ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక పాఠకుల ముందుకు తెచ్చిన “బోల్షివిక్ విప్లవం-స్ఫూర్తి వ్యాసాలు” నూరేళ్ళ బోల్షివిక్ విప్లవ సందర్భంగా తేవటం సముచితం, సరియైన సందర్భం కూడా. ఎన్నో ఏండ్లుగా పీడనకు గురై అణిచివేతలో సమస్త కష్టాలను పడుతూ, వాటినిక సహించలేని అనివార్య పరిస్థితుల్లో అనేక దశాబ్దాలు ఉద్యమాన్ని నిర్మించుకుంటూ పోరాడుతూ 1917న బోల్షివిక్ పార్టీ నాయకత్వంలో జార్ ప్రభుత్వాన్ని కూలదోసి సోవియట్ యూనియన్ ను ఏర్పాటు చేసుకున్నారు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటు సడలని పట్టుదలతో గుండె ధైర్యంతో లెనిన్ నాయకత్వంలో మార్క్స్ సిద్ధాంతంతో ప్రజలను సమీకరించుకుంటు సమాయత్తపరుస్తూ బోల్షివిక్కులు సోవియట్ యూనియన్ ఏర్పరచుకొన్నారు. ప్రపంచమంతా ఈ విప్లవాన్ని, విజయాన్ని ఆదర్శంగా తీసుకుంది. అనేక ఉద్యమాలు చేపట్టింది. ఎన్నో హక్కులను సాధించుకొంది. అంతటి ఆదర్శప్రాయమైన ఆ సోవియట్ యూనియన్ 1991లో పతనమైంది. ఇది కేవలం రష్యాకే పెద్ద చెంపపెట్టు కాదు. వామపక్ష పార్టీలన్నిటికీ ఓ సవాలైంది. ప్రస్తుతం ప్రపంచమంతటా ప్రజాస్వామ్యమే కొనసాగుతున్నట్లు కనబడుతున్నప్పటికీ అది మేడిపండు అని అందరికీ తెలిసిందే. ప్రశ్నించిన గొంతులు తీవ్రవాదమై జైల్లో మగ్గుతున్నాయి. స్వార్థం జడలు విచ్చుకుంటున్నది. మద్యం, డబ్బు ప్రధానమైపోయినవి. మానవత్వం మంట కలుస్తున్నది. ఈ పతనం చాపకింది నీరులా చేరి జనసామాన్య జీవితాలను అగాధంలోకి నెట్టివేస్తున్నది. ఇట్టి సందర్భంలో ఈ వ్యాసాలను పాఠకలోకం ముందుకు తేవడం సముచితమైందిగా భావిస్తున్నాను, హర్షిస్తున్నాను కూడ. ఇందులో పద్నాలుగు వ్యాసాల్లో నల్లూరి రుక్మిణి, అనిశెట్టి రజిత రెండేసి వ్యాసాలు రాయడం వల్ల రచయితలు పన్నెండుమందైనారు.
ఈ సంకలనాన్ని తీసుకొచ్చిన తీరులో ఓ విలక్షణత ఉన్నది. నల్లూరి రుక్మిణి విప్లవ తాత్వికతను మహిళా సమస్యలను ముందుకు తెస్తే మిగిలిన వారు పదిమంది ఆ సాహిత్యాన్ని ప్రస్తావించారు. ఒక రచయిత్రి (శివలక్ష్మి) దృశ్యీకరించబడిన సాహిత్యాన్ని విశ్లేషించింది.
