“అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం” అంటే జరిగిన అభివృద్ధిని సమీక్షించుకుని సాధించవలసిన హక్కులకోసం భవిష్యత్తు కార్యాచరణని చర్చించుకునే రోజు. ప్రపంచవ్యాప్తంగా మన ముందు తరాల మహిళలు అవమానాల్నీ, ఘోరాపజయాల్నీ వారు ఎదుర్కొని మనకి మాత్రం సౌకర్యాలను సాధించి పెట్టిన సాహస వనితల సమర శీల పోరాట చరిత్రని మన భావి తరాలకు అక్షరమక్షరం పొల్లు పోకుండా చేరవేయడానికి ప్రతిజ్ఞ తీసుకునే రోజు ‘మార్చి8’!
‘అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినా’నికి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన పోరాట చరిత్ర ఉంది. ప్రపంచంలో స్త్రీలకు సంబంధించి అంతర్జాతీయంగా చెప్పుకోదగిన వాటిలో ప్రధానమైనది మహిళా ఉద్యమం పుట్టుక. ఇది పెట్టుబడిదారీ యుగ ప్రారంభంలోనే మొదలైంది. మానవ చరిత్రలో మొట్టమొదటిసారి శతాబ్దాల అణచివేత నుంచి విముక్తి కోసం దిక్కులు పిక్కటిల్లేలా మహిళలు ప్రపంచం నలుమూలలనుంచీ ఉద్యమించారు. సాధారణమైన శ్రామిక మహిళలు వందేళ్ళకు పైబడి అసాధారణమైన త్యాగాలకూ, కష్టనష్టాలకూ ఓర్చుకుని పోరాడిన కృషి ఫలితంగా “మార్చి8- అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం” గా చరిత్రలో స్థిరపడింది!
గత చరిత్రను అవలోకిస్తే, మానవాభివృద్ధి ప్రారంభ సమయంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా గల మూలవాసులలో మహిళలే ఇంటి యజమానులుగా, మాతృస్వామ్య సమాజం ఉండేది. ఉత్పత్తి శక్తుల అభివృద్ధితో మహిళల్ని సామాజిక ఉత్పత్తికి దూరం చేసి, ఇంటిపనికీ, పిల్లల పెంపకానికీ పరిమితం చేసి పితృస్వామ్యాన్ని స్థిరీకరించారు. ఆ క్రమంలోనే ఆస్థి, సంతానం మీద హక్కులు కోల్పోయింది మహిళ. ప్రాచీనయుగం, మధ్యయుగాల్లో ప్రపంచవ్యాప్తంగా స్త్రీలందరూ కట్టు బానిసలే! ద్వితీయ శ్రేణి పౌరులే!! పారిశ్రామికీకరణతో తలెత్తిన సంక్షోభం సమాజంలో గొప్ప కుదుపులకు కారణమైంది.
1800 ప్రాంతాల్లో మహిళలు కడుపు కింత తిండీ, కంటికి నిద్రా, ఒంటికి బట్టా, తలదాచు కోవడానికి గూడూ లేక దుర్భరమైన పరిస్థితుల్లో మగ్గిపోయేవారు. మహిళలకు ఏ హక్కులూ లేని కాలంలో పిల్లలతో సహా పని ప్రదేశాల్లో 16 గంటల పైబడి వెట్టి చాకిరీ చేసేవారు. బండ పని, ఎటువంటి సౌకర్యాలూ లేని హీనమైన పని పరిస్థితులు, అతి తక్కువ వేతనాలు, స్త్రీ-పురుష అసమానత్వం మొదలైన కారణాలతో నరక యాతనలు పడుతున్న మహిళాలోకం మార్పు కోసం తపన పడి గొంతెత్తడం మొదలెట్టింది. పోరాటాల గతంలోకి వెళితే 1820 లో ఇంగ్లండ్ లో “టైలరింగ్ మహిళల పోరాటం” చరిత్రలో మొదటిది! ఈ పోరాటం ఎన్నోదేశాల్లో ఎందరో మహిళలకు స్ఫూర్తి నిచ్చింది!
