‘వ్యక్తికి కళా నైపుణ్యం వుంటుంది. కానీ సృజనాత్మకత సాధ్యమయ్యేది సమూహానికి మాత్రమే’ – గోర్కీ
విప్లవ రచయితల సంఘానికి యాభై యేళ్లు. సుదీర్ఘకాలంగా రాజ్యానికి వ్యతిరేకంగా సడలని నిబద్ధతతో పీడితుల పక్షాన నిలబడి సాంస్కృతికోద్యమంలో క్రియాశీలంగా కొనసాగుతున్న సాహిత్యసంస్థ విరసం. ఈ యాభై యేళ్లలో విరసం యెదుర్కొన్న సవాళ్లు అనేకం. ఆంక్షలూ ప్రకటిత అప్రకటిత నిషేధాలూ నిఫూలూ అసంబద్ధ అసత్య ఆరోపణలూ అక్రమ నిర్బంధాలూ కుట్రకేసులూ దాడులూ జైలు జీవితాలూ ఎన్‌కౌంటర్లూ… యెన్నిటినో తట్టుకుని ఆధిపత్య శక్తు లకు యెదురొడ్డి వొక ప్రజాసంఘంగా అది అలుపు లేకుండా పోరాడుతోంది. ఎన్నో కష్టనష్టాల మధ్య ఆటుపోట్ల మధ్య విమర్శలూ విద్వేషాల మధ్య విరసం తన వునికిని సజీవంగా నిలుపుకోగలగడానికి కారణం ఆచరణాత్మకమైన దాని రాజకీయ భావజాలమే. తన యాభై వసంతాల (కొన్నిసార్లు అగ్నిశ్వాస కక్కే గ్రీష్మాల, మరికొన్నిసార్లు ఆకురాలు శిశిరాల) ప్రస్థానాన్ని ‘సృజనాత్మక ధిక్కారం’గానూ, ‘వర్గపోరాట రచన’గానూ విరసం సగర్వంగా ప్రకటించుకుంది. వాటిలో మొదటిది విరసం సాహిత్య ఆచరణ, రెండోది రాజకీయ ఆలోచన. ఆధిపత్యాలపై ధిక్కారం, సామాజిక సమానత్వం, పీడిత పక్షపాతం, రాజ్య వ్యతిరేకత వాటి సారం. నూతన ప్రజాతంత్ర దృక్పథమే వూపిరిగా నూతన మానవ ఆవిష్కరణ అంతిమ లక్ష్యంగా ప్రజాయుద్ధ పంథాలో సాగుతున్న వొక ప్రజాసంఘంగా విరసం తెలుగు సాహిత్య సామాజిక రంగాలపై చూపిన ప్రభావం అపరిమేయం.
దేశంలో లౌకిక ప్రజాస్వామ్య ప్రగతిశీల భావజాలాన్ని సమర్థించి ఆచరించే ప్రజా సమూహాల మెడపై మతతత్వ ఫాసిజం కత్తి వేలాడుతున్న సంక్షోభ సందర్భంలో, యీ మట్టిలో పుట్టిన బిడ్డల పౌరసత్వమే ప్రశ్నార్థకమౌతోన్న విపత్కర పరిస్థితుల్లో యాభైయేళ్ల విరసం ప్రయాణాన్ని పునస్సమీక్షించి బేరీజు వేయడం, దాని వెలుగులో భవిష్యత్ పోరాట రూపాలను నిర్మించుకోవడం మనముందు వున్న కర్తవ్యం. చరిత్ర పుటల్లోంచి నేర్చుకున్న పాఠాలు, ఆచరణలో పుటంపెట్టిన ఆలోచనలు, సిద్ధాంతాలు, వాటిపై జరిగే విమర్శనాత్మక పరిశీలనలు, సాధించే గుణాత్మకమైన మార్పులు భవిష్యత్తుపట్ల ఆశ సడలకుండా వుండటానికి దోహదం చేస్తాయి. కొత్త దారులు పరుస్తాయి. గమ్యాల్ని నిర్దేశిస్తాయి. అబద్ధపు ఆరోపణలతో రోజుకొక అక్రమ అరెస్టు – పూటకొక కుట్ర కేసుతో రాజ్యం విరసం లాంటి ప్రజా సంఫూలపై తీవ్ర నిర్బంధాన్ని అమలుపరుస్తూ ప్రజలవైపు నిలబడ్డ రచయితల కళాకారుల మేధావుల భావప్రకటన స్వేచ్చనీ, జీవించే హక్కుని సైతం అమానుషంగా హరించడానికి పూనుకున్న కల్లోల కాలంలో ముక్కలైన ధిక్కార స్వరాలన్నీ ముక్తకంఠంగా యేకం కావడానికి విరసం యాభై యేళ్ల సందర్భం వొక చారిత్రిక అనివార్యతని సృష్టించింది. ప్రజల విముక్తి ఆకాంక్షని బలపరుస్తూ జరిగే సాంస్కృతికోద్యమంలో విభిన్న సమూహాలన్నీ ఐక్యమై కదలవలసిన వుమ్మడి అవసరాన్ని వొక సాహిత్య సంస్థగా విరసం గుర్తించింది. అయిదు దశాబ్దాల ప్రయాణంలో సాహిత్య మాధ్యమంగా విరసం ప్రచారం చేసిన భావజాలాన్ని ఆచరణ గీటురాయిపై పరీక్షించినప్పుడు ప్రగతిశీల సృజనాత్మక రంగంలో కొత్తతరంతో కలిసి నిర్మాణాత్మకంగా ముందుకు నడవడానికి అనుకూల మైన దారి యేర్పడుతుంది.
2
ఆధునిక తెలుగు సాహిత్యచరిత్రని విరసం యేర్పడక ముందు, యేర్పడిన తర్వాత అని రెండుగా విభజించుకునేంతగా అనితరమైన ప్రభావం చూపిన సంస్థ విరసం. అయితే విరసం చేసిన ప్రయాణాన్నీ, సాహిత్యమ్మీదా సమాజమ్మీదా అది చూపిన ప్రభావాన్నీ అర్ధశతాబ్ది కాలంగా అది సాధించిన విజయాల్ని కవిత్వ కేంద్రం గానే చూడడం, చర్చించడం, మూల్యాంకనం చేసి బేరీజు వేయడం గమనిస్తాం.
కానీ యాభైయేళ్లుగా కథ, కవిత, నవల, విమర్శ, పాట, కళారూపం, ఉప న్యాసం- ప్రక్రియ యేదైనా సామూహిక ధిక్కారస్వరాలకు విరసం వేదికయింది. ఆవిర్భవిస్తూనే విరసం తెలుగు సాహిత్యంలో పోరాట భావన తీసుకువచ్చింది. సాహిత్యంలో కొత్త చరిత్రకి దారులు వేసింది. కొత్త ఆలోచనలకి పాదులు కట్టింది. ప్రజాసాహిత్యానికీ రాజకీయాలకీ మధ్య వంతెనలు నిర్మించింది. సాహిత్యంలో నిబద్ధత, నిమగ్నతల గురించి నిర్దుష్టమైన నిర్వచనాలు రచించింది. బలమైన వ్యాఖ్యానాలు అందించింది. అణగారిన వర్గాలకు, కులాలకు, జాతులకు, ప్రాంతాలకు సాహిత్యంలో స్థానం కల్పించింది. విరసం రాకముందు తెలుగు సాహిత్యం దారీతెన్ను లేని పరిస్థితుల్లో వుండేదని కొందరు భావిస్తారు. అది కూడా పూర్తిగా నిజం కాదు. అభ్యుదయ కవిత్వంలో అభ్యుదయం అడుగంటి కవిత్వం స్తబ్దుగా వున్న కాలంలో విరసం యేర్పడక ముందు నుంచీ సైతం కథ సజీవంగా బలంగా వుంది. కొకు, రావిశాస్త్రి, కారా వంటి పేరు పొందిన కథారచయితలు విరసం పుట్టుకలోనే కలిసొచ్చి విప్లవ కథని నడిపించడంతో- విరసానికేమోగానీ తెలుగుకథకి గొప్ప స్పూర్తి, పుష్టి, శక్తి సమకూరాయి. కొత్తగా కథనరంగంలోకి దూకిన కథకులకి ఆలంబన దొరికింది. మార్గదర్శనం లభించింది. కళాత్మక నైపుణ్యాలు వుండి వొడ్డున నిలబడ్డవారికెందరికో సృజనాత్మక లోతుల్ని స్పృశించే దీమును విరసం అందించింది. ఉపరితల సంస్కరణలకూ పునాది నుంచి దూరమైన కృతక వైరుధ్యాలకూ అంతే కృత్రిమ పరిష్కారాలకూ కాలం చెల్లింది అని ప్రబోధించింది. ప్రజా హృదయస్పందనే ప్రేరణగా సాహిత్యసృజన జరగాలని చెప్పి అందుకు అవసరమైన సైద్ధాంతిక బలాన్నిచ్చింది. అది కథా వస్తు శిల్ప దృక్పథ ప్రయోజనాలను నిర్వచించుకోడానికి రచయితలకు యెంతగానో వుపయోగపడింది. లోతుగా పాతుకుపోయిన తల కిందుల విలువల్నీ భావజాలాల్నీ ప్రశ్నించే తత్త్వం అలవడింది.
ఆ విధంగా తెలుగుకథకే కాదు మొత్తం సమాజంలోని భావజాల చట్రాలని మార్చడానికి విరసం తోడ్పడింది. నిర్లిప్తంగా వున్న సాహిత్యవ్యవస్థలోకి ఒక పెను తుపానులా ఝంఝానిలంలా చొచ్చుకువచ్చింది విప్లవభావన. రచయితల్ని ఎటు వైపు నిలుస్తారో తేల్చుకొమ్మని సవాలు విసిరింది. కథలు రాయడం ‘పేషన్ ఆఫ్ ద డే కాద’నీ ప్రజలపట్ల, ప్రజా వుద్యమాల పట్ల సడలని విశ్వాసం అని ప్రకటించింది. అభ్యుదయ సాహిత్యోద్యమ కాలంలో బ్రాహ్మణ పండిత అగ్రహారాల నుంచి అదే వర్గానికి చెందిన మధ్యతరగతి రచయితల డ్రాయింగ్ రూంల వరకూ సాహిత్యం పయనించి ఆగిపోతే – దాన్ని అక్కడి నుంచి చెమటతో, రక్తంతో తడిసిన నాగేటిచాళ్ల లోకి, మట్టి పేడా కలిసిన గంజుతో నిండిన గుడిసె వాకిళ్లలోకి, గొడ్డు మాంసం కసరు కంపుతో కూడిన వాడల్లోకి గుంజుకొచ్చిన ఘనత విప్లవ సాహిత్యోద్యమానికి దక్కుతుంది. స్వాతంత్య్రానంతరం అక్షరాస్యులై యెదిగొచ్చిన అణగారిన కులాలకు చెందిన రచయితల చేతిలో కథ చైతన్య సాధనమైంది. ఈ రచయితలు కొత్త జీవితం, కొత్త భాష, కొత్త వ్యక్తీకరణలు కథల్లోకి ప్రవేశపెట్టారు. విరసం ఆవిర్భావం నుంచి అందులో భాగమైన కొకు, రావిశాస్త్రి, కారా వంటి సీనియర్ రచయితలు సైతం కొత్త తరంవైపు ఆశగా చూశారు. ఆచరణకు దూరమైన ఆదర్శవాదానికి గుడ్ బై చెప్పారు. కూడులోకి ‘పులుసు’ (భూషణం) రావాలంటే కర్ర పట్టుకోక తప్పదనీ, ‘ఎదురు తిరిగితే’ (అల్లం రాజయ్య) పోయేది బానిస సంకెళ్లేననీ, పేదవాడికి ‘న్యాయం’ (యం.వి. తిరుపతయ్య) దక్కాలంటే అడవి బాట పట్టాలనీ గ్రహించారు. జీవితాన్ని ‘బ్లాక్ అండ్ వైట్’గా (తాడిగిరి పోతరాజు) సాక్షాత్కారింపజేశారు. మర బతుకుల్లో ఫూటెక్కిన గంధక ధూమాన్ని (బి.టి. రామానుజం) పిడికిటబట్టారు. గొప్పోళ్ల రాజ్యం పై (మరువాడ రాజేశ్వరరావు) యుద్ధం ప్రకటించారు. ‘ఊరుమ్మడి బతుకుల’కు (సియస్ రావు) తమ రచనల ద్వారా అండగా నిలబడ్డారు. నూతన సమాజ ఆవిష్కరణలో దోపిడి రాజ్యానికి యెదురు నిలబడి ప్రాణాలొడ్డి ‘చిరంజీవులు’ (చెరబండరాజు) అయిన విప్లవ వీరుల అమర గాథల్ని కథాశిల్పాలుగా మలిచారు.