నల్లూరి రుక్మిణి “మహోజ్జ్వల భవిష్యత్తును నిర్మించి విప్లవ విజయాన్ని అందించిన బోల్షివిక్ విప్లవం అంచెలంచెలుగా కొనసాగి ఎట్లా విజయవంతమైందో దాన్ని అర్ధం చేసుకొని విశ్లేషించుకొని ప్రజారాసులను సాయుధ విప్లవం వైపు నడపడంలో బోల్షివిక్ పార్టీ నిర్వహించిన పాత్ర తెలుసుకోవడం అవసరం” అంటుంది. అందుచేత ఆమె సమగ్రంగా జార్ పాలక కుటుంబాల మతసంస్థల ఆధిపత్య నిరంకుశ ధోరణులను, పేద రైతుల నికృష్ట జీవితాలను, భూములను బీడు చేసుకుంటూ వలస కూలీలుగా వెళ్ళిన పరిస్థితుల్లో లెనిన్ నాయకత్వంలో అంతరాయం కల్గిస్తున్న మెన్షివిక్కులను లిబరల్ బూర్జువా వాదులను ఎదుర్కొంటూ 1905లో తొమ్మిది రోజుల పాటు చేసిన సమ్మె అనివార్యంగా, అర్థాంతరంగా నిలిపివేసినా, లోటుపాట్లను సర్దుకుంటూ ప్రణాళికలను నిర్మించుకుంటూ 1917లో విప్లవాన్ని విజయం చేసుకోవటం వెనుక తాత్వికతను సంపూర్ణంగా వివరించింది. మహిళా సమస్యలను చర్చించి స్త్రీలు పోరాట దిశలో పాల్గొనడానికి పార్టీ చేపట్టిన ప్రణాళికలను, అది ఫలవంతమై స్త్రీలు నాయకత్వదిశలో అచంచల దీక్షతో తామే ముందుండి సమ్మెను నడిపించిన సందర్భాలను, తమ సమస్యలను పరిష్కరించుకొని హక్కులను సాధించుకొన్న తీరును తన వ్యాసంలో పొందుపరిచింది కూడ.
ప్రముఖ విమర్శకురాలు కాత్యాయనీ విద్మహే తన వ్యాసంలో విప్లవ-విజయానికి ఉపోద్ఘాతం ఇస్తూనే వ్యాసంలోని సాహిత్య విభాగాన్ని 1. బోల్షివిక్ విప్లవ పూర్వ రష్యన్ సమాజ చిత్రణ సాహిత్యం 2. విప్లవోద్యమ ప్రతిఫలన సాహిత్యం 3. సోషలిస్టు సమాజ నిర్మాణ సాహిత్యం అంటూ దాన్ని మూడు విభాగలుగా చేసింది. మొదటి విభాగంలో 1. నికొలాయ్ గొగోల్ మృతజీవులు” (1842) 2. దోస్తాయేవ్ స్కీ “పేదజనం” (1845-1846) 3. ఇవాన్ తుర్గనీవ్ తొలి నవల “రుడిన్” 4. ‘తాల్స్టాయ్ అన్నాకరేనినా’ నవల – పందొమ్మిదో శతాబ్ది తొలి మూడు దశకాల రష్యా సమాజాల జీవిత చిత్రణ 5. మాక్సిమ్ గోర్కి ‘భయస్తుడు’ నవలలను విశ్లేషించింది. రెండో విభాగంలో 1903-1924లలో లెనిన్ నాయకత్వంలో బోల్షివిక్ విప్లవం నడిచిన ఇరవై ఏళ్ళ కాలపు వేగవంతమైన సామాజిక రాజకీయ పరిణామాలను మానవ జీవిత సంవేదనలను చిత్రించిన మాక్సింగోర్కి ‘అమ్మ’ నవల (1901 నుండి 1905 వరకు గల విప్లవోద్యమ సన్నాహక కాలపు సంరంభాన్ని ఇతివృత్తంగా గల) మిస్కీ స్లావిస్కీ నవల ‘అజ్ఞాతవీరుడు’, అలెగ్జాండ్రా కొల్లంటాయ్ ‘రెడ్ లవ్’ ‘ఎ గ్రేట్ లవ్’ ‘ది లవ్ ఆఫ్ త్రి జెనరేషన్స్ (మూడు తరాలు) ‘బి లవ్యేనోవ్’ నలభై ఒకటోవాడు నవలికలను (అంతర్యుద్ధానికి సంబంధించినది) మూడో విభాగంలో మిహైల్ షోలకోవ్ రాసిన ‘డాన్ నది ప్రవహిస్తూనే ఉంది’ (తీఖ్డాన్), నికొలాయ్ ఓస్ట్రోవ్స్కీ ‘కాకలు తీరిన యోధుడు’, మెఖైల్ షోలకోవ్ (బీళ్ళు దున్నారు’, గలీనాని కొలయేవా, ‘అపరిచిత’ ఆంతనేన కొలద్దేవా ఇవాన్ ఇవనోచ్ బగమొలవ్ ‘పసివాడి పగ’ (1953-1954లలో సోవియట్ యూనియన్ నడిపించిన ఉద్యమం) మొదలైన వాటిని సారవంతమైన విశ్లేషణలతో ప్రస్తావించింది. వ్యాసానికి ముగింపుగా సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రజల స్వరాన్ని నమోదు చేస్తూ 2013 లో స్వేట్లానా అలెక్స్ విచ్ ‘సెకెండ్ హాండ్ టైం – ది లాస్ట్ ఆఫ్ ది సోవియట్స్’ ను కూడా చెప్పింది.
