“శర్మ అమిత బిడియస్థుడు”- ఈ వాక్యంతో కథ మొదలవుతుంది. కథ చివరిలోకి వచ్చే సరికి అతని ఉద్రేక తీవ్రతని చూపిస్తారు. తనకే మాత్రం పరిచయం లేని వాళ్లు ‘డబ్బు పులు’ల్లా తన మీద పడి ఖర్చు చేయిస్తూ ఉంటే కూడా, తప్పించుకోలేనంత పిరికితనం అతనిది. చివరికి వచ్చే సరికి, చాలా మందికి చేతకానిపని – ‘తన తప్పును గ్రహించుకుని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరగలగడం’ – ఆ పని ధైర్యంగా చేస్తాడు.
పద్మనాభశాస్త్రి, మారుపేరుతో కథలూ, కవిత్వం రాస్తూ ఉంటాడు. శర్మకి అతని కవిత్వం చాలా ఇష్టం, కానీ అతను తన సహాధ్యాయి అని మాత్రం తెలియదు. శాస్త్రితోనూ, అతని మిత్రబృందంతోనూ – శర్మకి పరిచయం పెరిగే కొద్దీ ‘నిప్పు సెగ తగలగానే నెయ్యి కరిగినట్టు అతని పాత స్నేహితులు విచ్చి పోయినార’ ని కొకు రాస్తారు. ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. మన అభిరుచులూ, కోరికలూ, విలువలూ మనకి అంత స్పష్టంగా తెలీని స్థితిలో, మనని మొహమాట పెట్టేవాళ్లూ, బలవంతం చేసేవాళ్లూ – బెల్లానికి చీమలు పట్టినట్టూ – మన జీవితంలో చేరుతూ ఉంటారు. అదే మనం ఒక విషయం ‘సీరియస్’గా ఆలోచించడం మొదలుపెడితే, దాని ‘వెలుగు’ మన వ్యక్తిత్వంలోని ఇతర పార్శ్వాలపై కూడా పడడం మొదలవుతుంది. ఆ నిశ్చయాత్మక ధోరణి (assertive nature) సూచనలని గమనించి ‘పరాన్నజీవులు’ నెమ్మదిగా దూరమవుతారు.
వాదాన్ని వాదంలా కాక వ్యక్తిగతంగా తీసుకునే అనేక మందికి శర్మ ఒక ఉదాహరణగా కనిపిస్తాడు. అతనెవరో తెలియక ముందు – సాహిత్య ప్రయోజనాన్ని సాధించే విషయంలో శాస్త్రితో చర్చకి దిగి, తన ప్రశ్నలన్నిటికీ –జవాబులివ్వడం చూసి ఉక్రోషంతో –“కాలేజీ విద్యార్థులు సాహితీపరులయ్యేసరికి సాహిత్యం అధోగతికి పోతోంది” అంటాడు. మాట్లాడుతున్న విషయం గురించి కాక, మాట్లాడడానికి ఎదుటివారి కున్న అర్హతను ప్రశ్నించడం, ఈసడించడం – ఈ ధోరణి మనమంతా గుర్తు పట్టగలిగినదే.
దానికి విరుద్ధంగా పద్మనాభ శాస్త్రి – వ్యక్తిగతాన్ని అధిగమించిన బుద్ధిజీవికి ఒక ఉదాహరణ. ప్రత్యేక కవుల ప్రతిభ కన్నా, వారు సృష్టించే కవిత్వానికి కన్నా ఒక ఉద్యమానికీ, పోకడకూ ఎక్కువ విలువ ఉందని అతని సిద్ధాంతం. తన విశ్వాసాల మీద అభిమానంతో, పది మంది కవులు ముందుకు రావాలని కోరుకుంటాడు గాని, స్వయంగా తన మీద అభిమానాన్ని చూపాలని కోరుకోడు. చాలా అరుదైన మాట ఒకటి శాస్త్రి గురించి కొకు ఒకటి అలవోకగా అనిపిస్తారు – అది శాస్త్రి వ్యక్తిత్వ ఔన్నత్యానికి గీటురాయి వంటిది, అదేమిటంటే – “శాస్త్రి తన రచనల గురించి దీర్ఘచర్చలు ప్రోత్సహించే వాడు కాదట”. అనేది. నన్నడిగితే – రచయితైన ప్రతీ వ్యక్తీ పాటించవలసిన ప్రామాణిక నియమం ఇది. ఎందుకంటే -ఈనాడు చిన్నాపెద్దా లేకుండా అందరినీ పీడించే రోగం – ‘నేను చెప్పేది ఏమిటంటే’తోనే మొదలవుతుంది. రచయితలు కూడా ఈ బలహీనతకి దాసులౌతూనే ఉంటారు అడపా దడపా.
