మాదిగ వృత్తి వలపోత – “అలకల పోత”

సమాజంలోని ఏ సామాజిక సమూహాన్ని చూసినా దానిలో మూడు అంతర్వులు కనిపిస్తాయి. వ్యవస్థలో ఇప్పటికి అట్టడుగుననే ఉండి అవకాశాల కోసం తల్లడిల్లేవారు కొందరు. సమాజం అందించిన అవకాశాలను అంది పుచ్చుకొని మధ్యతరగతిగా ఎదిగి, ఉట్టికి స్వర్గానికి ఎగరని పరిస్థితిని ఎదుర్కొనేవారు కొందరు. దొరికిన అవకాశాలను సంపూర్ణంగా స్వంతం చేసుకొని, కోట్లకు పడగలెత్తి చుట్టపు చూపుగా తమ సమూహంలోని అణగారిన వాళ్ళ గురించి కొంత సానుభూతి ప్రకటిస్తూ, తమ స్థానాలను పదిలంగా కాపాడుకొనేవారు కొందరు.

పైన వివరించిన మూడు తరగతుల సమూహాల్లో అట్టడుగు నుండి ఎదిగి మధ్యతరగతిగా మారిన వాడు తప్పెట ఓదయ్య. తను పుట్టి పెరిగి, అనుభవించిన మాదిగ సమూహం యాతనను ”అలకల పోత” కవితా సంపుటిలో రూపు కట్టించినాడు.

పెట్టుబడిదారి పూర్వ సమాజంలో వ్యవసాయ ఉత్పత్తికి, దానికి అనుబంధంగా కొనసాగిన వృత్తుల్లో – వడ్ల, కమ్మరి, మాదిగ వృత్తులు ముఖ్యమైనవి. వడ్ల దాతి దగ్గర నాగండ్లు, గుంటుకలు, జంబులు తయారు చేయటం, లేకుంటే చెడిపోయిన వాటిని మరమ్మతు చేయటం వీరి పని. కర్రు, కొడవలి, గొడ్డలి, గడ్డపార (పార), పలుగు, కచ్చురాలకు బొడుశీల, కందెన శీలలు కమ్మరి వాళ్ళు చేస్తారు.

మాదిగలు దందెడ, తొండపుతాడు, ఆండ్ర, పగ్గాలు, ముగుదాళ్ళు, తనుగులు, మోకుదాళ్ళు, నులక, చీపురు మొదలైనవి తయారు చేస్తారు. రైతులకు పైన తెలిపిన మూడు వృత్తుల వాళ్ళకు ఒక ఒప్పందం ఉంటుంది. ప్రతి పంటకు రైతుకు వ్యవసాయానికి అవసరమైన కొత్త వస్తువులు కాని లేక పాత వస్తువుల మరమ్మతు కాని వడ్ల, కమ్మర్లు చేస్తరు. మాదిగలు తొండం, చెప్పులు, తాళ్ళు తనుగులు పంటపంటకు అందిస్తారు. ఇట్లా చేసిన పనిని ”చాత” అంటారు. పంట పండినంక రైతు తనకు ఉన్న వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని బట్టి ఇరుస, కుంచెడు గింజలు పెడతారు. దీన్ని ”బాపతు” అంటారు.పేదరికంలో పుట్టిన మాదిగలకు నిజాయితీగా పని చేస్తేనే బతుకు తెరువు. లేకుంటే ఎవరు దగ్గరికి రానీయరు.

”మాట పోతే పానం పోయినట్టే
మాట మీదనే బతుకు బరోసా” (సాత)
ప్రకృతిలో దొరికే ఈత, తాటి మట్టలే నారచీరి, వీళ్ళు తాళ్ళు తనుగులు పేనడానికి వనరుగా ఉపయోగిస్తారు. పశువుల చర్మం చెప్పులు చేయడానికి ముడి సరుకు. బజారులో నిలబడి ఒకరు పురి తిప్పుతుంటే మరొకరు దానికి చిన్న చిన్నగా చీరిన నార పోసలను జత చేస్తరు. ఇది తాడు పేనే పద్ధతి.
”పురి పెడుతుంటే,
రుంగ జుట్టుక పోయే ఈత నార,
చిక్కులు దీసే సున్నిత బుద్ధి
తడిలేని తనానికి కరిలేని అల్లిక” (సాత)
నులక పేనినప్పుడు చేతులకు లగ్గలసొంటి పొక్కులు వస్తాయని తన అనుభవాన్ని కవిత్వీకరించిండు కవి.

తాము పని చేసే రైతు ఇంట్లో పశువు చనిపోతే, విధిగా దాన్ని తీసుకపోయి, ఊరి బయట పారవేసి చర్మం ఒలుస్తారు. ఆ చర్మాన్ని శుద్ధి చేయడంలో ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని సంచి మాదిరిగా కుట్టి, దానిలో తంగెడు చెక్క పొడి, సున్నం నీళ్ళు నింపి కొద్దిరోజులు మురుగపెడతారు. నిర్దిష్ట సమయం నానబెట్టిన తర్వాత కత్తితోని వెంట్రుకలు లేకుండా నున్నగ గీకుతారు. కర్రతోని చీకులు చేసి చర్మాన్ని పరిసి, చీకులను దాని సుట్టు కొట్టి ఆరబెడుతరు. ఎండిన తర్వాత ఆ చర్మంతోని చెప్పులు చేస్తరు.
”ఇంటి ముందర దర్శన మిస్తున్నా
రెండు లందగోళాలు
నిన్నటిదాకా నిండుదనంతో
కళకళలాడిన జీవన భాండాగారాలు
నేడు అస్తిత్వం కోల్పోయిన నిర్జీవ రూపాలు” (లందగోలెం)
”లందగోలెం” ఒక పురాజ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఈ కవి ఎవరు స్పృశించని వస్తువులను తీసుకొని కవిత్వంగా మలచటం, ఆయన పరిశీలన దృష్టికి ఒక మచ్చుతునకగా నిలుస్తుంది.
కల్లం లేసిన తర్వాత కారిపోయిన గింజల గురించి అన్వేషణ మొదలవుతుంది. ఒక చేతిలో వెంపలి కట్టెలతోని కట్టిన చీపురు, మరొక చేతిలో ఒక చాటతోని బయలుదేరుతుంది ఒక తల్లి. ఆమె ముద్దుపేరు ”లేకి” తల్లి.