కాత్యాయనే కాకుండా మిగిలిన రచయితలు విశ్లేషించిన వ్యాసాల్లో కూడా ఆమె ప్రస్తావించిన సాహిత్యం కూడా కనబడుతుంది. శాంతి ప్రబోధ టాల్స్టాయ్ ‘అన్నా కరెనీనా’ నవలను విశ్లేషిస్తూ అన్నా కరేనీనా జీవితాన్ని హత్తుకొని గాఢంగా పరిశీలించి పరిశోధించి పాత విలువల స్థానంలో కొత్త విలువల్ని పొందుపరిచే సాహసోపేతమైన నిర్ణయంగా అనిపిస్తుంది అన్నాకరేనీనా అని చెపూనే మనుషుల్లో ఉండే అనేకానేక మనస్తత్వాలు ద్వంద్వ వైఖరులు మనకిందులో దర్శనమిస్తాయని మనిషి జీవన విధానానికి, అభిప్రాయానికి ఉండే తేడాలు ఇందులోని పాత్రలు తెల్సుతాయంటుందీమె.
అనిశెట్టి రజిత ‘చెహోవ్ కథల్లో విప్లవ పూర్వ సమాజం’ వ్యాసంలో ‘గుమస్తా మరణం’, ‘బురఖా కథ’, “సీతాకోక చిలుక’, కుక్కను వెంట పెట్టుకున్న మహిళ కథ’, ‘పెళ్ళికూతురు’ కథలను ప్రస్తావిస్తూ ఆయన కథలన్నీ సున్నితంగా, ఉద్విగ్నంగ, సంక్షుభితంగా ఉపదేశాలు, సంస్కరణ సందేశాలు లేకుండా ఉంటాయంటూ అవి అసంతృప్త జీవితాల్ని సంతృప్తం చేసుకోవాలని చెప్తాయని కఠినమైన హాస్యంతో కవితార్ధ్రతతో… తీవ్రమైన వ్యంగ్య ధోరణితో ఆశావహ దృక్పథాన్ని, సత్యాన్ని సందేశంగా ఇచ్చే రచనలని, కవిత్వంలో అంతర్లీనంగా రష్యన్ సంస్కృతికి పునాదిగా శ్రమ లేకపోవడం అనే హేతు రాహిత్యాన్ని నిర్వేదంతో కూడిన అస్థిత్వాన్ని అసమగ్రతను చూపిస్తారంటుంది.
‘సమాజం నొసటిమీది రాచపుండు యమకూపం’ వ్యాసం కూడా రజితదే. రష్యాలో వందేళ్ళక్రితం ఉన్న సమాజంలో వ్యభిచారం ఒక నికృష్టవృత్తి అంటుందీమె. స్త్రీల జీవితాల్ని నరకం చేస్తున్న వ్యభిచారం ఇతివృత్తంగ కుంప్రిన్ ‘యామా’ నవలకు అనువాదమే రెంటాల గోపాలకృష్ణా అనువాదమే యమకూపం. నవలను చదువుతుంటే రష్యన్ తెలుగు సమాజానికి జీవితాలకు లంకె వేసిన సారూప్యం ఉంటుంది అంటది రజిత.
