‘మనిషి అలికిడిలేక… ‘పోతే ఏమౌతుంది?

‘మా‌ నాయన’గా మొదలైనవాడు. ‘నల్ల చామంతి’గా విరబూసినవాడు. ‘వెలుతురు మొలకలు’గా వెలుగులు పంచినవాడు. ఇప్పుడు “మనిషి అలికిడిలేక…” అంటున్నాడు. చిత్తలూరి కవిగా తానేమిటో నిరూపించుకున్నవాడు. తెలుగు సాహిత్యంలో నల్లచామంతితో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు. 20 ఏళ్ల కాలంగా సాహిత్య రచనను నిరంతరాయంగా‌ కొనసాగిస్తున్న వాడు. రెండు దశాబ్దాలుగా సాహిత్యజీవిగా నిలబడటమంటే మామూలు విషయమేమీ కాదు. రాయకుండా వుండలేని తనమేదో చిత్తలూరిలో వుంది. నిత్యసంఘర్షణ ఏదో అతని జీవితంలోంచి కవిత్వంగా మాట్లాడుతుంది. సాహిత్యంలో వస్తున్న అనేక ధోరణులను, వాదాలను, గమనిస్తూ వస్తున్నవాడు. కవిత్వమైనవాడు. అభ్యుదయ పథగామిగా కావాలని నమ్మినవాడు. సమాజంలో మార్పుకు సాహిత్యం కూడా ఒక గొప్ప సాధనమని విశ్వసించినవాడు.

వర్తమానాన్ని పట్టించుకున్నవాడే‌ కవి. అన్వేషణ జీవిత విస్తరణ అవసరం ఏ కవికైనా. సమాజం మీద సమాజంలోని ఆధిపత్యాల మీద, నిరంకుశత్వ ధోరణుల మీద తన కలాన్ని ఝళిపించే పదునైన కాంక్ష వుంది. సునిశితమైన చూపు వుంది. అనేక‌ సందర్భాల్నీ, సంఘర్షణల్నీ, దృశ్యమానం‌ చేయడంలో నిపుణత ప్రదర్శిస్తాడు. పరిణితి కలిగిన తాత్విక గాఢత వుందీ రచనలో. కవిత్వం ఏ కొందరికో అర్థమవడాన్ని సహించని‌ కవి చిత్తలూరి. కవిత్వం కూడా సాధ్యమైనంతగా ప్రజలందరికీ చేరువ కావాలని కోరుకుంటాడు. సంక్లిష్టమైన వాక్య నిర్మాణాలతో శిల్ప విన్యాసాలతో రాయగలిగిన సామర్థ్యం వున్నప్పటికీ వస్తు శిల్పాల సమన్వయం చెదరకుండానే తాను చెప్పదలుచుకున్న అంశాన్ని చాలా సరళంగా వ్యక్తీకరిస్తాడు. కవిత్వం ఒక సామూహిక ఛోదక శక్తి అని విశ్వసిస్తాడు. ప్రజాచైతన్యానికి కవిత్వం‌ ఒక వాహిక అని ప్రగాఢంగా విశ్వసిస్తాడీ కవి. ప్రజల భాషలోంచే ప్రజా జీవితాల్లోంచే కవిత్వం సుసంపన్నమౌతుందని బయలుదేరిన వాడు చిత్తలూరి. భూత వర్తమాన భవిష్యత్తు అంశాలను అలవోకగా కవిత్వం చేయగల దిట్ట ఈయన.

