తెలంగాణాలో రచయితలే లేరన్న ప్రచారానికి రచయితలే కాదు రచయిత్రులూ ఉన్నారన్న విషయానికి నందగిరి ఇందిరాదేవి, పోల్కంపల్లి శాంతాదేవి, మాదిరెడ్డి సులోచనలు ఓ చెంపపెట్టు వంటి సమాధానం. మాదిరెడ్డి సులోచన హైద్రాబాదు అతిసమీపంగా ఉన్న శంషాబాద్ లో 1935న ఓ భూస్వామ్య కుటుంబంలో జన్మించింది. మాణిక్యమ్మ, రామకృష్ణా రెడ్డిలు ఆమె తలిదండ్రులు. బి.యస్.సి., బి.యెడ్., యమ్.ఏ., యమ్.ఏడ్ చేసిన ఈమె ఉపాధ్యాయ వృత్తిని చేపట్టింది. కొన్నాళ్ళు సెయింట్ జాన్స్ హైస్కూల్ లో పనిచేసిన ఈమె భర్తతోపాటు ఇథియోపియా, జాంబియా దేశాలకు పోయినప్పుడు అక్కడ కూడా ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. వృత్తి అధ్యాపకత్వం అయినా, రచనా ప్రవృత్తి పట్ల ఎక్కువ మొగ్గు చూపింది. అయితే ఆ ప్రవృత్తి రచనలకే పరిమితం కాకుండా వంటచేసే పనిని హాబీగా ఎంచుకుంది. కుట్లు అల్లికల పట్ల కూడా అత్యంత శ్రద్ధ కనబరిచేది. నాట్యం చేయించడం, నాటకాలు వేయడంలోనూ అత్యంత శ్రద్ధ చూపిస్తూ వాళ్ళను ప్రోత్సహించేది. 1962 ప్రారంభమైన ఈమె రచనా వ్యాసాంగం 1983లో గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయే వరకు నిరాఘాటంగా సాగింది. ఈమె కలం నుండి నవలలు, కథలే కాకుండా నాటికలు కూడా వెలువడడం అభినందనీయం. ఈమె కథా వస్తువులు వైవిధ్యంతో కూడుకొన్నవి. ప్రత్యేకించి ఓ అస్తిత్వవాదమో, ఇజాలో ఉండవు. ఏ యిజంలోనైన ఏ అస్తిత్వవాదమైనా అందులోని మంచి చెడులను విశ్లేషిస్తూ తన రచనను కొనసాగించింది. ఈమె 65 సాంఘిక నవలలను జననీ జన్మభూమి, వీడని నీడ, సంధ్యారాగం మొదలైన రాజకీయ నవలలను దేవీ చంద్రగుప్త అనే చారిత్రక నవలను కూడా రాసింది. డెబ్బయికి పైగా కథలు రాసినప్పటికీ అన్నీ అందుబాటులో లేకపోవడం విచారకరం.
కేవలం పాఠకులకే పరిమితం కాకుండా ఆమె రచనలు సినిమాలుగా ప్రజలకు వీక్షణ భాగ్యం లభించినాయి. ఆ క్రమంలోనే శిక్ష నవల ‘మేనకోడలు’ (1972) గా, ప్రేమలు – పెళ్ళిళ్ళు (1974), సంసార నౌక నవల ‘ఆడంబరాలు-అనుబంధాలు’ (1974) గా, భిన్నధృవాలు ‘ఈ కాలం పిల్లలు’ (1976) గా, తరంమారింది (1977), మిస్టర్ సంపత్ యం.ఏ ‘ఈ తరం మనిషి’ (1977) గా, రాగమయి ‘కళ్యాణి’ (1979) గా, అగ్నిపరీక్ష ‘కలవారి సంసారం’ (1982) గా, సంధ్య ‘చందమామ’ గా తెర పైకెక్కినై. కథలన్నీ ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, జ్యోతి, యువ, మహిళ, జయశ్రీ, విజయ, వనిత, స్వాతి, చక్రవర్తి, ప్రభవ, జ్యోత్స్న, వనితా జ్యోతి, కళాసాగర్ వంటి అనేక పత్రికల్లో ప్రచురితమైనాయి.
ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని పొందిన సులోచన ‘తరం మారింది’ సినామాకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని పొందింది. గృహలక్ష్మి స్వర్ణకంకణం పురస్కారాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును కూడా పొందింది. అంతటితోనే ఆగకుండా ‘భావి భారతంలో భర్త,’ ‘ఎంతెంత దూరం’ అనే ఏకాంకికలకు గాను గౌరవ పురస్కారాలను పొందింది. వంశీ ఆర్ట్స్ థియేటర్స్ అరుణిమ నృత్యకళా కేంద్రం వారు కూడా ఈమెను పురస్కారాలతో గౌరవించిన్రు.
వంశీ ఇంటర్నేషనల్ సంస్థ మాదిరెడ్డి సులోచన పేరిట ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ రచయిత్రిని ఎంపిక చేసి బంగారు పతకంతో గౌరవించడం ఆమె కీర్తి పతాకంలో ఓ కలికితురాయి.
