ప్రపంచ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా అన్ని రకాల హింసలకు, పీడనలకు, అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజాసంఘాల కృషి గురించి మరొక్కసారి చర్చించుకుందామని “కొలిమి” టీం భావించింది. అందులో భాగంగా హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న ప్రజాసంఘాల మానవహక్కుల దృక్పధాన్ని తెలుసుకోవడంతో పాటుగా వారి ఆలోచనల అమలులో ఎదురయ్యే అనుభవాలను కొలిమి పాఠకులకు అందించాలని అనుకున్నాము. అందులో భాగమంగానే “మానవ హక్కుల వేదిక”తో మా ఈ సంభాషణ.
కొలిమి: గత కొన్ని సంవత్సరాలుగా “మానవహక్కుల దినోత్సవం” కూడా ఒక పండుగలా మారిపోయింది. కాని మీలాంటి సంఘాలు అనునిత్యం హక్కుల పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు, పోరాడుతున్నారు. అయితే ఈ “పండుగ” సందర్భంలో మానవహక్కులను, పౌరహక్కులను మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు.
మానవ హక్కుల వేదిక: ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం అంటే డిసెంబరు 10 తేదీన జరుపుకునేది. ప్రభుత్వ విభాగాలూ, విద్యాలయాలూ ఇంకా కొందరూ ఆ రోజును ఓ తంతుకి కుదించి వేస్తాయి. 1948 డిసెంబర్ 10 న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను ఆమోదించింది అని ఆ ప్రకటనలోని 30 ఆర్టికల్స్ ని ఓ సారి మననం చేసుకుని మమ అనిపిస్తారు. మానవ హక్కుల పరిరక్షణకు అందరూ పాటు పడాలని వేదికలకనెక్కి ఉపన్యాసం ఇచ్చి దులుపుకు పోతారు పాలకపక్షం లోని రాజకీయ నాయకులు. భారత సాయుధ బలగాలు అయితే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మానవ హక్కులు ఎలా ఆటంకంగా తయారయ్యాయి అని ఉపన్యాస పోటీలు పెడతాయి! మానవ హక్కులను “గౌరవించడంలో” ఇది పరాకాష్ట. And this is possible only in India, that too under the Modi’s regime. కానీ మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పని చేసే మాకు ప్రతి రోజూ డిసెంబర్ పదే! అంటే మేము ప్రతిరోజూ మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆలోచిస్తూనే ఉంటాం.
హక్కుల లేమి అనేది వ్యవస్థీకృత హింస నుంచీ, వ్యవస్థీకృత అసమానత్వం నించీ ఉద్భవిస్తుంది. ప్రతి మనిషి లోనూ సమానత్వ భావన కలగాలని, తన చైతన్యంతో, జీవన శైలిలో, అంటే ఆచరణలో, సమానత్వం అంతర్భాగం కావాలి అనీ, హింసా-దౌర్జన్యాలు లేని వ్యవస్థ ఏర్పడాలి అనీ మానవ హక్కుల వేదిక భావిస్తుంది. ఇందులో హక్కుల స్పృహ, అదే… సోయి… చాలా కీలకమైనది. అప్పుడే హక్కులు అనేవి వాటంతట అవే ఎంత ప్రాముఖ్యం కలవో అర్థం అవుతుంది. ఆ సోయి ని కలిగించే కృషిలో మేమున్నాం అనేది మాకు ఒకింత గర్వాన్ని కలిగిస్తుంది.
హక్కులను వ్యవస్థీకరించే కృషి, వాటిని ప్రజల అనుభవం లోకి తీసుకొచ్చే పని చాలా కీలకమైనవి. ప్రజలు సమూహాలుగా అనేక ఆకాంక్షలను వ్యక్తీకరిస్తారు. వాటికోసం ఉద్యమాలలో కి వస్తారు. తమ కోరికలను తీర్చమని అధికారంలో ఉన్న వారిని అడుగుతారు. సరే అని చెప్పే పాలకులు ఆ ఆకాంక్షలకు చట్ట రూపం కల్పించేటప్పుడు ఆ ఆకాంక్షలను వక్రీకరించడం లేక వాటిని కుదించి వేయడమో చేస్తారు.
పోనీ చట్టం అయితే వచ్చింది కదా ఇక ప్రభుత్వం ఆ చట్టాన్ని సమగ్రంగా అమలు చేస్తుంది అని ప్రజలు భావించడం సహజం. అయితే చట్టాల అమలులో నిర్లక్ష్యం, నిర్లిప్తత బురాక్రసీ లో కొట్టొచ్చినట్లుగా కనిపించే అంశాలు. రాజ్యం లో ఉండేటటువంటి శాసన నిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ చక్కగా పని చేస్తే హక్కులు ప్రజల అనుభవంలోకి వస్తాయి. ఈ రెండు విభాగాలు సరిగ్గా పనిచేయని చోటే మూడవ విభాగం అయినటువంటి న్యాయవ్యవస్థ దగ్గరికి ప్రజలు వెళతారు.