వ్యభిచార గృహాల్లోని నికృష్టజీవితం, నాగరికులుగా చెప్పుకోబడే అన్ని హోదాలవాళ్ళు వాళ్ళను నీచంగా అనుభవించటం అందరికీ తెలిసిందే. ఓ సందర్భంలో వచ్చిన రౌడీమూకను ప్రతిఘటించినప్పుడు వాళ్ళ జీవితాలకు జరిగిన నష్టం చెప్పలేనిది. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ జనరల్ సానికొంపల్ని మూసేయమన్నపుడు ఆ ప్రాంతం నిర్మానుష్యమై నిశ్శబ్దమావరించి, వ్యభిచారిణులు నగరంలో చెల్లాచెదురై, పిచ్చివాళ్ళె, బిచ్చకత్తెలై తిరగడాన్ని ఉటంకిస్తూ “ఎయిడ్స్ రోగం కన్నా వ్యభిచారం జబ్బు ప్రమాదకరంగా వ్యవస్థను పట్టిపీడిస్తున్నదని, ఈ జబ్బు మనల్ని వందేళ్ళు వెనక్కి ఈడ్చుకుపోయి మళ్ళీ వందేళ్ళు ముందుకు ఈడ్చుకువచ్చి దోషుల్లా పాపుల్లా అసమర్థుల్లా నిలబెట్టి చీత్కరిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తుందీ రచయిత్రి. నిజమే ఇటీవల తెలుగు రాష్ట్రాల దేవాలయాల సన్నిధిలో జరుగుతున్నది కూడా అదే.
పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రతిబింబించిన కుంప్రిన్ కథలు వ్యాసంలో మందరపు హైమావతి ‘మొలాఖ్’, ‘ఒలేస్యా’, ‘గంభీనస్’, ‘ఇజుమృద్’, ‘రాళ్ళవంకీ’ కథలను చర్చకు తెస్తుంది. కుప్రిన్ది కవితాత్మక శైలి అని వాక్యాలు కవితా పరిమళాలతో గుబాళిస్తుంటాయని కథాకథన పద్ధతిలో మౌఖికశైలి కనపడుతుందంటుంది. ‘ఒలేస్యా’ కథలో ఒలేస్యా అమ్మమ్మ (మంత్రగత్తె)ను గురించి ప్రస్తావిస్తూ ప్రజల ద్వంద్వ వైఖరిని విమర్శించిన తీరు చాలా సహజంగా ఉండి అందరినీ ఆలోచింప చేస్తుంది. మనిషి స్వార్ధపరుడు, దురాశాపరుడు, సాటిమనిషిపై ప్రయోగాలు చేస్తాడు. ఉద్యోగం కోసం ఉంగరాలు ధరిస్తాడు. ప్రేమించిన ప్రియురాలు వచ్చి తన ఒళ్ళో వాలాలని వశీకరణ మంత్రాలు జపిస్తాడు. జ్వరం వస్తే తాయెత్తులు కట్టుకొంటాడు. తేలుకుట్టినా, పాముకరిచినా మంత్రం పెట్టించుకుంటాడు. అట్లా గండం గడిచి గట్టెక్కుతాడు. కానీ అవే పనులు చేసే మంత్రకత్తెలను దూషిస్తాడు. మనిషే ప్రశ్నలు చెప్పమని అడుగుతాడు. మనిషే దండిస్తాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుందీ రచయిత్రి. కుంప్రిన్ కథలన్నీ ఆనాటి పాలకుల నియంతృత్వ ధోరణిని ఎండగడుతూ కొరడా ఝళిపించిన కథలని, సామాన్యప్రజలను, కార్మికులను పూచికపుల్లలా చూస్తూ పనిచేసే మానవయంత్రాల్లాగా పరిగణించే బూర్జువా మనస్తత్వ ధోరణిని నిర్భయంగా నిరూపించిన నిప్పుకణికల అక్షరాలవి అంటుందీమె.
