మళ్ళీ మనం బయటకు వచ్చి మెరిసే నక్షత్రాలను చూస్తాం!

వో మహాత్మా, వో మహర్షీ !
యేది చీకటి, యేది వెలుతురు?
యేది జీవిత, యేది మృత్యువు?
యేది పుణ్యం, యేది పాపం?
వో మహాత్మా!

మెల్లగా జీవితాలు మాస్క్ తో.. సానిటైజర్ తో రోడ్లన్నీ కిక్కిరిసిపోతూ ప్రయాణిస్తున్నాయి. మనిషిని మనిషి స్పర్శించటానికి వెనుకాడకుండా స్పర్శించే మొండి ధైర్యమేదో కూడా వచ్చేసింది. భద్రజీవితాలు గడిపే అవకాశం వున్నవారిలో యెవరో కొందరు మాత్రం యింకా బయటకి రావటానికి జంకుతున్నారు కానీ అత్యధికంగా మనుష్యులు బయటి వచ్చారు. వస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తున్నవారు వున్నారు. భాద్యతారహితంగా జాగ్రతలు పాటించని వారూ వున్నారు. యేది యేమైనా మనిషి వొంటరిగా వుండలేడు. వర్చ్యువల్ జీవితంకి కూడా యెంతో అలవాటు పడినవారు, వ్యసనంగా అంటుకుపోయిన వారు కూడా థియేటర్స్ వోపెన్ చేసినప్పుడు సినిమాలకి వెళ్ళటం మొదలు పెట్టారు. సందర్భం యేమైనా కావొచ్చు.. అవసరమా కాదా అన్న ఆలోచనతో సంబంధం లేకుండా మనుష్యులు సమూహాలుగా మసలటం మొదయయింది.

యెందుకంటే మనందరికీ తెలుసు ‘మనిషి సాంఘిక జంతువు’, సంఘజీవి. మనిషి అవిర్భవించినప్పటినుంచి యెప్పుడూ వొంటరిగా మనలేడు. ‘మనిషి’ అనే పదమే వొక అద్భుతమైన శబ్దం అంటాడు గోర్కీ. అన్నం లేక పోయినా బతగ్గలం కానీ స్వేచ్ఛ లేకుండా బతకలేం. మనుషులు కలవాలి. కరచాలనం చేసుకోవాలి. సుఖదుఃఖాలని కలబోసుకోవాలి. మంచి చెడ్డల్ని పంచుకోవాలి. కొట్టుకోవాలి. తిట్టుకోవాలి. అనేక యుద్దాలు చేసుకోవాలి. మనిషి యెప్పుడూ వొంటరిగా మనలేడు. గత యేడాదిన్నర పైగా మనిషి వొంటరి అయిపోయాడు. ప్రకృతి ముందు తలవంచి మనిషి వొంటరిగా మిగిలిపోయాడు. వొక్కడిగా వెళ్లిపోతున్నాడు. యీ లాక్ డౌన్ , ఐసోలేషన్ పరిస్థితిని యిన్నిరోజులు అనుభవించాక ఆ పాత మనిషిని తిరిగి చూడగలమా? అనే దిగులు కూడా వచ్చేసింది కదా అప్పట్లో. యిప్పటికే కొన్నాళ్లుగా రాజ్యం మనిషినుంచి మనిషిని వేరుచేసే, మనిషికి మనిషిని శత్రువుని చేసే కార్యక్రమాన్ని చాపకింద నీరులాగా నిర్వహిస్తోంది. యిప్పుడు యీ కోవిడ్ – 19 దానికి మరింత దోహదం చేస్తోంది.