విప్లవకథ సాహిత్యంలో భావవాదం స్థానే సోషలిస్టు సామాజికతకి పీట వేసింది. సామాజిక న్యాయానికి పట్టంగట్టింది. బిగిసిన పిడికిలికీ ధిక్కార స్వరానికీ చేదోడు వాదోడుగా నిలిచింది. వ్యక్తివాదం నుంచి సామూహిక భావనకూ ఆచరణకీ పురిగొల్పింది. వర్గ సామరస్యాన్ని బోధించే ఉదారవాదం నుంచి బయటపడి వర్గ పోరాటమే సమస్త ఆధిపత్యాలకు అంతం పలకగలదనీ హెచ్చరించింది. విప్లవ కాల్పనికత నుంచి విప్లవ వాస్తవికతవైపు నడవడానికి, భవిష్యత్తుపట్ల ఆశావహ దృక్పథాన్ని పెంపొందించడానికి విప్లవకథ యెంతగానో దోహదం చేసింది. కథలు రాయడం కాలక్షేపం కాదనీ జనజీవన పోరాటాల్ని యెత్తిపట్టే ఆచరణ అనీ విరసం హెచ్చరించింది. సాహిత్యాన్ని ప్రభుత్వ రథచక్రాల వెంట లాక్కొనిపోవడంగాక ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికేనని విరసం పుట్టుక నుంచీ భావించింది. అందుకే రాజ్యవ్యతిరేకత విప్లవ సాహిత్యానికి జీవగర్ర అయింది. రచయితలు దోపిడీవ్యవస్థ లోని కాగితం పులుల్ని (ఎన్నెస్ ప్రకాశరావు ‘పేపర్ టైగర్’) గుర్తించారు. గుర్తించడమే కాదు, ‘కాగితపు పులుల్ని అణచివేయకుండా అందమూ ఆనందమూ లేనివాళ్ల జీవితాల్లోకి వాటిని తీసుకురావడం అసాధ్యం’ అని గ్రహించారు. కాగితం పులుల్ని నిర్మూలించడానికే సాహిత్యం అని నిర్ధారించారు. కథ నవల పాట కవిత ప్రక్రియ యేదైనా జీవితాన్ని నిర్వచించడం దగ్గర ఆగిపోరాదనీ దాన్ని మార్చడానికి దోహదం చేయాలనీ నమ్మారు. సాహిత్యకారులకు జీవితాన్ని గమనించటం మాత్రమే చేతన యితే చాలదని దాన్ని మార్చే గతిసూత్రాలు సైతం తెలిసి వుండాలనీ గ్రహించారు. తొలి రోజులనాటి యీ అవగాహన యాభైయేళ్ల పాటు కొనసాగడానికి అవసరమైన సాహిత్య సామాజిక రాజకీయ దార్శనికతనీ, ఆచరణనీ వారసత్వంగా మూడు తరాలుగా విరసం కాపాడుకుంటూ వస్తుంది. అదే వొక సాహిత్యసంస్థగా దాని బలం.
శ్రీకాకుళోద్యమానికి ముందూవెనకా కొకు ‘బకాసుర’, కారా ‘తీర్పు’, రావిశాస్త్రి ‘లాభం’, ‘పిపీలికం’ లాంటి కథలు విప్లవ కథకి రాజకీయ, తాత్త్విక నేపథ్యాన్ని యేర్పాటు చేశాయి. ఆ ఉద్యమ ఘటనలకి కాల్పనిక రచనా రూపం యిచ్చిన భూషణంలాంటి కథకులు తరతరాల పీడనని గిరిజనులు సాయుధమై ప్రతిఘ టించిన వైనాన్ని కథామాధ్యమంగా తెలియజేశారు. అందువల్ల విప్లవకథ విరసంతోనే/ విరసంలోనే మొదలుకాలేదు అని చెప్పాలి. అయితే కథాసాహిత్యంలో సంచలనం సృష్టించి చర్చోపచర్చలకి కారణమైన కారా మాష్టారి ‘యజ్ఞం’లో చూపిన అవాంఛ నీయమైన ముగింపులకు విప్లవకథ ముగింపు పలికింది.
విప్లవ కథ వర్గ సమాజంలో వుండే సమస్త అసమానతలనూ తిరస్కరించి సమూలమైన మార్పుని ఆహ్వానించింది. అసమ సమాజంలో వుండే వైరుధ్యాల్ని గుర్తించి వాటిని పరిష్కరించుకునే చైతన్యాన్ని కలిగిస్తూ పీడన దోపిడీ అణచివేత లకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు భావజాల రంగంలో మద్దతునిచ్చింది. పాత సమాజంలోని అభివృద్ధి నిరోధకమైన అంశాల్ని నిరసిస్తూ, సామాజిక ఆర్థిక రాజకీయ పరమైన వైరుధ్యాల్ని గతితార్కికంగా అర్థం చేసుకుంటూ, వాటిని అధిగమిస్తూ కుల, మత, లింగ ఆధిపత్యాల్ని తొలగించుకుంటూ, కొత్త సమాజ నిర్మాణానికి అవసరమైన అన్ని పోరాట మార్గాల్ని బలపరిచి, అందుకు అవసరమైన ఆలోచనల్నీ ఆచరణనీ ప్రచారం చేసింది. ఆవిధంగా నూతన ప్రజాతంత్ర దృక్పథానికి విప్లవ కథ వూపిరులు ఊదింది. వ్యవస్థలోని అసమానతల్ని చిత్రించడం దగ్గర విప్లవ కథ ఆగిపోలేదు. అభ్యుదయ రచనల కాలంలో భూస్వామ్య సమాజంలోని పీడనని, హింసని యథా తథంగా వర్ణించడం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజలు హింసని ప్రతిఘటించడం, ప్రతిఘటన సాయుధ పోరాటంగా పర్యవసించిన తీరుని చెప్పిన కథలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కాలంలో సైతం వచ్చాయిగానీ విప్లవకథ ఆ పోరాటానికి మరింత రాజకీయ తాత్వికతని జోడించింది. ఉత్పత్తి సంబంధాల్లో చోటుచేసుకునే ఘర్షణని ఆర్థిక పోరాటాలుగా మాత్రమేగాక రాజ్యాధికార లక్ష్యంవైపు సాగాల్సిన అవసరాన్ని గుర్తించింది. అందుకు అవసరమైన వెసులుబాటునూ వేదికనీ విరసం నిర్మించింది. పాత కథకుల సరసన కొత్త కథకులకు సమస్థానం కల్పించింది.
తొలినాళ్లలోనే కొ.కు. సంపాదకత్వంలో ప్రచురించిన ‘ఇప్పుడు వీస్తున్న గాలి’ (1971) నిషేధానికి గురైంది. ‘అరణ్య అజ్ఞాతవాస క్లేశాలు’ అనుభవించడంతో పాటు ఆంక్షలూ నిషేధాల్ని యెదుర్కోవడంలో విరసం, విప్లవ కథ మొదటినుంచీ ముందే వున్నాయి. ‘బద్‌లా’ సంకలనం (కరీంనగర్ ఉద్యమ సాహితి – 1973) విప్లవోద్యమ కథకి బీజాలు వేసి ప్రాతినిధ్యం వహించింది. బద్‌లా తెలంగాణ కథకి కొత్త గొంతుల నిచ్చింది. కొత్త వూపిరులు వూదింది. ‘హోరు’ (న్యూవేవ్), ‘జనం’ సంకలనాలు కూడ అంతే తీవ్రస్వరాల్ని వినిపించాయి. ఈ సంకలనాల్లోని రచయితల్లో చాలామంది విరసం లోపలివాళ్లూ లేదా విరసంతో భావసారూప్యం కలవాళ్లూ. ఈ సంకలనాల్లో కథలు వస్తుస్వీకరణ దృష్ట్యా తర్వాతి రచయితలపై బలమైన ప్రభావం చూపించాయి. అప్పటినుంచి భూస్వాముల నుండి భూములు లాక్కోవడం, గడీలమీద దాడి చేయడం, అప్పుపత్రాలు తగలబెట్టి స్వయంగా ఆర్థిక శృంఖలాలు తెంచుకొని విముక్తులు కావడం, దొరలని వూరి నుంచి తరమడం, పడావు భూముల్ని స్వాధీనం చేసుకొని జెండాలు పాతడం, కరువు దాడులు చేయడం వంటి యెన్నో వుద్యమ రూపాలు కథకి తక్షణ వస్తువులయ్యాయి.
అల్లం రాజయ్యలాంటి రెండోతరం రచయితల రాకతో విప్లవ కథ స్వరూప స్వభావాలు గణనీయమైన మార్పుకి గురయ్యాయి. కథ మధ్యతరగతి సంకెళ్లు తెంచు కుంది. ‘సాహిత్యం గొప్పవాళ్ల మనోసృష్టి, సాహిత్యం గొప్పవాళ్ల సంపద’ అనే రివాజుకు భిన్నంగా కష్టపడి చెమటోడ్చే శ్రామికుల నుంచే కథాసృజన జరిగింది. కథా నిర్మాణంలో నాజూకు పోకడలు వెతుక్కోకుండా వస్తువుకి అనుగుణమైన ప్రాంతీయ భాషనీ, శిల్పరీతుల్నీ కథకులు యెన్నుకున్నారు. ఉద్యమం వూపిరిని గుండెనిండా నింపుకున్న యీ కొత్త తరానికి విరసం అండగా నిలబడింది. సాయుధ పోరాటపు భావజాల బలాన్ని అందించింది. సాహిత్యరచనకూ విప్లవాచరణకూ మధ్య గీత చెరిగిపోయిన కాలమది. రచయితలు వుద్యమ చరిత్ర నిర్మాణంలో స్వయంగా భాగమయ్యారు. చోదకశక్తులయ్యారు. కల్లోలకాలంలో కదలబారిన ప్రజా శ్రేణులతో కలసి కదం తొక్కిన కలం యోధులయ్యారు.
ఈ రచయితలు కథల్లో వాడిన భాష, కథానిర్మాణ సూత్రాలు, సాహిత్య ప్రమాణాలు వంటి విషయాలు సాహిత్యకారుల్లో చర్చకి దారితీశాయి. సృజన, జీవనాడి, అరుణతార, ప్రజాసాహితి, నూతన మొదలయిన పత్రికలు అటువంటి కథలకీ చర్చలకీ వేదికలయ్యాయి. ‘కనీసం సాహిత్యానికి సంబంధించిన వరకైనా ప్రజలందరూ ఏకం కావాలంటే అన్ని ప్రాంతాల ప్రజల భాష ఏకం కావాలి. కనీసం ప్రతి ప్రాంతీయ శబ్దజాలమూ, నుడికారము అన్ని ప్రాంతాల అందరికీ అర్థం కావాలి. అప్పుడే అభ్యుదయకర పురోగామి సాహిత్యం అన్ని ప్రాంతాల అందరినీ చైతన్య వంతులను చేస్తుం’దని (కొ.కు. ‘సృజన’ ఆగష్టు -సెప్టెంబరు 1980) విరసం ప్రజల భాషలో వెలువడే సాహిత్యానికి అవసరమైన వొక సామాజిక తాత్త్వికభూమికను యేర్పరిచింది. సాహిత్య భాషనూ సాహిత్య లక్ష్యాలనూ ప్రయోజనాలనూ ప్రజాస్వామికంగా పునర్నిర్వచించుకునే అవకాశాన్నీ అనివార్యతనీ రచయితలకు కల్పించింది. ప్రజల నుంచి ప్రజలకు అన్న సూత్రం రాజకీయార్థంలోనేగాక సాహిత్యార్థంలో సైతం ఆచరణలోకి రావడానికి విరసం దోహదం చేసింది. ‘గ్రామాలకు తరలండి’ నినాదం లో భాగంగా సాహిత్యంలో వచ్చిన ఈ మార్పుల్ని అర్థం చేసుకోవాలి. విప్లవకథ అన్ని విధాలుగానూ ప్రజలపరమైంది.