‘మాదిరెడ్డి సులోచన నవలా సాహిత్యానుశీలనం,’ ‘మాదిరెడ్డి సులోచన నవలలు-ఒక పరిశీలన,’ ‘చంద్రగుప్త నవల – పరిశీలన,’ ‘జననీ జన్మభూమి’ నవలలపై పరిశోధనలు జరగడం ఎంతో హర్షించదగిన విషయం. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సందర్భంగా తెలుగు అకాడమీ ఆమె రచనలు, జీవితానికి సంబంధించిన మొనోగ్రాఫ్ తీసుకువచ్చింది. ఇంచుమించుగా అదే కాలంలో అంటే 2017లోనే డా. కె. విద్యావతి, సంగి సెట్టి శ్రీనివాస్ గార్లు ఇరవై కథలను ‘మాదిరెడ్డి సులోచన కథలు’గా ఓ సంకలనాన్ని తీసుకువచ్చిన్రు.
మాదిరెడ్డి సులోచన కథలు – పరిశీలన:
కథా సంకలనంలో ఇరవై కథలున్నై. ఏ కథకు ఆ కథ ఓ ప్రత్యేక కోణంతో పాఠకుల ముందుకొచ్చింది. 1975ల నుండి అనేక అస్థిత్వ ఉద్యమాలను, ఆ ఉద్యమాల నేపథ్యంలోని కథలను, జాల కోణంలో వచ్చే కథలను అనేకం చూస్తున్నాం. అందుకు మాదిరెడ్డి రచనలు పూర్తిగా భిన్నం. ఆమె ఒక కథలో స్త్రీ పక్షపాతిగా కనబడితే మరో కథలో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు పడే మగవాళ్ళను గూర్చి చర్చిస్తుంది. కొన్ని కథల్లో మనస్తత్వ విశ్లేషణ చేస్తది. మరికొన్ని కథల్లో పైస కొందరిని మూర్ఖులుగా మారుస్తదని చూపిస్తది. ఓ కథలో బీదవాడికి జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటుతుంది. కేవలం దానధర్మాలు చేయడం వల్ల పేదవాళ్లలో పరివర్తన కలుగదని ఓ కథలో చెపితే మగవాళ్ళ ఆకతాయి చర్యలను ఎత్తి చూపుతది.
ఈ ఇరవై కథల్లో అణికాడు, అసూయ, పంజరం విడిచిన పక్షి, తాడికింద పాలు, హక్కు అనే కథలను గవంచినపుడు సమాజంలో స్త్రీల పట్ల గల వివక్ష, స్వార్ధంతో స్త్రీలను ఉపయోగించుకో చూస్తూనే వారి వ్యక్తిత్వంపై దెబ్బ వేయడం, అనుక్షణం వాళ్ళతో పురుషులకు గల సంబంధాలపై అనుమానాలు పెంచుకొని అనుమానించటం, అవమానించటం ఓ యింటి కూతురు బాధ్యతకే పనికివస్తుంది తప్ప నిర్ణయాధికారం లేకపోవడం వంటి విషయాలను సులోచన స్రవించారు.
రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడమో, కాపాడుకోవడమో కారణాలుగా గతంలో స్త్రీల పెళ్ళిళ్ళు జరిగినై. బహు భార్యత్వానికి దారి తీసినై. తండ్రుల అభిమతాలు లక్ష్యాల మేరకు స్వయంవరాల పేరిట తండ్రులే అల్లుళ్ళను ఎనకున్నారు. స్త్రీల జనాభా తగ్గుతున్న క్రమంలో కన్యాశుల్కం వచ్చింది. అవి పసిమొగ్గలను చిదిమేసినై. ఆ తరువాత వరకట్నం, ఆస్తి హక్కులు ముందుకొచ్చినై. వరకట్న నిషేధాల చట్టాలు వచ్చినా అవి యథావిథిగా కొనసాగుతునే ఉన్నై. వరకట్నానికి ఆస్తిహక్కు ప్రత్యామ్నాయంగా కొనసాగుతున్నదా? లేదా అన్నది తేలాల్సిన విషయం! చట్టాల్లో ఎన్ని మార్పులొచ్చినా, స్త్రీల సమస్యకు పరిష్కారం లేకుండా పోతున్నది. ఈ క్రమంలో ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పెళ్ళిళ్ళకై ఎన్నో ప్రణాళికలు వేసుకోవాల్సిన పరిస్థితి. కానీ, ఆ సందర్భాలను అబ్బాయి పక్షం వారు స్వార్థంతో దుర్వినియోగం చేసుకొనే పరిస్థితిని తెలిపే కథే ‘అణికాడు’. ఈ కథలో ఓ ఇండస్ట్రియల్ ఎస్టేట్ డైరెక్టర్, పార్ట్ నర్ అయిన శ్రీపతి తన స్నేహితడు సోమశేఖర్ ను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా అతని కొడుకు జగన్ ను కంపెనీ వ్యవహారాల్లో చేదోడుగా పెట్టుకొని, తన కూతురితో అతనికి పెళ్ళి జరిపించాలనుకుంటాడు. కానీ, జగన్ సోమశేఖర్లు శ్రీపతి పేరిట లావాదేవీలతో లబ్ది పొందుతూ అతన్ని మోసం చేస్తున్న గుట్టు రట్టొవుతుంది. రచయిత్రి ఆ మోసానికి గుణపాఠంగా అమ్మాయి నిర్ణయంతో సహా పెళ్ళిని రద్దు చేసుకున్న విచక్షణతో కూడుకున్న ముగింపును ఈ కథకిచ్చింది రచయిత్రి.
