తిలక్ కవిగానే చాలా మందికి తెలుసు. అతను కవిగా యెంత ప్రతిభావంతుడో కథకుడిగా కూడా అంతే ప్రతిభావంతుడు. నాటక ప్రక్రియలో సైతం (సుప్తశిల) నిష్ణాతుడు. చందోబద్ధ కవిత్వం (గోరువంకలు) రాశాడు. అయినప్పటికీ అతని వచన కవిత్వమే ఎక్కువ గుర్తింపు పొందింది. పాఠకులకు దగ్గరైంది. విమర్శకులని ఆకర్షించింది. అభ్యుదయ – భావ కవిత్వాల మధ్య వారధి కట్టిన కవిగా అతను గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందాడు. శ్రీశ్రీ కృష్ణశాస్త్రుల కలయికగా వొకానొక కాలంలో జనం అతణ్ణి అభివర్ణించి ఆరాధించారు. అగ్ని చల్లిన, అమృతం కురిసిన (రాత్రి) కవితలు నాలుకమీద ఆడని కవిత్వ ప్రేమికులు ఆనాడు లేరంటే అతిశయోక్తి కాదు. పాఠ్య గ్రంథాల్లోకి సైతం అతని కవిత్వమే యెక్కువగా యెక్కింది. కథకుడిగా అతనికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. అతను రాసిన ముప్పై కథల్లో కనీసం వొక డజను కథలైనా అతణ్ణి మంచి కథకుల పంక్తిలో నిలబెట్టగలవు. మానవ సంబంధాల్లోని సంక్లిష్టతని వ్యాఖ్యానించడానికి తిలక్ కథనొక సాధనంగా యెన్నుకున్నాడు. కవిత్వంలోకి తర్జుమా చేయలేని భావాల్ని, ఆలోచనల్ని అతను తన కథల ద్వారా పంచుకోగలిగాడు. మనిషి అంతరంగ కల్లోలాన్ని ఆవిష్కరించడానికీ, వైయక్తిక సామాజిక విలువల మధ్య చోటుచేసుకునే వైరుధ్యాల్ని వొడిసిపట్టుకోడానికీ వచనం అతనికి తోడుగా నిలబడింది. కవిత్వ పరిమళాన్ని అద్దుకున్న చిక్కని వచనం జీవన తాత్వికతని ఆవిష్కరించడానికి అతనికి గొప్ప వనరుగా దోహదం చేసింది. అందువల్ల కొన్ని కథలు కవిత్వంలోని గాఢతని అందిపుచ్చుకున్నప్పటికీ యెక్కువ భాగం కథల్లో సరళమైన వచన శైలినే ఆశ్రయించాడు.
తిలక్ కథల్లో కూడా ఆశాకిరణం, ఊరి చివరి ఇల్లు, నల్లజర్ల రోడ్డు, అద్దంలో జిన్నా వంటి కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. సమాజంలో పాతుకుపోయిన విలువల మీదా, మనిషి బాహ్య అంతరంగ జీవితాల్లో వుండే ద్వంద్వ ప్రవృత్తుల మీదా అతను ఈ కథల్లో లోతైన చర్చ పెట్టాడు. అందువల్ల ఈ కథలు విమర్శకుల నోళ్ళలో యెక్కువగా నలిగాయి. వాటికి యే మాత్రం తీసిపోని కథ ‘దేవుణ్ణి చూసినవాడు’. స్త్రీల నైతికత చుట్టూ సంఘం తరాలుగా నిర్మించిన ఫ్యూడల్ విలువల చట్రాన్ని బద్దలుకొట్టిన అతి సామాన్యుడి కథ ‘దేవుణ్ణి చూసినవాడు’. కథనంలో, పాత్ర చిత్రణలో సన్నివేశ కల్పనలో, భిన్న ఉద్వేగాల మధ్య, భావాల మధ్య సంఘర్షణని చిత్రించిన సంఘటనల్లో, సంభాషణల్లో… యిలా కథలోని ప్రత్యంగంలోనే కాదు; ప్రతి వాక్యంలోనూ వొక పరిణత కథకుడిగా యీ కథలో తిలక్ మనకు గోచరిస్తాడు. ‘వెన్నెలనీ, ఉషఃకాంతినీ, మల్లెపువ్వుల్నీ, మంచిగంధాన్నీ, రత్నాలనీ కలబోసి మనమీద జల్లినట్లు (కవుల రైలు) వంటి కవితాత్మక వర్ణనలు యీ కథలో యెక్కడా కనపడవు. పాత్రలు ‘మంచు పర్వతాల అంచున దయాసరస్సుకి దక్షిణాన మంత్ర విహంగాలు మసలే చోటున – రంగు రంగుల చెట్ల నీడలలో’ సంచరించవు. నేల విడిచి సాము చేయవు. ‘దక్షిణానిలం వీచే దారినుండి దయాసరస్సులలో విహరించే రాజహంసనెక్కి నక్షత్రకిరణం మీదుగా జారుతూ (మణిప్రవాళం) వచ్చే అలౌకిక వర్తనులు’ యీ కథలో తారసపడరు. వాస్తవికతకు విఘాతం కల్గని శైలీ శిల్పాలు కథకి విశ్వసనీయతనీ విశిష్టతనీ సాధించాయి.