వర్గపోరాటానికి ఎత్తిపట్టిన దివిటీ ‘అమ్మ’ నవలను రచయిత్రి బండారు విజయ విశ్లేషించింది. వ్యాసం ప్రారంభంలో గోర్కీ జీవితంతో పాటు అతనికి సమాజంతో, రాజకీయాలతో, సాహిత్యంతో గల సంబంధాన్ని అనుబంధాన్ని వివరిస్తుంది. బానిసత్వం నుండి విముక్తి కోసం కార్మికవర్గ నాయకత్వశక్తిగా నిలిచి, శ్రామిక రాజ్యాన్ని నిర్మించుకునే దిశగా అచంచల విశ్వాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నవల గోర్కీ ‘అమ్మ’ అంటూ నూట పది సంవత్సరాల క్రితమే ఒక అద్భుత కళాఖండంగా సృజింపబడి ఇప్పటికీ సజీవంగా కార్మిక వర్గపోరాటమే బానిసత్వ సంకెళ్ళ నుండి విడిపించే విముక్తి ఆయుధమని చెప్పిన రచన గోర్కీ ‘అమ్మ’ నవల అంటుందీమె. శ్రామికుల శ్రమను దోచుకోవటం పైనే పెట్టుబడిదారీ విధానం ఆధారపడి ఉంటుందన్న నిజాన్ని మార్క్ ఎంగెల్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఆధారంగా ఈ నవలను గోర్కీ రాసాడంటుంది విజయ. ఉద్యమంతో మమేకమై జీవిస్తున్న పోరాటయాత్రలో పావెల్ తల్లి నీలోవ్నా మొదట్లో ఉద్యమం పేరు వింటేనే జంకేది. కొడుకు ఉద్యమంలో పాల్గొనడాన్ని చూసి జంకేది. కానీ కొడుకు మనసెరిగిన ఆ తల్లి కొడుకు పోరాటాన్ని ఆచరణను చూసి యథార్ధాన్ని అర్థం చేసుకుంది. అతని ప్రవర్తన, అతడు అతని స్నేహితుని ఉద్భోదలు ఆమెలో నిద్రాణమైన చైతన్యాన్ని జాగృతపరచడంతో కొనఊపిరి వరకు ఉద్యమానికి సహకరించిన తీరును సాంతం ఒడిసిపట్టి పరిచయం చేస్తుంది విజయ.
కొమర్రాజు రామలక్ష్మి “మానవ సంబంధాలను ప్రతిబింబించిన గోర్కీ కథలు” వ్యాసంలో “స్వేచ్ఛాప్రియులు”, “బహిష్కృతుడు”, “శూరుడు”, “ఆరాత్రి”, “పాఠకుడు”, “పక్షిపాము”, “తుఫాన్ పక్షిపాట”ముసలోడు-పిల్లోడు”, “దేశద్రోహి” కథలను విశ్లేషిస్తుంది. సమాజం ఉక్కుపాదాలతో అట్టడుగు లోతులకు తొక్కి వేయబడి అక్కడ చీకటిలో దారి తెన్ను కానక కొట్టుమిట్టాడుతూ బ్రతుకులు బాధాకరంగా పరిగణించబడిన పరిస్థితులను అర్థం చేసుకోలేని బహిష్కృతుల తిరస్కృతుల కష్టాల, ఆలోచనల కదలికలకు గోర్కీ ఆకారం కల్పించాడంటుంది. ఈ కథల ద్వారా గోర్కీ ప్రాపంచిక దృక్పథం వ్యక్తమౌతున్నదని కూడా చెప్తుంది రామలక్ష్మి.
1941 జూన్లో రష్యామీద దాడి చేయడానికి ఒక సంవత్సరానికి ముందు రష్యా ఉత్తర ప్రాంతంలో జరిగిన వృత్తాంతం ఆధారంగా ‘ఆంటోనీనా కప్తాయేవ’ ఆదర్శజీవులు నవలను రాసాడు. కథాకాలం 1940 మే – 1941 జూన్. కధలో మంచి వ్యక్తిత్వమే ఉన్న వైద్యుడు ఇవాన్ భార్యపట్ల మాత్రం పురుషాధిక్యతతో వ్యవహరించడం వంటి విషయాలతో పాటు ఆ రోజుల్లో అందరూ యుద్దంలో విధిగా పాల్గొనాల్సిన పరిస్థితిని వివరిస్తూ ఉన్నత విలువల జీవితాలకై ఘర్షణే ఆదర్శజీవులు” అన్న వ్యాసంలో “ప్రజలంతా యుద్దాలు లేకుండా ప్రపంచం ముందుకు పోవాలని కోరుకున్నవారే, శాంతిని ఆకాంక్షించిన వారే కానీ సామ్రాజ్యవాద దేశాలు సృష్టించిన యుద్ధంలో తమ దేశాన్ని తమ ప్రజలను తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న సోషలిస్టు సమాజాన్ని కాపాడుకోవటం కోసం అనివార్యంగా యుద్ధరంగంలోకి ఈడ్చబడ్డారని రచయిత సంపత్ రెడ్డి అంటాడు.