ఆ రోజుల్లో ఆస్ట్రియా, బెల్జియం, క్యూబా, కెనడా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ, గ్రీస్, ఐర్లాండ్, ఇటలీ, పోలండ్, లిథువేనియా, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, రష్యా, స్కాట్లాండ్, స్పెయిన్, సిరియా, టర్కీ, మెక్సికో మొదలైన చుట్టు పక్కల దేశాల ప్రజలు జీవిక కోసం అమెరికాకు వలస వచ్చేవారు. అలా వచ్చినవారిలో అన్ని దేశాల మహిళా కార్మికులు నూలు మిల్లులలో పని చేసేవారు. ఊపిరి సలపనివ్వని పనితో సతమతమయ్యే మహిళలు 1900 సంవత్సరంలో చికాగోలో స్థాపించబడిన “అంతర్జాతీయ మహిళా దుస్తుల తయారీ శ్రామికుల యూనియన్”లో చేరారు. ఈ యూనియన్ సారధ్యంలో మహిళలు గడ్డ కట్టుకు పోయే చలిలో నెలల తరబడి ఫ్యాక్టరీల ముందు ఆకలే కాదు, అవమానాలే కాదు, ఎన్నో చెప్పరాని దుర్భరమైన హింసల కోర్చుకుని పికెటింగులు, సమ్మెలు చేశారు. లాఠీ దెబ్బలు తిని జైళ్ళకు వెళ్ళారు. సమాజం నుంచి హీనమైన, అవమానకర, నిందారోపణలను ఎదుర్కొన్నారు. అయినా సరే, పట్టు వదలకుండా దృఢదీక్షతో వీరోచిత పోరాటాల బాటను వేసి, ముందు తరాలకు వెలుగు దారులు పరిచారు. కొన్ని అపజయా లెదురైనప్పటికీ ఈ ఉద్యమస్ఫూర్తితో 1908 లో పదిహేను వేల మంది మహిళలు తక్కువ పనిగంటల కోసం, ఓటు హక్కు కోసం, మెరుగైన జీతాలకోసం న్యూయార్క్ నగర వీధులలో బ్రహ్మాండమైన కవాతు నిర్వహించారు. 1909 లో అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ ఆదేశం మేరకు మొట్టమొదటి “నేషనల్ ఉమెన్స్ డే” ను ‘ఫిబ్రవరి ఇరవై ఎనిమిది’ న జరుపుకున్నారు.
1910 లో పదిహేడు దేశాల ప్రతినిధులు ‘జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ’ కి చెందిన ‘క్లారా జెట్కిన్’ నాయకత్వంలో డెన్ మార్క్ రాజధాని ‘కోపెన్ హేగన్’ లో సమావేశమయ్యరు. ఆయా దేశాల్లోని మహిళల సమస్యలను చర్చించడానికి-డిమాండ్ల సాధన కోసం ప్రతి దేశంలో, ప్రతి సంవత్సరం ఒకే రోజున ప్రపంచ వ్యాప్తంగా “మహిళా దినం” జరుపు కోవాలని క్లారా ప్రతిపాదించారు. వివిధ యూనియన్లు, సోషలిస్ట్ పార్టీలు, ఉమెన్స్ క్లబ్బులకు చెందిన పదిహేడు దేశాలకు చెందిన వంద మంది మహిళా ప్రతినిధులే కాక ఫిన్నిష్ పార్లమెంట్ కి మొట్టమొదటిగా ఎంపికైన ముగ్గురు మహిళా ప్రతినిధులు కూడా ఏకగ్రీవంగా క్లారా ప్రతిపాదనను ఆమోదించారు. ఈ మహాసభలో ‘మార్చ్ 8ని – అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం’ గా జరపాలని నిర్ణయించారు!
ఒక మిలియన్ కి మించి స్త్రీ-పురుషులు పని హక్కు కోసం, ఓటు హక్కు కోసం, పబ్లిక్ మీటింగులు పెట్టుకునే స్వేచ్చ కోసం, వివక్షని అంతం చెయ్యాలంటూ నినదిస్తూ, ప్రచారం చేస్తూ ఉద్యమించారు! కానీ మార్చ్ ఇరవై ఐదున న్యూయార్క్ లోని “ట్రయాంగిల్ స్క్వేర్” వద్ద అంతులేని దోపిడీ, పీడనలకు గురౌతున్న 140 మంది శ్రామిక మహిళలు పని ప్రదేశంలో బందీలై పోయి తప్పించుకునే వీలే లేక సజీవంగా అగ్నికి ఆహుతై పోయారు. ఈ భయంకరమైన సంఘటన లేపిన దుమారం మహిళా కార్మికుల లేబర్ లెజిస్లేషన్ మీదా, స్త్రీల పని పరిస్థితుల మీదా ప్రపంచం దృష్టిని మహిళల వైపుకి దిగ్భ్రాంతి కరంగా మరల్చేలా చేసింది!
