గుర్రం జాషువా అనగానే వెంటనే గుర్తుకు వచ్చే కావ్యం గబ్బిలం. దళిత జీవన సంవేదనల సమగ్ర చిత్రణ అయిన ఈ కావ్యం మొదటిభాగం 1941లోను రెండవ భాగం 1946లోనూ వచ్చాయి. గబ్బిలం మొదటిభాగం వచ్చేనాటికి పాతికేళ్ళముందునుండే ఆయన కవి. ఆ తరువాత పాతికేళ్ళు కూడా ఆయన కవితావ్యవసాయం నడిచింది.
నిజానికి గుర్రం జాషువా కుసుమ ధర్మన్న వంటి తొలితరం దళితకవులకు సమకాలికుడు. వాళ్ళకంటే రెండుమూడేళ్లకుముందే కావ్యరచన ప్రారంభించాడు. కానీ వాళ్లంతా స్వజాతి అభ్యుదయాన్ని కాంక్షిస్తూ ఆత్మగౌరవ చైతన్యంతో అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ సాహిత్యాన్ని పదునెక్కిస్తున్న కాలంలో జాషువా సంప్రదాయ సాహిత్య వస్తు రూపాల మాయలోనే ఉన్నాడు. ఇతరేతర రచనలలో నిమగ్నుడై ఉన్నాడు.
1895( సెప్టెంబర్ 28) లో పుట్టిన ఆయన ఇరవై రెండేళ్ల వయసులో (1917) ‘హిమధామార్క ధర పరిణయము’ అనే కావ్యం వ్రాసాడు( జాషువా సర్వ లభ్య రచనలసంకలనం, మనసు ఫౌండేషన్,బెంగుళూరు). హిమధామము అంటే హిమాలయ పర్వత ప్రాంతం. అక్కడ నివసించే అర్కధరుడు అనే పేరు గల వాని పెండ్లి కథ ఇది. కథ కల్పితం. అది ఒక మేలు. నగరవర్ణన, సూర్యోదయ సూర్యాస్తమయ చంద్రోదయ వర్ణనలు, విరహావర్ణన మామూలే. ఆశ్వాసాంత గద్య సరేసరి. ప్రాచీన కావ్యాల పద్ధతిలో కావ్యావతారిక ఉన్నా అందులో ఒక అసాధారణత కనబడుతుంది. మొదటి మూడు దైవప్రార్ధన పద్యాలే అయినా ఆ దైవం తన తండ్రి అయిన వీరయ్యకు సకల శుభాలు ఇవ్వాలన్న ఆకాంక్షాపూరిత ప్రార్ధనా పద్యాలు కావటం ఒక విశేషం. కవిజన ప్రార్ధన అనే శీర్షిక కింద ఉన్న పద్యాలూ రెండు మరీ విశేషమైనవి. నడకనేర్చుకొంటున్న బాలకుడు నేలపై పడితే చూచేవారు చేయిపట్టి లేపక నవ్వితే చింతపడడా అని ఒక లోక సామాన్యాంశాన్ని చెప్పి అలాగే నా కవిత్వంలో దోషాలు అనేకం ఉండవచ్చుగాక, కవిరాజులు చూసి గేలి చేస్తే తలెత్తుకోగలనా అని తన స్థితి గురించి సూచించాడు. తప్పటడుగులు వేస్తున్న కొడుకునని అనుకోండి. కొడుకు తప్పులు సంతోషంగా ఉండవా? అదేరకంగా “నా తప్పులను ముద్దుమాటలనుడి” అని ప్రార్ధించాడు.
