సమాజంలోని విషమ సమస్యలన్నీ ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటాయి. అవిద్య, పేదరికం, అసమానతలు, అవకాశాలలేమి, అవగాహనారాహిత్యం, వ్యసనాలు, దురలవాట్లు సమాజాన్ని నేరపూరితం చేయడమే కాక ఆ సమాజ అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేస్తాయి. అలాంటి వితంతు సమస్య ఒకటి.
సకల అసమానతలకు, అంటరానితనాలకు సూక్ష్మస్థాయి నిర్మాణ వ్యవస్థ కుటుంబం. దానిని నడిపించేది. పితృస్వామ్యం. స్త్రీల జీవితాల్లోని అనేక సంక్షోభాలకు సవాళ్లకు కారణం అది. స్త్రీల ఆలోచనలను, జీవితాలను ప్రతిక్షణం నియంత్రించడానికి పితృస్వామ్య వ్యవస్థ నిరంతరం ప్రయత్నం చేస్తుంది. దానికి ఆనేక రూపాలను నిర్మాణం చేస్తుంది. అలాంటి నిర్మాణమే వితంతు వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ డోల్లతనానికి ప్రతీక వితంతు వ్యవస్థ. స్త్రీలపై అణిచివేతకు పరాకాష్టయే వితంతు వ్యవస్థ. ఎంత చెప్పినా తరగని దుఃఖం వితంతువులది. ఏ విధంగా ఆలోచించినా వారు అన్ని రకాలుగా సమాజం చేత తిరస్కృతులు, బహిష్కృతులు.
అలాంటి వితంతు స్త్రీల జీవితం అంశంగా తీసుకొని అనిశెట్టి రజిత ప్రధాన సంపాదకత్వంలో 2023, డిసెంబర్ నెలలో“భారతదేశంలో వితంతు వ్యవస్థ సామాజిక సాహిత్య వ్యాసాలు;వ్యక్తిత్వాలు కథనాలు” అనే పుస్తకం వచ్చింది. కొమర్రాజు రామలక్ష్మి, చందనాల సుమిత్ర, తమ్మెర రాధిక సంపాదక వర్గం. ఈ పుస్తకం భారతదేశంలో వితంతు వ్యవస్థ స్వరూప స్వభావాలు, ప్రభావాలు సమాజంలో, సాహిత్యంలో, వ్యక్తిగత జీవితాలలో ఏమేరకు ఎలా ఉన్నాయో నిరూపించటానికి చేసినప్రయత్నం ఈ పుస్తకం. ఈ పుస్తకానికి కొల్లాపురం విమల, శీలా సుభద్ర దేవి, కొండవీటి సత్యవతి ముందు మాటలు రాశారు. సామాజిక వ్యాసాలు(18), సాహిత్య వ్యాసాలు (20),వ్యక్తిత్వ వ్యాసాలు (7), కథనాలు(13) అనే నాలుగు విభాగాల కిందఈ పుస్తకంలో వ్యాసాలు ఉన్నాయి.
సామాజిక వ్యాసాలలో సామాజిక పరిణామ క్రమంలో కాలానుగుణంగా వితంతు వ్యవస్థ ఎలా ఆవిర్భవించింది, ఎలా పెరిగింది, ఎలా తన ప్రభావాన్ని చూపి సమాజాన్ని చిన్నభిన్నం చేసిందో మనకు కనిపిస్తుంది. వితంతువు శీలం కోల్పోకుండా ఉండాలి. సాత్వికాహారం తినాలి. పరపురుషుని ఆలోచనలు మానివేయాలి. వితంతువు మంగళసూత్రం తీసేయాలి. పూలు, గాజులకు దూరంగా ఉండాలి. తెల్ల చీరలు ధరించాలి. శుభకార్యాలకు వెళ్ళకూడదు. సింధూరం, కుంకుమ పెట్టుకోకూడదు… శిరోముండనం చేసుకోవాలి… ఇలా మనుధర్మం వితంతువులను నియంత్రించిన విధానం. ఇంకా చెప్పాలంటే భర్తతో సతిసహగమనం చేయగలిగితే ఆ స్త్రీని ఒక దేవతగా పరిగణించింది. తండ్రి సంరక్షణలో, భర్త సంరక్షణలో, కొడుకు సంరక్షణలో బతకాలి తప్ప స్త్రీ స్వతంత్రంగా బతకకూడదు అని మనుధర్మం చెప్పిన మాటే ఆదర్శవంతంగా కనిపిస్తున్నఈ కాలంలో వితంతు స్త్రీల జీవితాన్ని సామాజిక సాహిత్య అనుభవ కోణాల నుండి విశ్లేషించటానికి పూనుకొనటం ఒక రకంగా ధిక్కారమే. ఆ పని ఈ పుస్తకంలోని రచయితలు చేసారు.