కవి ప్రధానంగా వర్తమానాన్ని పట్టించుకోవాలి. వర్తమానం‌లేని వాడికి భవిష్యత్తు వుండదని ఈ కవికి‌ బాగా తెలుసు. అందుకే చిత్తలూరి కవిత్వం‌ సమకాలీన‌ సమాజానికి ప్రతిబింబంలా నిలుస్తుంది. ఎందరో పట్టించుకోని తడమని అంశాల్ని, విషయాల్ని శక్తివంతంగా కవిత్వీకరించాడీ కవి. స్పందించాల్సిన ప్రతి సందర్భంలోనూ, ప్రతిఘటించాల్సిన ప్రతి సన్నివేశంలోనూ కవిత్వంగా నిలబడ్డ వాడీ కవి. ఆంగ్ల భాషా పరిజ్ఙానం కూడా పుష్కలంగా వుండటం మూలాన దేశ దేశాల కవిత్వాన్నీ, సాహిత్యాన్నీ చదివిన అనుభవం వుంది. జోవితంలోని సమస్త సంఘర్షణల పట్ల అవగాహన కలిగి సమూహంగా వికసించాలని ఓ గొప్ప మానవ సంస్కృతి నిర్మించాలన్న సంకల్పంలో కవిత్వమై బయలుదేరినవాడు. సమాజంపట్ల బాధ్యత,‌జీవితం పట్ల స్పష్టత వుంది. సున్నితత్వం‌ వుంది. అంతర్ముఖీనత వుంది. లోతైన అన్వేషణ వుంది. ఆర్ద్రత వుంది. నిరంతర తపన‌వుంది. సామూహిక చేతన‌వుంది.తలకిందులవుతున్న సమాజ పోకడల్నీ, ధ్వంసమౌతున్న మానవ విలువల్నీ,‌మానవ బంధాల్నీ గుర్తుచేస్తూ మనిషి మనిషిగా ప్రేమించబడాలని తన కవిత్వం ద్వారా వ్యక్తమౌతూ అనేక సందర్భాల్లో ఇతన్ని పడిపోకుండా నిలబెట్టింది కవిత్వమే. జీవితంలోని అనేక చిక్కుముడుల్లో కూరుకుపోయినపుడు ఓటమి అంచుల్లోంచి తనను గెలుపు దారులవైపు నడిపించింది కవిత్వమేనంటాడు. ధైర్యవాహికగా తనను కవిత్వమే తీర్చిదిద్దిందంటాడు చిత్తలూరి.

కొంతమంది శుద్ధ కవితా వాదులుంటారు. వాళ్లకి కవిత్వం‌ మాత్రమే రచనా‌ ప్రతిభ. శిల్ప విన్యాసమే కావాలి. ఆ‌ కవిత్వం ఎవరికీ అర్థం కాకపోయినా లైబ్రరీ ర్యాకులలో చెదలు పట్టిపోయినా గతాన్ని వర్తమానంతోనూ,‌ వర్తమానాన్ని‌ భవిష్యత్తుతోనూ శిల్పాన్ని చెక్కుతుంటారు. ఈ రకమైన శిలాశాసన కవిత్వం ఎప్పుడూ వర్తమానాన్ని‌ ప్రతిబింబించలేదు. సామాజిక‌స్పృహ కంటే ఈ శిల్ప శుద్ధివాదులకు శిల్ప దృష్టే ఎక్కువ. ఒక వేళ వీరికి సామాజిక దృష్టి‌ వున్నా, వర్తమాన ప్రతిస్పందన వుండదు కాబట్టి అలాంటి‌ సుప్రసిద్ధ కవులైనా చరిత్ర పుస్తకాల్లో చెలామణీ అవుతారేమోగానీ, వర్తమాన సమాజంలో అలాంటివారి పాత్ర శూన్యమనే చెప్పాలి. కవిత్వం‌కోసం మనిషి గడ్డకట్టుకుపోకూడదు. అలలా అవిశ్రాంతంగా సామూహిక గానమవ్వాలి. ఎక్స్‌ప్రషనిస్టు‌ కవుల్ని‌ చరిత్ర గుర్తుపెట్టుకుంటుందేమో కానీ, వర్తమానం విస్మరిస్తుంది. కవిత్వం సౌందర్యాత్మకంగా‌ వుండాలి కానీ, జీవితం‌ వాస్తవికతను మర్చిపోకూడదు. కవికి సత్య నిష్ట అవసరం. కవి ఒంటరి ద్వీపమే కావచ్చు. కానీ కవిత్వం‌ ఒక సామూహిక యుద్ధం. సరిగ్గా‌ అలాంటి యుద్ధం చేస్తున్నవాడు చిత్తలూరి.

