మనిషే వొక రచన 

జైలు లోపల నేను అనేకమంది అభాగ్యులను చూశాను. వాళ్లకు కనిపెట్టుకుని ఉన్న కుటుంబాలు లేవు. వాళ్లకోసం వాదించే న్యాయవాదులు లేరు. వాళ్ల చేతిలో డబ్బు లేదు. వాళ్లకు తమ పిల్లలు ఎట్లా బతుకుతున్నారో తెలియదు. వాళ్లకు తమ కుటుంబాలతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. అంటే అక్కడ నా చుట్టూ ఒక దుఃఖ సముద్రం ఉండింది. అటువంటి పరిస్థితుల్లో, ఎవరికి వీలైతే వారికి, ఎంత మందికి వీలైతే అంతమందికి సహాయం చేయడం అనే ఆలోచన ఒక్కదాని మీదనే కేంద్రీకరించక తప్పదు. అదే నన్ను క్షణం తీరిక లేకుండా ఉంచింది. నా గురించి నేను బాధ పడడానికి అతి తక్కువ సమయం మిగిలేది.’ 

(భీమా కోరేగావ్   కేసులో  జైలు పాలై బెయిల్ పై బయటికి వచ్చిన సుధా భరద్వాజ్ యింటర్వ్యూ నుంచి ) 

దేశం జైలు లోపలే కాదు; బయట కూడా ఆమె తన గురించి తాను యెప్పుడూ ఆలోచించుకోలేదు. తన వృత్తినీ ప్రవృత్తినీ వొదులుకోలేదు. ‘చీకటిలోనూ వెలుతురు పక్షమే‘ నిలబడింది. అనునిత్యం తనిఖీల మధ్య సోదాల మధ్య నిఘా నీడల్లో తన కలలను కాపాడుకుంటూ తోటి ఖైదీల ప్రేమలు మోసింది. వారి  ప్రేమను మనతో పంచుకుంది. మాట్లాడటం నిషేధమైనచోట గొంతు గుండె విప్పి మాట్లాడింది. అభిప్రాయ ప్రకటన పై ఆంక్షలు విధించిన చోట నిరసన స్వరాన్ని వినిపించింది. మనుషుల్ని కూడగట్టింది. ఏకాంతంలో సామూహిక గానం ఆలపించింది. లోపల అయినా బయట అయినా సహజ సిద్ధమైన న్యాయం కోసం పోరాడింది. మానవ హక్కుల కోసం నినదించింది. దరఖాస్తులు నింపింది. అర్జీలు, వుత్తరాలు రాసింది. ఇదంతా ఆమెకు ఒక కార్యాచరణ కాదు; దైనందిన జీవితంలో వొక భాగం మాత్రమే. 

జైలు ఆమెకు ఒక పాఠశాల. 
కూడదీసుకోవడం నేర్పింది.  
జైలు ఆమెకు ఒక వ్యాయామశాల.  
నిలబడటం నేర్పింది.  
జైలు ఆమెకు ఒక కలల బడి.  
ఊహలు చేయటం నేర్పింది.

2018 ఆగస్ట్ 28న అరెస్టయిన సుధా భరద్వాజ్ భీమా కోరేగావ్   కుట్ర కేసులో ఉపా కింద అరెస్టైన పదహారు మంది బుద్ధిజీవుల్లో,  మానవహక్కుల కార్యకర్తలలో, రచయితలలో, విద్యావేత్తలలో వొకరు. సుధ జైలు పాలవదానికి కారణం వొక్కటే; ఆమె మనందరికన్నా యెక్కువగా యీ దేశాన్ని ప్రేమించింది. ఈ మట్టినీ మట్టి మనుషుల్నీ ప్రేమించింది. వారి న్యాయబద్ధమైన హక్కుల కోసం అనుక్షణం  తపించింది.   