మహిళల పోరాటాల ఫలితంగా సాధించిన విజయాలను గమనిస్తే – ప్రపంచవ్యాప్తంగా మహిళల ఉద్యమాల ఫలితంగా రష్యాలో ‘మార్చి8’ ని “ద హీరోయిక్ వుమెన్ వర్కర్ డే” అని పిలుస్తారు. పదిహేడు దేశాల్లో ‘మార్చి8’ ని ‘సెలవు దినం’ గా ప్రకటించారు. జపాన్ లో ప్రతి ఇంట్లో ఒక “అమ్మ గది” ఉంటుంది. అంటే అమ్మకి కొంత స్పేస్ కావాలని గుర్తించేలా చేయగలిగారు. ఫిలిప్పీన్స్ లో 97% మహిళలు ‘ఉన్నత పదవులు’ సాధించారు! 1975, అక్టోబర్ 24 న ఐస్ లాండ్ మహిళలు పురుషులతో సమాన హక్కుల కోసం, సమాన వేతనాల కోసం, లింగ సమానత్వం కోసం చేసిన బ్రహ్మాండమైన సమ్మె, ఫలితంగా ప్రపంచంలో మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఒక మహిళ ఎన్నికవడమే గాకుండా ఐస్ లాండ్ మహిళలు ప్రపంచంలోనే అత్యధికంగా లింగ సమానత్వాన్ని సాధించారు!
పోరాటాలు-యూనియన్లు పురుష ప్రపంచానికే పరిమితమైన ఆ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తమ సుదీర్ఘమైన పోరాటాల ద్వారా స్త్రీలకు చట్టపరమైన రక్షణ, మహిళాభ్యుదయం, అట్టడుగు మహిళలకు నేరుగా మద్దతు, సహాయ సహకారా లందిస్తానని చెప్పేలా “ఐక్యరాజ్య సమితి” ని ఒప్పించగలిగారు!
మన దేశంలో కూడా మన ముందు తరాలవారు తమ త్యాగాలతో 8 గంటల పని దినం, వోటు హక్కు, ప్రభుత్వ రంగంలో స్త్రీ-పురుష వివక్ష లేని వేతనాలు-మొదలైన హక్కుల్నే గాక ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఎన్నో సౌకర్యాలను సాధించి పెట్టారు. స్త్రీల రక్షణకి సంబంధించి, 1975 లో ఐక్య రాజ్య సమితిలో భారత్ సంతకం చేసింది. ఫలితంగా జాతీయ మహిళా కమీషన్, స్త్రీలకి కొన్ని హక్కులతో పాటు, కుటుంబ హింస చట్టాలొచ్చాయి!
ఇదంతా పోరాటాల ద్వారా సాధించిన అభివృద్ధి అనుకుంటే ప్రపంచీకరణ దుష్ప్రభావాలు అన్ని దేశాల మహిళల జీవితాల్ని అతలా కుతలం చేస్తున్నాయి. చదువుల్లో సామాజికరంగంలో అంతరిక్షాన్ని అందుకోగలిగిన మహిళలు కుటుంబ హింసలో అధోగతి పాలవుతున్నారు. విమానయానంతో ప్రపంచాన్ని చుట్టి వస్తున్నా ఉన్న ఊళ్ళో, సొంత వీధి లోనే, అసలు సొంత ఇంట్లోనే స్వేచ్ఛ లేక అలమటిస్తూ అత్యాచారాలకు బలవుతున్నారు! ఈ దుర్మార్గమైన పరిస్థితుల్ని 2012 లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ, ఇటీవల అంటే 2019 లో హైదరాబాద్ లో జరిగిన ‘దిశ’ సంఘటనలు రుజువు చేశాయి! కంటితుడుపు చర్యలుగా ప్రభుత్వం ‘నిర్భయ’, ‘దిశ’ చట్టాలు తెచ్చినప్పటికీ, వాటి నమలు పరచడంలోని లోపాల వల్ల అత్యాచారాలు ఆగడం లేదు. ఈ రెండు సంఘటనలూ సంచలనాత్మకమయ్యాయి గానీ వెలుగులోకి రాని కొన్ని వేల పేద మహిళలపై, పసి బిడ్డలపై జరిగే అత్యాచారాలు కలవరపెడుతున్నాయి! స్త్రీ-పురుష సమానత్వసాధన కోసం మహిళలు నిరంతరం దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నారు!
