మణిపూర్ … మణిపూర్ … మణిపూర్ … ప్రపంచమంతా నివ్వెరపోయి దృష్టిసారిస్తున్న భారతదేశంలోని ఒక చిన్నఈశాన్య రాష్ట్రం. వందలాది మంది గుంపుగా వున్న మైతేయీ సమూహానికి చెందిన యువకులు ముగ్గురు కుకీ ఆదివాసీ క్రైస్తవ మహిళలను వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించిన వీడియో ప్రతి ఒక్కరినీ కలవరపర్చింది. పైగా ఆ ఉన్మాదపు సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఆ వీడియో బయటకు రావటంతో అప్పటివరకూ మణిపూర్ సంక్షోభం గురించీ అక్కడి సామాజిక, రాజకీయ అంశాలను పట్టించుకోని వాళ్లు కూడా అసలు అక్కడ ఏం జరుగుతోంది అనే స్పృహలోకి వచ్చారు. వీడియోని ఎంతగా బ్లర్ చేసినా గానీ, వారి నగ్నశరీరాల మీద, వారి మర్మాంగాల మీద కసిగా పాకుతున్న ఆ చేతులు… వెకిలితనంతో (ఇంకో పదం దొరకడం లేదు) కదులుతూ… ద్వేషపూరితమైన సామూహిక అత్యాచారానికి పాల్పడిన మదమెక్కిన ఆ మగమూక… జాతి, మతం మత్తు, సహజ వనరుల ఆధిపత్యం కోసం విశృంఖలంగా తెగబడుతూ వున్న వాస్తవం ఫెటీల్మని చెంపలు చరుస్తూ వుంటే… కారంచేడు, చుండూరు, ఖైర్లాంజీ, లక్షింపేటలలో కులాధిపత్యంతో దునుమాడిన మారణహోమాలు… మతం పేరుతో జరిగిన గుజరాత్ గాయం… ఆడవాళ్లను వివస్త్రలను చేసి పరిగెత్తించి, సామూహిక అత్యాచారం చేసి, కత్తులతో కడుపు కోసి నెత్తురోడుతున్న శిశుపిండాలను శూలాలకు గుచ్చి గంతులువేసిన మతోన్మాదం, ఇంకా పచ్చిగానే వున్న బిల్కిస్ బానో సంఘటన… ఏడు దశాబ్దాల వెనక్కి వెళితే దేశవిభజన సమయంలో అత్యాచారాలతో రక్తసిక్తమయిన స్త్రీల శరీరాల మీద ఎగిరిన స్వాతంత్ర్య పతాకల అవనతాలు గుర్తుకువచ్చాయి!!! ఇప్పుడు వర్తమానంలో మణిపూర్ ఆదివాసీ కుకీ క్రైస్తవ మహిళలు నిలబడి అప్పుడూ ఇప్పుడూ కూడా మా అణగారిన స్త్రీల శరీరాలే యుద్ధరంగమా? మేము ఈ దేశ పౌరులం, ఇంకా ఎంతకాలం ఈ పరిస్థితి? అని దేశానికి ప్రశ్నలను సంధిస్తున్నారు.