”శనార్తులు తల్లీ!” కవిత లేకి తల్లి మీద రాసినది. ఈ కవిత మాదిగ స్త్రీల జీవితాన్ని చిత్రీకరించింది. కల్లంలో దొరికే సోలెడో, అరసోలెడో గింజల కోసం బండ్లకొద్ది దుమ్మును జల్లెడ పడుతుంది. ఏమైనా గింజలు దొరికితే సరే లేకుంటే ఉత్త చేతులతోని ఇంటికి పోతుంది. ఒకవేళ కొన్ని గింజలు దొరికితే వాటితోని కన్నబిడ్డల ఆకలి తీరుస్తుంది. లేకుంటే ఇంటిల్లిపాది పస్తులే.

ఈ పరిస్థితి ఈనాటికీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో కొనసాగుతుంది. దానిలో ధాన్యం కొనే అడ్తిదారు దగ్గర కొద్దిమంది మహిళలు ఉంటారు. కొద్ది మంది హమాలీలు ఉంటారు. రైతు నేరుగా మార్కెట్‌కు అమ్మేకంటే అడ్తిదారుకు అమ్ముతడు. పండిన పంటలో పొట్టు, తాలు, తప్పలు లేకుండా చేసి గట్టి గింజలను అప్పజెప్పే బాధ్యత లేకివాళ్లది. పంట కొలిచిన తర్వాత మిగిలిన గింజల్లో నుండి కొన్ని పెట్టుమని బతిమిలాడుతుంటరు రైతులను. క్వింటాల్‌ కు ఇంత అని అడ్తిదారు ఇచ్చినా వాళ్ళకు దక్కేది ఆ అడుక్కున్న గింజలే.

”లేమిదానివని, లేకిదానివని” నిందలు మోసిన ఆమెను ”పిడికెడు మెత్కుల కోసం, అవుగోలిస్తూ అంగలారుస్తూ, కల్లమూడ్చి పస్తులున్న దినాలు” (సెనార్తులు తల్లి) కవి స్మృతిపథంలో మెదులుతాయి.

హరితవిప్లవం అమలు జరిగిన తర్వాత పంటల విధానంలో, పండించే పద్ధతుల్లో ఎన్నో మార్పులు వచ్చినాయి. వ్యవసాయ యంత్రీకరణ జరిగి మోటబావులు పోయి, రాట్లు, ఆయిల్‌ ఇంజన్లు, కరెంటు మోటర్లు, బోరుబావులు వచ్చినాయి. తొండం పురాజ్ఞాపకంగా మిగిలిపోయింది. ప్లాస్టిక్‌ తాళ్ళు, తనుగులు పగ్గాలు వచ్చిన తర్వాత నారచీరి తాళ్ళు పేనే పని నుండి మాదిగలు గెంటివేయబడ్డారు. చెప్పులకు కార్పొరేట్‌ కంపెనీలు వచ్చినాయి. ఈ విధంగా మాదిగల వృత్తి పోయింది. ఒక్క చావుడప్పు కొట్టటం మాత్రమే వీరికి మిగిలింది.

ఆధునిక పారిశ్రామిక నాగరికతలో కమ్మరులు వెల్డింగు పనివారుగా మారినారు. వడ్రంగులు ఫర్నీచర్‌ షాపులు పెట్టుకున్నారు. మాదిగల వృత్తి అంతరించి పోయింది.
”అలకలపోత” కవిత ఈ వృత్తిలో ముఖ్యంగా చెప్పుగూడల మీద సన్నని లేత చర్మాన్ని జడ మాదిరిగా అల్లి దాని అందాన్ని ఇనుమడిపం జేయడమే అలకల పోత. ఈ కవితా సంపుటిలోని (55) కవితలు తెలంగాణ భాషలోని మట్టిపరిమళాలను వెదజల్లుతాయి. ఈ కవితా సంపుటి మాదిగ వృత్తి యాతనను ఎత్తిపట్టింది.

కరీంనగర్ పట్టణంలో నివాసం. చేనేత జౌళి శాఖ లో ఉప సంచాలకులు గా పని చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాద్ విశ్వ విద్యాలయం నుండి MA; MPhil. చెరబండరాజు నవల మీద MPhil, కట్టెపలక కవిత సంపుటి వెలువడింది. సాహిత్యం అధ్యయనం, కవిత్వం, వ్యాస రచనా, సాహిత్యంలో సమాజం అభిమాన విషయాలు.

One thought on “మాదిగ వృత్తి వలపోత – “అలకల పోత”

  1. వ్యాసం చాలా బాగుంది. చాలా సామాజికాంశాలు స్పృశించారు. మీరు మరిన్ని రచనలు చేయాలని మా కోరిక

Leave a Reply