***
‘దేవుణ్ణి చూసినవాడు’ కథ వస్తు పరంగా, నిర్మాణ పరంగా అన్ని విధాలా ఆధునికమైనది. అయిదున్నర దశాబ్దాల కింద (1964) రాసిన యీ కథ యివాల్టికీ ఫ్రెష్ గానే కనిపిస్తుంది. కారణం : స్థల కాలాలు వేరైనా వ్యక్తులు మారినా సమాజంలో భావజాలపరంగా గుణాత్మకమైన మార్పు అంతగా చోటుచేసుకోకపోవడమే. వైరుధ్యాలను పరిష్కరించుకునే క్రమంలోనే వ్యక్తికీ సమాజానికీ నిరంతరం ఘర్షణ జరుగుతుంది.
వ్యక్తి స్వతహాగా స్వేచ్ఛాజీవి. కానీ సంఘం వ్యక్తుల నుంచి విధేయత కోరుకుంటుంది. సాధారణంగా దాదాపు అందరూ సంఘానికి, దాని మెజారిటీ భావజాలానికీ బద్ధులయ్యే నడుచుకుంటారు. ఎక్కడో యే కొందరో దాన్ని యెదిరిస్తారు. తాము నమ్మిన మార్గంలో యెన్ని అవాంతరాలు వచ్చినా పక్కకి తొలగరు. కొందరు ఆంక్షలు పెట్టినకొద్దీ మరింతగా గట్టిపడతారు. ధిక్కారాన్ని స్వభావంగా మలుచుకుంటారు. ఆ ధిక్కారం మానవీయమైనప్పుడు అదొక ఆదర్శంగా నిలబడుతుంది. అలాన్జెప్పి సమాజాన్ని ధిక్కరించడం కేవలం ఆదర్శమే కానక్కర్లేదు. అదొక అవసరం కూడా కావొచ్చు. అందుకు ధైర్యమే వుండనక్కర్లేదు. వొక మాదిరి నిర్లక్ష్యం మరొక పాటి మొండితనం వున్నా చాలు. అన్నిటికీ మించి చేతిలో నాలుగు రూకలుంటే యెవర్నీ దేన్నీ లెక్కజేయనవసరం లేదు. అయినప్పటికీ వ్యక్తుల్ని లొంగదీసుకోడానికి, అదుపులో పెట్టడానికి వ్యవస్థలు అనేక వ్యూహాలు పన్నుతాయి. శాసనాలు చేస్తాయి. ఆంక్షలు పెడతాయి. కట్టుబాట్లు విధిస్తాయి. భయపెడతాయి. బ్లాక్ మెయిల్ చేస్తాయి. ధిక్కరించినవారిని మతం పేరనో కులం పేరనో దైవం పేరనో ధర్మం పేరనో లోబరుచుకునే వరకూ వదలవు. అయినా తలవొగ్గని మనుషులే కథాశేషులౌతారు. దేవుణ్ణి చూసినవాడు కథలో గవరయ్య అటువంటి కథాశేషుడే.
