మనం ఎప్పటికీ ఒంటరి కాము

ప్రియ మిత్రమా,

మనం కలిసి జీవించడానికి ఈ ఏడాది మార్చి 2 కి 30 ఏళ్లు పూర్తయ్యాయి. నీకు గుర్తుందో లేదో కానీ నీవు అదే రోజు ఫోన్ చేసి మాతో మాట్లాడేవు. గుర్తు చేసే సందర్భంలో నేను లేను, గుర్తించే స్థితిలో నువ్వు లేవు. రాజ్యం కర్కశత్వానికి అంతమంటూ లేదు. ప్రాణాలు నిలబెట్టుకునే పోరాటంలో పెళ్లి రోజు, పుట్టిన రోజు తలచుకునే, పంచుకునే సందర్భాలు శూన్యం. రాజ్యం దయతలచి ఇచ్చిన ఆ కొన్ని క్షణాల్లో ఎంతో పంచుకోవాలనే ఆరాటం నీకూ, నాకూ. ఎన్నో విషయాలు పెదవి దాటక ముందే ముగిసిపోయే ఫోన్ కాల్. ఈ ఏడు సంవత్సరాలుగా జైలులో నీకు మన మాతృ భాష అయిన తెలుగు పుస్తకాలు చదవడానికి తెలుగులో లెటర్స్ రాయడానికి అనుమతి లేదు కదా ! తెలుగులో లేఖ రాయడానికి, చదవడానికి నీవు ఎంతగానో తపించిపోయి వుంటావు. తెలుగు తప్ప, ఇంగ్లీష్ లో ఉత్తరం రాయడం రాని నేను నీ కంటే మరింత వేదన పడి ఉంటానని నువ్వు ఊహించే ఉంటావు. ఇప్పటికైనా ఈ తెలుగు లేఖ అందుతుందో లేదోననే సందేహమే. నా మనోభావాలను మోసుకొచ్చే ఈ లేఖ నీ చేతుల్లోకి చేరుతుందనే నమ్మకం లేదు. అయినా నా మనసు కాస్త కుదుట పరచుకునేందుకు అయినా నీతో వెచ్చగా నాకు తెలిసిన మా అమ్మ ఉగ్గుపాలతో నేర్పిన నా మాతృభాష తెలుగులో ఈ లేఖ రాస్తున్నా.

నేను నీకు తెలుగులో ఉత్తరం రాసి బహుశా 30 సంవత్సరాలు అయి ఉంటుంది. మన పెళ్లికి ముందు ఎన్నో ఉత్తరాలు పేజీలకు పేజీలు ఇద్దరం ఒకరికొకరం రాసుకున్నాము. అవి యవ్వనప్రాయపు ప్రేమ లేఖలు. ప్రేమ లేఖలు అప్పుడు ఎంతో మాధుర్యాన్ని, ప్రేమను, ఆశలను నింపుకుని వచ్చేవి. ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, కన్నుల నిండుగా కాంతిని, పెదవులను వీడని దరహాసాన్ని, మనో ధైర్యాన్ని నింపే ఆ స్నేహ వీచికలు మరపురానివి. నాకు బాగా గుర్తు ఇవన్ని మనం మన వరకే పరిమితం చేసుకోలేదు. మన చుట్టూ ఉన్న వారిని కూడా స్నేహించే, ప్రేమించే, ఆదరించే, అనురాగం కురిపించే నైజాన్ని అందరితో పంచుకోనేవాళ్ళం. మురిపాలు, ముచ్చట్లు మరెన్నో సంగతులు మోసుకొచ్చేవి ఆనాటి లేఖలు. పేద, ధనిక తారతమ్యాలు లేని, కుల మత భేదాలు లేని సమసమాజ స్వప్నాలను వీక్షించే ఆనాటి మన లేఖలలో ‘సప్రత్’ (ద్వేష భావం) కు తావే లేదు.

ఈనాడు నిర్బంధం నీడలో, భారమైన హృదయంతో, రాయలేని నిస్సహాయతతో, ఛిద్రమైన మనస్సును కూడగట్టుకుని నీకు ఈ లేఖ రాస్తున్నాను. సాయీ, నీకు గుర్తుందా?! మనం పదో తరగతి ట్యూషన్ లో మొదటి సారి కలిసినప్పుడు నీకు రాని లెక్కల సబ్జెక్ట్ లో లెక్కలు ఎలా చేయాలో నేను నేర్పించాను. నీవు నాకు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేవాడివి. ఆ తరువాత పుస్తక పఠనం, సాహిత్యమే మన స్నేహాన్ని స్థిరపరిచాయి. మన చిన్నతనం నుంచి ఒకరికొకరం చూసుకోకుంకుండా నాలుగు రోజులు దూరంగా ఉండడం ఎంతో కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఏళ్లకు ఏళ్లు దూరంగా, ఎల్లలు లేని దూరంతో జీవించాల్సి వస్తుంది. అదీ ఒక తప్పుడు కేసులో మే 9, 2014 అరెస్ట్ వల్ల, న్యాయ వ్యవస్థకు వ్యతిరేకమైన తీర్పు వల్ల, మార్చి 7, 2017 జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసిన గడ్చిరోలి సెషన్స్ కోర్టు తీర్పు వల్ల. ఆ తీర్పులో న్యాయమే లేదు. డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ పరిగణనలోకి తీసుకోనే లేదు. ఈ అన్యాయానికి అంతం లేదు.

ఈ ఏడాది మార్చి 7 న నీ నుండి వచ్చిన లేఖలోని మాటలు ఈ సందర్భంగా గుర్తుకు వస్తున్నాయి – “ఈ రోజుతో శిక్ష పడి జైల్లోని ఈ అండా సెల్ లో నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఇలా జరుగుతుందని ఊహించలేదు. మన కుటుంబంలో ఎవరూ అనుకోలేదు. న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నది ఈ తీర్పు. ఈ నాలుగేళ్లు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలా గడిచాయి.” నీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంటే ఆందోళనతో నా తల పగిలిపోతుంది. వేళ కాని వేళ లాయర్ నుండి ఫోన్ వస్తే గుండె వేగం మరింత పెరిగిపోతుంది. ఎలాంటి స్థితి మనం ఎదుర్కోవలసి వస్తుంది! అక్కడ నీవు, ఇక్కడ మేము.. ఇలా ఇంకా ఎంత కాలం?!

పోలియో వాక్సినేషన్ లేని ఆ రోజుల్లో ఐదు సంవత్సరముల వయసులోనే నీకు పోలియో వచ్చి నీ రెండు కాళ్ళు దెబ్బ తిని నడవలేని స్థితికి మిగిలిపోయావు. నీ జీవితంలో చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నావు. చుట్టూ పచ్చని చేలతో పట్టుమని 20 గుడిసెలు లేని చిన్న వూర్లో నువ్వు పుట్టావు. నడవలేని నువ్వు పదో తరగతి జిల్లా స్థాయి లోనే మొదటి స్థానం పొందటం సామాన్య విషయం కాదు. పూరి గుడిసెలో, కిరోసిన్ దీపంలోనే నీ చదువంతా సాగింది. నువ్వు డిగ్రీ పూర్తి చేసి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో M.A. English literature లో సీట్ సంపాదించావు. అప్పటి వరకూ నీవు అమలాపురం, తూర్పు గోదావరి జిల్లా దాటి వెళ్ళింది లేదు. అలాంటిది ట్రైన్ లో మొట్ట మొదటి సారిగా హైదరాబాద్ కు వెళ్ళడం, విశాలమైన విశ్వవిద్యాలయ ప్రాంగణం, లైబ్రరీ, తోటి విద్యార్థులతో చర్చలు ఒక కొత్త ప్రపంచం నీ కళ్ళ ముందు కదలాడింది కదా! నీవు హైదరాబాద్ లో, నేను అమలాపురంలో ఉన్నా మనం ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ కాలేదు. ఎందుకంటే మన మధ్య దూరాన్ని దూరం చేసేవి మనం రాసుకునే ఉత్తరాలు.

మనం ఓ మారుమూల పట్టణంలో డిగ్రీ వరకు చదువు సాగించినా మన ఆలోచనలూ, మన భావాలు ఆదర్శవంతంగా ఉండడానికి సాహిత్యమే ప్రధాన కారణం. ఆ కాలంలో మనం రాగూర్, ప్రేమ్ చంద్, పెరియార్, శరత్, చలం, శ్రీశ్రీ, కొకు, కారా, రంగనాయకమ్మ… తదితర ఎంతో మంది సాహిత్యాన్ని ఎంతో ఇష్టంగా చదివాం. హైదరాబాద్ వచ్చాక మన ఆదర్శాలు ఆచరణాత్మక రూపం తీసుకోవడంలో అప్పటి కార్మిక, కర్షక, విద్యార్థి, మహిళా ఉద్యమాల ప్రభావం ఎంతో ఉంది.