లాక్ డౌన్ లో మరో మనిషి మొఖాన్ని నెలల తరబడి ప్రత్యక్షంగా చూడలేని పరిస్థితి యేర్పడినప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలోని ఘోట్టోలు, వొంటరి జైలు బందీఖానాలు యిలా యెన్నో గుర్తుకువచ్చాయి. ఆ సాహిత్యం కళ్ళముందుకు వచ్చి నిలబడింది. లాక్ డౌన్ లాంటి అనుభవాలనే రాసిన ‘అన్నా ఫ్రాంక్ డైరీ’ గుర్తుకు వచ్చింది. ‘పాపిలాన్’ గుర్తుకువచ్చింది. వూహలు వికసించే వయస్సులో, కలలు మొగ్గలు తొడిగే కౌమారంలో వో యూదు బాలిక తన కుటుంబం, తన కుటుంబానికి స్నేహితులైన మరో కుటుంబంతో పాటు వో ఆఫీస్ రూమ్ వెనుక భాగంలో బయటకు చిన్న శబ్దం కానీ, చిన్న వెలుతురు కానీ బయటకు కనిపించకుండా వొక యేడాదిన్నర పాటు నివసించాల్సి రావడం, చివరకు నాజీల చేతికి చిక్కి మరణించడం జరుగుతుంది. ఆ లాక్ డౌన్ జీవితాన్ని ఆ బాలిక అన్నా ఫ్రాంక్ డైరీగా రాస్తుంది. కలలు, మిస్ అవుతున్న స్నేహితులు, టీచర్లు, ప్రేమలు, అక్కడ వున్న మనుషుల స్వభావాలు యిలా ప్రతీ విషయాన్ని గొప్పగా నమోదు చేస్తుంది. ‘పాపిలాన్’ కూడా స్వీయ అనుభవ రచనే. సముద్రం మధ్య వొంటరి దీవిలోని జైలులో వొంటరి ఖైదు నుంచి పాపిలాన్ తప్పించుకోవడానికి, స్వేచ్ఛ కోసం చేసే ప్రయత్నాలు, చివరికి సముద్రంలో తేలుతున్న కొబ్బరికాయల తెప్ప మీద వెల్లకిలా పడుకొని పాపిలాన్ పెట్టే కేక యెప్పటికీ చెవుల్లో మారుమోగుతూనే వుంటుంది ” బాస్టర్డ్స్ ఐ యామ్ స్టీల్ యెలైవ్”.

ఆలాగే గుర్తొచ్చిన మరో నవల ‘ఎ జెంటిల్మాన్ యిన్ మాస్కో’.

లాక్డౌన్ సమయంలో యిల్లు జైలో లేదా అభయారణ్యమో కాదా? అని ‘ఎ జెంటిల్మాన్ యిన్ మాస్కో’ నవల ప్రశ్నించటం గుర్తొచింది. అమెరికన్ రచయిత అమోర్ టోవల్స్ 2016లో రాసిన యీ నవల గృహ నిర్బంధానికి గురైన వ్యక్తి జీవితపు కథ. గత లాక్ డౌన్ లో యీ పుస్తకాన్నిమళ్ళీ చదివినప్పుడు యెవరి జీవితమైనా నిర్భందానికి లోనైనప్పుడు ఆ జీవితానుభవం వారికేం నేర్పిస్తుంది?! వారి అనుభవాల నుంచి మిగిలిన వారేం తెలుసుకొంటారు?! నేర్చుకొంటారు?!