పద్మనాభ శాస్త్రితో శర్మ కలయిక రసవత్తరంగా ఉంటుంది. 60లనాటి సాహిత్య వాతావరణం ఎలా ఉండి ఉండేదో, సామాన్య పాఠకుడిని కేవల రసాస్వాదన నుండి – ప్రపంచం వైపు చూపు మరల్చేలా చేసిన ఆ చారిత్రాత్మక పరిణామం ఎలా ఉండేదో దానికి ఒక నమూనా అన్నట్టు శర్మలో వచ్చిన మార్పు గురించి ఇలా చెప్తారు మనకి: “యిది వరకు శర్మ తను చదివే పుస్తకాలలో వుండే భావాలకు సాంఘిక ప్రయోజనం వుందనే జ్ఞానం ఆట్టే లేకుండా వుండేవాడు. రచనల ద్వారా రచయితల పరిచయం చేసుకునే వాడే తప్ప ప్రపంచంతో పరిచయం చేసుకునేవాడు కాదు. శాస్త్రి కవిత్వం నిండా స్వాతంత్ర్య కాంక్షా, దారిద్ర్యం గురించీ, అజ్ఞానం గురించీ ఆవేదనా, కష్టజీవుల గురించి బాధా మొదలైన వాటిని రససాధనాలుగా పరిగ్రహించేవాడే కాని, అవి యదార్ధమైనవనీ, జీవితంలో వాటికి వేరు వేరు అర్ధాలున్నాయనీ ఎన్నడూ బుద్ధితో గ్రహించి వుండలేదు.” చిత్రమైన సంగతేమిటంటే – రెండడుగులు ముందుకేసి, అయిదడుగులు వెనక్కి వేస్తున్నాం మనం. సాంఘిక స్పృహ కలిగి ఉండడమనేది – పాఠకుడికీ, రచయితకీ కూడా రసాస్వాదనకీ, రస పోషణకీ ఒక పెద్ద ఆటంకమన్న వాదం ఒకటి ప్రచారంలోకి వస్తోంది. ఈ జంక్షన్‌లో ఒకసారి ఆగి, మనం వచ్చిన దారీ, చేరాలనుకుంటున్న గమ్యమూ మరొక్క సారి – స్ఫురణకి తెచ్చుకుని ముందుకు వెళ్లే మార్గాన్ని నిర్ణయించుకోవలసి ఉంది. దాని కోసం కుటుంబరావు కథలు తప్పకుండా ఉపకరిస్తాయని నా విశ్వాసం.
సరే కథలోకి వస్తే, ప్రపంచంలో ఏయే సాంఘిక నియమాలున్నాయో వాటినల్లా పాటించడమే మంచివాడి లక్షణమని శర్మ నమ్మి ఉండేవాడు. అలాటి వాడికి పూర్తి విరుద్ధమైన భావజాలం శాస్త్రిది. అతని మీద శర్మకు గౌరవంతో పాటు అంతో ఇంతో భయం కూడా ఉండేది. ఎందుకంటే అతను శర్మలాగా లోకాన్ని ఉన్నదున్నట్టు ఆమోదించినవాడు కాదు. ఈ మార్పులన్నీ ఒకెత్తైతే, శాస్త్రి చెల్లెలు వనజాక్షి పరిచయం మరో ఎత్తు.
అతి సాధారణమైన శర్మ ప్రపంచంలోకి మనోహరమైన మంచి గంధపు పరిమళంతో వనజాక్షి ప్రవేశిస్తుంది. రావడం రావడమే ఉద్ధృతమైన వేగంతో వచ్చి ఊపేస్తుంది, కళ్లు మిరుమిట్లు గొలిపే స్వతంత్ర వ్యక్తిత్వ ప్రకాశం ఆమెది. అతని దిగ్భ్రాంతికి కారణం రెండు చిన్న వాక్యాలలో ఇలా చెప్తారు: “శాస్త్రి మగవాడు, అతనిలో యిటువంటి ఆవేశం వుండడం అంత వింత కాదు. శాస్త్రి చెల్లెలు వనజాక్షి కూడా ఇదే ధోరణి”. లోకదృష్టి (world view)లో – ఇంతటి భేదం ఉన్న వారిద్దరి మధ్యా అపురూపమైన ప్రణయాన్ని నిర్మిస్తారు కొకు. గొప్ప ప్రేమ కథలన్నిటికీ – ఒక లక్షణం ఆవశ్యకం అంటారు. ప్రేమికులిద్దరూ కలవాలని మనలో తీవ్రమైన కోరిక రగిలించాలి. నాకైతే ఒక నవలలో ఉండగల గాఢమైన అనురాగం అంతా, ఆ రెండు మూడు పేరాలలోనే కనిపించింది.