నన్ను చాలా మంది నిన్నే జీవిత భాగస్వామిగా ఎందుకు ఎంచుకున్నా నని ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు. అలా అడుగుతున్న అందరికీ నేను చెప్పేది ఒక్కటే – ఈ పితృస్వామిక సమాజంలో స్త్రీలను అణచివేస్తూ ఎప్పుడూ రెండో స్థానమే ఇచ్చారు. కానీ నువ్వు ఎప్పుడూ స్త్రీలకు సమాన హక్కులు ఉండాలనీ, భావ ప్రకటన స్వేచ్చ ఉండాలనీ అనే వాడివి. సమాజ పురోగమనంలో స్త్రీల భాగస్వామ్యానికి ఎంతో విలువైన స్థానం ఉందని చెప్తూ స్త్రీలను ఎంతో గౌరవించేవాడివి, ప్రోత్సహించే వాడివి. అందుకే నేను నీ సాహచర్యం జీవితాంతం ఉండాలని కోరుకున్నాను. చాలామంది మన ప్రేమని ‘నిజమైన స్వచ్చమైన ‘ ప్రేమకు గొప్ప ఉదాహరణ అని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. స్వేచ్చగా, హాయిగా, ఉల్లాసంగా మనం ప్రేమను పంచుకున్నాం. అలాగే మన చుట్టూ వున్న ఎంతో మందితో ఆత్మీయ అనురాగాలను, స్నేహాన్ని, ప్రేమను పంచుకున్నాం. కానీ ఇప్పుడు రోజులు ఎంత గడ్డుగా నడుస్తున్నాయి అంటే ప్రేమ అనే పదం నేర జాబితాలో చేరిపోయింది. ప్రేమ జంటలను తన్ని తరిమి బోనుల్లో పెడుతోంది ఒక వర్గం. ద్వేషం ఎటు చూసినా విషకోరలు చాస్తూ హింసను ప్రేరేపిస్తుంది.

చాలా మంది నీవు చిన్నప్పటి నుండి వీల్ చైర్ ఉపయోగించే వాడివని అనుకుంటారు. కానీ నీవు 2008 వరకూ వీల్ చైర్ లేకుండానే రెండు చేతులకు హవాయి చెప్పులు వేసుకుని భుజాల పై శరీర బరువును వేసి మారు మూల ప్రాంతాలతో సహా దేశం మొత్తం తిరిగావు అని చెప్తే ఆశ్చర్య పోతుంటారు. వీల్ చైర్ కొనుక్కోలేని శ్లోమత, వీల్ చైర్ తిరిగేంత పెద్ద ఇంటికి కిరాయి ఇవ్వలేని స్థితిలో మనమున్నాం కదా! నీవు నీ త్రీ వీలర్ కైనెటిక్ హోండాని స్వయంగా నడుపుతూ కాలేజికి, ఇతర చోట్లకు వెళ్లే వాడివి. కాలేజ్ చేరుకున్నాక అక్కడ వుండే వీల్ చైర్లో క్లాస్ లకి వెళ్ళేవాడివి.

హైదరాబాద్ యూనివర్సిటీలో M.A. తరువాత, 1991 లో CIEFL (ఇప్పటి EFLU) నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ (PGDTE) చేసావు. అదే కాలంలో మార్చి 3 న అందరి సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ ప్రకటన చేసి, మనిద్దరం కలిసి జీవన యాత్ర ప్రారంభించాం. అతి ఖర్చు, హంగామాగా, సాంప్రదాయబద్ధంగా చేసే పెళ్ళిళ్ళ పట్ల నమ్మకం లేని మనం చిన్న టీ పార్టీలో మన మిత్రులతో మనం కలిసాము. సాయీ! మనం ఆ పార్టీ కి కేవలం మనం 600 రూపాయలు ఖర్చు పెట్టామంటే ఎవరైనా నమ్మగలరా!

హైదరాబాద్ రావడంతో ఒక విధంగా మన భావాలకు, మన కలలకు, ఆచరణకు పదును పెట్టే అవకాశం దొరికింది. మనం కలలుగన్న కుల మత బేధాలు లేని, స్త్రీ పురుష వివక్ష లేని సమసమాజం సాధించగలం అనే ఒక భరోసా, దానిని ఆచరణాత్మకంగా మలచుకునే అవకాశం కలిగింది.

అందరిలా నడవ లేకపోతున్నందుకూ, అన్ని చోట్లకు మిగతావారిలా చేరుకోలేకపోతున్నందుకు, నీ మనసులో ఓ మూల చిన్న బాధ ఉండేది. ప్రభుత్వం దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా వారికి అనుకూలంగా అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ సంస్థల నిర్మాణాల్లో మార్పులు తీసుకురావాలని చట్టాలను అయితే చేసింది కానీ ఆచరణ శూన్యమే. దాంతో ఎన్నో చోట్ల నువ్వు ఎన్నో అవస్థలు పడ్డావు. అయినా ఆదివాసీ, దళిత, మైనారిటీ, మహిళల హక్కులకై నినదించడంలో, ప్రజా ఉద్యమాలలో ముందున్నావు. ఉద్యమం మన జీవితంలో అవగాహనను, స్పష్టతను పెంచింది. ఏ రంగంలో అయినా నీ ఏకాగ్రత, నీ కఠోర పరిశ్రమ నీకు విజయాలతో పాటు అనేకమంది మిత్రులను చేరువచేసింది. ఉద్యమం నీకు కాళ్ళై నడిపించింది. నీ కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు ఏనాడూ నీకు ఆ లోటు తెలియనివ్వలేదు. నీ నిస్వార్థ ఉద్యమ ఆచరణ నిన్ను ప్రజలకు మరింత చేరువ చేసింది.

సాయీ, నీవు దివ్యాంగుల కొరకు, ముఖ్యంగా అకాడెమిక్ రీసర్చ్ వర్క్ కి అనుకూలంగా ఉంటుందని ఎన్నో ఆశలతో దేశ రాజధాని ఢిల్లీలో అడుగు పెట్టావు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో Ph.D. కొరకు, ఉద్యోగం కొరకు నీ ప్రయత్నాలు కొనసాగాయి. నిజానికి ఢిల్లీలో విపరీతమైన ఎండ, చలి వాతావరణం నీ శరీరానికి సరిపడనివి. నువ్వు నడుమునొప్పి, కాళ్ళలో నరాలు మెలి తిరగడం వలన ఎంతో బాధను భరిస్తూ వుంటావు. అయినా నీ జిజ్ఞాస నిన్ను ఇవన్నీ తట్టుకునేలా చేసింది. నీ ప్రయత్నాలు ఫలించి 2003 లో రామ్ లాల్ ఆనంద్ కాలేజ్, ఢిల్లీ విశ్వ విద్యాలయం (DU) లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఇంగ్లిష్ విభాగంలో జాయిన్ అయ్యావు. టీచింగ్ పట్ల, ప్రొఫెషన్ పట్ల నీ అంకిత భావం, నిబద్ధత నిన్ను ఒక మంచి గురువుగా విద్యార్థుల మనసులలో సుస్థిర పరచింది. తోటి అధ్యాపకులలో కూడా గౌరవ స్థానం పొందావు. మంచి స్కాలర్ గా మెప్పు పొందావు.

నీకు సాహిత్యం లానే టీచింగ్ కూడా చాలా ఇష్టం. సాయీ, చిన్నప్పటి నుండి నీవు పరీక్ష ఫీజు కోసం, పుస్తకాల కోసం నీ జూనియర్స్ కి ట్యూషన్ చెప్పేవాడివి. ఆరోజుల్లో కూడా పేద, వెనుకబడిన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు తీసుకోకుండా చెప్పేవాడివి. విద్యార్థులకు ఏ సమయంలో అయినా సందేహాలు తీర్చడానికి అవసరమైన పుస్తకాలు, నోట్స్ ఇవ్వడానికి, చర్చించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవాడివి. ఎంతో క్లిష్టమైన అంశాలను అవలీలగా అర్థం చేయించడంలో ముందుంటావు. సాయి, ఈ విషయంలో మన బిడ్డ కూడా నీ బాటే. నీకు తెలియదు కదా – ఎంతో సులువుగా, మృదువుగా అర్ధం అయ్యేలా చెప్పే విధానం మెచ్చుకోదగ్గది. నువ్వుంటే ఎంత మురిసిపోయే వాడివో కదా అని అనుకుంటూ ఉంటాను.