గవరయ్య దుర్మార్గుడు. వికృత రూపుడు. పిసినిగొట్టు. ఎవరికీ కానీ రాల్చడు. ఒంటెత్తు మనిషి. సభ్యత లేనివాడు. ఇవి గ్రామస్తుల , మరీ ముఖ్యంగా వూరి పెద్దల (ధర్మకర్త, మున్సబు, కారణం …) అభిప్రాయాలు. కనీసం ప్రసాదం తీసుకోడానికి కూడా అతను గుడికి పోడు. అయితేనేం ధనవంతుడు. అందువల్ల యెట్లైనా చేసి అతని ధనాన్ని గుడి ప్రాకారం కట్టడం వంటి సత్కార్యాలకు (?) ఉపయోగించేట్లు చేయాలని వూరిపెద్దల ప్లాన్. అందుకు వాళ్ళు పన్నని వ్యూహం లేదు.
‘అసలు గుడెందుకు? ఆ గుడి చుట్టూ గోడెందుకు?’ ఇదీ గవరయ్య ప్రశ్న.
‘తత్వవేత్తల్నీ మహర్షుల్నీ ముప్పతిప్పలు పెట్టిన జటిలమైన యీ ప్రశ్న అతనిలో గొప్ప సాధన జరుగుతుందనడానికి సూచన’ అని వాళ్ళు పొగడ్తలతో ముంచెత్తారు. గవరయ్య వుబ్బిపోలేదు. అతని దగ్గర వో పాతిక వేలు రాబడితే గుడి ప్రాకారం తో పాటు తమ ఇళ్ల ప్రహరీ గోడలు కూడా కట్టుకోవచ్చన్న సంఘీయుల ఆలోచనలు ఫలించలేదు.
‘ఒక తోటివాడు నాస్తికుడై పాపియై పోతుంటే ఊరుకోలేని మంచితనం వలన , కార్యదీక్ష వలన’ వూరి పెద్దలతని మీద బహిష్కరణాస్త్రం ప్రయోగించారు. కానీ అదేమీ పని చేయలేదు. ఎందుకంటే గవరయ్య ఊరినే బహిష్కరించాడు.
మొదటి నుంచీ గవరయ్యకి ‘ఒకరి జోలీ, శొంఠీ అక్కర్లేదు’. సమాజంతో, దాని రీతి రివాజుల్తో పనిలేదు. వాటి అస్తిత్వాన్ని అతను నిరాకరించాడు. అతని బాల్యం అతనికి నేర్పిన జీవితపాఠం అది.
ఒక భూస్వామి చేసిన దురాగతం వల్ల అతని తండ్రి భూమి కోల్పోయాడు. సరైన వైద్యం యిప్పించలేని పరిస్థితిలో తల్లి మరణించింది. భూస్వామి కుట్ర వల్లనే తండ్రి జైలు పాలయ్యాడు.
భూస్వామికీ అతనికీ వున్న వైరాన్ని తిలక్ వర్గ శత్రుత్వంగా చూపడానికి ప్రయత్నించనప్పటికీ దానికున్న సామాజిక కోణాల్ని రచయితగా గుర్తించడమే కాదు వ్యంగ్యాత్మకంగా విమర్శించాడు కూడా. తిలక్ రచనల్లో మార్క్సిస్టు దృక్కోణాన్ని , భావజాలాన్ని చూసే ప్రయత్నం వ్యర్థమే గానీ (తిలక్ యే ఇజానికీ బద్ధుడు కానప్పటికీ అతని ఆలోచనలు నెహ్రూవియన్ సోషలిజం వైపు కొంత మొగ్గుచూపుతాయనీ కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తాయనీ నండూరి రామమోహనరావు లాంటివారు భావించడంలో తప్పులేదు) వాటిని అర్థం చేసుకోడానికి మార్క్సిస్టు సాహిత్య విమర్శ పరికరాలు తోడ్పడతాయి. మిగతా కథల మాట యెలా వున్నా ముఖ్యంగా ‘దేవుణ్ణి చూసినవాడు’ కథని విశ్లేషించడానికి తప్పక ఉపయోగపడతాయి (కథ రెండో పంక్తిలోనే ‘చైనా ఇండియా సరిహద్దుల్లో దురాక్రమణ చేసింద’న్న మాటలద్వారా, యితరత్రా వ్యక్తులపై చేసిన విమర్శాత్మక వ్యాఖ్యల ద్వారా రచయిత స్టేండ్ తెలిసిపోతుంది).