సహజ వనరులు, అడవులు, భూమి మీద ఎవరికి హక్కు వుండాలి? మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, వ్యవసాయ పంటలు, పౌరసత్వం గురించీ జరుగుతున్న సంఘర్షణలోకి స్త్రీల శరీరాలు, ప్రాణాలు ఎందుకు బలి అవుతున్నాయి? దీన్ని కేవలం ఒక సంఘటనగానో లేదా ఎక్కడైనా స్త్రీల మీద జరిగే అన్ని అత్యాచారాల ఘటనవంటిదే అని కొట్టిపడేయగలుగుతామా? ఈ వీడియో తర్వాత బయటకు వస్తున్న అనేక అంశాల తీవ్రత అక్కడ జరిగిన ఘాతుకాల్ని బయటపెడుతున్నాయి. హింస ఒకరి దగ్గర ఆగలేదు. ఆధిపత్య మైతేయీ మహిళలపై దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు విష ప్రచారం మొదలై అది వైరల్ గా మారి మణిపూర్ ఆదివాసీ కుకీ సమూహాలపై దాడిగా మే 3న పరిణమించింది. అప్పటినుంచీ అది తీవ్రరూపం దాల్చి కుకీ సముదాయానికి చెందిన వందలాది చర్చ్ లు, వేలాది ఇళ్లు, వ్యాపార సముదాయాలు తగలబడ్డాయి. ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా తరిమి తరిమి దాడి చేశారు. మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికీ శవాలు మార్చురీల్లోనే కుళ్లిపోతున్నాయి. వాటికి అంతిమ సంస్కారాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఎవరూ చెప్పే పరిస్థితిలో లేరు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యి రిలీఫ్ క్యాంపులలో తలదాచుకుంటున్నారు. కుకీ జో మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన వీడియో దేశవిదేశాల్లో వైరల్ అవటంతో ఇతర బాధితుల వీడియో కథనాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇంకా చాలా బయటకు వస్తేనే గానీ మణిపూర్ లో జరిగిన విధ్వంసం పూర్తి ముఖచిత్రం ప్రపంచానికి అర్థంకాకపోవచ్చు. వచ్చిన కొద్ది కథనాలు కూడా భవిష్యత్ ఎంత ప్రమాదకరంగా మారబోతోందో సూచిస్తున్నాయి. ముఖ్యంగా కుకీలు నివసించే ప్రాంతాలకు సైన్యం ద్వారా రిలీఫ్ అందకుండా చేయటంలో మైతేయీ మహిళలు ప్రధానపాత్ర వహించారనే వార్త రావటం. ఈ విషయం స్పష్టంగా బాధితుల అనేక ఇంటర్వ్యూల్లో బయటికి వచ్చింది. నిజానికి ఆధిపత్య కుల- మత సంఘర్షణల్లో దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన స్త్రీల మీద తమ వర్గం పురుషులతో స్త్రీలే దాడికి ప్రేరేపించారన్న సంఘటనలు మన కళ్లముందు చాలా కనిపిస్తున్నాయి. ‘ఖైర్లాంజీ’, ‘లక్షింపేట’ ఉదంతాలు ఈ వైఖరికి నిలువెత్తు ఉదాహరణలు. వాస్తవానికి గతంలో ఈశాన్య రాష్ట్రాలలో సాయుధ దళాలు స్త్రీల మీద చేసిన లైంగిక అత్యాచారాలకు వ్యతిరేకంగా సామూహిక నగ్నప్రదర్శన చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మైతేయీ మహిళా సమూహం రెండు దశాబ్దాలు తిరిగే సరికి తమ తోటి స్త్రీల మీదే దాడులకు ఉసిగొలిపే స్థాయికి ఎందుకు దిగజారిపోయింది? అప్పుడు నిరసన తెలిపిన మహిళలూ, ఇప్పుడు ఇతర మైనారిటీ సమూహాల మహిళల మీదికి దాడులను ప్రేరేపిస్తున్నవాళ్ళు ఒకరే కాకపోవచ్చు! కానీ, ఈ సామాజిక వైరుధ్యాన్ని, వీటి వెనుక వున్న కారణాలను ఎలా అర్థంచేసుకుంటాం? మహిళా ఉద్యమాలకి ఇదొక పెద్ద సవాలుతో సమానం. మీరా ఫైబీ ( దారిదీపాలు) గా పిలిచే ఈ పౌర సమూహం మణిపురి సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తోంది.