సాయీ, నువ్వు ఒక్క రోజు కూడా క్లాస్ తీసుకోకుండా గానీ క్లాస్ కి ఆలస్యంగా గానీ వెళ్ళింది లేదు. సందేహాలు తీర్చడానికి ఒక్క విద్యార్ధి కోసమైనా, క్లాస్ రూమ్ ఖాళీ లేకున్నా గార్డెన్ లో నైనా క్లాస్ తీసుకునే కొనసాగించావు. నిరంతరం ఆలోచించడం, చదవడం, రాయడం, భావాలకి నూతనత్వంతో పదును పెట్టడం, విజ్ఞానాన్ని పది మందికి పంచడం ఇదే కదా నీ జీవన శైలి!

యూనివర్సిటీలో అడ్మిషన్స్ అప్పుడు రిజర్వేషన్స్ సరిగా అమలు చేయక ఎంతో మంది గ్రామీణ విద్యార్థులు నష్టపోతున్నారని నువ్వు, మీ కొలీగ్స్ కలిసి రిజేర్వేషన్స్ అమలు కొరకు ఎంతో పోరాటం చేసారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ఎంతో మంది విద్యార్థులకు ఫీజు కట్టడానికి, హాస్టల్ రూం దొరికే వరకు ఆర్థికంగా సహాయం చేసేవారు.

సిలబస్ తయారు చేయడంలో, ప్రశ్నా పత్రాలు తయారుచేయడంలో, సెమినార్స్ కండక్ట్ చేయడంలో ఇలా అనేక అకడెమిక్ అడ్మినిస్ట్రేషన్ కమిటీల్లో భాగమై పని చేశావు. కౌన్సిలింగ్ అవసరమైన విద్యార్ధులకి విడిగా శ్రద్ధ తీసుకుని బాధ్యత వహించావు. ఇలా నిరంతరం నీవు నీ ఉపాధ్యాయ వృత్తికి అంకితమై పని చేశావు. అందుకే నువ్వంటే నీ విద్యార్ధులకి, నీ సహ ఉద్యోగులకి ఎంతో ప్రేమ, గౌరవం. అలా తపనతో విద్యార్ధులని ప్రతిభావంతంగా క్లాస్ లోనే కాదు జీవితంలో కూడా వుండే విధంగా మలచినవాడివి. అలాంటి నిన్ను డిసిప్లినరీ ఏక్షన్ క్రింద 2021 తప్పుడు ఆరోపణ, అబద్దపు తీర్పు వలన. నాకు తెలుసు, ఈ వార్త నీవు తట్టుకోలేనిది.

నీవు ఒకసారి లెటర్లో “నేను ఇప్పటికీ క్లాస్ రూమ్ లో విద్యార్ధులకి పాఠాలు బోధిస్తున్నట్లే కలలు కంటున్నాను. క్లాస్ రూమ్, బ్లాక్ బోర్డు, విద్యార్ధులు లేకుండా నా జీవితం వూహించలేనిది” అని రాశావు. ఆ లెటర్ చదువుతుంటే కళ్లెంట నీళ్ళు తిరిగాయి.

నీకు జీవిత ఖైదు వేయడానికి ఎంత కుట్ర జరిగిందో, కాలేజీ నుండి, టీచింగ్ ప్రొఫెషన్ నుండి నిన్ను తొలగించడానికి కూడా అంతే కుట్ర జరిగింది. అవే శక్తులు పనిగట్టుకుని నిరంతరం వెంటపడి నోటిసుల మీద నోటీసులు పంపిస్తూ మనల్ని నిరంతరం వేధించారు. అక్రమ సింగిల్ మాన్ కమిటీలు ఏర్పాటు చేసి, క్రమశిక్షణా రాహిత్యం అని ముసుగు వేసి నీపై చర్య తీసుకున్నారు. ఏడు సంవత్సరాలుగా యూనివర్సిటీ వారితో ప్రజాస్వామిక హక్కుకై నీ స్థానం కొరకై పోరాడి పోరాడి చివరికి అన్యాయమైపోయాం. స్వార్ధపరుల కులీన కుట్రలకి ఒక నిస్వార్ధ ఉపాధ్యాయుడికి జరిగిన అన్యాయం ప్రజలందరూ గుర్తించారు. సాయీ, నువ్వేం బాధ పడకురా! జైలు బయటకి వస్తే ఈ విశాల ప్రపంచం అంతా నీ క్లాస్ రూమే. అలసిపోయేవరకు బోధించడానికి నీకు ఎంతో అవకాశం వుంది.

ఏంట్రా! చదువుతూ చదువుతూ తూలి పడుతున్నావా? చేతులు పట్టు తప్పుతున్నాయా? పట్టు లేని ఆ చేతులని మరింత శ్రమ పెట్టకు. తరువాత చదువుకుందువులే. అసలు ఇప్పుడు రెండు చేతులు కూడా పని చేయని పరిస్థితికి నెట్టింది ప్రభుత్వమే కదా! ప్రజాస్వామ్యం కరువైన ఈ ప్రజాస్వామిక ప్రభుత్వం నీ పట్ల ఎంత క్రూరంగా వ్యవహరిస్తుందో చాలా మందికి తెలియదు. రెండు కాళ్ళు కదపలేకున్నా నీ రెండు చేతులే నీ బలం. అది తెలిసే ఆ రెండు చేతులని పని చేయలేని నిర్వీర్య దశకి చేర్చేసింది రాజ్యం .

ఆ రోజులు నేను ఎప్పటికీ మరువలేను . ఎంతో కుట్రతో ఒక పధకం ప్రకారం సెప్టెంబర్ 12, 2013 నాడు మధ్యాహ్నం యూనివర్సిటీ క్వార్టర్స్ లో వున్న మన ఇంటి పై 50 మంది సివిల్ డ్రస్ లో వున్న పోలీసులు దాడి చేసి నీ ల్యాప్ టాప్, మన ఫోన్స్, హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లు, కొన్ని పుస్తకాలు సీల్ చేయకుండా తీసుకువెళ్లారు. ఆరోజు మన ఇంటిపై దాడి చేయడానికి తీసుకువచ్చిన వారెంట్ లో ఏముంది? మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో అహేరీ అనే ప్రాంతంలో దొంగతనం జరిగిందని ఆ చోరీ సామాను ప్రొఫెసర్ సాయిబాబా ఇంట్లో వుందని అనుమానంతో సెర్చ్ చేయడానికి వారెంట్ తో వచ్చారనే విషయం చెపుతుంటే అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇంకా విచిత్రమేమంటే ఇప్పటికీ ఆ చోరీ సామాను ఏమిటి, ఎవరివి అనే విషయం లోకల్ పోలీసులకు గానీ, మనకు గానీ, ప్రజలకు గానీ తెలియదు.

ఆ తరువాత జనవరి 2014 లో ఇంటరాగేషన్ పేరుతో మళ్ళీ మనింటికి వచ్చారు. మనకు మద్దతుగా అనేకమంది ప్రజాసంఘాల నాయకులు, ప్రొఫెసర్లు, పేరున్న మేధావులు,సామాజిక కార్యకర్తలు, ముఖ్యంగా విద్యార్ధులు ఎంతో మంది మన ఇంటి ముందు, మన వీధిలో నిండి పోయారు. దాంతో ఆరోజు రాకుండా పోలీసులు మరో తారీఖు త్వరలో చెప్తామని తోక ముడిచారు. హఠాత్తుగా ఒకరోజు నోటీస్ ఇచ్చి ఎంతో మంది బలగంతో పెద్ద పెద్ద వాహనాలతో వచ్చి ఆ వీధిని నింపేశారు. అయినా అప్పటికప్పుడు అంత తక్కువ వ్యవధిలో కూడా అనేకమంది విద్యార్ధులు, ప్రొఫెసర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మరలా మనకి మద్దతుగా ఇంటి వద్దకు చేరుకున్నారు కదా! అనేక మంది మీడియా వాళ్ళు కూడా రాత్రి వరకూ నిన్ను ఇంటర్వ్యూ చేస్తూనే వున్నారు.

ఇవన్నీ నీకు తెలిసిన విషయాలే… మళ్ళీ నీకు చెప్తున్నాను ఏంటి అనుకుంటున్నావా? తలుచుకోక తప్పటం లేదు. నిర్బంధంగా వాళ్ళు ఎత్తుకు వెళ్ళిన సాంకేతిక పరికరాల్లో గతంలోని మన చిన్ని చిన్ని జ్ఞాపకాలు, భవిష్యత్ ప్రణాళికలు మనకి కాకుండా చేశారు కదా! నీవు ఎంతో కష్టపడి తయారు చేసుకున్న స్టడీ మెటీరియల్స్, బోర్డ్ ఎగ్జామ్స్ ఇవ్వబోతున్న మన అమ్మాయి స్టడీ మెటీరియల్స్, నా అభిరుచి అయిన ఫోటో క్లిక్స్, మన బంధువుల, నా మిత్రుల, కుటుంబ సభ్యుల అరుదైన మరచిపోలేని జ్ఞాపకాలుగా ఉన్న ఫోటోలు అన్నీ ఎత్తుకెళ్లారు కదా… నేను నా ఫోన్లో బంధించిన ఆ అందమైన, మధురమైన క్షణాలు, జ్ఞాపకాలు పోయాయనీ, నీవు రాయాల్సిన కొత్త పుస్తకాల మెటీరియల్ అంతా పోయిందని చాలా కాలం దిగులుగా ఉండేది మనసులో.