ప్రసిద్ధ కవి కె.శివారెడ్డి గారన్నట్లు “ధ్వంసం కాగలిగినదేదైనా/ ధ్వంసమై పోవాలి/ ధ్వంసం‌కాగలిగినదేదీ‌ లేదంటే/ నువ్వే ధ్వంసం కాదగినవాడివి”/ అన్నట్లు సమాజానికి దూరంగా‌‌ కాదు మరింత చేరువగా కవి,‌ కవిత్వం నిత్యనూతనంగా, సత్యదీపంగా వెలగాలి. గుణాత్మక‌ మార్పు వైపు నిలబడాలి. నిజాన్ని నిర్భయంగా‌ చెప్పగలిగే ధైర్యం‌ వుండాలి. కవిత్వమైనా,‌కథైనా,‌కళయొక్క‌ సవ్యశ్రేష్టత సమాజ పరివర్తనమే. గుణాత్మక పరిణామమే. ఘర్షణా ఘర్షణ శక్తుల ప్రతిఫలనమే. చిత్తలూరి మనిషి అలికిడిలేక…సంపుటిలోని కవిత్వం చదివినపుడు పాఠకుడికి సరిగ్గా అలాంటి భావనే కలుగుతుంది. అందుకే‌ ఒకచోటంటాడు. ఎడారుల్లా, ఒంటరి ద్వీపాల్లా మిగిలిపోయే‌ సంక్లిష్ట సమయాల్లోంచి ,సంక్షుభిత‌ సందర్భాల్లోంచి ” వెలుతురు మొలకలై” విచ్చుకోవాలంటాడు. చీకటిని స్తుతించడం కాదు. వెలుగును ప్రేమించాలి. అనేకానేక వైరుధ్యాల,‌వైవిధ్యాల అంతస్సూత్రాల్ని గ్రహించి “మనిషి అలికిడిలేని” స్థితినుండి సమూహంలో కలివిడి గానం చేయాలని సంకల్పిస్తాడీ కవి.

వ్యవస్థీకృతమైన అనేక ఆధిపత్యాల మీద,‌వివక్షతల మీద తిరుగుబాటు జెండా వుందీ చిత్తలూరి కవిత్వంలో. ప్రాకృతిక సౌందర్య లాలసలేని,రోబోటిక్ జీవన‌ గమనాలపై నిరసన వుంది. ధ్వంసమవుతున్న‌ సమస్త‌ మానవ విలువలు, సంబంధాల పట్ల ఆర్తి వుంది. శకలాలు శకలాలుగా..ఒంటరి ద్వీపాలుగా మిగుల్తున్న సమాజం‌ ఈ విపరీత ధోరణులను అధిగమించి‌ సామూహిక చేతనగా మిగలాలన్న ప్రజాస్వామిక భావన‌ వుంది. ఈ కవి కవిత్వంలో అగ్ని‌సంతకం వుంది. యుద్ధ సంగీతం వుంది. ప్రేమ, దయాస్వరాల శాంతి‌‌ సందేశం‌ వుంది. ఇక చిత్తలూరి కవితా పంక్తుల్లోకి‌ వెళితే…
ఈ సంపుటిలోని‌‌ మనిషిని‌మాత్రమే‌నేను..అనే కవితలో….మనిషిని చూస్తే చాలు/ మహోత్తుంగ తరంగమై ఎగసిపడతాను/ అప్పుడే అమ్మ‌కడుపులోంచి పుట్టినంత/ మనిషితనం‌ నాది/ మనుషులంతా‌ మంచివాళ్లేనన్న‌ ప్రేమ‌సూత్రం నాది/ అని చెపుతూ…”మనిషి నుంచి‌మనిషిని వేరు చేసే ఏ‌ సామాజిక రుగ్మతలూ/ నాకొంట పట్టవు/ అంటాడు. మనిషే నా కేంద్రం/ మనిషే నా సిద్ధాంతం/ అచ్చం మనిషిలానే‌ జీవిస్తాను/ చివరకు మనిషిలానే మరణిస్తాను/” అంటూ ఒక మానవ వాదిగా‌ మనిషి పట్ల తనకున్న అపారమైన ప్రేమనూ,‌బాధ్యతనూ,‌సరికొత్త‌‌ మానవ గీతికగా‌ కవిత్వం చేస్తాడు. మనల్ని‌ ఉలిక్కిపడేలా చేస్తాడు. గొప్ప మానవవాద‌ సిద్ధాంతాన్ని బలపరుస్తూ ఏ కుల‌మతాల‌ అంటు తగలని‌ విశ్వమానవుడను నేను అంటూ మహాకవి జాషువాను గుర్తుకు తెస్తాడు.