మైతేయీ సమూహం చేతిలో దాడికి గురయ్యి, తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడి ఢిల్లీకి చేరుకున్న ఒక అమ్మాయి ‘కిమ్’ని వెబ్ మాగజైన్ ‘న్యూస్ లాండ్రీ’ జర్నలిస్ట్ శివనారాయణ చేసిన ఇంటర్వ్యూలో తన కళ్లెదురుగానే రాష్ట్రప్రభుత్వ అధికారి అయిన తన తల్లిని, ఐదు నెలల క్రితమే పెళ్లి అయిన తన అన్నని ఎంత భయానక పరిస్థితుల్లో చంపారో చెబుతుంటే ఆ విధ్వంసం తాలూకు తీవ్రత ఏ స్థాయిలో వుందో అర్థమయ్యి నిస్సహాయత కమ్ముకుంది. అదే దాడిలో తల పగిలి, ఇతర అవయవాలు దెబ్బతిని, క్రానియాటోమి అనే బ్రైన్ సర్జరీ వరకూ వెళ్ళిన కిమ్ వదిన ‘నాన్సి చింగ్తీయనింగ్’ ఇప్పుడు కోలుకుంటోంది. వీరిద్దరూ కూడా ‘వైర్’ సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ తో ఈ మధ్యనే మాట్లాడారు. శారీరికంగా, మానసికంగా ఎంత భయానకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామో మాటలు కూడదీసుకుంటూ చెబుతున్నారు. ఇంఫాల్ రాజకీయంతో తమ కుటుంబాన్ని కోల్పోయామని, భవిష్యత్తు ఏమిటో తెలియటం లేదని అన్నారు. అదే సందర్భంలో అంత హింసాత్మక సమయంలో కూడా అవతలి పక్షంలో మానవత్వంతో తమను కాపాడటానికి సహాయం చేసిన ఒకరిద్దరి యువకుల గురించీ కూడా ఆ యువతులు ప్రస్తావించారు. నిజానికి ఇప్పుడు కావలసింది లక్షల్లో ఒకటైనా సరే అలాంటి కథనాలు. గుండెను మెలిపెట్టే కథనాలను వెలికితీస్తూనే, మిణుకుమిణుకు మనే ఆశావహ ధృక్పధాన్ని అందించే అనుభవాలను కూడా వొడిసి పట్టుకోగలగాలి.
సంచలనం సృష్టించిన ‘స్త్రీలని నగ్నంగా వూరేగించిన’ వీడియో ఒక్కటే ఈనాటి ‘మణిపూర్’ సమస్య కాదు. ఈ విద్వేషపూరిత సంఘటన వెనుక చాలా దశాబ్దాల చరిత్ర వుంది. వాటిని మరో సంధర్భంలో మాట్లాడుకుందాం. అప్పుడైనా ఇప్పుడైనా సమస్య మూలాలు భూమి, సహజ వనరుల ఆధిపత్యం చుట్టూనే తిరుగుతోంది. ఇప్పుడు తాజాగా ‘మణిపూర్’ రాష్ట్రం మండటం మొదలయ్యి ఆరు నెలలపైనే అయింది. అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం మణిపూరీ ప్రజల మధ్య పెంచుతూపోయిన విభజన రాజకీయాలు అక్కడి సామాజిక వాతావరణాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు భూమిని పొందటానికి చట్టపరంగా అవకాశం లేదు. అందుకే మణిపూర్ లోయ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీయేతర మైతేయీలకు ఎస్టీ హోదా ఇవ్వాలన్న కోర్టు ఆదేశాలతో మంటలు రాజుకున్నాయి. ఆ తీర్పునకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, వాటి గురించిన సమాచారం మే నెలలో అక్కడ రెండు తెగల మధ్య జరుగుతున్న పోరాటంగా తొలుత ప్రచారమైంది. హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇళ్లు, ప్రార్థనా మందిరాలు, వ్యాపార సముదాయాలు