‘ఎవర్నీ నమ్మకు. నీ కాళ్ళమీద నువ్వు నుంచో, ఈ మనుషులందరూ దొంగ వెధవలు , విషసర్పాలు.’ మృత్యుశయ్యలో తండ్రి చెప్పిన మాటలు గవరయ్య మనసులో బలంగా పాతుకుపోయాయి. తల్లి దండ్రులు పోయాకా వొంటరి వాడైన గవరయ్యకి మశూచి సోకింది. అతని గురించి నరమానవులెవరూ పట్టించుకోని దుస్థితిలో తండ్రికి సన్నిహితురాలైన స్త్రీ అతణ్ణి కాపాడి, పెంచి పెద్దచేసి పెళ్లి చేసింది. మశూచి అతన్ని సమాజం నుంచి మరింత దూరం తరిమింది. పెంపుడు తల్లి చనిపోయిన తర్వాత ఆమె యిచ్చిన చిన్నపాటి ఆస్తితో మేనత్త వూరికి వచ్చి యెందరు అసహ్యించుకున్నా లెక్కచేయకుండా తోళ్ళ వ్యాపారం చేసి లక్షాధికారి అయ్యాడు.
కట్టుకున్న భార్య కాలు జారి బావిలో పడి చనిపోయింది. అతణ్ణి ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళించడానికి అదే సరైన అదను అని పెద్దలు ‘కర్మఫలం’ గురించి బోధించారు. కానీ గవరయ్య తనకంటే పదిహేనేళ్ల చిన్నదైన మరో పిల్లని రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె ‘ఎదురింటి అరుగుమీద వున్న మిషన్ కుట్టువాడితో లేచిపోయింది.’
ఒఖ్క ధర్మకార్యం చేయకపోవడం వల్లే అతనికీ ఆపదలని ప్రచారం చేశారు. ఇనుం వేడెక్కిననప్పుడే సాగగొట్టాలని అతణ్ణి తమ దారిలోకి తెచ్చుకోడానికి శతధా ప్రయత్నం చేశారు. అతనిలో దైవభక్తిని పాదుగొల్పి స్వామి కార్యం స్వకార్యం సాధించుకోవాలని గ్రామ పెద్దల పన్నుగడ.
నిజానికి గవరయ్య ముక్కుసూటి మనిషి. పన్నులు కట్టడంలో కానీ, పాలేళ్ళకి జీతాలివ్వడంలో కానీ – తన ధర్మం తాను టైముకి నెరవేర్చుకునేవాడు. ఒకరి సొమ్ము ఎప్పుడు తన దగ్గర వుంచుకోలేదు. ‘మా కామందు మహ దొడ్డ మనిషి’ అని వాళ్ళు చెప్పుకుంటారు. అతని మీద బహిష్కరణ వున్నప్పుడు సైతం డబ్బు నిక్కచ్చిగా యిస్తాడని మంగలి కోమటి చాకలి లాంటి వారు అతనికి చాటుగా సేవలందించేవారు.
తన భార్య లిద్దర్నీ అతను అమితంగా ప్రేమించాడు. రెండో భార్య దగ్గర యెవరైనా అతని రూపాన్ని గురించి గాని, వయస్సు గురించి గాని వ్యంగ్యంగా హేళన చేస్తే ‘ఆయన చాలా మంచివారు’ అని చెప్పేది. ఆ మంచితనం మీద నమ్మకం తోనే కుట్టు మిషన్ వాడి చేతిలో మోసపోయి నిండు నెలలు గర్భంతో అతిదీనావస్థలో అతని పంచకు వచ్చింది.
గవరయ్యని తమ అధీనంలోకి తెచ్చుకోడానికి యిదే అదనుగా భావించి పెద్దా చిన్నా హడావిడి మొదలెట్టారు. నీతిశాస్త్రాలు వల్లించారు. ఊళ్ళో కొందరికి యెక్కడెక్కడి పాతివ్రత్య ధర్మాలూ గుర్తొచ్చాయి. ‘లేచిపోయి కడుపులు సేసుకున్నోళ్ళని మళ్ళీ ఏలుకుంటావుంటే ఊళ్ళో పిల్లలు రెచ్చిపోరా’ అని బెంగటిల్లిపోయారు. ‘మాలగూడెంలో ఎవడికో కలరా తగిలిందనీ అందుకు కారణం యీ పాపిష్టిది వూళ్ళో అడుగు పెట్టడమే’ అని నింద వేశారు.