సమాజంలో ఎప్పుడూ స్త్రీకి రెండోస్థానమే. లైంగిక స్వేచ్ఛను అనుభవిస్తూనే కట్టుకున్న భార్యలను నిరాదరణకు గురి చేస్తూ, అమానవీయంగా ప్రవర్తిస్తుంటారు. విచిత్రమేమిటంటే తోటి కుటుంబసభ్యులూ, పనివాళ్ళు కూడా విజాతర లైంగిక సంబంధాన్ని ఆడవాళ్ళు సర్దుకుపోవాలని చెప్పడం. అట్లాంటి పరిస్థితుల్లో రెండో భార్యగా వచ్చిన హేమలతను ఆ పంజరం నుండి పిల్లల ట్యూషన్ మాస్టర్ విడిపించి పెళ్ళి చేసుకున్న ‘పంజరం విడిచిన పక్షి’ అభ్యుదయ భావాలు గల గోపాల్ స్త్రీ జీవితాన్ని చక్కదిద్దిన కధగా రచయిత్రి మలిచింది. ఇందులో ఒక మగవాడు స్త్రీ జీవితాన్ని రాచి రంపాన పెడితే మరో మగవాడు ఆమె జీవితాన్ని చక్కదిద్దడాన్ని గమనిస్తే అందరు మగవాళ్ళను ఒకే గాటన కట్టగూడదన్న భావన ఈ కథలో ఉందని తెలుస్తుంది.
పోయిన డబ్బును సంపాదించుకోవచ్చు. దెబ్బతిన్న ఆరోగ్యాన్ని కొంతలో కొంత బాగు చేసుకోవచ్చు. కానీ, వ్యక్తిత్వంపై మచ్చపడితే దాన్ని పోగొట్టుకోవడం అసాధ్యం అది కేవలం ఆ వ్యక్తులకే పరిమితం కాదు. వాళ్ళతో సహవాసం చేసినవారినీ తప్పుపట్టే అవకాశాలు ఎక్కువే. అక్రమ సంబంధాలతో జల్సాగా తిరిగిన రమాకాంత్ ఆ దురలవాట్లకు దూరమైనా భార్యతో సహా అందరూ అనుమానించేవాళ్ళే. ఢిల్లీలో ఓ ఉద్యోగం ఇంటర్వ్యూకి పోయిన మాలతికి అతడు నిస్వార్థంగా సాయం చేసినా, అతడి భార్య, మాలతి భర్త స్నేహితుని తల్లి ఆమెను తప్పుపట్టిన కథే ‘తాడికింద పాలు’.
ఆడవాళ్ళకు అసూయపాలెక్కువని, లేనిపోని అనుమానాలతో, కొన్నిసార్లు కల్పించుకొని ఇతరుల మీద అభాండాలు వేస్తారని చెప్పుకోవడం సాధారణంగా చూస్తుంటాం, వింటూంటాం కూడా. సమాజం అంతటితో సరిపెట్టుకోకుండా అసూయ ముందు పుట్టి ఆ తర్వాత ఆడవాళ్ళు పట్టి ఉంటారనీ చెప్పుకుంటారు. అయితే ఆ అసూయకు ఆడా మగా లింగ వివక్ష లేదని చెప్పే కథే ‘అసూయ’.
ఉద్యోగరీత్యా కెన్యాలో అడుగుపెట్టిన లక్ష్మణ్, అదే దేశంలో వ్యాపారం చేస్తున్న గోపాల్ అతని చెల్లెలు సునంద అన్ని విధాలుగా సహకరిస్తారు. అది వాళ్ళ నైజం. అందువల్ల లక్ష్మణ్ కు సహకరించినట్టే, ఇతరులకూ సాయపడ్డారు. కానీ ఆ స్నేహితులు ఆ సహకారాన్ని, సాయాన్ని తాము మాత్రమే స్వంతం చేసుకోవాలనే లక్ష్మణ్ పై సునందకు, సునంద మీద లక్ష్మణకూ అపోహలు కల్పిస్తారు. వారి కుతంత్రం వికటించి యధార్థం బయటపడుంది. అయినప్పటికీ అపకారికి ఉపకారం చేసే విశ్వమానం శ్రేయస్సు కోరే లక్షణాలు గోపాల్ సునందలో కనబడ్డాయని చెప్పే…
సృష్టికి స్త్రీ పురుషులిద్దరూ ఆధారభూతమే. కుటుంబం కొనసాగటానికి స్త్రీ ప్రధాన భూమిక వహిస్తుంది. మగవాడిని మించిన బాధ్యతను మోస్తుంది. అయినప్పటికీ కుటుంబంలో మగవాడికిచ్చే ప్రాధాన్యం స్త్రీకి ఇవ్వరు. అనేక సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా కూతుళ్ళకు బాధ్యతను మోపి, హక్కులను మాత్రం కొడుకులకు సంక్రమింపచేస్తుంటారు. కొడుకులు కూడా తల్లిదండ్రుల ఆలనా పాలనా పట్టించుకోకపోగా ఆర్థిక భార నిర్ణయాధికారం వచ్చేవరకు ఆడపిల్లలను హక్కు విషయంగా నిలదీసే కథే ‘హక్కు’.
