రచయితలంటే ఏం చేస్తారు? రాస్తారు… కథా, కవిత్వమా, నిడివి పెంచితే కావ్యమో, నవలో…. మధ్యలో బోర్ అనిపిస్తే ఓ వ్యాసమో అట్లా రాస్తారు. బస్! ఇంతేనా? రచయితంటే రాసేవాళ్లే కదా అనుకుంటాం, టెక్నికల్‌గా అది నిజం కూడా.
అయితే చిన్నతేడా ఉంది… రాసేవాళ్లు రాయటానికి ముందు ఆలోచిస్తారు. ఏక్కడో కదిలిన ఓ దుఃఖాన్ని, సంతోషాన్ని, కొత్త ఆలోచననీ, ఒక అడుగు ముందుకు వెయ్యాలన్న ధైర్యాన్ని…. ఇట్లా ప్రతీ భావననీ ఎంతోకొంత తనే అనుభవించాక గానీ కథకు కావలసిన అడుగు పడదు.
కొన్ని పాత్రలూ, అవి సంచరించే సమయాలూ, సందర్భాలూ, వాటి భావోద్వేగాలు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ, ఎంత మోతాదులో రావాలో అంతే పాళ్లలో సమకూర్చాలి. అంతే… సింపుల్ రాయటానికి కావాల్సిన మెటీరియల్ సిద్ధమైపోయింది. కాగితం మీదకి కథ ఎక్కేసింది. ఖతం… కథ రెడీ..!
అయితే! కుప్పిలి పద్మ కథలు రాస్తుంది… యెప్పటి నుంచీ… యేమో! నా చిన్నప్పటినుంచీ. మరి ఆ కథ రాయటానికి ముందు పైన చెప్పిన ఆలోచనలన్నీ ఉంటాయా? ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయేమో! ఎలా చెప్పగలం అంటే… ఎప్పుడైనా అమ్మో, అక్కో, చెల్లెలో, కూతురో ఇంటికి రావటం ఆలస్యం అయి, కాసేపు ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తే ఎలా ఉంటుందీ! ‘ముకుల’ కథలో “బేరింగ్ పోయిన ఫ్యాన్ చప్పుడు వినిపించినంత” అలజడిగా ఉంటుంది. కదులుతున్న ఒక్కొక్క క్షణం ఇంత మహా నగరంలోనూ సేఫ్టీ లేని తనం గుర్తొచ్చినట్టుగా ఉంటుంది…
కుప్పిలి పద్మ అంత ఆలోచించి ఉంటుంది. ఆ క్షణాల్లో మన గుండె కొట్టుకున్నదానికంటే గట్టిగా, ఆవేశంగా, దుఃఖంగా ఆలోచించి ఉంటుంది. లేదంటే జస్ట్ “జస్టిస్ ఫర్… తరువాత ఎన్ని పేర్లు రాసుంటాం సోషల్ మీడియాలో, ఎంత గట్టిగా అరిచి ఉంటాం ర్యాలీల్లో అంత యెక్కువగా యెక్కిళ్లు పెట్టేంతగా. హాస్టల్లో వాష్‌రూమ్‌కి వెళ్లాలన్నా ఒకరిని తోడు తీసుకెళ్ళాలి, పని చేసే ఆసుపత్రిలోనే నిద్రపోవాలంటే ధైర్యం కావాలి, రోజూ పని చేస్తున్న ఆఫీసులోనే జాగ్రత్తగా చుట్టూ గమనించుకుంటూ ఉండాలి… ఇలాంటి స్థితిని రాయటానికి ముందు ఆ పాత్రల మానసిక స్థితిలోకి వెళ్లటం అంత ఈజీ అయితే కాదు.
టీతోటల అందాల వెనుక, అద్భుతమైన వాతావరణం వెనుక ఎన్ని విషాదాలుంటాయో ఊహించలేం. కమ్లినీ లాంటి మనుషులు… సారీ! మనుషులు అని అంత సులభంగా అనేస్తే ఎలా? కమ్లినీ లాంటి ఆడవాళ్లు దాదాపుగా ఈ దేశంలోని 90% జనాభాకి తెలియని వాళ్లు, వాళ్లే తెలియదంటే మరి వాళ్ల కన్నీళ్లూ? నో ఛాన్స్… చదవటం పూర్తవుతుండగా కళ్లు తుడుచుకోవటం మర్చిపోయామని గుర్తొచ్చినట్టు చాలా తక్కువమందికి మాత్రమే తెలిసే బాధ అది. “మళ్లీ తేయాకు తోటల్లోకి” వెళ్లి అందాలను మాత్రమే చూసి వచ్చేయగలమా? ఒక రచయిత చదివిన వాళ్ల దృష్టినీ, దృక్పథాన్ని మార్చగలరనటానికి ఈ కథ ఒక ఉదాహరణ.