సాధారణంగా కావ్యావతారికలు ఇష్టదేవతా స్తుతితో పాటు, కవి కావ్యరచనా సంకల్పాన్ని గురించి, ప్రేరణల గురించి, ప్రతిభావ్యుత్పత్తుల గురించి చెప్పేవిగా ఉంటాయి. జాషువా అవతారిక అందుకు భిన్నంగా కవిగా తనతప్పులపట్ల మాతృపితృవాత్సల్యం చూపమని కవిజనులను అభ్యర్ధించటంగా ఉంది. ఇటువంటి అభ్యర్ధనలు మొల్ల, తరిగొండ వెంగమాంబ వంటి మహిళా కవులు తప్ప పురుష కవులు చేయలేదు. పురుషులదైన కావ్యరచనా ప్రపంచంలోకి అడుగు పెడు తున్నారు కనుక స్త్రీలకు ఆ వినయం, విజ్ఞాపన అవసరం అయినవి అనుకుంటే జాషువాకు ఆ అవసరం ఏమివచ్చింది? జాషువా పురుషుడే అయినా చాతుర్వర్ణ వ్యవస్థకు అవతలివాడుగా సాహిత్య సమాజానికి కూడా వెలి వాడే. సవర్ణ హిందూ సమాజ అక్షరప్రపంచంలోకి తొలి అడుగులు వేస్తున్నప్పుడు అచ్చం తరిగొండ వెంగమాంబ వలే తనవి బాలవాక్కులని అనుకొనమని చెప్పాడు. పిల్లల ముద్దు మాటలుగా భావించి తనతప్పులను సహించమని కవిజనులను అతను కోరవలసి రావటం 1917 నాటి వర్ణ సమాజ వాస్తవ విషాదం. సాహిత్యరంగంలో దళితుల ఉపాంతీకరణకు సంబంధించిన చింతన ఈ రకంగా నమోదు చేసాడు జాషువా.
ఈ ప్రారంభ దశలోనే జాషువా తెలుగు సాహిత్య రంగం దళితులది కాదని గుర్తించినట్లుగానే క్రైస్తవులది కూడా కాదని గుర్తించాడు. జాషువా తండ్రి క్రీస్తును నమ్మినవాడు. చర్చిలో పాస్టర్. ‘అఖండ స్వర్గ సాహిత్యం’ తండ్రి నేర్పిస్తే నేర్చుకొన్నాడు. బాప్తిసమ్ తీసుకొన్నాడు. బైబిలు సిద్ధాంత భాష్యాలు చదివాడు. ఆ నేపథ్యంలో దళిత క్రైస్తవుడిగా 1921లో క్రీస్తు జననం ఇతివృత్తంగా ‘చిదానంద ప్రభాతము’ అనే నాటకం వ్రాసాడు. క్రైస్తవ గాధలను పద్య కావ్యాలుగా వ్రాయాలన్న తన అభిలాషను, ఇంతకుపూర్వం చేసిన ప్రయత్నాలను ప్రస్తావిస్తూ జాషువా ఈ నాటకానికి ‘విజ్ఞాపనము’ అనే శీర్షికతో ఒక ముందుమాట వ్రాసాడు. క్రైస్తవ కవులయందభిమానము క్రైస్తవ సోదరుల కుండనిచో భాషాకాంత యే మొగము బెట్టుకొని మన మధ్య చరించగలదుఅని ప్రశ్నించ టమే కాదు, ఈ వైఖరివల్ల ఆమె హైందవపండిత జనారణ్యముల మద్యసీమలను వీడిరాలేదు అని హెచ్చరిం చాడు కూడా. హిందూ పురాణసాహిత్యం వచ్చినట్లు క్రైస్తవ పురాణసాహిత్యం రాకపోవటం గురించి, దానిని అధిగమించటానికి క్రైస్తవ సమాజం చూపవలసిన చొరవ గురించి జాషువా ఆకాంక్ష అది.