తగలబడ్డాయి. అనేకమంది చనిపోయారు. రెండురోజులు కూడా గడవకముందే ఇంటర్నెట్ ని ఆపేయటం ద్వారా అది ఒక జాతీయవార్తగా మారింది. అదుగో, సరిగ్గా అప్పుడే ఈ వైరల్ వీడియో సంఘటన పోలీసుల సాక్షిగా జరిగింది. బహుశా ఇలాంటివి జరుగుతున్న విషయం తెలిసే రాష్ట్రం పరువు పోతుందని ఇంటర్నెట్ ఆపేశారో లేదా ఇటువంటి సంఘటనలు బయటకు వస్తే మరింత హింస పెరుగుతుందని అనుకున్నారో ఏమోగానీ రాష్ట్ర అత్యున్నత అధికార యంత్రాంగం మొత్తానికీ ఈ సంఘటన గురించి మాత్రం తెలుసు. అయినా ఎలాంటి చర్యలూ నేరస్తుల మీద తీసుకోలేదని, బాధితులు కంప్లయింట్ ఇచ్చినా గానీ ఏమీ పట్టించుకోలేదనే సంగతులు ఇప్పుడు బహిరంగ రహస్యం. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రెండు నెలల తర్వాత ఈ వీడియో వైరల్ అయ్యాక మీడియా వేసిన ప్రశ్నలకు ఇదొక్కటే కాదు ఇలాంటి అనేక సంఘటనలు జరిగాయి అని దానినొక మామూలు విషయంగా చెప్పటం దేశమంతా చూసింది. మణిపూర్ సమస్య మొదలైన దగ్గరనుంచీ ఈ విషయం మీద కనీసం పెదవి విప్పని ప్రధాని, కంటితుడుపుగా రెండు మాటలు చెప్పాల్సి వచ్చిందంటే దేశవిదేశాల్లో తమ ప్రభుత్వానికి ఆ సంఘటన బయటకు రావటం వల్ల జరిగిన పరువునష్టం వల్లే అని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.
ఆదివాసీలు కాని మైతేయీలకు ఆదివాసీ గుర్తింపు ఇచ్చే అంశానికి సానుకూలంగా మణిపూర్ హైకోర్టు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలివ్వడం, స్థానిక కుకీ, ఇతర ఆదివాసీలు దాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఊరేగింపుపై హింస జరగటం… దీనిలోకి వెళ్లేముందు అసలు గత ఆరు నెలలుగా అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవడం కూడా అవసరం. సమస్య మొదలయిన వెంటనే అక్కడికి ప్రత్యక్షంగా వెళ్లి రిపోర్ట్ చేసిన కొంతమంది జర్నలిస్టుల కథనాలు చదివి, అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మహిళా, సామాజిక, హక్కుల కార్యకర్తల అనుభవాలను ప్రత్యక్షంగా వింటుంటే అనేక విషయాలు తెలియవస్తున్నాయి.
మే 3నాటి హింసాత్మక ఘటనలకు బీజం 2017 నుంచే పడింది. 1 జనవరి 2017 నుంచీ 18 ఏప్రిల్ 2023 వరకూ ఐదు జిల్లాలలోని ఇరవై రిజర్వ్, రక్షిత అడవులలో కుకీలకు సంబంధించిన 291 ఆవాసాలను తొలగించినట్లు మణిపూర్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2023 సంవత్సరం నుంచీ ఈ ప్రక్రియలో మరింత వేగం పెరిగింది. ఈ తొలగింపులలో భాగంగా 20 ఫిబ్రవరిలో చూరాచాంద్పురా జిల్లాలో కుకీ ఆదివాసీల గ్రామం కె.సొంగ్జంగ్ ని నేలమట్టం చేశారు. 