యీ నవల్లోని జీవితాన్ని చూస్తే కౌంట్ అలెగ్జాండర్ రోస్టోవ్ అనే కూలీనుడి కథ యిది. జార్ ప్రభుత్వంలో పనిచేసి అనేక మెడల్స్ సాధించిన రోస్టోవ్ 1917 బోల్షెవిక్ విప్లవం తర్వాత బోల్షెవిక్ అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సివస్తుంది. దానికి హాజరు అయ్యేందుకు మాస్కో వచ్చి అత్యంత ఖరీదైన మెట్రోపోల్ హోటల్లోని లగ్జరీ సూట్ లో బస చేస్తాడు. అతడ్ని విచారించిన అధికారులు ఆరేళ్ళకుముందు రాసిన వో ప్రజా వ్యతిరేక కవిత అతను రాసిందేనని అనుమానంగా వుందని, అది తేలేవరకు ఆ హోటల్ విడిచి వెళ్లరాదని చెప్తారు. అతని బసని లగ్జరీ సూట్ నుంచి హోటల్ ఆరవ అంతస్తులోని హోటల్ వర్కర్స్ కోసం కట్టిన వో చిన్న చీకటి గదిలోకి మారుతుంది. కొత్త పరిస్థితులకు మాత్రమే కాక, బోల్షెవిక్ పాలనలో తన జీవితం కనుమరుగు అవుతుందనే జ్ఞానానికి సైతం సంసిద్ధం అవ్వాలని అతను గ్రహిస్తాడు. తన గదికి వున్న చిన్న కిటికీ ద్వారా మారుతున్న పరిస్థితులను గమనిస్తుంటాడు. హోటల్ వర్కర్స్ తో స్నేహం చేస్తాడు. అదే హోటల్ లో బస చేసిన వ్యాపారి కూతురు నినా అనే చిన్న అమ్మాయితో స్నేహం కలుస్తుంది. ఆ అమ్మాయి నుంచి హోటల్ లో యెవరికీ తెలియకుండా యెలా సంచరించవచ్చో తెలుసుకుంటాడు. అలా సంచరిస్తున్నప్పుడు తన పాత స్నేహితురాలు, కవి మిష్కా ని కలుసుకుంటాడు. బోల్షెవిక్ ప్రభుత్వం నుంచి తన కవిత్వానికి బహుమతినందుకున్న మిష్కా మరొకనితో ప్రేమలో వున్నట్టు తడుతుంది.

అలాగే అన్నా ఆర్బనోవా అనే సినిమా నటితో పరిచయం అవుతుంది. రోస్టోవ్ ఆ హోటల్ నిర్బంధం లో వుండటం సంవత్సరం అయిన సందర్భంగా నినా ఆ హోటల్ రహస్య దారులకు సంబంధించిన తాళం చెవిని రోస్టోవ్ కి కానుకగా యిస్తుంది. అలా పదేళ్ళు గడిచాక తన సోదరి మరణించిందని తెలిసి హోటల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. కానీ అతడి స్నేహితుడైన హోటల్ వర్కర్ అతడిని కాపాడతాడు. నినా ని బోల్షవిక్ లతో పాటు చూస్తాడు. భూస్వాముల, కులక్ ల భూములను జప్తు చేసే బృందం లో తాను పనిచేస్తున్నట్టు చెబుతుంది. పార్టీలో ప్రముఖ స్థానంలో వున్న ఒసివ్ గ్లెబెనికోవ్ అనే మాజీ కౌంట్ హోటల్లో దిగి తనకు వొక రహస్య గదిలో ఫ్రెంచ్, యింగ్లీషు సంస్కృతులను గురించి బోధించాలని కోరుకుంటాడు. కొద్దిరోజులు అతనికి ఆ సేవ చేస్తాడు.

కొన్ని సంవత్సరాలు గడిచేక నినా వో పసిబిడ్డతో వచ్చి అతడ్ని కలుస్తుంది. తన భర్తని చిన్న అపార్ధంతో ఐదేళ్లు కఠిన శిక్ష వేసి సైబీరియా కి పంపించారని తాను వెళ్లి అతన్ని కలిసి వచ్చేవరకు తన కుమార్తె సోఫియా ని వొక నెలరోజుల పాటు చూసుకోవాలి అని అభ్యర్ధించి ఆ పసిపిల్లని రోస్టోవ్ కి అప్పగించి వెళ్తుంది. మొదటి రెండురోజులు తీవ్ర యిబ్బందులు పడినా ఆ పాప పెంపకం రోస్టోవ్ కి ప్రపంచాన్ని మరిపిస్తుంది. పాపని అప్పగించి వెళ్ళిన నినా యిక యెప్పటికీ తిరిగిరాదు. సోఫియా అతని వద్దే పెరిగి పెద్దదై మంచి పియానో ప్లేయర్ అవుతుంది. సోఫియా పియానో ప్రదర్శనలు యివ్వడానికి విదేశాలకు ఆహ్వానం అందుకుంటుంది. తన బృందం తో పాటు రోస్టోవ్ ను యిక్కడ తప్పించి తనతో అమెరికా తీసుకెళ్తానని సోఫియా చెబుతుంది. రోస్టోవ్ 37 యేళ్ళ తన లాక్ డౌన్ కి సహకరించిన మిత్రులందరికీ లెటర్స్ రాసి హోటల్ నుంచి తప్పించుకుంటాడు. కానీ సోఫియా తో పాటు అమెరికాకు వెళ్లకుండా తన స్వగ్రామం లోని తన యింటికి వో వృద్ధుడిగా చేరుకుంటాడు. క్లుప్తంగా యిదీ కథ.