నిజానికి గవరయ్య భార్య తిరిగి వచ్చిన కారణంగా వూళ్ళో మార్పులేం రాలేదు. కురవాల్సిన వానలు కురుస్తూనే వున్నాయి. జరగాల్సిన వ్యవహారాలు జరుగతూనే వున్నాయి. గ్రామం వుమ్మడి సౌఖ్యాలకి ఏదీ ఆటంకం కాలేదు.
‘పంచాయితీవాళ్ళు కట్టించిన లైబ్రరీ బిల్డింగులో పేకాట సజావుగానే సాగుతోంది.’
‘ఎండైనా వానైనా గ్రామం శివార్లలో వున్న కూలీ నాలీ జనం మురికి గుంటలూ పందులూ జబ్బులూ అన్నీ సక్రమంగానే ఉన్నాయి.’
వీటిలో దేన్నీ పట్టించుకోని నీతి – ధర్మ పరిరక్షకులు గ్రామ పెద్దలు మాత్రం ‘ఆ చెడిపోయిన దాన్ని తరిమేస్తాడో లేక తనే వూరి నుంచి వెళ్ళిపోతాడో తేల్చుకోవాల’న్నారు. ఊరందరికీ అదో చోద్యమై పోయింది. ఆడదాని శీలానికి అందరూ తీర్పరులైపోయారు. లేచిపోయిన ఆడది ఊళ్ళోకి తిరిగి రావడం వూరికి అరిష్టమన్నారు.
‘ఇలా బరి తెగించినవాళ్ళు వూళ్ళో వుంటే సంసారుల గతి ఏమౌతుందో’ అని వాపోయారు. ‘లేచిపోయినదాన్ని ఏలుకుంటావా, ఎవడి వల్లో పుట్టిన కొడుకుని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటావా, ఆ పాపాన్ని దేవుడు కూడా క్షమించడ’ని వూరి పెద్దలు భయపెట్టారు. గవరయ్య భయపడలేదు. ‘ధర్మ భయం, దైవ భయం’ అతని మీద పనిచేయలేదు. సరిగదా దేవుడే తనకు కనపడి యీ పని చెయ్యమని చెప్పాడని తాపీగా అన్నాడు. ఇంతటి అన్యాయాన్ని మేం ఒప్పుకోము అన్నారు. గుడి ఛాయలకి కూడా రానివ్వం అని బెదిరించారు. మంచిగా చెబితే వినకపోతే చేతులు కట్టుకు కూర్చోమని హెచ్చరించారు. అని వూరుకోలేదు; మరోసారి వెలి వేశారు. చాకలి మంగలి పనులకే గాదు పాలేరు తనానికి, పొలం పనులక్కూడా యెవర్నీ రానివ్వమని అంతిమ తీర్పు యిచ్చారు.
‘ఇలాంటి యెదువ్వూళ్ళో వుండమన్నా వుండను. పిల్లాణ్ణి ఈ యెదవల మధ్య తిరగనివ్వను. థూ!’ అని కాండ్రించి వుమ్మి వూళ్ళో యిల్లు పొలాలు అమ్మేసి దగ్గరున్న టౌన్ కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు గవరయ్య.
నిజానికి గవరయ్య కూడా తొల్త భార్యని స్వీకరించాలనుకోలేదు. నిండు నెలలతో దీనాతిదీన స్థితిలో తన యింటి పాకకు చేరిన ఆమెలో చివరి దశలో వున్న తన తల్లిని చూశాడు. చిన్న తనంలో తనను తల్లిదండ్రులకు దూరం చేస్తున్న జనమే యిప్పుడు భార్యా బిడ్డలను తగలబెడుతున్నట్టు కలగన్నాడు. అతనిలోని మానవీయత మేల్కొంది. ఆ తల్లీ బిడ్డల్ని స్వీకరించాడు.
గవరయ్య లోని దయాగుణమే అతనికి దైవంగా సాక్షాత్కరించిది. దేవుడు అతని లోపలి మనిషే. ఆ దేవుడు పసికందును చూసి ఏడ్చాడు. అభాగ్యురాలైన స్త్రీ పట్ల పసిబిడ్డ పట్ల క్రూరంగా ప్రవర్తించగల పెద్దలు దేవుణ్ణి సైతం చంపగలరని అతను తెలుకున్నాడు. ఈ యెరుకే గవరయ్య వూరిని బహిష్కరించేలా చేసింది.