రుక్మిణీకల్యాణం నాటక రచనాకాలానికి (1923) జాషువా ఆంధ్రాలో దళితఉద్యమాలకు కేంద్రమైన గుంటూరులో బోధనాభ్యసన కళాశాలలో ఆంద్ర పండితుడుగా ఉద్యోగంలో ఉన్నాడు. సమకాలీన దళిత ఉద్యమగతి ప్రభావమో, స్వీయ అనుభవమో గానీ 1925 లో ధృవవిజయము నాటకం వ్రాసేనాటికి కులభేదం గణింపక కవిత్వత్వం లోని గుణాలను గ్రహింపగల వాతావరణాన్ని ఆశించే చైతన్యం ఆయనలో మొగ్గవిప్పుకొనటం చూస్తాం. మరుసటి సంవత్సరమే వ్రాసిన శివాజీ కావ్యావతారికలో అది మరింత స్పష్టమైంది. ఆకావ్యాన్ని వ్రాయమన్నవాడు, అంకితం తీసుకొన్న వాడు శ్రీశైలపతి. ఆయన తనను పిలిపించి కావ్యం వ్రాయమని అడిగిన విషయం చెబుతూ జాషువా ‘బ్రాహ్మణేతరుడయినందున సమాదరణ లేక జీర్ణించుచున్న’ తనను కులభేదం లేక పిలిపించాడని ప్రశంసా పూర్వకంగా పేర్కొన్నాడు. సాహిత్య సమాజంలో దళితుడుగా తాను ఎదుర్కొంటున్న వివక్ష ఏదో లేకుండా, దాని తాలూకూ వ్యధ ఏదో వెన్నాడకుండా ఇట్లా అనిపించటం, అనటం రెండూ అసంభవమే. బహుశా ఈ సామాజిక అసమానతలు, నిరాదరణలు ఇవే ఆయనను మరొక ఎనిమిదేళ్లలో పద్యాన్ని వదలకపోయినా ఇతిహాస పురాణ వస్తువును, ప్రబంధ నిర్మాణాన్ని వదిలి నేలకు దిగివచ్చేట్లు చేసిఉంటాయి. ఈ ఎనిమిదేళ్ల మధ్యకాలంలో వ్రాసిన శ్రీ శారదా స్మృతి(1928), ఫిరదౌసి(1932) కావ్యాలలోనే ఆ ప్రయత్నం మొదలుకావడం చూస్తాం.
శ్రీ శారదా స్మృతి వైవాహిక జీవితంలో హింసను ఎదుర్కొని జబ్బుపడి మరణించిన వాస్తవ వ్యక్తి శారద స్మృతిలో వ్రాసిన లఘుకృతి. సమకాలపు స్త్రీల సహన జీవిత విషాద పార్శ్వాన్ని చూపింది ఈ కృతి. ప్రభువుల నిర్లక్ష్యానికి, మోసానికి గురయి మరణించిన పారశీక కవి అయిన పిరదౌసి జీవిత వేదన వస్తువుగా వ్రాసిన కావ్యం పిరదౌసి. ఇక ఇక్కడి నుండి జాషువా కవిత్వ రచనలో మరొక తొమ్మిదేళ్లకు వ్రాయనున్న గబ్బిలం కావ్య విషయ జీవిత దృక్పథాన్ని పదునెక్కించుకొంటూ తనను తాను రూపొందించుకొంటున్న అభ్యాస దశను చూస్తాం. ఈ దశకు చెందినవి స్వప్నకథ , అనాథ (1934)
1
ఒక యువకుడు కలలో చంద్రమండలానికి వెళ్లి, చంద్రుడితో స్నేహం చేసి, అతనితోపాటు తానూ అక్కడ ముసలవ్వ వాత్సల్యాన్ని, ఆదరణను పొందటం, కుతూహలంతో ఆమె జీవిత వృత్తాంతం తెలుసుకొనటం ఇందులో కథ. చంద్రుడిలో మచ్చను జింకగా ఊహిస్తారు కొందరు. రాట్నం వడికే ముసలమ్మగా భావిస్తారు మరికొందరు. జాషువా ఆమోదం రెండవ దానికే. స్త్రీత్వం, ముసలితనం రెండూ కలిపి ఆ మచ్చకు ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదించి ఆ వ్యక్తి స్వీయ కథనంగా ఈ కావ్యాన్ని అల్లాడు. ఆకాశం అనే స్త్రీ చుక్కల