వేద కాలం నుండి ఇప్పటివరకు స్త్రీల స్థితిగతుల్లో వచ్చిన మార్పులను చర్చిస్తూ వితంతు వ్యవస్థ పుట్టుక పెరుగుదల దాని ప్రభావం ప్రస్తుత స్థితి ఎలా ఉన్నదో ఈ వ్యాసాలు ఒక అంచనా వేసాయి. సామాజిక పరిణామ క్రమంలో ఉత్పత్తి సంబంధాలు మారుతున్న, మారిన సందర్భాలలో పితృస్వామిక వ్యవస్థ దుర్మార్గ రూపంగా వితంతు వ్యవస్థ బలపడిన తీరును ఈ వ్యాసాలు చర్చించాయి. వితంతువుల జీవితాల్లో ఉన్న హింస,ఆశలు, ఆకాంక్షాలు, ఆలోచనలు, మానసిక సంఘర్షణలు అవమానాలు మొదలైన అంశాలను విశ్లేషించాయి. బాల్య వివాహాలు నిరోధించడానికి, వితంతు పునర్వివాహాల కోసం జరిగిన ప్రయత్నాలను , బాలికల విద్య కోసం జరిగిన కృషిని వివరించాయి.
వితంతు సమస్యను చర్చించటం, పరిష్కారానికి సంస్కరణ ఉద్యమాలు నిర్మించటం మగవాళ్ళు ప్రారంభించినా సంస్కరణోద్యమ కాలపు స్త్రీలు ఆ సమస్యను యెట్లా చూసారో, స్వీకరించారో బుర్ర బుచ్చి బంగారమ్మ, కొటికలపూడి సీతమ్మ, జూలూరి సీతమ్మ, మోసలికంట రాంబాయమ్మ, సుసర్ల లక్ష్మీనర్సమాంబ, పులవర్త కమలావతీ దేవి లాంటి అనేకమంది మహిళల కవిత్వం, కథలు, వ్యాసాలు, కథనాలు ఆధారంగా నిరూపించే వ్యాసం స్త్రీలు వితంతువుల పునర్వివాహ ఉద్యమానికి ఊతమిచ్చే భావజాల అభివృద్ధిలో భాగమైన తీరును వివరిస్తుంది. మారుతున్న కాలమాన పరిస్థితులను ధర్మశాస్త్రాలు విస్మరించలేవని, అనివార్య సామాజిక పరిణామాలను ధర్మశాస్త్రాలకు అన్వయించడం సరికాదని, ప్రాచీన సాంప్రదాయాలను, కట్టుబాట్లను గుడ్డిగా సమర్ధించడం సరికాదని స్త్రీలు ప్రకటించారు. వితంతు స్త్రీల గౌరవకరమైన జీవనానికి విద్యకు ఉన్న సంబంధాన్ని గురించి కూడా వాళ్ళు మాట్లాడారు. సావిత్రి పత్రికా సంపాదకురాలు పులగుర్త లక్ష్మీనరసమాంబ లాంటి ఒకరిద్దరు స్త్రీ పునర్వివాహాలను వ్యతిరేకించి వివాదాస్పదులైనారు. అయినా మారుతున్న సమాజానికి అనుగుణంగా మారాలన్న ఉద్దేశంతో చాలామంది వితంతు పునర్వివాహాలను సమర్థించారు. కాకినాడ స్త్రీ సమాజం లాంటి అనేక సంస్థలు వితంతువుల ఉద్ధరణ కోసం ప్రయత్నం చేశాయి. అప్పటి నుండి ఇప్పటివరకు సామాజికంగా, సాంస్కృతికంగా చట్టపరంగా వితంతు స్త్రీలు ఎదుర్కొనే వివక్ష, పీడన, వాళ్లకు దొరుకుతున్న ఓదార్పు, భద్రత ఈ వ్యాసాలలో చర్చించబడ్డాయి.