“ఇక్కడొక మనిషుండాలి/ కలల విత్తనాలుండాలి/ ఆనందాల మొలకలుండాలి/ తోటి మానవునికి చేయూతనిచ్చే చేయుండాలి/ బతుకుదారిలో‌ కన్నీళ్లను తుడిచే చూపుడు వేళ్లుండాలి/ ఇక్కడొక మనిషుండాలి/ ఏడీ‌ఏమయ్యాడు?/” అంటూ మనుషులు‌, మనుషులు కాకుండా‌పోతున్న‌వైనాన్ని కళ్లకు‌కట్టిస్తాడు.‌మనసును పిండేస్తాడు. ‘మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు’ అని అందెశ్రీ ఒక పాటలో చెప్పినట్లు చిత్తలూరి అనగనగా‌ ఒకప్పుడు‌ మనిషుండే వాడు అని చెప్పుకోవాల్సొస్తున్న దుస్థితిని ఊహించి వలపోస్తాడు.

‘నాకో ముఖం కావాలి’ అనే కవితలో ఏ ముఖం ఎవరిదో తెలియకుండా/ అనేకానేక‌ మాస్కులు తొడుక్కున్న ఇన్ని‌ముఖాల మధ్య/ ఏ మాస్కులేని తేటనీటిలాంటి/ పారద్రశకమైన అద్దంలాంటి/ ఒక మానవ ముఖం కావాలని/” ఆవేదన వ్యక్తం చేస్తాడు. మనుషులంతా‌ స్వచ్ఛంగుండాలని ఆకాంక్షిస్తాడు.ప్రపంచ విపత్తుగా పరిణమించిన కరోనా కాలాన చిత్తలూరి అత్యద్భుతమైన కవితలెన్నింటినో అందించారు. కరోనా సందర్భంలోంచి అనేక సంఘటనలనీ, సంఘర్షణకనీ,‌మానవ జీవన వేదననీ,విభిన్న కోణాల్లో చెప్పగలిగారు. కవిత్వాన్ని చాలా తేలిక భాషలో, అర్థవంతంగా అదియూ కవిత్వ శిల్ప గాఢత ఎక్కడా చెదిరిపోకుండా చెప్పగలగటం చాలా కష్టం. ఆ ఒడుపును చిత్తలూరి అలవోకగా‌ సాధించాడు. విపత్కర పరిస్థితుల్లో,‌సంక్షోభ సమయాల్లో కవి ఎలా ప్రతిస్పందించాలో ఆ సంఘటనల్లోని వేదనని గొప్ప కవిత్వం చేసిన తీరు పుస్తకంలోని చాలా కవితల్లో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