బిడ్డలకు పురుడుపోసి, వెన్నెల నూలువడికి, చంద్రుడు కళలు హరించుకుపోతున్న దుర్దశను చూచి దుఃఖించే రోహిణీ మొదలైన అతని భార్యలను ఓదార్చి, గ్రహణకాలంలో మాసిపోయిన చంద్రుడి బట్టలు ఉతికి ప్రసవవేదనబడే దేవతాస్త్రీలకు మంత్రసాని అవుతూ అమావాస్య రోజు కూడా కళ్ళు మూయని నిరంతర శ్రమజీవిగా ఆమెను చిత్రించాడు. భూలోక జీవిత స్త్రీల ఉత్పత్తి పునరుత్పత్తి శక్తి , వాత్సల్య రక్తి, సహనం, దయ, పరోపకారపారీణత -ఈ అన్నింటి మేలుకలయికల మూలం ముసలవ్వ గతం. పూర్వజన్మ వంటి ఆ జీవితంలో ఆమె రెడ్డి స్త్రీకి పుట్టి పసి ప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయి సాలె పడతి చేతుల్లో పెరిగింది. కాయక శ్రమ బ్రతుకులేని ఉత్పత్తికులాల స్త్రీల వారసురాలిగా ఆమె శ్రమజీవి అయింది. పేదల దుఃస్థితికి దుఃఖిత అయి తన కాయ కష్టంతో వాళ్ళను ఆదుకొనే పని చేసింది. ఫలితంగా చంద్రమండల వాసం లభించింది. శ్రమజీవులలోకెల్ల శ్రమజీవిగా స్త్రీని గుర్తించటం ఆమె చుట్టూ కథను నిర్మించటం ఆనాటికి ఒక గొప్ప ముందడుగు.
అనాథ లో కూడా కవిత్వ కేంద్రబిందువు స్త్రీయే. ఆమె కడుపేదరాలు. ఆకలికి అలమటి స్తున్న ఆరుగురుబిడ్డల తల్లి. వాళ్ళ ఆకలి తీర్చటానికి బిచ్చమెత్తటం తప్పమరొక మార్గం లేని అనాథ. పైగా మాల కులపు మనిషి. ఇక అడుగడుగునా ఆమెకు తిరస్కారాలే అన్న విషయం వేరే చెప్పనక్కరలేదు. వీధి అరుగులమీదినుండి,పెండ్లిభోజనాల సందళ్ళ నుండి పదేపదే పోపొమ్మన్న ఛీత్కారాలు, అంటరానిది ఆదరించదగినది కాదన్నతిరస్కారాలు ఎదుర్కొనటంలో ఆమె ఎంత గాయపడ్డదో చూపించాడు జాషువా. ఈ కథలో సవర్ణ దంపతుల జంటలు రెండు ఉన్నాయి. ఒక జంటలో పురుషుడు సంస్కర్త. అందుకే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అనాథను వైద్యుని ఇంటికి చేర్చి చికిత్సచేయించాడు. ఆయన భార్య అంటరానిదాన్ని ముట్టుకున్నావని స్నానం చేయకుండా ఇంట్లోకి రావద్దని అభ్యంతర పెట్టింది. ‘కులభేద పిశాచ తృప్తికై’ అతను స్నానం చేసాడట. అంటే కులభేద పిశాచం భార్యను ఇంకా పీడిస్తున్నది కనుక తాను నమ్మి కాక ఆమె తృప్తికి ఇష్టం లేక పోయినా చేసిన స్నానం అదన్నమాట. ‘మాలదానిపిల్లల కడగండ్లు చూచి వేదన పడే మనస్సు మైలపడ్డట్లే కదా అది స్నానం చేయలేదు కదా ఈ వెలుపలి శుద్ధికి ఇంత వెంపర్లాట ఏమిటన్నది అతని తర్కం. తోటివాళ్ల కష్టాలకు కారణమైన సమాజ నీతికి బాధ్యతవహించగల సంస్కరం వల్లనే ఆ పాపానికి పరిహారంగా ఆమెకు చికిత్సచేయించాడు. ఆ పిల్లలను అనాధ శరణాలయంలో చేర్చాడు. మనసును శుద్ధిపరచుకొనటం అంటే అతని ఉద్దేశం అంతవరకే.