ఇక మే 9, 2014 న గొప్ప నాటకీయంగా కాలేజ్ నుండి వస్తున్న నిన్ను దారి కాచి ఎత్తుకెళ్లి సరాసరి డిల్లీ ఎయిర్ పోర్ట్ కి తీసుకు వెళ్ళారు. కాలేజ్ నుండి బయలుదేరిన నువ్వు ఎంతకీ ఇంటికి రాకపోయే సరికి చాలా ఆందోళన పడ్డాను రా. నీకు ఏమైందో తెలియక స్థానిక పోలీస్ స్టేషన్ లో నీ ఆచూకీ తెలపాలని, మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను. ఆ తరువాత అరెస్ట్ గా ప్రకటించారు. ఇప్పటికీ చాలా మందికి ఈ విషయం తెలియదు. నిన్ను బలవంతంగా మహారాష్ట్రలోని నాగపూర్, అక్కడి నుండి గడ్చిరోలి తీసుకెళ్ళారు. నాగపూర్ నుండి గడ్చిరోలికి అత్యంత అధునాతన ఆయుధాలు ధరించిన కమెండోస్ తో నిండిన పెద్ద పెద్ద యాంటి ల్యాండ్ మైన్స్ వెహికిల్స్ లో, నీవు ఉన్న వాహనానికి ముందూ, వెనక ఎస్కార్ట్ గా పెట్టి తీసుకువెళ్ళారని చెప్పావు. రమా రమీ 20 వెహికిల్స్ అలా వరసగా SLR తో నాలుగు వైపులా గురి పెట్టిన కమెండోస్ తో ఒక కరుడు గట్టిన తీవ్రవాదిని తీసుకువెళ్తునట్లు పెద్ద హంగామాగా తీసుకువెళ్ళారని అన్నావు. మీడియాలో ముఖ్యంగా మరాఠీ మీడియాలో మావోయిస్టు లీడర్ని పట్టుకున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ట్రయల్ నడుస్తున్నప్పుడు నాగపూర్ నుండి గడ్చిరోలి ట్రయల్ కోర్టుకు కూడా ఈ విధమైన ఎస్కార్ట్ తో అనేక సార్లు తీసుకు వెళ్ళేవాళ్ళు. దారిలో వున్న చిన్న గ్రామాలను దాటుకుని వెళ్తున్నపుడు ఆ కాన్వాయ్ వలన ట్రాఫిక్ జామ్ తో గ్రామస్తులు అవస్థలు పడే వారు. చివరికి నాగపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్ళినా ఎంతో మంది కమెండోస్ కూడా ఉండేవాళ్ళు. ఈ హంగామా అంతా ప్రజల్లో భయం పుట్టించడానికే. నిన్ను దేశద్రోహిగా చిత్రీకరించడానికి, మీడియా ద్వారా ప్రచారం చేయడానికి, ఎన్ ఐ ఎ వాళ్ళు శాయశక్తులా కృషిచేశారు. అదంతా అక్కడి మరాఠీ మీడియాలోనూ, గోడీ మీడియాలోనే కానీ, మిగతా మీడియాలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నీ అక్రమ అరెస్టు, నీ వృత్తి, నీ సామాజిక కార్యక్రమాలు గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది. దేశవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా నీ అరెస్టును ఖండిస్తూ వెనువెంటనే అనేకమంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు, పత్రికా ప్రకటనలు ఇచ్చారు.

సాయీ, 72 గంటలు నిన్ను కనీసం మూత్రానికి కూడా పోనీయకుండా, అత్యవసరంగా తీసుకోవల్సిన బిపి మెడిసిన్ కూడా తీసుకోనీయకుండా, ఆ పెద్ద వాహనాలలో నిన్ను ఒక ఇసుక బస్తాను పడేసినట్లు ఎత్తిపడేసారని చెప్పావు. నీ ముక్కు నుండి చెవుల నుండి రక్తం కారిపోయిందని తలంతా బ్లడ్ బంప్స్ వచ్చాయని నీవు చెబుతుంటే నా మనసు ఎంత విలవిలలాడిందో చెప్పలేను. ఒక దివ్యాంగ వ్యక్తిని, వీల్ చైర్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని కమెండోల, పోలీసుల క్రూరత్వం వలన నీ వీల్ చైర్ పాడయింది. అంతకంటే నీ ఎడమ చేయి లోపల నరాలకి గాయమైంది. నీవు 24 గంటలూ తీవ్రమైన నొప్పితో బాధ పడినా పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఊరుకున్నారు తప్ప, వెంటనే వైద్యం చేయించలేదు. దాంతో నీ ఎడమ చేయి నరాలు, మజిల్స్ డ్యామెజ్ అయ్యి, సమస్య ఇంకా ఇంకా పెరిగి చివరికి నీ ఎడమ చెయ్యి పనిచేయకుండా పోయింది. నీ మానసిక స్టెర్యాన్ని దెబ్బ తీయాలన్న దురాలోచనే ఇది.

2019 లో నీ ఎడమ చేయిలో కలిగిన ఇన్ఫెక్షన్ కి కూడా సకాలంలో సరైన వైద్యం చేయించనందువలన ఆ ఇన్ఫెక్షన్ కుడిచేతి నరాలకి ప్రాకి ఇప్పుడు నీ కుడి చేయి కూడా పూర్తిస్థాయిలో పని చేయని స్థితికి చేరుకుంది. కుడిచేయి పార్షియల్ గానే పని చేస్తున్నందువలన నీవు ఇప్పుడు లెటర్స్ తరచుగా రాయలేని స్థితికి చేరుకున్నావు. నీ రెండు చేతులే నీకు కొండత బలం. నీ మేధస్సు, బలమైన చేతులతో దేశవిదేశాలు తిరిగావు. అనేక యూనివర్సిటీల్లో అకాడమిక్ సెమినార్స్ అటెండ్ అయ్యావు. ఎక్కడా డిసబిలిటీ అడ్డురాని నిన్ను అండా సెల్ లో వేసి, పూర్తి నిర్జీస్థితికి నెట్టివేసింది రాజ్యం.

జైలు క్లిష్ట పరిస్థితులు నీకు 19 రకాల తీవ్ర అనారోగ్య సమస్యల్ని జత చేసింది. అసలే నడవలేని నీవు, చేతులు కూడా చచ్చుపడిన స్థితిలో, జైలులో కనీసం టాయిలెట్ కి వెళ్లలేని పరిస్థితి లో వున్నావు. నిరంతరం ఇద్దరు మనుషుల సహాయంతో జీవనం సాగించవలసిన కఠినమైన కారాగార శిక్ష ఇది. అత్తమ్మ Lymphatic కాన్సర్ తో, అనారోగ్యంగా చివరి దశలో వున్నప్పుడు, ఆమె చివరి కోరికగా నిన్ను చూడాలని ఎంతో తపన పడింది. అప్పుడు పెట్టుకున్న పెరోల్ కి అనుమతి ఇవ్వలేదు. చివరికి నిన్ను ఎంతో ప్రేమతో, అపురూపంగా పెంచిన అమ్మ చనిపోయినప్పుడు కూడా నీకు పెరోల్ ఇవ్వలేదు. నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు. దిగజారుతున్న నీ ఆరోగ్య పరిస్థితి పై మెడికల్ గ్రౌండ్స్ లో వేసిన బెయిల్ కూడా తిరస్కరించారు. మాఫియా గూండాలకి, అధికార పార్టీ నాయకులకి, హంతకులకి మాత్రం చాలా సునాయాసంగా బెయిల్ దొరుకుతుంది. సాక్ష్యాధారాలతో పట్టుబడినా, ట్రయల్ కోర్టులో గర్వంగా నేరం అంగీకరించిన వారు సైతం పరచిన అధికారపు కార్పెట్ పై గర్వంగా నడుచుకుంటూ, జైలు గోడలను సునాయాసంగా దాటి వచ్చేస్తారు. ఆ తరువాత ఎలక్షన్లలో పాల్గొని పార్లమెంటులో తిష్ట వేస్తారు. అంతేకాదు ఆపై కేసులన్నీ కూడా కొట్టివేయడం జరుగుతుంది. కానీ 90 శాతం డిసబిలిటీతో వీల్ చైర్ లో వుండే, రెండు చేతులు కూడా పని చేయలేని, స్వయంగా టాయిలెట్ గదికి కూడా వెళ్ళలేని, స్నానం చేయలేని, తిండి తినలేని, తనకు తానుగా మంచం పై పడుకోలేని, లేవలేని పరిస్థితుల్లో వున్న ఒక ప్రొఫెసర్ కి మాత్రం బెయిల్, పెరోల్ ఏదీ దొరకదు. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ నుండి డిసబిలిటి రైట్స్ విభాగపు ప్రత్యేక ప్రతినిధులు మానవ హక్కుల కొరకై నీ అలుపెరుగని పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని , విషమిస్తున్న నీ ఆరోగ్య పరిస్థితికి స్పందించి నిన్ను వెంటనే విడుదల చేయాలని చాలా సార్లు ప్రకటనలు ఇచ్చారు. మెడికల్ గ్రౌండ్స్ లో బెయిల్ ఇవ్వాలని భారత ప్రభుత్వానికి అప్పీలు చేసారు కూడా. అయినా ఎంతటి నిర్బంధం. నీపైనే ఎందుకు ఇంత కక్ష?