మనిషి భావావేశాలు – అతని చైతన్యానికి, స్పృహకూ ఆటంకంగా మారిన చిత్రీకరణలని తరచుగా కథల్లో చూస్తూ ఉంటాం. కానీ దానికి భిన్నంగా ప్రేమ, ఆరాధన – వ్యక్తి మేధో పరిణతికి కూడా దోహదం చెయ్యగలవని వీరి ప్రణయం నిరూపిస్తుంది: “తన కేదైనా పుస్తకం గానీ సినిమా కాని నచ్చితే వెంటనే ఆ అనుభవం వనజాక్షి కూడా పంచుకోవాలని ఉబలాటపడేవాడు. వనజాక్షి తన అభిరుచిని బలపరచకపోతే చాలా కష్టపడేవాడు. కానీ వనజాక్షి విమర్శ శ్రద్ధగా వినేవాడు. ఆమెతో చర్చించి తన అభిరుచులని చాలా మార్చుకున్నాడు.” ఇలాటి దృష్టాంతాలు – పుస్తకాల్లోనూ, బయటా చాలా చూస్తాం కానీ, తర్వాతి వాక్యాలు రెండూ ఈ జంట ప్రత్యేకతని నిలబెడతాయి. “కాని అతనికట్లా చెయ్యడం వల్ల ఆత్మ విశ్వాసం తగ్గలేదు. అతని వ్యక్తిత్వానికి భంగంకూడా రాలేదు.” స్త్రీపురుషుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలని చర్చించేటప్పుడు – ఈ అంశం ప్రాసంగికత చాలా ఉంటుంది.
వనజాక్షి ఉన్నత సంస్కారం – తన వెనకబాటు జీవితంలో ఇమడదన్న వాస్తవం ఒక పక్కా, ఆమెని పోగొట్టుకున్నాక ఆ ఖాళీని ఇక దేనితోనూ పూరించలేననే బెంగ మరో పక్కా – శర్మని వేధిస్తూ ఉంటాయి. తనంతట తాను వదులుకోలేడు కనక ఆమే తనని దూరం పెడితే బాగుండుననిపిస్తుంది అతనికి. అతని భావావేశానికీ, చైతన్యానికీ తలవని తలంపుగా పరీక్ష ఎదురౌతుంది.
యుద్ధానంతరం, తిండి దొరక్క ఆకలిచావులతో సామాన్య జనం మాడిపోతుంటే, 60వ దశకంలో – నిత్యావసర వస్తువుల ధరల మీద కంట్రోళ్లు పెట్టింది ప్రభుత్వం. డబ్బు చేసుకోడానికి ఇదే సమయమని వస్తువులని దాచి, డిమాండుని ఇంకా పెంచి హెచ్చుధరలకే వాటిని అమ్మే వ్యాపారం – బ్లాక్ మార్కెటింగ్ అమితంగా పెరిగిపోయింది. అప్పట్లో చాలా కథల్లో ఆ అంశం చర్చకు వచ్చి ఉంటుంది. 1960లో కాలాబజార్ అనే సినిమా కూడా వచ్చింది – విజయ్ ఆనంద్ రాసి, దర్శకత్వం వహించినది. కథలోకి వస్తే – “చీకటి బజారు” అనే గేయం రాస్తాడు శాస్త్రి. అంత వరకూ పాఠకులకు కూడా తెలియని విషయం – శర్మ తండ్రి బ్లాక్ మార్కెటింగ్ చేసి డబ్బు గడించాడని. కథ మొదట్లో ఒక వాక్యం – “శర్మ తండ్రి ‘ఇటీవల’ చాలా డబ్బు గడించాడు” అని మాత్రం ఒక క్లూలా చెప్పి ఊరుకుంటారు.