మూడు దశాబ్దాలుగా తన చుట్టూ వున్న పరిస్థితులలోని అన్వేషణలోని ప్రేమ, స్నేహం యిలా జీవితపు గొప్పతనాన్ని యీ నవలలో చూస్తాము. లాక్ చేయబడటం దురదృష్టమా లేక అదృష్టమా?! మాస్కోలోని వొక జెంటిల్మాన్ 37 యేళ్ళల్లో స్నేహం, చిన్నపాటి వేడుకలు, ప్రేమించడంలో నిజమైన అర్థం. అన్నిటికంటే అపూర్వమైన మానవ సంబంధాలు లాక్ డౌన్ తనకు నేర్పాయని. అది తన అదృష్టమేనని వొప్పుకుంటాడు.

37 యేళ్ళు లాక్ డౌన్ లో వున్న ‘యే జెంటిల్మాన్ యిన్ మాస్కో’ రోస్టోవ్ మనకు యీ లాక్ డౌన్ ని అధిగమించే పాఠాల్నిచాలానే చెప్పారు.

*

గత యేడాది యావత్ ప్రపంచం కోవిడ్ -19 తో లాక్ డౌన్ అయిపోయిన సందర్భంలో దాదాపు 30 దేశాల నుంచి యెంపిక చేసిన కవులు, రచయితలు, కళాకారుల అనుభవాలను సంకలనం చేసిన పుస్తకం “ఐ అండ్ వియ్ కేం అవుట్ సైడ్ అండ్ సా ద స్టార్స్ అగైన్”. యీ పుస్తకం శీర్షికను దానంటే యిన్ఫెర్నో చివరి పంక్తి నుంచి తీసుకున్నారు. ఆ పుస్తకం లో మెక్సికన్ ‘జువాన్ విల్లోరో’ రాసిన ‘కష్టాల్లో నేను వొంటరిగా లేను’ ఆలోచింపచేసే రచన.

*

లాక్ డౌన్ కి ముందు తరువాత అని మన జీవితాల్ని చూసుకుంటే మన జీవితంలో, చుట్టూ వున్న వారి జీవితాల్లో యెలాంటి మార్పులు వచ్చాయి. కరోనా యెందరినో యీ ప్రపంచం నుంచి పట్టుకుపోయింది. ఆ లోటు యెప్పటికీ పూడ్చలేనిది. యెప్పటికీ వెంటాడే విషాదమది.