నాగపూర్ వాతావరణం నీ ఆరోగ్య స్థితికి అనుకూలించనిది. విపరీతమైన ఎండ, చలి, వానలను నీ పోలియో ప్రభావిత శరీరం తట్టుకోలేకపోతుంది. నడుమునొప్పి, కాళ్ళ నొప్పి మరింత పెరుగుతాయి. చలి కాలం నరాలు మెలితిరిగి నువ్వు పడే బాధ తలచుకుంటే ఎంతో బాధగా వుంది. ఇంటి వద్ద హీటర్ పెట్టుకున్నా గానీ నీ కాళ్లు మంచులా చల్లగా వుండేవి. అక్కడ చుట్టూ ఎత్తైన గోడలు, పై భాగం సగం ఓపెన్ గా వుండే తలుపు లేని ఇనుప రాడ్లతో వుండే అండా సెల్ లో చల్లని గాలికి నీవు కప్పుకునే ఆ ఒక్క రజాయి కూడా చల్లగా నీళ్లతో తడిసినట్టే వుండి వుంటుంది.

Transfer of Prisoners Act, 1950 ప్రకారం శిక్ష పడిన ఖైదీకి హోం టౌన్ జైలుకి ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం వుంది. జైలు ట్రాన్స్ ఫర్ కోసం కూడా అనేక సార్లు మహారాష్ట్ర గవర్నర్ కి అప్పీల్ చేసుకున్నాం. నాగపూర్ సెంట్రల్ జైలు, మహారాష్ట్ర నుండి చెర్లపల్లి జైలు, హైద్రాబాద్ కి బదిలీ కొరకు అమ్మ, నేను అనేక సార్లు మహారాష్ట్ర గవర్నర్ కి ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇచ్చాము. గవర్నర్లు, ప్రభుత్వాలు మారిపోయారు కానీ ఇప్పటి వరకూ ఏ జవాబు దొరకలేదు. బెయిల్ అయినా, పెరోల్ అయినా, జైల్ ట్రాన్స్ఫర్ అయినా, వైద్యం కొరకైనా రాజ్యాంగ పరంగానే నీ విడుదల కొరకై నిరంతరం పోరాడుతున్నాము. ఈ నిస్సహాయ స్థితిలో నీ పాత ఉత్తరాలు ముందేసుకుని చదువుతూ ఉండగా నీవన్న మాటలే ఇలా గుర్తు చేసుకున్నాను. “జైలు ఒక దుర్మార్గమైన వ్యవస్థ. నిజమైన నేరస్తులను సైతం మించిన నేర వ్యవస్థీ జైలు. మానవ సమాజ చరిత్ర మీద ఒక పెద్ద అవమానకర మరక. ప్రాణాలను నిలబెట్టుకునీ బ్రతకడమే జైలులో ఒక మహా పోరాటం. మన ప్రేమ ప్రపంచంలోని సుందర స్వప్నాలను పదే పదే జ్ఞాపకం చేసుకోవడం వల్లే నేను ఇక్కడ జీవించగలుగుతున్నాను. నీ నుంచి వచ్చే ప్రతి ఉత్తరం ఆ జ్ఞాపకాలను వరదలా మోసుకు వస్తుంది. నీ లేఖ కోసం ఎదురు చూస్తూ నీ తలపులలో నివసిస్తాను” అన్నావు.

సాయీ! ఇంకో విషయం తెలుసా? జైలు ములాఖాత్ కొరకు అన్ని మైళ్ళు ప్రయాణించి నీతో మాట్లాడాలని ఎంతో ఉత్సాహంగా వస్తానా, అంతే నిరాశగా వెనుతిరుగుతాను. మొట్ట మొదటిసారి నేను జైలు ములాఖాత్ లో నిన్ను కలవడానికి వచ్చినపుడు ములాఖాత్ ఇవ్వడానికి తిరస్కరించారు. ఎందుకంటే నా ఇంటిపేరు నీ ఇంటిపేరు ఒకటి కాదని, నేను నీ భార్యనే అని ఎలా నమ్మేది అని అన్నారు. పితృస్వామ్య ఆధిపత్యానికి నిదర్శనమైన ఇంటిపేరు మార్పిడిని అంగీకరించని మన ఆదర్శం జైలు వాళ్ళకి ఏం అర్ధమవుతుంది? ప్రతిసారి ఇలాంటి ఏవో చిన్న సాకులతో ఇబ్బంది పెడుతూనే వుంటారు. మన మధ్య విండో కి గీతలు పడ్డ పైబర్ గ్లాస్ అడ్డుగా ఉండడంతో మసకగా ఒకరికొకరు చూసుకో లేని స్థితి, కిటికీ అవతల నీవు ఇవతల నేను ఫోన్లో వినేది ఎంత బాధాకరం. ఉదయం నుండి పడిగాపులు పడితే చిట్ట చివరికి ఇక ములాఖాత్ టైమ్ ముగిసి పోయేటప్పటికి నిన్ను తీసుకువస్తారు. ఒక 20 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తారు. అంతా కళ్ళు మూసి తెరిచే లోపు ముగిసిపోతుంది. ఇంకా ఎన్నో విషయాలు నీతో పంచుకోవాలని అనుకున్నవి మిగిలే పోతాయి. హృదయం భారమైపోతుంది. నిన్ను కలిశాను అన్న ఆనందం క్షణంలో ఆవిరి అయిపోతుంది. ఏదో తెలియని దిగులుతో తిరుగు ప్రయాణం అవుతాను. ఒక్కసారైనా నీ చేతిని నా చేతిలోకి తీసుకుని గట్టిగా కరచాలనం చేయాలనే నా ఆశను జాలి ములాఖాత్ నిలువునా వేరు చేస్తుంది.

ఒకసారి నేను ములాఖాత్ కి వచ్చినపుడు నిన్ను హాస్పిటల్ కి తీసుకు వెళ్ళబోతున్నారని తెలిసి, జైల్ గేట్ (లోపలి ద్వారం) వద్దకు వచ్చి అడిగితే ఎవరూ సరియైన జవాబు ఇవ్వలేదు. నన్ను అక్కడ నిలబడవద్దని వెళ్లగొడితే జైల్ మెయిన్ గేట్ (నిన్ను తీసుకువెళ్ళే దారి) వద్ద నీ కొరకు ఎదురుచూస్తూ వున్నాను. అరగంట పైగా అలా ఎండలో ఎదురు చూడగా, చూడగా సడన్ గా పెద్ద వాహనాలు ముందు వెనుక ఎస్కార్ట్ గా ఉండగా మధ్యలో కారులో వున్న నిన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చినా ఆపలేదు. గట్టిగా అరచి నిన్ను పిలిచే వరకూ నేను వచ్చినట్లు కూడా నీకు తెలియలేదు. తరువాత నేను గవర్నమెంటు హాస్పిటల్ కి వచ్చాను. నిన్ను తీసుకువెళ్లిన డిపార్ట్ మెంట్ కారిడార్ లో అడుగు పెట్టాను. నీవు ఏ రూంలో వున్నది తెలియక గట్టిగా నేను ‘సాయి నేను హాస్పిటల్ కి వచ్చాను కానీ నన్ను నీ దగ్గరకి రానివ్వడం లేదు’ అంటూ అరచి చెప్పాను. బదులుగా నీ గొంతు ఏదో ఒక రూమ్ లోంచి వినిపించింది. ఏవో టెస్టులు వున్నాయి అవి అయ్యాక కలుద్దామని. వైఫ్ ని అనుమతించమని అడుగుతున్నాను కానీ వినటం లేదు అని అన్నావు. ఉదయం 12 గంటల నుండి సాయత్రం 5 గంటల వరకు గాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్ మెంట్ ముందు వుండే లాంజ్ లో నీ కోసం ఎదురు చూస్తూనే వున్నాను. కాస్త అటుగా నీ వైపు అడుగు కూడా కదపనీయకుండా లేడీ కానిస్టేబుల్స్ నన్ను చుట్టు ముట్టే వున్నారు. ఏ టైంలో నైనా నిన్ను బయటకు తీసుకు వస్తారు అని తినడానికి క్యాంటీన్ కి కూడా వెళ్లకుండా అలా ఎదురు చూస్తూనే వున్నాను. 5 గంటల తర్వాత లేడి కానిస్టేబుల్స్ చాయ్ తాగమని క్యాంటీన్ చూపిస్తాం పదమని నా వెంట పడ్డారు. ‘నిన్ను హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు, నన్ను అనుమతిస్తారు, రాత్రికి ఇక్కడే వుండొచ్చు’ అని లేడీ కానిస్టేబుల్ చెప్పింది. అయినా నేను అనుమానంతో అక్కడ నుండి కదల్లేదు.