అయితే యింతకుముందు ఊరి వాళ్ళు పెట్టిన ఆంక్షల్ని తట్టుకుని ఊళ్ళోనే వుండి తానే ఊరిని బహిష్కరించిన గవరయ్య యీ సారి తిరిగొచ్చిన భార్యా బిడ్డల కోసం వూరొదిలి వెళ్ళిపోయాడు.
ఊరందరిలోనూ గవరయ్య వొక్కడే అభాగ్యురాలైన స్త్రీ పట్ల మానవీయంగా ప్రవర్తించాడు. తన ఆచరణ ద్వారా స్త్రీ పురుష సంబంధాల్లోని నైతికతకు కొత్త భాష్యం చెప్పాడు.
అయితే కథ పూర్తయ్యే సరికి మనలో అనేక ప్రశ్నలు పుడతాయి.
గవరయ్య వెళ్ళే పట్నంలో మాత్రం సమాజం లేదా? ఆ సమాజంలో జనం స్త్రీల లైంగికత పట్ల భిన్నంగా వ్యవహరిస్తారా? వుదారంగా ఉంటారా? మానవీయంగా వుంటారా? అక్కడ నీతి సూత్రాలు వేరుగా ఉంటాయా? పొరుగువాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే వెసులుబాటు తక్కువైన చోట తానూ స్వేచ్చగా బతకవచ్చని గవరయ్య భావించాడా? లేదా తన సంపదతో యెక్కడైనా చెలామణి కాగలనని భావించాడా? … వంటి ప్రశ్నలు మిగిలే వుంటాయి.
ఇన్నాళ్లూ వూరిని లెక్క చేయని గవరయ్య వూరిడిచి పోవడం అతని వోటమి కాదా? ఒక విధంగా అతని ధిక్కారమే అతని విజయం అనుకుంటే అది చైతన్యం తో కూడుకొన్నదేనా? అని మరో ప్రశ్న.
అయితే చైతన్యాన్ని యెవరు యెలా నిర్వచిస్తారు? మనిషికి, ఆపదలో వున్న మనిషికి, అండగా నిలబడటం కన్నా మించిన చైతన్యం యేముంటుంది? అలా వుండటానికీ, వ్యవస్థని వొంటరిగానే యెదిరించడానికీ దృఢంగా నిలబడ్డ గవరయ్య వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి కొలమానాలేంటి? ఆచరణని మించిన ఆదర్శం యేముంటుంది? ఈ చర్చనంతా పక్కన పెడితే అంతిమంగా గవరయ్య ఆచరించి చూపిన మానవీయ విలువ అన్నిటికంటే వున్నతంగా నిలబడి పాఠకుల్లో వుదాత్త సంస్కారాన్ని కలిగిస్తుంది. అతని పెంపకంలో ఆ బిడ్డ మంచి మనిషిగా రూపొందుతాడన్న భరోసా మిగులుతుంది. తిలక్ కథ ద్వారా ఆశించిన ప్రయోజనం అదే.
కథలో గవరయ్య ప్రదర్శించిన నిక్కచ్చితనం మానవీయ స్పందన యివాళ మన పౌర సమాజానికి చాలా అవసరం. సమాజం భౌతికంగా యెంత ఆధునికతని అందిపుచ్చుకున్నప్పటికీ మధ్యయుగంనాటి భావాలే రాజ్యమేలుతున్నాయి. వాటినే పాలకులు పెంచి పోషిస్తున్నారు. దేశభక్తినీ దైవభక్తినీ పాపభీతినీ మిళితం చేసి కుహనా ఆధ్యాత్మిక రాజకీయవాదులు గవరయ్య లాంటి వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. బతిమాలో, భయపెట్టో మనుషుల్ని లొంగ దీసుకుంటున్నారు. తమ భావజాలాన్ని అంగీకరించని వాళ్ళపై, అదుపులోకి రానివాళ్ళపై హింసాత్మక దాడులకు తెగబడుతున్నారు. పార్లమెంటు సాక్షిగా స్త్రీల విషయమై వందల యేళ్ళ కింద మనుధర్మం ప్రవచించిన విలువల్ని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకున్నారు. అందుకు రాజ్యాంగాన్ని తిరగరాయడానికి సైతం తెగబడుతున్నారు. ‘సంఘాన్నీ , ధర్మాన్నీ కాదని ఎక్కడికి పోతాడోయ్ వీడు’ అన్న ఆ వూరి ధర్మకర్త మాటలే యివ్వాళ దేశమంతటా ‘దేశం కోసం ధర్మం కోసం’ వంటి రాజకీయ నినాదాలుగా పాలకుల నోట పచ్చిగా పలుకుతున్నాయి. వాటిని తిరస్కరించిన గవరయ్య వొకవిధంగా నిజమైన నాయకుడు.