రైతాంగ – గిరిజన కార్మికోద్యమాలు ముప్పేటగా సాగిన కాలమది. విరసం మార్గదర్శనంలో విప్లవకథ ఆ వుద్యమాలకు టైం కీపర్‌గా పనిచేసింది. అందుకు విరసం పాతికేళ్లకు పైగా తెలుగునేల పురుటి నెప్పుల్ని, సామాజిక చలనాన్ని వొడిసి పట్టుకొంది. రాజకీయ చరిత్రని నమోదు చేసింది. ఆర్థిక గమనాన్ని, మారే వుత్పత్తి సంబంధాల్లోని ఘర్షణని గతి తార్కికంగా వ్యాఖ్యానించింది. కొత్తగా కలం పట్టిన రచయితలతో అడవిలో వెన్నెల, బొగ్గుపొరల్లో, నల్లకలువలు వంటి కథాసంకలనాలు సామూహిక కర్తృకాలుగా వెలువడ్డాయి. రచయితలు స్వీయ అస్తిత్వాల్ని వదులు కున్నారు. రచయితల పేరు లేకుండా కథలు ‘అనామకం’గా వెలువడ్డాయి. పాట లాగానే కథ కూడా అందరిదీ అయ్యింది. ప్రజల వుమ్మడి సంపద అయ్యింది. ఆర్థికం గానూ తాత్త్వికంగానూ పెట్టుబడీదారీ వ్యవస్థే వ్యక్తినీ వ్యక్తివాదాన్నీ సృష్టించింది. సమాజానికంతటికీ చెందాల్సిన వుమ్మడి సంపదలాంటి కళని సైతం వ్యక్తి ‘ఆస్తి’గా మార్చింది. సాహిత్యాన్ని ‘కమోడిటీ’గా మార్కెట్‌లో ట్రేడ్ మార్క్ వేసి విడుదల చేసే వ్యాపారాన్ని పోషించింది. మానవ మేధని పేటెంట్ చేసింది. పాటలాంటి కళారూపా లతో పాటు కథ కూడా సామూహికమే అని విప్లవ రచయితలు నిరూపించారు. సాహిత్య చరిత్రలో యిది అపూర్వ సంఘటన. సాహిత్యాన్ని వ్యక్తి ఆస్తిగా కాకుండా సామూహిక సంపదగా, సామాజిక వనరుగా పరిగణించే సంప్రదాయాన్ని విరసం సాహిత్యప్రపంచానికి అందించింది. ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతికి ద్వారాలు తెరిచింది.
అంతేకాదు; కథ మౌలిక రూపమైన మౌఖిక నిర్మాణ పద్ధతుల్ని రచయితలు అంది పుచ్చుకున్నారు. కాగిదమంటే తెలియని- తెలిసినా భయపడే ప్రజా సమూహాలకి చేరువ కావడానికి కథని వినిపించే దారుల్లోకి నడిపించారు. అచ్చులో చదవడానికి కుదించుకుపోయిన కథని శ్రవ్యం చేశారు. సమష్టి పఠనోద్దేశంతో శ్రావ్యంగా వినిపించే భాషా సాధనాలు సమకూర్చుకొన్నారు. వస్తురీత్యానే కాదు శైలీరీత్యా కూడా విప్లవ కథ సార్థకమైంది.
ప్రజా సంస్కృతిలో భాగమైన సజీవమైన భాషే విప్లవ కథకులకు రచనా మాధ్యమంగా గోచరించింది. దానిపై ఆంక్షలు విధించే ఆధిపత్యాల్ని నిక్కచ్చిగా తిరస్కరించి శ్రమజీవుల భాషకి, సాహిత్యానికి కథకులు గౌరవం కల్గించారు. భాషకి గొప్ప ప్రజాస్వామిక దృక్పథాన్ని జోడించారు. ‘ప్రజల సాహిత్యానికి ప్రాణం ప్రజల భాష’ అని శాస్త్రీయంగా నిరూపించారు. అందుకు సర్వశక్తులూ వొడ్డి పోరాడారు. ప్రజల జీవన్మరణ పోరాటాన్ని తమ నెత్తుటిభాషలో, చెమట భాషలోగాక మరేవిధం గానూ రాయలేమనీ, అలా రాస్తే ‘శ్రమ నుండి పుట్టిన చెమట ప్రాధాన్యాన్ని విస్మరించి అత్తరుసెంటు వాసనల కెగబడటమే’ అనీ తెగేసి చెప్పారు (అల్లం రాజయ్య). భాషా సమస్య జాతుల సమస్యలో భాగం అని రచయితలు (బిఎస్ రాములు) గ్రహించి ‘మా భాషలో మేం రాస్తాం, అది మా న్యాయ సమ్మతమైన హక్కు’ అని ప్రకటించారు.
ఉద్యమ సంఘటనలనే ఇతివృత్తంగా చేసుకుని వచ్చిన అనేక కథలు వ్యక్తుల అనుభవాల పరిధిని చట్రాల్నీ అధిగమించి రాజకీయ సిద్ధాంతాన్ని వున్నతీ కరించే దిశగా సాగాయి. కల్లోల దశాబ్దంలో ఆ దరిమిలా వచ్చిన రైతాంగ కార్మిక గిరిజన కథలెన్నిటినో యిందుకు వుదాహరణలుగా చూపించవచ్చు. అయితే స్వీయ అనుభవ చట్రాన్ని అధిగమించని వాస్తవ ఘటనలు కూడా ‘కథనాలు’గా అదే కాలంలో నమోదయ్యాయి. అవి కథలుగా రూపొందలేకపోయాయి. సరైన శిల్పానికి చోటులేని కేవల వాస్తవ కథనాలుగా అవి మిగిలిపోయాయి. విప్లవోద్యమంలో పనిచేస్తూ అమరులైన వారి జీవిత సంఘటనల చుట్టూ జ్ఞాపక శకలాల చుట్టూ అల్లిన 1980ల నాటి విషాదభరిత కథనాలకన్నా, వారి త్యాగాల వెనుక వున్న పోరాట నిబద్ధతనీ నిమగ్నతనీ విప్పిచెబుతున్న యిటీవలి కథలు విప్లవ తాత్త్వికతని బలంగా ఆవిష్కరిస్తున్నాయి. శిల్పపరంగా విప్లవకథ సాధించిన గుణాత్మక పరిణామం యిది. తొలినాటి కథల్లో యీ నాణ్యత కనిపించదు (రాడికల్ మార్చ్ లాంటి పత్రికల్లో వచ్చిన కథల్లో యీ లోటు గమనించవచ్చు).
వెనకబడ్డ ప్రాంతాలకూ కులాలకూ చెందిన రచయితల కథల్లో కళావిలువల్ని అంచనా వేయడానికి భిన్న ప్రమాణాలు పాటించాలని కొందరు విమర్శకులు భావిం చినా భూమి, సృష్టికర్తలు, మార్పు, మనిషి లోపలి విధ్వంసం, మధ్యవర్తులు, కమల, నీల, మహాదేవుని కల, అతడు (అల్లం రాజయ్య), ఎత్తున్రి పిడికిళ్లు (చుక్క), పోలీసు దాడి (సాహా), జాడ, ఉరి, శత్రువు, చావు విందు, పనిపిల్ల (తుమ్మేటి రఘోత్తంరెడ్డి), తాయమ్మ (కరుణ), జంగుబాయి, కెరమెరిఫూట్ రోడ్ (గోపీ భాగ్యలక్ష్మి) వంటి కథలు ఆ అవసరం లేదని చాటిచెప్పాయి. వైవిధ్య భరితమైన వస్తు స్వీకరణ విషయి- కంగా, సజీవమైన ప్రాంతీయ భాషా ప్రయోగంలోనూ విరసం కథకులకు మార్గ దర్శనం చేసింది. మంచి కథల కోసమే కాదు గొప్ప కథలకోసం సైతం సంకలనకర్తలు విరసం వైపే చూశారు. శ్వేతరాత్రులు, భూమిక, రుతుపవనాలు సంకలనాలు దాన్ని రుజువు చేస్తాయి. ఆ క్రమంలోనే యెన్నో కథావార్షికలకు విప్లవకథ నిండు- దనాన్నిచ్చింది.
కన్నీటి కథలు/ఫిర్యాదు కథలు విరసం నుంచి సైతం వచ్చాయిగానీ శ్రీకాకుళం నుంచి ఉత్తర తెలంగాణ నల్లమలల మీదుగా దండకారణ్యం వరకు రైతాంగం, కార్మికులు, ఆదివాసీలు భూమికోసం, విముక్తికోసం, జీవించే హక్కు కోసం చేసిన పోరాటాల్ని విప్లవకథ అంది పుచ్చుకుంది. యాభైయేళ్లుగా అనేక జీవన పార్శ్వాల్ని ప్రభావితం చేసిన ప్రజా ఉద్యమాల చరిత్రని నమోదుచేసింది. సొంత ఆస్తి లేని సమాజ నిర్మాణం కోసం విప్లవోద్యమాల్లో సాయుధులై ప్రాణాలు సాకపోసిన అమరుల త్యాగాలని యెత్తిపట్టింది. దీర్ఘకాల పోరాటాల్లో సాధించిన గెలుపు వోటముల్ని సమీక్షించింది. విప్లవం ప్రజాజీవితానికి చెందిన అన్ని రంగాల్లో భిన్న కాలాల్లో భిన్నతలాలపై చూపిన ప్రభావాల్ని, మానవ సంబంధాల్లో తెచ్చిన గుణాత్మక మైన మార్పుల్ని విశ్లేషించింది. అయితే ఆనాటి శ్రీకాకుళం గిరిజన రైతాంగ వుద్యమం దగ్గర నుంచి జగిత్యాల జైత్రయాత్ర మీదుగా యివాళ్టి దండకారణ్యంలో జల్ జమీన్ జంగిల్ కేంద్రంగా ఆదివాసీల స్వావలంబన సాధన లక్ష్యంగా నిర్మితమైన జనతన సర్కార్ వరకు ప్రజాయుద్ధపంథాలో సాగిన పోరాటాలను, రాజ్యహింస, నిర్బంధా లను మాత్రమే విప్లవకథ చిత్రించింది అని నిర్ధారించలేం (అలా వచ్చిన కథల సంఖ్య కూడా తక్కువేం కాదు).
విప్లవకథ సాయుధ పోరాటాలకో దళచర్యలకో పరిమితం కాలేదు. పునాది ఉపరితలాల్లో చోటుచేసుకున్న ఘర్షణలన్నింటినీ బహుముఖీనంగా విశ్లేషించింది. మారుతున్న సామాజిక సమీకరణాల్ని యెప్పటికప్పుడు అంచనా కట్టింది. గత ఐదారు దశాబ్దాలుగా దేశంలో సంభవించిన రాజకీయార్థిక పరిణామాల్నీ, సాంస్కృతిక-సామాజికచలనాలని, మార్పుల్నీ విప్లవకథ లోతుగా పరిశీలించింది. నిర్దుష్టంగా వ్యాఖ్యానించింది. ప్రతి సామాజిక చలనానికీ వున్న కార్యకారణ సంబంధాన్ని సూక్ష్మం గా వివేచించింది. ప్రపంచీకరణలో వేగంగా సంభవించే మార్పుల్ని అర్థం చేసికొని కథలోకి వొంపుకోవడంలో కథకులు బిత్తరపోయిన సందర్భాలు కూడా వున్నప్పటికీ కాలంతోపాటు నడవడానికే విరసం ప్రయత్నించింది. పాత కథకులు ఆగిపోయిన చోట కొత్తవారిని తయారుచేసుకుంది.