చీకటి బజారు గేయం – శర్మ మిత్రులకి వినిపిస్తాడు. అందులో జారత్వమూ, చోరత్వమూ, దొంగ వ్యాపారమూ ఒకేసారి వర్ణింప బడతాయి. శర్మ దానిని విని బిగుసుకు పోతాడు. మిగిలినవారి సంగతి ఎలా ఉన్నా దొంగవ్యాపారం చేసే వాళ్లని వనజాక్షి తిట్టడం సహించలేకపోతాడు. ఇక్కడ ఒక చిత్రమైన మాట అంటారు రచయిత – “మనం ఇతరులను క్షమించినంత సులభంగా, ప్రేమించిన వారిని క్షమించలేం.” ఎందుకలా? అంతవరకూ ఎటువంటి దాపరికం లేకుండా అన్ని విషయాలనూ చర్చించగలిగిన శర్మ హఠాత్తుగా అలా ఎందుకు మారిపోవాలి, కొకు అయితే – “ఆ గేయానికీ అతనికీ మధ్య ఏదో ఒక గోడ అడ్డం వున్నట్టు కూడా” కనిపించిందంటారు. ఏమిటా అడ్డు అని ఆలోచిస్తే – శర్మ స్పందన మానవ స్వభావంలోని చీకటి మూలల్ని స్పృశిస్తుందనిపిస్తుంది.
ఎప్పటికప్పుడు ఆలోచనలని సరిదిద్దుకుంటూ, పాత వాసనలు వదిలించుకుంటూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ, ప్రగతి మార్గంలో అడుగులు వేస్తున్న వ్యక్తిలో సైతం – మారవలసిన విషయాలు ఇంకా కొంత మిగిలి ఉంటూనే ఉంటాయి. జీవించి ఉన్నంతకాలం నిరంతరం ఆ ప్రక్షాళనం జరగాల్సిందే. దానికి కావలసింది – నిర్మమకారమైన వస్తుగత దృష్టి. అయితే – తనకే తెలియకుండా తాను ఆమోదించినవీ, తన స్వంతమనిపించే వాటి గురించి ఎవరైనా విమర్శిస్తే – వాటిని ఆబ్జెక్టివ్‌గా తీసుకోడం అంత తేలిక కాదు. అంతకు ముందు కూడా చెప్తారు కథలో – తాను అలవరుచుకుంటున్న కొత్త సంస్కారం మీద ఇప్టం ఉన్నా తన కోసం ఇంటి దగ్గర ఎదురుచూసే కుళ్లు జీవితాన్నితృణీకరించే శక్తి శర్మ దగ్గర లేదని. తన గతమే తన భవిష్యత్తుగా ఉండబోతోందని అతని నమ్మకం. తన తండ్రి నేరస్తుడు కాకుండా ఉండాలని అతను లోలోపల కోరుకుంటూ ఉండాలి. తప్పనిసరి అయి తాను అంగీకరించిన తండ్రినీ, అతని నల్ల వ్యాపారాన్ని – వారు పనిగట్టుకుని విమర్శిస్తున్నట్టుగా భావిస్తాడు. విమర్శలో వాస్తవం ఉన్నట్టు ఏపాటి తోచినా – అది చేసిన వాడి ఉద్దేశాల్లో తప్పులు వెతకడం – అసంకల్పిత ప్రతీకార చర్య – చాలా మందికి.
ఇందాకే చెప్పుకున్నట్టు శర్మకు ఆగ్రహం కలిగితే ఆబ్జెక్టివిటీని ముందు వదిలేస్తాడు. వ్యక్తిగత ఆరోపణలు చెయ్యడం, అవతలివారు చేసారని నమ్మడం – అతని లక్షణం. నల్లబజారు గేయం తనని ఈసడించడానికే రాయించి ఉంటుందని వనజాక్షిని సైతం అనుమానిస్తాడు. తండ్రి చేసిన పని తన నెత్తికి ఎత్తుకుని వెనకేసుకు రావాలని చూస్తాడు. అది చూసి వనజాక్షి అగ్గిరుద్రురాలవుతుంది.
ఈ ఉదంతం అంతటిలో ఆబ్జెక్టివిటీని వదలని వ్యక్తి పద్మనాభ శాస్త్రి. ఈ సందర్భంలో అతను చెప్పే మాటలు అతని భావాలని మనకి స్పష్టం చేస్తాయి: “మనం ఏ దొంగ వ్యాపారి గురించీ మాట్లాడుకోవడం లేదు. దొంగ వ్యాపారం గురించి మాట్లాడుకుంటున్నాం. రేపీ కంట్రోళ్లు రద్దైతే బహిరంగంగానే ధరలు పెంచి వ్యాపారాలు సాగిస్తారు. శర్మగాని, వనజాక్షిగాని వ్యక్తిగతమైన నిందలకు దిగవలసిన అవసరం లేదు.”