2020 సంవత్సరం ప్రపంచం తనకి తెలియని భూభాగాల్లోకి ప్రవేశించింది. కోవిడ్ కి ముందు ప్రపంచంలో ప్రజలకి తమ జీవితాలపై అంతో యింతో పట్టు వుండేది. పనిచేసే ప్రపంచం అంటే నిరంతరం కదలికలో వుండగలగడం. కొంతమంది పరిగెత్తారు, మరికొందరు తమ వేగంతో నడిచారు, కానీ యెప్పుడూ పూర్తి స్తబ్ధత లేదు. ప్రపంచం ఆగిపోయిన ఆ కాలంలో చిక్కుముడుల్లో చిక్కుకొన్న జీవితాలెన్నో.
భారతదేశ నగరాల్లో లాక్డౌన్ మొదలయ్యాక వచ్చిన శోభాడే ‘లాక్డౌన్ లైజన్స్’ లో యిల్లే ప్రపంచంగా మారిపోయి, ఆ యిరుకు నుంచి తప్పించుకోవడానికి లేని పరిస్థితిని. శోభా డే ‘లాక్డౌన్ లైజన్స్’ లో లాక్ డౌన్ లో స్తబ్దతలో చిక్కుకున్న జీవితాల నుంచి తప్పించుకోవటానికి చేసే ప్రయత్నం కనిపిస్తుంది. ‘లాక్డౌన్ లైజన్స్’ అనేది చిన్న కథల సమాహారం. లాక్డౌన్ సమయంలో యీబుక్ గా విడుదలైన యీ పుస్తకం తరువాత ముద్రణలో వొకే వాల్యూమ్ గా విడుదల అయింది. నిరాశ, సంతోష క్షణాలు, చుట్టుపక్కల కుటుంబాలతో చిన్న పరస్పర చర్యలు, ప్రపంచాల క్షణిక ఘర్షణలు, మీ స్వంత మనస్సులోని సంభాషణలు, తప్పించుకోవాలనే కోరిక, మొత్తం మీద, లాక్డౌన్ లైజన్స్ లాక్డౌన్లో భారతదేశం జ్ఞాపకాల స్పష్టమైన చిత్రాన్ని చిత్రించింది.

అనేకానేక సమయాల్లో కొందరు చేసిన ప్రయాణాలు మానవాళిని వెలుగుల్లోకి నడిపించేవి. స్పూర్తి ప్రదాతలు యెందరో.. చే ‘మోటర్ సైకిల్ డైరీస్’ చదివినప్పుడు ఆ అనుభవాల మెరుపు ధగధగలాడూతూ యెంతటి వుత్తేజపూరితమో కదా. ‘My experiments with truth’ చదివినప్పుడు, గాంధీ గారు వొక విద్యార్ధిగా చేసిన ప్రయాణం యెంతటి యెరుక నిచ్చిందో యెలా స్పూర్తివంతంగా నడిపిందో యెప్పుడూ ఆశ్చర్యమే. సూఫీ కవులు, జెన్ తత్వవేత్తలూ, రాహుల్ జీ యిలా యెందరో వారి యాత్రాలని మనలోకి వంపారు. అరకాటిక దీవుల్లోకి ప్రయాణింప చేసిన రోజులు, హరేరామ హరేకృష్ణ రాధేనాథ స్వామి ‘జర్నీ టూ హోం’ చదివినప్పుడు ఆ వెతుకులాట కోసం చేస్తోన్న ప్రయాణం వెంటాడుతూనే వుంటుంది. హోవార్డ్ ఫాస్ట్ ‘ది లాస్ట్ ప్రాంటియర్’ చదివినప్పుడు ఆ ఢీరధిక్కారప్రయాణం స్వేచ్ఛా జీవితపు ఆకాంక్ష మనల్ని యెన్నెన్ని సుడిగుండాల్ని యెదుర్కొనే శక్తినిస్తుందో చూసాం.