చట్ట సభలు చేసిన శాసనాలే అసమగ్రంగా ఉన్నాయని, ప్రజల హక్కులను హరించి వేసేలా ఉన్నాయని చెప్పే వారి మీద ప్రభుత్వం, అంటే కార్యనిర్వాహక విభాగం, కక్ష పూరితంగా విరుచుకుపడుతున్నది. ఇక ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిని దేశద్రోహులుగా పరిగణిస్తున్నారు.
ప్రజల ధర్మాగ్రహానికీ, ఉగ్రవాదానికీ తేడా చెరిపేసే రకంగా ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. ఇటీవలే న్యాయ వ్యవస్థ కొంత చురుకుగా ఈ విషయంలో పనిచేస్తున్నది.
అలా ప్రశ్నించిన గొంతుకలను నులిమి వేయడానికి, పలు నిర్బంధ చట్టాలతో ప్రభుత్వం సాయుధమై ఉంది. కనీస రాజ్యాంగ విలువలను కూడా గౌరవించని చట్టాలు అవి. మానవ హక్కులను కాలరాసే చట్టాలు అవి. ఆ చట్టాల కింద ఆరోపణలను ఎదుర్కొనే వ్యక్తికి బెయిల్ రాకుండా చేసేటటువంటి చట్టాలు అవి. కోర్టుల చేతులను కూడా కట్టివేసే చట్టాలు అవి.
సంవత్సరాల తరబడి జైలులోనే బంధించి ఉంచే చట్టాలు అవి. ఈ నిర్బంధం నుంచి బయటపడటానికి రాజ్యంలోనే మూడవ విభాగమైన న్యాయవ్యవస్థ వద్దకు హక్కుల కార్యకర్తలు వెళ్లాల్సి ఉంటుంది. లేదా బాధితులు వెళ్లాల్సి ఉంటుంది.
హక్కుల పరిరక్షణ లో ఇది కీలకమైన దశ. ప్రక్రియ. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ప్రజల ముందు పెట్టి, ప్రజల నుంచి ఒత్తిడిని పెంచడం ఒక పని అయితే, కోర్టులను ఆశ్రయించడం మరో పని. మొదటిది ఉద్యమ రూపం తీసుకుంటుంది. హక్కుల రంగంలో పనిచేసే కార్యకర్తలు ఈ రెండు రంగాల్లోనూ నైపుణ్యాన్ని పెంచుకోవాలి. అది నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియలో మేం నిత్యం నిమగ్నమై ఉంటాం.
ఇంకా పౌరసమాజం లోనే ఉండే ఆధిపత్య వ్యవస్థలు చేసే హక్కుల ఉల్లంఘన.
ఇందాక చెప్పిన దాంట్లో స్టేట్ ని మేము ఒక హక్కుల ఉల్లంఘనకు వనరుగా చూస్తాం. పౌర సమాజం లో ఉండే ఆధిపత్యకులం, మెజారిటీ మతము, పెట్టుబడి, భూమి సంబంధాలు, పురుషాధిక్యత, ఇలాంటివి కూడా హక్కుల లేమికి వనరులుగా పనిచేస్తున్నాయి. ఆధిపత్యము, సాంస్కృతిక వెనుకబాటుతనం రెండూ కూడా వీటికి కారణమవుతున్నాయి. పౌర సమాజం లోని ఆధిపత్య వ్యవస్థలు హక్కులను ఉల్లంఘించినట్లు అయితే అప్పుడు, ప్రజల హక్కులను రక్షించే బాధ్యత కూడా తనకు ఉందని ప్రకటించుకున్న రాజ్యాన్ని హక్కుల కార్యకర్తలు అడుగుతారు. అలా రాజ్యపు బాధ్యతలను హక్కులను పరిపుష్టం చేయడానికి వాడమని రాజ్యాన్ని అడుగుతారు.
అంటే ఒకవైపు రాజ్యం చేసే హక్కుల ఉల్లంఘనని తీవ్రంగా విమర్శిస్తూనే, పౌర సమాజంలో జరిగే హక్కుల అతిక్రమణలను, ఉల్లంఘనలను పట్టించుకొమ్మని రాజ్యానికి తన బాధ్యతను గుర్తు చేస్తుంటాము.
హక్కుల ఉల్లంఘనలకు, హక్కుల లేమికి కారణమవుతున్న వనరులను, హక్కుల ఉల్లంఘన జరిగితే ఎలా స్పందించాలి అనే విషయంలో మాకు ఎల్లప్పుడూ ఉండే స్పష్టతే ఈ “పండుగ” సందర్భంలోనూ ఉంటుంది. ఉంది.
కొలిమి: మారుతున్న సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక సంబంధాల సందర్భంలో ప్రజలకు (ముఖ్యంగా పీడితులకు) హక్కుల సోయిని కలిగించే విషయంలో ఏమైనా మార్పు వచ్చిందా? మీ పని విధానంలో ఏమైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందా?