 గణిత శాస్త్రంలో ఐఐటి పట్టభద్రురాలు అయిన సుధా భరద్వాజ్ కావాలనుకుంటే దేశవిదేశాల్లో యెక్కడైనా పెద్ద ప్యాకేజితో యే మల్టీ నేషనల్ కంపెనీకో సియీవో కావొచ్చు. కానీ యీ దేశంలో అణగారిన వర్గాలకు అండగా నిలవడానికి  ఆమె సిద్ధమయ్యారు. అందుకోసం తాను పుట్టి పెరిగిన అమెరికా దేశ  పౌరసత్వాన్ని వదులుకున్నారు. పారిశ్రామిక కార్మికులకు, గ్రామీణ పేదలకు న్యాయ సహాయం అందించడానికి హైకోర్టు న్యాయమూర్తి నియామక ప్రతిపాదనను సైతం తిరస్కరించారు. మానవహక్కుల న్యాయవాదిగా వుండటమే అత్యున్నత పదవిగా ఆమె భావించింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఛత్తీస్ గడ్ లో కార్మికోద్యమ కార్యకర్తగా పనిచేసింది, ఆదివాసులకు న్యాయ సహాయం అందిస్తూ గడిపింది. అందుకు యీ దేశం ఆమెకు యిచ్చిన బహుమతి జైలు జీవితం.  

అరెస్టయ్యే నాటికి ఆమె ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా న్యాయశాస్త్రం బోధిస్తున్నారు.  జైల్లో క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితి వల్ల బెయిల్ దొరికి విడుదలైన 83 సంవత్సరాల కవి వరవరరావు తర్వాత ఈ కేసులో బెయిల్ మీద విడుదలైన వ్యక్తి సుధా భరద్వాజ్.  

బెయిల్ కు షరతులు విధించిన ఎన్ ఐ ఎ స్పెషల్ కోర్టు సుధా భరద్వాజ్ తన మీద ఉన్న కేసు గురించి ప్రచార మాధ్యమాలతో మాట్లాడగూడదని ఆంక్షలు విధించింది. తాను తిరిగి న్యాయవాద వృత్తిని కొనసాగించడానికి  ఛత్తీస్ గడ్ వెళ్లడానికి అనుమతించాలని ఆమె చేసిన విజ్ఞప్తిని కూడ ఆ కోర్టు తిరస్కరించింది. ముంబాయి, థానే దాటి పోవడానికి వీలు లేదని ఆంక్షలు విధించింది.   

వాటిని ఛేదించుకుని చిత్రాంగదా చౌధురికి ఇచ్చిన ఇంటర్వ్యూని (అను. ఎన్ వేణుగోపాల్) దీర్ఘ కవితగా అల్లి కవి ‘వాసు’ తెలుగు పాఠకులకు అందించాడు. 

చాలా మందికి అది కేవలం ఇంటర్వ్యూ మాత్రమే. కొందరికి అది ఒక అర్బన్ నక్సలైట్  రాజకీయ తీర్మానం. ఆ కొందరికి అది వొక దేశద్రోహి ప్రకటన కూడానేమో! సుధా భరద్వాజ్ మహోన్నత వ్యక్తిత్వం, దేశ ప్రజల మీద ఆమె ప్రేమ,  అమ్మదనం,  స్త్రీతత్వం నాకు అందులో గోచరించాయి. ఆమె చెప్పిన ప్రతి అక్షరం ఆమెలోని మానవిని దర్శింపజేసింది.  కానీ కవిగా ‘వాసు’కి  ఆ ఇంటర్వ్యూ వొక మానవీయమైన కవితగా సాక్షాత్కరించింది. మనుషుల మధ్య వెల్లివిరియాల్సిన ప్రేమ వాక్యంగా విచ్చుకుంది.  బాధితులపట్ల కరుణ చూపే ఆమె వుదాత్త వ్యక్తిత్వం అతని ముంగిట ఆవిష్కారమైంది. కార్మిక  హక్కుల కార్యకర్తగా ఆమెలోని పోరాట పటిమకు ముకురమై భాసించింది. దశాబ్దాల ఆదివాసీ ఉద్యమ రక్త చలన గీతం ఆమె మాటల్లో వినిపించింది. అది వొక దీర్ఘ కావ్యమై ప్రతిధ్వనించింది.  ‘ప్రేమతో మీ సుధ’గా ప్రవహించింది.   