1911 లోనే ఆర్ధిక దోపిడీ (బ్రెడ్) పైనే కాకుండా మహిళలు ఎదుర్కొంటున్న మానసిక, సామాజిక అణచివేత (రోజెస్) పైన కూడా పోరాడాలని గుర్తించిన స్త్రీలందరూ రొట్టెతో పాటు స్వేచ్చ కూడా కావాలంటూ “బ్రెడ్ అండ్ రోజెస్” ఉద్యమాన్ని 1912 లో అమెరికాలోని మసాచుసెట్స్ లో నడిపారు. గురి పెట్టబడిన తుపాకీ మొనల్లో పదునైన బాకులు బిగించి నిలబడిన భీకరమైన సైన్యానికి ఎదురుగా ధీటుగా నిలిచి, బెదరని స్థిర చిత్తంతో వేలాది మహిళలు శాంతియుతంగా పోరాడారు. 40 దేశాల మహిళలు అతి దారుణమైన చలిలో రెండు నెలలు జనవరి నుంచి మార్చ్ వరకూ గొప్ప సంకల్పబలంతో సమ్మె కొనసాగించారు!
ఒక శతాబ్ధం పైబడి కాలం గడిచాక ఇప్పుడు 2019 డిసెంబర్ 15 వ తేదీనుంచి మళ్ళీ అలాంటి ఉపద్రవమే వచ్చి పడింది. ఇక్కడే పుట్టి, ఇక్కడే గిడుతున్న వారిని అసలు మీరీ దేశపౌరులవునో కాదో తేల్చుకోమంటూ ప్రజల ఉనికికే ఎసరు పెడుతున్నారు పాలకులు! దాదాపుగా అవే నెలల్లో వణికించే భీకరమైన చలిలో 29 రోజుల పసిపాప (రెహానా ఖాతూన్- అనే బాలింతరాలి పాపాయి) నుంచి 90 ఏళ్ళు దాటిన ఆస్మా ఖాతూన్, బిల్కిస్ బానూ లాంటి అవ్వల వరకూ ప్రాణాలకు తెగించి దుష్ట మూకలకు ఎదురొడ్డి పోరాడుతూ దేశ రాజ్యాంగాన్ని రక్షించడానికి రాత్రీ-పగలనే తేడా లేకుండా ఎడతెగని తపన పడుతున్నారు మహిళలు!
“భారత దేశ ప్రజలమైన మేము… భారత దేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా… అందరి పౌరులకు సామాజిక, ఆర్ధిక, రాజకీయ-న్యాయం, భావ ప్రకటనా స్వేచ్ఛ, విశ్వాసము, ధర్మము, ఆరాధనా స్వేచ్ఛ, అంతస్తులోనూ, అవకాశాలలోనూ సమానత్వాన్ని సాధించుకొంటూ…వ్యక్తి గౌరవం, జాతి ఐక్యతను, దేశ అఖండత ను చేకూర్చు విధంగా సౌభ్రాతృత్వం పెంపొందించు కొనుటకు సత్యనిష్ట పూర్వకముగా తీర్మానించుకుని…1949 వ సంవత్సరం నవంబర్ 26వ నాడు రాజ్యాంగ సభలో రాసుకున్న రాజ్యాంగం ను అంగీకరించి… అధిశాసనం చేసుకుని… మాకు మేము ఇచ్చుకుంటున్నాము” – అని రాసుకున్న దేశ ప్రజలందరికీ సంబంధించిన రాజ్యాంగ శాసనాన్ని అమలు పరచమని ప్రజలు శాంతియుతంగా పోరాటాలు చేస్తున్నారు. ముస్లింల పట్ల 2002 నుంచి బాహాటంగానే వివక్ష చూపిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం, భారత రాజ్యంగపు సెక్యులర్ పునాదుల్ని సమూలంగా నిర్మూలించే సన్నాహాలను సూచించే కొత్త పౌరసత్వ సవరణ చట్టం ఆమోదించినప్పటినుంచి దేశ రాజధాని ఢిల్లీ మహిళలు షాహీన్ బాగ్ అనే ఒక మారు మూల ప్రాంతంలో నలుగురితో శాంతియుత నిరసన ప్రారంభిస్తే, దాని వెలుగులు దేశం లోని గల్లీలూ, మూలలూ సకల ప్రాంతాలకూ ప్రసరించి, ఉత్తేజకరమైన పాటలు, కవితలు, నినాదాలతో లక్షలాది ప్రజల్ని కదిపి ఏకం చేసింది. అంతేకాదు, ప్రపంచమంతా షాహీన్ బాగ్ లు వెలిశాయి!