మానవ హక్కుల వేదిక: ఏ రంగంలోనైనా మార్పు సహజమే కదా. చైతన్యయుత కార్యాచరణ ద్వారా మార్పు జరుగుతూ ఉంటుంది. నత్త నడకన సంభవించే మార్పు గుణాత్మక మార్పుకు దారి తీయదు. ఇప్పుడు జరుగుతున్న మార్పు ప్రజల హక్కులను హరించే వైపుగా సాగుతోంది. హక్కుల లేమిని అనుభవించే వారందరికీ హక్కుల గురించిన సోయిని కలిగించే విషయం లో మార్పు లేదు. నిన్నటి వరకు ఎలా చేసామో, ఇప్పుడూ అలానే చేస్తున్నాం. రేపూ అలానే చేస్తాము. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పు వల్ల ప్రజల వద్దకు ఇప్పుడు మేము చాలా త్వరగా చేరుకోగలుగుతున్నాం. ఇందుకు సోషల్ మీడియా బాగా దోహదపడుతోంది. కరోనా టైం లో భౌతికంగా కలుసుకోలేని పరిస్థితుల వల్ల ప్రతి సంస్థా చేసినట్లుగానే మేం కూడా సోషల్ మీడియా ఆసరాతో కార్యక్రమాలను సజావుగానే చేసుకోగలిగాం. ఎన్ని మార్పులు చేర్పులు చేసుకున్నా ప్రాథమిక పని విధానం మీద ఈ మార్పులు కొంత ప్రభావం కలిగించాయి. హక్కుల హననం జరిగిన ప్రాంతానికి త్వరగా చేరుకోలేకపోయాం. లేదా అసలే పోలేక పోయాం. అయినా మా జిల్లా యూనిట్లు దాదాపుగా చురుగ్గానే పనిచేస్తున్నాయి. పని విధానంలో విధానంలో మార్పులతో పాటు చేసే పనిలోనూ మార్పు వచ్చింది. ఇందుకు హక్కుల తాత్వికతను సమగ్రంగా అర్థం చేసుకోవటంలో మాలో వచ్చిన పరిణితి కారణం. ఒకప్పుడు పోలీసు హింసే మా కార్యాచరణలో ప్రధాన భాగంగా ఉండేది. హక్కుల హననానికి వనరులను ఒకటీ ఒకటీ అర్థం చేసుకోవటంతో మా పనిలో వైవిధ్యం పెరిగింది. తీక్షణత పెరిగింది. విస్తృతి పెరిగింది.
కొలిమి: ముఖ్యంగా ఏదైనా ఒక సందర్భంలో మీరు ఒక కమిటీగా నిజనిర్థారణ చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి పద్దతులు ఎంచుకుంటారు. ఇది ఒక రాజకీయ ప్రాసస్ కు, మెథడ్ కు సంభందించినది. ఒక సత్యాన్ని నిర్మాణం చేయడానికి, నిర్థారణ చేయడానికి మీరు ఎంచుకునే పద్దతులు ఏమిటి? (ఇందులో భాదితులను ఎలా అప్ప్రోచ్ అవుతారు, ఎలాంటి ప్రశ్నలు అడిగుతారు, ఎవరెవరిని అడుగుతారు…) నిజనిర్థారణ ఇలాగే చెయ్యాలనే పద్దతి వుండకపోయినా, మీ అనుభవంలో మీరు ఎదురుకున్న మంచి, చెడులను చర్చించడం అవసరం అని భావిస్తున్నాము.
మానవ హక్కుల వేదిక: ఒక విషయంలో హక్కుల హననం జరిగింది అని మాకు సమాచారం రాగానే మేము ఆ కేసులో వాస్తవాలను తెలుసుకోవటానికి నిజ నిర్ధారణ బృందంగా మేమే ఏర్పడతాం. ఆధిపత్య కులాల వారు షెడ్యూల్డ్ కులాలకి, షెడ్యూల్డ్ తరగతులకు చెందిన వారిపై చేసే దౌర్జన్యాలు, కస్టడీలో పోలీసులు జరిపే హింస, కస్టడీలో జరిగే హత్యలు, పట్టుకుపోయి చంపేసి ఎన్కౌంటర్లో అనే పేరుతో జరిగే హత్యలు, అదమరచి నిద్రపోతున్న వారిని “ఎన్కౌంటర్లో” చంపేయడాలూ, దళితుల భూములను ఆక్రమించి వారిని ఆ భూముల నుంచి బేదఖలు చేసే ఘటనలు , మహిళలపై పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులు, వరకట్న హత్యలు, లైంగిక అత్యాచారాలు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరుతో పెత్తందారులు చేసే వేధింపులు, మతోన్మాదంతో చెలరేగిపోయి మైనారిటీ మతస్తుల పై జరిపే దాడులు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అని చెప్పి భూములను సేకరించి రైతులను విస్తాపన కు గురి చేసి వారి కి నష్ట పరిహారం చెల్లింపులో విపరీతమైన జాప్యం చేయడం, పరిహారం ఇవ్వకుండానే వారిని వెల్లగొట్టడం, గ్రామీణ ఉపాధి పథకంలో పని చేయించుకుని పనిచేసిన వారికి వేతనాలను ఎగ్గొట్టడం, జాబ్ కార్డుల జారీలో అవకతవకలు, ఇటుక బట్టీల లో ఒరిస్సా నుంచి కార్మికులను తీసుకొచ్చి వాళ్లతో వెట్టిచాకిరీ చేయించుకోవడం… ఇలా దేనికదే భిన్నమైనది.