మరొక జంటలో భర్త కు సమానతా సంస్కారం లేదు. వర్షంలో తడుస్తూ తలదాచుకొనటానికి చావడిలోకి వచ్చిన ఆమెను అంటుకోకు వెళ్ళు అని అడ్డగించాడు. వర్షంలో తడిసివచ్చిన పెంపుడు కుక్కకు ఉపచారం చేస్తున్న ఆ మనిషికి పసిబిడ్డతో తడిసిపోతున్న మానవికి ఆశ్రయమియ్యటం కులం అడ్డువచ్చింది. కానీ అతని భార్య మాత్రం “ ఎవరైననేమి?రక్షణ / మవశ్య కర్తవ్యమే కదా? నరులకు ధ /ర్మువునకు గలుగునే కుల / వివక్షతయుఁ జిన్న పెద్దభేదము నాథా!” అని చెప్పి అనాథను ఆదరించింది.ఈ రకంగా అమానవీయ సామాజిక వ్యత్యాసాల సమాజాన్నివిమర్శకు పెట్టే సందర్భాలను, సంభాషణలను కల్పిస్తూ కథను నడిపిన జాషువా మరొక అడుగు ముందుకువేసి సామాజిక వ్యత్యాసాలకు వర్గవైరుధ్యాలకుమధ్య ఉన్నపరస్పర సంబంధాల పై వెలుగు ప్రసరింప చేయటం అనాథ కావ్యంలోని విశేషం. ఇందులోని రెండు పద్యాలు పరిశీలిస్తే ఆ విషయం స్పష్టపడుతుంది.
“ అన్నము( బెట్టవే యనుచునల్లరిచేయు ననుంగు బిడ్డలన్
దిన్నగ నూరడించుచు విధిం దలపోయుచు నొక్క పేదరా
లన్నము( దిన్న కొండొక ధనాఢ్యుని బంగరు మేడముంగిటన్
దిన్నెల వేగుచుండె నతిదీనత మున్నొకనాఁటి రాతిరిన్” –
ఖండిక ప్రారంభంలోని ఈ పద్యంలో అన్నంకోసం అల్లరిచేస్తున్న పిల్లలను ఊరడించే తల్లిని , అన్నంతిన్న ధనాఢ్యుడి బంగారు మేడ ముందరి అరుగును పక్కపక్కనే చెప్పటం లేమి కలిమి అనే ద్వంద్వాల కార్యకారణ సంబంధాన్ని స్థాపిస్తుంది. లేమికి కారణం సంపదలు ఒక దగ్గర పోగు పడటమే. ఆకలి తీర్చే అన్నం తల్లికైనా పిల్లలకైనా మేడ యాజమానికైనా ప్రాథమికమైన అవసరాలు. ఆ అవసరం మేడ యాజమానికి తీరింది. అవసరాలు తీరిన తరువాత కూడా ఆయన దగ్గర పోగుపడే సంపదకు – బంగరు మేడలకు – తల్లీ పిల్లల ఆకలి అవసరాలు తీరకపోవటానికి మధ్య ప్రత్యక్ష సంబంధం లేకపోవచ్చుగానీ సంపదసంచయనమే పేదరికాన్ని సృష్టిస్తుంది అన్న సూత్రం మాత్రం సత్యం. ‘అన్నపురాసులు ఒకచోట, ఆకలిమంటలు ఒకచోట’ అని కాళోజి చెప్పిన వ్యత్యాసాల వాస్తవం ఇక్కడ గుర్తు రాక మానదు.
రోడ్డుప్రమాదపు గాయాలు మానాక పెద్దపిల్లలను శరణాలయంలో వదిలి చిన్న బిడ్డతో బతుకుతెరువు మార్గాలను వెతుక్కొంటూ ఒక ఊళ్లోకి వెళ్లిన సందర్భంలో జాషువా వ్రాసిన సీసపద్యం ఈ వ్యత్యాసాల వాస్తవాన్ని మరింత స్పష్టంగా చెప్పింది.