మొదటగా ఈ వేడి సెగలు అస్సాం రాష్ట్రాన్ని తాకాయి. అక్కడ 19,06657 మంది పౌరుల జాబితాను తొలగించారు. 23 మంది చనిపోయారు. అక్కడి వాతావరణం భగ భగ మండుతున్నదనే విషయాన్ని ‘జీనీ’, ‘వృందా’ అనే ఇద్దరు టీనేజ్ బాలికలు ఒక వీడియో ద్వారా వివరించారు. “మేము విద్యావంతులం, మా ప్రజలకి ఏం జరుగుతుందో తెలుసుకోగలం. అమిత్ షా ‘దేశంలో ఎక్కడా నిరసనలు జరగడం లేదనీ, జరగడానికి వీల్లేద’నీ చెప్పారు. కానీ ఇక్కడ మా ప్రజలు మంటల్లో కాలిపోతున్నారు. డిటెన్షన్ క్యాంపులలో నరక యాతనలు పడుతున్నారు! ప్రజాస్వామ్యం అనే పదాని కిక్కడ అర్ధం లేదు! మాదొక ప్రత్యేకమైన సంస్కృతి, మా భాష ఇక్కడ మైనారిటీ ప్రజల మధ్య మాత్రమే బతుకుతుంది. మేమిక్కడ మైనారిటీలం. మా సంస్కృతినీ, భాషనూ నాశనం చెయ్యాలని పాలకులు చూస్తున్నారు. మమ్మల్నీ, మా ఆత్మగౌరవాన్నీ కించ పరుస్తున్నారు. మా జాతిజనుల్ని విపరీతంగా గాయపరుస్తున్నారు… ఇవాళ మీరు భద్రంగా ఉన్నారని అనుకోకండి, మాకంటిన దట్టమైన వేడి సెగ రేపు మీకూ వ్యాపించబోతుంది. ఈ క్లిష్ట పరిస్థితులు దేశమంతా, అన్ని రాష్ట్రాల్లోనూ రాబోతున్నాయి కానీ మా అస్సాం భౌగోళికంగా బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది కాబట్టి ఆ సి ఏ ఏ, ఎన్ ఆర్ సి సెగలు అందరికంటే ముందు మాకు తగులుతున్నాయి” అని అన్నారు. ఇంకా మిలియన్లలో విదేశీయులు సరిహద్దుల్ని దాటి వస్తున్నారనీ, అంతమంది కాందిశీకుల మధ్య మా కేమీ కాదనీ నిశ్చింతగా ఉండమనీ, మా హక్కుల్ని పరిరక్షిస్తామని అబద్ధాలు ఎలా చెప్పగలరనీ, మేము పుట్టిన మా స్వంత నేలలో మేమెలా విదేశీయుల మౌతామని ప్ర శ్నించారు. ఇదంతా ‘పచ్చి మోసం’ అన్నారు. ఇక్కడ కర్ఫ్యూ ఉంది. ఇంటర్నెట్ బంద్ చేశారు. కాలు బయట పెడితే అసంఖ్యాకంగా ఉన్న పారా మిలిటరీ దళాల గన్నులు మామీద గర్జించడానికి సిద్ధంగా ఉన్నాయి. అస్సాం నిలువునా కాలిపోతున్నా మీడియాలో వార్తలు రావడం లేదు. ఈ వీడియోని షేర్ చేసి సహాయం చెయ్యండి. జాతీయ మీడియా, అస్సాం వెలుపల ఉన్న ప్రజలందరూ స్పందించేలా చూడమనీ, ఈ వార్తలను ప్రపంచ మీడియాకి తెలియజెయ్యమనీ గన్నులను తప్పించుకుని తెలివిగా వీడియోలో అభ్యర్ధించారీ అమ్మాయిలు!