2020 నాటి గూగుల్ మ్యాప్ ఇమేజ్ లో ఇక్కడ ఏ గ్రామం లేదన్నది దీనికి చూపించిన కారణం! ఇదే సాకుతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నవంబర్ 22లో చూరాచాంద్పురా, నోనే జిల్లాలలో 38 గ్రామాల గుర్తింపును రద్దుచేస్తూ అవి రక్షిత అటవీప్రాంతాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అక్కడ నివాసానికి అనుమతి ఇచ్చిన అధికారికి అలా అనుమతిచ్చే అధికారాలు లేవని పేర్కొన్నారు. స్థానిక కుకీ ఆదివాసీలను పక్క దేశాల నుంచీ వస్తున్న చొరబాటుదారులుగా చిత్రించటం, వారి పౌరసత్వాన్ని హేళనచేయటం, మాదకద్రవ్యాలను చేరవేస్తున్నవారిగా, మాదకద్రవ్యాల్లో ఉపయోగించే పోపీ (గసగసాలు) వ్యవసాయాన్ని చేసేవారిగా చెబుతూ వారిపై కొనసాగిన నిరంతర దాడులు కూడా ప్రధాన సమస్య. నిజానికి పర్యావరణ పరిరక్షణ పేరుతో ఆదివాసీ గ్రామాలను, అక్కడి ప్రజలను అడవి నుంచి దూరం చేయడానికి అన్ని ప్రాంతాల్లో చూపించే విభజన, వివక్షా రాజకీయాలే తప్పించి ఆదివాసీ సమాజాల్ని పర్యావరణ రక్షకులుగా ఎన్నడూ పరిగణనలోకి తీసుకోకపోవటం వెనుక అనేక అంతర్జాతీయ కార్పొరేట్ ప్రయోజనాలు వున్నాయనేది జగమెరిగిన సత్యం. భూమిపై ఆధిపత్యం అనేది నిరంతర సంఘర్షణ అంశం. దానికి మార్గం సుగమం కావాలంటే సమాజంలో ఇప్పటికే వున్న సామాజిక అంతరాల్లోని మత నమ్మకాలని ఎగదోయడం ద్వారా ప్రజల మధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టి ఒక తీవ్రమైన హింసాత్మక పరిస్థితికి నెట్టటం.
మార్చి 10న ఐదు కొండప్రాంత జిల్లాలలో ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ITLF) నేతృత్వంలోని కుకీ తెగ ఆదివాసీలు చూరాచాంద్పురా, ఊక్రూల్, కాంగ్పోక్ప్కీ, టెంగ్నవపౌల్, జిరిబామ్, తమెంగ్లాంగ్ లలో తమపై క్రూరంగా జరుగుతున్న దాడిని వ్యతిరేకిస్తూ బిజేపి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అనేక శాంతియుత ప్రజాప్రదర్శనలు ఆయా జిల్లాలలో చేశారు. బీరెన్ సింగ్ ప్రభుత్వం రిజర్వు అడవులను విస్తరించడం అనే ముసుగులో కుకీ గ్రామాలను ఏకపక్షంగా తొలగించడం “భారతీయ అటవీచట్టం, 1927”ను ఉల్లంఘించడమేనని అనేక సంఘాలు ఈ సందర్భంగా వాదించాయి.
ఒక పక్కన మణిపురి ఆదివాసీ సమాజంపై బిజేపి నేతృత్వంలోని బీరెన్ సింగ్ ప్రభుత్వం కొనసాగిస్తున్న హక్కుల ఉల్లంఘనను పట్టించుకోకుండా, మార్చి 27న మణిపూర్ హైకోర్టు మెజారిటీ మైయితీ సమూహాన్ని ఆదివాసీలుగా నాలుగు వారాల్లో గుర్తించమని, అదే ప్రతిపాదనను కేంద్రప్రభుత్వానికి పంపాలని రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశం కుకీ, నాగా సమూహాల్లో పెద్ద అలజడిని రేపింది. దీనికి నిరసనగా స్థానిక ఆదివాసీలు ఏప్రిల్ 27న చూరాచాంద్పురా జిల్లాలో ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సిన ఓపెన్ జిమ్ ని తగలబెట్టారు. దీనితో అక్కడ ఐదు రోజులపాటు ఇంటెర్ నెట్ ఆపేశారు.