“ఏవడారగించు నమృతభోజనంబున గలిసెనో యీ లేమ గంజి బువ్వ
ఎవ(డు వాసము సేయు శృంగార సౌధాన మునిగెనో యిన్నారి పూరిగుడిసె
ఎవని దేహము మీఁది ధవళాంబరములలో నొదిగెనో యిన్నాతి ముదుకపంచె
ఎవ(డు దేహము సేర్చు మృదుతల్పములలోన నక్కెనో యీయమ్మ కుక్కిపడక
వసుధపై నున్నభోగసర్వస్వమునకు
స్వామిత వహించి మనుజుండు ప్రభవమందు
నెవడపహరించె నేమయ్యె నీమెసుఖము
కలుషమెఱు(గని దీని కొడుకుల సుఖంబు?”
గంజిబువ్వ, పూరిగుడిసె, ముదుక పంచె, కుక్కిపడక ఆమె కనీస అవసరాలు. తిండి, గుడ్డ, గుడిసె కూడా లభించని హీనస్థితిలో మనుషులు ఉన్నారంటే దోపిడీ వ్యవస్థ కారణంగానే. ఇలా ఎంతెంతమంది కనీసపు అవసరాలు తీర్చే సాధనాల దోపిడీ జరగకపోతే కొందరికి అమృత భోజనం, శృంగార సౌధం, మంచి వస్త్రాలు , మృదుతల్పాలు సాధ్యమకావు అన్న గతితర్కం తెలిసిన కవిగా కనబడతాడు జాషువా. భూమిపై వున్న సకల సంపదల మీదా కొందరికి అధికారం దక్కిందంటే అది పూర్తిగా అపహరణ తంత్రం వల్లనే అన్న స్పష్టత జాషువాకు ఉంది. ఆమె సుఖాన్ని, ఏ పాపం ఎరుగని పసిపిల్లలు -ఆమెపిల్లలు – వాళ్ళ సుఖాన్ని దోచుకొన్న దొంగల గురించి జాషువా వేదన – అంటరానితనం, పేదరికం ఒకదాని నుండి ఒకటి విడదీయరానివి అన్న సామాజికార్ధిక అవగాహనగా పదునెక్కింది ఈ పద్యంలో. ఇదే తరువాతి కాలపు కవిత్వంలో బహుళంగా వ్యక్తమైంది.
స్వప్నకథ, అనాథ కావ్యాల సంపుటి ముందుమాటలో “ కావ్యశిల్పమునకన్న అభిప్రాయ ప్రకటనమే నా పరమావధి” అని జాషువా చెప్పినమాట గమనించదగినది. అంతకుముందు వ్రాసిన పురాణేతిహాస వస్తువిషయ రచనలకు అభిప్రాయాలతో పనిలేదు. అక్కడ శిల్పమే ముఖ్యం. స్వప్నకథ, అనాథ కావ్యాలలో వస్తువు నూతన దృక్పథం నుండి పరిణామంచెందింది. పేదరికం వల్ల, కులం వల్ల, స్త్రీలు కావటం వల్ల కొందరు అత్యంత హీనమైన దయనీయమైన జీవితాలను గడపవలసి రావటం గురించిన లోకవాస్తవాల పరిశీలన నుండి ఆలోచనలు, అభిప్రాయాలు ఏర్ప డుతూ వాటిని ప్రకటించటం అనివార్యమైన తొలిదశ రచనలుగా ఇవి జాషువా సాహిత్య జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పాయి. ఇక ఇక్కడినుండి ఆయన సాహిత్యం ఈ మూడుఅంశాలను వస్తువు గా చేసి వ్యాఖ్యానించే క్రమంలో ఎలా విస్తరించిందో చూడవచ్చు.
