మానవజాతి చరిత్రలో అనేకానేక దురాగతాలు జరిగాయి. ‘గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళులతో’ అన్నారు శ్రీ శ్రీ. చరిత్ర గమనం పరస్పరం సంఘర్షించిన శక్తుల వలన జరిగింది. క్రూరమైన నియంత పాలనల కింద నలిగి నజ్జయిన సమాజాలెన్నో. యుద్ధాలలో, అధికారదాహాలలో, పదవీ కాంక్షల్లో, కుట్రల్లో, కుతంత్రాలలో మానవ సమాజ చరిత్ర ప్రపంచం లో అణువణువూ నెత్తురోడింది. ఐతే చరిత్ర మాత్రం గెలిచిన వాళ్లే, అధికారాన్ని చేజిక్కించుకున్న వాళ్ళే, రాజ్యాలు స్థాపించిన వారే, అసంఖ్యాక పీడిత ప్రజానీకాన్ని అణచివేసిన వాళ్ళే రాసుకున్నారు. చరిత్ర నిండా, వాళ్ళు చేసిన ఘోరాలకు, దారుణాలకు మసిబూసి మారేడుకాయ చేసి గొప్పలు చెప్పుకున్నారు. ఓడిపోయినా వాళ్లూ, వాళ్ళ చరిత్రా కనుమరుగైపోయింది. ఆధిపత్య రథ చక్రాల కింద నలిగిపోయి శిథిలమై పోయి దుమ్ములో కలిసిపోయింది. న్యాయమైనా అన్యాయమైనా వాళ్ళ రోదన, ఆక్రందనలు చరిత్రలో ఎక్కడో తప్ప రికార్డ్ కాలేదు.
ఆధునిక యుగం లో ముందుకొచ్చిన అనేకానేక ప్రజాపోరాటాలు, తాత్విక సిద్ధాంతాలు, చరిత్ర ను కొత్త దృక్కోణం తో చూడాల్సిన అవసరాన్ని, పరాజితుల పక్షం నిలబడి చరిత్రను తిరగరాయాల్సిన ఆవశ్యకతను ముందుకు తెచ్చాయి. ‘చరిత్రను మర్చిపోతే అది తిరిగి పునరావృతమై మనల్ని శపిస్తుంది.’ ‘చరిత్ర మొదటి సరి విషాదంగానూ. రెండో సారి ప్రహసనంగానూ పునరావృతమౌతుంది’. ఐతే దాదాపు అన్ని సమాజాల్లోనూ మానవ విషాదానికి, దురాగతాలకు, అణచివేతలకు, రక్తపాతాలకు సాక్షీభూతంగా సాహిత్యం, కవిత్వం నిలిచింది. సాహిత్యకారులు, కవులు చరిత్ర లో ప్రతి సందర్భం లో గొంతెత్తారు. మనమెన్నడు మర్చిపోకూడని గతాన్ని, చరిత్రను మనకు గుర్తుచేయడానికి, మనం మళ్ళీ అదే చరిత్రను పునరావృతం చేసే శాపానికి గురికాకుండా కవిత్వం ఒక హెచ్చరికై కాపాడింది.
అటువంటి కవిత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చూడవచ్చు. చరిత్రను మనకు గుర్తుచేస్తూ తమకెన్ని కష్టనష్టాలెదురైనా, మనల్ని ఈ భూమ్మీద క్షేమంగా ఉండేందుకు దోహదపడిన అనేక కవుల్ని, వారు రాసిన కవిత్వాన్ని మనమెన్నడూ మర్చిపోరాదు . వాళ్ళ దృష్టి మనకు కరదీపికలుగా నిలుస్తుంది . మహాసముద్రం లో పెనుతుపాను లో చిక్కుకుపోయినప్పుడు వాళ్ళ కవిత్వం మనకు చుక్కాని అవుతుంది. మనల్ని ఒడ్డుకు చేర్చే తెరచాప అవుతుంది.
ఈ శీర్షిక లో మీకు అట్లాంటి కవుల్ని, వాళ్ళ కవిత్వాన్ని, వాళ్ళు బతికిన చారిత్రిక సందర్భాలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ప్రపంచం లోని విభిన్న దేశాలనుండి ఆయా సందర్భాల్లో ఆయా కవులు రాసిన కవిత్వం చరిత్రకు ఎట్లా సాక్షీభూతమవుతుందో మనకు అవగతమవుతుంది. మనం ఆ చరిత్రను, ఆ గతాన్ని ఎందుకు మర్చిపోకూడదో వెన్ను తట్టి మరీ చెబుతుంది.