అంతలో సడన్ గా పదిమంది పోలీసులు నిన్ను చుట్టుముట్టి వీల్ చైర్ ని తీసుకువెళ్తూ ఉండగా, వాళ్ళ కాళ్ళ సందులో నుండి నీ వీల్ చైర్ చక్రాన్ని చూసి నిన్ను తీసుకెళ్తున్నారని గ్రహించాను. పరిగెత్తుకుని నీ వైపు రాబోయే సరికి మహిళా కానిస్టేబుల్స్ నన్ను పట్టుకుని వెనక్కి లాగుతూ ఆపడానికి ప్రయత్నించారు. అక్కడే వున్న స్థంభాన్ని గట్టిగా పట్టుకుని లిఫ్ట్ వైపు తీసుకెళ్తున్న నీతో ‘హాస్పిటల్ లో జాయిన్ చేస్తున్నారా? ఏ విషయం తెలియ లేదు, నాకు వీళ్ళేమో హాస్పిటల్ జాయిన్ చేస్తున్నామని చెపుతున్నారు’ అని అన్నాను. నీవు, నాతో ఒక్క నిమిషం మాట్లాడనివ్వమని బ్రతిమాలుతున్నా కూడా వినకుండా నిన్ను లిస్ట్ లోకి తీసుకుపోయారు. లిప్టులో నుండి నువ్వు ‘రేపు జైల్ ములాఖాత్ కి రా, హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం లేదు’ అని చెపుతుండగానే లిఫ్ట్ కిందికి పోయింది. ఆవిధంగా తెలిసింది నువ్వు హాస్పిటల్ లో అడ్మిట్ కావడం లేదనే విషయం. కానీ అంత నిర్దాక్షిణ్యంగా, ఒక్క నిమిషం కూడా మాట్లాడనీయకుండా నిన్ను తీసికెళ్ళిపోయే సరికి ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. సుడులు తిరిగిన దుఃఖం కంటి నుండి నీరుగా బయటకు రాకుండా ఎంతో కష్టపడ్డాను. మన కన్నీరు వాళ్లు తమ శాడిజానికి విజయ సంకేతంగా భావిస్తారు. అందుకే నేను మనసులో ఎంత దుఃఖమున్నా వాళ్ల ముందు ఏడవకుండా స్థిరంగా ఉంటాను. నాకు అంతా అయోమయంగా ఉంది. అసలు నీకు ఏమైంది? ఎందుకు తీసుకు వచ్చారు? సాయంత్రం వరకూ ఏం టెస్టులు చేశారు? అని ఆందోళనతో ఉన్న నన్ను ఒక నిమిషం మాట్లడనిస్తే ఏమైతది? అంతా తమ అధికార అహంకారం చూపించుకోవడం తప్ప. ఖైదీలకు అనారోగ్యంగా ఉండి హాస్పిటల్ కు తీసుకువెళ్లినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ని కలుసుకోనీయడం సర్వసాధారణ విషయమే.
కానీ నీ విషయంలోనే ఇంత నిర్బంధం.

చివరికి కోర్ట్ అనుమతితో నిన్ను ICU లో ఉంచినప్పుడు కలవగలిగాను. ICU లో ఎలుకలు తిరగడం, బాత్ రూం ల అశుభ్రత చూసి, ఆసుపత్రి అధ్వాన స్థితికి షాక్ అయ్యాను. వీల్ చైర్ ఫ్రెండ్లీ
టాబ్లెట్ ఆసుపత్రిలో ఒక్కటీ లేదు. నీకు జైల్ కంటే నరకంగా ఆసుపత్రిలోనే ఉంది.

మన కుటుంబం ఎదుర్కొంటూ వచ్చిన ఈ గడ్డుకాలం 2020 మార్చి నాటికల్లా దేశ ప్రజలందరి గడ్డుకాలంగా మారిపోయింది. రాజ్య నిరంకుశ అహంకారానికి కరోనా పెద్ద వంకయింది. వైరస్ విలయతాండవం నలుదిక్కులా పెచ్చరిల్లింది. న్యాయం కోసం చేసే ప్రయత్నాలు కూడా దీర్ఘకాలికంగా నిశ్శబ్దాన్ని చవి చూసాయి. కరోనా నిర్బంధ కాలంలో జైలు ములాఖాత్ లేదూ, న్యూస్ పేపర్లు లేవు. పోస్టల్ సర్వీసెస్ లేకపోవడం తో పలకరింపుల కోసం కనీస ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు. నీవు ఎలా ఉన్నావో, ఆరోగ్యం ఎలా ఉందో తెలియక, ప్రతిసారీ నీకు నెల నెలా పంపాల్సిన లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ అందించే మార్గం తెలియక ఎంత క్షోభను అనుభవించామో తెలుసా?

కరోనా కాలంలో ఖైదీలను బెయిల్, పెరోల్ పై విడుదల చేయాలని, కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడించాలని సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా నాగపూర్ లో అమలుకు చాలా సమయం తీసుకున్నారు. అత్తమ్మ చనిపోయినప్పుడు నీకు పెరోల్ నిరాకరించడానికి కరోనా సాకు చూపించారు. పోనీ జైల్లో నీకు కరోనా రాకుండా ఆపగలిగారా?! జైలు కెపాసిటీ కి మించి ఎన్నో రెట్లు ఖైదీలను నింపుతుంటే కరోనా ప్రోటోకాల్ అయిన సానిటైజేషన్, భౌతిక దూరం, శుభ్రత, ఎప్పటికప్పుడు పరీక్షలు ఇవన్నీ జైల్లో పాటించడం అసంభవం. అండా సెల్ లో నీకు కూడా వైరస్ సోకి నీ ఆరోగ్యం మరింత దిగజారిపోయింది. ఒకపక్క కరోనా ఎంతో మంది ప్రజల ప్రాణాలను మింగేస్తుంది, అనేక మంది అమాయక ప్రజలు, వలస కార్మికులు కరోనా వైరస్ కు, ప్రభుత్వ నిరంకుశత్వ విధానాలకు బలయిపోయారు.

అలాంటి గడ్డు రోజుల్లో కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఎంతగానో ఉన్న స్థితిలో, తప్పని పరిస్థితులలో ఖైదీల హక్కుల అమలుకై అక్టోబరు 2020లో పది రోజులు నిరాహార దీక్షచేపట్టావని లాయర్ ద్వారా తెలుసుకున్నప్పుడు చాలా ఆందోళన చెందాము. నీవు నిరాహార దీక్ష చేయడం మాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే బలహీనంగా ఉన్న వాళ్లు కరోనా వస్తే తట్టుకోవడం కష్టం, నీతో ఒక్కసారి మాట్లాడి ఎలాగైనా నిరాహార దీక్ష చేయకుండా ఆపాలనే ఉద్దేశంతో జైలుకు అనేక సార్లు ఫోన్ చేశాం. నీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోడానికి జైలుకి ఫోను చేస్తే ఏమీ చెప్పేవారు కాదు. చివరికి నీ దీక్ష ఫలితంగా ఖైదీలందరికీ వారానికి ఒక ఫోన్ కాల్ కుటుంబ సభ్యులకి, మరొక కాల్ లాయర్ కి చేసుకునే అవకాశం కల్పించారు. మేము పంపిన మెడిసిన్ సకాలంలో అందివ్వడానికి, న్యూస్ పేపర్, మెడికల్ రికార్డ్స్, తెలుగులో లెటర్స్, పుస్తకాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ ఆ టైంలో ఎంత టెన్షన్ కి గురయ్యానో చెప్పలేను. ఒకపక్క సరైన వైద్యం లేక అనేక ఆరోగ్య సమస్యలతో బలహీనంగా ఉన్నావు. సాయి, ఇలా నిరవధిక నిరాహార దీక్ష చేస్తే ఎలా చెప్పు? నీ మీద చాలా కోపం వచ్చింది. అంతే బాధ కూడా? టెన్షన్ తో నా తల నరాలు చిట్లిపోతాయేమో అననిపించేది. ఎన్నో రాత్రులు నిద్రలేక అవస్థపడ్డాను.