మే 3వ తేదీన మైతేయీలను ఆదివాసులుగా పరిగణించాలన్న కోర్టు ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ చూరాచాంద్పురాలో ఇండీజీనస్ ట్రైబల్ ఫోరం నిర్వహించిన భారీ ‘ఆదివాసీ సంఘీభావ ప్రదర్శన’ తర్వాత తిరిగి తమ ప్రాంతాలకు వెళుతున్న వారిపై హింసాత్మక సాయుధదాడి జరిగింది. ఆ దాడులు ఒక్కరోజుతో ఆగలేదు. పైన వివరించినట్టు ఆ ఘటనలో అనేక మంది చనిపోయారు. ప్రతి దాడులు కూడా మొదలయ్యాయి. ప్రభుత్వ ఆయుధాగారాల నుంచీ వేలాది తుపాకులు, మందుగుండు మాయమైంది. సాయుధ హింస పెరగటంతో మే 4న కేంద్ర ఆర్మీ, అస్సాం రైఫిల్స్ షూట్ ఎట్ సైట్ ఆదేశాలతో రాష్ట్రంలోకి అడుగుపెట్టాయి. మే 7 నాటికి ఇండో మయన్మార్ సరిహద్దును తమ అదుపులోకి తీసుకున్నాయి. జరుగుతున్న హింసాత్మక ఘర్షణల్లో వేలమంది ప్రజలు తమతమ నెలవుల నుంచీ నిర్వాసితులు అయ్యారు. జూన్ 2 నాటికే 37, 400 మందిని 272 రిలీఫ్ క్యాంప్ లకు తరలించారన్నది ఫ్రంట్ లైన్ కథనం. అక్కడ ఈ రెండు నెలల్లో జరిగిన ప్రాణనష్టం, దాడులు వాటి స్వభావం, ఎవరెవరు ఎలా పాల్గొన్నారు అనేవి అన్నీ అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. పక్క రాష్ట్రమైన మిజోరాం వేలమంది నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించింది. ప్రింట్, వైర్ వంటి ఇంకా అనేక వెబ్ మాగజైన్స్ లో విస్తృతంగా రిపోర్ట్ అయిన ప్రత్యక్ష కథనాల ద్వారా జరిగిన పరిణామాలని పరిశీలిస్తూ వుంటే అ క్కడ అన్ని ప్రభుత్వ వ్యవస్థలు విఫలం అయ్యాయనే విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి.
మయన్మార్ దేశ సరిహద్దుకి అతి సమీపంలో వుండటంతో ఇరు దేశాల సరిహద్దు వివాదాలూ, అక్కడి రాజకీయ సంక్షోభాల్లో కొన్ని సంవత్సరాలుగా చిన్-కుకి శరణార్థుల అంశం తీవ్రంగానే వుంది. అయితే, బిరెన్ సింగ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం స్థానిక కుకీ సమూహాలను కూడా అక్రమ చొరబాటుదారుగా ముద్రవేస్తూ మైతేయీ జాతీయవాదాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఉపయోగించుకోవటం. ఇండీజీనస్ కుకీ ప్రజలను అక్రమ చొరబాటుదారులనటం తమకు అభ్యంతరకరమని కుకీ నాయకులు చెబుతున్నారు. మే 3న హింస మొదలైతే, శాంతిభద్రతల రక్షణ పేరుతో కేంద్రప్రభుత్వం ఆర్టికల్ 355 అమలులోకి తెచ్చింది. హెలికాఫ్టర్లతో, యూఏవి (unmanned aerial vehicle) డ్రోన్ లతో సరిహద్దుల్లో ఆకాశయాన తనిఖీలు చేపట్టింది. ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీతో, సైనిక బలగాలతో రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న హింసను అదుపులోకి తీసుకురావటం మరీ పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రెండూ హింసను ఆపాలి అనే రాజకీయ సంకల్పంలో లేవు. అందుకే స్థానిక కుకీ సమూహానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు (59 సైకోట్ నియోజక వర్గం) పావ్వోలిన్ హవోక్కిప్ ఒక న్యూస్ ఇంటర్వ్యూలో ఇలాంటి తీవ్ర హింసాత్మక పరిస్థితులపై ప్రధానమంత్రి స్పందించటానికి రెండు నెలల పైన సమయం తీసుకోవటం శోచనీయం అని, సమస్యను నివేదించటానికి ఎంత ప్రయత్నించినా గానీ తమకు ఈ రెండు నెలల్లో అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఆవాసాల నుంచీ కుకీల తొలగింపుపై, సర్వేల పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని తాను కేంద్ర పర్యావరణ, అటవీ, ఇంధనశాఖ మంత్రికి పదేపదే రాతపూర్వక విజ్ఞప్తులు చేసినా గానీ ఏ స్పందనా లేదని కూడా వివరించారు.