సుధ జీవితంలోనే కాదు సుధలాంటి అసంఖ్యాకుల జీవితంలో కరిగిన మంచు బిందువు కనురెప్పల కింద గడ్డకట్టినప్పటి‘ విషాదాన్ని వాసు కవిగా వెలికి తీశాడు. కష్టాలతో తలపడుతూనే దుఃఖాన్ని జయించే విద్య నేర్చిన  సహచర ఖైదీల  జీవితాల్లోని అనేక కోణాల్ని అక్షరీకరించాడు. వారిలోని ధిక్కార స్వభావాన్ని గుండెలోకి వొంపుకున్నాడు. భీమా  కోరేగావ్ సహనిందితులు,  ప్రేమాస్పదులు అయిన పదహారుగురి గురికీ అంకితభావానికీ అద్దంపట్టాడు. అకారణంగా, కేవలం మనిషి పట్ల అమలవుతున్న దోపిడి గురించి దుర్మార్గం గురించి కవులుగా జర్నలిస్టులుగా విశ్వవిద్యాలయ ఆచార్యులుగా మేధావులుగా మాట్లాడినందుకు, వారంతా వొక వూరి పేరుతో దేశద్రోహులయిన వైనాన్ని కయిగట్టాడు. మా పేరు ఒక ఊరు / మా పేరు ఒక నిరసన

 ఆ కేసులోని కుట్ర కోణాన్ని వాసు కవితాత్మకంగా బహిర్గతం చేశాడు. ఇజ్రాయిల్ సీసాలోని రహస్య భూతగాడు కంప్యూటర్ వేర్లలోకి చొరపడతాడు. అప్పుడు అందరూ నేరస్తులే. దొంగ ఆరోపణలతో కేసులు నమోదవుతాయి. అభూత క్రూర కల్పనలతో చార్జిషీట్లు తయారవుతాయి. సంవత్సరాల తరబడి చార్జిషీట్లు కూడా వుండవు. ఊపిరి తీసే ఉపా చట్టం ముందు శకార న్యాయం చిన్నబోతుంది. విచారణ అంతా పచ్చి అబద్ధం,  జైలు వొక్కటే అంతిమ నిజం. న్యాయ స్థానాలు పాలకుల పర్సనల్ సెక్రటేరియట్లు గా కుదించుకుపోతాయి. మరీ పచ్చిగా చెప్పాలంటే వారి ఫ్రంట్ ఆఫీసులుగా పనిచేస్తాయి. జడ్జీలు ఎన్ఐఏ రాసిచ్చిన స్క్రిప్ట్ కి మౌత్ పీసులు అవుతారు. చట్టాలు చట్టుబండలౌతాయి.  

(ఇక్కడ విచారణ అబద్ధంఖైదు ఒక్కటే నిజంఒక విషాదం దేశమంతా కమ్ముకుంటుంది, న్యాయమూర్తులు సైతం ప్రవచనాలకు భాషణాలకు పరిమితమయ్యారు  

చీకటి బ్యారకులు, చిలుము పట్టిన కడ్డీలు, రెండు రోటీలు, గరిటెడు దాల్ సబ్జీ,  నాలుగు బారు గోడలు,  మూడు అడుగుల నడవ,  చెట్టు కొమ్మకు ఉరేసుకున్న చారల చంద్రుడు,  పౌర సమాజం బతికే ఉన్నదా అన్న అనుమానం కలిగే చోటు జైలు. కానీ సుధా భరద్వాజ్ జైల్లో నిరుత్సాహానికి గురి కాలేదు. కొత్త పాఠాన్ని నేర్చుకుంది. జైలు ఆమెకు అధ్యాపకులైందిఅంటాడు కవి. జైల్లో దళితులు ఆదివాసీలు ముస్లింలే ఎందుకుంటారని ఆమె ప్రశ్నించుకుంది. సంధించకూడని ప్రశ్న అది. ఇటువంటి ప్రశ్నలు దేశాన్ని బహిరంగ జైలుగా మార్చటం మన కళ్ళ ముందున్న సత్యం. జైలు ఆమెకు లోపలి మనుషులనే కాదు; బయటలోకాన్ని అర్థం చేసుకోవటానికి కూడా దోహదపడింది. దేశాన్ని ప్రజల్ని మరింత ప్రేమించడానికి తోడ్పడింది. తనలా అక్రమంగా జైలు పాలైన తోటి ఖైదీల్ని ప్రేమించడానికి వారి ప్రేమను పంచుకోటానికి జైలు  వుపయోగపడింది. 

సొంత గాయాల్ని తడుముకోటానికి సైతం క్షణం తీరిక లేకుండా ఆమె అక్కడ పనిచేసింది. కవిగా వాసు సుధా భరద్వాజ్ మనసు లోపలి కల్లోలాన్ని కాకుండా దయార్ద్ర గుణాన్ని అక్షరీకరించాడు. ఆమె గుండె పొరల్లో దాగి ఉన్న ప్రేమను వెలికి తీశాడు. ఒక న్యాయవాదిగా ఆమె నిబద్ధతకు నిలువెత్తు చిత్రం గీశాడు. అతనీ కవితలో కేవలం సుధ ప్రేమను పంచటానికి పరిమితం కాలేదు. ఆమె జీవన శ్వాసను గుప్పిట పట్టి కళ్ళ ముందు రూపు కట్టించాడు. 