వ్యక్తిత్వాలు అనే శీర్షిక కింది విభగంలోని ఏడు వ్యాసాలూ అనాధ బాలికల కోసం, వితంతు స్త్రీల రక్షణ కోసం, వితంతు స్త్రీల పునర్వివాహం కోసం, బాలికల పాఠశాల కోసం, శ్రీ విద్య కోసం నిరంతరం శ్రమించిన కేశవ దోండో కర్వే, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, పండిత రమాబాయి సరస్వతి, వీరేశలింగం పంతులు, మోహినిగిరి, మాళవిక హెగ్డే చేసిన కృషిని విపులంగా విశ్లేషిస్థాయి. సంస్కరణ ఉద్యమ కారుల గురించిన ఈ వ్యాసాలు సామాజిక వ్యాసవిభాగంలో భాగంగానే భావించవచ్చు.
తెలుగులోనూ, ఇతర భాషలనుండి తెలుగులోకి వచ్చిన భిన్న ప్రక్రియల సాహిత్య రచనలు వితంతు సమస్యను ఎన్ని కోణాలనుండి ఇతివృత్తంలో భాగం చేశాయో వివరించేవి సాహిత్య వ్యాసాలు. పితృస్వామిక భావజాలం ఉన్న సమాజంలో ఒక వితంతు మహిళ చేసుకున్న పునర్వివాహం తత్ఫలితాలను పరిణామాలను చిత్రించిన సంగమం నవల, వితంతువుగా ఒంటరితనం అనుభవించి మరణించిన సూరమ్మ కథ ఆధారంగా శతాబ్ది కాలంలో ఆంధ్రదేశంలో బ్రాహ్మణ స్త్రీల జీవితాలలో వచ్చిన పరిణామాలను, సామాజిక విభజన నుంచి బయటపడడానికి వారు చేసిన పోరాటాలను, వారి జీవితాలలో మార్పు రావడానికి కారణమైన సామాజిక పరిస్థితులను ఇతివృత్తంగా చేసుకొన్న శతాబ్ది సూరీడు నవల, వాసిరెడ్డి సీతాదేవి సమత, వైతరణి, తిరస్కృతి లాంటి నవలలు విశ్శ్లేషించిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి.
హరి నారాయణ ఆప్టే వ్రాసిన నవల ప్రణ్ లక్ష్యాత్ కోన్ ఘోత్ పేరుతో మరాఠీ లో వచ్చింది. దీనిని పీవీ నరసింహారావు దీని తెలుగులోకి అనువదించారు. ‘అబలా జీవితం’ నవలను సనాతన మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి ఆత్మకథగా ఎలా చూడవచ్చో విశ్లేషించిన వ్యాసం ప్రత్యేకమైనది. బ్రిటిష్ వలస పాలనలో భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ బీహార్ బార్డర్ కథా నేపథ్యంగా వచ్చిన వాటర్ నవల గురించిన వ్యాసం చిన్నతనంలోనే పెళ్లిళ్లు జరిగి వితంతువులుగా మారి నరకయాతన అనుభవిస్తున్న బాలికల స్థితిగతులను మన మందుకు తెచ్చి పరిచయం చేస్తుంది. ఇందిరా గోస్వామి బృందావనం లో వితంతువుల జీవన సతిగతుల మీద జరిపిన పరిశోధన గురించి, ఆ పరిశోధన ఆధారంగా వ్రాసిన కన్నయ్య వాడలో క్రీనీడలు నవల గురించి ఈ సంకలనంలోని రెండు వ్యాసాలు తెలియచేస్తాయి.