పేరు తెలియని ఒక ధీర యువతి “పౌరసత్వ చట్ట సవరణ బిల్లు’ కి వ్యతిరేకంగా మేమెందుకు నిరసన తెలుపుతున్నామో తెలుసా? రాష్ట్రీయ స్వయం సేవక్ ముఖ్య నాయకుడు ‘ఎం ఎస్ గోల్వాల్కర్ ఏలుతున్నవారికి దేవుడు. ఆయన చెప్పిందే వేదం. జర్మనీలో హిట్లర్ నాజీ సైన్యం నిర్బంధ కేంద్రాలు పెట్టి అరవై వేల యూదు ప్రజలను జాతి హననం చేశారు. మానవత్వానికి విరుద్ధంగా జరిగిన పైశాచిక మారణ కాండను “We and Our Nationhood Defined” అనే పుస్తకం లోని పేజీ నంబర్లు 87, 105 లలో గోల్వాల్కర్ పొగుడుతూ, భారత్ దానిని ఆదర్శంగా తీసుకోవాలంటాడు. ‘పౌరసత్వ చట్ట సవరణ బిల్లు’ కి పూర్తి మూలాలు ఇందులో ఉన్నాయి”- అని చెప్పింది.
బెంగుళూరు నుంచి ఇంకొక యువతి దాదాపు ఇవే విషయాలు చెప్పింది గానీ “మీకు అధికారం ఇచ్చింది ప్రజలమీద దాష్టీకం చూపిస్తూ నిరంకుశత్వంగా పరిపాలించడానికి కాదు, ప్రజలకి సేవ చెయ్యడానికి ఓట్లేసి గెలిపించాం” అని ప్రభుత్వాలకి బలంగా బహు శక్తివంతంగా సవాలు విసిరింది!
జామియా మిలియా యూనివర్శిటీలో లా విద్యార్ధిని అనూజ్ఞ విలపిస్తూ “ఈ దేశం మొత్తంలో అమ్మాయిలకు సురక్షితమైన ప్రదేశం లేదు. నా ఇల్లు లాంటి యూనివర్శిటీని నాశనం చేశారు. నిరసన తెల్పినందుకే అన్యాయంగా నా స్నేహితురాల్ని చంపేశారు. నా స్నేహితులమీద దాడులు చేశారు” – అని చెప్పింది.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో జరిగిన హింస గురించి జర్నలిస్టు రవీష్ కుమార్ జామియా మిలియా ఇస్లామియా మహిళా విద్యార్ధినులతో మాట్లాడారు. నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. కలవరపాటుతో చెదిరిపోయిన విద్యార్థులు పొదల్లోకీ, లైబ్రరీల్లోకీ పరిగెత్తారు. మామీద టియర్ గ్యాస్ ప్రయోగించారు. మా యూనివర్సిటీలో మేమే దొంగలమైనట్లు దాక్కున్నాం. ఒక్క లేడీ పోలిస్ కూడా లేరు. తర్వాత మమ్మల్ని చేతులు కట్టుకుని కిందకు దిగమన్నారు. దిగింతర్వాత జిరాక్స్ సెంటర్ లో “మీరు ఇక్కడి సొమ్ము తింటూ పాకీస్తాన్ పాట పాడతారనీ, ఇక్కడెందుకు, అక్కడికే వెళ్ళమనీ, మీరు హిందువులు కారు. మీరు పాకీస్తాన్లు” అని నానా మాటలంటూ భయంకరంగా బూతులు తిట్టిపోస్తూ శారీరక, మానసిక దాడులు చేశారు. పైకి మాత్రం పోలీసులు బయటి వ్యక్తులు వస్తుంటే వాళ్ళని నిలవరించడం కోసం మేము లోపలికి ప్రవేశించామని చెప్తున్నారు. పోలీసుల వాదనను విద్యార్థులు ఖండించారు. “యూనివర్శిటీ సెక్యూరిటీ గార్డులు వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన తర్వాతే విద్యార్థులను గేట్ లోపల అనుమతించారు. కాబట్టి బయటి వ్యక్తి ఎవరూ క్యాంపస్‌లోకి ప్రవేశించలేరు” అని వారు తెలిపారు. నిజంగా ప్రభుత్వం పైకి చెప్తున్నట్లు ఈ చట్టాల వెనక ఏ కుట్రా లేకపోతే ఇంత కిరాతకంగా ప్రవర్తించవలసిన అవసరముందా? అని ప్రశ్నించారు.