అయితే యిప్పుడు లాక్ డౌన్ దాదాపు పోయింది. ప్రపంచం కొన్ని ఆంక్షలతో ప్రయాణిస్తోంది. సాహిత్యంలో మనల్ని అలరించిన విలువైన యాత్రా సాహిత్యం వుంది. గ్లోబలైజేషన్ మొదలైనప్పటి నుంచి ట్రావెల్ ని విపరీతంగా ప్రమోట్ చేసాయి. మధ్యతరగతి దాదాపుగా మాయమైపోయిన కాలమది. ఆ సమయంలో మొక్కులు తీర్చుకోడానికో, పుట్టింటికో, శుభకార్యాలకో, వేసవి సెలవల్లో అమ్మగారింటికో ప్రయాణాలు చేసే వారంతా వివిధ ప్రాంతాలు, దేశాలని చూడటానికి కుటుంబాలతో లేదా స్నేహితులతో వెళ్ళటం మొదలయింది. ట్రావలోగ్స్ రాయటం చూసాం. ప్రయాణాన్ని వొకొక్కరూ వొక్కోలా చూస్తారు. వొక్క మ్యాజిక్ క్షణం కోసం నిరీక్షించే ఫోటో గ్రాఫర్స్ చేసే ప్రయాణాలు కొన్ని. యిష్టమైన నదిని చూడాలనో, మంచుపర్వాతాలని చూడాలనో, పూలలోయల్ని చూడాలనో, సముద్రతీరాల్ని చూడాలనో యిలా చేసే ప్రయాణాలు యెన్నో. కొంత మంది ప్రయాణాలు చేసాక వాటి గురించి రాసినవి చదివినప్పుడు యేమిటీ పత్తిపనిలా వున్నాయి యీ ప్రయాణాలని పిస్తుంది. మరి కొందరివి సోమరిగా, పరాన్నజీవుల్లా వుంటాయి. యిలాంటి వాటి నుంచి వాళ్లకి యేమి అందుతుందో జీవితంలో యేమి నింపుకుంటారో వాళ్ళకి యేమైనా తెలుస్తుందో లేదో కానీ చదివేవారికి యేమీ అందదు. అలాంటివి చదవటం వల్ల సమయం వృధా తప్పా మరేమీ మనకి ప్రయోజనం లేదు. లాక్ డౌన్ లో పూర్తిగా నష్టపోయిన రంగం పర్యాటక రంగం. దాని చుట్టూ పుట్టుకొచ్చిన అనేక అనుబంధసంస్థలు. లాక్ డౌన్ తీసేసాక మళ్ళీ యిప్పుడు ఆ రంగాన్ని నిలబెట్టాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. యెప్పుడోకప్పుడు జీవితాన్ని గాడీలోకి తీసుకొని రావాల్సిందే. అయితే యిప్పుడు చెయ్యబోయే ప్రయాణాలు సరి కొత్త పరిస్థితిలో చెయ్యాల్సిన పరిస్థితులు. యిప్పుడు వో ట్రావెలర్ గా మనమేం చూస్తాం?! లాక్ డౌన్ యెత్తేసిన వెంటనే సిమ్లా వుండటానికి వొక్కగది కూడా దొరకనంతగా కిటకిటలాడిపోయింది పర్యాటకులతో. అంతగా మనం మన గదుల నుంచి పారిపోవాలనుకునేట్టు చేసింది.

పంకజ్ మిశ్రా ‘బటర్ చికెన్ యిన్ లూధియానా’ లో స్మాల్ టౌన్స్ యెలా మారుతున్నాయో యిచ్చిన యిన్సైట్ విలువైనది. యిన్నేళ్ళ తరువాత అదీ లాక్ డౌన్ తరువాత స్మాల్ టౌన్స్ లో వచ్చిన మార్పులు యెలా వున్నాయోననే కుతూహలంతో అటూయిటూ తిరుగుతున్నప్పుడు కనిపించిన వాటిలో ప్రధానమైనది వలసలో వెళ్ళి లాక్ డౌన్ లో తిరిగి వూళ్ళకి వెళ్ళిన వాళ్ళలో చాలామంది అక్కడే నిలదొక్కుకోడానికి చేస్తోన్న ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. యీ పరిణామం యెంత కాలం వుంటుందో అలానే సాగుతుందో యిప్పటికిప్పుడు తెలీదు. ముందుముందు యెలాంటి పరిణామాలని అందిస్తాయో కూడా యిప్పుడే చెప్పలేం. ఆ యా ప్రదేశాలకి కొంత కొంత గ్యాప్ తరువాత వెళ్ళి వస్తుంటే యేమైనా అర్ధమవుతుందేమో.