శ్రీపతి రావు భార్య చనిపోయి ఒంటివాడైనప్పటికీ అతని ఆలనా పాలనా ఏమాత్రం చూసుకోకుండా ఉద్యోగరీత్యా ఉన్న ఊరును విడిచివెళ్ళిపోవడంతో కూతురు దేవయానికి అతని బాగోగులు పట్టించుకోక తప్పలేదు. అన్ని బాధ్యతలను బాధ్యతగా తీసుకున్న దేవయాని స్థలం ఎన్ క్రోచ్ మెంట్ అయిందని ఆ పైసలు ఉన్న ఫళంగా కట్టమని పక్కింటివాళ్ళు నిలదీసిన సందర్భంగా ఆమె తన డబ్బును ఉపయోగించిన తండ్రిని గట్టెక్కించినా ఆ సోదరుల మెచ్చుకోలేదు సరికదా, ఆ హక్కు నీకెక్కడిదే అని ప్రశ్నించిన కథే ‘హక్కు’.
ఓ ముసలోడినుద్దేశించి ‘తాతా పెళ్ళి చేసుకుంటావా?’ అంటూ ప్రశ్నిస్తే ‘నాకెవరు పిల్లనిస్తారు’ అంటాడు కానీ, ఈ వయసులో పెళ్ళేమిటి? అన్న మాట రాదంటారు. వృద్ధుల బుద్ధులు సంచలింపవే అన్నట్లు వయసు మీరినవాళ్ళూ ఆడవాళ్ళను అందుబాటులోకి తెచ్చుకొని అనుభవింపచూస్తారని చెప్పే కథే ‘పాపం పసివాడు’. జులపాలు పెంచుకొన్న ఇంటర్ సెకండియర్ చదువుతున్న రాజాను (సినిమా చూసి వస్తుండగా) అమ్మాయనుకొని తన కారులో లిఫ్ట్ ఇచ్చి నానా భంగిమల్లో ఇబ్బంది పెట్టి అబ్బాయి అని తెలియగానే దారిలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయిన రామచంద్రమూర్తికి సంబంధించిన కథ ఇది. రామచంద్రమూర్తికి రాజా కన్నా వయసు మీరిన పిల్లలున్నా ఆడవాళ్ళపై మోజు తగ్గని ఓ వయసు మీరిన వాడి కథ కూడా. అయితే వక్రబుద్ధి గల ఓ మగాడికి ఊహించని విధంగా దిమ్మ దిరిగించే కథగా రచయిత్రి దీన్ని మలిచింది.
అవకాశం చూసుకొని గాలం వేసి అమ్మాయిలను అందుబాటులోకి తెచ్చుకొని వివాహేతర సంబంధాలను కొనసాగించే వాళ్ళు చాలామందే ఉన్నారు. వీళ్ళ సంఖ్య రాను రాను మితిమీరిపోతున్నది కూడా. చిక్కేమిటంటే దుర్మార్గులను కూడా తల్లిదండ్రులు, బంధువులు సచ్చీలురుగా నమ్ముతూ అదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తుంటారు. అమ్మాయిలు అంటే రాధ సుధలు పన్నాగంతో అచ్చంగా కీచకుణ్ణి సైరంధ్రా పట్టిచ్చినట్టు వాడి దుర్భుద్ధిని వాళ్ళ (వరుసకి) అక్కయ్య ముందు బట్టబయలు చేసిన రోమియో కథ ఇది. సమస్యలకు కుంగిపోకుండా సమయం చూసి అదును కనిపెట్టి సమస్యను పరిష్కరించుకోవాలని ఈ ‘రోమియో’ కథ ద్వారా సందేశమిచ్చింది రచయిత్రి.
మితిమీరిన మమకారం స్వార్ధానికి దారితీస్తుంది. విచక్షణను పోగొడ్తుంది. తనకు దక్కని ఆనందం, అనుభూతి ఇతరులకు దక్కగూడదన్న తీరులో ప్రవర్తింపచేస్తుంది. సాధారణంగా కుటుంబాల్లో అత్తాకోడళ్ళకు పొడసూ పొరపొచ్చాల్లో ఈ కారణమే కనపడుతది. అయితే ఇది కేవలం అత్తాకోడళ్ళకే పరిమితమైన విషయం కాదు. ఆ లక్షణాలు గల వాళ్ళు ఇతర సంబంధాల్లోనూ అదే అవివేకంతో ప్రవర్తిస్తారు. అట్లాంటి తల్లి ప్రేమ చెప్పే కథే ‘ఓ తల్లి ప్రేమ’.