2
స్త్రీ కేంద్రంగా శ్రమ గురించి, కులం గురించి జాషువా ఆలోచనలు సాహిత్యరూపం తీసు కొనటం మొదలైంది కనుక ముందుగా స్త్రీ సమస్యను ఆయన ఎట్లా అర్ధం చేసుకున్నాడో, ఏ పరిష్కారాలను ఆశించాడో పరిశీలించటం సముచితంగా ఉంటుంది. తల్లిగా, సోదరిగా, భార్యగా, బిడ్డగా, అత్తగా, ఆడబిడ్డగా స్త్రీలను రకరకాల పాత్రలలో కుదించి విలువకట్టి కీర్తించిన సాహిత్య సంప్రదాయానికి భిన్నంగా ఒక వ్యక్తిగా స్త్రీ కుటుంబంలోగానీ సమాజంలోగానీ ఎంత చేస్తున్నదో, ఎంత కోల్పోతున్నదో చూపించే ప్రయత్నం జాషువా సాహిత్యంలో కన బడుతుంది.
అట్లాగని ఆయన తల్లి గురించి వ్రాయలేదని కాదు. “చేరి తన మేని నెత్తురు టేరులందు/ నేను నిలువీత లీదని నెలవు లేదు” అని పుట్టుకకు ముందు తల్లిగర్భాన ఉమ్మనీటిలో ఈదిన స్థితిని కూడా సంభావించగలిగిన సున్నిత మానవుడు, అరవైఏళ్ల వయసులోనూ తల్లి వాత్సల్యం అనుభవించగలిగిన నిత్య శిశువు (మాతృప్రేమ, 1937), రక్తమే పాలుగా చేసి తాగిస్తూ ఒళ్ళుమరిచి కన్ను మూయక కళ్ళల్లో పెట్టుకు పెంచి జీవితమిచ్చిన కన్నతల్లి (1946) కన్నుమూతకు కనలిపోయే పసివాడు జాషువా. ఇవి రెండూ పూర్తిగా ఆత్మాశ్రయ కవితలు. వీటిలో తల్లి ఆయన స్వంత తల్లే. మాత (1952) అనే ఖండికలో మాత్రం ఆమె తల్లులందరికీ సామాన్య వాచకం. ఆది గురువు అయిన తల్లి పిల్లలపట్ల చేయగూడని పనులేమిటో ఇందులో సూచిస్తాడు.
కులభేదాల విద్వేష బీజాలు నాటటం, పిల్లలనేరాలను పక్కవాళ్ళమీదికి తోసివేయటం, తప్పుడు మాటలు మాట్లాడుతున్నా సరిచేయకపోవటం, దయ్యాలు,భూతాలు అని పిల్లల రోగాలకు సరైన చికిత్స చేయించక పోవటం, చిన్నతనానే పిల్లలకు పెళ్లిళ్లు చేయటం, చదువును నిర్లక్ష్యం చేయటం, బూచి భయం చూపి పసిమనసులలో మొలకెత్తే ధీర భావాలను అణచివేయటం పిల్లలను వక్రగుణం లో పట్టభద్రులను చేయటమే నని హెచ్చరిస్తాడు. మిగిలిన సందర్భాలు దాదాపు అన్నీ వివక్షాపూరిత భార్యాభర్తల సంబంధంలో కనిపించే హింసకు, కనిపించని హింసకు గురవుతున్న స్త్రీల పక్షాన నిలబడి మాట్లాడినవే. బహుశా అందుకు ఆయన నిబద్ధుడు అయ్యేట్లు చేసింది శ్రీ శారదా స్మృతి కావ్య రచనావకాశమే అయి ఉంటుంది.