దళితులపై, ఆదివాసులపై, ముస్లింలపై, స్త్రీలపై అమలయ్యే అణచివేత, కుల-మత-జండర్ ఆధిపత్య రాజకీయాలు, వ్యవసాయ సంక్షోభం, అడ్డగోలు పారిశ్రామికీకరణ, ప్రాంతీయ ఉద్యమాలు, జాతుల సమస్య, స్వదేశీ విదేశీ సెజ్‌లు, వాటి కారణంగా జరిగిన విధ్వంసం, అప్రజాస్వామిక కార్మికచట్టాలు, పెచ్చుపెరిగిపోతున్న పర్యావరణ సమస్యలు, అమానవీయతని పెంచి పోషిస్తున్న కార్పొరేట్ విద్యా వైద్యరంగాలు- యిలా అనేక అంశాల్ని యితి వృత్తం చేసుకుని కథలు వచ్చాయి. సరళీకృత ఆర్థికవిధానాలు, ప్రైవేటీకరణ, ప్రపంచీ కరణ నేపథ్యంలో, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు బలవంతంగా అమలుజేసే ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా సామాన్యుల జీవితాలు ధ్వంసమైన తీరుని విప్లవ కథకులు పట్టించుకున్నారు. మతతత్వ రాజ కీయాల్ని ఎండగట్టారు. బ్రాహ్మణీయ పితృస్వామ్య భావజాలాన్ని ఖండించారు. మార్కెట్ మాయాజాలాన్ని బహిరంగ పరిచారు. భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, మైనింగ్ కారణంగా సొంత నేలకు దూర మైన నిర్వాసితుల దైన్యాన్నీ పోరాటాల్నీ కథలుగా కట్టారు. సాంస్కృతిక సామ్రాజ్య వాదానికీ జాతీయవాదానికీ మధ్య వున్న సంబంధాన్ని విడమర్చి చెప్పారు. అందుకు అవసరమైన దృక్పథాన్ని, కథానిర్మాణ పద్ధతుల్ని సమకూర్చుకున్నారు. ఇదంతా యేటికి యెదురీతే. సంక్షుభిత సమాజంలో మానవ జీవితానుభవానికి సంబంధించిన ప్రతి పార్శ్వాన్నీ యీ కథకులు స్పృశించారు. అయితే అది కేవలం పైపైన తడమడం కాదు. మూలాల్లోకి దృష్టి సారించడం. స్థూలంగా సమాజాన్నీ సూక్ష్మంగా వ్యక్తుల్నీ వారి జీవితాల్నీ పోరాటాలనీ విడివిడిగా కాకుండా సమగ్రంగా కలగలిపి చూసే మార్క్సిస్టు దృక్పథం గత అయిదు దశాబ్దాలుగా యీ కథకుల్ని నడిపించింది. అందు వల్ల మూడుతరాల పాటు నేలతల్లి పడిన పురుటినొప్పుల చప్పుడును విప్లవకథలో వినగలం. స్థానికంగా రూపుదిద్దుకున్న వుద్యమచరిత్రే కాదు మొత్తం యాభై యేళ్ల మానవ సమాజచరిత్రని ప్రజలపరంగా నిర్మించడానికి విప్లవకథలు గొప్ప వనరుగా వుపయోగపడతాయి.
3
విరసం యాభైయేళ్ల పాటు కథారచనకూ విప్లవాచరణకూ వారధిని నిర్మిం చింది. సాహిత్య ప్రయోజనం మానవ చైతన్యానికి మాత్రమే పరిమితం కాదనీ అంతి మంగా మానవ ఆచరణ వైపు నడిపించాలనీ విరసం తొలినాళ్ల నుంచీ నమ్ము తుంది. దాన్ని ఆచరిస్తుంది కూడా. విప్లవ రచయితల్లో విప్లవోద్యమంలో తలమునకలై వున్న వాళ్లూ జైలుపాలైనవాళ్లూ రాజ్యహింసపై ప్రతిఘటన పోరాటంలో ప్రాణాలు కోల్పో యినవాళ్లూ అజ్ఞాత జీవితాల్లో స్వీయ అస్తిత్వాన్ని ఐచ్చికంగా నిరాకరించినవాళ్లూ ఎందరో వున్నారు. ఎమర్జన్సీ ముందూ వెనకా 1970ల నుంచీ వర్తమాన ఫాసిస్టు నిర్బంధం వరకూ అయిదు దశాబ్దాల విప్లవోద్యమ కాలంలో చుక్క (ముప్పాళ లక్ష్మణ రావు), అజ్ఞాత సూరీడు (నెమలూరి భాస్కరరావు), తాడిగిరి పోతరాజు, యం.వి. తిరుపతయ్య, సాహా (వెంకన్న), బిఎస్ రాములు, సృష్టి (మూట శంకర్), తాయమ్మ కరుణ, మిడ్కో (రేణుక), షహీదా (ఎస్‌డి), కౌముది, మంజీరా, షంషేర్ (గుండేటి శంకర్), పటేల్ సుధాకర్‌రెడ్డి, ప్రశాంత్, అనురాధ వంటి యెందరో రచయితలు అజ్ఞాత జీవితాలు గడిపారు, జైళ్లపాలయ్యారు, నిర్బంధాల్ని చవి చూశారు, ఎన్ కౌంటర్లలో మరణించారు. చరిత్ర పొడవునా విప్లవకథ ప్రజాపక్షమే వుంది అనడానికి యిటువంటి వుదాహరణలు యెన్నో వున్నాయి. ‘కలం తప్ప కాలు కదపం’ అనే కుహనా ప్రగతివాదుల్ని విరసం దూరం పెట్టింది. రచనకి ఆచరణశీలతని జోడించింది. సాయుధులై అడవిలో వున్నా, క్రూర నిర్బంధాలకు గురై జైల్లో వున్నా రచయితలు కథతో తమ ఆచరణాత్మక సృజన సంబంధాన్ని వదులుకోలేదు. అజ్ఞాతంగా ఉంటూనే తమ వుద్యమానుభవసారాన్ని కథామాధ్యమంగా ప్రజలతో పంచుకుంటూనే వున్నారు.
విప్లవకథలో అజ్ఞాతకథకి విశిష్టమైన స్థానం వుంది. అజ్ఞాతకథల్ని రెండు విధాలుగా పేర్కోవాలి. రచయిత యెవరో తెలీని అజ్ఞాత కర్తృకాలు. అజ్ఞాతంలో వున్న కథకులు రచించిన కథలు. రచయితలపై నిత్యనిర్బంధాల కారణంగా చాలా మంది రచయితలు మారుపేర్లతో కథలు రాశారు. కల్లోల దశాబ్దాల్లో కలంపట్టి కథని విప్లవోద్యమ చరిత్రకు ప్రతీకగా మలచిన అల్లం రాజయ్య డజనుకు పైగా మారుపేర్లతో రచనలు చేశాడు. తొలినాటి సాహు దగ్గర నుంచి కొత్తగా రాస్తున్న శృతి వరకూ యేది మారుపేరో యేది సొంత పేరో తెలీదు. ఉద్యమంలో సర్వస్వాన్నీ త్యాగం చేసినట్టే కథకులు స్వీయ అస్తిత్వాన్ని వదులుకున్నారు. ఈ సంప్రదాయం విప్లవోద్యమ సాహిత్యానికే ప్రత్యేకం. అడవిలో వెన్నెల, బొగ్గుపొరల్లోలాంటి సంకల నాల్లో వచ్చిన కథలు సామూహిక కర్తృత్వంలో వెలువడ్డాయి. కార్మిక కర్షకలాంటి పేర్ల వెనక వున్న రచయితలెవరో యిటీవలిదాకా తెలీదు. విప్లవ కథారచయితల్లో చాలామందికి కథారచన విప్లవాచరణలో భాగం. ఒకచేత్తో కలం మరోచేత్తో ఆయుధం పట్టిన పాణిగ్రాహి వారసత్వంలో నిబద్ధత నిమగ్నతలకు నిలువెత్తు సాక్ష్యంగా నిర్మాణంలో దళంతో ఫార్మేషన్‌లో కథలతో కదం తొక్కిన రచయితలు లెక్కలేనంత మంది. ఈ రచయితల కథల్ని లోపలి నుంచి వచ్చినవిగా పేర్కొంటారు. వాటినే అజ్ఞాతకథలు అని భావిస్తాం.
విప్లవంలో అజ్ఞాతకథలు ప్రధానంగా పోరాటంలో ప్రజల సమీకరణని చిత్రిం చాయి. సాధారణ రైతాంగం, కార్మికులు, గిరిజనులు మిలీషియాగా మారి మెరుగైన జీవితం కోసం ప్రగతిశీలమైన సమాజం కోసం స్థిరంగా నిలబడ్డ వైనాన్ని కీర్తించాయి. ప్రభుత్వ దళారీలకూ భూస్వామ్య కిరాయి హంతకులకూ పోలీసులకూ మిలటరీకీ కార్పొరేట్ గూండాలకూ కోవర్టులకూ వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో వ్యూహాలూ యెత్తుగడల గురించి దళచర్యల గురించి వర్ణించాయి. ఉద్యమకారులు నీళ్లలో చేపల్లా ప్రజల్లో కలసిపోయిన తీరునీ ప్రజలు ఉద్యమకారుల్ని కడుపులో పెట్టుకుని కాపాడిన సందర్భాల్నీ లోపలి కథకులు కథలుగా మలిచారు. ఎన్‌కౌంటర్‌లనూ అణచివేత ప్రతిఘటనల్నీ ఉద్యమ విస్తరణనీ గెరిల్లా పోరాటాలనీ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా కథామాధ్యమంగా రిపోర్ట్ చేశారు. పాత సమాజంలోని అభివృద్ధి నిరోధక భావజాలాన్నీ ఆచారాల్నీ సంస్కృతీ సంప్రదాయాల్నీ (కాయిదాలనీ) తొలగించుకోవడంలో యేర్పడే చిక్కుల్ని పరిష్కరించుకున్న పద్ధతుల్ని గతితార్కికంగా చర్చకు పెట్టారు. ఉద్యమంలోకి వచ్చాకా సాధారణ వ్యక్తుల అలవాట్లలో ఆలోచనల్లో సంభవించే అసాధారణమైన ప్రగతిశీలమైన మార్పునీ వికాసాన్నీ బలంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా పితృస్వామ్యం కోరల నుంచి మహిళలు బయటపడటానికి విప్లవ భావజాలం, ఆచరణ యెలా తోడ్పడ్డాయో వివరించారు. నిర్మాణంలో మహిళలపాత్ర గణనీయంగా పెరిగినట్టే అజ్ఞాత కథారచయితల్లో సైతం మహిళల సంఖ్య పెరిగింది. దండకారణ్య కథారచయితల్లో సాధన వంటివాళ్లు 1980ల నుంచీ రాస్తున్నారు. లక్ష్మి, నిలోవ్నా, కరుణ, మిడ్కో, పద్మకుమారి, షహీదా, యామిని, దమయంతి, భానుమతి, నిత్యా, మైనా, నిర్మల, కవిత, సోని, రేలా, స్వాతి, శృతి- యిలాయెందరో రచయిత్రులు (వీళ్లలో మారుపేర్లతో మగవాళ్లు కూడా ఉన్నారేమో) విప్లవ సంస్కృతి నిర్మాణంలో చోదకశక్తిగా పనిచేస్తున్నారు. వీరి కథలన్నీ ప్రజా మిలీషియా నుండి, ప్లాటూన్, కమాండర్, డివిజన్ మెంబర్లదాకా వివిధ స్థాయిల్లో వుద్యమంలో భాగస్వామ్యం వహించిన మహిళ పాత్రలతో నడిచినవే. అందుకే పితృస్వామ్యవ్యవస్థ మూలాల గురించి, ఆచరణలో వాటితో ఘర్షణపడటం గురించి, వైరుధ్యాల్ని పరిష్కరించడానికి మహిళలు చేసిన పోరాట రూపాల గురించి ప్రధానంగా చర్చించడం గమనిస్తాం.