త్వరలో మనలో చాలమంది తిరిగి ప్రయాణిస్తాం మాస్క్ తో, సానిటైజర్ తో చేసే యీ కొత్త ప్రయాణాలు యెప్పటిలా యెంతటి వ్యక్తిగతమో అంత సామాజికం.. అవును “మనం మళ్ళీ బయటకు వచ్చి
మెరిసే నక్షత్రాలను చూస్తాం!”
యెప్పటికైనా…
మనుష్యుడే నా సంగీతం,
మానవుడే నా సందేశం!

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, మూడు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, 'మసిగుడ్డ', 'ముక్త', 'ఇన్స్టంట్ లైఫ్', ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, ముక్త, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, 'నెమలీకలు పూసే కాలం' (కవిత్వం), 'మంత్రనగరి సరిహద్దుల్లో (ప్రేమ కథలు), 'పొగమంచు అడవి', 'మోహనదీ తీరంలో నీలి పడవ' (కవిత్వం) సంకలనాలుగా వచ్చాయి.

4 thoughts on “మళ్ళీ మనం బయటకు వచ్చి మెరిసే నక్షత్రాలను చూస్తాం!

  1. గొప్ప పరిచయాలు. ఈ పరిచయాలన్నింటిలోను కుప్పిలి పద్మ గారు చదువరులకి ఆ పుస్తకాలు చదవాలనే ఆతృత కలిగిస్తారు. ఇన్ని పుస్తకాలు చడవలేని ఉక్రోషం కూడా కలిగిస్తారు

  2. లాక్ డౌన్ ఎంత నరకప్రాయంగా అనుభవించామో కానీ తద్వారా మనల్ని మనం తిరిగి తెలుసుకోవడానికీ ఉపయోగపడింది. ప్రకృతికి మనం చేసిన అన్యాయం యొక్క ప్రతిఫలంగా మన అనుభవంలోకి వచ్చింది. అలాగే మృత్యువు యొక్క భయంకర అనుభవం బతికుండగానే మనుషులకు దూరంకావడం కూడా. మీరు చదివిన పుస్తకాల జాబితా వాటి లోని గొప్ప సాహిత్యం పరిచయం ఎప్పటికప్పుడు అద్భతం. అభినందనలు

  3. మీరు ఏమి రాసినా సరే పూర్తి వివరంగా రాస్తారు…ఎంత చిన్న టాపిక్ అయినాసరే ప్రతి విషయాన్ని touch చేస్తారు…ఇప్పుడు కూడా లాక్డౌన్ ముందు తర్వాత జీవితం లో జరిగిన మార్పులను చాలాబాగా చెప్పారు….ఇంకా దానితో పాటుగా నిర్భంద జీవితాలకు సంబంధించిన రచనలను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు….ఇంకా కవిత శీర్షిక చూస్తేనే మనసుకు ఒక వుత్తేజం కలిగింది…..నిజంగా చాలా చక్కటి శీర్షిక….ఎందరి మనసుల్లోనో మేదలాడిన మాట
    “మళ్లీ మనం బయటకు వచ్చి మెరిసే నక్షత్రాలను చూస్తామా????🙏🙏🙏

  4. “Where there’s hope, there’s life. It fills us with fresh courage and makes us strong again.”–Anne Frankనిజం!
    “మనం మళ్ళీ బయటకు వచ్చి
    మెరిసే నక్షత్రాలను చూస్తాం!”
    యెప్పటికైనా…
    మనుష్యుడే నా సంగీతం,
    మానవుడే నా సందేశం!”
    కరోనాకాలం నేర్పిన, భయపెట్టిన నిజాలు ప్రసూతి వైరాగ్యంగా మిగిలిపోతాయా?
    మనిషి మారిపోకపోయినా కాస్తైనా ఆలోచనల్ని, ఆచరణని సవరించుకొంటే బాగుంటుందికదా…
    “We all live with the objective of being happy; our lives are all different and yet the same.”—Anne Frank

Leave a Reply