అలాగే ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు, పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారిని అడవి నుంచి తరిమివేయడం, అటవీ ఉత్పత్తులను సేకరించు కోకుండా వారిని అడ్డుకోవటం, ఆదివాసులకు ప్రభుత్వ పథకాల నుంచి రావాల్సిన రాయితీలను సౌకర్యాలను మధ్యలోనే గుటకాయ స్వాహా చేసేయడం, అడవి ప్రాంతాలలో వేసవి వస్తుందనగానే వచ్చే తాగునీటి ఎద్దడి, వర్షాకాలం మొదలవుతూనే వచ్చే విషజ్వరాలు, ప్రసూతి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆదివాసీలలో నిత్యం జరుగుతున్న బాలింత మరణాలు లాంటివి కూడా దేనికదే ప్రత్యేకమైనది.
అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి ఓపెన్ కాస్ట్ మైనింగ్, ప్రపంచమంతా బొగ్గు వాడకంతో తయారవుతున్న విద్యుదుత్పత్తిని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఈ దేశంలో దానిని విపరీతంగా పెంచి వేయటం, అణు విద్యుత్తు ప్రాజెక్టు వల్ల ప్రపంచంలో కోట్ల మంది జబ్బున పడ్డా, లక్షల మంది చనిపోయినా దాన్ని పట్టించుకోకుండా ఇక్కడ అణు విద్యుత్తు ప్రాజెక్టులను పెట్టడం, పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూ ల్డ్ ఏరియాస్, క్లుప్తంగా పెస, చట్టానికి తూట్లు పొడిచే రకంగా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించటం, అభివృద్ధి ప్రాజెక్టుల ఫలితంగా సంభవించే పర్యావరణ ప్రతికూల ప్రభావాన్ని అంచనా వేయడానికి జరిపే పబ్లిక్ హియరింగు లలో ప్రభుత్వం అనుసరించే మోసపూరిత ధోరణి లాంటివి కూడా హక్కుల హననానికి ఉదాహరణలే. ఇప్పుడు చెప్పిన అన్ని సంర్భాలలోనూ మేం నిజానిర్ధారణ కమిటీల ద్వారా వాస్తవాలను లోకానికి వెల్లడించాం.
ఇంత వైవిధ్యం ఉన్న పని చేస్తున్న మేము వాస్తవాలను సేకరించేటప్పుడు కూడా పరిశోధించే అంశాన్ని బట్టి నిజనిర్ధారణ బృందాలలో పొందిక లేడా అమరిక ఉంటుంది. భిన్న విషయాలలో నిష్ణాతులైన వారు, నిపుణులైన వారు మా సంఘంలో సభ్యులుగా ఉన్నారు. హక్కుల ఉద్యమం లోకి కొత్తగా వస్తున్న వారు సీనియర్లు చేస్తున్న పనిలో నిమగ్నమై పోయి కార్యాచరణ లోనే రాటుదేలుతున్నారు.
హక్కుల హననానికి గురైన వారు ఎవరు ?వారి చుట్టుపక్కల వారు ఎవరు? హక్కుల హననానికి గురైన వారి సామాజిక నేపథ్యం ఏమిటి ?వారి హక్కులను అతిక్రమించిన వారు రాజ్య యంత్రాంగంలో కీలకమైన వ్యక్తులా లేదా కీలకమైన డిపార్ట్మెంట్లకు చెందిన వాళ్లా, వారి సామాజిక ఆర్థిక నేపథ్యం ఏమిటి …ఈ విషయాలను పరిశీలిస్తాం.మేం పరిశీలించ బోయే అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక చట్టం ఉండి ఉంటే ఆ చట్టం ఏం చెబుతోంది దాన్ని అమలు చేయాల్సిన వాళ్లు సరిగ్గానే చేస్తున్నారా , చేయకపోతే వారికి దన్నుగా నిలబడ్డ వాళ్ళెవరు అనే అంశాలను కూడా పరిశీలిస్తాం .ఎన్కౌంటర్లు, కస్టడీ మరణాల విషయాలలో పోలీసులు అనుసరించాల్సిన చట్ట నియమాలను నిబంధనలను సరిగా అమలు పరుస్తున్నరా లేదా అనే విషయాలను పరిశీలిస్తాం. పోస్టుమార్టం జరిపిన డాక్టర్లు శవాన్ని సరిగ్గా పరిశీలించి నిజాయితీగా రిపోర్టులు రాస్తున్నారా లేక పోలీసులకు వత్తాసు గా నిలబడ్డారా అనే విషయాలను చూస్తాం.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాల వల్ల జరుగుతున్న విధ్వంసాన్ని ఈ ప్రదేశానికకే వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలిస్తాం. పర్యావరణము, వాతావరణం, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, బావులు లాంటి వాటర్ బాడీస్ ఎంత కలుషితమైపోయాయో పరిశీలిస్తాం. అక్కడ నివసిస్తున్న ప్రజల అభిప్రాయాలను కనుక్కుంటాం.