*

జైలులో వ్యక్తిగత గౌరవం భంగమవుతుంది. ఏకాంతం దొరకదు. వాటి నుంచి బైటపడడానికి కాస్త సమయం పడుతుంది. ఇప్పటికీ నేను నడుస్తున్నప్పుడు, నా భుజాల మీంచి వెనక్కి చూస్తాను. యూనిఫాం వేసుకున్న వ్యక్తులు నన్ను వెన్నంటో, నాకు అటూ ఇటూనో వస్తున్నారా అని చూస్తాను. నేనొక్కదాన్నే నడుస్తున్నానా అని అనుమానిస్తాను. కాని ఇప్పుడు నా ఇష్టం వచ్చినప్పుడు లేవవచ్చు. “ఆంటీ జల్దీ కరోఅని బైటి నుంచి ఎవరో ఒకరు అరుస్తారనే ఆలోచన లేకుండా బాత్ రూం కు వెళ్లవచ్చు. భోజనం కోసం లైన్ లో నిలబడకుండా నా అంతట నేను తెచ్చుకోవచ్చు. ఇటువంటి చిన్న చిన్న సంగతులు కూడ అనుభవించవలసినవే.’ 

ఇంటర్వ్యూలో సుధ చెప్పిన యిటువంటి సున్నితమైన అంశాల్ని కూడా వొడుపుగా పట్టుకుని వాసు తన దీర్ఘ కవితలో యిమడ్చగలిగాడు. నిజానికి కవిత్వంగా రూపొందడానికి అవసరమైన వుద్వేగం ఆమె యింటర్వ్యూలో నిండుగా దట్టించి వుంది. దాన్ని అతను యథా తతంగా తర్జుమా చేయగలిగాడు. అయితే కవి అక్కడ ఆగలేదు. స్వేచ్ఛ కోసం గుండె గుప్పిట పట్టి కునుకు తీయక పరుగులెత్తిన పాపియాన్ ని గుర్తు చేస్తాడు. 

ఆశ, ఎండించి దాచుకోవాల్సిన విత్తనం  
అదునుకు వేసి పదును చూసి నాటాలి

అన్న వొక కవితా విశ్వాసాన్ని పంట తీస్తాడు. విద్వేషానికి విరుగుడుగా ప్రేమైక భాషలో సిసలైన దేశభక్తి గీతం రాస్తాడు. స్వేచ్ఛాగానం చేస్తాడు. మనుషులే రచన అనీ, ప్రేమ మీరా తడిమి నీరు కడితే బహురేకుల మందార పువ్వై విచ్చుకుటారనీ, బీడు భూముల్లో సద్దకంకుల బువ్వై విరగకాస్తారనీ మరోసారి నిరూపిస్తాడు.  

ఖైదీలలో అత్యధికుల కన్న నేను ఎంత ఎక్కువ అదృష్టవంతురాలిని’ అంటుంది సుధ. నిజమే. అసలు యెటువంటి విచారణ లేకుండా తమపై కేసులేంటో సైతం తెలీకుండా దేశవ్యాప్తంగా వేలాదిమంది కారాగారాల్లో మగ్గుతున్నారు. ఈ కుట్ర కేసులో మిగిలిన నిందితులలో చాలా మంది నాలుగేళ్ళుగా యిప్పటికీ  జైల్లోనే వున్నారు. కుటుంబ సభ్యులు మరణించినా కడసారిగా చూసుకునే అవకాశం కూడా యివ్వని అమానవీయ ప్రాణాంతక హంతక న్యాయం అమలౌతోంది. ఎనబై నాలుగు సంవత్సరాల జెసూయిట్ మతాచార్యుడు, సామాజికశాస్త్రవేత్త ఫాదర్ స్టాన్ స్వామి కోవిడ్ బారిన పడి విచారణలో ఉన్న ఖైదీగానే మరణించారు. ఈ హత్యలకు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. సిగ్గుపడేవాళ్ళూ లేరు.  