పుట్ల హేమలత చింగీజ్ ఏత్ మాతోవ్ రాసిన జమీల్యా నవలను విశ్లేషిస్తూ వికసించిన సోషలిజమే జమీల్యా అంటుంది. ఈ నవల 150 భాషల్లోకి అనువదించారు. తెలుగులో ఉప్పల లక్ష్మణరావు అనువదించారు. ఇది రచయితకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. యుద్ధానికి వెల్చిన భర్త కనీసం ఉత్తరాల్లో తనను పట్టించుకోక పోవడాన్ని ఆమెను కలవర పెట్టింది. అందువల్ల జమీల్యా తనకు నచ్చిన వ్యక్తి దనియార్ తో వెళ్ళిపోతుంది. ఈ కధలో జమీల్యా వ్యక్తిత్వాన్ని చర్చిస్తూ “పెట్టుబడిదారీ వ్యవస్థలో స్త్రీ అణిచివేత ఒక భాగమని సోవియట్ రష్యాలో విప్లవానంతరం పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా అంతమైందో, అదే విధంగా జమీల్యా కూడా కట్టుబాట్లకి అడ్డుకట్ట వేసిందని ఆమె ప్రపంచదేశాల స్త్రీల స్వేచ్ఛకు కుటుంబవ్యవస్థకు పతాకగా కన్పిస్తుందంటుంది”. స్టెప్పీ మైదానంలో దనియార్ జమీల్యాల పరుగులు ప్రేమ పందాలు ప్రపంచానికి దూరంగా పొందిన అలౌకికానందం చదువుతున్నంత సేపు చలం మైదానం మదిలో మెదులుతుంటుంది అని అంటుంది.
అక్టోబర్ విప్లవం కారణంగా పనికాలాన్ని 8 గంటలుగా కుదించుకోగల్గారని స్త్రీలను దిగజార్చే చట్టాలు రద్దయ్యాయని, మతం ప్రభుత్వం నుండి వేరయిందని, స్త్రీలు ఓటుహక్కును సాధించుకోవడంతో పాటు, హోమోసెక్సువాలిటీ, అబార్షన్లు చట్టబద్ధం కావటం, స్త్రీ విద్యకై కృషి, పద్దెనిమిది పత్రికలు స్త్రీలకుగాను ప్రచురించబడటం, స్త్రీలకు పనిభారాన్ని తగ్గించే దిశలో కిండర్ గార్డెన్లు, కేర్ సెంటర్లు, సూప్ కిచెన్లు, పబ్లిక్ లాండ్రీలు తెరవబడ్డాయని, “ఆడవాళ్ళ అస్తిత్వాలను మార్చిన అక్టోబరు విప్లవం’ వ్యాసంలో చెప్తుంది డా|| సమతారోష్ని. కానీ సోవియట్ యూనియన్ పతనమైన అనంతరం ఆ పరిస్థితులు మారిపోయాయంటూ మదనపడ్తుంది కూడా. ఈమె బోల్షివిక్ విప్లవానంతరం రష్యాలో మహిళల జీవితాన్ని ప్రత్యక్షంగా చూసింది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ 1991 తర్వాత గోర్బచెవ్ కాలంలో రష్యాలో సాధించుకున్న ఫలితాలు వెనక్కి వెళ్ళిపోయాయంటూ వాపోతుంది.