శాంతి అభియాన్, సల్వాజుడుం, గ్రీన్ హంట్, సమాధాన్- పేరు యేదైనా అటవీ ఖనిజసంపదని కార్పొరేట్ హస్తగతం చేయడానికి దళారీ పాలకులు అడవి బిడ్డలమీద భూమ్యాకాశమార్గాల గుండా హింసాత్మకంగా దాడులు జరుపు తున్నప్పుడు యుద్ధక్షేత్రంలో నిలబడి దొరికిన కాస్తంత తీరికలో రాసిన ప్రత్యక్ష కథనాలు యీ కథలు. నిత్యనిర్బంధాల మధ్య, దాడుల మధ్య మానని గాయా లతో, తెలీని రోగాలతో, బాధలతో, సలిపే నొప్పులతో సాహసోపేతంగా ప్రతిఘటిస్తూ- కొత్తగా నిర్మాణం చేస్తూ విప్లవాచరణలో పనుల వొత్తిడిలో తమ సామూహిక అను భవాలను, కొత్త సమాజపు కలల్నీ, వాటిని సాకారం చేసుకోడానికి చేసే ప్రయత్నాల్నీ, భవిష్యత్తుపై ఆశల్నీ యీ రచయితలు కథల్లో చిత్రించారు. సాహిత్యచరిత్రలో నెత్తుటి సంతకాలివి. ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని విప్లవాశయాన్ని గుండెల్లో వెలిగించు కొని పీడితుల ఆశలనే తమ ఆశలుగా కళ్లలో నింపుకుని రాసిన యీ కథలు ప్రపంచ సాహిత్యంలోనే ప్రత్యేకంగా నిలుస్తాయి.
జనతన సర్కారులో విద్య, వైద్యం, వ్యవసాయం, నీటిపారుదల వంటి రంగాల్లో మానవీయంగా అమలయ్యే ప్రత్యామ్నాయ పద్ధతుల మీద, విలువల మీద అజ్ఞాత కథకులు ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ కథకులు వస్తు శిల్పాల్లోనే కాదు భావజాలపరంగా కూడా మూసపద్ధతుల్ని బద్దలుకొట్టారు. సాహిత్యాన్ని ఉద్యమ ఆచరణలో భాగం చేశారు. ఈ రచయితలందరూ సాంకేతికంగా విరసం సభ్యులు కాకపోవచ్చు- కావచ్చు; కానీ విరసం నమ్మిన భావజాలంతో వాళ్లు ఆచరణలో నిలిచారు. విరసం వారి ఆచరణతో మమైకమైంది.
ఈ కథల్లో యెక్కువ భాగం దండకారణ్యాన్ని నేపథ్యం చేసుకుని అక్కడి పోరాటానుభావాలని చిత్రించినవే అయినప్పటికీ ఆంధ్రా ఒరిస్సా బోర్డర్, నల్లమల నేపథ్యాల నుంచి, మైదాన ప్రాంతాల విప్లవోద్యమం నుండి వచ్చిన కథలు కూడా వున్నాయి. ఈ కథలన్నీ అందుబాటులోకి వస్తే- గత యాభై సంవత్సరాలుగా, మూడు తరాలుగా రాజ్యాధికార సాధన దిశగా సాగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవో ద్యమాన్ని సాహిత్యపరంగా మరింత అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ కథల్లో యెక్కువ భాగం విప్లవోద్యమ నిర్మాణానికి చెందిన భిన్నపార్శ్వాల్ని ఆవిష్క రిస్తాయి. ఇంతకుమునుపు భారతీయ సాహిత్యంలో వెలువడ్డ కథల కన్నా యివి అన్నివిధాలా భిన్నమైనవి. పోరాటంలో వైయక్తిక అనుభవాలు సామాజిక అనుభవా లుగా, విప్లవానుభవాలుగా మారే క్రమంలో గతితార్కిక, చారిత్రిక, తాత్విక నేపథ్యం లో రూపొందినవి.
శ్రీకాకుళంలో ‘కొండగాలి’ని మోసుకుంటూ మొదలైన విప్లవకథ ప్రయాణం ఆదిలాబాద్ ‘అడవిలో వెన్నెల’ దారుల్లో, నల్లమల చెంచుపెంటల మీదుగా దండ కారణ్యం వరకూ యెన్నో ఒడిదుడుకులని ఎదుర్కొంటూ అప్రతిహతంగా సాగింది. అడవి విప్లవకథకి ఉద్యమ భూమిక నేర్పరిచింది. అడవి విప్లవకథకి ప్రాణవాయు వైంది. అడవి కోసం ఆదివాసీ చేసే పోరాటం దానికి జీవధాతువైంది. ‘అడివి నుండి వొలసల్నిండి కొండల్నిండి గవర్మెంటూ తుపాకులూ పోయేవరకూ యుద్ధం చేయక తప్పద’ని రచయితలు తీర్మానించారు (అప్పల్నాయుడు). సాహా, సాధనలాంటి రచయితలు పోరాట అవసరాలకు ఆదివాసీ భాషా సంస్కృతుల్ని అధ్యయనం చేశారు. సవర, గోండి, కొలామీ, కోయతూర్ పదజాలం చేరికతో తెలుగుకథ కొత్త పుంతలు తొక్కింది. తెలుగు సాహిత్యభాష పరిపుష్టమైంది. అయితే అదే సమయంలో ఆదివాసీ సమూహాల నుంచి ‘తెలుగులో కథలు రాసే’ రచయితలు రూపొందలేదని గుర్తిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది పెద్ద లోటే కాదు, వైఫల్యం కూడా. ఈ లోటు తీర్చే దిశగా విరసం పయనం చేయాల్సి వుంది.
1990ల తర్వాత బలంగా ముందుకు వచ్చిన దళిత మహిళా మైనారిటీ ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంతో జరుగుతున్న పోరాటాలు విడివిడి శకలాలుగా కాకుండా మొత్తం నూతన ప్రజాతంత్ర పోరాటంలో యేకోన్ముఖంగా విప్లవీకరణ చెందాల్సిన అవసరాన్ని అందుకు అనుగుణమైన సైద్ధాంతిక దృక్పథాన్ని విరసం గుర్తించింది. కారంచేడు. చుండూరు దగ్గర్నుంచి వేంపల్లె మీదుగా నిన్నటి గరగ పర్రు వరకు ఆయా సందర్భాల్లో దళిత సమస్యల్ని, వుద్యమాల్ని, వర్గీకరణ యేకీ కరణ వైరుధ్యాల్ని అర్థం చేసుకొని పార్టీ తీసుకున్న నిర్ణయాత్మక వైఖరినే విరసం స్వీకరించింది. కులాన్ని ఉపరితలాంశంగా గాక పునాదిగా కూడా గుర్తించింది. నిర్మాణంలో స్త్రీల భాగస్వామ్యాన్ని విస్తృతపరచుకుంది. పురుషాధిపత్యంపై స్త్రీ వాదులు లేవనెత్తిన సున్నితాంశాల్ని మహిళావిముక్తి మార్గంలోకి అన్వయించు కుంది. మతతత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా సాంస్కృతికరంగంలో చేయాల్సిన ఐక్య పోరాటాలకు అవసరమైన భావజాలాన్ని నిర్మించుకుంది. వీటన్నిటినీ సాహిత్యంలోకి మరీ ముఖ్యంగా కథల్లోకి అనువదించుకుంది. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ వుద్యమంలో ప్రజా తెలంగాణ విధానాన్ని అవసరాన్ని విరసం రచయితలు అనేక సందర్భాల్లో తమ కథల్లో బలంగా చెప్పారు. కొన్ని సందర్భాల్లో అస్తిత్వవాదుల ఆధుని కోత్తర భావజాలమే విరసాన్ని నడిపిస్తుందా అన్నంతగా ఆయా అస్తిత్వాలతో కలిసి నడిచింది. అయినా అస్తిత్వవాదులు విరసానికి దూరమయ్యారు. ఘర్షణ, ఐక్యత వంటి సిద్ధాంతాలు యెన్ని చెప్పినా కొత్తతరం విరసాన్ని అభిమానిస్తున్నప్పటికీ దాన్ని సామాజిక వుద్యమాలకు నాయకత్వస్థానంలో అంగీకరించడంలేదు. అందుకే చాలా సందర్భాల్లో సంస్థ వొంటరి పోరాటాలు చేయాల్సి వస్తుంది. విరసాన్ని వేధిస్తున్న సమస్యల్లో యిది కూడా వొకటి.
ఒకానొక కాలంలో విప్లవకథ సైతం మూసపాత్రలకు, పునరుక్తులకు, కృత్రిమ ముగింపులకు గురైంది. ఆత్మవిమర్శతో, దృక్పథబలంతో తనను తాను దిద్దుకొని యీ ధోరణి నుంచి బయటపడి కొత్త శిల్పరీతులతో ముందుకు నడిచింది అనడానికి నిదర్శనాలు కూడా వున్నాయి. గమనం కుంటువడిన ప్రతి సందర్భంలోనూ కుదుట బడి తనను తాను పునర్నిర్మించుకొని రూపసారాల మధ్య సమన్వ యానికి విప్లవకథ ప్రయత్నించిది. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానాన్నే తమ చోదక శక్తిగా విప్లవ కథారచయితలు ప్రకటించుకున్నందువల్ల పార్టీ లైన్‌నే కథారచనకి దిక్సూచిగా భావించడంవల్ల పార్టీ వ్యూహాలూ యెత్తుగడలకు అనుగుణంగా యితివృత్తాల్ని నిర్వహించడమూ పాత్రల్ని తీర్చిదిద్దడమూ ముగింపుల్ని మలచడమూ గమనిస్తాం. అది విప్లవకథకి బలమా బలహీనతా అన్నది పెద్ద ప్రశ్నే. అందువల్ల కొన్ని సందర్భాల్లో విప్లవకథ యాంత్రికతకి గురైనట్టు కనిపిస్తుంది. పార్టీ పంథాతో వ్యూహాలతో విభేదించే రచయితల కథలపట్ల విరసం విమర్శనాత్మక వైఖరితో వ్యవహరించింది. ఆ కారణం గా సంస్థకు దూరమైనవాళ్లు వున్నారు. ఇవన్నీ సంస్థ అంతర్గత వ్యవహారాలని కొట్టి పారేయలేం. వాటివల్ల జరిగిన నష్టాన్ని పునర్మూ ల్యాకనం చేసుకొని పూడ్చుకోవాల్సిన సందర్భం యిది. పార్టీ పంథాకి భిన్నమైన దృక్పథంతో వచ్చిన కథల్ని పార్టీ లైన్‌కి అనుగుణంగా రూపొందిన కథల్ని తులనాత్మ కంగా పరిశీలిస్తే వస్తు-శిల్పాలకు చెందిన సంబంధం గురించిన కొత్త కోణాలు వెలికి వస్తాయి. విప్లవకథని శిఖరాగ్రానికి చేర్చిన రాజయ్యవంటి రచయితలు రాయకపోవ డానికీ అతని స్థాయిలో విరసంలో కొత్త రచయితలు తయారుకాకపోవడానికీ కారణాలు తెలుస్తాయి. విరసం బయటా లోపలా యీ అధ్యయనం నిరంతరం కొనసాగాల్సి వుంది.