కొన్ని విషయాలలో వెంటనే ఒక అభిప్రాయానికి రాగలం. మరి కొన్ని విషయాలలో నిజాన్ని నిర్ధరించడానికి కొన్ని రోజుల పాటు , ఒక్కోసారి వారాలపాటు కూడా ఆగాల్సి వస్తుంది. సత్యాన్వేషణలో నిరీక్షణ , ఓపిక చాలా అవసరం. అంతేకానీ తొందరపడి ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించి వేయుము. సర్వ సాధారణంగా మేం ప్రకటించే రిపోర్టులలో నూటికి 99% రిపోర్టులు సందేహానికి అతీతంగా ఉంటాయి. ఇంతటి నిక్కచ్చితనానికి మేము కట్టుబడి ఉంటాం.
కొలిమి: పెట్రేగుతున్న హిందుత్వ, కుల, పితృస్వామ్య, రాజ్య హింస సందర్భంలో మీ సంఘ పరిధిలో ఇప్పుడు చేస్తున్నది, ఇంకా చేయాల్సినవి ఏమిటని మీరు అనుకుంటున్నారు.
మానవ హక్కుల వేదిక: వీటిలో రెండు రాజకీయ సమాజానికీ, రెండు పౌర సమాజానికీ సంబంధించినవి. ఆధునిక రాజ్యం లో మూడు ప్రధాన విభాగాలు: శాసన నిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ ,న్యాయ వ్యవస్థ. మానవ హక్కుల హననానికి మొదటి , రెండవ S విభాగాలు చేసినంత హాని మూడో విభాగం చేయదు. పైగా మొదటి రెండు విభాగాలు చేసే హానిని మూడవ విభాగం ముందు ఫిర్యాదు చేయొచ్చు. రాజ్య హింస అంటే పోలీసులు, సైన్యము చేసే హింస మాత్రమే అని ఒక సంకుచిత అర్థం లో మాట్లాడటం సరైంది కాదు.
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చట్టం, ,సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం … ఇవాళ అత్యంత క్రూర చట్టాలు. ఇవి కాక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకున్న పబ్లిక్ సెక్యూరిటీ చట్టాలు కూడా అలా హానికారకమైనవే. పైగా ప్రేవెంటివ్ డిటెన్షన్ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నీ చట్టసభలు చేసినవే. అంటే రాజ్యంలోని శాసన నిర్మాణ విభాగం చేసిన హింసాయుత చట్టాలు. అంటే చట్ట సభలు రాజ్యహింస కు పాల్పడినట్లే.
ఇక ‘ఉపా’ కింద పెడుతున్న కేసుల్లో 90 శాతం మంది ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు ఏమీ కాదు. అలాంటి వారి మీద కేసులు పెట్టి సంవత్సరాల పాటు జైల్లో ఉంచేస్తున్నారు. పోలీసు స్టేషన్స్ లో చిత్ర హింసలు పెడుతున్నారు. ఇది క్రిమినల్ చట్టాల సంగతి. సివిల్ కేస్ లలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారు. ఇక రెవిన్యూ యంత్రాగము ఎన్నో చట్టాలను అమలు చేయాలి. కానీ చేయదు. ఇది కూడా హింసే.
ఇక హిందుత్వ. కరోనా వైరస్ ఎలా అయితే మ్యుటేషన్సు చేసుకుంటున్నదో హిందుత్వ కూడా అట్లా మ్యుటేషన్ లు చేసుకుంటోంది. ఒకనాటి భారతీయ జనసంఘ్ కాదు ఇది.పోనీ వాజ్పేయి కాలమునాటి బిజెపినా అంటే అదీ కాదు. ఒకప్పుడు దీనికి సాంఘిక పునాది ట్రేడింగ్ కమ్యూనిటీ. కానీ ఇవ్వాళ ఆదివాసుల నుంచి బ్రాహ్మణుల దాకా దాని సాంఘిక పునాదిని విస్తరింప చేశారు. అందుకే ఈ వైరస్ ప్రమాదకారి.
ఇక ఆధిపత్య కుల పెత్తనం. ఇది జుడిషియరీ లోకి కూడా పాకింది. లేకుంటే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద సుప్రీంకోర్టు అలాంటి తీర్పును ఇవ్వగలిగే ఉండేదా? పురుషాధిక్యత అంటే మగ వాడిలో వ్యక్తమయ్యే పెత్తనం మాత్రమే కాదు. ఆడవాళ్ళ చైతన్యంలో కూడా ఇంకిపోయిన మగపెత్తనం.పని ప్రదేశాలలో స్త్రీలపై లైంగిక వేధింపుల నుంచి మొదలు పెడితే రేప్ అండ్ మర్డర్ వరకు,పరువు హత్యల వరకూ కారణం ఈ ఆధిక్యతా భావనే. ఈ తరుణం లో హక్కుల సంఘాలు ఇంకా నిబద్దతతో పని చెయ్యాలి.ఒక్కొక్క రంగంలో హక్కులు ఏ విధంగా ఉల్లంగిఇంచ బడుతున్నాయో క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రచారం చెయ్యాలి. అశేష ప్రజానీకం ను హక్కుల చైతన్యం వైపు నడిపించాలి.