పరిచయం చేయటానికి కూడా ఇంకోసారి మనసును మెలి తిప్పుతున్న కథ ‘నా స్నేహితురాలు మణిపూర్ ఎక్స్’. ఒకానొక ప్రాంతాన్నీ, ఆ ప్రాంతపు మనుషులమీద కమ్ముకున్న నల్లని యుద్ధమేఘాలనీ చెబుతూనే… ఆ చిన్న కథలో మొత్తం భారత దేశం ఎదుర్కుంటున్న, ఎదుర్కోబోతున్న ఓ కల్లోలాన్నీ చెప్పిన తీరు హృద్యం. ఈ కథలో వాడిన మాటలకంటే ఆమె చెప్పాలనుకున్న ఆలోచనల వైశాల్యం ఎక్కువ. ఇది కుప్పిలి పద్మ రచనలో మాత్రమే కనిపించే ఒకానొక మౌన సంకేతం, సందేశం.
ఈ కథలన్నింటిలోనూ మనం గమనించే విషయమేమిటంటే, పద్మ కథలు ఎప్పుడూ పూర్తిగా పూర్తవవు… కథ చివరలో చదువుతున్న వాళ్ల ఆలోచనకి ఇంకాస్త కొనసాగింపునిస్తాయి. మిగతా ప్రయాణాన్ని పాఠకుని ఊహలమీదే వదిలేస్తాయి. ఇవి కేవలం పుస్తక పుటల మధ్య నడిచే కథలు కాదు, పాఠకుల జీవితాల్లో స్ఫురించే స్పందనలు. ముఖ్యంగా ‘ముకుల’లో ఉన్న కథల్లో కనిపించే ఏ పాత్రా మనకు తెలియనిది కదు. ఇంట్లో, అపార్ట్ మెంట్‌లో, ఆఫీసులో… మన రోజువారీ సంభాషణల్లో కనిపించే మనుషులే కొన్ని చోట్ల మనమూ ఉంటామేమో. ఈ కథల్ని చదవటం అంటే మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టు. అలాంటి అద్దాలు అరుదుగా దొరుకుతాయి.
జీవితం చాలా చెడ్డది గురూ! అనుకున్నట్టుగా ఉండకపోయినా పరవాలేదు బతకగలిగితే చాలు అనుకున్నా, ఒక్కొక్క మెట్టూ దింపటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా నువ్వు జీవితాన్ని నిలబెట్టుకోవాలని చూశావా వచ్చిపడుతుంది సమాజం… కరోనా తరువాత వచ్చిన పరిణామాల్లో కుదేలైన జీవితాలూ లక్షల్లో ఉన్నాయి. చేస్తున్న పని ఉన్నట్టుండీ పోయినవాళ్లు కొందరైతే, తెలిసిన పనిని చేసే అవకాశం కూడా పోయి పాతాళాన్ని చూసినవాళ్లెంతమందో… “ఇంద్రదనుస్సు చేజార్చుకున్న రంగుల్లో…” మనం ఊహించని ఫ్రొఫెషన్ అది, మనం ఊహించటానికి కూడా భయపడే స్థితి అది. ఈ కథ చదివాక “సంజన దగ్గర కూచుని… నక్కో బేటే, వద్దు ఏడవద్దు అని చెప్పాలనిపించి… అప్పటికే ఏడ్చేది సంజన కాదనీ నాలోలోపల ఆ దుఃఖం వస్తున్నదనీ తెలిసిన క్షణాన.. తల్లీ ఎట్లా మోయమంటావీ భారాన్ని… కథ చదువుతూనే వచ్చి ఆ చివరి వాక్యాలదగ్గర ఆగిపోయి. ఉఫ్ఫ్… ఈ దుఃఖపు కుండని నెత్తికెత్తిన రచయితల కృరత్వాన్నీ, ఆ ఆలోచనలో ఉన్నప్పుడు పడ్డ వేదననీ ఏమని అర్థం చేసుకోగలనూ.