చివరికి మొట్టమొదటిసారిగా నీవు తెలుగులో రాసిన ఉత్తరాన్ని 45 రోజుల తర్వాత 21 జనవరి, 2021 న అందుకున్నాను. నీ ఉత్తరం మొదట యాంటి నక్సల్ టీం వద్దకి స్క్రూటినీ కొరకు వెళ్లి ఆ పై పోస్టు చేస్తారని అందుకే ఆలస్యంగా అందుతాయని తర్వాత తెలిసింది. నీ ముత్యాల్లాంటి అక్షరాల వెంట పరుగులు తీస్తూ జైలులో నీవు అనువదించిన ఫైజ్ కవిత్వం చదువుతుంటే నాకు రెక్కలు వచ్చినట్లు అనిపించింది.

ఆ లెటర్ లో నీవు కరోనా కాలం గురించి అన్న మాటలు నిజం. “జైలుగోడలకు కరోనా లాక్ డౌన్ గోడలు తోడయి అంధకారంలో మగ్గుతూ వచ్చాను. ఇంతటి భయంకర నిరంకుశ కాలం మధ్యయుగాల నిరంకుశ శాసన పైశాచికత్వాన్ని దాటిపోయింది. కరోనా వైరస్ కరోర నిర్బంధం జైలును ఒక కాన్సంట్రేషన్ క్యాంపుగా, బయట ప్రపంచాన్ని ఒక పెద్ద జైలుగా మార్చి వేసింది. జైలు గోడల బయట మీరందరూ అంతటి నిరంకుశత్వాన్ని అనుభవించవలసిన పరిస్థితులు చూస్తే జైల్లో ఉన్న మా స్థితిని నువ్వు ఊహించగలవు. కరోనా వైరస్ ప్రాణాంతకమైన మహమ్మారి అయితే ప్రజలే దాన్ని ఓడించగలిగే వాళ్ళు కానీ కరోనా వైరస్ నీడలో తెచ్చిన లాక్ డౌన్ ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేసింది. కరోనా వైరస్ అణచివేతకు ఒక పనిముట్టు అయ్యింది. మాకు కరోనా వైరస్ పెద్దమహమ్మారి కాదు. మా స్వేచ్ఛను హరించిన నిరంకుశత్వమే ప్రజలందరికీ ఒక పెద్ద మహమ్మారి”.

“దుర్మార్గమైన తీర్పు వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయినా ఇంకా అండా సెల్ లోనే మగ్గిపోతున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కో యుగంలా నడిచింది. ఎన్నో సార్లు ఆరోగ్య పరిస్థితి విషమించి ఇక ఎంతోకాలం బతకడం కష్టం అనిపించింది. అయినా ఏదో విధంగా అనుకోని రీతిలో ప్రాణం బలీయంగా నిలబడ్డది” అన్నావు. నిజం సాయి, ఇదంతా నీ మనోధైర్యం, ప్రజల పట్ల నీకున్న అపారమైన ప్రేమ, విశ్వాసం వల్లే సాధ్యపడింది.

చివరికి 2018 నవంబర్ నుండి ఇవ్వాల్సిన మెడికల్ రిపోర్ట్స్ ఈనాటికి జైలు వాళ్ళు ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ చూసిన మన ఫ్యామిలీ డాక్టర్స్ నీ ఆరోగ్య పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని అన్నారు. కార్డియాలజిస్ట్ గుండెకు రక్తం సరిగ్గా ప్రసరించటం లేదని, అర్జంటుగా కొన్ని టెస్టులు చేయాలని అన్నారు. తరచుగా సృహ తప్పి పడిపోవడం, చెస్ట్ పెయిన్ రావడం నిదర్శనమనీ, ఈసారి స్ట్రోక్ వస్తే, ఎమర్జెన్సీ ఎక్విప్ మెంట్ లేకుంటే కష్టమే అన్నారు. ఆర్థోపెడిక్ సీరియస్ నెస్ కూడా ఎక్కువగానే ఉన్నది. వెంటనే ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, టెన్స్ అండ్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్ అత్యవసరంగా ప్రతిరోజూ అందియ్యాలని చెప్పారు. వెన్నెముక చివర బెండ్ అయిందనీ, గాల్ బ్లాడర్ లో స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్, బ్రెయిన్ లో సిస్ట్, స్లీప్ ఎప్నియా సమస్యలు వున్నట్లు రిపోర్ట్ చెప్తున్నాయి. లెఫ్ట్ సైడ్ అట్టోమిన్ లో హ్యూజ్ లంప్ ఫామ్ అయి విపరీతమైన నొప్పితో, నడుం, షోల్డర్ లో షూటింగ్ పెయిన్ తో 24 గంటలు బాధ పడుతున్నావు అని అనేకసార్లు చెప్పావు. కోవిడ్ సోకక ముందే ఈ బాధలన్నీ వున్నట్లు మెడికల్ రిపోర్ట్ చెబుతున్నాయి. ఇక పోస్ట్ కోవిడ్ తరువాత విపరీతమైన అలసట, బలహీనత ఇంకా కొనసాగుతూనే ఉంటుంది కదా.

జైలులో ఖైదీలకు పౌష్టికాహారం దొరుకుతుంది అనుకోవడం ఒక భ్రమే. జైలులో పండ్లు ఇతరత్రా ఏమైనా కొనుక్కోవాలి అంటే ధర ఎక్కువ చేసి అమ్ముతారు. నెలకి 3,500/- రూపాయలు మాత్రమే పంపడానికి మాకు అనుమతి ఉంది. రోజువారీ అత్యవసరాలైన సబ్బు, టూత్ పేస్ట్, పోస్టల్ స్టాంప్ లు, కవర్లు, వార్తా పత్రికలు ఇంకా కొన్ని పళ్ళు కనుక్కోడానికి ఆ పైసలు ఏం సరిపోతాయి?!

ఈ సుదీర్ఘ ఎడబాటు క్రమంగా మానసికంగా, శారీరకంగా నన్ను క్రుంగదీస్తుంది. మెనోపాజ్ తరువాత ఎనీమియా, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఎక్కువయ్యాయి. దేశంలో 90 శాతం స్త్రీలు ఈ బాధలు పడుతున్నారు. ఇపుడు నీవు వుంటే నా గురించి ఎంతో కేర్ తీసుకునేవాడివి. గిన్నెలు తోమడంలో, కూరగాయలు తరిగి ఇవ్వడంలో, బట్టలు ఫోల్డ్ చేయడంలో, డస్టింగ్ లో ఎప్పుడూ ఎంతో బాధ్యత తీసుకునేవాడివి. బయట నుండి వచ్చేటప్పుడు కావాల్సిన సరుకులు నువ్వే తెచ్చేవాడివి. వీల్ చైర్ వెళ్ళే వీలున్నంత వరకూ నీవు అనేక ఇంటి పనుల్లో భాగమయ్యేవాడివి. కానీ సాయి, నీవు నా ఆరోగ్యం గురించి బెంగ పెట్టుకోవద్దు. ఎటువంటి ఆదుర్గాకు లోను కాకుండా ధైర్యంగా వుండు. ధైర్యం, సహనం, పట్టుదలతో మనకు న్యాయం దొరికే వరకు, నిన్ను విడుదల చేసే వరకు పోరాడే స్ఫూర్తి నాకు నువ్వే.

రాత్రి అందమైన కలలో నేను వీల్ చైర్ లో వున్న నీ మెడ చుట్టూ చేతులు వేసి నా చెంపలు నీ మోముకు ఆనించి ఎన్నో సంగతులు చెపుతూనే వుంటే నీవు చిరునవ్వుతో ఆలకిస్తున్నా వంట. ఎంత ఆహ్లాదంగా ఉన్నది కదా ఈ కల! నీవు రచించే నవల చెపుతుంటే, నేను టైపు చేస్తున్నట్లు, నీ గుండెల్లో ఒరిగి గూడుకట్టుకున్న బాధను వూరడిస్తున్నట్లు, మన కూతురుతో లిటరరీ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నట్లు ఎన్నో ఊహలు. ఇలా మరెన్నో అనుభూతులు కలగా మిగలకుండా నేను చేసే పోరాటానికి వున్నంతలో నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో సుమా! ఈ నిర్భంధం త్వరలోనే తొలగిపోతుంది. నీవు నా దగ్గరకు చేరుకుంటావు.