రాజ్యం జవాబుదారీ తనాన్ని డిమాండ్ చేస్తూ రాజ్యాంగ విలువలను నొక్కి చెప్పడం మాత్రమే కాక ,న్యాయవ్యవస్థ ను,హక్కుల అంశాలను పట్టించుకునే సంస్థలను పూర్తి స్థాయి లో పని చేసేలా మన పని విధానం ఉండాలి. హక్కులు అనుభవించే దిశ వైపు ప్రజలను నడిపించాలి. కరపత్రాలు, బుక్ లెట్స్ ద్వారా హక్కులు కోల్పోతున్న వైనాన్ని ప్రజలకు తెలపాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితి లో ,విషయాలను అంచనా వేసుకుంటూ పని చేయడమే పెద్ద ఛాలెంజ్ గా మేము భావిస్తున్నాం.
కొలిమి: హక్కుల పరిరక్షణ సంఘాల వరకే పరిమితమవుతున్న స్థితి ఒకటి వచ్చింది. దానిని మొత్తం సమాజం భాద్యతగా మార్చడానికి ఏమి చేయాల్సి వుంది. దానికి కావాల్సిన శక్తులు, సాధనాలు ఏవని మీరనుకుంటున్నారు.
మానవ హక్కుల వేదిక: హక్కుల పరిరక్షణ సంఘాల వరకే పరిమితమవుతున్న స్థితి ఒకటి వచ్చింది అని మీరు అంటున్నారు. అంటే హక్కుల సంఘాలకు మాత్రమే హక్కుల పరిరక్షణ పరిమితమవుతున్న స్థితి అని మీ ఆలోచనగా ఉన్నట్లు మాకు అనిపిస్తుంది. కానీ ఇది వాస్తవం కాదు. హక్కులు ఎప్పుడూ అమూర్తం గా ఉండవు. అవి నిర్దిష్ట సమూహాలకు నిర్దిష్ట రూపంలోనే ఉంటాయి. హక్కులు కోల్పోయిన వాళ్ళు హక్కుల పరిరక్షణ కోసం, హక్కుల పునరుద్ధరణ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే అలాంటి సమూహాలకు, మా లాంటి మానవహక్కుల వేదిక కు ఉన్న తేడా మీకు చెప్తాము.
ఉదాహరణకు. ఇటీవల జరిగిన రైతాంగ ఉద్యమాన్ని తీసుకోండి. మూడు వ్యవసాయ చట్టాలు తమ ప్రయోజనాలకు ప్రమాదకరంగా తయారయ్యాయి అని రైతులు రోడ్ల మీదికి వచ్చారు. అత్యంత శాంతియుత పద్ధతుల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. గాంధీ వాదానికి కాలం చెల్లిపోలేదు అని ఆచరణలో చూపించారు.
మానవ హక్కుల వేదిక గా మేము విలువల గురించి మాట్లాడతాము అనే విషయం మీకు తెలుసు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయమని జరుగుతున్న పోరాటం ఏ విలువలను ముందుకు తెచ్చిందో మేం వాటిని సమాజం ముందు పెట్టాము. రైతు చట్టాల మీద అందరూ రకరకాల వ్యాసాలు రాస్తున్న సమయంలో మా సంస్థ మాత్రమే మూడు వ్యవసాయ చట్టాలను తెలుగులోకి అనువదించి ఇంగ్లీషు రాని వాళ్లకు చట్టాలలో ఏముందో స్వయంగా చదువుకునే అవకాశాన్ని కల్పించింది. ఏ రైతు సంఘమూ చేయని పని ఇది. తాను లాయర్ కాకపోయినా మా సంస్థ తెలంగాణా యూనిట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య ఈ పని చేశారు. ఏ రైతు ఉద్యమం జరుగుతుందో ఆ రైతుల వద్దకు పోయి మీకు సంఘీభావం తెలుపుతున్నాము అని అనటం ఒక అంశం. ఆ పని చేస్తూనే మేము ఇంకొక పని చేశాం.
మా సంస్థ అవగాహన ప్రకారం రైతు ఉద్యమం ఎందుకు సమర్థనీయం అయిందో చెబుతూనే రైతులు కానీ ఇతర సమూహాల వద్దకు మేము వెళ్లి రైతు ఉద్యమపు న్యాయబద్ధతనూ, ఆ ఉద్యమం లేవనెత్తుతున్న విలువలనూ ప్రజల ముందు పెట్టాము. అలా రైతు ఉద్యమానికి మద్దతు ప్రోది చేశాము.మేము పెట్టిన మీటింగు లలో ఉపాధ్యాయులను, ఉద్యోగులను, లాయర్లన, డాక్టర్లను, యూనివర్సిటీ విద్యార్థులనూ ఇంకా ఇతర ప్రొఫెషనల్స్ ను భాగస్వాములను చేశాము.