శీలా సుభద్ర దేవి రాసిన ‘గోడలు’, ‘గుండెల్లో గాయాలు’, ‘ఎవరూ అభాగ్యులు కాదు’ అనే మూడు కథలు, గంటి భానుమతి రాసిన రాయలమ్మ కథ వితంతు స్త్రీల జీవన సంక్షోభాలను, బలిపీఠాల మీద బతుకులను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలున్నాయి. విధవల పట్ల మన కనీస ధర్మం కథలో రంగనాయకమ్మ వితంతుల పట్ల సాటి స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారో ఎలా అవమానిస్తారో, ఎలా వెలివేస్తారో పరిశీలించిన వ్యాసం మనం ఎక్కడ ఉన్నామో , ఏం చేయాలో గుర్తు చేస్తుంది.
గోడ దెబ్బలు చెంపదెబ్బలు కథ పైన వచ్చిన వ్యాసం భర్త మరణించిన తర్వాత వితంతు స్త్రీలు పడే కష్టాలే కాదు, భర్తను కోల్పోయిన స్త్రీకి అనివార్యంగా జరిగే తంతులను కూడా ప్రశ్నించిన స్థితిని చర్చించింది. ఒగ్గు కథలో వితంతువు తన లైంగిక అనుభవాన్ని లైంగిక వ్యక్తిత్వాన్ని లైంగిక సహచరుని తనే స్వయంగా నిర్ణయించుకొని లోకానికి వెరవకుండా కొనసాగిస్తూ రావడం గమనించవచ్చు.
ఉమా చక్రవర్తి, ప్రీతి గిల్ కలిసి వ్రాసిన భారతీయ సాహిత్యంలో వితంతువులు అనే వ్యాసం పరిశోధనాత్మకమైనది.
గురజాడ కందుకూరి రచనలలో వితంతు సమస్య చిత్రణ ఎలా ఉందో విశ్లేషించిన వ్యాసం, చలం రచనల్లో వితంతువులను చిత్రించిన విధానాన్ని తెలిపే మరొక వ్యాసం, శ్రీపాద కథల్లో వితంతువుల జీవితాన్ని, వాళ్ళ వేదనలను దుర్భర స్థితులను చిత్రించిన ఇంకొక వ్యాసం మనలను ఆలోచింప చేస్తాయి. బృందావనంలో వితంతువులను దుర్భరమైన పరిస్థితి నుండి బయటకు తేవడంలో సఫలీకృతమైన ప్రియ రాసిన కథ వైట్ రెయిన్ బో ని విశ్లేషించిన వ్యాసం, వితంతు స్త్రీల మనోభావాలకు ప్రాధాన్యం ఇవ్వడం, సమాజానికి చేటు చేసే దురాచారాలను అడ్డుకోవడం అవసరమని నొక్కి చెప్పిన అక్కసు కథ పరిచయ వ్యాసం ఇందులో ఉన్నాయి.
వితంతు స్త్రీల స్థితిని సహజ మానవీయ స్పందనల కోణం నుండి వస్తువుగా చేసి కొడవటిగంటి కుటుంబరావు రాసినపెంపుడు తల్లి, దత్తపుత్రుడు, మళ్లీ పెళ్లి కథల పై వచ్చిన వ్యాసం పేర్కొనదగినది. వితంతువుల జీవితంలోని లైంగికత, మాతృ కాంక్ష మొదలైన సున్నితమైన భిన్న పార్శ్వాలను చర్చకు పెట్టిన ఈ వ్యాసం వితంతు సమస్యను గతానుగతికత్వం నుండి కాక వినూత్నంగా ఎలా చూడాలో, ఎలా అర్థం చేసుకోవాలో మన ముందు ఉంచుతుంది.