విప్లవ కథ పోరాటాలనే చిత్రిస్తుందిగానీ, మానవ సంబంధాలను, జీవితాన్ని చిత్రించదనే ఆరోపణ యిప్పటికీ వినిపిస్తుంది. అలాగే విప్లవకథలో వుత్పత్తి సంబంధాల చిత్రణ, భౌతిక పరిస్థితుల వర్ణన, భావజాల ప్రమేయాల పరికల్పన, రాజకీయ ఆచరణ- వీటిపట్ల వున్న శ్రద్ధ మానవ అంతరంగచిత్రణకి వుండదనీ సామాజిక చలనానికి యిచ్చిన ప్రాధాన్యం మనోవిశ్లేషణకీ, మనిషి లోపల జరిగే కల్లోలానికీ వుండవనీ అపోహలు వున్నాయి. విప్లవకథని లోతుగా అధ్యయనం చేస్తే వాటిలోని నిజానిజాలు బయటపడతాయి.
విప్లవ కథ మానవ సంబంధాల్లో లుప్తమౌతున్న అనేక అంశాలపట్ల పాఠకు లకు గొప్ప యెరుకను కలిగించింది. సమాజంలోని భిన్న సమూహాల జీవితాలకు చెందిన అనేక పార్శ్వాలనూ కోణాలనూ అర్థం చేయించింది. అయితే విప్లవ కథ మనిషి మనస్సు లోపలి పొరల్లో చోటుచేసుకునే ప్రకంపనలకు సమాజమే epi-center అన్న అవగాహన నుంచి రూపుదిద్దుకుంది. సామాజిక మానసిక సంక్షోభాలు రెండింటికీ సమప్రాధాన్యం యిచ్చింది. వాటి మూలాల్ని పట్టుకోడానికి పూనుకుంది. సమాజంలోని భిన్న సమూహాలమధ్య చోటుచేసుకునే వైరుధ్యాలకూ, సంఘర్షణకూ, వాటి పరిష్కారాలకూ పెద్దపీట వేసింది. సమాజ చలనాన్ని అవగతం చేసుకోడానికి అవసరమైన సూక్ష్మాతి సూక్ష్మాంశాల్ని అందించింది. స్థూలంగా వర్తమాన సామాజిక చరిత్రను సాక్షాత్కరింపజేసింది. కళ్లు మిరిమిట్లుగొలిపే కఠోర జీవన సత్యాల్ని విప్లవకథ ఆవిష్కరించింది, సాక్షాత్కారింపజేసింది. కొత్త శతాబ్దంలో మిడ్కో ‘మెట్లమీద’, పద్మ కుమారి ‘కాంత పున్నం వెన్నెల’, ‘అపురూప’ సంపుటులు చూడండి; మనిషి లోపలి వేదనని నిశ్శబ్దంగా అనుభవించే మౌనహింసని యెంత తీక్షణంగా ఆవిష్కరించాయో గమనించగలం. ఆత్మాశ్రయ శౖలిలో నడిచే షహీదా కథల్లో (జాజిపూల పరిమళం) వూపిరి తీసుకోనివ్వని యెదురెక్కే ప్రశ్నలు మనిషి అంతరంగపు అలజడి నుంచి పుట్టినవే. అజ్ఞాతసూరీడు (అజ్ఞాతంలో మాతృత్వం), రాజయ్య (మధ్యవర్తులు), కళ్యాణరావు (పద్మ), చక్రవేణు (కువైట్ సావిత్రమ్మ), రాప్తాడు గోపాలకృష్ణ (నాన్నా కత చెప్పవూ), సువర్ణముఖి (గోరపిట్ట), బమ్మిడి (రెక్కలగూడు), రఘోత్తం (జాడ), కరుణ (కవులమ్మ ఆడదేనా), చిన్నయ్య (మెట్ట భూమోడు), పాణి (తడి)… యిలా యెంతోమంది రచయితలు జీవితం పొడిగా వున్న అన్ని తలాల్లోనూ ఆర్ద్రత నింపడానికే పూనుకున్నారు. నిర్దిష్టత, సాధారణీకరణల మధ్య సమన్వయాన్ని సాధించారు. కథని వ్యక్తి నుంచి సమూహంలోకి నడిపించారు. వైయక్తిక సంబంధాలన్నీ సామాజి కాలనీ రాజకీయ దృగంశాలనీ నిరూపించారు. మానవ సంబంధాల మూలాల్నీ వాటి మధ్య చోటుచేసుకనే ఘర్షణకి దారితీసే పరిస్థితుల్నీ గతితార్కికంగా విమర్శ నాత్మకంగా తరచి చూడటానికి ఆ విధంగా విప్లవకథ యెంతగానో తోడ్పడింది.
4
కథారచనకూ విమర్శకూ విరసం సమప్రాధాన్యం యిచ్చింది. నిజానికి రచానా విమర్శనా ప్రత్యేకాంశాలుగాగాక వొకే నాణేనికి వున్న రెండు ముఖాలుగా గుర్తిం చింది. ప్రతి కథనీ దాని తయారీలోనే విమర్శనాత్మకంగా తీర్చిదిద్దడానికి అనువుగా సంస్థ వొక వేదికగా రూపొందింది. ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా లెక్కలేనన్ని వర్క్‌షాప్‌లు, సాహిత్య పాఠశాలలూ నిర్వహించింది. మార్క్సిస్టు విమర్శనా సూత్రాల వెలుగులో కథని సానపట్టింది. వస్తువు శిల్పం దృక్పథం ప్రయోజనం వంటి అనేక విషయాలపై చర్చోపచర్చల ద్వారా కథానిర్మాణం సామూహిక ప్రక్రియగా పరిణ మించింది. ఆ క్రమంలో మంచి కథలు అనేకం విరసం కారా‰నా నుంచి వెలికి వచ్చాయి. మనిషెత్తు కథకోసమే విరసం నిరంతరం పరితపించింది.
చాలాకాలం వస్తురూపాల మధ్య ప్రాధాన్యతలను నిర్ధారించడంలోనే తెలుగు కథ గిరికీలు కొడుతుండేది. విప్లవ రచయితలు కూడా రూపవాదాన్ని తిరస్కరించ డానికి మొదట వస్తువుకే ప్రాధాన్యం యిచ్చారు. కానీ తర్వాత వస్తుశిల్పాల సమ ప్రాధాన్యాన్ని గుర్తించారు. ఆ రెండిటినీ నిర్దేశించేదీ నిర్ణయించేది దృక్పథమేనని గ్రహించారు. శుద్ధ కళావాదాన్ని తిరస్కరించారు. వస్తు-శిల్ప-దృక్పథాలు విడివిడి అంశాలు కావనే స్పృహని అందుకోవడంలో, అందించడంలో విప్లవకథ ముందు పీరిÄన నిలబడింది. అందుకు కావలసిన విమర్శాసూత్రాలని విరసం ఎప్పటికప్పుడు బలంగా నిర్వచించింది.
విరసం కవిత్వ విమర్శతోపాటు కథావిమర్శపై కూడా మొదటినుంచీ దృష్టి సారించింది (విప్లవ కథాసాహిత్యం: కొ.కు., సృజన, ఫిబ్రవరి 1971). వ్యావసాయక సమాజంలో ప్రజల చెంతకి పాట చేరినంత సహజంగా వచన రచన ప్రక్రియలైన కథ నవల చేరవని గ్రహింపు విరసం రచయితలకు వుంది. తొలిరోజుల్లోనే విప్లవ కథ ప్రయోజనం గురించి లక్ష్యం గురించి ఎన్నెస్ ప్రకాశరావులాంటి రచయితలు మౌలిక మైన ప్రశ్నలు లేవనెత్తారు. వర్గసమాజంలో జనసామాన్యానికి రచయితలకూ కళాకారులకు మధ్య వున్న దూరాన్ని అధిగమించడానికి జముకుల కథ, పాట వంటి ప్రక్రియలతో ఆధునిక కథ పోటీపడగలదా అని ఎన్నెస్ సందేహించాడు. అచ్చు యంత్రం వచ్చాకా మౌలికరూపమైన మౌఖికతని పోగొట్టుకున్న కథను జనంలోకి తీసుకుపోవటం గురించి ఎన్నెస్ చేసిన ఆలోచనల్ని విరసం ఆచరణలోకి తర్జుమా చేసింది. తెలుగు కథాచరిత్రలో రూపపరంగా, భాషా విషయికంగా, శౖలీరీత్యా విప్లవ కథా రచయితలు చేసిన కృషి అపూర్వం. పడకకుర్చీకి పరిమితమైన పాఠకుల నుంచీ చేనూచెలకల్లో యెర్రమట్టి దుబ్బల్లో నల్లబొగ్గుపొరల్లో చెమటోడ్చే శ్రామికుల చెంతకు కథని చేర్చారు. కథని మౌఖికంగా వినిపించారు. రాత కథని శ్రవ్యకథగా మార్చే క్రమంలో యేర్పడే పరిమితుల్ని గుర్తించారు. వాటిని అధిగమించడానికి కొత్త కథన రీతుల్ని యెన్నుకున్నారు. కథారచనలో శుష్క ప్రయోగాలకు తావులేదనీ సరళత సూటిదనం కథని పాఠకులకి దగ్గర చేస్తుందనీ కథకులు గుర్తించారు. మౌఖికశౖలినీ కథన రీతుల్నీ స్వీకరించారు. సంప్రదాయ భాషా వ్యక్తీకరణ పద్ధతుల్ని విడిచిపెట్టారు. కథకు పాఠకులకు బదులు శ్రోతల్ని తయారుచేసుకోవాలని ప్రయత్నించారు. అప్పుడు అది సామూహిక ప్రదర్శనగా మారి ప్రభావశీలం కాగలదని ఆశించారు. కథని సమూహాల ముందు వినిపించారు. జానపద మౌఖికకథన సంప్రదాయాన్నీ అనుస రించారు (ఉప్పల నరసింహం ‘ముద్ర’ కథలు ఆ క్రమంలోనే వచ్చాయి. అయితే తర్వాతి కాలంలో అతనే విప్లవ కథకు దూరమయ్యాడు). మళ్లీ చాలాకాలం తర్వాత రఘోత్తంరెడ్డి ఆడియో కథలు ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగానికి కూడా కొనసాగింపు లేకుండాపోయింది. కానీ యీ ప్రయత్నాలన్నిటి వెనక తాము నమ్మిన భావజాలాన్నీ కథనీ విస్తృత ప్రజాసమూహాలకు చేర్చాలనే తపన వుంది. ఇప్పుడు కొత్తగా అంది వచ్చిన సామాజిక మాధ్యమాల ద్వారా, సాంకేతిక పరికరాల ద్వారా కథని కొత్తతరం శ్రోతల చెంతకు చేర్చడానికి ప్రయత్నించాలి.
ఒక విధంగా వుద్యమాచారణలో భాగంగానే వుద్యమావసరాలే సాహిత్య రూపాన్నీ భాషనీ శాసించాయి. సాహిత్యంలో వస్తురూపాల్ని నిర్దేశించడానికి రాజకీయ సందర్భాలు కారణమౌతాయి అని చెప్పడానికి విప్లవకథ సరైన వుదాహరణగా నిలిచింది. గమనించాల్సిన విషయం యేమంటే కథ ప్రజలపరం అయ్యే ప్రక్రియ పూర్తికాలేదు; కానీ నోటి నుంచీ నోటికీ నోటి నుంచీ రాతకీ రాత నుంచీ మళ్లీ నోటికీ మారే అమోఘమైన సాహిత్య అనుసృజన కారణంగా కథారచనలో మిశ్ర మౌఖిక శౖలి వొకటి రూపొందింది. దాన్ని వొడుపుగా పట్టుకున్న విరసం లోపలి బయటి రచయితలు బలమైన కథలు చెప్పారు. తెలుగు కథానిర్మాణ పద్ధతుల్లో వచ్చిన మార్పుల్లో విరసం ప్రభావాన్ని అధ్యయనం చేసే సందర్భంలో తప్పక పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం యిది.