నాకు దూరంగా వుండలేక నీవు కూడా ఎంత దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నావో నాకు తెలుసు. “రాజ్య వ్యవస్థ సమాజాన్ని, ప్రజలను పీల్చి పిప్పిచేసి గుల్లగా తయారు చేస్తున్నట్లే నా శరీరాన్ని సర్వ నాశనం చేస్తుంది. నేను బయటకు వచ్చేటప్పటికి ఎంత మిగులుతానో తెలియదు” అన్నావు. అదే నా భయం కూడా. అన్ని రకాలుగా నార్మల్ గా వున్న వాళ్ళే జైల్లోని కఠినత్వాన్ని తట్టుకోలేరు. అలాంటిది నీకు ఇంకెంత కష్టమో కదా! అయినా నీవన్నట్లుగా “మనం మన గురించి విషాదంగా భావించకూడదు. విషాదం సమాజంలోనే వుంది. మానవ చైతన్యాన్ని నిర్బంధించే సమాజ వ్యవస్థ విషాదాన్ని కాక మరి దేన్ని తీసుకు రాగలదు ఆ విషాదాన్ని అధిగమించడమే మన విజయం. రాజ్యం తెచ్చిన నిర్భంధంతో పాటు చుట్టూ వున్న వాళ్ళు చేస్తున్న అవమానాల్ని మనం భరించవలసి వస్తుంది. ఈ పరిస్థితి నుండి బయట పడడానికి ఓపికతో పాటు చాకచక్యం కూడా కావాలి” అని అన్నావు.

సాయి, నీవన్న ఈ మాటలు నిరంతరం స్మరణ చేసుకుంటాను ” సమాజ పరివర్తన కోసం, ప్రజల కోసం నిలబడడం అన్నిటికన్నా కష్టమైన పని. జీవితాన్నే పణంగా పెట్ట గలిగిన వారే జీవితం చివరివరకూ ఆ పనిని చేయగలుగుతారు. దీనికి నువ్వు తల ఎత్తుకుని తిరగ గలగాలి. కానీ మానసిక ఆవేదనకు గురి కాకూడదు. ఎవరు ఏ విధంగా అవమానిస్తున్నా లెక్క చేయకుండా సరైన మార్గాన్ని వదలకుండా నీవు ముందుకు వెళ్లు. ఈ కష్ట కాలం నుండి, నేడు సమాజంలో ఆవరించి ఉన్న పరిస్థితుల నుండి బయట పడే రోజులు ఎంతో దూరం లేవు. చివరి వరకూ నిబ్బరంగా నిలబడిన వారే చరిత్రలో మిగిలిపోతారు”.

ఫోన్ లో ఎంత మాట్లాడినా అవి ఉత్తరాలకు సరితూగలేవు. కాల్స్ ద్వారా అప్పటికప్పుడు తాత్కాలిక సమాచారాన్ని అందించుకోగలం. స్వయంగా మనం మాట్లాడుకుంటున్నప్పటికి భావరాహిత్యంగానే ఉంటాయి ఆ మాటలు. అదే ఉత్తరాల్లో అయితే మన మనసులో అంతర్గతంగా ఉన్న భావాలను, ప్రేమను, ఆప్యాయతను, బాధను ఒకరికొకరు పంచుకుంటూ మనం ఒకరికోసం ఒకర్ని పంచుకోగలుగుతాం. కానీ ఫోన్ కాల్స్ ములాఖాత్ వరకు మన మధ్య ఏర్పడే జాప్యాన్ని మాత్రమే తగ్గించగలుగుతాయి.

నవంబర్ 1 నుండి మహారాష్ట్రలో జైలు ములాఖాత్ మొదలు పెట్టారు. ఫోన్ కాల్స్ ఆగిపోయాయి. 20 నెలల తర్వాత నవంబర్ లో నిన్ను నేను కలిశాను కానీ అలసటతో సరిగా మాట్లాడలేని పరిస్థితి. ఇదివరకటి రోజుల్లోలా నేను అంత దూరాలు ప్రయాణించలేకపోతున్నాను. ఫోన్ కాల్స్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు నీ ఆరోగ్యం గురించి తెలిసేది. అప్పటి నుండి నీ దగ్గర నుండి ఒక ఉత్తరం కూడా లేదు. ఎలా ఉన్నావో అని చింత. ” ఈ మధ్య నువ్వు రాసిన ఉత్తరంలో – రెండు నెలల నుండి నాకు బాగా లేదు. అందుకే నేను ఉత్తరాలు కూడా రాయలేకపోతున్నాను. ఎడమ చెయ్యి, ఎడమ కాలులో తీవ్రమైన నొప్పులే కాకుండా, వెనుక నడుము దిగువ భాగంలో, తుంటి కీళ్ళలో తీవ్రమైన నొప్పి వచ్చింది. నేను మంచం మీద కూర్చోలేక పోతున్నాను. పడుకో లేకపోతున్నాను. నొప్పి పగలు, రాత్రి 24 గంటలు కొనసాగుతుంది. దాంతో నిద్ర పోలేకపోతున్నాను. ఇప్పుడు ఈ నొప్పితో బీపీ లెవెల్స్ బాగా పెరగడంతో దేని మీద శ్రద్ధ పెట్టలేక పోతున్నాను, తల తిరగడం ఎక్కువగా ఉండడంతో బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను. నేను ఇక్కడ నిస్సహాయంగా ఉన్నాను కాబట్టి మీరు ఏదైనా చేస్తారని ఆశిస్తున్నాను”

“సరైన వైద్యం దొరకకపోవడం వల్ల రోజు రోజుకు క్షీణిస్తున్న ఆరోగ్యంతో ఎంతకాలం బ్రతుకుతానో చెప్పలేనని, ఎప్పుడైనా ‘స్టాన్ స్వామిలా’ ఆ వార్త మీరు వినాల్సి ఉంటుందేమో? మీరు ఏమైనా చేసి నన్ను బయటికి తీసుకురాకపోతే” అన్నావు. ఆ మాటకి మనసంతా దుఃఖంతో సుడులు తిరుగుతూనే ఉంది. ఇది తలచుకున్నప్పుడల్లా, ఆ లెటర్ చదవాలి అనుకున్నప్పుడల్లా నా మనసు మెలిపెట్టేసినట్లు అవుతుంది. ఈ విషయం చెప్త మిత్రులు కూడా ఎంతో బాధతో విలవిలలాడారు.

ఈ ఉత్తరం మొదలు పెట్టాక ఎన్నో ఒడిదుడుకులతో, జ్ఞాపకాల ఒత్తిడుల తో, గూడు కట్టుకున్న గుబులుతో రాయటం పూర్తి చేయలేక పోయాను. సెప్టెంబర్ లో మొదలుపెట్టి చివరికి జనవరిలో ముగిస్తున్నాను. నీ ఉత్తరాలు, నీ కవితలు, మాటలే నాకు దైర్యాన్ని , బలాన్ని ఇస్తాయి.

మనం ఎప్పటికీ ఒంటరి కాము. ఒకరికొకరం తోడుగా వున్నాము. ఇక ముందు కూడా వుంటాము. న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చిన ఈ అన్యాయమైన తీర్పు మన మధ్య దూరాన్ని పెంచినా, మానసికంగా మనిద్దరం ఎప్పుడూ ఒకటే. నీ విడుదల కోసం, ప్రజాస్వామిక విలువల కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం చేసే పోరాటంలో నేను ఒంటరిని కాను. మన నిస్వార్థ జీవితపు పోరాటాన్ని సమర్థించే మరెందరో మనకు తోడుగా ఉన్నారు. మరింత మందిని నీ విడుదల కై నేను చేస్తున్న న్యాయపోరాటంలో భాగమవ్వమని అభ్యర్ధిస్తున్నాను.

చివరికి 2021 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ ఈ ఉత్తరం ముగిస్తున్నాను. 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించే నా ఈ స్నేహ వీచిక నీకు కొంత ఊరటనిస్తుంది అనుకుంటున్నాను. ప్రజలందరూ జైలులేని సమాజంలో జీవించాలనే మన స్వప్నం అందరి స్వప్నంగా కాంక్షించే రోజులు, నిర్భంధ సంకెళ్లు తెంచుకొని నిన్ను వీల్ చైర్లో ఈ విశాల ప్రపంచంలో నడిపించే రోజులు ఈ కొత్త సంవత్సరం మోసుకొస్తుందన్న బలమైన కాంక్షతో ఈ ఉత్తరం నీకు పంపుతున్నాను మిత్రమా.

ఈ ఒంటరి చీకటి రాత్రి
మన సాన్నిహిత మధుర క్షణాల
స్మృతుల దొంతర్లను కావలించుకోనీయి
ఈ ఒంటరి నిశబ్ద మీటలు
భవిష్యత్ స్వప్న రాగాలతో సవరించనీయి
ఈ నూతన విజయ కిరణాల
ఉషోదయాలను స్వాగతిద్దాం ప్రియతమా!

ప్రేమతో
నీ
వసంత
జనవరి, 2022

One thought on “మనం ఎప్పటికీ ఒంటరి కాము

  1. Our political system SUCKS
    NO FREEDOM
    NO TRUTH
    NO JUSTICE
    Needs THIRUGUBATU ????
    ————————————-SISTER VASANTHA GARU —NICE LETTER ——
    BUCHIREDDY gangula

Leave a Reply