మనకు విద్యాబుద్ధులు చెప్పే నిజాయితీగల గురువులు,‌వారి సేవలకు ప్రతిభకు ఎలా గుర్తింపు లేకుండా పోతుందో చెప్తూ…..” ఎక్కడో ఒక మూల కూర్చుని/ నాలుగు పూల మొక్కలకు/ నడకలు నేర్పిస్తారు/ మట్టిలో అక్షరాలను చల్లుతూ/ వసంతాలను పూయిస్తారు/ చీకట్లో కొన్ని మిణుగురులను/ నేల మీద కొన్ని నక్షత్రాలను/ పోటెత్తే సముద్రాలను/ మేరుపర్వతాలనూ/ యుద్ధాన్ని గెలిచే యోధాను యోధులను/ ఓ మూల కూర్చుని నిశ్శబ్దంగా తయారు చేస్తుంటారు/ అట్లాంటి వారు ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో ఎప్పటికీ వుండరు…” పిల్లల లేలేత ఆకాశాల్లో గాలిపటాలై/ ప్రజల హృదయ మాగాణాల్లో ఆకుపచ్చని పంట చేలలా రెపరెఒలాడుతూ వుంటారంతే/” అంటూ అద్భుతమైన కవిత్వం చేస్తారు.

కవిత్వ పరుసవేది విద్యేదో తెలిసిన కవికి సముద్రంలో అలలు ఆగనట్టే…ఈ కవి నిరంతరం నూతన అంశాలను కవిత్వం ఎట్లా చేయాలా అనే ధ్యాసలోనే వుంటాడు. కాశ్మీరు విభజనను గురించి రాస్తూ…” నా యాపిల్ పండును ముక్కలు చేశారు/ నా గుండె పొలంలో స్వతంత్రంగా పెంచుకున్న మంచులాంటి ఒక ప్రత్యేకమైన యాపిల్ పండిది/ రెండుగా చీల్చి/ ఎవరికి తోచిన భాష్యం వాళ్లు చెబుతున్నారు/ కత్తికి మరింత పదును పెట్టేవాళ్లేగానీ/ నెత్తుటి మరకల్ని తుడిచేవాళ్లే లేరంటూ/” వాపోతారు. ఇట్లాంటి కవితలు చదివినపుడు చిత్తలూరి దేనినైనా కవిత్వం చేయగల దిట్ట అనిపిస్తుంది. కవిత్వం ఇతని చేతుల్లో నదై ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుంది.

జ్ణానపీఠ అవార్డు గ్రహీత డా. సినారె గారన్నట్లు” ఏమిటీ సంగతీ! ఈ రోజు నాకెందుకో ఉక్కపోస్తుంది/ ఓ అదా ఈ రోజు కవిత్వం రాసినట్టు లేదు” అన్నట్లు చిత్తలూరి కవిత్వం రాయని రోజంటూ వుండదు. ఆత్మకళకి దేహం కూడా‌ముఖ్యం. కవిత్వాన్ని మనిషిని చేస్తాడు. అవసరమైన‌చోట్ల ప్రతీకాత్మకంగానూ, పదచిత్రాలతోనూ ఆలోచింప చేస్తాడు. అద్భుత పరుస్తాడు. కవిత్వాన్ని కథనాత్మక పద్ధతిలో నడిపించటం‌ ఈతని ప్రత్యేకత.పాఠకుడ్ని చాలా చాకచక్యంగా తన కవితావరణంలోకి గాలానికి చిక్కిన చేపను లాక్కెళ్లినట్టు లాక్కెళతాడు. అమ్మ చందమామ కథ చెప్తూ గోరు ముద్దలు తినిపించినట్టు తన కవితల పొట్లం మెల మెల్లగా విప్పుతాడు. మొగ్గ పువ్వయిన సవ్వడిలా సుకుమారంగా, పరిమళభరితంగా కవిత్వాన్ని‌ మనకు అందిస్తాడు.