నిజానికి ఈశాన్య రాష్ట్రాలు అనుకోవటం తప్పించి అక్కడి భౌగోళిక, సామాజిక జీవనం మీద, అక్కడి ఉద్యమాలు, భాష, సాహిత్యం, సమస్యలు, సంక్షోభాల గురించి ఇక్కడి ప్రజలకి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలిసింది తక్కువే అని చెప్పాలి. అక్కడ రాజకీయ ప్రయోజనాలున్నపార్టీల వాళ్ళకి తెలిసుండటం వేరు. అలాగే, దక్షిణ భారత భాషల గురించీ, సామాజిక జీవనం గురించీ, ఇక్కడ జరుగుతున్న ఉద్యమాలు, రాజకీయాల గురించి ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు కూడా ఏమీ తెలియదనే అనుకోవాలి. చెప్పానుగా, దీనికి రాజకీయ పార్టీలు మినహాయింపు అని! ఆయా ప్రాంతాలతో, అక్కడి అంశాలపై, సమస్యలపై సీరియస్ గా పనిచేసే సమూహాలతో ఒక నిరంతర సంభాషణ వున్నప్పుడే విభిన్న ప్రాంతాల ప్రజల మధ్య సజీవమైన సంబంధాలు వుంటాయి. ఆలస్యం అయినప్పటికీ మణిపూర్ మంటల్లో ఆహుతి అవుతున్న ప్రజలతో ఇప్పుడు మన నుంచీ అటువంటి సజీవ సంభాషణ చేయడం అవసరం.
ఈశాన్య రాష్ట్రాలకు సుదూరంగా నివసిస్తున్నప్పటికీ అక్కడ జరుగుతున్న మారణకాండని ఆపటం కోసం మనం ఇక్కడ చేపట్టగలిగిన కార్యాచరణని రూపొందించుకోవాలి. అది ఎంత చిన్నదైనా సరే! అలానే మనవైపు నుంచీ కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలకి స్పష్టమైన డిమాండ్లు కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే అక్కడి బాధిత ప్రజలకు మన సహానుభూతిని గట్టిగా ప్రకటించాలి. అదే గాయపడ్డ మణిపూర్ కి మనం అందించగలిగే కనీస ఉపశమనం. చివరగా, ఇదంతా పథకం ప్రకారమే జరిగిన హింస అని సుప్రీం కోర్టు గుర్తించడం, దాని మీద కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించటం చాలా ముఖ్యమైన విషయం.
Very disturbing Manipur trouble very aptly and with much detail written by Sajaya garu. As she has written correctly this is a struggle between two group of people. One is numerically stronger and predominantly Hindu group and other is Kuki group who are basically tribal and Christian people and also Naga tribes.
The forests there have quite a good amount of high value minerals and natural resources
So naturally, like in Bastar and other forest areas which have major mineral wealth and many of the big industrialist like VEDANTA and others have interest in this area. Government wants to denounce the tribals here. Towards this they not only wage war but also change the existing Forest Laws (the bill is approved in Loksabha where the entry for these people there becomes very easy.
Another factor is the spread of Hinduism.
I congratulate Sajaya for this detailed piece on Manipur
Very well written Story abut Manipur. It is disturbing .Read without fail.