***
కథ నిర్మాణం విషయానికి వస్తే కథ నడపడంలో, యెత్తుగడ దగ్గర్నుంచీ ముగింపు వరకూ చక్కటి అల్లిక కనిపిస్తుంది. యెక్కడా పొల్లు మాట కనిపించదు.
గవరయ్య రెండో భార్య లేచిపోయిందన్న వార్తతో కథ మొదలై వూరంతటినీ యెదిరించి బిడ్డతో సహా ఆమెను స్వీకరించడం దగ్గర ముగుస్తుంది. మధ్యలో కథ గవరయ్య వ్యక్తిత్వం రూపొందడానికి కారణమైన వొకట్రెండు గతాల్లోకి వెళ్లి వస్తుంది. ఆ క్రమంలో గవరయ్య నాస్తిక్యం గ్రామ పెద్దల కుహనా ఆస్తిక్యం, గవరయ్య ముక్కుసూటి తనం అతని చుట్టూ వున్న తక్కిన కపట బుద్ధి వీటన్నిటినీ సమాంతరంగా గాక కలివిడిగా వర్ణించడం చూస్తాం. ఆ యా సందర్భాల్లో రచయిత దృక్పథం గోచరమౌతుంది. కొన్ని చోట్ల మానవ ప్రవృత్తిలోని అవలక్షణాల్ని విమర్శించడానికి రచయిత వ్యంగ్యాన్ని ఆశ్రయించాడు. అయితే అది కటువుగా వుండదు. సున్నితంగా వుంటుంది. నిశితంగా వుంటుంది. ఫ్యూడల్ సమాజంలో స్త్రీల నైతికత గురించి లైంగికత గురించి పాతుకుపోయిన విలువల గురించి స్పష్టమైన ఖచ్చితమైన సూత్రాలు నిర్వచించి వుంటాయి. వాటిని పాత్రల ముఖత: చెప్పించేటప్పుడు ఔచిత్యానికి యెక్కడా భంగం కలగకుండా జాగరూకత వహించాడు.
చివరిగా వొకమాట –
గుళ్ళూ గోపురాల్నీ కట్టి వోట్లు నోట్లు దండుకునే ధర్మకర్తృత్వ రాజకీయాల స్థానే ప్రత్యామ్నాయ ప్రజారాజకీయాల అవసరాన్ని గుర్తించడానికి మనిషిలోనే దేవుణ్ణి చూసిన గవరయ్య ధిక్కార స్వరం స్ఫూర్తి దాయకంగా వుంటుంది. అందుకే తిలక్ శతజయంతి సందర్భంగా మనిషిలోనే ‘దేవుణ్ణి చూసినవాడు’ కథ గురించి యీ నాలుగు మాటలు పంచుకోవాలనిపించింది.
మరొక్క మాట –
‘మాటలు చచ్చిపోవు. మనుష్యులు చచ్చిపోతారు. మనిషి మాటని సృష్టించాడు.’ (అద్దంలో జిన్నా) అంటాడు తిలక్ వొకచోట.
దీన్నే మరోలా చెప్పుకుందాం.
రచయితలు కథల్ని సృజిస్తారు. రచయితలు చచ్చిపోతారు. కథలు చచ్చిపోవు.
చనిపోకుండా హృదయ సంస్కారాన్ని పెంచే మంచి కథకు జేజేలు.
మంచిని పెంచే భావజాలం యెప్పటికీ చావకూడదు.
(తిలక్ శతజయంతి సందర్భంగా అమృతవర్షిణి కోసం యీ వ్యాసం రాయడానికి ప్రేరేపించిన మిత్రుడు ‘కవిసంధ్య’ శిఖామణికి కృతజ్ఞతలతో …)
కథకులు చనిపోతారు ..కథలు కావు ..అవును కదా ..ఎంత బాగా అందుకున్నారు ..సారాంశాన్ని ..అభినందనలు
ముకుంద రామారావు
హైదరాబాద్
Very nice review.
AK forty seven gun lava pelindi mee review Prabhakar annaa…