‘రైతులు ఇలానే గొంతెమ్మ కోరికలు కోరుతూ పోతే దేశం ఎలా ముందుకు వెళుతుంది’ అని అభిప్రాయం లో ఉన్నటువంటి వారు మా సమావేశాలలో పాల్గొన్న తర్వాత వారి అభిప్రాయాలను మార్చుకున్నారు. రైతు ఉద్యమాన్ని హోల్ హార్టెడ్ గా సమర్థించారు. ఇది మేం మాత్రమే చేయగలిగిన పని. ఎమ్మార్పీఎస్ ఉద్యమన్ని మేం సమర్థిస్తున్నాం. మా సమర్థన షెడ్యూల్డ్ కాస్టులలో విభజన తెస్తుంది అని మమ్మల్ని విమర్శించిన వారు ఉన్నారు. ఈక్వల్ రిప్రజెంటేషన్ కీ, ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ కీ అర్థం విడమరిచి చెప్పాక అనేక సమూహాలు ఎమ్మార్పీఎస్ ను సమర్థించాయి. ఈక్వాలిటీ అంటే యాంత్రిక ఈక్వాలిటీ కాదు. దానిలో ఈక్విటబిలిటీ కూడా ఉండాలి. ఇది మా తాత్విక అవగాహన.
మేము ఏం చెప్పాం? ఈ మూడు వ్యవసాయ చట్టాలూ రాజ్యాంగ వ్యతిరేకమైనవి; భారత రాజ్యాంగం ఏ సమాఖ్య స్ఫూర్తిని ఇస్తుందో ఆ స్ఫూర్తిని ఈ చట్టాలు దెబ్బతీస్తాయి. అంటే అధికారంలో ఉన్న వాళ్ళే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. వ్యవసాయం అనేది, వ్యవసాయ మార్కెట్ లు అనేది పూర్తిగా రాష్ట్రాల సబ్జెక్టు. అంటే వాటిపై రాష్ట్ర శాసన సభలు మాత్రమే చట్టాలు చేయగలవు. కానీ కేంద్ర శాసన సభ అంటే పార్లమెంటు ద్వారా ప్రభుత్వం ఈ చట్టాలను చేయించింది. పార్లమెంటులో ఉన్న బ్రూట్ మెజారిటీ ఉపయోగించుకొని , కనీసం చర్చ కూడా లేకుండా, మూజువాణి ఓటుతో ఈ చట్టాలను ఆమోదింప చేసుకున్నారు. ఈ చట్టాలు రాకముందు ఏదో ఆకాశం కూలి పోతుంది అనే ప్రమాదం సంభవించినట్లు గా ఆర్డినెన్స్ లను ప్రకటించింది ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వం తన రాజ్యాంగ ధర్మాన్ని పూర్తిగా విస్మరించింది. రాజ్యాంగం ఇవ్వని అధికారాన్ని బలవంతంగా లాక్కుంది. ఇది పేరుకు ప్రజాస్వామ్యమే కానీ జరిగింది మాత్రం నియంతృత్వ ప్రభుత్వం చేసే చర్యలే. అధికారాన్ని కేంద్రీకృతం చేసుకోవటం మంచి పని కాదు. అధికార వికేంద్రీకరణ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయటంలో దోహదపడుతుంది. కానీ ప్రభుత్వం చర్య ఈ ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిస్తుంది.
ఎప్పుడైతే ఇలాంటి విషయాలని రైతులు కానీ ప్రజా సమూహాల వద్దకు తీసుకెళ్లామో, మరీ ముఖ్యంగా మేధావి వర్గాల వద్దకు తీసుకెళ్లామో రైతు ఉద్యమం యెడల వారి స్పందనలో తేడా వచ్చింది. ఆ స్పందన రైతు ఉద్యమానికి అనుకూలంగా మారింది.అలా రతుల ఉద్యమానికి, పరిమిత స్థాయి లొనే కావచ్చు కానీ, సంఘీభావాన్ని కూడ గట్టాము. తమ ప్రయోజనాలను దెబ్బతీసే రకంగా, తమ హక్కులకు హాని కలిగించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఒక సమూహం బాధపడుతున్నప్పుడు, ఉద్యమిస్తున్నప్పుడు ఆ ఉద్యమం లేవనెత్తుతున్న విలువలను, ఉద్యమ న్యాయబద్ధతనూ ఆ ఉద్యమానికి దూరంగా ఉండే ప్రజా సమూహాల ముందు పెట్టి వారి మద్దతును ఉద్యమానికి కూడగట్టడం అనేది మా ఆచరణలో భాగం.
హక్కుల పరిరక్షణ మొత్తం సమాజం బాధ్యతగా చేయడం అంటే ఇదే. మాకు ఉన్న పరిమిత వనరులతో మేము ఈ పనిని సమర్థంగా చేయగలిగాం. దానికి కావలసిన శక్తులు, సాధనాలు ప్రజలే, సమాజమే..
కొలిమి: మీరు చేస్తున్న మానవహక్కుల కృషిలో నిరాశ చెందకుండా పనిచేయడానికి మిమ్మల్ని నడిపిస్తున్న పరిస్థితులు, ఆశ, ఆశయాలు, ఆదర్శాలు ఏమిటి?