బర్ఖాదత్ ఢిల్లీలో నిరసనలో పాల్గొన్న వివిధ విశ్వవిద్యాలయాలకి చెందిన విద్యార్ధినులను ప్రశ్నించింది. ఏ రాజకీయ పార్టీ అండదండలు లేకుండా మీరింత గొప్ప ఉద్యమాలను ఎలా నిర్మించగలుగుతున్నారు అనే ప్రశ్నకు “అధ్యయనం, చైతన్యంతో సంఘటిత పరుచు, ప్రతిఘటించు” – ఇదే మేము పాటిస్తున్న మా మూల సూత్రమని చెప్పారు. ఒక్కమాటలో మీ స్ఫూర్తి ఏమిటి? అని బర్ఖాదత్ అడిగితే “ఇంక్విలాబ్ జిందాబాద్” అన్నారు. ‘ఎప్పటివరకూ పోరాడతారు’ అని అడిగితే “ఈ చట్టాలు ఉప సంహరించు కునేంతవరకూ” అని ధైర్యంగా సమాధానమిచ్చారు. ఇది సాధ్యమేనా అని రెట్టించి ప్రశ్నిస్తే “మేము చరిత్రను సృష్టిస్తాం” అని సాహసవంతంగా బదులిచ్చారు!
బాగా వైరల్ అయిన ఒక వీడియోలో ఒక యువకుడి చుట్టూ వలయంలా నిలబడ్డ యువతులు పోలీసుల లాఠీ దెబ్బలనుండి విద్యార్ధినులు రక్షించారు.
షాహీన్ బాగ్ లో పెల్లుబికిన చైతన్యం రెండు నెలలుగా ఒక పెద్ద సుడిగాలిలా ప్రపంచాన్ని చుట్టుముట్టి, ఎవరినీ ఊపిరి సలపనివ్వడంలేదు. ‘నవమితా చంద్రా’ అనే జాదవపూర్ యూనివర్శిటీ విద్యార్ధిని డిగ్రీ సర్టిఫికెట్ తీసుకోవడానికి వేదిక నెక్కి “నాతోటి విద్యార్ధులను కొడుతూ, వాళ్ళను గాయపరుస్తూ గుడ్డివాళ్ళుగా చేస్తుంటే, వాళ్ళను హత్యలు చేస్తున్న ఈ వాతావరణంలో నేను సంబరంగా డిగ్రీ అందుకోలేను”అని రాసిన ప్లకార్డును ప్రదర్శిస్తూ వైస్ చాన్స్ లర్ చేతుల నుంచి సర్టిఫికెట్ తీసుకోలేదు. ఇదెంత సాహసం! ఇవి మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే! దేశవ్యాప్తంగా అసంఖ్యాకంగా పాల్గొని, పోరాటాలను క్రమశిక్షణతో నడిపిన విద్యార్ధులు మోసపు కేకల నుంచి, అక్రమాల మధ్య నుంచి, హత్యల నుంచి, అంతులేని దౌర్జన్యాలనుంచి తప్పించి భారత దేశానికి నవ యవ్వన కాంతులతో, ప్రకాశవంతమైన ఆలోచనలతో మంచిరోజులు తెస్తారనే భరోసా కలిగించారు!
ఇంతకీ ఈ సామాజిక ఉద్యమాలు ఇనప పద ఘట్టనల కిందపడి ఇంతటితో ఆగిపోతాయనుకుంటే పొరపాటే! ఈ పౌరసత్వ పోరాట దీక్షల్ని అత్యద్భుతంగా మలుస్తున్న కొందరు యువతుల ఆలోచనలను గమనిస్తే అమితంగా ఆశ్చర్యపోతాం! నూతన ఆర్ధిక విధానాల అమలు తర్వాత పుట్టిన ఈ యువతరం ఎంతసేపూ తమ దృష్టిని ‘వారి కెరీర్ మీద తప్పించి ప్రజాసమస్యలని పట్టించుకోరు’ అనుకునే పెద్దతరం ఊహల్ని పటాపంచలు చేసేశారు! ఎంతోకాలం నుంచి కవులూ, రచయితలూ, మేధావులూ తమ సృజనాత్మక రచనల్లో, ఉపన్యాసాల్లో గంటల తరబడి వివరించిన విశేషాలను ఈ పిడుగుల్లాంటి విద్యార్ధినులు చిటికెలో 5, 10 నిమిషాల వీడియోల్లో పాలకుల స్వభావాలనూ, ప్రజా వ్యతిరేక విధానాలనూ వివరిస్తూ సకల జనుల దృష్టినీ కార్యాచరణల వైపుకి మళ్ళిస్తున్నారు. సమాచార మాధ్యమాలను సమర్ధవంతంగా వాడుకుంటున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, విద్య, నిరుద్యోగం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకూ, రాజ్యాంగాన్ని అమలు చెయ్యమంటున్నందుకే హింసలు ప్రయోగిస్తున్నారని వారికి తెలిసిపోయింది! ఈ విషయంలో వారికి వారే సాటి. అంతర్జాలంతో వ్యాపార సామ్రాజ్యాలని నిర్మించాలని కార్పొరేట్ శక్తులు, అగ్రరాజ్యాధినేతలు, వారికి వత్తాసు పలికే పాలకులు చూస్తుంటే, అదే అంతర్జాలాన్ని ప్రభావవంతంగా వాడి ఉద్యమాలు కార్చిచ్చులా వ్యాపింపజేస్తున్నారు విద్యార్ధులు, యువతరం. ‘పాలకులు వారు తీసుకున్న గోతిలో వారే పడతార’న్న దానికిదే నిదర్శనం!