ఇక్కడ చూడండి…’ప్రియాంకా రెడ్డి హత్యాచారం గూర్చి ‘తనేం‌చేసింది’ అనే కవితలో “తనేం చేసింది/ మనిషంటే తనకున్న ఒక నమ్మకాన్ని / పెదాలపై చిరునవ్వును చేసింది/ ఒక ఎదురుచూపును పక్షిని చేసి/ వచ్చే దారిలో నమ్మకంగా ఎగరేసింది/ఒక నమ్మకాన్ని కొవ్వొత్తిని చేసుకుని/ రోడ్డుపక్క దీపంలా నిరీక్షించింది/” అంటూ అద్భుత కథనాన్ని కవితాత్మకంగా సమర్థవంతంగా ఆలోచనాత్మకంగా చెప్తాడు.

“ఎవరి రాత్రిని వాళ్లు/ ఒంటరిగా ఎత్తిపోసుకునే/చీకటి సమయాలుంటాయని/” ‘కునుకు చేప’ కవితలో చిక్కని కవిత్వాన్ని పోతపోస్తారు. సామాజిక ఉద్యమకారులు నిర్భంధానికి గురైన సందర్భాలను కవిత్వం చేసిన తీరు అబ్బురపరుస్తుంది ఈ యన కవితల్లో. సముద్రాన్ని మూటకట్టి గదిలో వేస్తారా?/ సూర్యుణ్ని బంధించి ఊచల వెనుక దాస్తారా?/ అని ప్రశ్నిస్తాడు ‘వీరుడు’ అనే కవితలో.

“హీరోలకు హీరో” అంటూ ఈ కరోనా సందర్భంలోనే ప్రముఖ నటుడు సోనూసూద్ గురించి రాస్తూ….ఎవరన్నారు అతను విలనని?/ అతనే నిజమైన హీరో/ హీరోలకు హీరో/ వలస పాదాలకు విమానపు రెక్కలయ్యాడు/ బస్సు చక్రాలయ్యాడు/రైలు బోగీలయ్యాడు/అలసిపోయిన వలసపాదాల ప్రయాణ పాదుకల్ని గుండెలపైన పెట్టుకుని/ మానవత్వాన్ని ఏలినవాడు/ మనిషితనాన్ని బతికించినవాడు/” అంటూ బతుకు తెర మీద నలుగుర్ని జీవింప చేసే గొప్ప హీరో గురించి చెపుతూ..” నీకెంత వుంటే ఏముంది?/ కొంతైన మరొకరికి జీవిక కాలేనపుడు/” అంటూ గొప్ప కవిత్వ హితబోధ చేస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో ఎన్ని కవితలనైనా విశ్లేషించవచ్చు.

కరోనా కాలంలో కూడా అందరికీ విశ్రాంతి వుంది. మాకు మాత్రం జీవితం ‘శ్రమ జైలు’ గానే మిగిలిందని ఈ దేశ స్త్రీ స్వేచ్ఛ ఎలా బంధించబడిందో వివరిస్తారు. జీవితంలో ఒక్క రోజైనా మా శ్రమజైలు నుంచి మాకు విముక్తి కలిగిందెపుడని?” అంటూ స్త్రీల‌ పక్షాన ప్రశ్నిస్తారు.
‘డాడీ మంచోడు కాడు’ అంటూ నాన్న యొక్క ఔన్నత్యాన్ని తను పుట్టెడు చీకటిలో మునిగివున్ననూ “తనను నమ్ముకున్నవాళ్లను/ చందమామలుగా వెలిగించి మురిసిపోయే/ రాత్రి కనిపించని సూర్యుడిలాంటి నాన్న/ మంచోడు కాడు/” అంటూ‌ నెగెటివ్ టెక్నిక్ తో నాన్నను పాజిటివ్ గా గొప్పగా అభివర్ణిస్తాడు.

