతమైన లక్ష్యం కోసం పోరాడిండ్రు, అమరులయ్యిండ్రు. వాళ్ల జీవితాలు ఎప్పుడూ చరిత్రలో నిలిచిపోతయి. వాళ్ల త్యాగాలే ముందు తరాలకు ఒక బాటనేస్తయి. వాళ్ల త్యాగాలను ఎత్తిపట్టడమే వాళ్లకు నిజమైన నివాళి.

***

అక్కతో ఈ సంభాషణ జరిగి రెండు నెలలు అయ్యింది. కాని ప్రతి మాటా చాలా స్పష్టంగా గుర్తున్నాయి. ఎంత సహజత్వం లేకపోతే అంతగా ఒక ప్రవాహంలా చెప్పడం సాధ్యం కాదు. సహజత్వం, రాజకీయ నిబద్ధత, ప్రజల పట్ల వినమ్రత, అమరుల త్యాగాల మీద గౌరవం, రాజ్యం మీద ధిక్కారం… ఇవన్నీ అక్క మాటల్లో కనిపించినవి. అవి పుస్తక జ్ఞానంతో వచ్చేవి కావు, లేదా కేవలం ఒక కులంలోనో, వర్గంలోనో పుట్టినంత మాత్రాన అబ్బేవి కూడా కావు. కేవలం విప్లవ రాజకీయ ఆచరణ ద్వారా class in itself నుండి class for itself కు పరిణామం చెందే క్రమంలో వచ్చేవే. ఆ విప్లవ చైతన్యమే సంధ్యక్క లాంటి అట్టడుగు స్థాయి మామూలు మనుషులు ఒక సాహసోపేతమైన విప్లవాన్ని కలగనే, అందులో ఇస్టపూర్వకంగా పాల్గొనే, త్యాగాలు చేసే అసామాన్యులుగా రూపాంతరం చెందే అవకాశం కల్పిస్తుంది. ఆ దారిలో కొందరు ఒరిగిపోవచ్చు, మరికొందరు ఒంగిపోవచ్చు, కాని ఆ దారి మాత్రం సమాజంలో ఆకలి, పీడన, అణిచివేత ఉన్నంత వరకు ఉంటుంది. ఆ దారి అందించిన పోరాట విలువలను నిలబెట్టుకోవడమే కొనసాగుతున్న ఫాసిస్టు పాలనకు సరైన సమాధానం.

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

19 thoughts on “పాలబుగ్గల జీతగాళ్లే కండ్లల్ల మెదులుతుంటరు

  1. Excellent. మంచి పరిచయం. సంద్యక్క కి viplavabhi వందనాలు

  2. Ashok…నా సెల్యూట్..ఎంత బాగా రాసినవు…సంధ్యక్క గురించి చాల కథలు వినీయు.ఆమె ధీరత్వము, గుంటూరు సభ గురుంచి చాలా సార్లు విన్న…అద్భుతం…సంధ్యక్క ను ఇంతగొప్పగా పరిచయం చేసినందుకు అబీజింఅందనలు..

  3. Ashok garu. You have shown us what a beautiful person our friends mom is thank you for introducing us to her

  4. సంద్యక్క గురించి ఇప్పటివరకు నేను విన్నది. మాభూమి సినిమా పాట ద్వారా మాత్రమే పాపులర్ అయ్యింది. జె.యన్.యం ఆడియో క్యాసెట్లలో తప్ప ఎప్పుడూ ప్రత్యక్షంగా వేదికల మీద అప్పట్లో చూడలేదు (ఇప్పుడు విరసం సభల్లో చూస్తున్నాను)
    సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తూ అప్పుడప్పుడు వచ్చి పాడుతుంది అనుకునేవాడిని,
    ఈ ఇంటర్వ్యూ చూశాకా, ఆ కమిట్మెంట్ చదివాక ఆశ్చర్యపోయాను.
    ఇలాంటి మనుషుల గురించి అంతర్లీనంగా మిగిలిపోయిన చరిత్రను బయటకు తీసిన రచయితకు, కొలిమి అభినందనలు

  5. Very informative about Sandyakka , i really appreciate efforts put enlighten things happened that point of time .

  6. సంధ్యక్క తో చాలా కాలం గా పరిచయం ఉన్నా తన జీవితం గురించి ఇన్ని విషయాలు తెలియదు. కళ్ల నీళ్లు…… చాలా హృద్యం గా రాశారు.

  7. చాలా గొప్ప ఇంటర్వ్యూ. సంధ్యక్కలో ఆ సున్నితత్వం, సరళత్వం ఇప్పటికీ సజీవంగానే వున్నాయి. తన వ్యక్తిత్వం, ప్రవర్తనల్లోని మంచి గుణాలు తన రాజకీయాల నుండి అబ్బినవే అని ఆమె చెప్పటం గొప్ప విషయం.

  8. సంధ్య గారి పాటలెన్నో వేదికల మీద విన్నాను. తోటరాముడి పాట ఎంత బరువుగా పాడేవారో!
    చాలా విషయాలు తెలిపినందుకు. ధన్యవాదాలు సర్

Leave a Reply