మూడో కాన్సులో కూతురు చనిపోవడంతో అనసూయమ్మ తన ఇల్లరికపుటల్లుడు చంద్రానికి సరితను భార్యగా తీసుకువచ్చినప్పటికీ తన కూతురు స్థానంలో సరితను చూడలేక అసూయకు లోనై అనేక ఇబ్బందులు పెట్టగా, ఆ విషయం తెలుసుకున్న చంద్రం తనకు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ తెప్పించుకొని అటు అత్తగారి మనసు విరగకుండా, భార్య పట్ల అనురాగంతో వేరే ఊరికిపోయి తన కథను సుఖాంతం చేసుకున్న కథే ‘ఓ తల్లి కథ.’
స్త్రీల ఉనికిని మాతృత్వంతో విడదీయరాని సంబంధం ఈ సమాజం అంటగడ్తున్నది. అంతేకాదు, సంతానం లేని స్త్రీని అనేక సందర్భాల్లో అగౌరవపరుస్తారు కూడా. వ్యక్తిగతంగా తమకు పిల్లలు లేరన్న అసంతృప్తితో పాటు ఇతరులు ఎత్తిచూపడం అవమానపరచడం మరింత బాధను కల్గిస్తుంది. ఆ క్రమంలో పిల్లలు లే ఆ సంతానం కొరకై ఎంతో ఆతురతతో ఎదురు చూస్తుంటారు. ఆ పరిస్థితే ‘కోరిక తీరిన వేళ’ కథ. జానకమ్మ పెద్దకోడలు జయలక్ష్మి, తోడికోడలు రాధ కూతురును ఆప్యాయగా ప్రేమగా దగ్గర తీసుకునే ప్రయత్నంలో ఎన్నో అవమానాలు పొందుతది. ఈ విషయాన్ని గమనించిన భర్త, ట్రాన్స్ఫర్ చేయించుకొని పోవడంతో రాధకు ఆమె ఉనికి విలువ తెలియడమే కాకుండా, మానసిక పరిపక్వత రావడం ఒకవైపు జరుగగా, గర్భం దాల్చిన జయలక్ష్మి బిడ్డను ప్రసవించి కోరిక తీరిన వేళ అసువులు బాయడం ఈ కథలోని వస్తువు. రచయిత్రి మనస్తత్వ పరిపక్వతకు సంబంధించిన కథగా ‘కోరిక తీరిన వేళ’ ను మలిచింది.
ఓ తల్లి కథ, కోరిక తీరినవేళ ఈ రెండు కథలూ మనస్తత్వ పరిశీలనకు సంబంధించిన కథలే.
పుట్టింటి నుండి మెట్టింటికి వచ్చిన కోడలు, ఆ అత్తింట్లో దొరికే ఆదరణ అంతంత మాత్రమే అని చెప్పే సందర్భాల్నట్లే ఆ కోడండ్లు, అత్తింటి వాళ్ళను ప్రేమాదరణలను చూపని సందర్భాలుంటాయని, ఉన్నాయని ఒప్పుకొని తీరవలసిందే. ఆ కారణంగా కదా, వృద్ధాశ్రమ పరంపరలు వెలుస్తున్నై. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకొని యోగ్యులుగా చేసిన అత్తామామలు వచ్చిన కోడళ్ళకు పరాయి వ్యక్తులుగా కనబడటం సాధారణమై పోయింది. భర్త వాళ్ళ సొంతం. తనకు తన తల్లిదండ్రులకు ప్రేమ, అభిమానం ఉన్నట్లు, భర్త తన తల్లిదండ్రులను అక్కాచెల్లెండ్లను పట్టించుకోకూడదు అన్న నిశ్చితాభిప్రాయంతో ఉంటున్నారు. ఈ వస్తువు ఆధారంగా సులోచన రాసిన కథే ‘యుగళగీతం’.
రవి మూడేండ్లవాడుగా, పద్మ ఆరేండ్ల వయసులో ఉన్నప్పుడే భర్త చనిపోగా అప్పడాలు వత్తి, వంటావార్పులు చేసి పిల్లలను నానా కష్టాలు పడి పెంచి యోగ్యులుగా చేసిన తరువాత రవి భార్యగా కాపురానికి వచ్చిన శశిరేఖకు, ఆడబిడ్డ పద్మ అన్నా, అత్త శాంతమ్మ అన్నా చిరాకు. తన కాపురంలోకి వాళ్ళు కాలు పెట్టడానికి అయిష్టతను చూపిస్తుంది. రవి కాపురాన్ని కండ్లారచూసి వాళ్ళతో కాలం వెళ్ళబుచ్చుకుందామని వచ్చిన శాంతమ్మను, దిగబెట్టడానికి వచ్చిన పద్మల పట్ల అసంబద్ధంగా ప్రవర్తించటంతో గోడక్కొట్టిన బంతిలా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయిన విషయం శశిరేఖ అక్క సురేఖకు తెలుస్తుంది. నాటకీయంగా తను వచ్చినప్పుడు రవిని విముఖంగా ఉండమని చెప్పి శశిరేఖలో పరివర్తన వచ్చేట్లు చేస్తుంది సురేఖ. సాధారంగా కోడలి పుట్టింటివాళ్ళు తమ బిడ్డకు ఏ కష్టం రాకూడదని, సుఖపడాలని అత్తామామలను పట్టించుకోకపోయినా ఫర్వాలేదని భావిస్తారు. అన్ని సమయల్లో ఇది నూటికి నూరు పాళ్ళు సత్యమని చెప్పలేం. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ చెల్లెలు సంసారం ఒడిదుడుకులు లేకుండా సాగాలని కోరుకున్న అక్క సురేఖను సులోచనను ఆదర్శప్రాయంగా చూపించింది ఈ కథలో.