ఈ దేశంలో స్త్రీల అణచివేతని గూర్చి చెపుతూ ఇంతగా అభివృద్ధి చెందిన దేశంలో ‘ ఆమె ఇంకా ఒక గుడ్డ ముక్క కోసమే వెతుక్కోవడం,‌కంటనీరు తెప్పిస్తుందంటాడు. ఈ దేశం ఆ తల్లులకు శానిటరీ పాడ్స్ కూడా ఇవ్వలేని అభివృద్ధి దేశం/ అంటూ అభివర్ణిస్తాడు. ఆమె భూమంత పరిమళమై/ ఈ దేశం ఆకాశమంత పువ్వై/ ఆత్మగౌరవ పతాకమై వుంటానంటూ/ ఒక నెత్తురు చుక్కను దాచుకోవటం/ ఇపుడు దేశమంత శానిటరీ పాడ్ కావాల్సిందేనని/ ఎలుగెత్తి నినదిస్తాడు.

తోకలు,‌ ఏం కావాలి వాళ్లకు, పిచ్చితల్లి, నాకు దేవుడు కనిపించాడు, రాకాసి ముళ్లు, హోలోకాస్ట్, ఛీ అంతా తొండి, నువ్వెన్నయినా చెప్పు తమ్ముడూ, విరిగిన చెక్క పడవ, వాసన, అనేక దృశ్యాలు, రెక్క తెగిన గాయం, పురుగు ముట్టని, నాకో రెండు చెవులు కావాలి, ఒంటరి చెట్టు, ఇలాంటి అద్భుతమైన కవితలెన్నో మనల్ని ఆలోచింప చేస్తాయి. చిక్కని కవిత్వమై పలకరిస్తాయి. “గాలిలో కొన్ని పేజీలు రెప రెపలాడితాయి/ ఏ‌ కన్నూ నెమలీకై దాచుకోదు/ అక్షరాలకూ రంగులు మొలిచి/ సీతాకోక చిలుకలై ఎగరవు/ ఏ దారపు కొసా దొరకని పతాక రెప రెపలాడని నిశ్చల స్థితి/ పిట్ట పాటొకటి చెట్టు పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది/ గాలిలో పేజీలు రెప రెపలాడుతూనే‌ ఉంటాయి/ పేజీల సందుల్లో ఇరుక్కుపోయిన పూలు/ పరిమళాల శ్వాసనొదిలి విల విలలాడుతాయి/” అంటూ‌ బతుకు ఒక బండరాయిలా మారిన నిశ్చల స్థితి గూర్చి ‘మనిషి అలికిడిలేక’పోతే ప్రకృతిది కూడా ఆత్మహత్యా సాదృశ్య స్థితేనని ప్రకృతిలో భాగమైన మనిషి ప్రకృతి విధ్వంసానికి పాల్పడకుండా ప్రకృతతో మమేకమై జీవించాలనే ఆకాంక్షతో మన ముందుకొచ్చాడీ కవి ‘మనిషి అలికిడిలేక…’ అంటూ. మొత్తం 64 కవితల పూలహారమీ పుస్తకం. ఇందులోని ప్రతి కవితా ఆలోచింపజేస్తుంది. కవితా హృదయుల్ని ఆకట్టుకుంటుంది. ఆనందింప జేస్తుంది. చదివిన పాఠకుల్ని కవుల్ని చేస్తుంది. మరెందుకాలస్యం? తప్పక చదివి తీరండి. మీకే తెలుస్తుంది ‘మనిషి అలికిడిలేక’పోతే ఏమౌతుందో!

(పుస్తకం కోసం ఈ నెంబరులో‌ సంప్రదించండి – 82474 32521)

పుట్టిన ఊరు కృష్ణా జిల్లా నూజివీడు. కవి, రచయిత, అధ్యాపకుడు. అసలు పేరు కత్తుల కిశోర్ కుమార్.  ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి.(తెలుగు) పూర్తి చేశారు. రుక్మిణి ప్రసన్నను ఆదర్శ వివాహం చేసుకున్నారు. డిగ్రీ కాలేజీలో పదేళ్లు తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. ప్రస్తుతం అరసం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా, "నెలవంక" సాహిత్య మాసపత్రిక ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

 

Leave a Reply