కథకు ముగింపు తెచ్చేది ఒక అనూహ్యమైన మలుపు. సెలవులకు శర్మ ఇంటికి వెళ్లినపుడు ఆ డబ్బుపులి స్నేహితులు – అతని ఊరికొచ్చి ఒక వారం రోజులుంటారు. తండ్రి వారి మీద యెంతో డబ్బు ఖర్చు పెట్టి చాలా ఆదరిస్తాడు. చాలా పెద్ద మనుషులని కితాబిస్తాడు. దానితో శర్మకు మబ్బు విడినట్టౌతుంది. వాళ్లకీ, వనజాక్షికీ ఉండే భేదం మరింత స్పష్టమవుతుంది శర్మకి. అతని మాటలకీ, ఆలోచనలనకీ విలువనిస్తుంది – కనకే ప్రేమిస్తుంది, కోపం తెచ్చుకుంటుంది, పోట్లాడుతుంది, భరించలేకపోతే దూరంగా పొమ్మంటుంది. అయితే అతనిని ఏమాత్రం పట్టించుకోకుండా – అతని నుంచి కేవలం ‘పొందడానికే’ చేరే పెద్ద మనుషులు – ఈ డబ్బు పులి స్నేహితులు. తన తండ్రికి కావలసింది డబ్బుకు దొరికే పెద్ద మనుషులు. దాని అంతరార్ధం అతనికి బోధపడుతుంది.
శర్మ తండ్రి వంటి వారిని వేల కొద్దీ మన చుట్టూ చూడొచ్చు. వారేదో ఒక రకంగా ఒక ‘పదవి’, లేదా ‘కీర్తి’, ‘పవర్’ లేదా ‘నెట్‌వర్క్’ సంపాదించుకుంటారు. దాని కోసమే వారి దగ్గరకు వ్యక్తులు స్నేహితులుగా చేరుతున్నారని సైతం వారికి తెలుసు. దానినే కోరుకుంటారు. వారు నిజాయితీని ఆశించరు కూడా. ప్రతిఫలం ఆశించే అయినా తమ వద్దకు నలుగురూ చేరడం వారికి కావాలి.
దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి – భావాలనీ, ఆలోచనలనీ ఇచ్చిపుచ్చుకోడంతో ఏర్పడే సంబంధాలు. అక్కడ విమర్శ ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది – మార్పు ఉంటుంది. ప్రతిఫలాపేక్షతో చేరే వారు విమర్శ చేయరు, భావసారూప్యం కోసం ప్రయత్నించే వారే విమర్శకు పూనుకుంటారు. దాని నుంచి దూరం జరగడం అవివేకం.
ఈ స్పృహ కలగగానే – తనెంత పిచ్చి పని చేశాడో తెలుసుకుని శర్మ వనజాక్షికి క్షమాపణ ఉత్తరం రాస్తాడు. కథలో కెల్లా మణిపూస అనదగ్గ వాక్యం – ఆఖరు వాక్యం. వనజాక్షి ఇలా రాస్తుంది: “కపటం ఉన్నవాళ్లెవరూ తమ ఉద్రేకాన్ని మీలాగ బయటపెట్టుకోరు. అది గ్రహించలేకపోయినాను.” క్షమాపణ చెప్పే వాడిలో ఎంత అంతర్మధనం జరుగుతుందో, అంతకంటే ఎక్కువ దానిని అందుకునేవారిలో జరుగుతుంది, జరగాలి కూడా. విమర్శని స్వీకరించాలంటే – ఆబ్జెక్టివిటీతో ఆలోచించగలగాలి. క్షమాపణని స్వీకరించాలంటే – మనిషి మారగలడని, మారుతూ ఉంటాడని నమ్మగలగాలి. అవతలివారి పొరపాటుకు కారణం ఏమిటో గ్రహించగలగడం, దాని నుండి వారు బయట పడిన క్షణాన్ని గుర్తించగలగడం – అదే నాగరికతకు నిగ్గు. ఈ స్థాయి సంబంధాలూ, సంబాషణలూ – బుద్ధిజీవుల మధ్య జరగాలని ఆశించడం అత్యాశ కాదేమో.
కధ ఎవరి కి వాళ్ళు చదువు కుంటె ఎంతో బాగుంటుందని నా అభిప్రాయం కానీ.. మీరు నా అభిప్రాయం తప్ప ని .. నిరూపించారు. చక్కగా చదివే రు. మంచి మనొ విశ్లేషణాత్మక కథ. అభినందనలు కళ్యాణి గారికి.
చాలా బాగుఁది కల్యాణి
ఆ రోజుల్లోనే సాహిత్యోద్యమ అవసరాన్ని కొకు కథ చెదరకుండా ఎంత బాగా చెప్పాడు. ప్రతి మలుపు దగ్గర మీ interpretation చాలా బాగుంది