ఆధునిక కాలం వచ్చేసరికి వితంతువుల జీవితాల్లో వాళ్ల పరిస్థితుల్లో కొన్ని మార్పులు వచ్చాయి. కారణాలు ఏమైనా ఫలితంగా సమాజంలో స్త్రీల పరిస్థితిలో మార్పు రావడం వారికి ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాలలో పురోగతి ఉండడం మనం గమనించవచ్చు.ఇదివరకు వితంతువులు పెళ్లి చేసుకోవడం తప్పుగా నేరంగా భావించేవారు. కానీ ఆధునిక కాలంలో ఇష్టాఇష్టాలు, అవకాశాలు, సందర్భాలు, అవసరాలను బట్టి తమ జీవితాన్ని వితంతువులే కొత్తగా నిర్మించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది పూర్తి స్థాయిలో కొనసాగుతుందా అంటే లేదని చెప్పవచ్చు. గతం కంటే కొంత పరిస్థితులు మెరుగు పడవచ్చు కాని వితంతువుల సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రాంతాలు కులాలు వర్గాలు, మతాలు, జాతులను బట్టి వితంతు స్త్రీల సమస్యల్లో భేదాలు ఉన్నాయి, సాదృశ్యాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకొని నిర్దిష్ట కార్యాచరణతో సంఘటితంగా ముందుకు పోవలసిన అవసరం ఉంది.
కొండేపూడి నిర్మల, కొండవీటి సత్యవతి, బి రమాదేవి, కొమర్రాజు రామలక్ష్మి, బి అంజనీ దేవి, సుమిత్రా దేవి, కొలిపాక శోభ, స్వరాజ్యం వెంకటరమణమ్మ లాంటి వాళ్లు తమ వ్యక్తిగత జీవిత సంబంధాలలో, సామాజిక జీవితంలో తాము చూసిన, తాము విన్న అనేకమంది వితంతువుల జీవితాలను మన కళ్ళ ముందు ఉంచారు. అంతేకాదు లంబాడ తండాలలో గుడుంబా తాగి భర్త చనిపోతే బతకలేని స్థితిలో ఉన్న దుర్భరమైన వితంతువుల జీవితాలను కూడా ఈ పుస్తకం మన ముందు ఉంచింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఇందిరా క్రాంతి పథం పథకం ద్వారా జరిపిన ఒక అధ్యయనంలో మధ్యపాన బాధిత కుటుంబాల వితంతువుల సమస్యపై 11 మండలాల్లో 45 గ్రామాల్లో 32 గ్రామాలు పాక్షికంగా చేసుకొని జరిగిన అధ్యయనం వలన వితంతువుల జీవితాల్లో కంటికి కనిపించని అర్థం కాని దుఃఖం ఎంత వేదనాభరితంగా ఉందో బయట పెట్టిన ఒక వ్యాసం మనలను కదిలిస్తుంది.
కాల దోషం పట్టి నియమాలను ధర్మాలను భావాలను తిరస్కరిస్తూ నిలబడవలసిన అవసరం ఇవాళ ఉంది.వితంతువులను అర్థం చేసుకోవడం వాళ్ళ ఆలోచనలకు వాళ్ళ ఆకాంక్షలకు గౌరవం ఇవ్వడం వాళ్ల జీవితాన్ని వాళ్లే ఎన్నుకునేటట్లుగా అవకాశాలు ఇవ్వడం వాళ్ళ కాళ్ళ మీద వాళ్లు నిలబడే విధంగా కావలసిన నైపుణ్యాలను అందించడం ఆధునిక సమాజపు ఆదర్శం కావాలి. ఆచరణ కావాలి.
వర్ణాశ్రమ వ్యవస్థ, మనుధర్మం, మత ధర్మం, సంస్కృతి పేర స్త్రీలను బంధించిన అమానవీయ ఆచారాలకు వ్యతిరేకంగా, స్త్రీలు గౌరవంగా జీవించే హక్కు కోసం, స్వేచ్ఛా సమాజం నిర్మించుకునేందుకు సంఘటితం కావలసి ఉన్నది. ఆ దిశగా భారతీయ వితంతు వ్యవస్థ మీద చర్చ జరగడానికి ఈ పుస్తకం దోహదం చేస్తుంది.
సంపాదకులకు అభినందనలు