“విశ్వాసాలతో నిజాయితీ విద్యుత్తేజమైనప్పుడు  
సింహాసనాన్ని భయపెడతాయి  
మానవ హక్కులే కాదు మానవ సేవ కూడా.   
దేశమేదైనా పరిత్యాగులను చంపటం పాలక మత సంస్కృతి 
ఫాదర్ స్టాన్ స్వామిని హత్య చేసింది ఎవరు లోకానికి తెలియదా  
కారాగారపు గోడల కంటిన జేగురు మరకలే 
సత్యానికి సంతకం”

సత్యం అబద్ధపు కథనాల వెనక చీకట్లో నాలుగ్గోడల మధ్య సమాధి అయినప్పుడు సుధ  గాయపడిన అంతరంగాన్ని వాసు ఆర్తితో తడిమాడు.  ఫాదర్ స్వామికోసం తపించే క్రమంలోనే నిఘా కన్ను కింద స్నానం చేసే సాయిబాబా కోసం అరుణ్ కోసం గౌతమ్ కోసం షోమా సేన్ కోసం సురేంద్ర గాడ్లింగ్ కోసం వాళ్ల కోసం యెదురుచూసే కుటుంబ సభ్యుల కోసం ఆమె ఆరాటపడింది. ఈ ఆర్తిని ఆరాటాన్నీ వాసు సుధ ముఖతఃనే పలికిస్తాడు. ఒక విధంగా కవి సుధా కాయంలోకి ప్రవేశించి మాట్లాడతాడు. చాలాచోట్ల  యేది కవి హృదయంలో నుంచి దుమికి వచ్చిందో యేది సుధా భరద్వాజ్ ఆలోచనా ధారో విడదీయలేనంతగా కలిసిపోయిన కవిత్వ పంక్తులు  పఠితల్ని వుక్కిరిబిక్కిరి చేస్తాయి. అందుకే అసలీ కుట్రల వెనక వున్న శక్తుల అన్వేషణ సాగింది. రాజ్యం కార్పొరేట్ ముంగిట పందిరి గుంజకి కట్టేసిన పెంపుడు జంతువైన వైనం కవిత్వంలో  దృఢంగా ముందుకు వచ్చింది.  

“వేలంపాట ఇప్పుడు జాతీయగీతం అయింది.   
అడవులు ఖనిజాలు విమానాలు రైళ్లు  
అమ్మ గలిగినవన్నీ అగ్గవగా అమ్మేయవచ్చు 
బరిబాతల నిలబెట్టి మనిషిని కూడా. 
మృత్యు బేహారికి హక్కుల విలువ ఏం తెలుసు”
అంటాడు.

ఫాసిస్టు భూతం కార్పొరేట్ పిశాచం కలిసి చేస్తున్న ఫ్యూజన్ నాట్యాల జుగల్బందీని వాసు ఆ యా సందర్భాల్లో తన రాజకీయ దృక్పథం నుంచి నిర్ద్వంద్వంగా ఖండించడానికి తొట్రుపడలేదు. సంశయించలేదు.  

*

తొమ్మిది ఖండికల దీర్ఘ కవిత లో సుధా భరద్వాజ్ మూడేళ్ళ జైలు అనుభవాల తో పాటు ఆమె జీవితంలో వివిధ దశల్లోని వుద్యమ ఆచరణని కూడా వాసు పరిచయం చేశాడు. ఆ క్రమంలో టీ కొట్టే ఆడిటోరియంగా లైబ్రరీ మెట్లే జానపద రంగస్థలంగా మూసిన పిడికెళ్లే ఎర్రజెండాలుగా రెపరెపలాడిన కాలంనాటి నాటి సామాజిక చైతన్యం, ఢిల్లీ కార్మిక వాడలు ఫ్లైఓవర్ ల క్రీనీడలు ఆసియా క్రీడలు శంకర గుహా నియోగి అడుగుజాడలు యివన్నీ కవిత్వమయ్యాయి. అలాగే ఆమె గతం నుంచి నిర్మించుకున్న భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రస్తుతమైంది. 

న్యాయవాదులను పెట్టుకోవడానికి శక్తి లేని నా సహ ఖైదీ మిత్రుల కేసులు చేయాలని ఉంది. వారికి ప్రభుత్వం అందించే న్యాయసహాయం అస్తవ్యస్తంగా ఉంది. అయితే రెండో పనిలో నాకు భుక్తి ఏమీ దొరకదు. కాని నేను చేయగలిగిన సహాయం తప్పనిసరిగా చేయాలని ఉంది. నేను జైలులో కలిసినవారిలో చాల మంది ఏళ్ల తరబడి ఉన్నారు. వారికి న్యాయస్థానాలలో సరైన ప్రాతినిధ్యమే దొరకలేదు. వారికి ఏదో ఒకరకంగా సహాయం చేయ దలచుకున్నాను.’  