కథని మౌఖికం చేసే క్రమంలో భాషా విషయికంగా విప్లవ కథకులు విమర్శ కులు చేసిన చర్చల వల్ల గొప్ప ప్రజాస్వామిక వాతావరణం యేర్పడింది. ఉత్పత్తి రంగంలో ప్రత్యక్షంగా పాల్గొనే శ్రామిక వర్గం నుంచి వచ్చిన కొత్త తరం రచయితలు భాషకి సంబంధించి మధ్యతరగతి మూస ఆలోచనల్ని ఛేదించి ఆవిష్కరించిన శాస్త్రీయ దృక్పథం తెలుగునేల మీద అన్ని ప్రాంతాల నుంచి ముఖ్యంగా తెలంగాణ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ఆయా మాండలికాల్లో ప్రజల జీవద్భాషలో కథలు రావడానికి కారణమైంది. ఇది తెలుగు సాహిత్యచరిత్రలో పెను మార్పు; మలుపు. ప్రధానస్రవంతిలో నామినిలాంటి రచయితలకు లభించిన ఆదరణని యీ మలుపు నుంచే చూడాలి. డజన్లకొద్దీ రచయితలు యివ్వాళ తమ సొంత వర్గ- ప్రాంత భాషల్లో సాహిత్యాన్ని హాయిగా సృష్టించుకోగలుగుతున్నారంటే దాని వెనక విరసం పోషించిన పాత్ర అమేయమైనది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రోద్య మంలో భాష కీలకపాత్ర పోషించింది. సొంతభాషలో చేసే సాహిత్యసృజన ఆత్మ గౌరవ ప్రకటనకి అస్తిత్వసోయికి మారుపేరయ్యింది.
సాహిత్యంలో ప్రయోగవాదం బూర్జువా లక్షణం అని మార్క్సిస్టు విమర్శకులు తొలిరోజుల్లో బలంగా భావించినప్పటికీ- విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణని చిత్రీక రించడానికో, వ్యక్తుల అంతరంగ సంక్షోభాన్ని వొడిసిపట్టుకోడానికో, పాత్రల చైతన్యంలో మార్పు లక్ష్యంగా కథని నడపడానికి పూనుకున్నప్పుడో, వొకానొక సామాజిక రాజకీయ అపసవ్యతని అవహేళన చేయడానికో విప్లవకథ అనేక సందర్భాల్లో ప్రయోగాన్ని ఆశ్రయించింది. ప్రయోజనోద్దిష్టమైన ప్రయోగానికి విప్లవ కథకులు ఎప్పుడూ విముఖులుగా లేరు. ప్రయోగం కోసం ప్రయోగాన్ని మాత్రమే నిరసించారు. శిల్పానికీ ప్రయోగానికీ దృక్పథం పరిమితులు విధిస్తుంది అనడం తప్పు. నిజానికి సరైన దృక్పథం మంచి శిల్పానికీ నూత్న ప్రయోగాలకూ బలాన్ని- స్తుంది. ఒక భావజాలంపట్ల నిబద్ధతతో దాని వ్యాప్తికోసం సాహిత్యసృజన చేయడ- మంటే కళను నిర్లక్ష్యం చెయ్యడమే అన్నది అనిబద్ధవాదుల ఆరోపణ. సామాజిక స్పృహ వంటి పదాలు శుద్ధ కళావాదులకు హాస్యాస్పదంగా కనిపిస్తాయి. దృక్పథం రచయితకి సంకెల అని కూడా వాళ్లు వాదిస్తారు. సమాజం కోసం సాహిత్యం అనేదే వాళ్లు విశ్వసించరు. వాళ్లకి విప్లవ రచయితలు తమ కళానైపుణ్యాలతో అనేక సందర్భాల్లో సమాధానాలు చెప్పారు. దృక్పథం నుంచి దృష్టి మళ్లించడానికే రూప వాదులు బహురూపాలతో ముందుకు వస్తారు.
వస్తువు శిల్పం దృక్పథం ప్రయోజనం- వీటిని విడివిడి అంశాలుగా చూడ లేమన్న స్పష్టతని విరసం రచయితలకు యిచ్చింది. వస్తుశిల్పాల మధ్య సమన్వయం సాధించడానికి రచయిత దృక్పథం యెంతగా దోహదం చేస్తుందో తెలియజేసింది. వస్తువు తన శిల్పాన్ని తానే యెన్నుకుంటుంది అని కొందరు విమర్శకులు స్థూలంగా చెప్పినప్పటికీ సరైన దృక్పథమే కథనరీతిని నిర్ధారిస్తుందనీ కథలోని పాత్రల స్వభావాన్నీ చైతన్యాన్నీ వాటిమధ్య సంఘర్షణనీ దృక్పథమే రూపొందిస్తుందనీ కథ పేరు, ఎత్తుగడ, సన్నివేశాల నిర్వహణ, ముగింపు మొదలైన కథాంగాల్ని సైతం దృక్పథమే మలుస్తుందనీ విప్లవ కథకులు విశ్వసించారు. సౌదా (ఫోటోగ్రాఫర్), కూర్మనాధ్ (క్షుద్రక్రీడ) వంటి రచయితలు చేసిన కొత్త ప్రయోగాలు శిల్పపరంగా విప్లవకథ సాధించిన విస్తృతికి మచ్చుతునకలు మాత్రమే.
రాజయ్య ‘అతడు’ కథ వస్తుశిల్పాలపరంగా విరసం బయటా లోపలి కథకు లకు దారిదీపమైంది. పాత్రోన్మీలన పద్ధతికి పాఠ్యగ్రంథమైంది. మహాశ్వేత ‘బషాయిటుడు’లా సికాస ఉద్యమశ్వాస రమాకాంత్ ‘అతడు’ కథ ద్వారా మళ్లీ మళ్లీ జన్మించాడు. విప్లవోద్యమ త్యాగాల చరిత్రలో ‘అతడు’ అనేక నామవాచకాలకు సర్వ నామమైంది. వస్తుపరంగా నిర్మాణపరంగా కాల్పనిక సాహిత్యంలో అతడుకి అనేక అనుకరణలు (రిప్లికా) పుట్టాయి. డా|| వి. చంద్రశేఖరరావు క్లోనింగ్ ద్వారా సృష్టించిన అనేక పాత్రలకు బీజాలు అతడులో కనిపిస్తాయి. కథకులకు రచనా నిర్మాణ కళాకౌశలాలను నేర్పే పాఠశాల అయ్యింది విరసం.
విరసం వర్క్‌షాపులు తొలి నుంచీ కథకుల సృజనాత్మకతకు కొత్త ద్వారాలు తెరిచాయి. కథాసృజనని సమష్టికళగా మలిచాయి. 1980ల్లో వర్క్‌షాపులు విప్లవ కథలోని వస్తువు భాష కథనరీతుల మీద యెక్కువ దృష్టి పెడితే ఆ తర్వాతి కాలంలో దృక్పథం – శిల్పం వాటి మధ్య వున్న సంబంధం గురించి చర్చచేయడం గమనిస్తాం. విశాఖ, కీసరగుట్ట, లోపూడి, మహానంది, పొద్దుటూరు, అరకు, హైదరాబాదు… యిలా ప్రతి వర్క్‌షాపూ సమష్టి కథాసృజనకి కార్యక్షేత్రమైంది. నేలతల్లి విముక్తి కోసం, మనకాలం కథలు, కథా కెరటాలు, కదిలే కథ మరీ ముఖ్యంగా కథల పంట (మూడు భాగాలు) విరసం కథకుల కృషికి సానపట్టడం నుంచి వెలికి వచ్చినవే. వర్క్‌షాపుల్లో సీనియర్ రచయితల మార్గదర్శనం కొత్తగా కలం పట్టేవాళ్లకు గొప్ప స్పూÛర్తినివ్వడం అటుంచితే కథారచన విమర్శ యేకకాలంలో పురుడు పోసుకునేవి. రాజయ్య, రఘోత్తం, కళ్యాణరావు లాంటివాళ్లు కథలు రాయడం ఆపినా కొత్త రచయితలతో సంభాషించడం ఆపలేదు. ఉదయమిత్ర, చిన్నయ్య, బాసిత్, వరలక్ష్మి, హైమావతి మొదలైన మూడోతరం, నాలుగోతరం రచయితలు విరసం కార్యశాలల్లో రాటు తేలారు. విరసం అందించిన సాహిత్యదృక్పథం వెలుగులో రచయితలు జీవితాన్ని చూడడం నేర్చారు. చూసినదాన్ని విశ్లేషించడం తెలుసుకున్నారు. జీవితాను భవాలు వాటంతటికవి కథలు కావనీ వాటికి సృజనాత్మకత జోడించాలంటే సరైన సామాజిక దృక్పథం ఉండాలనీ దృక్పథమే శిల్పాన్ని సైతం నిర్దేశిస్తుందనీ కథల వర్క్‌షాప్‌ల ద్వారా విరసం యెప్పటికప్పుడు యెరుకపరచింది. సామాజిక సాంస్కృతిక రంగాల విస్తరణకు అవసరమైన ఇతివృత్తాల్ని స్వీకరించడానికి ప్రోత్సహించింది. భూనిర్వా సితులు (పి. చంద్), పోలేపల్లి సెజ్ కథలు (గీతాంజలి) ఆ క్రమంలోనే వెలువడ్డాయి. అయినప్పటికీ ఆధునిక జీవితంలోని సంక్లిష్టతని పట్టుకోవడంలో విరసం కథకులు మరింత శ్రద్ధ చూపాలి. అరుణతార కథల ప్రత్యేక సంచికలు విరసం మంచి కథ కోసం చేసిన కృషికి దర్పణంలా నిలుస్తాయి. కథాసంపుటుల ముందుమాటలు, ప్రత్యేక సంచికల సంపాదకీయాలు కథావిమర్శకి కొత్త పరికరాల నందించాయి.
కథని విశ్లేషించడానికి కొత్త పరికరాల అవసరం ఉందని విరసం అనేక సందర్భాల్లో గుర్తించింది. సామాజిక శాస్త్రాల వెలుగులో విప్లవ కథావిమర్శ పయని- స్తోంది. విప్లవ కథావిమర్శ పాఠ్యాన్ని గతితార్కికంగా చారిత్రికంగా పరిశీలిస్తుందన- డానికి పర్‌స్పెక్టివ్స్ ప్రచురించిన అల్లం రాజయ్య సాహిత్యానికీ ఇతరత్రా వరవరరావు రాసిన ముందుమాటలు బలమైన తార్కాణాలు. ‘విప్లవ కథారచన కొత్త ప్రపంచపు నిర్మాణ కళ’గా అల్లం రాజయ్య చేసిన సంభాషణ వస్తు శిల్ప దృక్పథాల సంబంధాన్ని అపూర్వంగా నిర్వచించి విప్లవ కథావిమర్శలో కొత్త కోణాలు ఆవిష్కరించింది. వస్తువునీ శిల్పాన్నీ దృక్పథాన్నీ వేర్వేరుగా చూడరాదనీ, కథా నిర్మాణం ప్రజాపోరాట నిర్మాణం అవిభాజ్య అంశాలనీ రాజయ్య చేసిన ప్రతిపాదనల వెలుగులో విప్లవకథనే కాదు మొత్తం తెలుగుకథని అంచనా కట్టాల్సి వుంది. అయితే మార్క్సిస్టు విమర్శ సూత్రాలని సరైనరీతిలో అర్థం చేసుకుని ఆధునిక సందర్భానికి అన్వయించే విమ ర్శకులు కూడా మనకు తక్కువయ్యారు. కెవిఆర్, కొకు, టియమ్మెస్ వంటి విమర్శకు లకు కొనసాగింపు అవసరం బలంగా కనిపిస్తోంది. సాహిత్యమంతటినీ దృష్టిలో వుంచుకుని వాళ్లు భిన్న సందర్భాల్లో చేసిన సూత్రీకరణల్నీ, ప్రతిపాదనల్నీ, మౌలిక భావనల్నీ కథకి అన్వయించుకోవాలి. విరసం బయటా లోపలా కాత్యాయనీ విద్మహే బాలగోపాల్, వేణుగోపాల్, పాణిలాంటివాళ్లు కథావిమర్శలో చేసిన/చేస్తున్న కృషిని ప్రత్యేకంగా గుర్తించాలి. మారిన ఉత్పత్తి సంబంధాల్ని అర్థంచేసుకోడానికి ప్రపంచ వ్యాప్తంగా మార్క్సిజానికి, మార్క్సిస్టు విమర్శకూ కొత్తజోడింపులు వస్తున్నాయి. వాటిని మన విమర్శకులు అందిపుచ్చుకోవాల్సిన అవసరం వుంది. దోపిడీరూపాలు మారాయి. తమ శ్రమ పరాయీకరణకి చెందుతున్న దుర్మార్గాన్ని శ్రామికులు గుర్తించ లేకపోతున్నారు. ఒకవైపు వర్గశత్రువు కంటికి కనిపించకుండా భూమ్యాకాశాల్లో మాయాయుద్ధం చేస్తున్నాడు. తీవ్రమైన అణచివేత పద్ధతుల్ని అమలుపరుస్తున్నాడు. కార్మికవర్గాన్ని నాయకత్వ స్థానం నుంచి తొలగించడానికి కొత్త కుట్రలు పన్ను- తున్నాడు. మరొకవైపు అదృశ్యహింస ఆధునిక నగర జీవితాల్లో పెరిగిపోతుంది. గ్రామాలు సైతం మారుతున్నాయి. సమస్త జీవనపార్శ్వాల్లోకీ పరాయీకరణ విస్తరి- స్తోంది. మనుషులు తమనుతాము నిరంతరం కోల్పోతున్నారు. తిరిగి అన్వేషించు- కోడానికి సైతం వ్యవధి లేదు. విమర్శకులకూ రచయితలకూ యీ అదృశ్యశక్తుల గురించి స్పష్టమైన అవగాహన వుండాలి. వాటిని సాహిత్యీకరించే నైపుణ్యం వుండాలి. నిరంతర చలనశీలతే సృజనాత్మకతకి బలం.