సామాజికంగా స్త్రీలు అన్న భావనలో న్యూనత, వారి పట్ల వివక్ష, వారి కదలికలలో అనేక నిబంధనలు ఉన్న విషయం వాస్తవమే అయినప్పటికీ స్త్రీవాదం పేరిట ప్రతి విషయంలో మగవాళ్ళను తప్పు పట్టడం సరియైంది కాదని చెప్పే కథే ‘హరిప్రియ’. మొదట్లో అన్నింటా మగవాళ్ళను తప్పుపట్టడం అనవాటైన హరిప్రియ జీవితం ఇచ్చిన అశేభవంతో భర్త హరిని అతని కుటుంబాన్ని కంటికి రెప్పలా చూచుకోవడం ఈ కథలో చూస్తాం.
గతంలో పెళ్ళిళ్ళలో పెళ్ళి చేస్తున్న కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవటమో లేదా కొంత వెసులుబాటు కల్పించడమో, కారణాలుగా తృణమో ఫణమో కట్నాల పేరిట చదివించేవారు. కాలక్రమేణా కట్నాల రూపం మారిపోయింది. పెళ్ళి చేసుకుంటున్న కుటుంబానికి ఉపయోగపడుందా లేదా అన్న దృష్టి లేకుండానే చెత్తా చెదారాల రూపాల్లో పనికిరాని వస్తువులు చేరిపోతున్నై. పైగా తెచ్చిన కానుకల విలువలను బట్టి అతిథులను గౌరవించడమూ మామూలైపోయింది. వస్తువు ఏ విధమైన ప్రతీకను వ్యక్తం చేస్తున్నది అనే అభిప్రాయాలను పక్కన పెట్టి దాని విలువ అంచనా వేయడమూ జరుగుతున్నది. విద్య వివేకాన్నిస్తుందని చెప్తారు. కానీ ఉన్నత చదువులు చదివి ఆర్థికంగా ఎదిగినప్పటికీ కూడా డబ్బు విలువతో మనుషుల్ని గౌరవించడమూ జరుగుతున్నదన్న సందేశంతో రాసిన కథే ‘కానుక’.
ఎంతో ప్రేమతో స్నేహితురాలికి ‘తాజ్ మహల్’ నమూనాను బహుమతిగా ఇస్తుంది క్రాంతి. పెళ్ళికూతురు రాధ తల్లి ఈసడించడమే కాకుండా క్రాంతి పెళ్ళికిచ్చిన చెవి కమ్మలను గుర్తుచేయడంతో, క్రాంతి తన వేలి ఉంగరాన్ని రాధకిచ్చి ఇంటికి తిరుగుముఖం పడుతుంది. డబ్బుకిచ్చే విలువ స్నేహానికి ఇవ్వకపోవటాన్ని ఈ కథలో గమనిస్తాం. ఆర్థికంగా నిలదొక్కుకున్న వాళ్ళకు స్వచ్ఛమైన ప్రేమాభిమానాలు ఏమాత్రం కనబడవని సులోచన తేల్చి చెప్పింది.
అత్తవారింట్లో కోడళ్ళకు ఆదరణ దొరకనట్లే అల్లుండ్లకు ఆదరణ కరువౌతుందని చెప్పే కథే. ఇల్లరికపుటల్లుడు చుట్టం చూపుగా అల్లుడొస్తే గౌరవ మర్యాదలకేం కొదువుండదు. కానీ, ఆ గౌరవ మర్యాదలు కూడా అల్లుడి ఆర్ధిస్తోమతపై ఆధారపడి ఉంటాయి. కోడళ్ళ పరిస్థితి ఆ క్రమంలోనే అక్కడక్కడ కొనసాగుతుంటుంది. ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా జీవితంలో నిలదొక్కుకోని ఓ పేద ఇల్లరికపుటల్లుడి కథే ఇది.
వ్యక్తి స్వేచ్ఛ లేకుండా, స్వంత అభిప్రాయాలకు నిర్ణయాలకు గౌరవం ఇవ్వకుండా, జీవితంలో నిలదొక్కుకునే అవకాశాలు ఇవ్వకుండా డబ్బున్న అత్తగారి కుటుంబం అడుగడుగునా అవమానించడమే కాకుండా, తిండికి మొహం వాచేటట్లు చేయడమే కాదు, అతని కోసం వచ్చిన స్నేహితులకు ఆతిథ్యమివ్వకుండా సూటిపోటిలనడం వంటి ఇల్లుటల్లుడి దీనిస్థితి రచయిత్రి ఈ కథలో వివరించింది. తనకు తోచిన ఉద్యోగం చేసి తన ఆత్మగౌరవం ఆ అల్లుడు దక్కించుకునాఢన్న -సందేశంతో కథను ముగిస్తుంది సులోచన.