ఇక షాహీన్ బాగ్ ప్రదర్శనల విషయాని కొస్తే ఎన్నడూ గడప దాటి ఎరుగని సాధారణ గృహిణులు ఒకరినుండి మరొకరు బలం పుంజుకుంటూ సమిష్టి చైతన్యంతో చావో, బతుకో తేల్చుకోవడానికే పగలూ-రాత్రీ తేడా లేకుండా సిట్-ఇన్లు నిర్వహించారు. సిట్-ఇన్ అనేదే ఒక నిరసన రూపం. దీనిలో ప్రదర్శనకారులు ఒక స్థలాన్ని ఆక్రమిస్తారు. వారి డిమాండ్లు నెరవేరే వరకు అక్కడనుండి కదలడానికి నిరాకరిస్తారు. జీవితానుభవాలనుంచే పాఠాలు నేర్చుకుని “పోరాడక పోతే బతుకే లేదని” తెలుసుకుని తిరగబడుతున్నారు.
విద్యార్ధులు గానీ, దేశమంతా షాహీన్ బాగుల్ని వెలిగించిన మహిళలు గానీ బొత్తిగా పోరాటాలు తెలియనివారు. మొదటి సారి రోడ్లమీదకొచ్చినవాళ్ళు. కొత్త ఉద్వేగాలతో న్యాయం కోసం ఆక్రోశించిన వాళ్ళు. మిల్టన్ “Paradise Lost” లో లాగా పదకొండుసార్లు సైతాను గెలిచాకే పన్నెండోసారే మనదైన స్వర్గాన్ని గెలుచుకుంటామని తెలియనివాళ్ళు. అయినా సరే, పూర్తి న్యాయం వైపే ఉన్నారు. ఆర్ధిక, సామాజిక, మానసిక అణచివేతలకు వ్యతిరేకంగా నడిపిన “బ్రెడ్ అండ్ రోజెస్” ఉద్య మం లాగే ఈ సమర శీల మహిళల పోరాటం చరిత్రలో మహిమాన్వితమైన స్ఫూర్తిగా నిలుస్తుంది!
రాజ్యాంగానికి ఉల్లంఘనలు జరుగుతుంటే ప్రప్రధమంగా మేల్కొని జాతిని మొద్దునిద్ర నుంచి తట్టి లేపింది కూడా మహిళలే! పొద్దస్తమానం రకరకాల దుమ్ముదులుపుకుంటూ, ఎదురయ్యే చెత్తను వదిలించుకుంటూ రొష్టు పడుతూ ఉంటారు గనుక మహిళలకు ఆచరణజ్ఞానం మెండుగా ఉంటుంది!
మనం పురుషులకు వ్యతిరేకం కాదు. ‘అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం’ స్ఫూర్తితో మనతో కలిసొచ్చే పురుషులతో వ్యవస్థ మార్పు కోసం జరిగే నిర్మాణాత్మకమైన నూతన సమాజ పోరాటంలో భాగం కావాలి! పితృస్వామ్య భావజాలం పట్ల అప్రమత్తంగా ఉండి మడమ తిప్పని పోరాటాలను ఎక్కుపెట్టాలి!
మనుస్మృతిని భారత రాజ్యాంగంగా మార్చడానికి హిందూ ఫాసిస్టు శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా శ్రామిక తత్త్వ శాస్త్రాన్ని అర్ధం చేసుకుని తమ కష్టంతో సంపదలు సృష్టిస్తున్న ప్రజలతో మమేకం కావాలి! పాలకుల స్వభావాలు, చేష్టలు కౄరంగానే ఉంటాయి. దానికి విరుగుడుగా మనం మానవీయ స్పందనలు పెంపొందించుకోవాలి!!