పునాది-ఉపరితలాలు పునర్నిర్వచనానికి గురవుతున్నాయి. ఆర్థిక అసమా- నతలతోపాటు సామాజిక అంతరాలు సమాజంలో సాహిత్యంలో బలంగా చర్చకు వచ్చాయి. వర్గపోరాటాలనీ కులపోరాటాలనీ జమిలిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థిక రాజకీయ సామాజిక పరాయీ కరణ మాత్రమేగాక సాంస్కృతిక పరాయీకరణ సైతం అజెండా మీదకి వచ్చింది. మత ఆధిపత్య రాజకీయ కేంద్రాలు బలపడుతున్నాయి. జాతీయవాదం పేరున మూకస్వామ్యం ఆమోదాన్ని సంపాదించుకోడానికి ప్రయత్నం చేస్తోంది. దోపిడీపీడనల స్వరూపం మారినట్లే అణచివేత పద్ధతులు మారాయి. వాటికి వ్యతిరేకంగా పోరాట పద్ధతులు మారుతున్నాయి. వాటికి సాహిత్య ప్రతిఫలనాలు మారుతున్నాయి. వీటిని అర్థం చేసుకోడానికి ముందుగా మనకు అందుబాటులో వున్న పరికరాలకు సాన బెట్టాలి. కొత్త సంక్లిష్టతలను కొత్తగా చూడాలి. ఇన్నాళ్లూ వుపాంతాలకు గురై పీడనని అనుభవించిన జాతులు, కులాలు, అస్తిత్వ పోరాటమార్గాలు పట్టినచోట కొత్త అధ్యయనం చేపట్టాలి. జీవితానుభవసారం నుంచి రూపొందే ప్రమేయాల ద్వారా దేశీయ ఉద్యమ నిర్మాణ అవసరాలరీత్యా యేర్పరచుకునే సిద్ధాంతాల నుంచి కొత్త పరికరాలను తయారుచేసుకోవాలి. అదే సమయంలో పోరాటశ్రేణుల్ని శకలాలుగా విడదీసి ఐక్య ఉద్యమ నిర్మాణాన్ని దెబ్బదీసే ప్రతిఫూతశక్తులపట్ల అప్రమత్తత కూడా అవసరం. ప్రజల సామూహికతని ధ్వంసం చేసే వాదాల్ని తిరస్కరించే చైతన్యాన్ని సాహిత్యమే అందించాలి. అందుకు అవసరమైన సైద్ధాంతికబలాన్ని యిచ్చే బాధ్యతని సైతం విమర్శకులు స్వీకరించాలి.
విప్లవం సమాజంలో తొంబై శాతం ప్రజలకు సంబంధించిన విషయం. కానీ దోపిడీ పాలకవర్గం దాన్ని పిడికెడుమంది యెక్కడో ఒకమూల చేపట్టే దుడుకు చర్యగా భావించేలా చేస్తుంది. దీన్నుంచి బయటపడటానికి విప్లవ కథకులు అత్యంత జాగరూకులై ఉండాలి. సమాజాన్ని ముక్కలు చేసి పాలకులు పబ్బం గడుపు కుంటున్న సందర్భంలో ఆయా నిర్దిష్టతల దగ్గరే ఆగిపోయే ప్రమాదం విప్లవ కథకులకే కాదు అందరికీ వుంది. అందువల్ల మానవ జీవితానుభవాల్లో సాధారణంగా కలిగే ఉద్వేగాల్ని ఆలోచనల్ని సంవేదనల్ని కథల్లోకి తీసుకురావడం ద్వారా విప్లవకథకులు యీ సంక్లిష్టతని అధిగమించగలుగుతున్నారు. అయితే ఈ పని మరింత కళాత్మ కంగా జరగాల్సి ఉందని విప్లవ కథకులు గుర్తించాలి. వస్తు రూపాల మధ్య సమన్వయాన్ని సాధించడానికి కథకులు కథానిర్మాణపు మెళకువలు తెలుసుకొని ఉండాలి. దృక్పథ ప్రయోజనాల సంలీనతని తెలుసుకోడానికి సైద్ధాంతిక స్పష్టతని సాధించాలి. విప్లవకథ తొలిరోజుల్లో ఎన్నెస్ ప్రకాశరావు రాసిన ‘పేపర్ టైగర్’ లాంటి కథలు చూడండి. ఆ కథలో ఆయన వర్గ వైరుధ్యాల్ని కళాత్మకంగా యెంత చక్కగా కళ్లకు కట్టాడో!
5
సుదీర్ఘమైన తెలుగు సాహిత్య ప్రస్థానంలో చరిత్రలో విరసం నడిచిన యాభై యేళ్లు స్వల్పమే కావొచ్చు. కానీ చరిత్రగతిని మలపటానికి ఆ కాలంలో యెత్తిపట్టిన ఆకాంక్షలు, పాటించిన విలువలు, అనుసరించిన విధానాలు, ఆచరించిన సిద్ధాం తాలు, అవలంబించిన వ్యూహాలు, అందుకు యెదుర్కొన్న సవాళ్లు, అనుభవించిన క్లేశాలు, పడిన సంఘర్షణ, చేసిన పోరాటాలు, తెచ్చిన మార్పులు, సాధించిన విజయాలు, భవిష్యత్తుకి అందించిన ఆశయాలు, స్వప్నాలు- యివి మాత్రం అనల్పం. సామాజిక సాంస్కృతికరంగాలపై విప్లవకథ చూపిన ప్రభావం అపరి మేయం. వాటి విస్తరణకు కథ మాత్రమే కాదు విప్లవ సాహిత్యం మొత్తం యెంత గానో దోహదం చేసింది.
అఖిల భారత సాంస్కృతిక ఉద్యమానికి తెలుగునేల మీద పెల్లుబికిన విప్లవోద్యమం దిగ్దర్శనం చేసింది. అగ్రగామిగా నిలిచింది. పాణిగ్రాహి నిమగ్నత వారసత్వాన్ని అందుకున్న విరసం నుంచి వెలువడ్డ ఉద్యమ కవితలు, పాటలు, కథలు, నవలలు అనేక భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. కళాప్రదర్శన రీతులు అన్ని ప్రాంతాలవారికీ ఆదర్శమయ్యాయి. ఇవ్వాళ దేశవ్యాపితంగా సామాజిక సాంస్కృతిక రంగాల్లో అత్యంత హింసాత్మకంగా అమలవుతున్న మతతత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న దళిత ఆదివాసీ బహుజన ఉద్యమాలకు తెలుగునాట పుట్టిన విప్లవ సాహిత్యమే సాంస్కృతిక స్పూÛర్తిని అందిస్తుందంటే తప్పుకాదు. అందులో విప్లవకథ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది.
అయితే నడవాల్సిన దారి చాలా వుంది. అది అంత సుగమంగా యేంలేదు. తొవ్వనిండా రాళ్లూ రప్పలూ ముళ్లూ. అనేక సంక్లిష్టతలతో నిండిన జీవితాన్నీ సమాజ గతినీ నిర్వచించడం దగ్గరే ఆగిపోక దాన్ని మార్చడానికి అవసరమైన పరికరాలని అందించడంలో తెలుగునాట విప్లవకథ చూపిన మార్గం అనితరమైనది. జీవితాన్ని మానవీయంగా వుంచడానికీ ఆచరణాత్మకంగా మలచడానికీ అది చేస్తున్న నిరంతర ప్రయాణం అపారమైనది. దాన్ని నిర్దుష్టంగా అంచనావేసే ప్రయత్నం మాత్రం అల్పమే. మూడు నాలుగు తరాలుగా భిన్న సామాజిక నేపథ్యాల నుంచి సంస్కృతుల నుంచి వచ్చిన రచయితలు విప్లవోద్యమాన్నే కాదు మొత్తం మానవసమాజ పరిణా మాల్ని కథాక్షేత్రంలో నిలబెట్టి విమర్శనాత్మకంగా పరిశీలిస్తున్న రీతిని చూస్తే అబ్బుర మనిపిస్తుంది. యాభైయేళ్ల సామాజిక రాజకీయచరిత్ర విప్లవకథలోసూక్ష్మంగా వొదిగిపోయింది. విప్లవ కాల్పనికత నుంచి విప్లవ వాస్తవికత వైపు రచయితలు చేసిన గమనం వొక పాఠం. కత్తి అంచు మీద నిలబడి చేసిన విన్యాసం. విప్లవ కథకులకు కథారచన చావుకూ బతుక్కీ మధ్య సన్నటిదారుల్లో సంచరించడం. జీవితపు అగాధాల అడుగు మట్టుని స్పృశించడం. మనుషుల మధ్య అనివార్యంగా పంచుకోవాల్సిన సాంద్ర ఆర్ద్రతని పెంచుకోవడం. తాము జీవిస్తున్న స్థలకాలాల్ని గుప్పిటపట్టి బంధిం చడం. మానవీయ పరిమళాన్ని శ్వాసించడం. దృశ్యాదృశ్య సామాజిక చలనాన్ని వొడిసిపట్టుకోవడం. ధిక్కారస్వరాల్ని కలిపి పెనవేయడం. మాటల్ని మంటలు చేయడం. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత విరసంలాంటి ప్రజాసంఫూలపై వుంది.
మాట్లాడటం సైతం దేశద్రోహంగా మారిన రాజకీయ సందర్భంలో యీ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన స్పూర్తి కోసం భారతీయ సమాజం విరసం వైపు చూస్తోంది. విరసం చెయ్యకుంటే యింకెరు చేస్తారు?
‘మౌనాన్ని ప్రాసిక్యూట్ చేసి మాటను బతికించుకుందాం.’ (కౌముది)
( విరసం యాభై యేళ్ల సందర్భంగా పర్స్పెక్టివ్స్ ప్రచురిస్తున్న “ఏభై ఏళ్ల విరసం: పయనం – ప్రభావం” కోసం రాసిన వ్యాసం)
‘మనిషెత్తు కథకోసం విరసం’ చాలా బాగారాశారు ఏకే ప్రభాకర్ జారు. 50 ఏళ్లలో విరసం సాహిత్యం ప్రస్థానం నాలాంటి విరసం సాహిత్యం ఇష్టపడే వాళ్ళకు తెలిసేలా రాశారు.