మానవ హక్కుల వేదిక: నిరాశ చెందకుండా మమ్మల్ని నడిపిస్తున్నది మాలో మానవ హక్కుల కోసం ఉన్న తపన. ఇక్కడ మాకు ఒనగూడే వ్యక్తిగత ప్రయోజనాలు ఏమీ లేవు. మా సంపాదనలో కొంత భాగం తప్పనిసరిగా ఈ కృషి కోసం ఖర్చు చేయాల్సిందే. నానాటికీ దిగజారుతున్న మానవ హక్కుల పరిస్థితి మా కృషిని మరింతగా రాటుదేలుస్తోంది. దేశంలో పెరుగుతున్న పాలకుల నియంతృత్వ ధోరణులు, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యలు మమ్మల్ని మరింతగా పనిచేసేలా పురికొల్పుతున్నాయి. ఫక్తు లాభార్జన మీదనే ఆధార పడిన పెట్టుబడిదారీవిధానం పర్యావరణానికి పెనుముప్పు గా తయారయింది. వాతావరణం, పర్యావరణం, జీవ వైవిధ్యంలు ధ్వంసం అయిపోయాక మనిషి బతికి ఉండలేని పరిస్థితి దాపురిస్తోంది. పెట్టుబడిదారీ విధానం భూమిని నిస్సారంగా చేస్తోంది. కొంతమంది తమ సంతానానికి, వారి సంతానానికి, వారి వారి సంతానానికి సరిపోయేలా సంపద కూడ పెట్టుకోవాలని చూస్తున్నారు. కానీ వారి చర్యలు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాయి. మామూలు మనుషులకి జీవనమే గగనమై పోతోంది. జీవించే హక్కు కి అర్ధం మృగ్యం అయిపోతోంది. మనుషులను ప్రేమించే వారు చేతులు ముడుచుకుని కూర్చోలేరు కదా.
నిజమైన ప్రజాస్వామ్యం నెలకొల్పుకోవడానికి మా కృషి ప్రజలకు చైతన్యం కలిగిస్తుందని ఆశ. భయ భీతులు లేని, అసమానత్వం లేని సమాజాన్ని ప్రజలు తమ చైతన్యయుత కృషితో సాధించుకునేలా మా ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశ. ఇవే మా ఆశయాలు.
ఇక మాకు ఆదర్శం అంటారా? దీనికి మనుషులూ ఉన్నారు. సిద్ధాంతాలూ ఉన్నాయి. మొట్టమొదటి ఆదర్శం మా బాలగోపాల్. ఆయనో మానవ హక్కుల పతాక. an embodiment of human rights. ప్రతి ప్రగతిశీల రాజకీయ సిద్ధాంతంలోనూ ఉండే హక్కుల కోణాన్ని మన చైతన్యం లో కి ఇంకింప చేసుకోమని చెబుతూ మానవ హక్కుల తాత్వికతను అభివృద్ధి చేసినవాడు. తమ నిష్కళంక కృషి తో మరణం వరకు హక్కుల పరిరక్షణ కోసం, వాటిని వ్యవస్థీకృతం సీజేయడానికీ, విస్తృత పరచడానికి తపన పడిన మా బుర్ర రాములు, గొర్రెపాటి నరేంద్రనాధ్ లు మాకు ఆదర్శం. ఎలాంటి అసమానతలూ లేని సమాజం కావాలని తపన పడి తమ జీవితాలను కొవ్వొత్తులుగా కరిగింప చేసుకున్న మార్క్సూ మాకు ఆదర్శమే. అంబేడ్కరూ మాకు ఆదర్శమే.
చివరగా ఓ మాట
విస్పష్టమైన అవగాహన కలిగిన మా సంస్థ ముందు చేయాల్సిన పని రాశి కూడా భారీగా ఉంది. మేం చేయాలి అనుకునే పనికి, మా ఔట్పుట్ కీ మధ్య వ్యత్యాసం ఉంది. ఇది ఆందోళన కలిగిస్తోంది. సామాజిక బాధ్యతను మర్చిపోతున్న కొత్త తరాల నుంచి హక్కుల రంగంలో, నిస్వార్ధంగా పనిచేయగల మనుషులను వెతుక్కుని, నిర్మాణాన్ని పెంచుకోవటం కష్టంగా ఉన్న నేటి పరిస్థితుల్లో పరిమిత సభ్యత్వం, వనరులతో, ఉన్న శక్తిని కేంద్రీకరించి మాత్రమే పనిచేయటానికి ప్రయత్నిస్తున్నాం.
(ఈ అభిప్రాయాలు జీవన్ కుమార్, మాధవరావు గారు తెలిపినప్పటికి ఇవి వారి వ్యక్తిగత ఆలోచనలు కావు. ఈ అభిప్రాయాలు “మానవ హక్కుల వేదిక” సంస్థ దృక్పథం. సంస్థ ఏర్పడ్డప్పడు వారి దృ క్పథం, కార్యాచరణ, సంస్థ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో పరీక్షకు, ప్రయోగానికి పెట్టి వివరణగా పొందిన ఫలితాలు.)