సమసమాజంలో పేద ధనిక భేదాలుండకూడదని వాళ్ళ శ్రమను గుర్తించి తగిన మూల్యం చెల్లించాలని వాళ్ళకు సమస్త సౌకర్యాలు కల్పించాలని సోషలిజం చెప్తున్నది. కానీ సమాజంలో మౌలిక ఆలోచనలు మార్పులు రాకుండా ఆ తారతమ్యాలను పోగొట్టడం సాధ్యం కాదని చెప్పే కథే ‘శోభాదేవి’.
విద్యావంతురాలై సమసమాజ స్థాపన భావాలు గల శోభాదేవి అత్తవారింట్లో పనివాళ్ళకు కూడా తమవంటి సౌకర్యాలు కల్పించాలని, విశ్రాంతికి అవకాశం ఇవ్వాలని, సీలింగ్ లో పోయే భూమిని వాళ్ళకిచ్చి వ్యవసాయానికి అవకాశం కల్పించాలని అనుకొంటుంది. అత్తామామలకు సలహా ఇచ్చి అనుకున్నట్టే వాళ్ళ పేర భూముల పట్టా చేయిస్తుంది. పనివాళ్ళను తమతో సమాన హోదాలో చూడాలన్న ఉద్దేశంతో సినిమాలో తనతోపాటు కూర్చోమని సలహా ఇస్తుంది. కానీ ఆమె ఆలోచనలన్నీ తలకిందులై పనివాళ్ళు పనిచేయడానికే విముఖత చూపడం, ఇచ్చిన భూములను అమ్ముకోవడం, సమానంగా కూర్చోమనడంలో అక్రమ సంబంధానికి అనుమతి ఇవ్వడంగా అర్థం చేసుకుంటారు ఆ పేదజనం.
సమసమాజం అనేది కేవలం డబ్బున్నవాళ్ళు, లేనివాళ్ళకు పైస ఆస్తులను పంచి పెట్టడం వల్ల రాదని అట్టడుగు ప్రజల నుండి పై వరకూ గల సిద్ధాంత చైతన్యంతో మాత్రమే సాధ్యమన్న విషయాన్ని రచయిత్రి ఈ కథలో సూచించింది.
మనోసౌందర్యం కన్నా, బాహ్యసౌందర్యాన్ని చూచి గౌరవించటం, అభిమానించటమూ సమాజంలో చాలా సాధారణం. ఆశ్చర్యమేమిటంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పిల్లల అందాన్ని చూసి ఆప్యాయత చూపుతుంటారు. అందవీమలను అవమానపరచటమూ, నిరాదరణకు గురిచేయడమూ అక్కడక్కడ తటస్థపడుతూ ఉంటుంది. ఈ కోణంలో రాసిన కథే ‘తప్పు నాదా!’. అందంగా లేని జయకు ఇంట్లో అడుగడుగునా అవమానాలే. చివరకు పెళ్ళి కూడా అదే తంతులో జరగడం. చేసుకున్న భర్త కూడా జయ చెల్లెలు శ్రీలతనే ఆకర్షించచూడటం, తనను కేవలం పనిచేసే వ్యక్తిగా చూడటం భరించలేని జయ చాయ లో నిద్రమాత్రం కలిపి చెల్లెల్ని చంపి జైలుపాలు కావటం కథగా సులోచన మలిచింది. కథలో జయను నేరం చేయించడంలో భర్త, తల్లిదండ్రుల ప్రవర్తనే కారణం. అవమానాలను భరించి భరించి ఇక ఓర్చుకోలేని పరిస్థితి ఆమెను నేరస్తురాలిగా చేసిందని రచయిత్రి ఈ కథలో చెప్పుకొచ్చింది.
విదేశాల్లో ఉద్యోగాలు చేసి వచ్చి ఇండియాలో నిజాయితీగా అధ్యాపకవృత్తిని చేపట్టలేని విషయంతో పాటు రైల్వే అధికారులు అక్రమంగా సామాన్లను (బియ్యాన్ని) రవాణా చేస్తున్న వారిని వదిలేసి, కిలోన్నర బియ్యం తీసుకుపోతున్న వాడికి శిక్ష వెయ్యడం వంటి నిజాయితీపరులకు జరుగుతున్న న్యాయాన్ని ఎత్తిచూ పేదే ‘సిన్సియారిటీ ఖరీదు’ లేదా ‘ఎంగిలి కూటి కథ’.
క్రికెట్ విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలతో బెట్ కట్టి ఓడి, హోటల్లో జేబులు ఖాళీ కావడంతో చేతి గడియారాన్ని పోగొట్టుకున్న హాస్య కథ “ఖాళీ జేబులు- జాలీ మనసులు’.
అడిస్ అబాబాలో ఇద్దరాడవాళ్ళు డ్రైవింగ్ లో ప్రావీణ్యం లేకుండానే కారు నడిపి గాయాలపాలై హాస్పిటల్ లో చేరి హాస్య కథే ‘మధురక్షణాలు’.