“ఇక్కడ అందని ఊపిరి…” ఎప్పుడెప్పుడు అయిపోతుందా, త్వరగా ఈ భారాన్ని దింపేద్దామా అన్నంత ఊపిరాడని అనుభవం, భరించలేని ఇలాంటి ఒక దృశ్యాన్ని ఊహించటం, దాన్ని మళ్లీ అంతే బాధని మోస్తూ అక్షరాల్లోకి మార్చటం అంత ఈజీ కాదేమో! రాయటం ఏముందీ అని అనిపిస్తే ఈ ఒక్క కథ చదివితే చాలు… రాయటం కూడా ఎంత దారుణమైన అనుభవమో చెప్పటానికి. గుప్పెడు గాలిరా నాయనా… కాస్త ఆక్సీజన్… మనిషి లేడు ఉన్నా రాలేడు, చచ్చినా ఒక్క మనిషీ తాకే దిక్కులేదు ఎంత దారుణమైన కాలం అది. ఇలాంతి ఒక కథ కేవలం కుటుంబ సంబంధాలనో, తల్లి మరణపు దుఃఖాన్నో మాత్రమే కాదు. ఒక వ్యవస్థ వైఫల్యాన్నీ, మానవ విజయ పరిమితులనీ గుర్తు చేస్తుంది.
కొన్ని కథల శీర్షికలు పెద్దగా ఉంటాయి, ఓ వాక్యమంత పొడవుగా… కానీ అసహజంగా అనిపించలేదు. కుప్పిలి పద్మ కథల్లో ఎక్కువగా వినిపించని పేర్లు ఉంటాయీ అనుకునేవాళ్లం. అలాంటి అపరిచిత పేర్లు పాత్రలని మనకు దూరం చేస్తాయన్న అభిప్రాయమూ ఉండేది. ఈ సారి అనుకోకుండా వచ్చినవో, కావాలనే ఉద్దేశపూర్వకంగానోగానీ ఏ పాత్రా మనకి దూరం అనిపించదు. ఏ మనిషీ మనమెన్నడూ చూడని వాళ్లుగా అనిపించరు. మనవాళ్లే… మనమే… ఒక రోగం బయటపెట్టిన ఎన్నెన్నో కోణాలు, మరెన్నో సరిదిద్దుకోవాల్సిన విషయాలు, ఇంకెన్నో సాటి మనుషుల పట్ల ఉందాల్సిన ఆలోచనలు… బతకడంలో కొన్ని మెళకువళు నేర్చుకోవాల్సిందే. మబ్నిహిగా బతకటానికి కావాల్సిన అర్హత సంపాదించుకోవాల్సిందే.
ఈ కథల్లో ఏపాత్రా అత్యంత సినిమాటిక్ ఆవేశంలో ప్రసంగించదు, పనిగట్టుకొని సందేశాలూ ఇవ్వదు. ముఖ్యంగా రచయిత పాత్రలమధ్యకి వచ్చి చేసే డామినేషన్ ఉండదు. ప్రతీ కథా, అందులోని పాత్రలూ తమకు తము స్వతంత్రంగా ప్రవర్తిస్తున్నట్టూ, సహజంగా జరుగుతున్నట్టూ ఉంటుంది. కల్పించి తెచ్చిన మలుపులూ, కథని ఇలా నడపాలి, ఇక్కడ ఆపాలి ముగింపులో మెరుపు ఉండాలి అని ప్లాన్‌చేసుకుంటూ తయారు చేయబడ్డ కథలు కాదు.
ఇలాంటి కథలు రాయాలంటే చేయితిరిగిన రచయితగా ఉంటే చాలదు, చదవాలంటే అలా పుస్తక చేతిలోకి తీసుకొని రిలాక్సడ్‌గా చదివి పక్కన పాఠకుడిగా ఉండడం మాత్రమే చాలదు… మనిషిగా ఉండటం అవసరం. మనిషిగా ఆలోచించటం అవసరం. చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవటానికి బీజం పడే ఒకానొక కాలస్థలమది.
ఈ కథలని చదవటం అంటే… ఎక్కడైనా మనలో చెమ్మ మిగిలి ఉందా అని ఇంకోసారి తరచి చూసుకోవడం, రెండు కన్నీటి బొట్లతో సమాజంతోనూ, మనుషులతోనూ ఉండే బంధాలకు కాస్త స్పందనని నేర్పడం…