ఈ చెదరని నిమగ్నత కారణం గానే యీ సడలని నిబద్ధత వల్లనే బాధితుల కోసం పనిచేస్తూ బాల్య కౌమారాల్లో తల్లి అవసరం వున్న కన్నబిడ్డపై (మాయాషా) సుధ ఎక్కువ శ్రద్ధ చూపలేకపోయారు. ఒక తల్లిగా తన వైఫల్యాన్ని ఆమె దాచిపెట్టలేదు. జైలు పాలవడానికి కారణమైన తల్లి రాజకీయాల గురించి గానీ ఆమె కార్యక్షేత్రం గురించి కూతురికి తెలీదు.  తెలిసిన తర్వాత మాయాషా కి తల్లి త్యాగం లోని గొప్పదనం అర్థమైంది. ‘ఆదివాసీలు, కార్మికులు, రైతుల తరఫున పోరాడటం, వాళ్ల కోసమే మొత్తం జీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వారనే నా అభిప్రాయం.’ అని నిశ్చితంగా ప్రకటించగలిగింది. ఇప్పుడు తల్లితో పాటు బిడ్డ పేరు కూడా దేశద్రోహుల జాబితాలో నమోదైందేమో! 

“మరోసారి ఇలాగే జీవించే అవకాశం వస్తే 
ఇప్పుడు చేసిన పనులే మళ్లీ మళ్లీ చేస్తాను 
మరింత అందంగా 
మరింత సమర్థంగా 
మరింత మానవీయంగా 
ఎంతో ప్రేమతో.”

అంటారు సుధ యీ ఇంటర్వ్యూ/కావ్యం పూర్తయ్యేసరికి. జైలు జీవితం ఆమె పట్టుదలని రెట్టింపు చేసింది. ఉత్సాహాన్ని పదింతలు చేసింది. ఆమె మనశ్శరీరాలను మరింత దృఢతరం చేసింది. అందుకు ఆమె జైలు లోపలి సహచరులకు బయట మహా పోరాటంలో వున్న ప్రజలకు కృతజ్ఞురాలై వుంది.    

ఇప్పటికి అసహాయలే కావచ్చు 
రేపు అజేయులవుతారు నా ప్రజలు

ఇది వాసు కవితా వాక్యం మాధ్యమంగా సుధ ప్రేమతో మనకిస్తున్న  సందేశం. విశ్వాసం. అందుకుని ముందుకు సాగుదాం. సమస్త శక్తుల్నీ కూడగట్టుకుని ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా పోరాడడాం. ఈ యుద్ధం కష్టతరమైనది. ఈ యుద్ధం జీవితాన్ని దాటేంత సుదీర్ఘమైనది. అయినా పోరాడక తప్పదు. ద్వేషాన్ని ప్రేమతో యెదుర్కోక తప్పదు. ఎందుకంటే ప్రేమ భాషలో ఆలోచించి అనుభూతి చెంది ప్రేమ భాషలో మాట్లాడినప్పుడు మాత్రమే అగాథాలు పూడుతాయి. 

ఈ యెరుక కలిగిస్తున్నందుకు కవి వాసు, పవి సుధ లకు ప్రేమతో.. 

ఎ. కె. ప్రభాకర్

** సమీక్షలో ఇటాలిక్స్ లో సింగిల్ కోట్ లో వున్న వాక్యాలు సుధా భరద్వాజ్ ఇంటర్వ్యూలోవిబోల్డ్ అక్షరాల్లో ఉన్నదివాసుకవిత్వం  

[ప్రేమతో మీ సుధ, దీర్ఘ కవిత, వాసు, విరసం ప్రచురణలు, సెప్టెంబర్ 2022, వెల: రూ.50,  ప్రతులకు: పాణి 87 – 106 శ్రీ లక్ష్మీ నగర్, బి కాంప్, కర్నూలు 518002, ఫోన్: 9866129458, నవోదయ బుక్ హౌస్ హైదరాబాద్, నవ తెలంగాణ హైదరాబాద్, అనేక బుక్ స్టాల్ విజయవాడ] 

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

2 thoughts on “మనిషే వొక రచన 

Leave a Reply