కోరల్ బీచ్ లో ఆనంలో కొంత సమయాన్ని గడిపిన అమ్మాయి చనిపోయి పదేళ్ళయిందన్న విషయం తెలిసి అతను ఖంగైపోవటం కోరల్ బీచ్ లో కొన్ని క్షణాలు కథలో సారాంశం. కోరల్ బీచ్ లో దయ్యాలు సంచరిస్తాయన్న నమ్మకం ఆధారంగా రచయిత్రి ఈ కథను రాసింది.
ఈ సంకలనంలో ఉన్న ఇరవై కథల్లో అణికాడు, అసూయ, పంజరం విడిచిన పక్షి, తాడికింద పాలు, హక్కు కథలు స్త్రీల సమస్యలకు సంబంధించిన కథలు.
‘కోరిక తీరినవేళ’ కథ సంతానం లేని కారణంగా స్త్రీ తల్లడిల్లే మనస్తత్వాన్ని వెల్లడిస్తే, బిడ్డపై మమకారంతో బిడ్డ స్థానంలో భార్యగా వచ్చిన మరో స్త్రీని సహించలేని అసూయా ద్వేషాలకు సంబంధించిన కథ ‘ఓ తల్లి కథ’. కుటుంబంలో, సమాజంలో జరిగే అవమానాల కారణంగా నేరస్తులుగా మారుతారని చెప్పే కథ ‘తప్పు నదా!’. ఈ మూడు కూడా మనస్తత్వానికి సంబంధించిన కథలు. అత్తింట్లో కోడళ్ళకే కాదు ఆర్ధిక స్తోమతలేని ఇల్లరికపుటల్లుళ్ళకుండే అవమానాలను వివరించి చెప్పే కథ ‘ఇల్లరికపుటల్లుడు’. స్నేహాన్ని కట్నకానుకలతో తూచే కథ ‘కానుక’. ఆడవాళ్ళూ అత్తింటివాళ్ళను నిరాదరణతో చూస్తారని చెప్పే కథ ‘యుగళగీతం’. అన్నివేళలా మగవాళ్ళను తప్పుపట్టడం సరియైనది కాదని చెప్పే కథ ‘హరిప్రియ’. ఆడపిల్లల్ని ఆటపట్టించి వాడుకో చూసుకునే కథలుగా ‘రోమియో’ ‘పాపం పసివాడు’ కథలు. ఆడపిల్లలు మగపిల్లల్ని ఆట పట్టించిన కథగా ‘ఖాళీజేబులు- జాలీమనసులు’. సమసమాజం అనేది చిన్నాచితకా సహాయాలు వ్యక్తికంగా చేయటం వల్ల రాదని చెప్పే కథ ‘శోభాదేవి’. ఇండియాలో కోరలు చాస్తున్న అవినీతిని వెల్లడించే కథ ‘సిన్సియారిటీ ఖరీదు’ లేదా ‘ఎంటిలికూటి కథ’. తమకు ఏ మాత్రం డ్రైవింగ్ లో ప్రావీణ్యం లేకపోయినా ప్రయత్నించి అభాసుపాలైన ఇద్దరాడవాళ్ళ కథ ‘మధుర క్షణాలు’. ఇక ‘దయ్యాల నమ్మకానికి సంబంధించి కథగా ‘కోరల్ బీ’లో ‘కొన్ని క్షణాలు’గా అనేక కథలను మాదిరెడ్డి సులోచన వ్రాసింది.
అయితే ఈ కథలన్నీ గమనించినప్పుడు మాదిరెడ్డి సులోచన ఏదో ఒక సిద్ధాంతానికో, అస్థిత్వవాదానికో కట్టుబడి లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. మంచి చెడు అనేది ధనిక పేద ఆడా మగా తేడాలతో ఉండదని ఆమె కథలు చెప్తాయి. పరిస్థితులు మంచి వాళ్ళను నేరస్తులను చేస్తాయని చెప్పడంతో పాటు హాయిగా నవ్వుకొని ఆనందపడే కథలను కూడా రాసింది.
కథల్లో శిల్పానికి కొదువలేదు. ఆమెకు గల విదేశీ పరిజ్ఞానాన్ని కూడా ఈ కథలు వెల్లడిస్తాయి. అంతేకాకుండా ‘తినబోతూ రుచులెందుకు’ ‘పొరుగింటి పుల్లకూర రుచి’ ‘తమ్ముడు తన వాడైనా తగు ధర్మం చెప్పాలంటారు’ అద్దాల మేడలో ఉండేవాడు ఇతరులపై రాళ్ళు రువ్వకూడదు’ వంటి అనేక సామెతలను కూడా కథల్లో పొందుపరిచిప్పదలచుకున్న విషయానికి బలం చేకూర్చింది.
ఏది ఏమైనా అతి తక్కువకాలంలో ఎక్కువ రచనలను చేసి తెలంగాణ రచయితల కీర్తిని పతాకస్థాయికి చేర్చింది. ఇంకొంత కాలం బతికుంటే ఎంత ఘనకీర్తి లభించేదో మరి!