శారద 1926 నవంబర్ 14 చనిపోయిన ఒక సామాన్య బ్రాహ్మణ గృహిణి. భర్త సతాయింపు, సాధింపులు, వేధింపుల మధ్య అనారోగ్యం పాలయి చిన్నతనం లోనే మరణించింది. అలాంటి ఆడవాళ్లు అనేకులు ఉండవచ్చు. కానీ ఈ అమ్మాయి తండ్రో, మేనమామలో గుంటూరు వాళ్లు కావటంవల్ల ఆమె వ్యధాభరిత జీవితాన్ని వస్తువుగా చేసి కావ్యం వ్రాయమని జాషువాను అడిగి వుంటారు. ఆ కావ్యం వ్రాసే క్రమంలో స్త్రీ పురుషుల అసమానత, స్త్రీల అసహాయత, పురుషుల అధికారం వంటి విషయాలు ఆయన హృదయానికి దగ్గర అయి ఉంటాయి. స్వప్నకథ, అనాథ కావ్య రచనల తరువాత కూడా స్త్రీ పురుష వివక్ష ఆయనను వెన్నాడుతూనే ఉండి అనేక రచనలకు కారణమైంది. 1946 లో ‘తెరచాటు’ నాటకం అలా వచ్చిందే. నిజానికి జాషువా ఈ నాటకాన్ని అంతకు ఎనిమిదేళ్ళకు పూర్వమే అంటే 1938 లోనే గూడవల్లి రామబ్రహ్మం పెట్టిన నాటక పోటీ కోసం వ్రాసాడు. స్త్రీల విషయంలో జాషువా సంస్కరణ దృష్టికి నిదర్శనం ఈ నాటకం.
నాలుగు అంకాల ఈ వ్యవహారిక వచన నాటకం వృద్ధులతో పెళ్లిళ్లు, బాల్యంలో వైధవ్యం, సామాజిక ఆంక్షలు, సహజ శారీరక వాంఛలు, రహస్య ప్రణయాలు, అనైతిక గర్భాలు, సంఘానికి జడిసి అయితే గర్భస్రావాలు చేయించుకొనటం లేదా సంతానాన్ని అనాధలుగా వదిలెయ్యటం- మొదలైన దురాచారాలతో కునారిల్లుతున్న హిందూసమాజం మీద విమర్శ. ఇందులో ప్రమోదుడు, అతని భార్య శ్యామల స్త్రీపురుషుల వికాసానికి అవరోధంగా ఉన్న మూర్ఖపు సంప్రదాయాలను నిరసించే ఆధునిక యుగ సంస్కర్తలకు ప్రతినిధులు.“ హిందూ సంఘమంటే మనుషుల్ని ప్రాణాలతో పీక్కుతిను క్రూర పిశాచం గాదా? వెఱ్ఱిదానా? ఆడదై పుట్టడమే మహా పాపమనుకో. అందులో బ్రాహ్మణ కొంపలో పుట్టటం నీచాతినీచం”( శ్యామల) “పాతివ్రత్య సమస్య ఒక నిషా వస్తువు. అది మీ ఒంట నినికిపోయింది. మీరిక బాగుపడరు( గిరి ), వంటి సంభాషణలు స్త్రీ మీద సామాజిక మత నియంత్రణ స్థాయిని తెలుపుతాయి. ప్రమోదుడు స్త్రీ సమస్యలతో పాటు వర్ణ సమస్యను కూడా విమర్శకు పెడుతుంటాడు. స్వరాజ్యం తమ ఏలుబడికి అవకాశం ఇస్తుందని ఆశపడి సమర్ధించినా హరిజనోద్ధరణ, దేవాలయప్రవేశం మొదలైన తలనొప్పులు తెచ్చి వర్ణసంకర కారణం అవుతున్నదని బాధపడుతున్న వర్గాల పట్ల కూడా అతనిది విమర్శనాత్మక దృష్టే. జాషువా దీనిని విషాదాంత నాటకం అన్నాడు. 1938 నాటికి ప్రబలంగా ఉన్న దళిత జాతీయోద్యమాల వెల్లువలో వీరేశలింగం కాలం నాటి బాల్యవివాహాలు, వితంతు సమస్య, వయో తారతమ్య వివాహాలు ప్రధాన సమస్యలు కాకపోవటం వల్లనేమో ఈ నాటకం పెద్దగా చర్చలోకి రాకుండాపోయింది.
(ఇంకా ఉంది…)