పై వ్యాసాలన్నీ రష్యాకు సంబంధించినవి కాగా కె.యన్. మల్లీశ్వరి “తెలుగు సమాజ సాహిత్యాలు-బోల్షివిక్ ప్రభావాలు” అన్న వ్యాసంలో తెలుగులో విప్లవ ప్రభావ సాహిత్య వచ్చిన రచనలను, రచయితలను పేర్కొన్నారు. వ్యాసంలో మొదటగా భారతదేశంలోకి మార్క్సిస్టు సిద్ధాంతం కమ్యూనిస్టు పార్టీలు వచ్చిన తీరున ప్రస్తావించి ఆ ప్రభావంతో అరసం ఏర్పడటం వట్టికొండ విశాలాక్షి ‘అభ్యుదయ గీతాలు’ శ్రీశ్రీ గర్జించు రష్యాలను పేర్కోవచ్చంటుంది. రష్యన్ బాల సాహిత్యం తెలుగు సమాజం మీద చాలా ప్రభావం వేసిందని, ఆ ప్రభావంతోనే నొప్పి డాక్టర్, ఏడురంగుల పువ్వు చుక్గెక్ అన్నదమ్ములు, బుల్లిమట్టి యిల్లు, చెడ్డబడవ-ఎలుగుబిడ్డ, నాన్నారి చిన్నతనం, కళాతపస్వి యెగోరి బంగారు గిన్నె వంటి రచనలు వచ్చాయని ఆ రచనలు ఇక్కడి వ్యక్తిత్వాలను తీర్చి దిద్దుకోవడానికి సాయపడ్డావంటుంది. రాస్కోల్నికోవ్ తెలుగు పాఠకులకు, రచయితలకు దగ్గరయ్యాడనటానికి ఆలూరి బైరాగి రాస్కోల్నికోవ్ పేరుతో కవిత కూడా రాసాడని చెప్తుంది.
పదకొండుమంది రచయితలు సాహితీ విమర్శ ప్రస్థానం చేస్తే రచయిత్రి శివలక్ష్మి ఆ విప్లవాన్ని సమాజాన్ని అద్దంపట్టి చూపే సినిమాలు విశ్లేషించడం ఈ పుస్తకానికున్న ప్రత్యేకత. ఈమె ఆ సినిమాలను గురించి ప్రస్తావిస్తూ రష్యాలో సోషలిస్టు సమాజాన్ని కాంక్షిస్తూ మార్క్స్ గత తార్కికవాదాన్ని అన్వయిస్తూ ఐసెన్స్టీన్ వుడోవికిన్ కృషి చేశారన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఈమె తన వ్యాసంలో ఐసెన్స్టీన్ ‘స్ట్రైక్’, ‘బాటిల్షిప్ పొటోవ్కిన్’ లను మొదటి రెండు సినిమాలుగా చెప్తారు. రెండో సినిమా జార్ పాలకుల మితిమీరిన నిరంకుశత్వానికి ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా నావికులు చేసిన తిరుగుబాటును దృశ్యీకరించిన చిత్రమే కాకుండా అతి గొప్ప విశ్వజీవన చిత్రాలలో ఇది ఒకటని అంటుంది. ఇక మూడో చిత్రం లెనిన్ నాయకత్వంలో తిరుగబడి ప్రజలు నికొలస్ 11 విగ్రహాన్ని పడదోసి వింటర్ పాలెస్ ను స్వాధీనం చేసుకోవడం కథాంశంగా స్టానిస్లమ్ రాసోటీ దర్శకత్వం వహించి దృశ్యీకరించిన మరో చిత్రం “ది డాన్స్ హియర్ ఆర్క్ క్వైట్” అని చెప్తుంది. ఈ సినిమా బోరిస్ వ్యాసిల్యేవ్ ఆధారంగా తీసింది. నాజీ సైనికులతో ఆరుగురు రష్యన్ల వీరోచిత పోరాటానికి సంబంధించినదని చెప్తుంది. ఈ సినిమలన్నీ విజువల్ చేయడంలో దర్శకులు మిక్కిలి ప్రావీణ్యం చూపారని ఈ తరం యువతరానికి వాటిని చూసి తీరాల్సిందే అంటుంది కూడా.
ఇట్లా బోల్షివిక్ పూర్వాపరాలను, దాని ప్రభావాన్ని, ఆ సాహిత్యాన్ని పాఠకుల ముందుకు తెచ్చి వ్యాసానికి పెట్టిన పేరును సార్ధకం చేసుకున్నందుకు ప్రరవే మిత్రులను హార్థికంగా అభినందిస్తున్నాను.